మానవ సంబంధాలన్నీ వీగిపోతున్న కాలాన్ని ఎలా గుప్పిట పట్టి బంధం కలుపుతాయో… అన్న ఆలోచనే మనసుకి ముల్లు గుచ్చుకున్నట్టు ఉంటుంది.
వీగిపోతూ, విడిపోతూ విసిరి వేయబడుతుంది ఎక్కడో, ఎవరిదో ఎవరినో కాదు మన కాళ్ళ కింద నేల అనే సంగతి మర్చిపోతున్నాం.
కాలచక్రంలో రాజకీయ విషసర్పాల ఆటలో పావులవుతున్నాము.
ఈ రాజకీయ కుట్ర ఏ ఒక్కరిదో కాదు చెదపురుగుల్లా ప్రపంచాన్ని అంతటినీ పట్టిపీడిస్తున్నది. మనమంతా అధికార బంధాల మధ్య నలిగిపోతున్న సామాన్య మానవులం, ఇక్కడ ఎవరి నియమపాలనలు వారివి అయినా మనుషులుగా మానవత్వాన్ని మూటకట్టుకునేందుకు అక్షరం ఓ నేర్పు గల ఆయుధమైందని అనిపిస్తుంది ఈ వేంపల్లి షరీఫ్ కథలు చదువుతున్నంత సేపు.
ప్రతి కథలో ఓ నేర్పు కలిగిన తీర్పు ఈ సమాజానికి గొంతెత్తి పిలిచి మరీ వినిపిస్తూ ఉంటాడు. మానవత్వం ఉన్న మనుషుల మధ్య ఏ మతాల గోడలు లేవు అని చెప్తూనే ఉంటాయి వేంపల్లి షరీఫ్ కథలు. ఆయన రాసిన రచనల్లో ఇప్పుడు నా చేతుల్లో ఉన్నది “చారల పిల్లి” కథా సంపుటి. ఆ కథల్లో అంశాలాన్ని మన ఆలోచనలకు పదును పెడుతూనే ఉంటాయి..
బతుకు చక్రంలో ఏదో మార్పుని ఆశించి ఎందరో కుటుంబాలని వదిలి కువైట్ మార్గం పట్టి తిరిగి రాలేని వ్యక్తి భార్యగా నసీముద్దీన్ ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులలో ‘జూదం’ ఆడటాన్ని తప్పుపట్టే ప్రపంచానికి రాజు చెప్పిన మాట “లెక్క దండిగా ఉండేటోళ్లయితే కొవ్వుబట్టి ఆడతారు సార్, మా అట్టాంటోళ్లు ఎందుకు ఆడతారో తెలియదా ” అన్నప్పుడు పేదరికం ఎందరిని వెక్కిరిస్తుందో తెలియజేస్తుంది.. అంతేకాదు ఈ కథలో స్త్రీలకు వంద రూపాయల ఖర్చు కూడా పెట్టుకునే స్వతంత్రం లేని కుటుంబాలే ఎక్కువ అని వేలెత్తి చూపించే ప్రయత్నం గుట్టుగా బతికే బతుకుల్ని బాహాటం చేసే పురుషాదిక్య నీచత్వం బయటపడతాయి.
సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఓ కవిత రాసుకున్న ” బ్యాగీట్ బ్యాగ్ లో 100 రూపాయలకు బర్త ముందు చేయిచాచే ఆఫీసరమ్మ ” అని ఈ కథ ఆ కవితకు ప్రాణం పోసినట్లయింది.
‘సైకిల్ చక్రం ‘ వ్యాపారం, పేదరికం మతాన్ని మరిచిపోయి తిరుగుతాయని చెప్పే కథ, ఈద్గా దగ్గర కనిపించే రాముడు,ఆంజనేయుడు, గంగమ్మ, గౌరమ్మ, గాంధీ కలిసి వేషంకట్టి పండగనాడు సాయిబును ఆటపట్టించడం లాంటి జీవన చిత్రాన్ని గీసి దేశానికి చూపించాలనుందని అంటారు షరీఫ్..
టైటిల్ కథ చారల పిల్లి చదువుతుంటే మాత్రం భలే గొప్పగా ఉంటుంది.
పెద్ద పెద్ద చారలతో ఆకాశమంత విస్తరిస్తూ, ఇంతింతై వటుడింతైనట్లు ఈ కాషాయపు చారల పిల్లి, ఎత్తుకెళ్ళిన బాల్యాన్ని ఎలా తెచ్చి ఇవ్వాలో, ఆ పసి మనసుని ఎలా కాపాడుకోవాలో ఈ కథ చదివి మీరైనా ఆలోచించండి అంటూ ఓ ప్రశ్న ఈ సమాజానికి వేస్తారు షరీఫ్.
మట్టి కొట్టుకుపోయిన నల్లబండ మానవత్వానికి స్థాయి భేదం లేదు అంటూ… నిజాయితీని మనిషికి అలంకారమై స్వచ్ఛమైన స్నేహానికి గుర్తుగా మిగులుతుందని చెప్పే ఆనవాళ్ళని ఈ కథలో మనకి చూపిస్తారు.
ఈ పుస్తకంలో ఏ కథకు ఆ కథ ఓ ప్రత్యేకమే, అయినా ఈ పత్తి గింజలు కథలో మాత్రం ప్యారీ మారుతున్న సమాజం పై తిరగబడ్డ నారీమణిగా కనిపిస్తుంది. ” మతం ఆమెకు ఎప్పుడూ అండ అవలేదు, కానీ ఆమెకు అండగా నిలబడ్డ వ్యక్తి మాత్రం మతానికి అడ్డు అయింది. ” ప్రేమలు ఎలా చెదిరిపోతున్నాయో వీధి వీధిలో వెలుస్తున్న మందిరాలు మసీదులు మనసుల్ని ఎంతగా కలుషితం చేస్తున్నాయో చెప్పే కథ.
ఓ స్త్రీ అస్తిత్వం పై ఆధారపడ్డ కథ , ఎందరి మధ్య ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్య పరిష్కారంగా ఆ ప్రాంతలోని లేదా ఆ కుటుంబం లోని స్త్రీనే బలి అవ్వాల్సి రావడం, మణిపూర్ సంఘటనని గుర్తు చేస్తుంది. మన వేద భూమిలో జరుగుతున్నవన్నీ స్త్రీ బలిదానాలే, సమస్య ఊరి మధ్య వచ్చినా, దేశం మధ్య వచ్చినా పరిష్కారంగా ఏదో ఒక వర్గానికి చెందిన స్త్రీ బలి అవ్వాల్సి రావడం పరిపాటైపోయింది ఈ కాలంలో… అటువంటి వ్యధను కథగా మలచడంలో పురుష స్వామ్యవిజయాన్ని చాలా బాగా చెప్పారు. అంతే బలంగా “ప్యారి” నిలబడడం అనేది మార్పు కోరుకునే సమాజానికి గుర్తుగా చూపించారు.
దర్గాలకు దూరమవుతున్న సందర్భాలని పరిస్థితులని ఈ కథల్లో చదవచ్చు. ‘గ్యార్మీ’ సూఫీ సాంప్రదాయంలో వెలిగించే 44 దీపాల వెలుగులు మనుషుల జీవితంలో నుండి ఎలా దూరం అవుతున్నాయో అమ్మమ్మ చేసిన గ్యార్మీ పండుగ గురించి చెప్తూ ” మలీద ” రుచి ఎంత పవిత్రమైన ఆచారానికి గుర్తుగా చూపిస్తూ చుట్టూ ఉన్న మనుషులని కలుపుకుపోయే ఆచారాలలో ఉన్న ప్రాముఖ్యం దీనివలన బంధాల బలం వివరించిన తీరు బావుంది.
మనసులో అనుమానపు పొరలు కప్పుకుంటే గుండెలో రేగే అలజడికి భార్య జ్ఞాపకాలు నేలకు రాయాలనుకోవడం అన్న ప్రయత్నం లో నుండి ప్రేమని ప్రేమగా ప్రేమించడంలోని అర్థవంతమైన సారాంశాన్ని చెప్పిన కథా శిల్పం ఓ వైవిధ్యం.
సమయాన్ని మిగుల్చుకోవడం అంటే సర్వం మిగిల్చుకోవడమే అని షరీఫ్ మాటల్లో చెప్తుంటే సిటీ లైఫ్ బిజీ షెడ్యూల్స్ లో ఒక మనిషి సమయాన్ని ఎలా పీల్చి పిప్పి చేస్తుందో ఈ నగర జీవితంలోని టైం షెడ్యూల్ చదువుతున్నప్పుడు అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం గుర్తుకు వస్తుంది. మహానగరం మాయా దర్బార్ అని అందులో టైం టైట్ షెడ్యూల్ అని చెప్పిన కథ.
గంగన్న, హుస్సేనీలా స్నేహం హలాలు అయిందని అనడంలోని ఆంతర్యం మాత్రం భలే గొప్పస్నేహన్ని అందులోని ప్రేమని ఉక్రొశాన్ని ఏమీ చేయలేని నిస్సహాయతని భలేగా చెప్పారు. ఈ కథల్లో బలమైన బాంధవ్యంతో ముడిపడి వున్న స్నేహం ఒక్కటే కాదు కటికోళ్ళ పిల్లగాడు, పశువుల కాపరి బక్కోడి మానవతా స్నేహం కూడా బాగుంటుంది.
ఈ పుస్తకంలో మొత్తం 13 కథలు ఉన్నాయి ప్రతి కథలో ప్రపంచం మొత్తానికి చూపించాల్సిన సందేశం ఉంది. మనుషుల మధ్య మతం లేదని, మతమే మనుషుల మధ్యలోకి వచ్చి చిచ్చు రగుల్చుతుందని ఇప్పుడు నడుస్తున్న జీవన క్రమాన్ని, మనుషుల్లో మార్పుని కోరుకునే సమాజం ఇంకా పల్లెల్లో ప్రాణాలతోనే ఉందని చెప్పే కథలు.ఇంకా చాలా విషయాలు మనం చర్చించుకోవలసిన అంశాలు ఈ పుస్తకంలో వున్నాయి.
షరీఫ్ గారు ఫాసిజం వెళ్ళూనుకుంటున్న కాలాన్ని అక్షరబద్ధం చేసి చూపించిన మీ కలానికి, మీకు అభినందనలు..