పోతూ పోతూ ఒకయుగాన్నే తనతో పట్టుకుపోయారు

Spread the love

రామకృష్ణ శాస్త్రిగారు వెళ్ళిపోయారు. పోతూ పోతూ ఒక యుగాన్నే తమతోకూడా పట్టుకు పోయారు. “అధిక చక్కని” చిట్టి మొదలు, ‘సానిపాప’కు స్వయంగా జడ వేసిన తాతగారి వరకూ – నిండుతనం గల నిలువెత్తు మనుషులందరినీ, వారి సుఖమైన ఆరోగ్యమైన మనస్సులనీ, సుఖంగా పాపం చెయ్యగలిగిన మొనగాళ్ళ’ని, కల్తీ ఎరగని, కండపుష్టి గలవాళ్ల తెలుగు నుడి కారాన్నీ, అన్నిటినీ మనకు దూరంగా పట్టుకుపోయారు. ఇంక మిగిలింది మనం. క్షీణదశలో ఉన్న, విక్టోరియా యుగం నాటి ఆంగ్ల సభ్యతను ఎరువు తెచ్చుకుని, రక్తమాంసాలు లేని నీరసపు సంకర సంస్కృతి నొక దాన్ని సృష్టించుకుని, అదే ప్రాచీన భారతీయ సంస్కృతి అనుకుని ఆత్మ వంచనకు పాల్పడ్డ మనం మిగిలాం.

కొత్తగా సమర్తాడిన సాని – పాప ఆశీర్వచనం కోసం వచ్చింది ఒక తాతగారి దగ్గరకు. ఆయనలేచి సందిట పొదుపు కున్నారు. అలాగే మనుమరాల్ని ముద్దు చేశారు. చిన్నది అంతలో తెప్పరిల్లింది.

“ఏమిటది?” ఠపీమని అడిగారు తాతగారు.

“కిలికించితం-” తడుముకోకుండా జవాబు చెప్పింది.

తాతగారు – అప్పటికి చెయ్యెత్తి దీవించారు.

ఈ తాతగారినీ మనుమరాలినీ, నేనెప్పుడో చిన్నతనంలో – ‘కిలికించితాని’కి అర్థం తెలియని ప్రాయంలో చూశాను. ఈ ‘మధ్యాక్కర’ కథలోనే ఒక మనుమడున్నాడు. సానిపాప మల్లెపూల పాన్పుమీద నిదుర

చేస్తుండగా, మరొక గదిలో నిద్రపట్టక, అర్థరాత్రి పక్కమీద దొర్లుతున్నాడు. తాతయ్యవచ్చి పక్కన కూర్చుని.

“నీవు ఇక్కడ పడుకుంటావని మనం కల కనలేదు సుమా”, అన్నారు. “అదేమిటి తాతయ్యా.” అన్నాడు మనుమడు ఉక్రోషంగా,

“ఆ-ఏం లేదు మీరంతా పుట్టు సన్యాసులురా!”

“పది నవరసులు బనారసు చీరె కొంగుని ముడివేసి, మినప సున్ని ఉండలు గుటకేసి – చీకటిగదిలో దోమల తెరలో – చివికి పోవలసిన పుణ్యజనులు! తాతయ్యకు అంత కోపం రావడం మనమడు ఎప్పుడూ చూడలేదు.

“నేను – నీ మనమణ్నే.” అని తాచల్లేలేచాడు.

“ఔనోయ్ – కాని – మనకూ మనకూ ఒక నూరేళ్లు వార వుంది. ఈ ఇరవయ్యో శతాబ్దంలో – సుఖంగా పాపం  చేయగలిగిన మొనగాడు అంటూ లేడురా నాయనా – మీ రందరూ పూజ్యులు -“

ఈ తాతయ్యలో ముమ్మూర్తులా శాస్త్రిగారున్నారు. మనమణ్ణి ఉద్దేశించి చేసిన ఈ ఎగతాళి – ఈనాటి యువకులమీద శాస్త్రిగారు విసిరిన విసురే – అయితే అందులో ఒక అప్యాయత లేకపోలేదు.

శాస్త్రిగారి పాత్రలో చాలా భాగం, నలభైఏళ్ళ క్రితం – పట్టణాలొచ్చి పల్లెల్ని పూర్తిగా మింగెయ్యక పూర్వ పట్టణాలు కూడా ఒక మోస్తరు పల్లెటూళ్ల లాగ ఉండే రోజుల్లోది. ఈ గడ్డను పుట్టి పెరిగిన వ్యక్తులు గదిలో బైఠాయించరు. ‘రేవిణీ’ వేస్తారు. వాళ్లు ప్రేయసుల్ని కౌగలించుకోరు, ‘పరీరంభం’ చేసుకుంటారు. శాస్త్రిగారు ఈనాటి వాళ్ళని గురించీ వ్రాశారు కథలు, కాని ఆయన మాటలతో వాళ్ళ బొమ్మలు కడుతుంటే, మెల్లగా ఆ యుగానికి జారిపోతారు వాళ్ళకి తెలియకుండానే – చిత్రశాలలో శ్రీమాన్ లాగ. వాళ్ళనోట్లో ఆ నాటి పలుకుబడులే, వాళ్ళ చేతలలో ఆ నాటి వయారాలే. ఆయనకు ఈనాటి లోకం తెలియక కాదు, నవీన నాగరికతకు ఆయన దూరుడూ కాడు. గోల్డ్ ఫ్లాక్ సిగిరెట్టంటే ఆయనకు ప్రీతి. కాఫీ అంటే ఇష్టం. అయితే వాటిని కూడా ఆ పేర్లతో పిలవడాయన. సిగిరెట్టు ఆయన కథల్లో, శ్వేత కాష్టం’ అయిపోతుంది. కాఫీ ‘తిక్తమధుర’ మైపోతుంది.

కథానిక తెలుగు సాహిత్యంలో కొత్త ప్రక్రియ. కాని ఆయన కథానిక భారత కాలంనాటినించి నేటివరకూ విస్తరించిన తెలుగు సాహిత్య మహావృక్షంలో ఒక కొత్త శాఖగానే అనిపిస్తుంది గాని, దానితో సంబంధంలేని కొత్త మొలక అనిపించదు. భాషలోని ఒక చిత్రమైన విలక్షణం వల్ల, ఆయన రచనలన్నీ నేడూ రేపూ లేని ఒక తెలుగు యుగాన్ని చిత్రిస్తాయి. కాముని పున్నమి, చెంగల్వ లాంటి అపురూపమైన కథలు, ఒక వంక ఏ కళాపూర్ణోదయాన్నో తలపిస్తూ, మరోవంక, నాకేనాడో తన పక్కలో పడుకోబెట్టుకుని మా బామ్మ చెప్పిన కథలను గుర్తుకు తెస్తాయి. ఎంత బిగువైన భాష ఎంత చక్కని కథనం!!

నిజానికి శాస్త్రిగారు రొమాంటిక్. ఆయన తన ఎదురు గుండా చూస్తున్న దృశ్యాన్ని వర్ణించినా, అది ఈనాటిదీ ఈ లోకానిదీ అవుతూనే, కాలదేశాలకు అతీతమయిన ఒక కాల్పనిక లోకంలో స్థిరంగా అవాసం ఏర్పరచుకుంటుంది. అందుకే ఆయన కథలు నాడూ నేడూ అంచులు చెరిగిపోయి, తెలుగుతనం పేరుకుపోయిన ఒక యుగంలో వృత్తాంతాలుగా  మారిపోతాయి.

అయితే ఆ తెలుగు యుగం కేవలం ఆయన సృష్టించుకున్నది. అది నన్నయ్య యుగమూ కాదు, అష్టదిగ్గజాల యుగమూ కాదు. అయితే వాటిని స్మరింపజేస్తుంది. అయినా అది సరికొత్త యుగం. ఆ యుగంలో – సంస్కృత ప్రాకృతాలను కాచి వడబోసిన, శ్రోత్రియమైన పవిత్ర గంభీరమైన ప్రాచీనత, కులాసా విలాసాలతో చంపామేలీలతో, ఆగరు ధూపాలతో భోగాను భవానికి అవధుల నందుకొన్న మొగల్ వాతావరణం, ఆంగ్లసాహిత్యం అందించిన అపూర్వ భావన, జిజ్ఞాస – అన్ని విచిత్రంగా ఒకదానిలో ఒకటి కరిగిపోయి, విడదియ్యడానికి వీల్లేకుండా కలిసిపోయిన ఒక సాహిత్య రసాయన సంయోగం- ఆయన సృష్టి.  

ఆయన కథల పేర్లు, చూడండి – ‘విపులాచపృథ్వీ’, ‘మస్తానీ’, ‘మధ్యాక్కర’, ‘మునిగోరింట’, ‘జీ-హా’, ‘అర్థనారి’, ‘బుషే’, ‘యక్షగానం’, వీటిలో సగం పేర్లలకు స్పష్టంగా అర్థాలే తెలియవు మనకి. ఎప్పుడో విన్నవే, అయితే అవి మన అనుభవంలో నుండి మెల్లగా జారిపోయాయి.

కథా కథనంలో ఆయన గడసరి. మహా పట్టుదలగా చెక్కుతాడాయన ప్రతి వాక్యాన్నీ. ఆయన సంభాషణలు ఎంత ముక్తసరిగా, ఎంత చమత్కారంగా ఉంటాయి, సాని – పాపలో – నాయకుడు –

“అదృష్టవంతుణ్ణి గనుకనే అశరీరవాణి నీ నోట అలా పలికించింది కదా కోకిలా?” అని వచ్చే జవాబు ముందే తెలిసిన తృప్తితో ప్రశ్నించాడు.

“కాదు, శరీరవాణి పలికింది. అదృష్టానికి ఇంకొకరి మీద ఆధారపడటం అవసరమైతే…”

“పడటం ఎవరిమీద?”

“అదే నేనూ అడిగేది?”

“అడిగితేనే కాని…”

“అమ్మైనా పెట్టదు.”

ఇలా చమత్కారం ఎంతదూరమైనా సాగించగలడాయన. అవసరాన్ని బట్టి రెండు ముక్కల్లోనే ముగించగలడు. శిల్పానికి ఆయనది పెట్టినది పేరు. మళ్ళీ ఇంత చమత్కారానికీ వెనుక ఒక లోతైన బలమైన పాత్ర ఉంది. సాని – పాప మహా గొప్పమానవి. తను మనసార వలచిన వాణ్ణి – అతని బాగుకోరి – ఈసడించినట్లు నటించింది. అతను వెళ్లిపోయాడు. శాస్త్రిగారు కథ ఆఖరు చేసిన విధానం గుండెను పట్టుకుని, బ్రతికున్నంత కాలం మరచిపోరాని ముద్ర వేస్తుంది.

‘ఈ మైకం తెల్చుకుని … మళ్ళా మామూలు మనిషి అయిపోయింది.’

ఆఖరు వాక్యంలో కోకిల కొన్ని రెట్లు పెరిగింది. ఏమి మనిషి! అనుకోకుండా ఉండలేం. ‘చిట్టి’ వంటి ఒక పతితలో దివ్యత్వాన్ని మెరుపులా మేళవించగల సిద్ధహస్తుడు.

అసలు శాస్త్రిగారి పాత్రలు – ముఖ్యపాత్రలు – మహా వ్యక్తులు. వాళ్లు సానులుగాని, సంసారులుగాని, ఇలాంటి వ్యక్తులు, పుట్టడానికీ పెరగడానికీ అవకాశాలుండేవి వెనుకటి కాలంలో … యంత్రనాగరికత వచ్చింది. మనిషి పెరుగుదలను అరికట్టింది. మహాకవి కృష్ణశాస్త్రి గారు ఒకసారి అన్నారు. వెనుకటి రోజుల్లో కొందరు వ్యక్తులు తాడి చెట్లలా జన సామాన్యం మీద ఎంతో ఎత్తు పెరిగి పోయి స్పష్టంగా కనిపించేవారు. మిగతా జనం మరుగుజ్జు పొదల్లా ఉండేవారు. ఈ కొత్త యుగంలో ఏ వ్యక్తీ ఆరడగులు మించి ఎదగడానికి అవకాశాలు నశించాయి. మనిషి అడ్డంగా పెరుగుతున్నాడు. అందువల్ల మనిషికీ మనిషికీ తేడా తెలియడం మానేసింది అని. అందుకే అనుకుంటాను, శాస్త్రిగారు తాడిచెట్ల ప్రమాణంలో ఉన్న వ్యక్తులకోసం, వెనుకటి తీరానికి పోయారు. ఇప్పటివాళ్ళని కూడా వెనుకటి తరానికి పట్టుకుపోయారు. వాళ్ళని గురించి చెప్పడానికి వెనుకటి తరం భాషకి ప్రాణం పోశారు, పదును పట్టారు. నిజంగా వెనుకటి వాళ్ళ కథల్లో ఆయన ప్రతిభ పరాకాష్ఠ నందుకుంది.

కాముని పున్నమిలో – ఏ వాక్యం చదవండి అది తెలుగే – జీవంతో మిలమిలలాడే తెలుగు. మొదటి వాక్యమే కొన్ని పేజీలు – అది కాశీమజిలీ కథలా పెనవేసుకుని విచ్చుకుంటూ చిలవలూ పలవలూ వేసుకుంటూ సాగిపోతుంది.

గొంతు ఉలికి పడంగా గొంతువిని – కన్నెలందరూ కమ్ముకుని – అరచేత, గంటలున్న చోట కంట తడిమి చూసి ఏ కన్నె “అలా తూల, తూలక సోలుతూన్న, చిన్నవాని చేతికి ఏ రెమ్మ తాకెనో – ఏ ములు సోకెనో – మూగపోయిన

కా కన్నె మనసార చేతికందిన వీరులు దూసుకురాంగా – పుప్పొడిజల్లి – చిదిమిన పూవులు అదిమి, ఆ పైన కప్పురపు అనంటి పొర చుట్టి, సోకీ సోకని లగువున బిగుతు తెలియకుండా చేతికి కట్టుచుట్టి ‘పాయోపో- పాయోపో’ అని కిలకిల మంతిరించి…”

ఇలా అనంతంగా బరిమీది త్రాచులా పారిపోయే తెలుగు, మిసమిసలాడే తెలుగు, వ్రాయగలవాళ్ళు మరి లేరు. అందేకే నాకు బెంగ. చాలా విలువైన దేదో ఆయనతో అంతరించి పోయినట్టు అనిపిస్తుంది.

 *  *  *

పాలగుమ్మి పద్మరాజు

పాలగుమ్మి పద్మరాజు, ప్రముఖ తెలుగు రచయిత, (జూన్ 24, 1915 - ఫిబ్రవరి 17, 1983) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.  తన జీవిత కాలములో ఈయన 60 కథలు, ఎనిమిది నవలలు, ముప్పై కవితలు ఇంకా ఎన్నెన్నో నాటికలు, నాటకాలు రచించాడు. ఈయన వ్రాసిన 60 కథలు గాలివానపడవ ప్రయాణంఎదురుచూసిన ముహూర్తం అనే మూడు సంపుటాలుగా వెలువడ్డాయి. పద్మరాజు 23 యేళ్ళ వయసులో తన మొదటి కథ సుబ్బిని వ్రాశాడు. ఈయన ఎన్నో కథలు వ్రాసినా వాటిలో బాగా పేరుతెచ్చిన కథ గాలివాన. ఈ కథ 1952లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన ప్రపంచ కథల పోటీలో రెండవ బహుమతిని గెలుచుకుంది. మొత్తం 23 దేశాల నుండి 59 కథలు ఎంపికయిన ఈ పోటీలో భారత్ నుండి మూడు కథలు ఎంపికయ్యాయి. గాలివాన ప్రపంచములోని అనేక భాషాలలోకి అనువదించబడింది. ఈ విధముగా తెలుగు కథను ప్రపంచ సాహితీ పటములో నిలిపిన ఘనత ఈయనకే దక్కినది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *