(కె.రామచంద్రారెడ్డి కవిత్వ సంపుటి ‘మాటపేటల బిడ్డకుట్లు’ పై సాలోచన)
•
కవిత్వం ఒకేలా వుండాలనుకోవడం, ఒకే తరహా భవ భావ సారాన్నీ ప్రాప్తినీ సంగతినీ కలిగి వుంటుందనుకోవడం, crime towards creative existence. కవిత్వం, ఎన్నో multiple polarities లోంచి singularity లోకి ప్రవహించి జీవానుభవ ధారల్లో మునుగుతూ తేలుతూ ఎండిపోతూ మండిపోతూ ఈదుతూ వస్తూంటుంది. కవిత్వ క్షణానికి హఠాత్తుగా చిప్పిల్లే ఆగమనం వుంటుంది కానీ నిష్క్రమణలోని ఏ అడుగుజాడలూ మిగలవు. కవిత్వ రాకడకూ పోకడకూ వచ్చేతలుపూ పోయేతలుపూ ఒకటి కాదు. ఆ రహస్యం తెలిసిన చిన్న పిల్లలు చెరువు గట్ల దగ్గర, వాగు వంకల దగ్గర ఇసుక గూళ్ళకి రెండు వైపుల నుంచీ… entry, exit తలుపులు అమర్చుకుంటారు. ఇసుకతో మాట్లాడుతూ తవ్వితీస్తూ గూళ్లను కడుతూ పోయే పిల్లలకు మాత్రమే కవిత్వ జీవరహస్యం తెలుస్తుంది.
•
రారెడ్డి కవిత్వమంతా మే నెల ఎండల్లో నిర్జనంగా… గ్రామాల ఊరేగే అమ్మవారి తుడపం డప్పు. visual narrative తో కొప్పు విప్పుకొని చలించిపోతూ తిరిగే slowness లోని animation. ఇందులోని ప్రతి కవితలో పదపదాల మధ్య నిశ్శబ్ద సందడి వుంటుంది. నగరీకులకు దగ్గరికి రావడానికి ఇష్టపడని భాష, నేత చీరలాగ శివసత్తుల దేహాలకు చుట్టుకున్నట్టు కమ్ముకుని ఆకర్షిస్తుంది.
గ్రామీణ వాతావరణంలో నెలకొని వుండే ఛాయా ప్రచ్ఛాయల ఆవిరి తాకిడి వుంటుంది. ఇందులోని చాలా కవితల్లో మానవుల physical presence వుండదు. కానీ, తత్కాలంలోనే వారు విడిచి వెళ్లిపోయిన, లేదా వారు రావడానికి ముందు ఏర్పరచిన absence కనబడుతుంది. ఉగ్గబెట్టుకున్న దిగులు పొగల కవిత్వం ఇదంతా. దీనిలో mainstream folk languageని కూడా కాలదన్నుకున్న, తెగ్గొట్టుకున్న గోదావరి తీరగ్రామాల భాష, పాఠకుడికి ఎదురొచ్చి ‘ఏ కాలం తలుపులకూ గొళ్ళాలుండని’ (పే.9) ఇళ్లలోకి తీసుకుపోతుంది.
•
మంచి కవిత్వం ఎప్పుడూ అనుభవాన్ని సానబెడుతూనే వుంటుంది. దానిలోపల, రాజకీయాల కసరుకంటే మానవానుభవమే, జీవానుభవమే ఎక్కువగా పసిబిడ్డల నిద్రోలె కదలాడుతూ వుంటుంది. ప్రాంతీయ అస్తిత్వాల దిగువమెట్ల పచ్చదనపు నాచు తగులుతూ వుంటుంది. గుండె గొంతుకతో ముచ్చట్లు పెట్టుకునే ఊరి నిలకడతనముంటుంది. అందుకే పాఠకుడిని మంచి కవిత్వం ఏమిటని అడిగితే mime ‘మూగతావి’ భాషతోనే బదులివ్వగలడు. కానీ కదిలించని dry poetry గురించి పాఠకుడు పుంఖానుపుంఖాలుగా మాట్లాడగలడు కూడా… ఈ విషాదానికి విరుగుడు, అటువంటి mime భాషను unfold చేయగలిగే శక్తి గల పాఠకుడే మళ్లీ. ఎటువంటి preconceived political blocks, అడ్డంకులు లేని అచ్చమైన పాఠకుడే.
“దిసకాళ్ల దుమ్ముచెప్పులు / వెలివిరామం / మింటికీ మంటికీ / కాడెద్దులకీ / నాలుగ్గోడల మయాన మసలే వొట్టెద్దులకీ”
(నడిపవలు వగలవల)
– అంటూ కవి తలపోస్తూ వుంటాడు. ఈ తలపోతలో… మన గ్రామీణ జీవితంలో ఎదురుపడి వెళ్ళిపోయే చాలా అస్పష్టానుభవాలు తిరిగి వెనకకు చూస్తూ మనల్ని పలకరిస్తూంటాయి.
అవసరంలేని, కేవల ప్రదర్శనకే పనికివచ్చే మేధావి తనంతో చులకనైపోయి అర్థాల కోసం వెతకడం మాని పాఠక లక్షణాలతో శుద్ధి చేసుకుంటే చాలు. తెలుగు కవిత్వంలో అరుదుగా వచ్చి సందడించిన pre/post modern కవులైన రంథి సోమరాజు (రోజీ సంకలనం), మహేంద్ర (పర్వవేలా తరంగాలు), ఇస్మాయిల్, మో, కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణల తొవ్వల్లో, సీతాఅనసూయల గాత్రధారణ చేస్తూ రేడియో తరంగాలలో సంచరించి సాధించిన నిజగ్రామీణ సంగీత గతులూ, వాటి సుజల రూపచిత్రాలూ… జ్ఞాపకాలను తోడుతుంటాయి, మోటబాయిల బొక్కెనలతో… పాతాళ గరిగెలతో… ఈ కవిత్వంలో.
•
“కోసిన వరిదుబ్బుల / ఎడమ నెరలు / చూరుల వేలాడే / వాన తీగలూ / పచ్చిగరిక మొనమీది మంచు గుండ్లూ / మూగకళ్ళను ముడుచుకుంటాయెందుకో”
(జిడ్డుతలపుల ఆవిరూపిర్లు)
“తెరు / తెరువెరగని / వెలగని ఒత్తు కంటి పుసి నులుముతూ / నల్లని పొగరునీ… / నీలో వగరునీ”
(గలావా)
“ఎప్పుడూ గోడబల్లిపొట్ట / మొగిలు వేలాడాలని ముంజేయి చాచదు”
(పారాటాలు)
“చలిచందపు జోరెండలో / వొళ్ళు కాచుకొనీ / మూలతెలివి గరగాడనీ / లోముళ్ళ ఉసురు తెమడ చీమనీ / ఆపై నన్ను తెమలనీ… / నీ నీడలోంచి”
(పారాటాలు)
– ఇటువంటి ఎండాకాలం, చలిముసురు, నీడల నడుమకు తీసుకుపోయి ఆటలాడించే కవిత్వం గొప్ప జీవానుభవాన్ని కలిగిస్తుంది.
ఈ సంపుటి ప్రతి కవితకు ఒక body language వుంటుంది. దానిలో ఆత్మ వుండి, దాని అలికిడి కూడా నిలకడగా కదులుతూ వుంటుంది. అనుభవం పెద్దదవుతూ పోతూ… అర్థాలు చిన్నవయి పోతూంటాయి. అందుకే ఇది అచ్చమైన పాఠక కవిత్వం అనీ, దీంట్లో అతి మాములుగా కన్పించే జీవికలోని aesthetics, పాఠకుడిని నెనరుగా మనసులోకి తవ్వుకుంటూ తీసుకుపోతాయని స్పురణ కొస్తుంది. భూమి పొరల్లోపల దాగుడు మూతలాడే గురుత్వాకర్షణ శక్తి కనిపించదు, కానీ దాని లాఘవం, శక్తీ జీవికి తగులు తూంటుంది. అద్భుత కవిత్వంలాగ. రారెడ్డి కవిత్వంలాగ.
ఇప్పుడిక కుడి ఎడమల కార్చిచ్చుల మార్కెటింగ్ విన్యాసాల పొగలొద్దు. రాజకీయాల యూట్యూబ్ ఛానల్ రచ్చబండలొద్దు… కవిత్వం మాట్లాడాలి అంతే… దేశీయ ఆత్మతో జీవ కవిత్వమే ముచ్చట్లు పంచుకోవాలి. అంతరించి మరుగైపోతున్న వాస్తవ, నిజ భారతమే, భిన్నతత్వాల మూలవాసుల, గ్రామీణ భాషల వేయిన్నొక్క నాల్కల, అంటుడూ ముట్టుడూ లేని జీవభాషల ఆర్తనాదమే, సంరంభమే కవిత్వంగా కావాలిప్పుడు. ప్రాంతాలు ఎక్కడివక్కడ మూలస్థావరాలైపోయిన పల్లెటూర్లు తిరిగి పుట్టాలి కవిత్వంలో… అదే మన సదువులు చెప్పే కథనాలయి పోవాలి. రారెడ్డి కవిత్వం… అటువంటి తత్వాన్ని ఎదనెత్తుకుంటూ వచ్చిన కవిత్వం.
ఆధునికానంతర తెలుగు కవిత్వ రూప చిత్రం మీద, main stream అస్తిత్వవాద సామాజిక కవిత్వాలకు భిన్నంగా నడిచి వస్తున్న అచ్చమయిన language poetry ఇది. వినిర్మాణ కాల్పనికత సూత్రాలలో వొదిగిపోతూనే తిరగబడుతూ వస్తున్న కవిత్వం. Rural, town, గ్రామీణత నిలకడగా వుండి మాట్లాడుతుంది ఇందులో.
గత కొన్ని దశాబ్దాలుగా కేవల ఉద్యమాలకీ ఉద్యమానంతర విఫలత్వాలకే పరిమితమయి జానపద రీతుల సంగతులు నడిచాయి. కానీ ఈ కవితలలో జానపద నుడితో పాటు… పదరూపాల అల్లికలో ఎంకిపాటల సౌరభం వుంటుంది. జావళీల లలితా గేయాల fusion వినబడుతుంది. ఇందులో అమోదించబడిన repeated గా monotonous గా రుద్దబడే folk language స్వభావం వుండదు. తనకంటూ ప్రత్యేకానుభవ అర్థాలతో వొంచబడిన syntax తో, గ్రామీణ యాసలోని వ్యవహారం కలగలిసిన దృష్టి వుంటుంది. వాచకంలో textuality ని ఇముడ్చుకుని సాగే orality కూడా ఎదురొస్తూంటుంది.
స్థానిక సాంప్రదాయ శృంగార కాల్పనికతా రసన విన్పిస్తుంది కూడా. ఇటువంటి పోకడ సామూహిక తత్వాన్ని ఎదిరిస్తూనే ఎదురుపడుతూ కనిపిస్తుంది. అందుకే రారెడ్డి అచ్చమయిన విభజనకొదగని స్థానీయ గ్రామీణ కవి అని పాఠకునిగా నేను అనుకుంటాను.
“ఆమె గేపకం వొక పూనకం / ఆమెనాలోచించడం వొక / చేమంతుల జలపాతం,”
(దిగులు ముఖం)
– అంటూ భగ్నతలో జారిపడిపోయే వాంఛా జలపాతం అవుతూవుంటాడు కవి.
ఈ కవిత్వంలో ఆధిపత్యాల దాగుడుమూతలు కానరావు. ఆకుపచ్చటి బాయిగడ్డల తీర్థముంటుంది. మనల్ని ముంచి తానం చేయిస్తుంది. ఇక్కడ మెటఫర్లన్నీ సింబల్సన్నీ రూపచిత్రాలన్నీ జీవజాలస్థితులన్నీ inversions లో ఆటలాడుతూ inanimate అవుతూ పాఠకుడిని జీవధ్యానంలోకి తోస్తూవుంటాయి. మనుషుల సడిసోకని జీవరవాల రావాల కదిలే empty frames వుంటాయి. అవి “దూదిదోస మజ్జిగ చిలికే” సోపతి గాళ్ళ గురించి చెప్తాయి. చిన్నగా తలుపులు తెరుస్తూ పల్లెటూర్ల మధ్యాహ్నాలను చల్లగా ఆరబెడుతూ వుంటాయి. మోటబాయి కలలో ఈదుతూ ముందు కొస్తుంటుంది. రహస్యంగా వాగు నడుస్తూ వూరంతా తిరుగుతూ వుంటుంది. “మణికట్టు ముళ్ళ దారాలు వీపునంతా నిమురుతూ” పలకరిస్తాయి. “పొయ్యిలోంచి లేచే కూటిపొగ వాసన” నాలుకను చుట్టుకుంటుంది. అందుకే ఇక్కడ కవి తన పదం గురించి చెబుతూ,
“ఊడుపులూడ్చే / కోతలు కోసే / కుప్పలు నూర్చే / నాటుమల్లె కంపు నా పదం”
(పదపూప)
– అని తాళం చెవిని పాఠకునికి అందజేస్తాడు. తన మాటపేటల బిడ్డకుట్లు తెలుసుకొమ్మనీ దాని అనుభవాలను వార్చుకొమ్మనీ వంపుకొమ్మనీ జీవగంజిలా మన మట్టి అటికల్లోకి జార్చుకొమ్మనీ… ఆహ్వానిస్తాడు.
•
వొక్కోసారి అనుభవం చాలా గాఢంగా మరీ వ్యక్తిగతంగా లోబరుచుకున్నపుడు ఈ కవిత్వం చాలా చిన్న విస్తృతితోనే పాఠకునికి కనబడే అవకాశం వుంది. ఆ రూపులో సాదాగా తోచే వీచే పలకరింపుని మనం గమనిస్తూ పోతూంటాం. కానీ అది అగ్గిరవ్వ పెను దహనమైనట్టుగా ఆక్రమిస్తూ పోతూంటుంది. దానిని ఎటువంటి జడివానా ఆర్పలేదని పాఠకునికి అర్థమవుతుంది. వొక్కసారి ఈ కింది expressions గమనిస్తే తెలుస్తుందది.
“ఎండి పాతుకున్న నాగలి / ఓ నెరలో / పసిపిల్ల నాజూకు శవం”
(వరకల)
“ఎర్రచీమల పుట్ట / ఈ బుర్ర”
(అనివారిత)
“పొంగని అగ్గికొండ / కనుకొలకుల జారే కరుణసుర / ఆమె”
( సాక…)
“పెసరట్టుప్మా గంతులేసే /అంగుట్లో అడ్డుపడ్డ /చిక్కటి చేదుగుళిక”
(చిట్లం మెదడు)
– అందుకే ఈ కవిత్వానికి, అది కలిగించే సత్యానుభావానికి ఇదీ లోతూ, ఇదీ విస్తృతీ అని చెప్పగలిగే వారెవరూ? ఆ probabilities లో పాఠకుడే కనబడతాడేమో… అదీ… అదీ కూడా గానవచానాలూ వనవచానాలూ కలిసే సందర్భాలలోనే.
•
ఈ కవిత్వాన్ని అనుభవాలతో వార్చుకుంటూ ఆ జీవగంజిని జుర్రుకుంటూ.. తెలుగు పాఠకుడు తన దారంతెగిన గాలిపటాల యోజనాల దూరాన్ని కొలిచే ప్రయత్నానికి సాహసిస్తాడు కూడా…ఈ కవిత్వంలోని figurative nature కి అబ్బురపడుతూ …!
“Thought is the pure word. In thought we must recognize the supreme language, whose lack is all that extreme variety of different tongues permits us to grasp”
– Blanchot.
•••
కవి సిద్ధార్థ
కవి సిద్ధార్థ తెలంగాణ అగ్రశ్రేణి కవులలో ఒకరు.
గతంలో దీపశిల, బొమ్మలబాయి కవితా సంపుటాలు తెచ్చారు. సినిమారంగంలో పని చేస్తున్నారు.
స్వగ్రామం నల్గొండజిల్లా పోచంపల్లి దగ్గర చినరావులపల్లి. ప్రస్తుత నివాసం హైదరాబాద్.