డాన్ నది ప్రశాంతంగా ప్రవహిస్తోంది Part 19

Spread the love

అధ్యాయం -21


రెండు రోజుల నుండి రెజిమెంటు వెనక్కి తగ్గుతూ ఉంది. శక్తి కూడగట్టుకుని యుద్ధం చేస్తూ ఉన్నా, యుద్ధ విరమణపైనే సైనికుల ఆసక్తి ఉంది.ఆ మురికి రోడ్ల మీద రష్యా, రొమానియా సైన్యాలు ఆ యుద్ధం నుండి విరమించుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఆస్ట్రియా-జర్మనీ సైన్యపు దళాలు వారి విరమణను శతవిధాలా అడ్డుకుంటున్నాయి.
సాయంత్రానికల్లా 12 వ కొసాక్కు రెజిమెంటు, దాని పొరుగున ఉన్న రొమానియా బ్రిగేడ్ లను శత్రువులు చుట్టుముట్టారన్న వార్త వచ్చింది. సూర్యాస్తమయ సమయానికల్లా శత్రువు ఖోవినెస్కి గ్రామం నుండి రొమానియాన్లను తరిమి కొట్టి, గోలష్ స్కీ లోయ ప్రాంత సరిహద్దుకి ప్రాంతానికి వెళ్ళారు.
రాత్రి సమయంలో ఆయుధాలతో సిద్ధంగా ఉన్న 12 వ రెజిమెంటుకి గోలష్ స్కీ లోయ దగ్గర ఏటవాలుగా ఉన్న చోట యుద్ధ వ్యూహంతో తయారుగా ఉండమని ఆజ్ఞ వచ్చింది. ఆ రెజిమెంటు వెంటనే అవుట్ పోస్టు లను సిద్ధం చేసి, శత్రువులను ఎదుర్కోవడానికి సన్నద్ధం అయ్యింది.
ఆ రాత్రి మిష్కా కొషివోయి, అతని గ్రామానికే చెందిన అలెక్సి బెష్ నాయక్ పహారాగా ఉన్నారు. వారిద్దరూ వాడకుండా పాడుబడి ఉన్న ఒక బావి దగ్గరలో దాక్కుని, మంచు నిండి ఉన్న గాలిని పీల్చుకుంటూ ఉన్నారు.
‘ఇదో పనికిమాలిన జీవితం, అలెక్సి!… జనాలు గుడ్డి వాళ్ళలా ఏ దారిలో పడితే అటూ పోతూ ఉన్నారు. కలుస్తున్నట్టే కలుస్తూ విడిపోతూ ఉంటారు. ఒక్కోసారి ఒకరిని ఒకరు తొక్కుకుంటూ ఉంటారు. ఇలాగే ఇంకొంత కాలం బతుకుతూ ఉంటే, చావు దగ్గర పడినప్పుడు, అసలు ఇలాంటి జీవితం ఎందుకనిపిస్తుంది. నన్ను అడిగితే, ఈ సృష్టిలో మనిషి లోపల ఉండే ప్రపంచం కన్నా భయంకరమైనది లేదు.ఇక్కడ చీకటిగా ఉన్న మూలలను ఎప్పటికీ ప్రకాశవంతంగా ఉండేలా చేయలేము.ఇక్కడ నేను నీ పక్కనే ఉన్నా నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఎప్పటికీ తెలుసుకోలేను. అలాగే నీ కోసం ఎలాంటి జీవితం వేచి ఉందో కూడా ఊహించలేను. అలాగే నీకు కూడా నా గురించి ఏమి తెలియదు… ఒకవేళ నా మనసులో నిన్ను చంపే ఆలోచన నాలో ఉన్నా, నీకు అది తెలియకపోవడం వల్ల నువ్వు తినేది నాతో పంచుకుంటావు. జనాలకు అసలు తమ గురించి తమకు కూడా ఏమి తెలియదు. నేను వేసవి కాలంలో ఆసుపత్రిలో ఉన్నాను. నా పక్క పడక మీద మాస్కోకి చెందిన ఒక సైనికుడు ఉన్నాడు. అతను పదేపదే కొసాక్కుల గురించి అడుగుతూ, వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వారి దృష్టిలో కొసాక్కు అంటే రాయి లాంటి వాడు, మృగంలా ప్రవర్తించే వాడు, గుండె ఉండాల్సిన చోట ఖాళీ సీసా ఉన్నవాడు. కానీ మనం కూడా వారి లాంటి మగవాళ్ళమే. మనకి కూడా స్త్రీలతో ప్రేమ వ్యవహారాలు నడపాలని ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు బాధ పడటం, పక్క వారి అదృష్టానికి చింతించడం కూడా చేస్తూనే ఉంటాము.ఇక నీ విషయం ఏమిటి, అలెక్సి? నాకు జీవితంలో చాలా అనుభవించాలని ఉందబ్బాయి. ప్రపంచంలో ఉన్న ప్రేమాస్పద విషయాలు గుర్తొకొస్తే నాకు ఎంతో బాధగా ఉంటుంది! అసలు వాటిలో వేటిని అనుభవించే అవకాశం లేని నా జీవితం గుర్తుకు వస్తే గట్టిగా అరవాలనిపిస్తుంది. ఈ మధ్య నాకు స్త్రీల మీద ఎంత ప్రేమ కలుగుతుందంటే ప్రపంచంలో ఉన్న స్త్రీలందరిని ప్రేమించిన నా దాహం తీరదేమో!స్త్రీ అందంగా ఉన్నంతవరకూ నేను ఆమెను నాకు నచ్చిన రీతిలో అనుభవిస్తాను. కానీ మన కోసం ఒక పద్ధతైన జీవితం ఏర్పాటు చేసి ఉంచారు. ఒక స్త్రీని మనకు అంటగట్టి, చచ్చే వరకూ ఆమెతో ఉండేలా చేశారు. మనకు ఆమె పట్ల ఎప్పటికీ ఓకే ఆసక్తి ఎలా ఉంటుంది? వీటికి తోడు మనం యుద్ధం చేయాలని ఆశిస్తారు… ఇవన్నీ ఎలా చేయగలము…’
‘నువ్వు పెద్దగా జీవితంలో అనుభవించాల్సినవి అనుభవించినట్టు లేవులే!’ బెష్ న్యాక్ పరిహాసంగా అన్నాడు.
కొషివోయ్ వెనక్కి చేతులు వాల్చి, ఆకాశంలోకి నిశ్శబ్దంగా చూస్తూ, తనలో తాను నవ్వుకుంటూ ఉన్నాడు.

* *


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *