రాసుకో!
నేను అరబ్బును
నా గుర్తింపు కార్డు సంఖ్య యాభై వేలు
నాకు ఎనిమిది మంది పిల్లలు
ఈ వేసవి తర్వాత
తొమ్మిదో సంతానం రాబోతోంది
ఆ సంతానాన్ని కూడా
నువ్వు ద్వేషిస్తూనే ఉంటావా?
రాసుకో !
నేను అరబ్బును
తోటి కూలీలతో కలిసి పనిచేసే
క్వారీ కార్మికుణ్ణి
నాకు ఎనిమిది మంది పిల్లలు
ఈ రాళ్ళ నుండే
వాళ్ళకు రొట్టెలు, బట్టలు ఇంకా పుస్తకాలు
తొలిచి ఇచ్చాను
నా చేయి
నీ తలుపు ముందు తలవంచి యాచించలేదు
నీ గడప దగ్గర నన్ను నేను తగ్గించుకోలేదు
కాబట్టే నన్ను ద్వేషిస్తావా?
రాసుకో!
నేను అరబ్బును
నా పేరుకు ముందు ఏ ప్రఖ్యాతి లేని వాణ్ణి
ప్రజలను పదే పదే రెచ్చగొట్టే దేశంలో
సహనాన్ని శ్వాసిస్తున్న వాణ్ణి
కాలం పుట్టుకకు ముందే
యుగాల ఆరంభాలకు ముందే
ఈ పైన్ చెట్లూ, ఆ ఆలివ్ కొమ్మలూ
పచ్చగా ఈ పచ్చిక పెరుగుక ముందే
నా వేర్లు ఇక్కడ లోతుగా పాతుకుపోయినయి
ఉన్నత వర్గం కాని
సామాన్య కుటుంబం నాది
నాన్న నాగలిలా
ఈ నేలకు అంటి పెట్టుకొనే ఉన్నది
కష్టాల ఒడిలో పుట్టిన
కాలే కడుపుతో పెరిగిన రైతు
మా తాత
ఎట్లా చదువాలో నేర్పక ముందే
ఎండ గొప్ప తనమేదో నేర్పాడు!
తాటాకు కప్పు , సన్నని వాసాలు
పేదవాడి గుడిసె నా నివాసం
ఈ నా స్థితితో సంతృప్తి చెందావా?
ఏ పేరుగాంచని పేరు నాది!
రాసుకో!
నేను అరబ్బును
నువ్వు నా పూర్వీకుల తోటలను దొంగిలించావు
నా బిడ్డల్లాగా ప్రేమగా
నేను పెంచుకున్న నా నేలను లాకున్నావు
నా కంటూ ఈ రాళ్ళు తప్ప
ఏమీ మిగిల్చలేదు
నీ రాజ్యము ఈ రాళ్ళను కూడా వదలదా?
కాబట్టి
మొదటి పేజీ పై భాగన్నే రాసి పెట్టుకో!
నీలా
నేను ప్రజలను ద్వేషించను
దురాక్రమించను
కానీ నా ఆకలిని ఇంకా ఇంకా రెచ్చగొడితే
దురాక్రమణదారుడి మాంసమే నా ఆహారం
జాగ్రత్త...
జాగ్రత్త...
నా ఆకలి పట్ల
నా ఆగ్రహం పట్ల!