రచయిత కావాలనుందా నాయనా!
మొదటి పుస్తకానికే అవార్డు కూడా అందుకుంటావా నాయనా!
అయితే మీ కోరిక నెరవేరడం ఇప్పుడు క్షణాల్లో పని. లాప్ టాప్ ఓపెన్ చేయుము. గూగుల్ లోకి వెళ్లుము. ఏదో టాపిక్ అనుకొనుము. కాస్త ఓపిక పెట్టి సెర్చ్ చేయుము.
ఇంకేముంది-టన్నుల కొద్ది విషయం మీ కళ్ళ ముందు విశ్వరూప సాక్షాత్కారం చేసి అవార్డుకు దగ్గరి దారులు పరుస్తుంది. మీకు నచ్చిన సమాచారాన్ని సెలక్ట్ చేయండి. పేరాలకు పేరాలు ఎత్తి పోయండి. మీకు అనువైన పద్ధతిలో అధ్యాయాలుగా విడగొట్టేయండి.
మీకు తోడుగా నిలవటానికి గూగుల్‍తో పాటు కృ.మే. గారూ ఉన్నారు. అదేనండి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్. మీరు అడగటమే తరువాయి సవాలక్ష సందేహాలకు అల్లాఉద్దీన్ గారి అద్భుత దీపంలా. కొండ మీద కోతిని సైతం అరక్షణంలో కిందకి దింపగల మాయామశ్చీంద్ర టక్కుటమార గోకర్ణ వికర్ణ విద్యలన్నీ కృ.మే. గారికి కొట్టిన పిండి.
ఈ వెతకడాలు, పేజీలకు పేజీలు ఊడ్వటాలూ చేటల్లోకి ఎత్తి పోయడాలూ దాన్ని పుస్తకంగా అట్టల మధ్య ఒత్తడాలూ-ఇంత శ్రమ, ఈ బండెడు చాకిరీ ఎవడు పడతాడు బాబూ! అనుకుంటున్నారా?
కంప్యూటర్‍లో కాస్తంత ప్రవేశంవున్న, ఏ పనీ పాట లేక పార్కుల వెంట, పబ్బుల వెంట, ప్రేమ దోమల సంగీతం వింటున్న కుర్రాడిని ఒకడిని పట్టుకోండి.కాస్తంత డబ్బుని ఎర వేయండి. మీరిచ్చేది సిగరెట్ ఖర్చుకూ రాదని అతగాడు మొండికేస్తే, బిర్యానీ ఖర్చు కూడా కలపండి.
అప్పటికీ కుదరదంటూ మొరాయిస్తుంటే, చేస్తావా? చేయవా? క్యూలో చాలామంది ఉన్నారు. నెక్స్ట్ వాణ్ణి పిలవనా? అని బెదిరించండి. అప్పుడు అతగాడే బెట్టు వదిలి,మెట్టు దిగి మీ సేవకు అంకితమవుతూ బాండు రాసి మరీ బతుకు బస్టాండు చేసుకుంటాడు.
ఇలా చెప్తున్నానని, వ్యంగ్యమో కాసింత వెటకారమో ధ్వనిస్తోందని మాత్రం అనుకోకు బాసూ! ఇప్పుడు చాలామంది అనుసరిస్తున్న టెక్నిక్కే ఇది.
ఇలాంటి విద్యల్లో ఎప్పుడో అన్నప్రాశన నాడే ఆరితేరారు శ్రీమాన్ రామోజీరావుగారు. ఈనాడు పెట్టిన కొత్తల్లోనూ ఆ తర్వాత చాలాకాలం పాటు పత్రిక పాపులారిటీ కోసం సర్క్యులేషన్‍లో అమాంతం ఆకాశాన్ని అందుకోవడం కోసం నానా రకాల ప్రయాసలు పడుతూ ఉండేవారు. అప్‍కంట్రీ పేపర్లనూ, విదేశీ పత్రికలనూ దుర్భిణీ వేసి వెతుకుతూ స్పైసీ మసాలా కాగల కథనాల కోసం గాలిస్తుండేవారు.
అప్‍కంట్రీ అనగా ఎగువనున్న ఉత్తర భారతమనీ,దిల్లీ ,ముంబయి, కోల్‍కత, గౌహతిల నుంచి ప్రచురించే పత్రికలను అలా వ్యవహరిస్తారనీ ఆ తర్వాత తెలిసింది.
ఈ పత్రికలేవీ తెలుగు పాఠకులు చదివి ఉండరు కనుక, వాటిలో రసవత్తర కథనాలపై స్కెచ్ పెన్నులు అరగదీసి, విరగదీసి-ఇదిగో ఇది టూకీల కోసం, మరి ఇదేమో సండే కవర్ పేజీ కోసం. ఇది ఫస్ట్ పేజీలో బాక్స్ అయిటమ్‍గా వాడదగ్గ వార్త అంటూ తనే మార్క్ చేసి, తన సిబ్బంది పనిని సులభం చేసేవారు.
సులభ్ కాంప్లెక్స్‌కు ఆ పేరు ఎందుకు పెట్టారా? అనే పిచ్చి ఆలోచన నాకెప్పుడూ రాలేదు గానీ క్షణాల్లో ఆ సులువులేమిటో, మతలబులేమిటో బోధపడుతున్నాయి.
ఆ రోజుల్లో గూగుల్ బాబాయి, కృ.మే. అంకుల్ లేరు గనుక, రామోజీరావుగారికి ఇదే రాచబాటగా తోచింది. ఈ చౌర్యానికి అందమైన పేరొకటి కారిడార్ కబుర్లలో చక్కర్లు కొట్టేది. ఇలాంటి కథనాలకు రామోజీగారే స్వయానా లిఫ్ట్ ఇరిగేషన్ అనగా ఎత్తిపోతల కథనాలని మురిపెంగా పిలుచుకునేవారు. ఈనాడు తొలి విజయం వెనక, ఈ ఎత్తిపోతలు కూడా భుజం ఆసరాగా ఇచ్చి కాచుకున్నాయి.
ఆ రోజులు ఇంతగా తెలివి మీరలేదు. ఇంటర్నెట్‍లు ఇంతగా చెలరేగి పోలేదు. కనుక రామోజీరావుగారు అందుబాటులో ఉన్న కత్తిరింపుల పథకాన్ని ఎంచుకుని సక్సెస్ సాధించారు.
ఇప్పుడు అవే కత్తిరింపులను మరో రూటులో ఆశ్రయించుకుని, సకల శాస్త్ర పారంగతులూ, రచయిత బ్రహ్మలూ అయిపోతున్నారు.
యూనివర్సిటీల్లో ఎంఫిల్‍లూ, పి హెచ్ డి లూ అంటూ బోలెడంతమంది గడ్డాలు పెంచుకుని, ఏళ్లూ పూళ్లూ పరిశోధనల పేరిట తలమునకలవుతుంటారు. మరీ ముఖ్యంగా సామాజిక శాస్త్రాల్లో కొంతమంది దగ్గరిదారులు వెతుక్కుని ఎత్తిపోతల స్కీమ్ లో మహత్తర సిద్ధాంత రాజమును గైడ్ గారి అపార కరుణా కటాక్ష వీక్షణ సమ్మతితో యూనివర్సిటీ వారికి సమర్పిస్తున్నారు.
ఇందులో అసలు పాలెంత? కాపీ పాలెంత? అని నిగ్గు తేల్చటానికి యూనివర్సిటీల్లో ప్రత్యేకంగా నిఘా సెల్స్ కూడా పెట్టారు. సదరు సిద్ధాంత వ్యాసాన్ని వర్డ్ ఫైల్ లో కూడా ఈ సెల్ కి సమర్పిస్తే వారు దాన్ని వీక్షించి దాని చిట్టా క్షణాల్లో తేల్చేసి, డాక్టరేట్ కు పనికొచ్చే కుర్రాడా? కేటుగాడా? అని నిగ్గు తేలుస్తున్నారు.
రచయితలే కాదు, కొందరు ఘనాపాఠి జర్నలిస్టులమని చెప్పుకునే వారూ ఎత్తిపోతల పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తూ తమకు తామే గొప్ప జర్నలిస్టులుగా కితాబులిచ్చుకుంటూ తెగ మురిసిపోతున్నారు. ప్రముఖుల జయంతులు, వర్ధంతులూ, పండగలు, పబ్బాలు, కార్తీక మాసాలు -ఇలా ఏడాదికి సరిపడా నిర్ణీత తేదీలతో ఓ జాబితా సిద్ధం చేసుకుని, ఆయా తేదీలకు కాస్తంత ముందుగా పాత చింతకాయ పచ్చడికి కొత్తగా తిరగమోతేసి దేశం మీదకి వదులుతున్నారు. నానావిధ ఆన్‍లైన్ పత్రికల పేజీలు బకాసుర దాహంతో మేటర్ కోసం నోళ్ళు తెరుచుకుని చూస్తుంటాయి కనుక ,ఆ పత్రికల వారు మహాప్రసాదంగా వాటిని అచ్చేయడమూ,ఆ అచ్చేసిన క్లిప్పింగ్‍లను సోషల్ మీడియాలోనూ చలామణి చేసి జనాలను చావగొట్టడమూ చేసేస్తుంటారు. ఏ సాహిత్య అకాడమీ వారో ప్రచురించిన నానావిధ మోనోగ్రాఫ్‍లను చౌకగా సేకరించి పెట్టుకుంటే ఏడాది పొడవునా విరామం లేకుండా ప్రొఫైల్స్ పేరిట వ్యాసరాజములను ఎత్తి పోయవచ్చు.
ఇటీవలి కాలంలో రచయిత కావాలని ఉబలాట పడుతున్న వారి సంఖ్య బాగా పెరిగింది. సమర్థులతో మనకేమి పేచీ లేదు. కానీ ఒక్క వాక్యం కూడా రాయలేని ప్రబుద్ధులు రచయిత అవతారం ఎత్తి పుస్తకాలు అచ్చొత్తి దేశం మీదకి వదలడమే పెద్ద విషాదం.
ఈ సరికొత్త తరం ఫిఫ్త్‌రేటెడ్ రచయితల తోటి పాఠకులు బెంబేలెత్తిపోవడం అటుంచి నా బోంట్లకు మరో రకం బెడద వచ్చి పడింది.
తన రచనా విన్యాసాలపై ప్రముఖుల అభినందనలూ ప్రశంసలతో ఒక సంకలనం ప్రచురిస్తున్నానని, దానికి మీ కీర్తి గానాలు కూడా జోడిస్తే భజన సంపూర్ణమవుతుందని ఈ మధ్య బొడ్డూడని ఒక బాలబ్రహ్మ ఫోను. ఇప్పటికే వీరాధివీరులు, శూరాధిశూరులు అనేకమంది తమ అభిప్రాయాలను గంపలతో ఎత్తి గుమ్మరించారని, ఇక మీదే ఆలస్యమనీ, వేగిరపడకుంటే మంచి అవకాశం చేజారుతుందని హెచ్చరించాడు కూడా.
ముందు హెచ్చరిక లేకుండా వచ్చి పడిన ఈ ముందుమాట రాత పరీక్ష , శిక్ష ఏమిటో నాకు అర్థం కాలేదు. ఒక వాక్యాన్ని ఇంపుగా సొంపుగా రాయలేని బాలాకుమారుణ్ణి మనసు చంపుకుని కీర్తి గానాలు చేయాలా? అలా చేస్తే అతడికి లాభమా?నష్టమా?ములగ చెట్టు ఎక్కించి బొక్క బోర్లా పడేయటమా? అనే ప్రశ్నల పరంపర ఎదురై అడుగు ముందుకు పడనివ్వలేదు.
‘బాబూ! నువ్వు ఇంకా రాటుదేలాలి. వెన్నెముక బలపడాలి. పెద్ద రచయితల రచనలను కాస్తంత తీసి చదువుతూ ఉండు. అప్పటిదాకా రాతలకు విరామం ఇవ్వు’ అని ఉచిత సలహా పారేస్తే ఇక ఆ మర్నాటి నుండి నన్ను బ్లాక్ లిస్ట్ లో చేర్చాడు ఆ యంగ్ టర్క్.
అయ్యా! అది సంగతి
లాప్‍టాప్ ఉన్న ప్రతివాడూ రచయితే.
మొబైల్ ఉన్న ప్రతివాడూ జర్నలిస్టే
గొంతెత్తి అరవగల ప్రతివాడూ ఎనలిస్టే
స్వీయలోపం బెరుగుట పెద్ద విద్య అని గాలిబ్ గారు ఏనాడో చెప్పారు. ఆ విద్యను ఒంటబట్టించుకోవాలన్న కనీస ధ్యాస లేకపోవటమే ఈనాటి ట్రాజడీ.