రైల్వే స్టేషన్‌కి వచ్చేసరికి…
ఉదయం 5.00 గంటలు….
ముందుగానే బయల్దేరి రైల్వేస్టేషన్‌కి వచ్చా… ఇంకా గంట టైమ్ వుంది.
వెలుగురేఖలు ఇంకా విచ్చుకోనేలేదు. శీతాకాలం ప్రారంభ సూచనగా అప్పుడప్పుడే మొదలవుతున్న చలి… పలచని తెరలా సన్నగా పడుతోన్న మంచు… ఆహ్లాదకరమైన వాతావరణం. అయినా… మనసెందుకో వ్యాకులం.
చివరగా ఉన్న బెంచిపై కూర్చున్నా.
సన్నగా వీస్తోన్న లేత చలి గాలి… పక్కనే వున్న పున్నాగచెట్టు నుంచి వస్తోన్న పూల పరిమళం.. గాలికి రాలుతున్న పూలు…. ఇవేవీ మనసుకు సాంత్వన కలిగించలేకపోతున్నాయి. ఒకప్పుడైతే ఈ ఉదయాన్ని… ఎంతగా ఆస్వాదించేవాడినో..
రైలు పట్టాలవైపు చూశా… దూరంగా మంచుతెర కప్పుకున్నట్టుగా ఆకాశం… చెయ్యి తిరిగిన చిత్రకారుడు చిత్రించిన అందమైన చిత్తరువులా…
ప్చ్..
జీవితమెందుకు ఇంత నిస్సారంగా… రొటీన్ వర్క్… రొటీన్ లైఫ్… రొటీన్… రొటీన్…
హైదరాబాద్ నుంచి ఏలూరు వచ్చి మూడురోజులైంది. నెలకో రెండు నెలలకో ఇక్కడి బ్రాంచికి వస్తూనే వుంటా. ఎప్పటిలాగే… ఆఫీసు పని ముగించుకొని తిరుగు ప్రయాణం… మళ్లీ యాంత్రిక జీవనం…
జీవితమంటే ఇంతేనా…ఒకప్పటి నా అందమైన ప్రపంచం ఇప్పుడేది?
ప్రకఅతిని ఆస్వాదించడం… బమ్మలు వేయడం… కవితలు రాయడం.. విపరీతంగా పుస్తకాలు చదవడం…
ఈ నా అందమైన ప్రపంచం… ఇప్పుడెందుకు మాయమైంది?
నాలోని భావుకుడు.. చిత్రకారుడు… కవి… ఇప్పుడేమయ్యాడు?
ఎన్నో ఊహలు…కోరికలు.. ఆశలు… ఆశయాలు.. ఆ సుందర ప్రపంచం…
నా ఒక్కడికే సొంతమైన ఆ ప్రపంచాన్ని లాక్కున్నదెవరు?
కాలం…?
నా కలల ప్రపంచాన్ని తారుమారు చేసింది.. కాలమేనా?
నా ఆలోచనలకు బ్రేక్ వేస్తూ… ఒక్కసారిగా ప్లాట్‌ఫామ్‌పై కేరింతలు.. పెద్దగా నవ్వులు…. ఐదారుగురు కాలేజీ కుర్రాళ్లు బ్యాగులు తగిలించుకొని… నా ముందు నుంచే వెళుతున్నారు. కాస్త దూరంగా ఉన్న బెంచిపై కూర్చుని కబుర్లలో పడ్డారు. ఒకతను మొబైల్లో పాటలు వింటూ నేను కూర్చున్న బెంచిపై చివరగా కూర్చున్నాడు.
అతని మొబైల్ నుంచి పాట.. నాకు చాలా చిరపరిచితమైన పాట… మనసును కదిలించి… గత జ్ఞాపకాల తడిని ఒక్కసారిగా కళ్లముందుంచిన పాట…
”ఏ నావదే తీరమో…
ఏ నేస్తమే జన్మవరమో…
కలగానో ఓ…ఓ… కథగానో ఓ…ఓ…
మిగిలేది నీవే… ఈ జన్మలో ఓ…ఓ…” మఅదుమధురంగా వినిపిస్తోంది.
మదనపడుతోన్న మనసును చల్లని చిరుగాలి తరగలా తట్టుతోంది. అవ్యాక్తానుభూతిని కలిగిస్తోంది. ఆ ఉత్సాహం… ఉత్తేజం… అభినందనలు… ప్రశంసలు… ఎంత అద్భుతంగా ఉండేవి. ఈ పాటతో నాకున్న అనుబంధం ఒక్కసారిగా మళ్లీ కళ్లముందు కదలాడింది.
***
అవి కాలేజీ రోజులు..
జీవితం అందంగా ఆహ్లాదకరంగా సాగిపోతున్న రోజులు… ప్రకఅతిలోని రమణీయతంతా నా సొంతమే అన్నట్టుగా. మనసులోని స్పందనలన్నీ పేపర్‌పై కవితలుగా మారుతుండేవి.
ఇంకా ఒక స్పష్టమైన రూపం రాని ఊహాసుందరికి కానుకగా… ఆ కవితలోని భావానికనుగుణంగా రకరకాల దఅశ్యాలను చిత్రిస్తూ… నాదైన ప్రపంచంలో మునిగిపోయే నాకు ఒక్కసారిగా ప్రశంసలు… అభినందనలు.
కాలేజీ వార్షికోత్సవానికి మొదటిసారిగా స్టేజీ మీద నాకిష్టమైన పాటను పాడుతూ మైమరచిపోతే… అందరి చప్పట్లతో మళ్లీ ఈ లోకంలోకి వచ్చిపడ్డా…
బాగా పాడావని…ఆ పాటలోని భావనను చాలా చక్కగా పలికించావని అంతా మెచ్చుకున్నారు. ఆ పాటలోని భావనేంటో… అర్థం చేసుకొని సరిగ్గా పలికించడమేంటో అప్పుడు అర్థం కాలేదు. తర్వాత అదే పాటను చాలాసార్లు .. చాలాచోట్ల పాడాను. ప్రశంసలూ పొందాను.
మళ్లీ ఇంత కాలానికి ఆ పాట… అదే పాట…
”ఏ నావదే తీరమో…
ఏ నేస్తమే జన్మవరమో… ”
నాకు తెలియకుండానే… నా నోటివెంట కూనిరాగం…
అప్పటి ఆ పాటకు అర్థం ఇప్పుడు తెలుస్తోంది…
సెలయేరులా పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోన్న జీవితంలో సునామీలా ఒక కుదుపు…
అనారోగ్యంతో అమ్మ చనిపోవడం.
అమ్మలేనితనం జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చింది. పవరవళ్లుతొక్కుతోన్న జీవన ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. అప్పటివరకూ కలలుగన్న స్వాప్నిక జగత్తు నుంచి ఒక్కసారిగా జారిపడినట్టయింది.
నాకేం కావాలో నాకే సరైన స్పష్టతలేని వయసులో అనుకోకుండా మేనమామ కూతురు శారదతో వివాహం. కాలగమనంలో గడిచిపోయిన ఇరవై ఏళ్ల వైవాహిక జీవితం…
భిన్న అభిప్రాయాలు, భిన్న అభిరుచులు. భిన్న మనస్తత్వాలు. పది నిమిషాలు మాట్లాడితే పదకొండో నిమిషంలో ఏదోక గొడవ. అయినా… మేం భార్యాభర్తలం. మనసులు కలవకపోయినా… కలిసిన శరీరాలకు గుర్తులుగా ఇద్దరు పిల్లలు.
ఏదో అసంతృప్తి… ఏదో కోల్పోయానన్న భావన నన్ను వెంటాడుతూనే వుంది. నాకేం కావాలో… జీవితంలో ఏం కోల్పోయానో ఈ ఇరవై ఏళ్ల వైవాహిక జీవితంలో వెనుదిరిగి చూసుకుంటే.. మనసును స్పందింపచేసే ఒక్క జ్ఞాపకమూ లేదు. కనిపించేదంతా నిరాశ… నిస్పృహ మాత్రమే.
భార్య ఇలావుండాలి… అలా వుండాలి అని పెద్దలు నూరిపోసిన మాటలే తప్ప… తనకంటూ ఒక నిర్థిష్టమైన ఆలోచన, అభిప్రాయం లేని శారద నాకు ప్రశ్నగా మిగిలిపోయింది.
నా గురించీ తనూ అలాగే అనుకుంటుందేమో బహుశా…
కానీ… నా ప్రపంచం వేరు. తన ప్రపంచం వేరు.
నేను కోల్పోయిన నా అందమైన ప్రపంచాన్ని మళ్లీ పునరుద్ధరించుకోవాలనుకున్నా. ఇదేమీ పట్టని శారద… నా ప్రపంచానికి దూరంగానే వుండిపోయింది.
దీంతో… యాంత్రికత పూర్తిగా నన్నావరించింది. ఎంతోకొంత ఉపశమనం నా ఉద్యోగమే.
పని…పని..పని… ఒక మెషీన్‌లా మారిపోయా.
రోజులు… నెలలు… నెలలు సంవత్సరాలు అవుతున్నాయి. క్యాలెండర్లు మారుతున్నాయి. అయినా జీవితంలో మార్పులేదు.
దేనికీ చలించని…స్పందించని బండరాయిలా మారిపోయింది మనసు.
కఅష్ణశాస్త్రి అన్నట్టుగా.. ”నాకుగాదులు లేవు… ఉషస్సులు లేవు”… నేనొక యంత్రాన్ని.
కొన్నిసార్లు అనిపించకపోలేదు… ”నా అందమైన ప్రపంచాన్ని… నేను కోరుకున్న ప్రపంచాన్ని వెతుక్కుంటూ ఎగిరిపోవాలని”. కర్తవ్యానికి లంగక తప్పలేదు.
ఆశలను కుటుంబం కోసం… కోరికలను పరువు కోసం… ఒదిలేసుకొని బతుకుతోన్న ఓ జీవశ్చవం.
నా ఆలోచనలను భగం చేస్తూ… ప్లాట్‌ఫామ్‌పై కేకలు… గందరగోళం.
తీరా చూస్తే… ట్రైన్ వచ్చేసింది. అందరూ పోటీలు పడి ఎక్కుతున్నారు.
జ్ఞాపకాల భారాన్ని మోసుకుంటూ నెమ్మదిగా కదిలాను.
***
ట్రైన్ కదలడానికి టైమ్ ఉందని డోర్ దగ్గర నిలబడి పేపర్ చూస్తున్నా..
ట్రైన్ కదలడానికి సూచనగా ఒక కుదుపు… పేపర్‌లోంచి బయటపడి లోపలికి వెళ్లబోతూ యాదఅచ్ఛికంగా పక్కకు చూసిన నా కళ్ల ముందు ఓ మెరుపు మెరిసినట్టుగా ఆమె…
మెరూన్ కలర్ చీర, నెమలి పింఛం డిజైన్. తన ఒంటి రంగుకు అతికినట్టుగా సరిపోయింది. మకరంధం గ్రోలేందుకొచ్చి… పుష్పంపై అల్లరిగా తిగురుతోన్న మధుపంవోలె ముఖంపై అల్లరిగా ఎగురుతోన్న ముంగురులు…
తన చేతిలో ఏదో బరువైన బ్యాగ్.
ట్రైన్ కదులుతోంది.. తనూ గబగబా నడుస్తోంది. నాకు టెన్షన్ మొదలైంది… తను రాగలుగుతుందా అని. బ్యాగ్ అందిస్తే అందుకుందాం అన్నట్టుగా సిద్ధంగా నిలబడ్డా. దగ్గరగా వచ్చేసింది. నేనూ అప్రయత్నంగా చెయ్యి ముందుకు చాపా. తను నావైపోసారి చూసి బ్యాగ్ అందించింది. అంత టెన్షన్‌లోనూ తను నావైపు చూసిన చూపు గుండెల్లో ముద్రించుకుపోయంది. బ్యాగ్ పక్కనే పెట్టి తనకీ చెయ్యి అందించాలనుకునే లోపే లోపలికి ఎక్కేసింది.
నేను తననే చూస్తున్నా… హడావుడిగా నడిచొచ్చిన ఆయాసం… ముఖంపై చిరు చమట… అప్పుడే
అరవిరిచిన తెల్లగులాబీపై మంచు బిందువుల్లా…
అలా చూస్తూనే వుండిపోయా…
”ఈ అమ్మొకతి. చెబితే వినకుండా ఇంత బరువు తగిలించింది” అని వాళ్లమ్మని ముద్దుగా విసుక్కుంటోంది…
నేను విన్న ఆమె తొలిమాటలవి. వీణ మీటినట్టుగా గుండెను తాకాయి.
కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పదేం అనుకుంటున్న నా మనసులోని భావం కనిపెట్టినట్టుగా…
”థ్యాంక్స్ అండీ”
”వచ్చేటప్పుడు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయా. అందుకే లేట్…” అని, ”ఇక కదులుతారా” అన్నట్టుగా చూసింది..
కాస్త పక్కకు జరిగా..
వాష్ రూమ్ దగ్గరున్న అద్దంలో ఓసారి ముఖం చూసుకొని ముంగురులను సరిచేసుకుంది. వెళ్లి విండో పక్కన సీట్లో కూర్చుంది.
రెండు నిమిషాల తర్వాత… తనకెదురు సీట్లో కూర్చున్నా.
వాళ్ల అమ్మగారితో అనుకుంటా ఫోన్‌లో చెపుతోంది. ”ట్రైన్ ఎక్కేశా” అని.
కాసేపు నిశ్శబ్దం.
బయటకు చూస్తున్నా… తనని ఓరకంట గమనిస్తూనే. గాలికి రేగుతున్న ముంగురులు అందమై ముఖంపై అల్లరి చేస్తున్నట్టుగా వున్నాయి.
ఫోన్ మాట్లాడడం ముగించి, నావైపు ఓసారిచూసి చిన్నగా నవ్వి… మొబైల్ చెక్ చేసుకోవడంలో మునిగిపోయింది.
ఆమెను చూసినప్పటి నుండి నాలో ఏదో అలజడి. ఆమె నవ్వు ఆ అలజడికి మరింత ఆజ్యం పోసింది. ఇదివరకెన్నడూ కలగని ఏదో ఫీలింగ్. తనతో మాట్లాడాలని మనసు తపిస్తోంది. కానీ తప్పుగా అనుకుంటుందేమో.. ఆకతాయిలా భావిస్తుందేమోనని ఆ ప్రయత్నం విరమించుకున్నా.
తన పేరేంటో… ఎక్కడివరకూ వెళుతోందో తెలుసుకోవాలనిపిస్తోంది… కానీ ఎలా?
తనైనా మాట్లాడించొచ్చుకదా…
బ్యాగ్ మూసేసి, ఫోన్‌లో మెసేజ్‌లు చెక్ చేసుకుంటోంది.
నన్ను నేను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నా… నా బ్యాగ్ లోంచి ఠాగూర్ ”గీతాంజలి” తీశా. చలం తెలుగులో అనువదించారు. ఎంత బాగుంటుందో.. ఎన్నిసార్లు చదివానో… మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తూనే వుంటుంది.
పుస్తకం తెరవగానే 19వ గేయం కనిపించింది.
”నీవు పలక్కపోతే,
నీ మౌనంలో నా హఅదయాన్ని నింపుకుని,
వోర్చుకుని ఊరుకుంటాను…”
యథాలాపంగా పైకే చదివేశా… తనకు వినిపించిందేమో నావైపోసారి చూసి మళ్లీ మొబైల్‌లోకి చూసుకుంటోంది.
మళ్లీ పేజీలు తిప్పాను.. మరో గేయం మీద నా దఅష్టి పడింది.
”నీ పక్కన ఓ నిమిషం కూచునే చనువు
నాకిమ్మని అడుగుతున్నాను.
నేను అవసరంగా చెయ్యవలసిన పనుల్ని
తరవాత పూర్తి చేసుకుంటాను”
….మళ్లీ పైకి చదివాను.
”ఏదో అన్నట్టున్నారు..?” వీణ మీటినట్టుగా అనిపించింది.
”మిమ్మల్నే… ఏదో అంటున్నారు…”
”ఏం లేదండీ.. గీతాంజలి…” నేను పూర్తి చేయకముందే…
”ఠాగూర్ గీతాంజలినా… నాకు చాలా ఇష్టం”.. శఅతి చేసిన వీణ సరిగమలు పలికినట్టుగా…
”అవునా… చలం అనువాదం ఇది”
”మీరు పుస్తకాలు బాగా చదువుతారల్లే వుందే…”
”ఏదో చదువుతాను…”
అలా… చలం నుంచి యండమూరి వరకూ, స్త్రీవాద సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్యంలో స్త్రీ పాత్ర వరకూ… సినిమాల నుంచి సీరియళ్ల వరకూ ప్రవాహంలా ఎన్నో విషయాలు. సాహిత్యం మీద, సినిమాల మీద తనకు మంచి అవగాహన వుంది. గోదావరి కథలు గురించి, అందులోని పాత్రల వైచిత్రిని తను చెబుతోంటే ఆశ్చర్యమనిపించింది. కథ మొత్తం చెప్పడంతో పాటు.. పాత్రల విశ్లేషణ చేయడమంటే మామూలు విషయం కాదు. అన్నింటికీ మించి మంచి మాటకారి. అందరూ మాట్లాడతారు… కానీ ఎదుటివారిని ఆకట్టుకునేలా మాట్లాడడం కొందరికే సాధ్యం. అందులో తనకు పిహెచ్‌డి ఇవ్వాల్సిందే.
మాటల మధ్యలో అప్పుడప్పుడు తన కళ్లలోకి చూస్తుండిపోయా. అలా చూడడం మర్యాద కాదని తెలిసినా… చూడకుండా వుండలేకపోయా.
తను నావైపు చూసినప్పుడు బలవంతంగా చూపు తిప్పుకున్నా…
అవి కళ్లు కాదు… మానస సరోవరాలు. ఇంత అంతమైన కళ్లు వుంటాయా అనిపించింది. మామూలుగానే సావిత్రి గారి కళ్లంటే నాకు చాలా ఇష్టం. అలాంటిది… ఈమె కళ్లు నన్ను మరింత ఆకర్షించాయి.
ఆవిడ కూడా మధ్య మధ్యలో నావైపు చూస్తూనే వుంది. కాని ఆ చూపు నన్ను అంచనా వేస్తున్నట్టుగా వుంది.
”ఇంతకీ మీ పేరు……?” అడిగాను.
”స్పందన”
”వావ్… నైస్ నేమ్”
”మీ పేరు..?”
”రవీ… రవీంద్రనాథ్”
”ఏం చేస్తుంటారు?”
”బ్యాంక్‌లో వర్క్ చేస్తా. నెలకో రెండు నెల్లకో ఇక్కడి బ్రాంచికి వస్తుంటా. వచ్చినప్పుడల్లా మూడు నాలుగు రోజులు వుంటా. మధ్యలో సాయంత్రాలు వీలు చేసుకొని మరీ దగ్గరలోని గ్రామాలు, పొలాలు చూసొస్తుంటా…”
”మరి… మీరేం చేస్తుంటారు..?”
”ఫ్యాషన్ డిజైనర్”
”నేననుకుంటూనే వున్నా… మోడలింగ్, ఫ్యాషన్ డిజైన్ వంటిదేదో చేస్తుండొచ్చు అని”
”హహ..హహ” అవునా.. అంది నవ్వుతూ.
ఇంత ప్రశాంతంగా కూడా నవ్వుతారా…? పిల్లతెమ్మెర వీచినట్టుగా… మళ్లీ నవ్వితే బాగుండు..
”ఏంటలా చూస్తున్నారు…?” పెదాలపై చిరునవ్వు చెరగకుండానే…
కాస్త తడబడుతూ.. ”సా…రీ… మీరు నవ్వుతుంటే చాలా బాగున్నారు. అలా చూస్తుండి పోవాలనిపించేలా”
”థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్” నవ్వుతూనే…
కళ్లు కూడా నవ్వుతాయంటే ఇదేనేమో… ఆ కళ్లలో ఏదో మెరుపు..
”హమ్మయ్య.. బతికించారు. ఎక్కడ తిడతారోనని టెన్షన్ అయ్యాను”
”హహహ” ముత్యాలు చిలకరించినట్లుగా… మళ్లీ నవ్వు.
మాటల్లోనే విజయవాడ వరకూ వచ్చేశాము.
విజయవాడ స్టేషన్ నుంచి ట్రైన్ బయల్దేరిన తర్వాత… స్పందన బ్యాగ్‌లోనుంచి టిఫిన్ బాక్స్ తీసింది.
”అమ్మ పులిహోర చాలాబాగా చేస్తుంది. ఏం తినకుండా బయల్దేరానని… చకచకా చేసి, బాక్సులో పెట్టింది. షేర్ చేసుకుందాం…” ఏమంటారు అన్నట్టుగా నావైపు చూసింది.
”ఫర్వాలేదండీ… మీరు కానిచ్చేయండి…” అన్నా కాస్త మొహమాటంగా..
”భలేవారే… బయట ఏదో తినేకంటే ఇది బెటర్ కదా… ఏం మొహమాట పడక్కర్లేదు” అంటూ బాక్సు మూతలో కొంత సర్ది, మూతలో పెట్టిన పులిహోర తను తీసుకొని, బాక్సు నాకు ఇచ్చేసింది.
”అబ్బే…. నాకే అదివ్వండి… మీరే బాక్సు తీసుకోండి..”
”ఏంటండీ మరీ ఇంత మొహమాటం… కొంపతీసి పులిహోర తినరా ఏంటీ?”
”అబ్బే.. అలాంటిదేం లేదండి. నాకు చాలా ఇష్టం కూడా”
”మరింకేం… హ్యాపీగా లాగించేయండి. బాగుంటదని మాత్రం హామీ ఇవ్వగలను.. హహహహ’
మళ్లీ అదే నవ్వు. మనసును గిలగింతలు పెట్టేలా…
ఏం మాట్లాడకుండా బాక్సు తీసుకొన్నా…
నిజంగానే బాగుంది. నిజానికి పులిహోర నాకు చాలా ఇష్టం. అదే విషయం తనకు చెప్పా…
”చాలా బాగుందండి… అమ్మగారికి చెప్పండి. ఏలూరు వచ్చినప్పుడల్లా చేయించుకుంటాను”
”దానికేం భాగ్యం… చేసిపెట్టడం అమ్మకి చాలా ఇష్టం కూడా…”
తర్వాత కాఫీ తాగుతూ మొదలైన మాటలు… హైదరాబాద్ చేరే వరకు ప్రవాహంలా సాగుతూనే వున్నాయి. మా మాటల్లో ఎక్కువగా సాహిత్యం, సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాల వరకూ అన్నీ వచ్చాయి.
హైదరాబాద్ దగ్గరవుతున్న కొద్దీ తను వెళ్ళిపోతుందనే దిగులు మొదలైంది. తన నెంబర్ తీసుకోవడం ఎలా… అడిగితే ఏమైనా అనుకుంటుందేమో…. ఇవే ఆలోచనలు…
ఇంతలో రానే వచ్చింది సికింద్రాబాద్ స్టేషన్.
దిగడానికి బ్యాగ్ పట్టుకొని కొంత హెల్ప్ చేశా…
దిగిన తర్వాత… ”కాఫీ తాగుదామా..?” ఎలాగైనా ఇంకాసేపు తనతో మాటలు పెంచాలని.
”ఇప్పుడా..?”
”సరే.. వద్దులెండి…” కాస్త నిరుత్సాహంగా.
నా గొంతులోని నిరుత్సాహాన్ని గమనించినట్టుంది… ”లేదు..లేదు… వెళ్దాం రండీ..”
రైల్వే క్యాంటిన్‌కి వెళ్లి కాఫీ తాగుతూ… ”ఇంతకీ మీరుండేది ఏ ఏరియా…’ ధైర్యం చేశాను.
”అమీర్‌పేట… అవును… మర్చేపోయాను… మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. తర్వాత నేను కాల్ చేస్తాను”
చకచకా నెంబర్ చెప్పాను.
నెంబర్ ఫీడ్ చేసుకొని… ”ఇక వెళ్దామా” అన్నట్టుగా లేచింది.
ఇక తన నెంబర్ అడగలేకపోయా…
చివరికి ”ఎలా వెళతారు…”
”డ్రైవర్ వెయిటింగ్…” అంటూ డ్రైవర్ నెంబర్‌కి కాల్ చేసింది.
డ్రైవర్ వచ్చి బ్యాగ్ తీసుకున్నాడు. ఇద్దరం బయటకొచ్చాం.
తను వెళ్లేవరకూ అక్కడే నిల్చుండిపోయా. తను వెళుతోంటే… నా ప్రాణాన్ని ఎవరో బలవంతంగా లాక్కుపోతున్నట్టుగా అనిపించింది.
***
రోజులు గడుస్తున్నాయి… స్పందన నుంచి ఫోన్ లేదు.
అవును… నా పిచ్చిగాని తను ఎందుకు చేయాలి. రైల్లో కలిసిన వారంతా మళ్ళీమళ్ళీ కలవాలనేం వుంది.
యథాలాపంగా నా గొంతు నుంచి కూనిరాగం…
”ఏ నావదే తీరమో… ఏ నేస్తమే జన్మవరమో…” నన్ను మైమరపించే పాట.
నిజమే కదా… ఏ నేస్తం ఏ జన్మవరమో.. మా పరిచయం కూడా అంతే.
మా రైలు పరిచయం… ఎప్పటికీ కలవని రైలు పట్టాల్లా. ఒకే ఊరిలో వున్నా.. ఎప్పటికీ కలవలేం. అంతే జీవితం. ఐదుగంటల ప్రయాణం… ఓ తీయని జ్ఞాపకం.
తన పేరు తలచుకోగానే నా హఅదయమెందుకిలా స్పందిస్తోంది. ఇన్నాళ్లూ లేని ఈ స్పందన… ఇప్పుడు కొత్తగా గిలిగింతలు పెడుతోందేం.
స్పందన గుర్తొస్తే చాలు… వెన్నెల్లో విహరించిన అనుభూతి.
తన నవ్వు గుర్తొస్తే కోయిల గానంలా… తన మాటలు గుర్తొస్తే వీణ మీటినంత తీయగా…
నిజంగానే తన గొంతు ఎంత బాగుంటుందో. మనిషెంత అందంగా వుంటుందో… తన మాటలూ అంతే అందంగా వుంటాయి.
ఈ భగవంతుడున్నాడే… పెద్ద తుంటరి. అన్ని అందాలూ ఒక్కరికే ఇచ్చేస్తే… మిగతా వారి పరిస్థితేంటి…? నా ప్రశ్నకు నాకే నవ్వొచ్చింది.
పదిరోజుల తర్వాత… ఓ ఫోన్ కాల్. అన్‌నోన్ నెంబర్ నుంచి.
ఎవరో అనుకుంటూ… ”హలో”
”హలో…. రవీంద్ర గారా…” ఓ కోయిల స్వరం….
ఆ స్వరాన్ని మర్చిపోతే గదా…. ఒక్కసారిగా గుండె లయ తప్పింది…
తను… స్పందన.
”నేను… స్పందన..”
తన గొంతు మర్చిపోతే… మళ్లీ గుర్తు చేయడానికి…
”హలో… ఆ..ఆ… గుర్తు పట్టాను. ఏమిటో సడన్‌గా మేడమ్‌గారికి మా మీద దయ కలిగింది…” చిన్నగా నవ్వుతూ…
”దయ కాదు గానీ… ఈ రోజు సాయంత్రం 5గంటలకు రవీంద్రభారతిలో ఓ పుస్తక పరిచయ కార్యక్రమం వుంది. ఇప్పుడే ఓ ఫ్రెండ్ చెప్పారు. సడన్‌గా మీరు గుర్తొచ్చారు. అందుకే ఫోన్. వీలైతే…”
”సాయంత్రం కదా… తప్పకుండా వస్తా…”
తర్వాత కుశల ప్రశ్నలు… తన మాటల ప్రవాహం…
”మీరేం మాట్లాడ్డంలేదు… నేనే మాట్లాడేస్తున్నా… సాయంత్రం తప్పకుండా రండి. పెద్ద రచయితలు చాలా మంది వస్తున్నారట..”
”అలాగే… తప్పకుండా..”
ఫోన్ కట్ అయింది. వెంటనే నేను చేసిన మొదటి పని… తన ఫోన్ నెంబర్ సేవ్ చేసుకోవడం.
మళ్లీ అదే ఫీలింగ్… నా హఅదయాన్నెవరో లాక్కుపోతున్నట్టుగా…
సమయం భారంగా గడుస్తోంది. ఎప్పుడు ఐదవుతుందా అని ఆతఅత…
కాస్త ముందుగానే రవీంద్రభారతికి చేరుకుని పక్కనే చెట్టుకింద నుంచొని ఫోన్ మాట్లాడుతున్నా…
అప్పుడొచ్చిందో తెల్లని కారు రాజహంసలా. కారును ఓ వైపు పార్క్ చేసి, దేవకన్య దివినుంచి భువికి దిగొచ్చిందా అన్నంత వయ్యారంగా… కారులోంచి దిగింది స్పందన.
తననలా చూట్టమే గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది.
నన్ను చూసి పలకరింపుగా ఓ స్మైల్ విసిరింది.
నేనూ నవ్వుతూ తనవైపు వెళ్లా…
”చాలాసేపయిందా మీరొచ్చి..”
”లేదండి.. ఫైవ్ మినిట్స్…” తననలా గుడ్లప్పగించి చూడ్డం సంస్కారం కాదని మనసు హెచ్చరిస్తోంటే… మెల్లగా చూపు తిప్పుకుంటూ…
”ఇంకా ఎవరూ వచ్చినట్టులేదు.. ఇప్పుడిప్పుడే వస్తున్నారు”
స్పందనకు తెలిసినవాళ్లనుకుంటా… పానకంలో పుడకల్లా అప్పుడే…
”హారు స్పందనా…” అంటూ ఓ జంట ప్రత్యక్షమైంది.
”వీరు రవీంద్రనాథ్ గారూ…. వీరు చంద్రమోహన్ గారు, ప్రమీల గారు” అంటూ పరిచయం చేసింది.
”లోపలికెళ్దాం రండీ…” ఆడిటోరియంలోకి దారితీసింది.
ప్రోగ్రామ్ పూర్తయ్యేసరికి 9 అయింది.
స్పందన అరగంట ముందే వెళ్ళిపోయింది.
తను వెళ్లిన కాసేపటికి ఫోన్…
”ఇంకా అక్కడే వున్నారా”
”అవునండీ… కార్యక్రమం చివరికొచ్చింది. నేను కూడా బయల్దేరదామనుకుంటున్నా… ఈలోపు మీ ఫోన్…” మాట్లాడుతూ బయటకొచ్చేశా…
ఆ పుస్తక పరిచయం గురించి దాదాపు గంట పాటు మా చర్చ కొనసాగింది. రచయిత గురించి, ఆ కథల్లోని పాత్రల గురించి తన విశ్లేషణ నాకు ఆశ్చర్యం కలిగించింది.
ఆ తర్వాత…
రవీంద్రభారతి, త్యాగరాయ గానసభలలో జరిగే ప్రతి సాహితీసభకు హాజరయ్యేవారం. ఎన్నో కబుర్లు… చర్చలు.. ఒక్కోసారి తనముందు నేను ప్రేక్షకుడ్నే.
తేనెల ఊటలా… తన మాటల ప్రవాహం…
చాలా భాగం మా చర్చలన్నీ ఫోన్‌లోనే. రోజులో రెండు మూడు గంటలు ఫోన్‌లో కబుర్లు…
రోజూ తన ఫోన్ కోసం ఎదురుచూపు. ఆ ఎదురుచూపులో చెప్పలేని అనుభూతి.
తన పరిచయంతో కాలేజీ రోజుల్లోని రవీంద్రనాథ్ మళ్లీ మేల్కన్నాడు…
కవితలు, కథలు రాయడం మొదలైంది…
స్పందన ఎంతో ప్రోత్సహించేది. అందులోని లోపాలను కూడా సరిదిద్దేది.
ఓ రోజు సడన్‌గా స్పందన అన్న మాటలు…నన్నెంత ఉక్కిరిబిక్కిరి చేశాయో చెప్పలేను.
”మీరిలాగే రాస్తూ వుంటే… ఎప్పుడోకప్పుడు మీ ప్రేమలో పడిపోతానేమోనని భయంగా వుంది” అంటూ చిన్నగా నవ్వింది.
ఆ మాటలు నన్నెంత కదిలించాయో చెప్పలేను.
అప్పటికే తన మీద నాకేర్పడుతున్న భావానికి… ఆ మాటలు ఒక రూపాన్నిచ్చాయి.
కాసేపు మూగవాడ్నే అయ్యాను…
”హలో వింటున్నారా..”
”ఆ వింటున్నా… నిజమా…”
”నిజమే చెబుతున్నా…”
అలా మళ్లీ ఓ గంటపాటు మాటల ప్రవాహం.
చివరికెలాగో గొంతు పెగల్చుకుని ”నా మనసులోని భావనను.. నేను చెప్పలేకపోయిన మాటలను… మీరు చెప్పారు.. థ్యాంక్యూ స్పందన” అనగలిగాను.
కానీ… తన మాటలు రేపిన అలజడి మాత్రం పెను తుపానులా హఅదయాన్ని తాకింది.
చదువుకునేప్పుడు ప్రేమ గురించిన ఆలోచనలున్నా… వాటికి ఒక రూపం రాకముందే… పెళ్లి జరిగిపోయింది.
మళ్లీ ఇన్నేళ్ల తర్వాత…
మనసు మనసులో లేదు.. స్పందన కలిగించిన హఅదయస్పందనను కంట్రోల్ చేయడం నావల్ల కాలేదు.
అప్పటివరకూ తెలియదు… ఈ వయసులోనూ ప్రేమ పుడుతుందని. తన కోసం టీనేజ్ కుర్రాడిలా పరుగులు పెడతానని.
మనసు ఉత్సాహంతో గంతులు వేస్తోంది…
కూనిరాగంలా మొదలైంది పాట… నా ప్రియమైన పాట…
”ఏ నావదే తీరమో… ఏ నేస్తమే జన్మవరమో…” అంటూ ప్రవాహంలా సాగిపోయింది.
జీవితమంటే అదేనేమో… మనం ఊహించనివి జరగడమే జీవితమేమో..
***
రోజులు గడుస్తున్నాయి…
అనుకోనివిధంగా జరిగిన ఓ సంఘటన..
మెసెంజర్‌లో చాట్ చేస్తూ… ‘ముద్దు కావాలా?’ అంటూ సరదాగా మెసేజ్ పెట్టా.
స్పందన నుంచి ఎలాంటి స్పందన లేకపోగా… ఫోన్ చేయలేదు. నేను చేసినా తీయడం లేదు.
ఏం జరిగిందో అర్థం కాలేదు.
తర్వాత కాస్త స్థిమితంగా ఆలోచిస్తేగానీ నేను చేసిన పొరబాటేమిటో అర్థం కాలేదు. అప్పటికే 24గంటలు గడిచిపోయింది. సడన్‌గా తన మౌనం నన్ను నిలువనీయలేదు. ప్రపంచం మొత్తం శూన్యంలా అనిపించింది.
తనతో పరిచయం వాస్తవం కాదా… ఇలా మంచులా కరిగిపోవాల్సిందేనా..
హౌ గాడ్… ఎందుకిలా జరిగింది. నేనెందుకింత తొందరపడ్డాను.
అంతేనా… ఇంకేమైనా జరిగిందా?
ఎందుకు ఫోన్ తీయడంలేదు… బుర్ర బద్దలైపోతోంది…
ఎట్టకేలకు మరుసటిరోజు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసింది.
‘చెప్పండి…’ మునుపటి లాలిత్యం ఆ గొంతులో వినబడలేదు.
‘ఏమిటీ… ఫోన్ చేయలేదు… చేసినా తీయడం లేదు’
‘ఏం లేదండీ…’
‘సారీ.. స్పందన గారు. నేను సరదాగా అన్నాను. దానిగురించే మీ మౌనం అయితే… వెరీసారీ…’
నా సారీని పట్టించుకోకుండానే…. ‘చెప్పండి… నా నుంచి మీరు ఏం కోరుకుంటున్నారో… ఆలోచించుకొని గంట తర్వాత ఫోన్ చేయండి. అది ఏదైనా ఫర్వాలేదు. కానీ… నా నుంచి మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో తెలియాలి… ఉంటాను…’
గుండె వేగం పెరింది… అనుకున్నంతా అయ్యింది.
నాకు తెలుసు… తన నుంచి నేనేం కోరుకుంటున్నానో…
”గంట వరకేం అక్కర్లేదండీ… నా గురించి నాకు తెలుసు. నాకేం కావాలో కూడా నాకు తెలుసు. మీ నుంచి నేనేదో ఆశించి మాట్లాడ్డంలేదు. నాకూ క్యారెక్టర్ వుంది. నన్ను అపార్థం చేసుకోవద్దు ప్లీజ్….”
”మీరంటే నాకు చాలా ఇష్టం. అది నేను మాటల్లో చెప్పలేను. నాది ప్రేమే తప్ప వ్యామోహం కాదు. ఇన్నిరోజుల మన పరిచయంలో ఎప్పుడూ సభ్యత మరచి మాట్లాడలేదు… ఆ విషయం మీకూ తెలుసు”
”నేను సరదాగా అన్న మాటకు… మీరూ సరదాగానే కౌంటర్ ఇస్తారనుకున్నా… కానీ ఇలా అపార్థానికి దారితీయడం దురదఅష్టకరం”
”మీ నుంచి నాకు కావాల్సింది కాసింత ప్రేమే తప్ప… నాకింకే భావనా లేదు. ఈ విషయాన్ని మీరు నమ్మితే చాలు. ఇంతకంటే చెప్పేదేం లేదు…”
”ఓకె.. రవి గారూ.. ఒదిలేద్దాం… అర్జంటు కాల్ ఒకటి చేయాలి. తర్వాత మళ్లీ మాట్లాడతా…” ఫోన్ పెట్టేసింది.
ఈ పరిస్థితి ఎటు దారితీస్తుందో… ఒకవేళ తను మాట్లాడకపోతే..
ఆ ఊహనే భరించలేనట్లుగా వుంది నా మానసిక స్థితి.
అన్నట్టుగానే గంట తర్వాత స్పందన నుంచి మళ్లీ ఫోన్…
ఆశ్చర్యకరంగా… అసలేమీ జరగలేదన్నట్టుగా మళ్లీ గలగల గోదారిలా.. తన మాటల ప్రవాహం.
నాలో గిల్టీ ఫీలింగ్…
మనసును కాస్త స్థిమితపర్చుకొని… ”ఇంతకీ మేడమ్ గారికి కోపం తగ్గినట్టేనా…”
”కోపం కాదండీ… మీరు కూడా అలా అనేసరికి హర్ట్ అయ్యాను. అందుకే బాధనిపించింది…”
”సారీ… స్పందన గారు. సరదాగానే అన్నాను తప్ప… వేరే ఉద్దేశ్యంతో కాదు…”
”ఓకె అండీ… ఇక అది ఒదిలేద్దాం..”
ఒక అపార్థం… 24గంటల పాటు మనసును సుడిగుండంలా తిప్పింది.
మళ్లీ మొదలు….
గంటలు గంటలు… మాటల ప్రవాహం…
చాలా సందర్బాల్లో… తనంటే నాకున్న ఇష్టాన్ని… తన మీద నా ప్రేమను వ్యక్తం చేస్తూనే వున్నా…
ఒక్కోసారి నాకూ ఇష్టమే అన్న భావన కలిగించేది. మరోసారి మాటలు దాటవేసేది…
నెమ్మది నెమ్మదిగా నాకు అర్థమౌతోంది…
తాను నా పట్ల చూపేది ప్రేమ కాదు…
మరేమిటి?
స్నేహమేనా..?
కానీ… నేను తనని ప్రేమించకుండా ఉండలేకపోతున్నానే…
తనను చూడాలని… మాట్లాడాలని… మనసు తపించిపోతోంది.
ఈ మనసును కంట్రోల్ చేయడం ఎలా?
రోజులు గడుస్తున్నాయి…
ఫోన్లు… మెసేజ్‌లు… యథాతథంగా జరిగిపోతున్నాయి.
నాకు మరింత అర్థమైన విషయం…
మా మధ్య ఎప్పటికీ పూడ్చలేని ఒక అంతరం…
స్పందన బాగా ధనవంతురాలు.
తనతో పోల్చుకుంటే… నేను నిరుపేదనే.
ఫోన్‌లోనే తప్ప… ఎక్కడా కలిసింది లేదు… ఎదురెదురు కూర్చొని మాట్లాడుకున్నదీ లేదు.
ఓ సందర్భంలో తానన్న మాట…
‘రెండ్రోజులు కూడా నన్ను, నా ఖర్చుని మెయింటెయిన్ చేయలేరు…’
నిజమే రెండ్రోజులు కాదు రెండు గంటలు కూడా తన ఖర్చుని భరించలేను…
ఆ విషయం నాకూ తెలుసు.
వాస్తవానికి తననుంచి కోరుకున్నది ప్రేమనే. నేను జీవితంలో కోల్పోయిన ఓదార్పునే.
నాకు ఓ మనసు కావాలి. నన్నర్థం చేసుకొని… ఊరడించి…. లాలించే ఓ ప్రేమమూర్తి కావాలి.
కానీ… స్పందన నాకు అర్థం కావడంలేదు.
నా ప్రేమను కాదనడంలేదు… కానీ తను మాత్రం మనసు విప్పడంలేదు.
ఈ సందిగ్ధం నన్ను వెంటాడుతూనే వుంది.
ఓ రోజు….
మాటల మధ్యలో తన గతాన్ని గురించి చెప్పింది.
తాను అప్పటివరకూ గుండెలోతుల్లో దాచుకొన్న తన ప్రేమను గురించి…
తన ప్రేమికుడితో దాదాపు 12ఏళ్ల సాంగత్యం గురించి చెప్పింది.
అది బ్రేకప్ అయిన వైనం గురించి ఎమోషనల్‌గా మాట్లాడుతూ… తనను తాను కంట్రోల్ చేసుకోలేక ఫోన్ కట్ చేసింది.
నాకు తెలుసు… తన మనసు ఎంత అల్లకల్లోలం అయివుంటుందో…
నేనూహించగలను… తన మనసులోని ప్రకంపనల తీవ్రతను…
ఒకటి మాత్రం నాకర్థమయ్యింది.
తన ప్రేమకథను చెప్పడం ద్వారా.. నన్ను కంట్రోల్ చేయాలనుకుంటోందని.
కానీ….
నేనది తట్టుకోలేకపోతున్నా…
ఒకవైపు స్పందన ఆవేదన. మరోవైపు.. తన మనసులో నాకు చోటులేదే అనే వ్యధ.
మనసు రోధిస్తోంది… ‘ఏ నావదే తీరమో… ఏ నేస్తమే జన్మవరమో…’ అంటూ…
ఈ కొద్ది పరిచయంతో నేనే ఇంత వేదన పడుతోంటే…
12ఏళ్ల సాంగత్యంలోని తన ప్రేమ కోసం తానెంత బాధపడుతోందో… ఎలా తట్టుకోగలుగుతుందో…
ఒక మనిషిని ఎవరైనా ఇంతగా ప్రేమిస్తారా…
నిజమైన ప్రేమ ఎప్పటికీ నిలిచే వుంటుంది…
నా ప్రేమ కూడా.
స్పందన కోసం తాజ్‌మహల్ కట్టలేకపోవచ్చు…
కానీ నా గుండెనే తాజ్‌మహల్ కంటే గొప్ప దేవాలయంగా మలిచాను.
తాను ఎప్పటికీ ఆ దేవాలయంలో దేవతే….
ఈ గుండె ఆగిపోయే వరకూ…
ఈ గొంతు మూగపోయే వరకూ…
ఈ తనువు నిర్జీవమయ్యే వరకూ…
ఎప్పటికీ ఎప్పటికీ… నా మనసులో నిలిచే వుంటుంది.
ఈ తనువు రాలిపోయేలోపు ఒక్కసారైనా తన నోటివెంట వినాలనుకునే మాట…
నువ్వంటే నాకిష్టం… ఐ లవ్ యూ… అని.
ఆకలి లేదు… నిద్ర లేదు…
తన మాటలే వెంటాడుతున్నాయి…
మనసులో రకరకాల ఆలోచనలు తేనెతుట్టెలా ముసురుకొంటున్నాయి.
చివరకు ఒక నిర్ణయానికొచ్చాను…
***
ఉదయాన్నే ఫోన్ చేశా…
”వీలైతే… ఓసారి కలుద్దాం ఎక్కడైనా…. ప్లీజ్..”
ఏమనుకుందో… ”మీరే చెప్పండి ఎక్కడ కలవాలో…”
”శిల్పారామం…”
”చాలా దూరం కదా”
”కానీ అక్కడైతే.. కాస్త ఏకాంతంగా వుంటుంది…”
”సరే…”
”ఇంకా…”
”చెప్పండీ…”
”సరే వుంటాను…. సాయంత్రం 4గంటలకు కలుద్దాం..” ఫోన్ పెట్టేశా.
శిల్పారామం పార్కులో ఓ చెట్టు కింద…
రాత్రంతా సరిగా నిద్రపోయినట్టు లేదు…
చంద్రబింబంలా వెలుగుతూ వుంటే తన మోము ఒడిలిపోయివుంది. తననలా చూడడం చాలా బాధ కలిగించింది..
”చెప్పండీ… ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చారు..” అంటూ నవ్వింది.
కానీ… ఆ నవ్వులో ఇదువరకటి కళ లేదు… జీవం లేదు…
”స్పందన గారూ…
నన్ను అవాయిడ్ చేయడానికి చెప్పినా… మరొకందుకు చెప్పినా.. మీ ప్రేమగాథ నన్ను తీవ్ర వేదనకు గురిచేసింది. ఒక ఆత్మీయుడిగా మీ సహచర్యం బ్రేకప్ కావడం బాధ కలిగించింది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నా మనసులో ఒక్కరే వుంటారని చెప్పదలచుకున్నారేమో అని కూడా అనిపించింది.
అయితే ఒక విషయం మాత్రం నాకు స్పష్టంగా అర్థమయింది.
మీరొక ప్రేమమూర్తి. మీ మాటలు పెదల నుండికాక గుండె లోతుల్లో నుంచి వస్తాయి.
ఒక వ్యక్తిని మీరు ఎంతగా ప్రేమిస్తారో తెలిసింది.
అందుకేనేమో నేనూ మిమ్మల్ని అంతే గాఢంగా ప్రేమిస్తున్నా..
మీ విషయం చెప్పిన తర్వాత కూడా మీపై నాకున్న ప్రేమలో ఇసుమంత కూడా మార్పులేదు. మరింత గౌరవం పెరిగింది. ప్రేమా పెరిగింది. రోజు రోజుకూ పెరుగుతూనే వుంటుంది.
కాకపోతే మనిద్దరి మధ్య ఒక అంతరం వుంది.
నా స్థాయికి మీరు దిగిరాలేరు… మీ స్థాయికి నేను ఎదగలేను.
అయినా పిచ్చి మనసు మాట వినడంలేదు. దానికిప్పటివరకూ ప్రేమ రుచేమిటో తెలియదు. ఇప్పుడు ప్రేమ రుచిని అనుభవించి… అమఅతపానం చేసినట్టుగా వుంది.
మీ పరిచయం నన్నెంతగా మార్చేసిందో నాకు మాత్రమే తెలుసు. అది మీకూ తెలుసనే అనుకుంటున్నా… మీతో అంత గాఢమైన ప్రేమలో మునిగిపోయాను. అలాగని మీరు కూడా ప్రేమించాలని లేదుగా.
నేను ప్రేమిస్తున్నా కాబట్టి మీరూ ప్రేమించాలి అంటే.. అది స్వార్థమౌతుంది…
ప్రకఅతిని ప్రేమించడానికి అందమైన మనసు కావాలి. ఆ మనసు నాకుంది. అది ఇప్పటికీ ఎప్పటికీ అలాగే వుంటుంది మనసు నిండుగా నీ రూపంతో.
ఈ ప్రకఅతిలోని ఒక సౌందర్యానివి నువ్వు.
సేవించేకొద్దీ ప్రేమామఅతాన్ని నింపుతూనే వుంటావు…
అనుభవించేకొద్దీ ఈ గుండె నిండా ఆనందాన్ని ఒంపుతూనే ఉంటావు…
ఈ శ్వాస ఆగిపోయే వరకూ… ఆ శ్వాసలో నీవుంటావు.
స్పందనా… ‘గారూ’ అననందుకు ఏమనుకోవద్దు..
ఇదంతా నా ఫీలింగ్స్ మాత్రమే…
ఎందుకంటే.. ఉన్నదానిలోనే సంతోషాన్ని వెదుక్కోవడం అలవాటైన మనసిది. ఇప్పుడూ అంతే…
ఒక్కటి మాత్రం చెప్పగలను.. నా ప్రేమ మీకెప్పటికీ ఇబ్బంది కలిగించదు…”
అప్పటికే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి… ఇంకాసేపు అక్కడే వుంటే… ఏం జరుగుతుందో తెలుసు…
”మరి నేను వెళుతున్నాను స్పందనా…
ఎప్పటిలాగే మన పరిచయం కొనసాగుతుందని ఆశిస్తున్నా…
అది ప్రేమికులుగానా… స్నేహితులుగానా అన్నది నీ ఇష్టం…
వస్తాను….
ఎప్పటికీ నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూనే వుంటా…
బై స్పందన…”
మెల్లగా రోడ్డు వైపు నడుచుకుంటూ…బయల్దేరా..
”నాకు తెలుసు… తను నావైపు చూస్తోందని..
తన చూపుల స్పర్శ నాకు తాకుతోంది…
మనసును చిక్కబట్టుకొని ముందుకు నడుస్తూనే వున్నా….
మనసు మూగగా రోదిస్తోంది… ”ఏ నావదే తీరమో… ఏ నేస్తమే జన్మవరమో…” అంటూ…