“చూడండి ఇక ఈ రోజు పొద్దుటి నుంచే ఆమె నానా గొడవ మొదలెట్టేసింది. అసలు చెల్లె అడిగింది కూడా “మీ అత్త ఎందుకు ఊరకనే అలుగుతూ ఉంటుంది”? అని. ఏం చెప్పను చెప్పండి? ఆమె అలవాటే ఇది. ఇంటికి వచ్చే పోయే వాళ్లందరి ముందు ఏడుస్తూ నా గురుంచి చాడీలు చెబుతూనే ఉంటుంది మరి. లోకంలోని చెడు అంతా నా లోనే ఉంది. నేను మురికి దాన్ని. నా మొఖం కూడా అంత గొప్ప అందంగా ఏమి ఉండదు. పిల్లల్ని పెంచడమే నాకు రాదు. పిల్లలే నా శత్రువులు మరి. నాలో ఎప్పుడూ లేని తప్పులనే వెతుకుతుంది. తనలో లేని మంచి నాలో కూడా ఉండదని అనుకుంటుంది. ఇక నేను వంటచేశాననుకోండి ., ఏం చెప్పమంటారు నాలుక మీద ఉమ్మటానికి ఉమ్ము సిద్దంగా చేసుకుంటుంది. ఇక నా వంటకి ఎలాంటి పేరు పెడుతుందనుకున్నారూ., వినేవాళ్ళు తరువాత ఆ తిండి తినడానికి అసహ్యించుకుంటారనుకోండి. మొదట్లో ., పెళ్ళయిన కొత్తల్లో అయితే నేను వంట ఎంతో ఇష్టంగా చేసేదాన్ని. నా వంట గురించి నీకు తెలియంది ఏం ఉంది చెప్పు? పుట్టింట్లో ఎంత బాగా వంట చేసేదాననో. అలాగే మన అమ్మీ కూడా అద్భుతంగా వంట చేస్తుంది. ఆమె వంటలకి మా ఇంట్లో, బంధువుల్లో అంతా చాలా మంచి పేరు ఉంది. ఇక ఇక్కడ నా అత్తవారింట్లో ఎప్పుడూ చూడూ నా వంట మీద ఏదో ఒక చిన్న చూపే ఉంటుంది. “అబ్బా ఉప్పు ఇంత ఎక్కువా వేసేది ., వొట్టి విషం దీని బదులు మన్ను తినడం నయం” అంటుంది చీదరగా చూడు ఎప్పుడూ ఇవే మాటలు.
“అబ్బా ఏం వంటనో ఏమో ఇంత ఘోరంగా ఎవరూ వండరు” అని బడబడా వాగుతూనే ఉంటుంది ప్రతీసారీ. “నీ కైతే కోడలు పిల్ల వంటనే నచ్చుతుంది అంటావుగా మరి” అని ఎవరైనా అన్నారనుకోండి “..ఒహ్హో మరి నా వంట సంగతి ఏంటట? నా జీవితమంతా వండి, వండి అందరికీ తినిపించడంలోనే నా కాలమంతా గడిచిపోయింది. మీకేం తెలుసు” అని వాపోతుంది. ఇప్పుడిక నేనేం చెబుతాను? బాగా నవ్వుకున్నాం. ఈమె నా ఓపికకి పరీక్ష అంతే. ఈమెకి నేనెప్పుడూ బాగా పని చేయాలి, మీద నుంచి మాటలు పడుతూనే ఉండాలి. దాని బదులు అసలు పనే చేయకపోతే పోలా? వండడం, తినడందేం ఉందిలే? ఇంకో విషయం విను. ఇక ఎప్పుడైనా ఏదైనా డ్రస్ నచ్చిందని దర్జీతో కుట్టించు కున్నాననుకో ఇక చూడాలమ్మామా అత్త మాటలెలా ఉంటాయో?. “నెలంతా ఎలా గడుస్తుందో తెలియదు కానీ ఇక్కడ చూడండి కోడలు దర్జీకి డబ్బులు ఇచ్చి మరీ బట్టలు కుట్టించుకుంటుందమ్మా మహారాణి కదా మరి”? దీర్ఘాలు తీస్తూ మందికి చెబుతుంది. నేనైతే నా బట్టలు, నా భర్త కుర్తా పైజామా, నా పిల్లల బట్టలు నేనే కుట్టుకుంటాను. ఎప్పుడైనా కొత్త రకం బ్లౌస్, కోట్ మీద మనసయితేనే దర్జీకి ఇస్తాను. అదీ ఎవరికి తెలీకుండా దాచిపెట్టి మరీ. అయినా కానీ ఎట్లా పసి గట్టేస్తుందో..ఆమెకి తెలిసి పోతుంది. ఇక మొదలు పెట్టేస్తుంది. ఒకసారి ఏమైందో తెలుసా బెహెన్? పెళ్ళయిన కొత్తల్లో నేను మా అత్తకి ఒక చికెన్ కుర్తా పైజామా కుట్టి ఇచ్చాను ఎంతో ఇష్టంగా. ఏం చేసిందనుకున్నావూ ., బయటకు తీసుకెళ్ళి అందరికీ చూపించి దాన్లో ఎన్ని తప్పులున్నాయో చెబుతూ వెక్కిరించిందంటే నమ్ము. నాకెంత బాధేయాలి చెప్పు? కానీ చూసిన వాళ్ళంతా ఆమెకేమీ వంత పాడలేదు. ఎందుకంటే నేను కుట్టిన కుర్తా పైజామా అంత బాగా వచ్చింది మరి. ఇక వాళ్ళు బాగా లేదని ఎట్లా అనగలరు ఈమె పిచ్చి కాకపోతే? ఇక అందరూ మెచ్చుకునేసరికి అత్తకి కోపం వచ్చేసి నేను కుట్టిన కుర్తాని ఉల్టా, పుల్టా చేసేసి మళ్ళీ దర్జీకి ఇచ్చింది కుట్టమని. ఏం చెప్పను అలాంటిది మా అత్త. నాకు ఇప్పుడు నేను కుట్టించుకున్న కుర్తా చూపించాలనే ఉంది. కానీ ఎలా చూపించను చెప్పు? మళ్ళా ఏమైనా వంకర మాటలు అంటూ నా మనసు ఇట్టే విరగగొట్టేస్తుంది మహాతల్లి. తన పెద్దరికాన్ని, అత్తరికాన్ని అడ్డు పెట్టుకొని ఆమె నాతో ఇలా ధాటీగా ప్రవర్తిస్తుంది. ఎప్పుడు చూడూ నేను చదువుకున్నానని ఎద్దేవా చేస్తూ ఉంటుంది. ఏదైనా పుస్తకం నా చేతుల్లో చూస్తే చాలు భగ్గున మండిపోయేది. ఎవరికైనా ఉత్తరం రాస్తున్నాననుకో ఇక దానిలో తన గురించే చెడ్డగా రాస్తున్నాను అనుకుంటుంది. నా ఒక్క మాట కూడా ఆమెకి ఇష్టం ఉండదు. అన్నిటికీ మించి బాధ కలిగించే విషయం ఏంటో తెలుసా నీకు., మా మొగుడూ పెళ్లాలం సుఖంగా ఉండడం మా అత్త అస్సలు చూడలేదు. ఎప్పుడైనా నా షొహర్ (భర్త) నాకేమైనా తెచ్చాడనుకో ఇక అంతే మొఖం ముటముట లాడించుకుంటూ ఉండిపోతుంది. కూర్చున్నా, లేచినా నా షొహర్ వెంట బడుతూ “నువ్వు వొట్టి పనికి రాని వాడివి.. పెళ్ళాం చేతిలో కీలు బొమ్మవి” అంటూ వెంటబడి వేధిస్తూ ఉంటుంది. ఎంత సేపూ నా గురించి ఆయనకి చెడ్డగా చెప్తూనే ఉంటుంది. అది విన్నా కూడా ఆయన పెద్దగా పట్టించుకునేవాడు కాదు. కానీ కొన్నిసార్లు చిరాకు పడేవాడు. ఒక్కోసారి “ అవును అమ్మీ నువ్వన్నట్లు ఈమె ఎక్కువగానే మాట్లాడుతుంది. పోనీ ఒక పని చెయ్యి నాకు ఇంకో నిఖా(పెళ్లి) చెయ్యి” అనేవాడు నవ్వుతూ. “నీలో దమ్ముంటే ఈమె నీ నెత్తి మీద ఎందుకు ఎక్కుతుంది చెప్పు”? అని ఆయనతో అంటుందా., ఇక చూస్కో బయట మాత్రం “ఇలాంటి భార్య దొరికినందుకు నా కొడుకు ఎప్పుడూ బాధ పడుతూనే ఉంటాడు. నాకు రెండో నిఖా చేసేయ్ అమ్మీ అంటూ ఉంటాడు, ఈ దునియాలో కొడుకు కోసం కోడలితో కొట్లాడేదాన్ని నేనొక్కదాన్నే ఉన్నాను. ఇంకొకత్తి అయి ఉంటేనా ఈ పాటికి రెండో పెళ్లి చేసేసేదే.
బతుకులో మనశ్శాంతే లేకుండా పోయింది. ఇక నా పిల్లలనంటావా నాశనం చేసేసింది. ఏదైతే నేను చేయమంటానో దానికి వ్యతిరేకంగా చేస్తుంది. నేను వద్దు అన్నది తను చేసి తీరుతుంది. బయట ఈగలు వాలిన తిండి వస్తువులు వద్దంటానా.. తను నా మీద జిద్దుతో అవే కొని పిల్లలకి ఇస్తుంది. పోయిన సారి పెద్దోడికి బయట ఎక్కడో కొన్న మీగడ బర్ఫీ తినిపించింది అంతే వాడు జ్వరంతో మంచాన పడితే రెండు నెలలు లేవనే లేదంటే నమ్ము. మళ్ళీ తానే ఏమంటుందో తెలుసా. “పిల్లలకి ఏమీ పెట్టకుండా చంపేస్తున్నావు” అని. ఏం మనిషో ఏమో? ఇక జ్వరం తగ్గడానికి రోజూ ఏవేవో ఇంజెక్షన్లు ఇప్పించి ఇప్పించి పిల్లాడి వొళ్లంతా గుల్ల చేసేసింది. మీదికెల్లి ఊర్లో ఉన్న మౌల్వీ సాహెబ్ ను పిలిచి మంత్రాల మీద మంత్రాలు వేయిస్తుంది. తావీదులు కట్టిస్తుంది. ఇక నేను ఎంతకీ జ్వరం తగ్గకపోతే పిల్లాడ్ని ఎత్తుకుని హాస్పిటల్ కి తీసుకెళ్లాక కానీ తగ్గలేదు. ఆ డాక్టర్ని నా దోస్త్ కాబట్టి నా మాట విని చేర్చుకుంది. ఇక మా అత్త కథ చూడు., హాస్పటల్లో కూడా నా మీద డాక్టర్ కి, నర్సులకి ఒక నాలుగు చాడీలు, నన్నో పది మాటలు అనడం మాత్రం మాననే లేదు.
ఇక పిల్లలకి పాలు పట్టే విషయంలో మా అత్త నన్నెలా సతాయిస్తుందో ఆ కథలు ఎన్నని చెప్పాలి చెప్పు? కన్న తల్లినై ఉండీ నేను పిల్లల్ని శత్రువుల్లా చూస్తానంట. పిల్లలు ఆకలితో ఏడుస్తూ ఉంటే నేను రాయిలాగా చూస్తూ ఉండిపోతానంట. నేను నా పిల్లలకి సంత్ర, సేబ్ (ఆపిల్) లాంటి పండ్లు తినిపిస్తాను ఆరోగ్యానికి మంచివి అని. తప్పా చెప్పు? ఒకసారి ఏం చేసిందనుకున్నావూ,. పెద్ద పిల్లాడికి మొదటిసారి పండ్లు తినిపించినప్పుడు వోహ్., చాలా గొడవ చేసింది. పండ్లు లాక్కుని నన్ను కొడుతూ నేను అస్సలు తిననివ్వను అని అరిచింది. నా కోడలు న్యుమోనియాతో పిల్లాడ్ని చంపేయాలని చూస్తున్నది అంటూ రచ్చ రచ్చ చేసింది. మా మామ మాత్రం చాలా అమాయకుడు. ఆమెకి అర్థం చేయించే ప్రయత్నం చేశాడు. ఇక వినకపోయేసరికి నన్ను నా పుట్టింట్లో వదిలేసి వచ్చారు పిల్లాడితో సహా. అలా పుట్టింట్లో ఆరు నెలలు ఉండిపోయా. తరువాత మా షొహర్ వచ్చి నన్ను తెచ్చుకున్నాడు. ఒక నెల రోజులు మా అత్త నాతో మాట్లాడనే లేదు. తరువాత రాత్రిళ్ళు పిల్లాడ్ని తన పక్కలో పడుకోబెట్టమని గొడవ చేసేది. పిల్లల్ని విడిగా పడుకోబెట్టి నేను వాళ్ళ మీద జులుమ్ (అన్యాయం) చేస్తున్నానట. ఇదెక్కడి గొడవ నేను నా ముగ్గురు పిల్లల్నీ మొదటి రోజు నుంచీ వేరుగానే పడుకోబెడతాను. భూత ప్రేతాలు ఏమైనా పిల్లల్ని ఎత్తుకుపోతాయో ఏమో విడిగా పడుకోబెడితే? రాత్రుళ్లు మెల్లిగా పిల్లల్ని తన దగ్గర పడుకోబెట్టుకోవడమే కాదు. మధ్య రాత్రుళ్లు సన్నని దీపపు వెలుతురులో కటోరి (గిన్నె)లో మెల్లిగా పాలు పడుతూ ఉండేది. నేను వద్దంటే ముఖం మాడ్చుకునేది. అందరి పిల్లలతో ఇలాగే చేసేది.
ఇక నన్ను ఎప్పుడూ గలీజుదానా అనేది అని చెప్పాను కదా. కాస్త ఆమె వైపు కెళ్ళి చూసావంటే నీకే తెలుస్తుంది. చుట్టూ ఈగలతో ఎంత అసహ్యంగా ఉంటుందో. ఆమెకి అది శుభ్రంగా ఉండడం అన్నమాట. పాన్ తింటుంది కదా పాన్ ఉమ్మే ఉగల్దాన్ పక్కనే ఉంటుంది. అయినా ఆమె ఉమ్మిందీ అంటే చుట్టూ పక్కల నేల మీదే పడుతుంది. పక్కన కూర్చోవాలంటే ఎంత అసహ్యం పుడుతుందనుకున్నావు? నేను ప్రతీ వస్తువు చాలా శుభ్రంగా పెడతాను. ఈగలు రాకుండా పరదా వేస్తే మాత్రం నేను మహా గలీసు దాన్ని.
ఇక ఒక ఏడాది నుంచీ ఈ అలకలతో పడలేక మా వంటిళ్లు వేరుపడ్డాయి తెలుసు కదా. ఒక్క సారి నా వంటిల్లులో కొచ్చి చూస్తే తెలుస్తుంది ఎంత శుభ్రంగా ఉంటుందో? ఎక్కడ కూడా కోసిన కూరగాయల పొట్టు కానీ, మురికి పట్టిన గిన్నెలు కానీ కనబడుతాయేమో చూడు. మా అత్త బావర్చి ఖానా(వంటిల్లు) ఉండి చూశావూ., అక్కడ ఏకంగా నీకు ఈగల ఊరేగింపే కనపడుతుంది. నేను అక్కడంతా ఫినాయిల్ వేసి రుద్ది రుద్ది కడిగి మరీ గలీజు చేస్తానంట., ఏం చెప్పను ఆమె గురుంచి?
ఇక ఆమె ఇంటి నౌఖర్లను ఒక రకమైన పద్దతిలో చాలా సతాయిస్తుంది. కడుపు నిండా తిండి పెట్టకూడదు. పెట్టే ప్రతీ రొట్టెముక్కా, బియ్యం గింజా లెక్కబెట్టి తీరాల్సిందే. వాళ్ళు కూడా మనుషులే కదా ఇక రెండు రోజుల్లో ఈమె తరీకా చూసి భయపడి పారి పోయేవాళ్ళు. నేను నౌకర్లకి కూడా బట్టలు కుట్టిస్తాను. వాళ్ళను స్నానం చేయమని చెప్పాక ఆ కొత్త బట్టలు వేసుకోడానికి ఇస్తాను. ఇది కూడా ఓర్వదు ఆమె. మొగుడి సంపాదన అంటే లెక్కే లేదు అని గొణుగుతూనే ఉంటుంది. నౌఖర్లను నేను తల కెక్కించుకుని బాదుషాల్లాగా చూస్తానంట. అందువల్ల తన నౌకర్లు కూడా చెడిపోతున్నారట . అంతే కాదు నేను ఇంటి మగాళ్లని కూడా చెడ గొడతానంట అదేంటో మరి ?
ఇక ఈ చోద్యం విను. ఇంటికి ఎవరైనా వస్తే “వాళ్ళ ముందు ఎందుకు నిలబడతావు .. పరదా వెనక్కి ఎందుకు వెళ్ళవు? లేదా నఖాబ్ ఎందుకు వేసుకోవు”? అంటుంది. ఆయనకి బోలడంతమంది దోస్తులు ఉన్నారు. హా ., ఒకటి రెండు సార్లు ఆయన ఇంట్లో లేనప్పుడు నఖాబ్ లేకుండానే వాళ్ళ ముందుకు వెళ్ళాను. యికంతే ., ప్రళయం సృష్టించిందనుకో. “ఒహ్హో..ఈమెను చూడండి కాస్త పెద్ద మేడమ్ అయిపోయింది. మగవాళ్ళని కలుస్తుంది. వట్టి సిగ్గులేనిది అయిపోయింది”. అంటూ ఇంకా నానా అనరాని మాటలు అంటుంది. “నీ కూతురు కూడా పరదా లేకుండానే బయటకు వెళుతుంది కదా” అని నేను అన్నాననుకో ., “ఆ మహా చెప్పొచ్చావులే వాళ్ళ ఆయన బలవంతంగా పరదా తీయించేస్తే ఆమేం చేస్తుందీ” అంటుంది. అదేదో ఆమె చాలా అమాయకురాలైనట్లు తన కూతురికి పరదా లేకుండా బయటకు వెళ్ళడం అస్సలు ఇష్టమే లేనట్లు, అదేదో భర్త బలవంతం మీద బేపరదా (పరదాలేకుండా) అవుతున్నట్లు మాట్లాడుతుంది చాలా తెలివైంది తను అనుకుంటుంది. నేనే నా భర్తకి ఇష్టం లేకపోయినా పరదా వేసుకోకుండా బయటకు వస్తున్నట్లు. అందరితో ఇదే చెబుతుంది. ఏం చేయను చెప్పు కోపాన్ని గుక్కిళ్లుగా మింగి ఊర్కోవడం తప్ప? మా ఆడ బిడ్డ అయితే కనీసం మదరసా లో కూడా చదవలేదు తెలుసా. ఆమె భర్తే పెళ్లి అయ్యాక చదవడం రాయడం నేర్పించాడు. ఆమె స్వేచ్ఛగా ఎక్కడంటే అక్కడికి వెళుతుంది. మా అత్తే అన్నీ దాచి పెడుతుంది.
పోయినసారి మా ఆడబిడ్డ వస్తే నేను మటుకు అడిగేసాను. “మీ ఆయన బలవంత చేస్తాడా నిన్ను పరదా వేసుకోవద్దని” అని అడిగేసాను. “అలా ఏమి లేదే ఎవరూ చెప్పారలా నా ఇష్టంగానే నేను పరదా వేసుకోను ఇప్పుడు నన్నెవరైనా పరదా వేసుకోమని చెప్పినా వేసుకోను తెలుసా మా ఆయన కూడా ఏమీ అనడు” అంది. “మా అత్తను చూడు నేను తన కొడుకుని నేను గుప్పిట్లో పెట్టేసుకున్నానని, తన నుంచి తన కొడుకుని దూరం చేసేశానని, తన కొడుకుకి తన మీద ద్వేషం నూరిపోసానని అంటుంది. అంతేనా నా ముగ్గురు పిల్లల ముందు కూడా నన్నెప్పుడూ చెడ్డ దాన్ని చేసి మాట్లాడుతుంటుంది. ఆమెనే అంటుంది.. మళ్ళా ఆమెనే ఎదురు తిరుగుతుంది.. ‘నిన్ను ఏమన్నాను ఎప్పుడన్నాను’ అని. అదే పని నేను చేస్తే తప్పయిపోతుంది, ఆమె బిడ్డ చేస్తే వొప్పయిపోతుంది . ఎక్కడి లెక్కలు ఇవి నువ్వే చెప్పు” !
ఏనాడూ ఆమె నాతో నవ్వుతూ మాట్లాడింది లేదు. అసలామెకి నేనంటే అంత ద్వేషం ఎందుకు? తన కొడుకు నన్ను ఎందుకంత ప్రేమగా చూస్తాడన్నది ఆమెకి అంతుపట్టని విషయం. ఆమె కోపానికి కారణం అదే. ఆయన మాట్లాడుతున్న గదిలోకి నేను వెళ్లాననుకో ., ఇక ఆయన నన్ను చూసి సంతోషంగా పలకరించాడే అనుకో అంతే ఇక గొడవ మొదలై పోతుంది. ఆయనతో నేను అంత అందంగా లేక పోవడం గురించి మాట్లాడుతుంది. ఆయన చాలా సార్లు నవ్వేస్తుంటాడు. “అమ్మీ.. ఆమెలో చెత్త గుణాలు కొన్ని ఉన్నాయనుకో., కానీ ఆమె ముఖం అందమైనదేనే పాపం” అనేసేవాడు. ఇక ఈమెకి కోపం వచ్చేస్తుంది. “సిగ్గులేదూ భార్యను నా ముందే పొగడ్డానికి” అని అరుస్తుంది. ఏం చేయలేక ఆయన మెల్లిగా నవ్వుకుంటూ ఉంటాడా నా మటుకు నాకు మనసు కలుక్కు మంటుందనుకో. ఇక చప్పున లేచి అక్కడి నుంచి వెళ్లిపోతాను. ఏం చేస్తానిక మరి ?
ఎప్పుడు చూడూ నాతో కొడుకు ముందు ప్రతీ విషయంలో పోటీ పడుతూ ఉంటుంది. ‘ఎక్కడ నేనూ., ఎక్కడ వాడి భార్యా’ అనుకుంటూ. నన్ను నా భర్త ఇంట్లోంచి గెంటేసి నప్పుడో., కొట్టినప్పుడో లేదా రెండో పెళ్లి చేసుకున్నప్పుడో గానీ ఆమె మండే గుండె చల్లబడదు అనిపిస్తుంటుంది నాకు. ఇంకో విషయం ఏంటంటే నా తోటికోడళ్లు, మరదళ్లు అంతా వేర్వేరు నగరాల్లో ఉన్నారు. వాళ్ళెప్పుడైనా వచ్చారనుకోండి.. కొన్ని రోజులు వాళ్ళతో బాగానే ఉంటుంది. కొన్ని రోజులైనాక ఇక వాళ్ళల్లో కూడా తప్పులు వెతకడం మొదలు పెడుతుంది. ఇంతా చేస్తూ ఇకప్పుడు నన్నేమంటుందంటే., నేనే నా తోటి కోడళ్ళను అందరినీ పోగేసి తన మీద కుట్ర చేసి వదులుతానట. అప్పుడు కూడా నా మీదే ఆరోపణ. కోడళ్లందరూ చెడ్డ వాళ్ళే ఆమెకి. కానీ అందర్లోకి నేనే చాలా చెడ్డదాన్ని. ఇక నా దుర దృష్టం కొద్దీ కొంచెం చదువుకున్న దాన్ని కాబట్టి మేడమ్ అనే కితాబు అందుకున్న దాన్ని అదీ కథ.
అసలు ఈమె గొణగడం మొదలెట్టిందంటే చాలు నా గదిలోకి వెళ్ళిపోయి తలుపులు గడీలు పెట్టేసుకోని వేరే ఏదో ఇక పనిలో మునిగిపోతుంటాను. ఆమె మాటలు అస్సలు వినపడక పోతేనే హాయిగా ఉంటుంది మనసుకి. కానీ ఈ రోజు పొద్దుటినుంచీ నేను పిల్లలకి టైఫాయిడ్ టీకాలు ఇప్పించానని ,. వాళ్ళకి కొంచెం జ్వరం వచ్చిందని, అది నా వల్లేనని నా మీద ఒకటే గొణుగుతూ ఉంది. పెద్ద వాడు కాస్త ఆమెకి మాలిమి. వాడు పోయి ఆమె వొళ్ళో తల పెట్టుకుని పడుకున్నాడో లేదో వాడి నుదుటి మీద చేతులు వేసి జ్వరం వచ్చేసిందని వోహ్., రెండు గంటల నుంచీ ఆపకుండా గొణుగుతూనే ఉంది. ఇక ఆ అల్లాహ్ సాక్షిగా చెప్తున్నా ఇప్పుడు చూడండి ఈ కథ ఎప్పటి దాకా నడుస్తుందో మీరే చూద్దురు”!
***