హఠాత్తుగా
తెల్ల మబ్బులన్నీ మాయమై
కమ్ముకొస్తాయి
ఎక్కడినుండో
నల్ల మబ్బులు.
వాటిని వెంటాడుతూ
చల్లని గాలి.
చినుకులు
తూనీగల్లా
నేలన వాలతాయి.
ప్రతి మనసూ
కన్ను తెరచి
కిటికీల పెదవులతో
ముసి ముసిగా
నవ్వుకుంటుంది.
చిక్కటి వెలుగు
లే చీకటి
రాగమాలపిస్తుంది.
ఎన్ని సంగీత
వాయిద్యాలో
కచేరినీ రక్తి కట్టిస్తుంటాయి.
ఫ్యాషన్ పరేడ్ కి వచ్చినట్టు
రోడ్డెక్కి
క్యాట్ వాక్
చేస్తుంటాయి కాలువలు.
నేల పొరల్లోంచి
అత్తరు వేర్లేవో
చినుకులకు
సుగంధాన్ని పులుముతాయి.
పిల్లలు తమ బాల్యాన్ని
వానకిచ్చి
వానని
ఆడిస్తూ ఉంటారు.
కాగితపడవలెక్కించి.
వాన జింక పిల్లలై
సెలయేరుల్లో గెంతుంటుంది.
పిల్లలంతా వాన కుందేళ్ళై
వానకి స్వాగతం పలుకుతుంటారు.
యువకుల జ్ఞాపకాల తీగలోంచి
ప్రేమ సందేశాలేవో గుసగుసలాడుతుంటాయి.
అందరికీ
బాల్యాన్ని పంచిపెట్టడానికి
కాసేపలా
వాన పిల్ల వయ్యారంగా
తళుకులీనుతుంది.
కన్నె కాలేజీల తల్లో
తడిసిన జాజిపూల పరిమళం
ఊరంతా గుబాళిస్తుంది.
యువరక్తం మయమరచి
పరిమళాల వెనకే
తేనెటీగల్లా వెంటాడుతూ…
ప్రతి ఇంటా
వాన కాలక్షేపమై
ఆనందమేదో వెచ్చగా
గొంతులోకి దిగి
కొందరిని
వాన కచేరీకి
సిద్ధం చేస్తుంటుంది.
ఏం మంత్రం వేస్తుందో ఏమో!
ఎడారులు కూడా
పచ్చగా చిగురులెత్తే
విద్యేదో
ఊరంతా
పంచిపోతుంది.
వాన పుట్టినరోజులు
సెలబ్రేట్ చేస్తూ
ఉరుములు, మెరుపులు,
పిడుగుల కోలాహలం
ఒక దీపావళిని మోసుకొస్తుంది.
వాన రాయని
ప్రేమ కావ్యం ఏదైనా
ఉందా?!
పల్లెలన్నీ
మట్టి మనుషుల
మహాకావ్యాల్ని
సందడి సందడిగా ఆలపిస్తాయి.
దుక్కి దున్ని
పాపిట దిద్దిన నే
రైతు నాటిన
ఆకుపచ్చని కలలు
కళాత్మక సౌందర్యంతో
మొలకెత్తుతాయి.
అమ్మలాంటి
ప్రకృతికి మించిన
మహా సౌందర్యం ఏముందీ విశ్వంలో

