నాల్కలకు
పాదాలు మొలిచిన
తోడేలు యుగం
దేహమంతా
పొడుచుకొచ్చిన అంగాలతో
కామగాములు
భయమూ బెంగ
ఆజన్మం ఆమె ఆభూషణాలేనా
ఊపిరిచెట్టు ఉనికి
జూదరి చప్పరించి
ఊసిన చేదుబిళ్ళ
ఉగ్ర కాళీ రూపం
గోడమీద పటంలా
గాలికి రెపరెపలాడుతూ
కొవ్వొత్తులు, కన్నీళ్లు
తూటాలు, సమ్మెలు
కొద్దిరోజులే
చిన్నితల్లి ప్రశ్నలకు
కంచె కట్టే జవాబుల్లేవు
అభద్రకాలంలో.