మరో బాల్యం

Spread the love

రైలు ముందుకు పోతోంది..

          కంపార్ట్మెంట్ లోకి గాలి జోరుగానే వస్తోంది. బహుశా నేను డోర్ కి దరిగా ఉండడంచే అలా తోస్తోందేమో.

          నా సీట్.. డోర్ నుండి రెండో వరసన ఉన్న సింగిల్ సీట్. కిటికీ అద్దం దించుకున్నాను. చలి కాలం. చేతులు రెండూ రబ్ చేసుకుంటూ ఉన్నాను.

          డోర్ కి.. టాయిలెట్ వే కి మధ్యస్థన ఒకామె కూర్చొని ఉంది. తన ఒడిన ఓ బిడ్డ ఉంది. బిడ్డ చలి గాలికి వణుకుతూంటే.. ఆమె తన తల చుట్టూ చీర పైటను చుట్టుకునే పనిలో ఉంది.

          “అక్కడ పడి ఉండే కంటె లోనికి పోవచ్చుగా.” ఎవరో చెప్పుతున్నాడు గట్టిగానే. అటు చూశాను.

          నా సీటుకు సమాంతరంగా పక్క లాంగ్ సీటున.. నా వైపున ఉన్న ఆయన చెప్పుతున్నాడు ఆమెను చూస్తూ.

          ఆమె వినిపించుకున్నట్టు లేదు. నా దృష్టి ఆమె నుండి ఆయన వైపు తిరిగి షిఫ్టయ్యింది.

          ఆమె నుండి ఆయన చూపు మార్చుకున్నాడు. తల దించుకున్నాడు. ఆయన ఎందుకో ఇబ్బంది పడుతున్నాడు. గుర్తించాను.

          ఆయన వైపు తల తిప్పి ఉంచడం సరిగ్గా వీలు కావడం లేదు. కిటికీ వైపుకి వీపు తిప్పి ఆయన వైపు పూర్తిగా తిరిగి పోయాను నా సీట్లో.

          ఆయన ఏదో అవస్థన ఉన్నాడు. ఆమెనే చూస్తున్నాడు. వెంటనే తల దించుకుంటున్నాడు. ఆయన చేష్టలు నాకు చిత్రంగా అనిపిస్తున్నాయి. ఆయన అంతలోనే జేబులోంచి రుమాలు తీసుకున్నాడు. కళ్లద్దాలు తీసాడు. కళ్లు ఒత్తుకుంటున్నాడు.

          నేను రవ్వంత విస్మయంలో పడ్డాను. ఏమిటీయన..  మరీ జావకారిపోతున్నాడు..

          ఉండబట్టక ఆయన్ని.. “ఏమిటి మీ హైరానా” అడిగాను ఆయన వైపుకు ఒంగి.

          ఆయన చెప్పలేదు. నన్ను మాత్రం చూసాడు. నా చొరవకి ఆయన చిరాకు పడ్డట్టుంది. ముఖం చిట్లించాడు.

          ఐనా నేను తిరిగి అడిగాను. ఆయన నన్ను ఎగాదిగా చూసాడు. నేను పట్టించుకోలేదు.

          “ఆమె మిమ్మల్ని ఇబ్బంది పరుస్తోందా.” టక్కున అడిగేసాను.

          ఆయన నన్ను సర్రున చూసాడు.

          “మరె. చూసారా.. ఆమె నక్కడి నుండి లోనికి పొమ్మంటే పట్టించుకోదే.” ఆయన మాట్లాడేడు.

          ఆయన అసహనం తెలుస్తోంది..

          ఆమె దేబిరించు వాలకం అసహ్యపరుస్తోందనా.. ఆమెను ఆయన ఆడ నుండి పొమ్మంటుంది..

          “మీ మాట ఆమెకు వినబడిందో లేక లేదో. లేదా మన భాష ఆమెకు తెలియదో. చూస్తే తెలుస్తోందిగా ఆమె యాచకురాలులా ఉంది. సరైన వాలకం.. వాటం ఎలా ఉంటాయి.” సర్దబోయాను.

          “పాపం.. చూస్తున్నారా.. చలి గాలికి ఆ పసి బిడ్డని ఎలా అవస్థ పరుస్తోందో.” నొచ్చుకుంటున్నాడు ఆయన.

          నేను ఉలిక్కి పడ్డాను. ఏమిటీ ఈయన అస్తవ్యస్తంకి కారణం.. ఇదా..

          ఆమె వైపు చూసాను. ఆమె ఒడిలోని బిడ్డని వదిలేసి అటు ఇటు చూస్తోంది.

          ఆయన్ని చూసాను. ఆయన ఇంకా ఇందాకటి స్థితినే ఉన్నాడు.

          నేను లేచాను. ఆమె దరికి వెళ్లాను. ముడుకులు మీద అర చేతులతో ఒంగి.. “చలిలో బిడ్డని ఇబ్బంది పర్చే బదులు.. లోనికి పోకూడదూ.” చెప్పాను.

          అంతే.. ఆమె గతుక్కుమన్నట్టు నన్ను చూస్తోంది. బెదిరిపోతూ వెనుక్కు జరుగుతోంది.

          సరిగ్గా నిల్చున్నాను. మళ్లీ చెప్పాను. ఆమె వినిపించుకోలేదు. సీట్లోకి వచ్చేసాను.

          “మనం చెప్పేది ఆమె పట్టించుకోవడం లేదు. బహుశా భాష తెలియకేమో.” ఆయనతో చెప్పాను.

          ఆయన ఏమీ అనలేదు.

          “ఆమె ఊసు వదిలేయండి.” అప్పుడే చెప్పాను.

          “మనమే చలి గాలికి ముడుచుకు పోతున్నాం. చంటి బిడ్డ.. ఉండయ్యిపోదూ.” అన్నాడు ఆయన.

          “సర్లేండి.. ఏం చేయగలం.” అనేసాను.

          “ఆ పైయోడ్ని ఆడిపోయాలి. కావాలన్నోళ్లకి బిడ్డ నివ్వడు.” యథాలాపముగా చెప్పాడు.

          ఆయనలో ఏదో గోప్యత చిక్కగా ఉంది. దానిని లాగాలి.

          “ఏం జరిగిందండీ.” అడిగాను.

          ఆయన నన్ను చూస్తాడు.

          “దేనైనా అణగదొక్కితే మరింత ఇబ్బంది పరుస్తోంది. ఏదో బాధన మీరు ఉన్నారు. నిజం. ఆమె బిడ్డని చూసి మీరు మరింత హైరాన పడుతున్నారు. తెలుస్తోంది.  దయచేసి నా మాట కొట్టేయకండి. ఏంటో చెప్పండి. మీరు కుదురవ్వొచ్చు.” అనునయంగా అడుగుతున్నాను.

          ఆయన మెల్లిగా స్థిమిత పడ్డాడు. తేలిక పడ్డాను.

          “నేను ఒంటరి సంతానంని. బాగా చదివింప బడ్డాను. మంచి ఉద్యోగం పొందాను. అట్టహాసంగా పెళ్లైంది. మంచి ఇల్లాలు లభించింది. తను గర్భవతైంది. పురిటిలోపే బిడ్డ పోయింది. తర్వాత మరో బిడ్డని కనలేక పోయింది.” ఆయన గొంతు బొంగురయ్యిపోతోంది.

          నేను బేగ్ నుండి వాటర్ బాటిల్ తీసాను. మూత తీసి ఆయనకి ఇచ్చాను.

          “నీళ్లు తాగండి.” చెప్పాను.

          ఆయన నీళ్లు తాగి తిరిగి బాటిల్ ఇచ్చాడు. నేను మూత పెట్టి బాటిల్ ని తిరిగి బేగ్ లో సర్దాను.

          ఆయన్ని చూసాను. ఆయన రుమాలుతో కళ్లు తుడుచుకున్నాడు. కళ్లద్దాలు పెట్టుకున్నాడు.

          నేను ఏమీ అడగడం లేదు.

          “బిడ్డ ప్రాప్తి లేదు. నా ఇల్లాలు కన లేదు. బిడ్డకై మరో పెళ్లి వద్దన్నాను.” ఆయన చెప్పుతున్నాడు.

          నేను వింటున్నాను.  

          “నా తల్లిదండ్రులు పోయారు. నా ఇల్లాలు పోయింది. నేను ఒంటరయ్యాను. బతుకీడుస్తున్నాను. నాకు బిడ్డలంటే ప్రీతి. నేను ఒక దురదృష్టవంతుడ్ని.” చెప్పడం ఆపేసాడు ఆయన.

          ఆయన్నే చూస్తున్నాను.

          ఆ వెంబడే..

          “బిడ్డతో మరో బాల్యం పొసగించుకోవచ్చట. అయ్యో.. నాకా అదృష్టం లేదు.. నేనొక దౌర్భాగ్యుడును..”  అన్నాడు. రుమాలు అడ్డు పెట్టుకొని సడన్ గా ఏడ్చేస్తున్నాడు.

          నాకు జాలేస్తోంది. లేచాను. ఆయన వైపుకు కదులుతున్నాను.

          అంతలోనే..

          మా మాటలు పట్టించుకోని ఆమె.. అక్కడికి గమ్మున వచ్చేసింది.

          ఆయన సొదలో ఆమెని అంత వరకు తిరిగి పట్టించుకొనే లేదు.

          ఆయన ఒడిలో.. బిడ్డని పెట్టేసి.. “మీ మాటలు తెలిసాయి. నేను పాపిష్ఠి దాన్ని. నా ముష్టి కోసం ఈ బిడ్డని ఎత్తుకు వచ్చిందాన్ని. నా కంటే మీకే బిడ్డ అవసరం ఎక్కువ. ఉంచుకోండి సామి.” చెప్పుతోంది ఆమె. ఆ వెంటనే మెరుపులా పోయింది.

          మేము తేరుకోనే సరికి సమయం పట్టింది.

          అప్పటికే రైలు ఏదో స్టేషన్లో ఆగి ఉంది. నేను డోరు వద్దకు వెళ్లి చూసాను. ఆమె.. దూరాన.. వెను చూడక.. పోతూ.. కనిపిస్తూ.. కను మరుగైపోయింది.

          నేను భారంగా వెనుక్కు వచ్చాను.

          ఆ బిడ్డ గుక్కపడుతోంది.

          “అయ్యా.. ఆమె లేదు. రాదు. అంతా మీ మంచికే. ఈ బిడ్డతో మరో బాల్యం మీరు పొందండి.” నేను ఒత్తిడి పెట్టాడు.

          ఆయన ఆ బిడ్డని తన ఒడిలోంచి తన చేతుల్లోకి తీసుకున్నాడు. 

          ఆ బిడ్డ ఏడుపు ఆగింది.. ఆయన లాలనతో.

          రైలు ముందుకు పోతోంది..

***

బి వి డి ప్రసాదరావు

నేను, బివిడి ప్రసాదరావు, తెలుగు రైటర్ ని, తెలుగు బ్లాగర్ ని, తెలుగు వ్లాగర్ ని. నా పూర్తి పేరు - బత్తుల వెంకట దుర్గా ప్రసాదరావు. నేను పుట్టింది (15.5.1956), పెరిగింది, చదివింది (సామాన్య విద్యతో పాటు సాంకేతిక విద్య) మరియు నేను చేపట్టిన వృత్తి (సాంకేతిక విద్యల శిక్షణ) నిర్వహించింది  - పార్వతీపురం  (ఆంధ్రప్రదేశ్, పార్వతీపురం మన్యం జిల్లా)  లో. నేను ప్రస్తుతం (6.12.2011 నుండి) ఉంటుంది -  హైదరాబాద్ (తెలంగాణ) లో.  ఇదే నా మొదటి  నివాస స్థల  మార్పిడి.   ఇది  అవసరంతో ముడిపడిన ఒక కొత్త అనుభూతి.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *