ఆల్డస్ హక్సిలీ గాని, మరో మేధావిగాని జె.కె.ని గురించి చెప్పిన మాటలను మీ దృష్టికి తెచ్చి, మిమ్మల్ని జె.కె. అధ్యయానికి ఉద్యుక్తుల్ని చేయడం నా అభిమతం కాదు. మీకు జె.కె. తో ఏర్పడవలసిన అనుబంధం ఎలాంటిదో మీరే నేరుగా గ్రహించడం సముచితం. అందుచేత ఈ సంక్షిప్త పరిచయాన్ని జె.కె. మాటల్లోనే మీకందిస్తున్నాను.
ఆనందంగా జీవించడానికి అవసరమైన అవగాహనని జె.కె. అధ్యయనం ద్వారా పొందవచ్చునని జె.కె.ని అర్ధం చేసుకున్న వాళ్ళు చెబుతున్నారు.
మనిషిలో సమూలపరివర్తన రానిదే ఉత్తమ సమాజ ఆవిష్కరణ అసంభవం అంటున్నారు జె.కె. ఈ పరివర్తనకు చేతన ఎలా అవరోధ మవుతున్నదో వివరిస్తారు. అశాంతి, ఘర్షణ, దుఃఖం తొలగిపోడానికి మనం ఏమి చెయ్యాలో చెబుతూ, అందుకు జ్ఞానం నిరుపయోగం అంటారు. సత్యం అంటే ఏమిటో విశ్లేషించి, అనుభవం సత్యాన్ని అందుకోలేదంటారు. మనజ్ఞానం, మన నిబద్ధత సత్యాన్వేషణకు అవరోధం అంటారు. మన జీవిత పుస్తకాన్ని చదివే నేర్పు మనలో లేకపోతే వినూత్న చైతన్యం మనలో వెల్లి విరియదంటారు. ప్రేమ ఒక్కటే సృజనాత్మకమైన నిరంతర విప్లవాన్ని మనకు అందించగలదంటారు. ఎన్నో విధాల మానవుడి ఉజ్వల భవిష్యత్తుకు తాత్విక పునాదులు నిర్మించారు జె.కె.
మనల్ని విచిత్రమైన మనుషులుగా జె.కె. వర్ణిస్తున్నారు. ఏదో ఏదేదో కావాలని, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో వెదుకుతాం. అది మన దగ్గరే ఉందని గ్రహించం. కొండల్లో కోనల్లో సౌందర్యం కోసం అన్వేషిస్తాం, చుట్టపట్ల కొలువైన అందం కంటపడదు. సత్యాన్ని వెదుక్కుంటూ దిగంతాలకు ప్రయాణిస్తాం, సత్యం మన మధ్య దాగిందన్న స్పృహ ఉండదు. దేన్నో, దేన్నో అందుకోవాలని ఆకాంక్షిస్తాం. మన అంతరంగంలోని నిజాన్ని చూడలేని అంధులం.
యుగ యుగాలుగా మనలో ఘనీభవించిన అజ్ఞానాన్ని దూరం చేసుకోకుండ, మన చైతన్యాన్ని పునర్మించుకోకుండ, చుట్టముట్టిన భ్రాంతుల్నీ, తీరని ఆకాంక్షల్ని, అంతులేని అన్వేషణల్ని దూరం చేసుకోకుండా బ్రతికేస్తున్నాం. మనకు ఎంత వరకు జె.కె. సహాయపడగలరో చూద్దాం. కొన్ని ముఖ్యమైన తాత్విక విషయాలను ఆయన ఎలా పరిశీలించారో అర్ధం చేసుకుందాం.
నిబద్ధత
మనం నిర్మించుక్ను విలువలకీ, భావాలకీ, విశ్వాసాలకీ మనం బానిసలం అయిపోయాం. వాటికి నిబద్ధులం అయిపోయి ఉన్నాం. వీటి చట్రంలో యిరుక్కున్న మనం వీటికి అతీతంగా ఆలోచించలేకపోతున్నాం. మన మనస్సు అంగీకరించదు, కొత్త విషయాలను స్వీకరించడానికి, వ్యక్తికీ వ్యక్తికీ మధ్య సంఘర్షణలు నిబద్ధత మూలంగానే సంభవిస్తున్నాయి. అయినా నిబద్ధతను గురించి మనం పట్టించుకోము. దాని స్వరూప స్వభావాలు మనకు తెలియవు. మనకు తెలిసిందంతా నిబద్ధత కల్పించిన ఘర్షణలు, దుఃఖం, బాధ. మనం మనలోని నిబద్ధతను పరిశీలించలేకపోతున్నందువల్ల అనర్థాలు అలాగే కొనసాగుతున్నాయి.
నిబద్ధతని మానవ సహజమైన లక్షణంగా మనం భావిస్తున్నాం. దాన్ని అర్ధం చేసుకోవాలన్న స్పృహ మనకు కలగడం లేదు. నిజమేమిటంటే, మనలో ఉన్న శూన్యతని మనం భరించలేక దాన్నుండి పారిపోవాలనుకుంటాం. రాజకీయాలు, మతాలు, దేశభక్తి – వీటిని ఆశ్రయిస్తాము. తమతమ పనుల్లో నిమగ్నమైపోయి కొందరూ, భక్తి డ్రగ్స్, సెక్స్లో మరికొందరూ, ధార్మిక కర్మకాండల ద్వారా ఇంకొందరూ శూన్యతను తప్పించుకోజూస్తారు. ఇలా తమ తమ శూన్యతని మరిచిపోవాలని ప్రయత్నిస్తాము గాని మన నిబద్ధతని పరిశీలనకు లోనుచెయ్యం.
ఎంతటి జ్ఞానికైనా, సత్యాన్ని గ్రహించడంలో నిబద్ధత అవరోధం అవుతున్నది. ఆలోచనల నుండి విముక్తి కలిగి మనస్సు పూర్తిగా నిశ్చలమైనప్పుడే నిబద్ధత నుండి మనిషికి స్వేచ్ఛలభిస్తుంది అంటారు జె.కె.
తమ తమ నిబద్ధతలలో చిక్కుకున్నవాళ్ళే జె.కె. ప్రతిపాదించిన నవ్యతని స్వీకరించలేకపోతున్నారు. జె.కె. భాష కఠినం అనడానికి, ఆయనది మాటల గారడీ అనడానికీ కూడ వారి వారి నిబద్ధతలే కారణం.
జ్ఞానం
జ్ఞానం రెండు రకాలు. ఒకటి ప్రాపంచిక జ్ఞానం – విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానానికితోడైంది. మన దైనందిన జీవితానికి ఇది అత్యవసరం. ఇది లేకుంటే జీవితమే దుర్లభం. రెండవది మానసికమైన సైకలాజికల్ నాలెడ్జి. ఆలోచనల రూపంలో ఉన్న నమ్మకాలు, కోరికలు, ఆత్మీయతలు, భయాలు, ఆందోళనలు, సుఖాలు, దుఃఖాలుగా అల్లుకొనిపోయి ఉంది. ఈ జ్ఞానమంతా నిశ్చిత అభిప్రాయాలతో, నిర్వచనాలతో, నిర్ణయాలతో కూడుకొని ఉంది. ఈ జ్ఞానం మనల్ని వర్గాలుగా చీల్చి, విభేదాలు, ఘర్షణలు కల్పిస్తున్నది.
జ్ఞానమే మొత్తం జీవితం అనుకొని, తమ జీవితాలను తమ నమ్మకాలకు అంకితం చేసి, తమ మనసుల్లో కట్టుకున్న గోడల మధ్య ఖైదీలుగా ఉండిపోతున్నారు అనేకులు. వీళ్ళు ఏదో ఆదర్శం కోసం (దేవుడు కావచ్చు, ప్రశాంతత కావచ్చు. శ్వాతత్వం కావచ్చు) అన్వేషిస్తుంటారు. ఇది వృధా ప్రయాసగా మిగిలిపోతుందని గ్రహించలేరు. జ్ఞానానికి అలవాటు పడడం తక్కిన దురలవాట్ల వంటిదేనని తెలుసుకోరు.
జ్ఞాన సమ్మోహనం మన మనస్సుల్ని నిబద్ధీకరిస్తున్నది. తమ గొప్పతనాన్ని పెంపొందించుకోడానికి కొందరు జ్ఞానాన్ని ఉపయోగపెట్టుకుంటారు. అంతకంటే దుష్టకార్యం మరొకటి లేదు అంటారు జె.కె.
జ్ఞానం కొందరిలో సంతృప్తిని కలుగజేసి మత్తుమందులాపని చేస్తుంది. అసంతృప్తి జ్వాలలా మనలో ఎప్పుడూ వెలుగుతూ పరిశోధననీ, పరిశీలనా శీలాన్ని ఎల్లప్పుడూ తేజోమయం చేస్తూ ఉండడం జీవితావసరం అని వాళ్లు గ్రహించలేరు. జ్ఞానం యొక్క సమ్మోహనంలో చిక్కుకోవడం మనిషి దౌర్బల్యమైనా, దాన్ని ద్వేషించకుండా, సమర్ధించకుం మౌనంగా గమనించినప్పుడే, అర్ధం చేసుకున్నప్పుడే దాని ప్రభావం నశిస్తుంది. అయితే దీని ప్రభావం పూర్తిగా నశిస్తే మనం మనుషులుగా మిగలమేమోనని చాలా మంది భయం. అందుకు జె.కె. సమాధానం ఇలా ఉంది – అప్పుడు నగ్నంగా మిగిలిపోతాం.కూడ బెట్టినవన్నీ లేకపోతే మనం ఏమీ కాము – జ్ఞాన శూన్యత ఏర్పడుతుంది. అప్పుడు భావవికసనం హృదయానికీ మధ్య అంతరం నశించి, అమాయికత మనల్ని పరిపాలిస్తుంది. దాన్నే బ్లెస్సెడ్ ఇన్నోసెన్స్ అంటారు.అందులో నుంచే ప్రేమ జనిస్తుంది. ఆ ప్రేమ మానవ సంబంధాలను,అత్యుత్తమ స్థాయిలో నిలుపుతుంది. మన సమస్యల కన్నిటికి అదే అంతిమ పరిష్కారం. జ్ఞాన శూన్యతని అనుభవంలోకి తెచ్చుకోవడమే వివేకానికి నాంది. జ్ఞానం ఎప్పుడూ పాతదేనని, అది స్మృతుల ద్వారా గతాన్ని పొడిగిస్తుందే తప్ప, క్షణ క్షణం ప్రత్యక్షమయ్యే జీవిత సమస్యలకు పరిష్కారం చూపలేదంటారు జె.కె. కొత్త విషయాలను పాత మూసలోంచి చూడడం దాని అలవాటు. గతానికి నిబద్ధమై పోయిన మనస్సు కొత్త ఆవిష్కారాలను అడ్డుకునే ప్రమాదమూ ఉంది.
సత్యం
సత్యానికి మార్గంలేదు. సత్యాన్ని సాక్షాత్కరింప జేసుకోవాలి. ఆసాక్షాత్కారానికి ఒక సూత్రం లేదు. సూత్రీకరించినది సత్యం కాదు. సత్యానికి అనేక మార్గాలుంటాయనేది మనస్సు అసహనంతో కనిపెట్టిన విషయం. సత్యాన్ని అవగాహన చేసుకోవడానికి అనుభవం మీద ఆధారపడటం భ్రమల్లో చిక్కుకోవడమే.
సత్యాన్ని అనుభవం పొందటం సాధ్యంకాదు. అది ఉంటుంది అంతే.
అనుభవించేవాడు నిజాన్ని అనుభవం పొందుతున్నానని అనుకుంటే అతనికి తెలిసింది భ్రమ మాత్రమే. నిజం గురించి ఉన్న జ్ఞానమంతా భ్రమే. నిజం ఉండాలంటే జ్ఞానం, అనుభవం అంతం కావాలి. అనుభవం నిజాన్ని చేరుకోలేదు. అనుభవం నిజాన్ని రూపొందిస్తుంది. జ్ఞానం అనుభవాన్ని మలుస్తుంది. నిజం ఉండాలంటే ఆ రెండూ అంతమవ్వాలి.
ఏది అసత్య మార్గమో కనుక్కున్నప్పుడు మనకి తెలిసేది ఒక్కటే – అసలైన మార్గం. అసత్యాన్ని అర్ధం చేసుకోవటమే సత్యాన్ని కనుగొనడం. అసత్యాన్ని అసత్యంగా గ్రహించటం కఠినం. దాన్ని ఆలోచనా ప్రక్రియ ద్వారా అసత్యంగా చూడలేము. ఆలోచన సత్యంకాదు, అసత్యమే. అందుచేత ఆలోచన నుండి విముక్తి కలిగి స్వేచ్ఛగా ఉన్నప్పుడే అసత్యాన్ని అసత్యంగా చూడగలం.
అసత్యాన్ని అనాసక్తంగా, జాగ్రత్తగా గమనించటానికి ఆలోచన అవసరం లేదు. అంతేకాక, ఆలోచన పని చేస్తున్నట్లయితే, అనాసక్తత ఉండటమే కుదరదు.
మనస్సు – దాని వ్యాపకం
మనస్సే వ్యాపకం. దాని వ్యాపకమే దాని బ్రతుకు. మనస్సుకి వ్యాపకం లేనట్లయితే అది బ్రతకడం ఆగిపోతుంది. దేనితో ఒక దానితో (దేవుడితో కావచ్చు / సంపాదనలో కావచ్చు) వ్యాపకం పెట్టుకొని అల్పత్వంతో ఉంటుంది – అంటే వ్యాపకంతోనే తన్ను తాను పోషించుకుంటుంది. వ్యాపకం లేకపోతే తనకు ఉనికే ఉండదన్న భావం వల్ల మనస్సు, విశ్రాంతి లేకుండా, ఏదో పనిలో మునిగిపోతుంది.
మన మనస్సు ఎప్పుడు స్థిమితంగా ఉండదు. ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ వ్యాకులతలో ఉండడమే బతుకులక్షణం అనుకుంటారు. విజయం సాధించాలనుకోవడం, వృద్ధిలోకి రావాలనుకోవడం మనిషికి సహజమే అనుకుంటాం. వాటివల్లే ఘర్షణలో చిక్కుకుంటున్నామన్న అవగాహన మనకు లేదు.
సురక్షితంగా ఉండాలన్నది మనస్సుకుండే తాపత్రయం. మనసు కెన్నో అనంతమైన ఆశలు, ఆకాంక్షలు. ఏదో అవ్వాలని, ఏదో చేయాలని ఎప్పుడూ ఆతృత పడుతుంది. భ్రమల భవిష్యత్తులో కాలం గడుపుతుంది. ఏ తాపత్రయమూ, ఆతృతా లేకుండా స్థిమితంగా ఉండడం దానికి తెలియదు. దేశాన్ని రక్షించాలనీ, అధికారం చేజిక్కించుకోవాలని, సమాజంలో గుర్తింపు పొందాలనీ దాని తపన. అవిశ్రాంతంగా రక రకాల పనులు చేయడంలోనే ఆనందం పొందుతుంది. తన వ్యాపకతకు దేశం, శాంతి, ఆదర్శం, దైవం అనే ముసుగులు తొడుగుతుంది. మనం పనిలో ఆనందాన్ని వెదుక్కునే బదులు, ఆనందంగా ఉండి పని చెయ్యడానికి అవకాశం లేదనుకుంటాం. అది మన భ్రమ.
ఏదో ఒక సమస్యతో సమమతమవుతూ ఉండడమే జీవితం అనుకుంటాం. సమస్యలు లేని జీవితాన్ని ఊహించలేము. నిత్య సమస్యలతో కుంగిపోయే మనస్సు సున్నితత్వాన్ని కోల్పోయి, మొద్దుబారి పోతుంది.
స్థిమితం లేని మనస్సు, ఎంత గొప్పదైనప్పటికీ, అవగాహననీ, ఆనందాన్ని నాశనం చేస్తుంది. వ్యాపకం మరణించటంతో నిశ్శబ్దం ఆరంభమవుతుంది. పరిపూర్ణమైన నిశ్శబ్దమే మనస్సుకు స్థిమితత్వాన్ని కలిగిస్తుంది.
నేను
మనం అనామకంగా ఉండాలంటే సిగ్గుపడతాం, భయపడతాం. అందుకనే గుర్తింపు పొందాలన్న తాపత్రయం. పేరునీ, పదవినీ, ఆస్తినీ, డాబూ దర్పాన్నీ పట్టుకుని వ్రేలాడతాం. మన కార్యకలాపాలన్నీ ఆగిపోతే, మన జీవితానికి అర్ధం ఉండదనీ, అటువంటి జీవితం నిస్సారమనీ భావిస్తాం. అందుకని ఘర్షణలో, ప్రతి కూలతలోనయినా సరే, ముందుకు సాగుతాం.
“నేను” ఎన్నటికీ అనామికగా ఉండదు. అనామికగా ఉండడం అంటే నగ్నంగా శూన్యంగా అయిపోవడమే. “నేను” ఆ స్థితిని తట్టుకోలేదు, కొత్త వేషాలు వేస్తుంది. అలా కాకుండా, ఆ శూన్యతని నేరుగా మనం ఎదుర్కొగలిగితే, బాధాకరమైన ఒంటరితనంతో ఉండగలిగినట్లయితే, భయమనేది మాయమవుతుంది. ఒక సమూలమయిన పరివర్తన సంభవిస్తుంది. ఇది సంభవించటానికి ఆ శూన్యత అనుభవంలోకి రావాలి.
మన అనుభూతులే మనం. అవి లేకుంటే మనం లేము. కాని వీటితోనే విభేదం, వీటితోనే ఘర్షణ, అనుభూతులెప్పుడూ పరస్పరం పోరాడుకుంటూనే ఉంటాయి. ఈ వాస్తవాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోగలగినప్పుడు, మన మనస్సు, దాని స్మృతి, అనుభూతి ప్రశాంతంగా అయిపోతాయి. మనస్సు నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడే, “నేను” “నా” అనే స్పృహ లేకుండా ప్రేమతో జీవించగలం.
ప్రేమ
జీవితమంటే మానవ సంబంధాలు – కార్యాచరణ అని జె.కె. నిర్వచిస్తున్నారు. To be is to be related – జీవించి ఉండడం అంటే మానవ సంబంధాలతో ఉండడమే.
ప్రేమ లేని సంబంధబాంధవ్యాలు నిస్సారమైనవి. మనం ప్రేమించటంతోనే ఊరుకోము. మనం కూడ ప్రేమించబడాలని ప్రాకులాడుతాం. మనం యిచ్చేది తీసుకోవడం కోసమే అయితే అది ప్రేమ కాదు గదా.
బంధనం ప్రేమని నిలవనివ్వదు. బాధపడటంలో ప్రేమ దొరకదు. అసూయ ప్రేమని బంధించి ఉంచలేదు. అనుభూతీ, తృప్తి ఎప్పుడూ అంతమైపోతూనే ఉంటాయి. కాని ప్రేమ అనంతమైనది.
జాలి, సహనం, దయ, సేవ, సరళ భాషణ, మృదు ప్రవర్తన – వీటిలో ఏదీ ప్రేమ కాదు. మనస్సునీ, హృదయాన్నీ, ప్రక్షాళనం చేసి, అన్నిటినీ కొత్తవిగా చేయగల జ్వాలే ప్రేమ. ఆజ్వాల మనసులోంచి వచ్చేది కాదు. మనం అలవరుచుకునేదికాదు. మన హృదయాన్ని శూన్యంగా ఉండనివ్వడమే మనం చేయగలిగింది. ఎప్పటికైనా అది నిండవచ్చునేమో.
పొగలేని జ్వాల ప్రేమ, ప్రేమ జ్వాల లేకుండ జీవితానికి అర్థంలేదు. జ్వాల స్పష్టంగా ఉండాలంటే పొగ ఆగిపోవాలి. జ్వాలకు సాటి మరొకటి లేదు.
ఆలోచన ఉన్నప్పుడు ప్రేమకు తావులేదు. ప్రేమను పెంపొందించుకోవాలనే కోరిక కూడ ఆలోచనా ప్రక్రియే. ఆలోచనా ప్రక్రియ ఆగిపోయినప్పుడే ప్రేమ ఉండటానికి సాధ్యమవుతుంది. ప్రేమకు నిర్వచనం కూడ ఆలోచించే చెప్పాలి. అందుచేత ఆ నిర్వచనం కూడా ప్రేమ కాదు. ప్రేమవరం కనుక పొందినట్లయితే నేనెలాంటి వాడినైనా నన్ను మీరు ప్రేమించకమానరు. మనిషిని మనిషిగా చూడకుండా, మనిషిని సాధనంగా గుర్తిస్తున్నంతకాలం దోపిడీ ఆగదు. అసమానత్వం తొలిగిపోదు. రాజకీయాలు, సిద్ధాంతాలు సమానత్వాన్ని తీసుకురావు. ప్రేమ ఒక్కటే సృజనాత్మక నిరంతరం విప్లవం.
జీవిత పుస్తకం
అనాది నుంచి సంపాదించి పెట్టుకున్న సంపూర్ణ జ్ఞానరాశే జీవిత పుస్తకం. ఆదిమకాలం నుండి నేటి దాకా సాగిన మానవ జీవిత చరిత్ర అంతా మనలోనే ఉంది. మన మెదడు ఎన్నో లక్షల సంవత్సరాల ఫలితం. భయాలు, ఆందోళనలు, వైరుద్ధ్యాలు, ఘర్షణలూ అన్నీ అందులో ఘనీభవించి ఉన్నాయి. అవి నేటికీ మనల్ని ప్రభావితం చేస్తున్నాయి.
మనమే మన జీవిత పుస్తకం. అది మన అంతరంగాన్ని చూపే నిలువుటద్దం. దానిలో మనల్ని మనం చూచుకుంటే, మనలో నిగూఢంగా ఉన్న గందరగోళం, అజ్ఞానం మనకే అర్థమవుతాయి. మనం చెప్పేదానికి, ఆలోచించేదానికి, చేసే దానికి పొంతన లేనట్లు తెలిసివస్తుంది.
కాని ఈ పుస్తకాన్ని చదవడానికి నేర్పు ఉండాలి. మనం వాస్తవికాలలో నివసించకుండ, భ్రమల్లో ఉంటున్నామని పుస్తకం చెబుతుంది. మనం ఊహా చిత్రాలను నిర్మించుకొని, వాటి మధ్యే జీవిస్తున్నామని తెలుస్తుంది. మనుషుల్ని మనుషులుగా కాకుండా, కేవలం ప్రతిమలుగా, సంకేతాలుగా చూస్తున్నాం. అందువల్లనే తోటి మానవుతో మన సంబంధాలు, సజావుగా లేవు. వీడు భారతీయుడు, వీడు ముస్లిం, వీడు కమ్యూనిస్ట్ – ఇలాంటి సంకేతాలే మన మధ్య సంబంధాలను నిర్వచిస్తున్నాయి. ఇవన్నీ మనలో అనాదిగా చేరిపోయిన మలినాలు.
ఈ ముసుగులన్నీ తొలగించుకొని, మనల్ని మనం నగ్నంగా చూచుకొనే అవకాశాన్ని పుస్తకం కలిగిస్తున్నది. అప్పుడు మన శరీరం పడే బాధలు, దాని బద్ధకము, జడత్వము తెలిసివచ్చి, మన అస్తవ్యస్త జీవితం మనల్ని వెక్కిరిస్తుంది. “నేను” “నాది” అన్న మాటల్ని పట్టుకొని వదలి పెట్టనందువల్లే స్నేహితులుగా ఉండవలసిన వారి మధ్య అగాధాలు ఏర్పడుతున్నాయని పుస్తకం విశదపరుస్తుంది.
బతుకు పుస్తకంలోని విషయాలను శ్రద్ధగా చదివితే, మన మనస్సులు ప్రశాంతతను సంతరించుకుంటాయి. ఈ ప్రశాంతతే మన జీవితాలను పునర్మిస్తుంది. ఈ మానవ సమాజ సమూలపరివర్తన కొరకు ఈ బతుకు పుస్తకాన్ని అధ్యయనం చెయ్యడం అనివార్యం.
స్వేచ్ఛ
జె.కె. ఇలా అంటున్నారు – “నా ప్రధాన లక్ష్యం ఒకటే – వ్యక్తి స్వేచ్ఛ. అన్ని భయాల నుండి బంధాల నుండి మనిషి విముక్తి సాధించాలి.”
సాంప్రదాయకమైన సిద్ధాంతాలు, విశ్వాసాలు, విలువలపైన ఆధారపడి మనిషి జీవిస్తున్నంతకాలం విభేదాలు, ఘర్షణలు, అశాంతి అనివార్యమవుతున్నాయి. ఈ దుస్థితి నుండి విముక్తి కలిగించేది స్వేచ్ఛ. తరతరాలుగా మనం మోస్తున్న వీటి బరువు భారం తొలగిపోయినప్పుడు, మన శక్తి వృధాకావడం ఆగిపోతుంది. ఆశక్తి, ఆ స్వేచ్ఛ మనకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాయి.
స్వేచ్ఛ యొక్క స్వభావాన్ని, నిర్మాణాన్నీ మనం అవగాహన చేసుకున్నట్లయితే, ప్రతి విషయాన్ని సందేహించి ప్రశ్నించడం మన స్వభావమైపోతుంది. పాత విలువలు, తాపత్రయాలు, కోరికలు, భయాలు దూరమైపోతాయి. భావాలు, అభిప్రాయాలు, నమ్మకాల అరణ్యంలో దారి తప్పకుండా మనల్ని కాపాడేది స్వేచ్ఛ. సత్యాన్ని అవగాహన చేసుకోవడానికి అవసరమైన అంతర్దృష్టిని స్వేచ్ఛ మాత్రమే యివ్వగలదు.
మనస్సు గతం నుండి విముక్తి పొంది శూన్యంగా అయిపోయినప్పుడే స్వేచ్ఛ ప్రవేశిస్తుంది. అంతేగాని, మనం కోరుకుని ప్రయత్న పూర్వకంగా తెచ్చుకునేది కాదు. అతి సహజంగా మనలో చేరిపోయేది. ఉన్నస్థితిని చెప్పే కథని శ్రద్ధగా వింటుంటే, స్వేచ్ఛ తనంతటతాను మనలో ప్రవేశిస్తుంది.
స్వేచ్ఛ పరిపూర్ణ మానసిక స్థితి, పాక్షికమైందికాదు. అది మానవ జీవితానికి అంతిమలక్ష్యం కాదు, స్వేచ్ఛతోనే జీవితం ప్రారంభమైతే సంపూర్ణ పరివర్తన త్వరితంగా కలుగుతుంది. స్వేచ్ఛా శూన్యమైన మానవ సంబంధాలు వ్యాపార బంధనాలుగానే మిగిలిపోతాయి.
మానవ చైతన్యానికి అతీతమైంది స్వేచ్ఛ.
* * *