జయంత్ పర్మార్ ఉర్దూ కవితలు

Spread the love

నీ పేరు 

ప్రతి పూరేకు మీద
నా వేళ్ళతో
నీ పేరు రాస్తాను
పువ్వు వాడిపోతుంది
కానీ నీ పేరు
పరిమళమై
చుట్టూరా వ్యాపిస్తుంది
*****
దారి మలుపు తిరిగిన చోట

ఒక దారి మలుపు తిరుగుతుంది
ఒక వంకర సందు లోకి –
దాని ఎడమ వైపున ఒక పెరిగిన రావి చెట్టు
దాని ఎదురుగా ఒక మామూలు గుడిసె-
రాత్రయినా పగలయినా
ఆ ఇంటి కిటికీ తెరిచే వుంటుంది
ఎప్పుడూ –
కానీ ఆమె ముఖం ఎప్పుడూ కనపడదు
అయినా నా హృదయం
అదే చోటును కోరుకుంటూనే వుంటుంది
*****

శూన్యం

రేడియో , టెలివిజన్ ,ఫ్రిజ్
నాకు అన్నీ వున్నాయి
కానీ నా దగ్గర ఏమీ లేదని
అనిపిస్తున్నది
ఈ సర్వాలంకార గృహంలో
నాకు భయం వేయడం మొదలయింది
నా చుట్టూ శూన్యం కాపలా కాస్తున్నది
ఎవరి భుజం మీద తల వాల్చి
నేను ఋతువుల గాథలను చెప్పగలను
మంచివో చెడ్డవో ;
సగం మరచిన జ్ఞాపకాలను
పంచుకోగలను ?
అట్లాంటి స్వజనం నాకు లేరు
కనుక ఈ రాత్రి ఒంటరి తనంలో
అద్దంలో
నా తలను నా భుజాల మీదే వాల్చి
గంటల కొద్ది విలపిస్తాను
*****

వర్షం
మేఘాల ఉన్నత శిఖరం మీద
రెండు నల్ల ఏనుగులు
భీకరంగా ఘీంకరించాయి
ఆ పిదప అవి తళతళ మెరిసే ఖడ్గాలతో
యుద్ధం చేసాయి
అంతే ! వర్షం కురిసింది !

****
ఆంగ్లానువాదం : నిషాత్ జైదీ
తెలుగు సేత : : దర్భశయనం శ్రీనివాసాచార్య

దర్భశయనం శ్రీనివాసాచార్య

కవి, విమర్శకుడు. అనువాదకుడు, “కవిత్వం “ వార్షిక సంకలనాలకు సంపాదకుడు .1961లో వరంగల్ లో జననం . ఇప్పటివరకు 12 తెలుగు కవితాసంపుటాలు, ఒక ఆంగ్ల కవితాసంపుటి (Scents of the Soil), ఒక విమర్శ గ్రంథం (ఇష్ట వాక్యం ), పిల్లల కోసం “బాలల కోసం బాటసారి పదాలు” అనే సంపుటిని వెలువరించారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *