1.ఒక జాబు
—--------------
ఈ రాజ్యం కుప్పకూలింది.
నదులూ,పర్వతాలే మనగలుగుతాయి.
నగరంలో వసంతం..
మొక్కలూ,చెట్లూ ఏపుగా పెరుగుతాయి.
చూడబోతే ఇలాంటి సమయాల్లో
కుసుమాలూ కన్నీరు కారుస్తాయి.
పక్షులు కూడా
ఎడబాటును ఇష్టపడక
రెక్కలు కొట్టుకుంటూ
మనసులో బెదురుతాయి.
మూడు నెలలుగా
యుద్ధ సూచిత జ్వాలలు
రేగుతూనే వున్నాయి.
ఇంటి నుండి
ఒక జాబు వస్తే
ఇక అదృష్టం వరించినట్టే..!
2.శ్వేతాశ్వం
—---------
ఈశాన్యం నుంచి
దౌడు తీసుకొచ్చింది
ఓ శ్వేతాశ్వం.
కాలి జీనుకి
గుచ్చుకొని రెండు బాణాలు..
పాపం..రౌతు !
అతని కథ ఎవరు చెపుతారు..?
అర్థరాత్రి వేళ
అతని దళాధిపతి
ఎలా పోరాడాడో..ఎలా గాయపడ్డాడో..
ఎలా మరణించాడో..
ఈ యుద్దం వల్ల
ఎంతోమంది అమరులయ్యారు.
నా కన్నీళ్ళు ఆగడం లేదు..
నేను విలపిస్తూ వున్నాను.
3.వెన్నెల రాత్రి
—------------
ఈ రాత్రి
ఈ వెన్నెలలోనే
ఇంటి కిటికీ దగ్గర
నా భార్య ఒంటరిగా వుంది.
నా పిల్లల గురించిన ఆలోచన
తట్టుకోలేక పోతున్నాను.
ఇంటికి నేనెందుకు రాలేకపోతున్నానో
అర్థం చేసుకోలేని పసిప్రాయం వారిది.
ఈ పొగమంచులో
ఆమె కురులు తడిబారి వుంటాయి.
ఈ జాబిలి వెలుగులో
ఆమె చేతులు వడలిపోయి వుంటాయి.
తెరలు తొలిగి మేమిద్దరం
ఒక దగ్గరయినప్పుడు
మా ముఖాల మీద
కారే కన్నీటి చారికల్ని
ఈ వెన్నెల మాపగలదా..?
