గురజాడ స్మారక భవనం స్థితిగతులు

Spread the love

నేను గురజాడ ఇందిరను. గురజాడ మునిమనవడు గురజాడ వెంకటేశ్వర ప్రసాద్ గారి అర్ధాంగిని. మహాకవి గురజాడగారి బాల్యం, విద్యాభ్యాసం, సంస్థాన, సాహిత్య జీవితం గురించి లోకానికి చాలవరకు తెలుసు. ఆ మహాకవి వారసురాలిగా నేను సాహితీ ప్రియులకు, సమాజానికి మరికొంత సమాచారాన్ని తెలియజేయాల్సిన ఆవశ్యకత వుంది.

            మహాకవికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు. పెద్ద కుమార్తె పేరు లక్ష్మీనరసమ్మ, ఈమెను ఓలేటి వంశం వారికి ఇచ్చి వివాహం చేసారు. రెండవ కుమార్తె అప్పలకొండమాంబ (రాణి అప్పల కొండమాంబ మీద ఉన్న గౌరవం కొద్దీ ఆమె పేరు పెట్టుకున్నారు) ఈమెను పులిగెడ్డ వంశం వారికి ఇచ్చి వివాహం చేసారు. కుమారుడు రామదాసుకు అప్పారావుగారు తన తండ్రి రామదాసు పేరు పెట్టుకున్నారు. రామదాసు గారికి, శ్రీపతి వారి ఇంటి ఆడపడుచు అయిన మాణిక్యమ్మను ఇచ్చి వివాహం చేసారు. రామదాసుగారి కుమారుడు గురజాడ వెంకట అప్పారావు, వారి కుమారుడు గురజాడ వెంకటేశ్వరప్రసాద్. మా నాన్నగారు బుద్ధవరపు సత్యనారాయణమూర్తి మహాకవికి వీరాభిమాని, భక్తుడు. నాన్నగారు పట్టుబట్టి నాకు వెంకటేశ్వర ప్రసాద్ గారితో వివాహం జరిపించి నన్ను గురజాడ కుటుంబంలో చేర్చారు. గురజాడ ఇంటిపేరు నన్ను అదృష్టంగా వరించింది.

            అప్పారావు గారి తమ్ముడు శ్యామలరావు అప్పారావుని మించిన తెలివి తేటలు కలవాడు. వీరు కూడా వ్యాసాలు పద్యాలు రాసేవారు. కానీ చిన్నతనంలోనే జలఉదరం అనే వ్యాధితో చనిపోయాడు. ఇది అప్పారావు గారిని బాగా కలచివేసింది. కారణం తమ్ముడితో అనేక విషయాలు చర్చించే వారు. వారితో కాంగ్రెస్ మహాసభలకు కూడా వెళ్ళేవారు. తమ్ముని మరణం, ఆనంద గజపతి మరణం వారి జీవితంలో అత్యంత విషాదకరమైన  సంఘటనలుగా ఆయన తన డైరీలలో రాసుకున్నారు.

            ఆనందగజపతి వారి సంస్థానంలో ఉద్యోగం గురజాడ వారి జీవితంలో ఓ మలుపు. ఆనందగజపతి రాజావారు బహు సుందరులు. ఆయనను “ప్రిన్స్ అఫ్ చార్మింగ్” అనేవారు. ఇంగ్లీషు, పార్సీ, ఉర్దూ మరియు సంస్కృత భాషలలో పండితులుగా పేరు గాంచారు. సంగీతంలోను, నాటకాలలోను అభిరుచి కలవారు. అందుచే వారి కొలువులో విశ్వ విఖ్యాతి పొందిన కవి పండితులు కొలువై ఉండేవారు. మహామహులతో నిండిన సభలలో గురజాడ వారు కూడా ఉండటం ఒక విశేషం. వీరి గోష్టులు చర్చలు అప్పారావు గారి ఆలోచనలను పదును పెట్టాయి. తరువాత వారు చేసిన సాహిత్యకృషికి ఇవి కొంత వరకు ఉపయోగపడ్డాయి. అనందగజపతిరాజావారితో పరిచయం స్నేహంగా మారింది.

            1897లో రాజావారి మరణం తర్వాత విజయనగరం సంస్థానం వారికి ఎదురైన పెద్ద దావాలో అప్పారావు రాజకుటుంబానికి విజయం చేకూర్చడానికి ఒక పుష్కర కాలము కోర్టు వ్యవహారములపై పనిచేయడం, గురజాడ వారి ప్రభుభక్తికి నిదర్శనంగా చెప్పవచ్చునేగానీ సాహిత్యంపై దృష్టి పెట్టలేక తెలుగు జాతికి జరిగిన అపారనష్టంగానే చెప్పాలి.

            ఒకసారి అప్పారావు గారి తెలివితేటలు గురించి రేవారాణిగారు తన దివాను గారితో ఇలా చెప్పారు. “మీరు అప్పారావు వచ్చినప్పుడు ఏమి రాసినా, దూరంగా ఉండి కూడా మీ చేతి వ్రాత వంపులను బట్టి  మీరు  ఏమి రాసినదీ అప్పారావు గ్రహించగలడు” అని చెప్పారట. అప్పారావుగారు ఎంత సూక్ష్మదృష్టి కలవారో రాణిగారి మాటల్లో మనకు తెలుస్తుంది.

            జీవితకాలం సంస్థానంలో పనిచేసిన అప్పారావుగారికి సొంత ఇల్లు కూడా లేదు. విజయనగరంలో దాసన్నపేట ప్రాంతంలో మొదట ఉండేవారు. అది ఒక చిన్న పెంకుటిల్లు. అక్కడున్నప్పుడే వారికి పెద్ద కూతురు లక్ష్మినరసమ్మ పుట్టింది. కూతురు పడుకున్న మంచం మీద పెంకులు రాలి పడ్డాయని ఇల్లు నివాస యోగ్యంగా లేదని అప్పలనరసమ్మ చెప్పగా గురజాడ వారు ఆవిషయాన్ని రాణివారికి తెలియజేసారు. అప్పుడు రాజావారు కోటకు దగ్గరగా ఉన్న పన్నులు వసూలుచేసే ఇంటిని ఖాళీ చేయించి అప్పారావుగారిని అందులో నివాసం ఉండమని చెప్పారు. అద్దె లేకుండా ఉంటే ఇంట్లో ఉన్నవారికి ఇంటి మీద హక్కులు ఏర్పడతాయని సంస్థానంవారు భావించి నెలకు ఐదు రూపాయలు అద్దె వసూలు చేసేవారు. ఆ విధంగా అప్పారావు గారు నేటి స్మారకభవనం లోకి వచ్చారు. ఇల్లు చాలా పురాతనమైనది. సౌకర్యాలు తక్కువ. మేడ మీద రెండు గదులు, క్రింద ఒక వంటగది, రెండు చిన్న గదులు మరియు ఒక ధాన్యపుకొట్టు గది ఉన్నాయి.

            కాగా విజయరామగజపతి రాజావారి వివాహ విషయంలో అప్పారావుగారు ముఖ్య పాత్ర వహించారు. కాశి రాజావారి కుమార్తె రాణి లలితకుమారితో విజయరామగజపతికి వివాహం చేసారు. రాణి లలితకుమారిగారు అప్పారావుగారి పట్ల అభిమానంతో ఉండటానికి ఇది ఒక కారణం. రివాసర్కారుగా పేరుగాంచిన అప్పలకొండమాంబ అప్పారావు గారిని పంపించి కాశిలో విజయనగరం ఘాట్ను ఒకటి కట్టించారు. దీనికి ప్రతిఫలంగా అప్పారావు గారికి అతను ఉంటున్న ఇంటిని ఇచ్చివేస్తానని చెప్పారు కానీ, అది వారి కాలంలో జరగలేదు. తరువాత ఆవిషయాన్ని తెలుసుకున్న రాణి లలితకుమారి తప్పక ఆ ఇంటిని అప్పారావు గారికి ఇస్తానని చెప్పారు. వీరు రాణిగారిని ఎప్పుడూ ఇల్లు ఇస్తారా అని అడగలేదు, అది వారికీ రాణిగారికి ఉన్న అనుబబంధం. కాశిలో కట్టించిన ఘాట్కి ప్రతిఫలంగా మరియు దావా విషయంలో చేస్తున్న కృషికి గాను అప్పారావు గారికీ కొంత డబ్బు ఇస్తున్నట్లు దివాన్ సూపరింటెండెంట్ చెప్పారు. ఇవ్వబోయే ప్రతిఫలంలో కొంత మినహాయించుకొని ఇంటిని ఇమ్మని, ముందుగా ఇంటి మరమత్తులకు కొంత డబ్బు ఇవ్వవలసినదిగా రాణీ వారికి అర్జీని పెట్టుకున్నారు అప్పారావుగారు. అప్పటికే విజయనగర సంస్థానం కలెక్టర్ల పాలనలోకి వచ్చింది, ఏ పని కావాలన్నా రాజు లేదా రాణి గారి సిఫారసు కావాలి. వెంటనే రాణి గారు కూడా అంగీకరించారు. నివాసయోగ్యంగా మార్చుకొన్నారు. అప్పారావు గారు తాను కొనుక్కున్న ఆ విధంగా రూ2,500/కు ఇప్పుడు ఉన్న స్మారక భవనం కొనుక్కుని __చదువుకోవడానికి కట్టుకున్న క్రొత్త ఇంటికి “లలిత్” అని పేరు పెట్టారు. ఇంటి ప్రక్కన ఖాళీ స్థలంలో తన పుస్తకాలను భద్రపరచుకోవడానికి, చాలాకాలం అది లలిత్ బిల్డింగ్స్ గా ఉండేది. మొన్నటి వరకు గురజాడ  వంశీయులు అక్కడే ఉండేవారు.

            మా మామగారైన గురజాడ అప్పారావుగారు (గురజాడ మనవడి పేరు కూడా గురజాడ అప్పారావే) ఎప్పుడూ ఒక విషయం చెప్పేవారు. గురజాడవారికి విజయనగరం ఆర్ధిక వ్యవహారాలు అన్నీ తెలుసు. రాణివారికి కూడా అప్పారావుగారి మాట మీద గురి ఎక్కువ. పెద్ద దావాలో అప్పారావుగారి ప్రమేయం ఉన్నంత వరకూ తమకు కష్టమని ఎదుటి పక్షం వారు తలచి ఒకనాడు రాత్రి అప్పారావుగారి ఇంటికి వెళ్లి ఇవిగో నలభైవేల రూపాయలు అని ఇచ్చి, ఈ దావా విషయంలో తటస్థంగా ఉండమని కోరినారట. దానికి వారు “అయ్యా! అజీర్తి వ్యాధితో బాధపడే నాకు పిడికెడు బియ్యం కూడా అరగదు. అటువంటిది ఇంత డబ్బు ఎలా అరుగుతుంది, దయచేసి వెళ్ళిపొమ్మని చెప్పినారట. ఇది సంస్థానంపై వారికి గల విశ్వాసం మరియు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. మరి సంస్థానం వారు వీరి విశ్వాసాన్ని గ్రహించారో గుర్తించారో లేదా మరిచారో!!

            ఇప్పుడు ఏదైతే మనం గురజాడ స్మారకభవనం అంటున్నామో ఇక్కడ కొన్ని విషయాలు చెప్పక తప్పదు. స్వర్గీయ ఎన్.టి. రామారావుగారు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు వారికున్న సాహిత్యాభిమానం కొద్దీ ఈ మహాను __భావుడి ఇంటిని ప్రభుత్వంవారు స్వాధీనం చేసుకొని వాటిని భావితరాల వారికి స్పూర్తిదాయకంగా తీర్చిదిద్దాలని ఆశించారు. ఆశయం మంచిదే కానీ వారి ఆశయం పూర్తిగా కార్యరూపం దాల్చలేదు. ఆక్రమంలో గురజాడ వంశీయుల వద్దకు ఆనాటి ప్రభుత్వ అధికారులు వచ్చి వారి వద్ద నుండి ఇప్పుడున్న స్మారక భవనాన్ని 1989 ప్రాంతంలో స్వాధీనపరచుకున్నారు.

            ఇంటిని తీసుకుని రెండు సంవత్సరాలైనా దానిని ఎవరూ పట్టించు కోలేదని ఇల్లు పాడవటం చూసి బాధతో తాను ప్రభుత్వానికి ఎన్నో ఉత్తరాలు రాసాననీ, పట్టించుకోకపోతే మరల దానిని కుటుంబ పరం చేయమని రాస్తే అప్పుడు స్పందించారని మా మామగారైన గురజాడ అప్పారావు గారు (నా భర్త వెంకటప్రసాద్ తండ్రి) చెప్పేవారు. ఇలా ఉండగా ఆనాటి ప్రభుత్వం ప్రతి జిల్లా సమాచారం ఆ జిల్లా కేంద్రంలో ఎక్కడో ఒక చోట ఉండాలని కొత్త జి.ఓ ను జారీ చేసింది. విజయనగరం జిల్లాకు సంబంధించి జిల్లా సమాచార కేంద్రం ఖాళీగా ఉందని చెప్పి మహాకవి గృహంలో పెట్టారు. స్మారక భవనంలో మేడ మీద గల రెండు గదులలో అప్పారావుగారు వాడిన కళ్ళజోడు, రెండు కుర్చీలు, ఒక టేబులు అయన చదివిన పుస్తకాలు భద్రపరిచారు. నేటికీ అవి అక్కడే ఉన్నాయి. 2015లో గురజాడ వారి స్మారక భవనాన్ని రాష్ట్ర పురావస్తుశాఖవారు తమ అధీనంలోకి తీసుకుంటున్నట్లు జి.ఓను ఇచ్చారు. నాటి నుండి నేటి వరకు ఇది వారి అధీనంలోనే కొనసాగుతున్నది. ప్రస్తుతం విజయనగరంలో ఉన్న సాహితీ సంస్థలు ఏ విధమైన సాహిత్య కార్యక్రమాలు గురజాడ వారి స్వగృహంలో జరుపుతున్నారు. ఎంతో మంది సాహిత్యాభిమానులు గురజాడ వారి స్మారక భవనాన్ని సందర్శించి గురజాడవారు వాడిన వస్తువులను, వారు నడయాడిన ఇంటిని చూసి జన్మ ధన్యమైనదిగా భావిస్తారు. అటువంటి ఈ గృహం నేడు కొంత శిధిలావస్థకు చేరుకుంది. దీనిని పరిరక్షించవలసిన బాధ్యత, అవసరం ఎంతైనా ఉంది.

            గురజాడవారు నడయాడిన, రచనలు చేసిన స్మారకభవనాన్ని ప్రభుత్వం తీసుకున్న క్రమంలో గురజాడ వంశీయులు గురజాడవారు కొత్తగా కట్టుకున్న ‘లలిత్’ భవనంలోకి మారారు. అందులో వారు 2013 వరకూ ఉన్నారు. అప్పటికి నా భర్త వెంకటేశ్వర ప్రసాదుగారు ఒక చిన్నపాటి పాఠశాలలో పనిచేస్తున్నారు. నేను తాత్కాలిక పద్ధతిలో ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్నాను. నేను ఇలా పనిచేయటానికి కూడా ఒక కారణం వుంది.

            అప్పట్లో మండలి బుద్దప్రసాద్ గారు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. వారు గురజాడ స్మారక భవనాన్ని చూడటానికి తనికెళ్ళ భరణిగారితో కలసి వచ్చారు. వారసులను కూడా చూద్దామని ప్రక్కనే ఉన్న  మా ఇంటికి వచ్చారు. మా స్థితిగతులను చూసి కలెక్టరు వారితో  మాట్లాడి  నాకు తాత్కాలిక పద్దతిలో ఉపాధి కలుగజేసారు. బుద్ధప్రసాద్ గారు, _అటుపిమ్మట యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ గారు మాకు చేస్తున్న మేలు మరువలేనిది. మేము మా ఉద్యోగం చేస్తూనే గురజాడవారి గృహ సందర్శకులకు ఇంటిని చూపించడం, మాకు తెలిసిన విషయాలు చెప్పడం దినచర్యగా మారింది. కుటుంబపరంగా కొన్ని చికాకులు, ఆర్ధిక సమస్యలు వున్నప్పటికీ. పోతే లలిత్ బిల్డింగ్ కట్టి వందసంవత్సరముల కాలం కావున నివాసయోగ్యంగ లేకపోవడం, దానిని బాగు చేయాలంటే తలకుమించిన పని కావడంతో మహాకవి వంశీయులు ఆ ఇంటిని అమ్మకానికి పెట్టారు. ఇల్లు అమ్మడం ఎంతమాత్రం నాకు సమంజసం అని తోచలేదు. అది స్వయంగా మహాకవి కట్టుకున్న ఇల్లు కదా! మహాకవి ఇల్లు అని కొన్నవారికి శ్రద్ధ ఉండదు. కొన్నవారు దానిని నేలమట్టం చేస్తారు. అది జరగకుండా ఇది కూడా ప్రక్కన ఉన్న స్మారకభవనం లాగే ఉండాలని, ఉన్నంత వరకు కుటుంబీకు లందరూ అందులోనే ఉందామని ఇంట్లో వారికి ఎంతగానో చెప్పి చూసాను. ఎవరూ నామాట వినలేదు. గత్యంతరం లేక అప్పటి జిల్లా కలెక్టరు వారిని, జిల్లా మంత్రులను కలసి వారికి ఈ విషయం చెప్పి ప్రత్యామ్నాయం చూపమని ఆరు నెలలు తిరిగాను. ఎవరూ స్పదించలేదు. దీనిపై అప్పట్లో టి.వి.లలో చర్చా కార్యక్రమాలు కూడా జరిగాయి, కాని ప్రసాద్, నేనూ అనుకున్నట్లు జరగలేదు. “తీసుకున్న ఇంటినే ప్రభుత్వం వారు పట్టించు కోవటం లేదు దీని కథ కూడా అలానే తెల్లవారుతుంది” అని కుటుంబ సభ్యులు అన్న మాటలలో నిజం లేకపోలేదు అనిపించి, మేము కూడా… . నిస్సహాయ స్థితిలో ఉండిపోయాము. విజయనగరంలో ఉన్న ఒక వ్యాపారి ఆ ఇంటిని కొనుగోలు చేసారు. అయితే నేనూ వెంకటేశ్వర ప్రసాదుగారు ఆలోచించుకొని ఇంటిని కొన్న వారితో ఒక ఒప్పందం చేసుకున్నాము. దాని ప్రకారం వ్యాపారి కొనుక్కున్న స్థలంలో ఉన్న అప్పారావుగారి లలిత్ భవనం పడగొట్టి నూతనంగా ఒక గ్రూప్ హౌస్ నిర్మాణం చేస్తారు. కుటుంబలో అందరికీ ఎవరి వాటా డబ్బు వారికి ఇచ్చివేసి, మాకు ఇవ్వవలసిన వాటాకు ఆ  స్థలంలో కట్టిన ఒక ఇంటిని ఇచ్చేట్లుగా, గురజాడ వారి వారసులుగా అక్కడే మేము నివాసం ఉంటామని చెప్పాము. అలా అయితేనే సంతకం పెడతామని మొండికేస్తే చివరికి గత్యంతరం లేక అంగీకరించారు. కుటుంబీకులు అందరూ ఎవరి వాటా వారు తీసుకొని వెళ్ళిపోయారు. మేము గురజాడవారి స్మారక భవనం దగ్గరలో ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకొని స్మారకభవనం సందర్శకులకు అందుబాటులో ఉండేవారం.

            ఇక్కడ నుండి మహాకవి చెప్పినట్టు మా పరిస్థితి ‘డామిట్! కథ అడ్డం తిరిగింది.’

            గ్రూప్ హౌస్ కట్టే క్రమంలో కొనుక్కున్న వ్యక్తి అనుమతి కోసం మున్సిపాలిటికి పత్రాలు సమర్పించారు. ఒక ఆరు నెలలు కాలం గడిచాక ఒక పిడుగులాంటి వార్త మాకు చెప్పారు. అదేమిటి అంటే గురజాడవారి స్మారక భవనం పురావస్తు శాఖ పరిధిలో ఉందని వారి మార్గదర్శకముల ప్రకారం ప్రక్కన ఎటువంటి కట్టడములు కట్టరాదని తేల్చిచెప్పారు. ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి. ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించమని ఎన్నో అర్జీలను పెట్టుకున్నాము. మేము రెండు సంవత్సరములు అందరి చుట్టూ తిరిగి కొంతమేరకు ఈ సమస్యను పరిష్కరించుకోగలిగాము. ప్రభుత్వంవారు ఆ స్థలం తీసుకుంటూ మాకూ, ఆ కొన్న వ్యక్తికి మరొక చోట స్థలం కేటాయించారు. అయినప్పటికీ ఇందులో ఇంకా చిన్నచిన్న పరిపాలనా పరమైన ఇబ్బందులు మిగిలి ఉన్నాయి. వాటిని కూడా ప్రభుత్వం వారు పరిష్కారం చేసి గురజాడ స్మారకభవనం ప్రక్కన ఉన్న ఖాళీ స్థలమును ఆధీనంలోనికి తీసుకొని గురజాడ వారి పేరుతో అక్కడ ఒక ఆడిటోరియం కట్టించాలని మా కోరిక. ప్రభుత్వము దీనిపై తగు శ్రద్ధ చూపక పోవటం వల్ల ఇప్పటికీ అక్కడ 600 గజాల స్థలం నిరుపయోగంగా దుర్గంధంతో నిండి, ప్రక్కనే ఉన్న స్మారకభవనంలోకి కూడా ఈ దుర్గంధం వ్యాపిస్తోంది.

            గురజాడవారి స్మారకభవనం మొదట ప్రభుత్వం వారు ఒప్పందం కుంటున్నారు. గురజాడవారికి సంబంధించిన సమగ్ర సమాచారం అంతా  ఇక్కడ ఏర్పాటుచేయాలి. అంటే వారి రచనల కాపీలను పెట్టడం, గురజాడ వారి సమకాలీన సాహిత్యకారుల చిత్ర పటాలను ఏర్పాటు చేసి సలహాలతో గురజాడవారి స్మారకభవనాన్ని లండన్ లోని షేక్స్పియర్ దాని క్రింద వారి సంక్షిప్త చరిత్రను తెలియపరచాలి. ఇంకా పెద్దల సూచనలు, స్మారక భవనంలా రూపొందించినప్పుడే గురజాడ వంశీయులు ఇచ్చిన ఈ  ఇంటికి సార్ధకత చేకూరుతుంది.

            సాంస్కృతిక పరిరక్షణ కూడా పరిపాలనలో భాగమే కదా, మరి ప్రభుత్వాలు ఈ కర్తవ్యాన్ని ఎందుకు విస్మరిస్తున్నాయి? “స్వంత లాభం కొంత మానుకు పొరుగువారికి తోడుపడవోయి” అన్నమాటను వారి కుటుంబీకులుగా ఆచరించి కోట్లు విలువైన ఆస్తిని, వారి జ్ఞాపకాలను భావితరాలకు స్పూర్తిగా ఉండాలని ప్రభుత్వ పరంచేసాము. మరి ప్రభుత్వం వారు “ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మెల్ తలపెట్ట వోయి” అన్న మాటను మన్నించి గురజాడ వారి గృహం విషయంలో శ్రద్ధపెట్టి ఆ మహనీయుని సాహిత్య కృషికి నిజమైన నివాళులు అర్పించాలని ఆశిస్తున్నాము.

            విజయనగరం సంస్థానానికి, రాజకుటుంబానికి చేసిన సేవకు ప్రతిఫలంగా మహాకవికి రాజకుటుంబంవారు 1913 నుండి నెలకు 1500 రూపాయలు పెన్షన్ గా మంజూరు చేసారు. 1913 నాటికే అప్పారావుగారు ఆరోగ్యం పూర్తిగా కోల్పోయారు. దీనికి కారణం విపరీతమైన పని ఒత్తిడి. కుటుంబ బాధ్యతలు, మరో ప్రక్క సంస్థానం బాధ్యతలు వారికి మోయలేని భారం అయింది. భగవంతుడు అప్పారావు గారికి అన్నీ ఇచ్చాడు కానీ మంచి ఆరోగ్యం ఇవ్వలేదు. డాక్టర్లు ఎన్ని సలహాలు ఇచ్చినా వాటి దారి వాటిదే. పనిచేయలేని పరిస్థితి వచ్చినప్పుడు బ్రతికి ఏమి లాభం అనే వారు. బ ఉందని విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆస్పత్రిలో  ఉన్నప్పుడు వీరిని చూడడానికి గిడుగు రామ్మూర్తిగారు వస్తూ ఉండేవారు. ఒకరోజు డాక్టర్లు రామ్మూర్తిగారితో “మీరు రావటం వల్ల అప్పారావుగారు అనారోగ్యం సంగతి కూడా మరిచి మీతో సాహిత్య గోష్టి జరుపుతున్నారు, వారికి కొంతకాలం విశ్రాంతి అవసరం” అని చెప్పడం జరిగింది. ఇది గురజాడ వారి నిరంతర సాహిత్య అభిలాషకు, కృషికి నిదర్శనం. అప్పారావుగారి ఆరోగ్య విషయమై రాణి లలితకుమారి గారు కే.జి.హెచ్ డాక్టరు గారికి ఒక ఉత్తరం వ్రాసి అప్పారావుగారి ఆసుపత్రి ఖర్చును తామే భరిస్తామని, ఎంత ఖర్చు అయినా వెనుకాడవద్దని చెప్పారు. అప్పారావుగారికి ఇంకా ఏమైనా కావాలో కనుక్కోమని రాణిగారు కబురు చేసారట. తాను ఎన్నో పుస్తకాలను సేకరించడం జరిగిందని, వాటిని కళాశాలలో పెట్టే ఏర్పాటు చేసినట్లయినా భావితరాల వారికి అవి ఎంతో ఉపయోగపడతాయని చెప్పినారట గురజాడవారు. అదీ వారి జ్ఞానతృష్ణ. ఆరోగ్యం కొంత కుదుటపడి విజయనగరం వచ్చిన అప్పారావుగారు తిరిగి సాహిత్య రచనకు పూను కున్నారు. విజయనగరంలో వీరికి శ్రీ చాపా మంగయ్యనాయుడుగారు వైద్యం అందించేవారు. నవంబర్ నెలలో మహాకవికి రోజూ జ్వరం వచ్చేది. నాయుడుగారు వేపుడుజావ, మజ్జిగ ఆహారంగా ఇవ్వమన్నారు. అరుగుదల తగ్గింది. ఆయాసం వస్తోంది. గాలి అసలు పడేది కాదు కోటు మీద కోటు వేసేవారు. వీరు రాణిగారితో ఉదకమండలం వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏమీ తినకుండా తనతో పాటు కొన్ని వంట పదార్థములను తీసుకొని వెళ్ళేవారట. అప్పారావు గారికి జీడిపప్పు అంటే చాలా ఇష్టం, కానీ పాపం వాటిని తిన్నా అరిగేది కాదు. జీడిపప్పును వాసన చూసి ప్రక్కన పెట్టేసేవారు. కూరల్లోని పోపును కూడా విదిలించి చప్పటి కూరగాయ ముక్కలే తినేవారని కుటుంబంలోని మా పెద్దలు చెప్తారు.

            1915 నవంబరు నెల 30వ తారీఖు వచ్చింది. తెలుగు సాహిత్యానికి ఆరోజు చీకటి రోజు. అదే మహాకవికి ఆఖరి ఉదయం. ఉదయం 6 గంటల నుండి కొడుకు రామదాసు, తల్లి కౌసల్యమ్మ, భార్య అప్పలనరసమ్మ అందరూ అందోళనతో అప్పారావుగారి మంచం ప్రక్కన ఉన్నారు. ఆయాసంగా ఉందని కొడుకు రామదాసుగారు డాక్టరు మంగయ్య నాయుడుని పిలుచుకొని వచ్చారు. ఆయన కూడా అప్పారావు గారి మంచం ప్రక్కన కూర్చున్నారు. గురజాడ గారు కొడుకును పిలిచి పై దుస్తులన్ని తీసివేయమని చెప్పారు. కొంచెం కోకో వైన్ మరియు దంచిన తాంబూలం తెమ్మన్నారు. రామదాసు గారు భయంగా డాక్టరుగారి వైపు చూసారు. వారు ఇమ్మన్నారు. అది తాగి, తాంబూలం వేసుకొని డాక్టరు వైపు తిరిగి “డాక్టరుగారూ నేను బ్రతికి ఉంటే ఆరోగ్యశాస్త్రం మీద ఒక పుస్తకం రాస్తామ అని ఒక చిరునవ్వు నవ్వినారట. అదే ఆ మహాకవి ఆఖరి మాట అంటారు. తన తల్లి అయిన కౌసల్యమ్మ వైపు చూస్తూ ఒక కన్నీటి బొట్టు రాల్చేరట. (నీ కన్నా ముందు నేను వెళ్లిపోతున్నాను అనీ, తమ్ముడు శ్యామలరావు మరణించినప్పుడు తల్లి పడ్డ బాధ చూసారు కనక మరలా ఆ తల్లికి ఈ బాధ తప్పదని కాబోలు) అప్పుడు కాలం 8.20 ని.లు సరిగ్గా, భౌతికంగ మహాకవి గురజాడ గారు లేరిక. అప్పారావు గారి అంతిమ సంస్కారాలు చేసిన చోటికి వారి తల్లిగారైన కౌసల్యమ్మ రోజూ వెళ్ళి “అప్పారావు లేచి రా! నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వు ప్రపంచానికి కావలసినవాడవు” అని వెక్కి వెక్కి ఏడ్చి ఇంటికి వచ్చేవారట. మహాకవి తల్లి 1916లో మరణించింది. మహాకవి భార్య అప్పలనరసమ్మ 1926లో మరణించారు. అప్పల నరసమ్మ పూర్వాచారాలు, ఛాందస భావాలు కలిగిన వ్యక్తి. పూజలు, పునస్కారాలు ఎక్కువ. నిత్యం మహానైవేద్యం అయితేనే భోజనం వుండేది. ఆమెకు అప్పారావుగారి ఆధునిక భావాలు ఆలోచనలు నచ్చేవి కావు. వారి వ్యవహారాలన్నీ గుమ్మం బయట చేసుకోమని గుమ్మం లోపల సంప్రదాయ 5 పద్ధతుల్లో ఉండాలని చెప్పేవారట. గురజాడ వారి అభ్యుదయ భావజాలం  వారి వారసులకు ఎవరికీ రాలేదు అనడం ఒక చేదు వాస్తవమే!

             మహాకవి ఏది చెప్పారో అది చేశారు. ఏది చేశారో అది చెప్పారు.

‘బ్రతికి చచ్చియు ప్రజల కెవ్వడు బ్రీతి కూర్చునొ వాడె ధన్యుడు.

  *   *  *

గురజాడ ఇందిర

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *