“అమ్మీ, జిల్కికి ఆస్పిటల్ల జాయిన్ సేసినారటే”… సంతనుంచి సామాన్ల సంచి మోసుకొస్తున్న
ముసిలన్న చెప్పేడు. గతుక్కుమంది మిలంతి. “ఏటైంది? నిన్నటిదాకా బాగనే ఉన్నాడు గదా?”
ఆత్రుతతో అడిగింది. “ఏమో… నాకు తెలీదే. మనూరు మండింగోడు సెప్పినాడె. ఏటైందిరా అంతె
ఆడు మల్లా ‘ఏమో’ అనుకోని పారొచ్చినాడే”. అంటూ దాటి వెళ్ళిపోయేడు.
జిల్కి… అన్నీ సవ్యంగా ఉండి వుంటే ఈ పాటికి తనతో మనువై పోయుండేది.
సంత నుండి వస్తున్న ఎవర్నడిగినా ‘ఏమో’ అనే సమాధానం రావడంతో ఆత్రుతతో కొండ
దిగుతోంది మిలంతి.
ఏటవాలు కొండ. కొండ మీద నుంచి రాళ్ళు నిండిన దారి. అక్క డక్కడా ఎదురొస్తున్న
వాగులు. దారిపక్కన ముళ్ళకంపలు, తుప్పలు, డొంకలు. కంది కొండ కాపుకి ఏర్పాటు చేసిన
ఎత్తయిన మంచెలు. మంచె మీద నుండి పిట్టలు, కోతులు పంట మీదికి రాకుండా ‘టొణ ప’ శబ్దాలు.
ఏ దొంగావు మెడలో నుంచో ‘డిడంగ సవ్వడి… కొండ మలుపు లోంచి పిల్లంగోవి పాట.
దూరాన్నుంచి ఒంటరి డప్పు మోగుతూ డప్పు దరువులు.
మారుతున్న డప్పు వరసలు
వరసలు… వరసలు… వరసలు… వరసలు…
…చలి చలి గాలుల నుంచి తేలియాడుతున్న డప్పు వరసలు. దీసరోడు చుక్క వెలుగును చూసి
చెట్టు ముహూర్తం కట్టేడు. ఆ ముహూర్తానికి ఊరంతా కంది కొత్తల మత్తులో… తుడుం డప్పుల
హోరు… ప్రతిధ్వనిస్తున్న కొండలు.,
జన్నోడింట దీపం వెలిగింది. ఎజ్జోడు కానికు పోసేడు. ఊరి జాకరమ్మ
పూజలందుకుంటోంది. పసుపు నీళ్ళతో స్నానమాడి గొడ్డలమ్మ ముస్తాబయ్యింది. కోడిపిల్లని బలిచ్చి
గొడ్డలమ్మ మెడలో హారంగా వేలాడదీసేరు.. కుంకుమ బొట్లు దిద్దేరు. కంది కాయల గుత్తిని వేలాడ
దీసేరు. ఊరంతా పండుగ వాసన కమ్ముకుంది. కొత్త బట్టలేసుకుని పిల్లలు కేరింతలేస్తున్నారు. కొత్త
కోకలతో ఒకరి నడుమ్మీంచి మరొకరు చేతులందుకుని ధింసా అడుగులేస్తున్న ఆడపడుచుల వరస
కొండ మెడలో బంతిపూల దండలా కదులుతోంది. యువకుల సమూహం జీలుగు కల్లు మత్తులో
ఉరకలేస్తోంది. వీధంతా ధింస్తా అడుగుల హోరుకి లేచిన దుమ్ముతో నిండిపోయుంది. వీస్తున్న గాలి
కాసేపాగి అక్కడ పరిమళించీ మరి ముందుకు సాగుతోంది.
ఆ సమూహం లోంచే… ఆ డప్పుల వరసల్లోంచే… ఏవో చూపులు తనను వెంటాడుతున్నట్టనిపించింది
మిలంతికి. పరిశీలించి చూసింది. గుండెల మీద ఆనించి డప్పు దరువేస్తూ… జిల్కి. నొక్కి పట్టి వుంచిన
పెదాల మాటున చిరునవ్వుని చిందిస్తూ అడుగులేస్తున్నాడు. తనకేసే ఓరచూపులు చూస్తూ
హోరెత్తిస్తూ… ఆమె గుండె ఝల్లుమంది మనసు ఊయలూగింది. డప్పు దరువుకి అనుగుణంగా ఆమె
పాదం కదిలింది లయబద్దంగా తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది. చేతిగాజులు మీదికి జరిపి
చీరకుచ్చిళ్ళు ఎత్తి దోపుకుంది. జిల్కి దరువుల వరస మార్చేడు. ఒక్కసారిగా గోల… ఈలలు… హోరు
మిన్నంటేయి. సమూహం వైపు అడుగులేసింది. ధింసా వరసల్లోకి చేరింది. జిల్కి నవ్వేడు. ఆమె అటు
చూసింది. చెమట పట్టిన జుట్టు అతని కళ్ళని, చెవులని మూసేస్తుంటే… దరువు ఊవులోనే తల
నెగరేస్తూ… కొండ శిఖరమ్మీంచి దూకుతున్న జలపాతంలా కనిపించేడు.
శతర.
పొడవాటి వెదురు కర్రకి నెమలీకల్ని దట్టంగా కట్టి వుంది. చివర తెల్లని గుడ్డని వెండి తీగల్తో
బిగించివుంది. కరెంటు తీగలకి తలగ కుండా జాగ్రత్తపడుతూ ఆడిస్తున్నారు.
ఊర్లోని ప్రతి ఇంటివాళ్ళూ బియ్యము, కొత్త కందులు, చిక్కుళ్ళు జన్నోడింటికి తెచ్చేరు. అక్కడే
అన్నీ కలిపి వంట చేసేరు. ఆ వంటకం జాకరమ్మకి, గొడ్డలమ్మకి నైవేద్యంగా పెట్టేరు. తమ పూర్వీకుల్నీ
పెద్దల్నీ తలంచుకున్నారు. అందరికీ ప్రసాదంగా అడ్డాకుల్లో పంచిపెట్టేరు. ప్రతి ఇంటిలోని ప్రతిఒక్కళ్ళూ
తిని కొత్త దినుసుల్ని కొత్త గలిచేరు.
కంది కొత్తలు… అడవికి అర్పించే నీరాజనాలు. విత్తనం నాటితే పండుగ. మొలకెత్తితే పండుగ.
పూస్తే పండుగ. కోతకొస్తే పండుగ. ఎంత గొప్ప సంస్కృతి!! ప్రకృతి మార్పుల కనుగుణంగా
సాంప్రదాయ గిరిజన జీవితం!!!
ఊరంతా కదిలి ‘దుర్ల’కి బయలుదేరేరు. పక్క గ్రామం చేరుకున్నారు. రెండు గ్రామాల
గొడ్డలమ్మలు కలిసి ఆడేయి. రెండు గ్రామాల వాయిద్యాలు కలిసి ఒకటై నిలిచిన ధింసా అడుగుల్ని
కదిలించేయి. కురిసిన వెన్నెల… మురిసిన అరణ్యం… దుర్ల సమూహం ఆ రాత్రిని రంజింపజేసాయి. ఆ
రాత్రికి ఆతిథ్యం అక్కడే. తెల్లవారేక మరో వూరు.
పండుగ మాటున ఎంత గొప్ప మానవ సంబంధాలు!!
ఆ దుర్ల సమాయాల్లోనే జిల్కిని చూసింది మిలంతి. ఆ దుర్లలోనే అతను డప్పు వాయిస్తూ
కొండల నిండా, తన గుండెల నిండా ప్రతిధ్వనిస్తున్నపుడే అతని మీద మనసు పారేసుకుంది.
అతను డప్పుల దరువైతే ఆమె ధింసా నృత్యమయ్యింది.
అతను వేణువైతే ఆమె గానమయ్యింది.
అతను సన్నాయి పాటైతే ఆ పాటకు పల్లవయ్యింది.
ఆ రోజు నుంచీ, కంది కొత్తల మాటెత్తితే చాలు… అతను కొట్టిన డప్పు దరువే ఆమె గుండెల్లో
మారుమోగేది. అతను మాట్లాడితే చాలు వేణువూదిన దృశ్యమే కదలాడేది. అతను తలంపుకొస్తే చాలు,
కొత్తల సాయంత్రాన వీధుల్లో గంతు లేస్తున్న సమూహమే కదలాడేది. అతని చేతి వేళ్ళ కదలికల్లోంచి
ధ్వనించిన డప్పు వరసలు కొన్ని వందల పాదాల కదలికల్ని నిర్దేశించేవి. అతనొక యువకుడే కాదు.
ఒక సమూహం కూడా. మిలంతి అతన్ని ఇష్టపడడానికి అంతకు మించిన కారణాలేముంటాయి?
ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఏకాంతంగా కలుసుకునేవాళ్ళు. కలిసి సినిమాలకి,
యాత్రలకి వెళ్ళేవారు. పండుగలొస్తే ఆడేవాళ్ళు. పాడేవాళ్ళు. అతను డప్పు కొడితే ఆమె కొంగు ముడేసి
ఆడేది. పండుగ రోజుల్లోనే ముంతడు జీలుగు కల్లు తాగి మత్తుగా ముఖం మీద ముఖం పెట్టి అల్లరి
పనులు చేస్తుంటే వింత వాసనకి, ఆ చిలిపితనానికి ఆమె పులకరించిపోయేది.
తాడికొండ యాత్ర. జనం. ముద్దబంతి పూలరాసుల్లా ప్రతి దుకాణం ముందూ గిరిజనం.
దీపాల వెలుతురు. మైక్ నుంచి సినిమా గీతాల హోరు. గాజులు, పూజలు, బొట్లు, తాళ్ళు
బేరమాడుతున్న బాలికల గుంపు. వారి వెనక కుర్రాళ్ళు. తన మిత్రబృందంతో వచ్చిన మిలంతి గాజులు
బేరమాడుతోంది. ఎక్కడి నుండి వచ్చేడో, ఎలా వచ్చేడో… పక్కకొచ్చి నిలబడ్డాడు. ఇద్దరి చూపులు
కలుసుకున్నాయి. రెక్క పట్టుకుని చీకట్లోకి లాక్కెళ్ళేడు. ఆమె చేతిలో రూపాయి బిళ్ళని పెట్టేడు. ఆమె
నవ్వింది. సిగ్గుతో తల వంచుకుంది. అతనితో కలిసి నడిచే బతుకుని ఊహించుకుంది. మసక చీకట్లో
ఆమె కళ్ళలో వెలుగుని చూసేడతను. క్షణమాగి అదే రూపాయి బిళ్ళతో ‘కజ్జం’ కొని అతనికి
తినిపించింది. ఆమెను గెలిచాననే గర్వం అతనిలో తొణికిసలాడింది. వెనక నున్న అతని మిత్రుల వైపు
ధీరుడిలా చూసేడు. మిగిలినదాన్ని నోట్లో వేసుకుంది. ఆ మాధుర్యం ‘ఇద్దరమొకటే’ అన్న భావాన్ని
కలిగించింది ఇద్దరిలో.
కాలం కదిలిపోతోంది ముందుకు.
ముఖానికి ముళ్ళ కంపేదో తగిలి ఈ లోకానికొచ్చింది. కొండనొదిలి పల్లానికి చేరింది దారి.
గబగబా అడుగులేసింది. ఆసపత్రికి చేరుకుంది. మంచమ్మీద అపస్మారక స్థితిలో వున్నాడు జిల్కి. తల
మీద, ఒంటి మీద బలమైన గాయాలున్నాయి. రక్తం తుడిచిన దూది ఎర్రగా బేసిన్లో మెరుస్తోంది. రక్తం
నల్లబడి గాయాలు భయం గొల్పుతూ…
“ఏటైంది?” అడిగింది.
కాళ్ళవైపు కూర్చొనున్న మేనత్త బోరున ఏడ్చింది.
“ఒద్దురా… మనకొద్దురా… అన్నాను. ఇన్నాడా…!?” అంటూ కాళ్ళ మీద పడి వెక్కి వెక్కి
ఏడవడం ప్రారంభించింది.
“మామిడి మాను గూడోలు కొట్టేరు. ఒక్క సిటం నేను సూడ్డం ఆలిస్యం అయితే
సంపీసుందురు” వెనక నుంచి పెద్దన్న చెప్పేడు.
వెనక్కి తిరిగి చూసింది. “నీకు తెలీదేటీ…” అన్నట్టు ఉన్నాయి అతని చూపులు. భుజమ్మీది
తువ్వాలు గుడ్డని సరి చేసుకుంటూ మళ్ళీ చెప్పేడు. “మనూర్లోన మనోలైతే పర్నేదు. ఆలు
పల్లకుంతారా? అక్కడికెల్లి కొత్తలు సెయ్యోద్దన్నాడట. జాకరమ్మకి మొక్కొద్దన్నాడట. ‘తుడుం కొట్టకు,
డప్పు ముట్టకు’ అన్నాడట. అలగన్నోడు పల్లకున్నాడా? కొడుతున్నో ల దగ్గరికెల్లి తుడముకుండ, డప్పు
లాక్కుని జల్లీసి నాడట… కోపం రాదా?…”
మిలంతికి విషయం అర్థమైపోయింది. అతనివైపు చూసింది. స్పృహలో లేడు. సెలైన్ లోంచి
చుక్కా చుక్కా జారుతోంది. మిలంతి వెనకటి జ్ఞాపకాలలోకి…
ఆ రోజు సాయంత్రం… పోస్టులో తనకి వచ్చిన కవర్ విప్పి చదివింది. టీచర్ ట్రైనింగ్
సీటొచ్చింది. ఆ మరుసటి రోజే ‘అరకు’లో జాయినవ్వాలి. అదే విషయం చెప్పింది జిల్కితో. అతని
ముఖంలో కళ తప్పింది. తను దూరమవడాన్ని భరించలేకపోయేడు. నచ్చజెప్పింది.
“ట్రైనింగ్ పూర్తయితే ఉద్యోగమొస్తుంది. అప్పుడు ఏ సమస్యలుండవు గదా” అని ఒప్పించింది.
వదలలేక దిగులుతో తప్పనిసరి పరిస్థితుల్లో తనని బస్సెక్కించేడు. దిగులు నిండిన కళ్ళతో
చేతులూపుతూ సాగనంపేడు. ట్రైనింగ్లో జాయినయ్యే రెండు మాసాలదాకా వారానికో ఉత్తరం
రాసేవాడు. ఆ ప్రేమ లేఖల్ని చదువుకుంటూనే ట్రైనింగ్ కాలాన్ని గడిపేసేది. ఆ తర్వాత కొన్నాళ్ళకి
ఉత్తరాలు ఆగిపోయేయి. సెలవులకని ఇంటికొచ్చేక ఆరా తీస్తే పాష్టర్ ట్రైనింగ్ కని వెళ్ళిపోయేడని
తెలిసింది. ఆశ్చర్యపోయింది.
సంవత్సరం తిరిగేక ఒక సాయంత్రం పూట ఇంటికొచ్చేడు. ఎన్నో ప్రశ్నలకి అడగకుండానే
సమాధానం చెప్పేడు. ఎంత మార్పు?! నిన్నటి నా జిల్కేనా తను!? తెల్లని బట్టలు… ఇంగ్లీషు
మాటలు… భుజాన సంచి… మెడలో సిలువ!!?
ఏదో పరాయితనం. తనకు నచ్చనిదేదో కనులముందు కదలాడుతూ. ఏ ఆచార
సంప్రదాయాల మాటున అతన్ని చూసిందో… ఏ విశ్వాసాల మాటున అతన్ని ఇష్టపడిందో. ఆ
విశ్వాసాలనే దెబ్బకొట్టేడు.
కంది కొత్తలకి ఇంకా వారం పది రోజులుందనగా… చలి చలి గాలుల మధ్య వెన్నెల
అవిశ్రాంతంగా అడవి మీద రాలుతున్న సమయాన… తుడుం డప్పులతో చలి పులిని తరిమే వేళ…
యువకులంతా ఉరకలు వెయ్యాల్సిన వేళ…
“జిల్కి ఏడ్రా… డప్పు తెమ్మన్న్రా… రమ్మనాడికి” పిలిచేడు మిత్రుడు మంగడు.
“ఆడెందుకొస్తాడ్రా!?” సాగదీసేడు బీసురు. “ఏమి?”
“ఆడి వోలకం సూసేవా? పేంటు బుస్కోటు, మెడల గొలుసు… ఈ మద్దిన ఏటి సేస్తున్నాడో
తెలుసునా?”
“ఏటి సేస్తున్నాడ్రా?” కుతూహలంగా అడిగేడు.
“పొద్దు పోయిన టైముకి ఊరూరుకి ఎల్తన్నాడు. ఇంటింటికి తిరిగి పెబువు మాటలు… పాటలు…
మరింకేటి?….”
“ఆ ?!”
“మరేటైతే జాకరమ్మ, గొడ్డలమ్మ ఇవన్నీ ఒట్టిదేనట్రా సెట్టుకి మొక్కడం పుట్టకి మొక్కడం మూర్కమట.
డప్పులు కొట్టడం గెంతడం పనికిమాలినవట్రా…” అని అంటూండగానే…
“మరి కాదేటి?…” అంటూ వచ్చేడు జిల్కి. “ఈ పండుగులన్నీ ఒట్టి ట్రాష్. ఏసుని నమ్ముకోండి. ప్రభువు
కాపాడుతాడు” అని చెప్పుకుపోతున్నాడు.
మిలంతి ఒక్కసారి తుళ్ళిపడింది.
తుడుం కొట్టి కొండల్ని దద్దరిల్లించే జిల్కి…
పిన్లకర్ర పెదాల మీద ఆనించి సవర పాటల్ని రసరమ్యంగా ఆలపించిన జిల్కి… ఎందుకిలా
తయారయ్యేడు? డప్పుతో ధింసా అడుగుల్ని శాసించేవాడు… ఏమిటిలా ప్రవర్తిస్తున్నాడు? కొత్తల
సంబరాల్లోనే కదా అతని దరువులకి మైమరచి తన మనసు పారేసుకుంది?! అందుకే కదా అతన్ని
మనువాడుదామనుకున్నది? మరిప్పుడు? తుడుము డప్పులని వదులుకున్నవాడిని, తనచే ధింసా
అడుగుల్ని వేయించలేనివాడిని అంగీకరించగలదా? మరీ ముఖ్యంగా తన విశ్వాసాల మీద, విలువల
మీద, ఆచారాల మీద, సంస్కృతి మీద దెబ్బకొడుతున్నవాడిని… అదే అడిగింది. మౌనంగా చూసేడు
జిల్కి. “మిలంతీ” అంటూ దగ్గరికొచ్చేడు. ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తోంది.
“నాలాగా ప్రభువుని నమ్ముకో. నాలాగా ఏసు ఆశీస్సులు తీసుకోగూడదూ” అన్నాడు.
“నేనడుగుతున్నదేమిటి? నువ్వు చెప్తున్నదేమిటి?” చిరాకెత్తి ప్రశ్నించింది.
ఇంకా దగ్గరికొచ్చేడు. “మన పెళ్ళికి ప్రభువు ఆశీస్సులు కావాలి. చర్చిలో జరగాలి” అన్నాడు.
“అంటే?”
“మతం పుచ్చుకోమని…’
ఉలిక్కిపడింది. కొండ మీంచి దూకుతున్న జలపాతం వరదై తనను ముంచుకుపోతున్న
ట్టనిపించింది. బరువైన తుడుం కుండ తలపై పడి బళ్ళున బద్దలైనట్టనిపించింది. అతనికి
చూడాలనిపించలేదు. గిరిక్కున వెనక్కి తిరిగింది. ఆ రోజు నుంచి అతన్ని కలవలేదు. దూరంగా
జరిగింది. అతని ముఖం మథనపడింది. తన మనసా? మనసుకు గాయం చేసినవాడా? ఎటూ
తేల్చుకోలేకపోయింది.
జల్కి మాత్రం చుట్టు పక్కల గ్రామాలకి వెళ్ళేవాడు. ఉపన్యాసాలిచ్చేవాడు. క్రీస్తు సంఘాల్ని
పెట్టించేడు. ఒకరోజు ఉదయాన… తెల్ల వేనొకటి ఊరి మధ్యలోకొచ్చి ఆగింది. దాంట్లోంచి తెల్లటి
మనుషులు దిగేరు. వేన్ నిండా ఏవేవో ఖరీదైన వస్తువులొచ్చేయి. ఊరందరికీ పంచిపెట్టేరు. టెంట్
వేయించేడు జిల్కి. మైక్ సెట్ పెట్టించేడు. ఊరి నిండా ఏసుక్రీస్తు బొమ్మలు పెట్టించేడు. ఇంగ్లీషులో
ప్రార్థన చేసేరు. దాన్ని సవర భాషలోకి అనువదిస్తూ చెప్పేడు జిల్కి. క్రీస్తు పాటలు పాడేడు. ఆ రోజంతా
క్రీస్తు ప్రార్థనతో పాటలతో గడచిపోయింది.
ఆ తెల్లవారే…
వదిన కొత్తగా కనిపించింది. ‘అడ్డుగుండాలి’ చీర కట్టిన వదిన కుచ్చిళ్ళు దోపుకుని కొంగు
వదిలి కట్టింది. పావలా బిళ్ళంత బొట్టు పెట్టుకునే వదిన సూర్యోదయాన్ని మోస్తున్న తూరుపు దిక్కులా
ఉండేది. ఇప్పుడు… వదిన నుదురు సూర్యుడు లేని ఆకాశమై పోయింది.
‘ఏమిటొదినా’ అని ప్రశ్నించబోయేసరికి “ఆ పొద్దు… మీ యన్నకి జొరమొస్తె… పేర్థన
సెయ్యబట్టేకదే తగ్గింది. మరి… ముసిలన్నో… సచ్చిపోయినోడు… జిల్కి ఒచ్చి నూన రాసి వాక్యం చదివే
గదా బతికినాడు” అంటూ చెప్పుకుపోయింది. అలా అడిగిందని ముభావంగా మారింది తనతో. ఒక్క
రోజైనా కనపడకపోతే గాబరాపడి తల్లడిల్లిపోయే వదిన అన్నయ్యలు తనకు ముఖం చాటెయ్యడం
బాధించింది. పిల్లలిద్దరూ అలాగే తయారయ్యేరు. ఇంట్లో అందరు ఉండగా తను ఒంటరిదాన్లా
ఉండాల్సొచ్చింది. ఇంట్లోనే కాదు ఊర్లో కూడా చాలామంది కట్టు బొట్టు మార్చేరు. మాట మార్చేరు.
ముసలివాళ్ళతోను తనలాంటి వారితోను మాటలు తగ్గించేసారు.
కొత్తల పండుగలొచ్చేయి. కందులు. గుత్తులు గుత్తులుగా కాసేయి. చలి గాలులు ముదిరేయి.
ఊర్లో దీసరోడు ముహూర్తం చూసేడు.
జన్నోడింట దీపం వెలిగింది. ఎజ్జోడు కానికు పోసేడు. కానీ ఊరందరి నుండి కొత్త గలవాల్సిన
దినుసులు రాలేదు. ఒకరిద్దరు మాత్రమే తెచ్చేరు. వంట చేసేరు. ప్రసాదం ఊరందరికీ పంచేరు. కానీ
అందరూ తీసుకోలేదు. ఊర్లో డప్పు మోగలేదు. తుడుం పలకలేదు. యువకులు లేరు. సమూహం
లేదు. ఊరంతా నిశ్శబ్దం కమ్ముకుంది. సడి లేదు. సందడి లేదు. చినుకు రాలని చీకటి కొండలా వుంది
ఊరు.
గడపలో నులక మంచమ్మీద దిగులుగా కూర్చొనుంది మిలంతి. ముందుటేడు కొత్తలు
గుర్తొచ్చేయి. కొత్తల్లోని సందడి గుర్తొచ్చింది. సందడిలో జిల్కి వేసిన డప్పు దరువులు గుర్తొచ్చేయి.
కుర్రాళ్ళ సమూహం కనిపించింది. సమూహంలోని ఊరు కనిపించింది.
ఇప్పుడు… ఊరుని కమ్ముకున్న నిశ్శబ్దం కలిచివేసింది. ఆమె కళ్ళ నుంచి ఓ కన్నీటి బొట్టు
మౌనంగా చెక్కిళ్ళ మీంచి రాలిపడింది. మండింగోడి గడపలో ప్రార్థన సన్నాహాలు జరుగుతూనే వున్నా
యి. ఊరంతా అక్కడకు చేరుకుంటున్నారు ఒక్కరొక్కరుగా. గొడ్డలమ్మకి ఇంటికొచ్చిన తొలి
పంటలోంచి కొంత భాగాన్ని ఇచ్చే వాళ్ళే కదా వీళ్ళు. వెన్నెల రాత్రి సవర పాటల్తో రాత్రిని రంజింపచేసిన
వాళ్ళేనా? జిల్కి… జిల్కీ… ఎంత పని చేసావు? ఇదేనా ఇంకేం చేసేడు ?!…అదే గదా తన గుండె
మండిస్తున్నది. అమాయక సవర పడుచుల్ని ప్రార్థన ముసుగులో… ఛ… ఛ… తలచుకుంటే
అసహ్యమేస్తుంది.
ఆ రోజు… అన్నా వదినా కలసి పార, గునపం, తట్టల్తో బయల్దేరేరు. ‘ఎక్కడికి’ అని అడిగితే
సమాధానం చెప్పలేదు వాళ్ళు. ఆరా తీసింది. ఊరి చివర మామిడి మానుకవతల పునాదులు
తవ్వుతున్నారని. మిలంతి అక్కడికి వెళ్ళి చూసింది. అన్నా వదినలతో పాటు ఊర్లోని చాలామంది
అక్కడ తవ్వుతూ కనిపించేరు. ఏమిటని అడిగింది. ‘పిలిప్ నగరం’ నిర్మాణం అని చెప్పేరు. ఎందుకు,
ఎవరి కోసం? అని చూస్తే గుండె ఆగినంత పనయ్యింది. మతం తీసుకున్నవాళ్ళు ఊర్లో ఉండరని,
మతస్తులంతా ఏకమై ఒకేచోట ఉండాలని కొత్త ఇళ్ళు కట్టుకుని అక్కడికి వెళ్ళిపోతారని తెలిసింది.
ఏమి చెయ్యాలో తోచలేదు. కాళ్ళక్రింద నేల దిగబడిపోతు న్నట్టనిపించింది. సమూహమై
సందడి చేస్తూ అడవితల్లి ఒడిలో హాయిగా గడిపేసే తనవాళ్ళు వేరైపోతున్నారా? తన అన్న, వదిన,
మామ, అత్త, తాత, బావ, వీళ్ళందరూ ఒకే కుటుంబంలాగా ఒకే ఊరులాగ, ఒకే సమూహం లాగ
ఉండాల్సి నవాళ్ళు తనకు కాకుండా దూరంగా వెళ్ళిపోతు న్నారా?
ప్రశ్నలు ప్రశ్నలుగా మిగిలి ఉండగానే ‘పిలిప్ నగరం’ నిర్మాణం పూర్తయ్యింది. తనవాళ్ళందరూ
కళ్ళెదుటే తన నుంచి వేరుపడి వెళ్ళిపోయేరు.
భరించలేకపోయింది. మిలంతి. బోరున ఏడ్చింది. నిస్సహా యంగా చూస్తూ
నిలబడిపోయింది. ఆమె కళ్ళ నుంచి రెండు కన్నీటి చుక్కలు జారిపడ్డాయి.
సెలైన్ బాటిల్లోంచి జారుతున్న చుక్కలు ఆగిపోయేయి. శ్వాస బరువుగా ఆడుతున్నట్టు
ఇబ్బందిగా కదులుతున్నాడు జిల్కి. అతని తల్లి మళ్ళీ ఏడుపు అందుకుంది. ఆసుపత్రిలో కలకలం
మొదలయ్యింది. డాక్టరు హడావిడిగా లోపలికొచ్చేరు. పరిశీలించి పెదవి విరిచేరు. అతని ముఖం
చూస్తే అందరికీ ఆందోళన కలిగింది. “వైజాగ్ తీసుకెళ్ళడం మంచిది” అన్నారు.
మిలంతి ఆసుపత్రి గోడకానుకొని మౌనంగా నిలబడింది. ఆమె గుండెలో ఎన్నో ప్రశ్నల
సంఘర్షణ సుడి రేగుతోంది. మతం పేరుతో తన వాళ్ళని తన నుండి దూరం చేసి తనూ
దూరమైపోయిన జిల్కి అమాయకపు ముఖం గుర్తొచ్చింది. పక్క ఊరిలో అతన్ని వ్యతిరేకించి అతని
ప్రాణాలకే అపాయం తీసుకొచ్చిన మామిడి మాను గూడ గుర్తొచ్చింది. ఏది ఏమైనా అతన్ని
గాయపరచడం జీర్ణించుకోలేకపోయింది. అతనికి అయిన గాయాలు గుర్తొచ్చేయి. అతను కొండకి
చేసిన గాయం గుర్తొచ్చింది. తనకు చేసిన గాయాలు గుర్తొచ్చేయి. అందరూ జిల్కి గాయాల గురించే
మాట్లాడుతున్నారు. మరి తన మనసుకయిన గాయం?…
“ఎల్లమా ఇంటికి…” అడిగింది నేస్తురాలు.మౌనంగా తనననుసరించింది.
దారి పొడవునా అతని ఆలోచనలే. అతనికి నచ్చింది అతను చేసేడు. నా నిర్ణయమేదో నేను
చేసుకోవాలి. ఏదేమైనా, అతనికేమీ కాకూడదు.
నడుస్తున్నారు. పొద్దు కొండ వెనక్కి జారిపోతోంది. దారి… సన్నని కాలిబాట… పాట
తీసినట్టు. మసక చీకటి… కమ్ముకుంటూ. ఆలోచనల్లో పరధ్యానంగా నడుస్తున్న మిలంతి… కాలిబాట
వరసల్లో వెనకగా. ఏమైందో… ‘అమ్మో’ అని కేక వినిపించింది. ఒకళ్ళ ఒకళ్ళ మీద ఒకళ్ళుగా తన
మీద పడిపోతుంటే పక్కనే వున్న చెట్టు కొమ్మని పట్టుకుంది.
కిందికి చూస్తే… లోయ. చీకటి. ఒళ్ళు ఝల్లుమంది. ఎంత అపాయం తప్పింది?!

మల్లిపురం జగదీశ్
మల్లిపురం జగదీశ్ గా రచనలు చేస్తున్న రచయిత పూర్తి పేరు మల్లిపురం జగదీశ్వర రావు. స్వస్థలంపార్వతీపురం మన్యం జిల్లాలో గల గుమ్మలక్ష్మీపురం మండలం లో “పి. ఆమిటి” అనే ఆదివాసీ గ్రామం. ఎం.ఏ (ఆంగ్లం), ఎం.ఏ (తెలుగు), బీ.ఈడీ విద్యార్హతలు. గిరిజన సంక్షేమ శాఖ లో గల కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల లో ఆంగ్ల సహోపాధ్యాయుడుగా పని చేస్తున్నారు.
అనేక కథల పోటీలలో వివిధ బహుమతులతో పాటు రంగినేని ఎల్లమ్మ స్మారక కథా పురస్కారం, సిరిసిల్ల (2012), మాడభూషి రంగాచారి స్మారక సాహిత్య పురస్కారం, హైదరాబాదు (2013), విమలాశాంతి సాహిత్య కథా పురస్కారం, అనంతపురం (2013), గిడుగు సాహిత్య పురస్కారం, భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ (2017), రాచకొండ విశ్వనాథ శాస్త్రి కథా పురస్కారం – 2024, ఉదయిని, హైదరాబాద్ మొదలైన అవార్డులు అందుకున్నారు.