ప్లాట్ఫార్మ్ చివరి అంచున
నేనూ బ్యాగులూ తానూ
ఏం గుర్నాధం?
ఇల్లు తాకట్టు పెట్టావని విన్నాను!
యూనివర్సిటీ ప్రకటన నవ్విస్తున్నా
ఒకటి నుంచి ఏడుకు వెళ్ళటం
ఎంత కష్టమైనా తప్పనిసరి పని.
కాలానిది ముఖమల్ స్పర్శ
చర్మం మీదినుంచి
అలా జారిపోతూనే ఉంటుంది
కళ్లముందు ఆగిన రైలు
కళ్ళముందే మలుపు లోకి
మళ్ళినట్లు
భౌతికం అంతా లోపలికి
కుచించుకు పోతూ
నిన్నటిదాకా
పెళ పెళ లాడిన ఇస్త్రీ చొక్కా మాదిరి
నీలగిన వొళ్లంతా
నానబెట్టిన మినప బద్దలా .
రెండున్నర మిల్లీగ్రాముల నుంచి
ఐదుకు ఎగ బాకుతుంది
బీపీ మాత్ర.
ఆకలిగా ఉంటుంది
పక్కనే కూర్చున్న నడివయస్కుడొకడు
మిట్ట మద్యాన్నపు ఎండకు
పచ్చబడ్డ కళ్ల రంగులో
మిస మిస లాడుతున్న
మామిడి పండుకు పీలర్ తో
తొక్కు తీస్తుంటాడు
బహుశా దాన్ని అతడు ఆమెకు
ముక్కలుగా కోసి పెట్టేస్తాడేమో !
జిల్లార్చుకు పోయిన
భూగర్భ జల మాదిరి
అట్టడుక్కి పోయిన లాలాజలం
లావాలా తన్నుకొచ్చే లోపు
డొక్కలో మోచేతి పోటు ఒకటి
ఇదుగో సుగరు మాత్ర ఏస్కొ
అరగంట తర్వాత జొన్న రొట్టె తినాలగా
అంటూ .. .. తను .
పది కిలోమీటర్లు సైకిలు తొక్కిన పిక్కలు
యాభై కేజీల బియ్యం మూటను
ఇట్టే ఇలు జేర్చిన భుజాలు
కాజాలుకుట్టే సూదిలోకి
లటుక్కున దారం దూర్చగలిగిన చూపు
వంద గ్రాముల కొబ్బరి నూనెను
ఆవురావురుమని ఆవిరిజేసే
నొక్కుల జుట్టు
అన్నీ కట్టగట్టుకుని
ఎటు వెళ్లిపోయాయో!?
పందుంపుల్ల తో
పరాచకాలాడ గలిగినవై ఉండీ
వైద్యుడి చేతికి ఆట బొమ్మలైన
పలువరసకేమైనదో!?
చేతక్ మీద
చెమ్మక చెల్లా అంటా ఆడినోడికి
ఇవాళ బెర్తు దొరకక పోతే
ప్రయాణం పేరాశే అయింది
*
పుల్లలు దెచ్చి
గూడుగట్టి, గుడ్లుబెట్టి
పొదిగి పిల్లల్ని జేసి
గింజలు సేకరించి
తెరిచిన నోళ్ళల్ల ఏసి
సాచుతున్న రెక్కల్ని
ముక్కులతో దువ్వి
వాటికాళ్ళ గోళ్ళ పట్టును సరిజేసి
తీరా అవి ఎగిరెళ్ళిపోయాక
ఎనక్కి చూసుకుంటే
మరచి పోయి వచ్చిన
జత నవ్వుల
విలువ కనబడుతోంది
వెళ్లిపోయిన రైలు
వెలకట్టిన జీవితపు భాగాన్ని
స్టీలు కుర్చీలో కూలేశాక
బతకు
మాత్రలకు మాత్రమే
రాసిచ్చిన విల్లు.
యుక్త వయస్కులారా
నన్నొకసారి చదవండి
కుంచెం జాగరత్త పడండి
మీకంటూ ఏవన్నా కొన్నిక్షణాలను అట్టే పెట్టుకోండి.
ఇది మెట్లెక్కే కాలం కూడా కాదు
ఎస్కలేటర్ కాలం
బతుకు నిచ్చెన మీద
పాదం సరిగా మోపండి
మీకోసమూ కొన్ని సందర్భాల పాటు
కొన్ని ఙ్ఞాపకాల పాటైనా బతకండి.
కోసూరి రవికుమార్
కోసూరి రవికుమార్, పల్నాడు వాసి , 90 ల నుంచీ కవిత్వం రాస్తున్నారు. కొన్ని సంస్థలలో ఒక దశాబ్ధం పాటు పనిచేశాను. "బొడ్డుపేగు, కాలం తెరలు", ఇప్పటి వరకూ తెచ్చిన ప్రచురణలు. నవంబర్ 24 లో "దాపల" కవితా సంపుటి తెస్తున్నారు. కధలు రాసే ప్రయత్నం లో ఇప్పటి వరకూ "కిటికీ చచ్చిపోయింది, నమ్మకం కోసం, నాగులేరు," ఇలా కొన్ని.
Good👍👍 nice poetry inka chala kavitalu menundi ravalani కోరుతు me abhimani.