పూల మీద మరికొంత వెలుగు చేరుకుంటున్నది
ఎండ సింగారంగా వాలుతున్నది
తేనెరంగు సూర్యుడు పూల మీద తుమ్మెదలా మెరుస్తున్నాడు
కొమ్మ చివర పూలగుంపులోంచి
తల బయటకు పెట్టి కోకిల కూస్తున్నది
నువ్వు నడిచెళ్లిన కాలువ ఒడ్డు
నీ పాదాల మెత్తదనానికి ఎర్రగా మారినది
నేను వచ్చే సరికే వసంతపు తొలిపూత రాలిపోయినది
మధువు కోసం రాలిన పూలను ఏరి
నీ కోసం తెద్దామనుకుంటే
కోకిల ఒంటరిగా మిగిలిపోతుందని ఆగిపోయాను
సూర్యుడు పూలలో కలిసిపోయి
కోకిల ఆదమరిచాక
పూలను రాగాలను తీసుకొని
నీ వద్దకు రాబోయాను
కాలువ ఒడ్డున నీళ్ళు పారాడుతున్నాయి
దారి చెదిరిపోయింది
దోసిల్లలో పూలు తేనై వేళ్ళ చివర జారిపోయాయి
పూల కోసం రాగాలు ఒంటరిగా మిగిలిపోయాయి.
