‘మీరిద్దరూ ఒక సారి వచ్చి రెండు రోజులు ఉండి పోతే బావుంటుంది. పరిస్థితి చేయి జారకముందే, మీరిద్దరూ, మేమిద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకుంటే, కొన్ని ప్రశ్నలకన్నా సమాధానం దొరుకుతుందని నా ఆశ. సాధ్యమయినంత త్వరగా వస్తారని ఆశిస్తున్నాను.’ ముక్తసరిగా మూడు వాక్యాల్లో ముగించిన వాట్సాప్ మెసేజ్ చూస్తూనే గుండె దడదడ కొట్టుకుంది నాకు.
‘సుభద్రా! ఏం చేస్తున్నావు?’ బలహీనంగా పిలిచాను.
వంట చేస్తున్న సుభద్ర పమిటకు చేతులు తుడుచుకుంటూ వచ్చింది ఏమైందంటూ.
సాధారణంగా ఫామిలీ గ్రూప్ లో పెట్టే వాట్సాప్ మెసేజ్ నాకొక్కడికే పెట్టాడు అల్లుడు గహన్. అమ్మాయికి కూడా ఈ మెసేజ్ పెట్టినట్టు తెలియదని నాకర్థమయింది.
మెసేజ్ చూపించాను సుభద్ర కు. మొహం లో ఏ భావం లేదు.
‘మాట్లాడవేం?’ రెట్టించాను.
‘గహన్ కాస్త ఓవర్ రియాక్షన్ చేస్తాడని తెలుసు కదా? ఏం కంగారు లేదు. దీపావళికి పోదాం. వాళ్లకు ఎలాగూ సెలవలు ఉండవు.’
కోపం నషాళానికి అంటింది నాకు.
‘నువ్వు నిమ్మకు నీరెత్తినట్లు నింపాదిగా కూర్చుంటే, అక్కడ దాని కాపురం కుప్ప కూలుతుంది. మనం ఎల్లుండి బయలుదేరుతున్నాం’. అని ఫ్లయిట్ టిక్కెట్ల కోసం బయటకు నడిచాను.
శనివారం ఫస్ట్ ఫ్లయిట్ లో హైదరాబాద్ నుండి బెంగళూరు చేరుకొని, ఓలా లో అమ్మాయి ఇంటికి చేరేటప్పటికి సుమారు పది గంటలయింది. సర్ప్రైజ్ విజిట్లు మానేసి ముందుగానే చెప్పేశాం వస్తున్నామని. కొంపతీసి వాళ్ళు ఉండకపోతే, కారిడార్ లో కూర్చోవలసి వస్తుందేమోనని నా భయం .
కాలింగ్ బజర్ కు తలుపు తీసిన సమీర మొహం లో ఏ టెన్షన్ లేదు.
‘అమ్మా’ అంటూ వాళ్ళమ్మను వాటేసుకుని, నేను వీపు నిమరాటానికి వీలుగా, దగ్గరగా వచ్చి నిలుచుంది. గదిలోనుంచి బయటకు వచ్చాడు గహన్. మొహం సంతోషంగా లేకపోయినా అంత సీరియస్ గానూ లేదు.
‘బాగున్నారా అత్తయ్యా?’ ఆపేక్షగా పలకరించాడు. అల్లుళ్లకు అత్తగారి మీద ఉన్న ప్రేమలో అయిదోవంతు మామగారి మీద ఉన్నాఅరవై దాటిన మగవాళ్ల బ్రతుకు ఇంత దుర్భరంగా ఉండేది కాదు.
వాళ్లిద్దరూ ఓ అయిదు నిముషాలు మాకెవ్వరికి అర్ధం కాని మరాఠీ అభంగుల విషయం మాట్లాడుకున్నారు.
నా మనసు మనసులో లేదు. పరిస్థితి అర్థం చేసుకోకపోతే, ఏం మాట్లాడాలో, ఎన్ని రోజులు అక్కడ ఉండాలో తెలియని పరిస్థితి.
కాఫీ తాగగానే అడిగాను. ‘మేము ఫ్లయిట్ లో బ్రేక్ఫాస్ట్ చేసే వచ్చాము. లంచ్ కి ఏమీ తొందర లేదు. మనం కూర్చుని మాట్లాడుకుందామా?’
‘మీరు మాట్లాడుతూ ఉండండి. నేను కుక్కర్ పెడతాను’. సమీర లేచి వెళ్లబోయింది. అమ్మాయి మొహం లో నాకు పరిచయం లేని ఏదో వెలుగు. మొగుడు ఇంత కోపంగా ఉంటే దానికా సంతోషం ఏమిటో నాకర్థం కాలేదు.
‘నువ్వు కూర్చో’ గొంతెత్తి అన్నాను.
‘రోజూ ఉండేదే నాన్నా’ మళ్ళీ లేవబోయింది.
‘ప్లీజ్ కూర్చో’. ఈ సారి కాస్త కోపంగానే అన్నాను. బుంగమూతి పెట్టి కూర్చుంది.
‘చెప్పు బాబూ! నీ అభిప్రాయాన్నీ, వచ్చిన అపోహాల్నీ పూర్తిగా చెప్పు. మనసు విప్పి మాట్లాడుకుంటేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది’.
సోఫాలో నిక్కరు, టీషర్ట్ వేసుకుని కూర్చున్న గహన్ కొంచెం ఇబ్బందిగా కదిలాడు.
‘ఒక విధంగా చూసుకుంటే మీకివి చిన్న విషయాలే అనిపించవచ్చు. నెల క్రితం మా అమ్మ వచ్చి నాలుగురోజులుండి వెళ్ళిపోతూ ‘నాన్నా నీకేమయినా తినాలనిపిస్తే వైజాగ్ రా’ అంటూ వెళ్ళింది’.
మనస్పర్థలు, అభిప్రాయభేదాలు అనుకుంటుంటే ఏమిటి ఇతగాడు తిండి విషయం మాట్లాడుతున్నాడు? అర్థం కాలేదు నాకు.
‘చెప్పు బాబూ. నేను నిన్ను ఆపను. నీ మనసులో ఉన్నది వివరంగా చెప్పు.’ అన్నాను.
గొంతు సవరించుకున్నాడు గహన్.
‘పొద్దున్న కాఫీ లో బాగా నురగ ఉండి, పైన కాస్త మీగడ ఉంటే బావుంటుంది. కాఫీ లో మీగడ ఏమిటి? ఛండాలంగా ‘ అంటూ ఒక్క బుడగ కూడా లేని కాఫీని కప్పులో ఇస్తుంది. ఆ ఇచ్చే కాఫీ ఏదో, చిన్న గ్లాసులో పోసి కింద ఒక పాత్ర పెడితే ఎంత బావుంటుంది? మీరు తాగే ఈ చల్లటి కాఫీ కి ఏమిటిదంతా అని దెప్పి పొడుస్తుంది’.
‘ఇంకా?’
‘బీరకాయ, పొట్లకాయ, సొరకాయ – నీరు ఉన్న ఏ కూరలన్నా పరమ అసహ్యం. ఎంతసేపూ క్యాలీఫ్లవర్, కాబ్బేజీ, బెండకాయ, వంకాయా’ అక్కసుగా అన్నాడు.
“పొట్లకాయలు లేతవి తెస్తే, ఫ్రిడ్జ్ లో పడి ఎండిపోయినాయి. ఆవ పెట్టిన పొట్లకాయ పెరుగు పచ్చడి పెళ్ళయాక నేను తినలేదు’. బాధగా అన్నాడు గహన్.
మ్రాన్పడిపోయాను నేను.
‘ఇంట్లో ఇంగువ, ఎండు మిరపకాయలు లేకపోతే చీమ కుట్టినట్లన్నా ఉండదు. జ్ఞాపకం ఉంటే తెప్పిస్తుంది. లేకపోతే అంతే. మా అమ్మ పంపిన పండ్ల చింతకాయ పచ్చడిని అవకాడో నూనెలో ఇంగువ, ఎండుమిరపకాయలు లేకుండా పోపు పెట్టింది. ఆ పచ్చడిని చూసిన మా ఏడు తరాలవాళ్ళూ గుడ్ల నీళ్లు కుక్కుకుని ఉంటారు.
అంత సీరియస్ గా మాట్లాడుతున్న గహన్ ని చూసి సుభద్ర అనవసరంగా పమిటతో మూతి తుడుచుకుంటున్నది. సమీర మోహంలో నవ్వు ఆగడం లేదు.
‘ఎన్నని చెప్పమంటారు మావయ్యగారూ? సేమ్యా పాయసం లో కిస్మిస్ వేయదు. ఆలూ బిర్యానీ లో పుదీనా ఉండదు. కొత్తిమీర లేకుండా చారు పెడుతుంది. పుట్నాల పప్పు లేకుండా ఇడ్లీ పచ్చడి. పులుసులో దోసకాయ ముక్కలు పడవు. పెరుగు మీద మీగడ తీసి సింకులో పడేస్తుంది. సాయంత్రం రొట్టెలు చేస్తే ఎప్పుడూ ఆ పాడు పన్నీరే. మొన్న చుక్కకూర పప్పు చేయమంటే, ఆ కట్టను విసిరి ఫ్రిడ్జిలో పారేసి చుక్కకూర, నక్కకూర నాకు డోకు అంటూ వాంతి చేసుకోబోయింది’.
‘ఇంకా?’
‘ఏమిటండీ? ఇంకా?, ఇంకా? ఇదేమన్నా ఎన్నికల మానిఫెస్టోనా? నేను చెప్పిన వాటిల్లో ఏమి మీరు తీర్చగలరు? టీవిలో తెలుగు ప్రోగ్రాం చూసి నెలలు గడిచి పోయినాయి. ఎప్ప్పుడు నెట్ఫ్లిక్. దాంట్లో కూడా తెలవని భాష సీరియళ్లు. పెళ్లయి దాదాపు రెండేళ్లు కావస్తున్నా, ఒక్కరోజు మీరు కానీ, అత్తయ్య కానీ గహన్ కు కావలసినవి అప్పుడప్పుడన్నా వండుతున్నావా? పోనీ అతనే వండినా పారేయకుండా తింటున్నావా అని అడిగారా? నువ్వులపొడి కలిపి పొట్లకాయ కూర చేసి టేబుల్ మీద పెడితే, లోపలినుంచి ఆవకాయ తెచ్చుకుని కూచుంది. తినమంటే, చేపమందు తిన్నట్లు, ఒక్క ముక్క తీసుకుని గొంతులో వేసుకుంది. చెప్పి చూడండి మావయ్య గారూ, ఎన్ని రోజులులిట్లా?’
కళ్ళలో నీళ్లు తుడుచుకున్నాను నేను. సింగల్ సీటర్ నుంచి లేచి వెళ్లి గహన్ పక్కన సోఫాలో కూర్చుని గట్టిగా అతని చెయ్యి పట్టుకున్నాను.
‘బాబూ! సమీరాకు ఇరవై ఎనిమిదేళ్లు. మా పెళ్లయి దాదాపు ముప్పై ఏళ్ళు కావస్తున్నది. మొదటినుంచి నాకు రకరకాల ఇండియన్ టిఫిన్లే బ్రేక్ఫాస్ట్. కానీ ఉప్మా, గారె, వడ, దోసె, పరాఠా ఇవేవీ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కి పనికి రావు బాబూ. గత ముప్పయ్ ఏళ్లలో కేవలం బ్రేక్ఫాస్ట్ కిందే దాదాపు ముప్పై వేల పైన ఇడ్లీలు తినుంటాను నేను. ఎప్పుడూ ఇడ్లిలు, ఇడ్లీలు. నీ కోరికలు చిన్నవని నీకనిపిస్తున్నాయి. మరి నేనెవరికీ చెప్పుకోను? దొండకాయ ఎప్పుడూ నిలువుగానే తరుగుతుంది. పాడయిపోయినా, ఎండిపోయినా,సర్వకాల సర్వావస్థలలో బీన్స్ కూరలో పాడు కొబ్బరి. దోసకాయ పప్పు అంటే కందిపప్పుతోనే. మొన్న షాపులో పెసరపప్పుని చూసి మసూర్ దాలా అంటే షాపువాడు ఫక్కున నవ్వాడు. కొన్ని వస్తువులను చూస్తే మా ఇంట్లో పూనకం వస్తుంది. అల్లం పచ్చడిలో చింతపండు, బెల్లం వెదికినా దొరకవు. అంతా అల్లమే. వంకాయ కూరలో అల్లం వేస్తే అల్లం లో వంకాయలు వేసినట్లు ఉంటుంది.
ఇంట్లో వారానికి, ఇద్దరు మనుషుల మధ్య వంద గ్రాముల ఇంగువ ఖర్చవుతుంది. సమీర ఇంగువ వాడదంటే కారణం ఈపాటికి నీకు అర్థం అయ్యుండాలి’.
‘ఇంకా?’ అడిగాడు గహన్.
‘కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందంటారు. బొబ్బట్ల మీద ఎప్పుడూ మైదా పిండీ, సాంబార్ లో కారట్ ముక్కలు, పరమాన్నామంటే సగ్గుబియ్యపు జావే. కాకరకాయ ఎప్పుడూ సెనగపిండి కారమే. మజ్జిగపులుసులో మజ్జిగ కనపడనంత బచ్చలికూర. చారులో బెల్లం. కందిపొడి, కారప్పొడిలో వెల్లుల్లిపాయలు. సబ్బు సగం కూడా అరగక ముందే కొత్త సబ్బు తీస్తుంది మీ అత్తయ్య. పాత సబ్బు పారేయడానికి మనసొప్పక నేను ఎప్పుడూ వాడేది పాత సబ్బే. సబ్బు కవరు చించి కొత్త సబ్బు వాసన చూడటానికి కూడా పెట్టి పుట్టాలేమో. చెబితే సిగ్గుగా ఉంటుంది. ఇంకా ఏం చెప్పమంటావు బాబూ’.
నా అరచేతిని తన అరచేతితో అదిమాడు గహన్.
‘కష్టాలు పంచుకుంటే, మనకు ముందులేని అవగాహన ఒక్కోసారి కలుగుతుంది. మనకు నచ్చినది లేకపోతే తెచ్చుకోవచ్చేమో కానీ నచ్చనిది బలవంతంగా రుద్దితే మన గతి ఏమిటి? నేను కాఫీ లో మీగడ వేసుకోవచ్చు. నూనె వేరేగా కాచి ఇంగువ వేసుకోవచ్చు. మరి మీరు? పొడుగు దొండకాయ ముక్క ఏం చేస్తే గుండ్రంగా అవుతుంది? దంచిన కారప్పొడి నుంచి వెల్లుల్లిని ఎవరు వేరు చేయగలరు? చారులో బెల్లం ఎలా పోతుంది?’ జాలిగా అన్నాడు గహన్.
కాసేపు ఊరుకుంటే, ‘చెట్టుమీద ఉన్న రెండు పక్షులు ఏమిటి? పరమాత్మ, ప్రత్యగాత్మ ల భేదం ఏమిటి?’ లాంటి ప్రశ్నలు వేసి గహన్ సన్యాసుల్లో కలుస్తాడనిపించింది.
‘మనిద్దరం బయటకు పోయి భోజనం చేద్దాం రా! ఏ సంకోచం లేకుండా కష్టసుఖాలు పంచుకునేందుకు ఇన్నాళ్లకు నువ్వు దొరికావు నాకు.’ అన్నాను.
మేమిద్దరం బయటకు నడుస్తుంటే
‘అమ్మాయికి కూడా ఏమి తిన్నా పడట్లేదు. దానికి అరిటాకులో ప్యాక్ చేసిన మసాలా దోసె కావాలట. వేడిగా తీసుకురండి’ సుభద్ర సంతోషంగా అంటుంటే నేను సంభ్రమంగా గహన్ కేసి చూసాను.
