ఆపద, అపప్రద చెప్పి వస్తాయిట్రా … పైవాడి కరుణ, భరించాల్సిందే …` అటూ ఇటూగా ఇవే అమ్మ మాటలు ` ఓ ఏడాది పాటు.
గతేడాది అమ్మకి నలత మొదలైంది. ఓ వారం తర్వాత కోలుకుంది.
అప్పుడే ఓ అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సుకి లండన్ వెళ్ళాల్సొచ్చింది నాకు. అమ్మ రానంది. మీరెళ్ళి హాయిగా తిరిగి రండ్రా, మధ్యలో నేనెందుకు.
మధ్యలో తనెందుకా. నాకు గుర్తెరిగి అమ్మ ఇలా మాట్లాడ్డం మొదటిసారి. పట్టించుకోనట్టే నువ్వూ రామ్మా, సరదాగా అన్నీ చూసిరావచ్చు, బాబిగాడికి కూడా బావుంటుంది అన్నాను. లేదులేరా అంది అమ్మ. అంతటితో ఆగిపోయిందా విషయం.
అమ్మకి ఇరవై రెండేళ్ళకే, డిగ్రీ పూర్తవుతూనే పెళ్ళి రెండేళ్ళకే నేను, ఆ తర్వాత నాలుగేళ్ళకే నాన్న పోయారు ` నాకేం గుర్తులేదు. అమ్మ మాత్రం సంగీత కచ్చేరీలు ఆపలేదు. నాన్నకిష్టంరా, అది చూసేకదా నన్ను చేసుకున్నారు అనేది. సుబ్బలక్ష్మిగారి కళ, ఆవిడ విద్యరా మీ అమ్మది అనేది అమ్మమ్మ.
అమ్మ సంగీతం నేర్పడమూ మానలేదు. రోజూ పదిమంది పిల్లలొచ్చేవారు ఇంటికి `
ఫ్రీగా చెప్పేది. రెండు మూడు హోంట్యూషన్స్, పెద్దవాళ్ళిళ్ళల్లో ` డబ్బులు బాగానే వచ్చేవి. నా మెడిసిన్ పూర్తయ్యాక ఎందుకమ్మా మానెయ్యచ్చు కదా అంటే కాలక్షేపంరా అంటూ నవ్వేసేది.
హోంట్యూషన్స్‌కి వెళ్ళొచ్చే రెండ్రోజులూ అమ్మ మరింత యాక్టివ్‌గా, అందంగా ఉండేది.
ఇద్దరు మేనమామలు, అమ్మమ్మ తప్ప మిగిలిన బంధువులకి అమ్మ కొంచెం దూరంగానే ఉండేది. నేను స్థిరపడ్డాక వచ్చిన దగ్గిర సంబంధాలని కచ్చితంగా తిప్పికొట్టింది అమ్మ. ఇంతలో నా ప్రేమ, అమ్మసంబరం, పెళ్ళి, బాబిగాడు ` అమ్మకి వాడితోనే కాలక్షేపం. ఇంట్లో సంగీతం క్లాసులు తగ్గిపోయాయి క్రమేణా.
పెరుగుతున్న వయసుతోబాటే అమ్మలో అదో వింత హుందాతనం, ఆనందం.
***
పెద్దాయన తెల్లని బట్టల్లో కూర్చునున్నారు మా హాస్పిటల్ స్పెషల్ స్వీట్ బెడ్‌మీద. కొంచెం హడావిడిగా ఉన్న గది కాస్సేపటికి ఖాళీ అయ్యింది.
చెప్పండి సర్ అన్నాను.
నెమ్మదిగా చెప్పారాయన. అప్పటిదాకా మొహాన్నిమెత్తిన రంగులకి చిరుచెమటలు, కళ్ళల్లో తడి.
ఒక్కసారి చూడచ్చా
అక్కడ పరిస్థితి అంతబాగాలేదు. ఆయన స్థాయికి, ఆ మెయింటెనెన్సుకి, దానికి పోలికలేదు.
ఎప్పటినుంచి సర్
సంవత్సరం పైమాటే
బాగా అశ్రద్ధచేశారు
శ్రద్ధ తీస్కోలేదు ` అందుకే మీ దగ్గరకి
ఫరవాలేదు, తగ్గిపోతుంది ` ఓ వారం ఉండాల్సొస్తుంది
మంచిది. అలాగైనా రెస్ట్ దొరుకుంతుంది ` మచ్ ఎవైటెడ్ బ్రేక్
ఏర్పాట్లన్నీ స్వీట్‌లోనే.
స్కాన్‌కి నీళ్ళు బాగా తాగాలి సర్
కష్టపడి ` నవ్వుకుంటూనే ` ఓ లీటరున్నర తాగారాయన.
ఇంతలో మేడం వచ్చారు.
ఇంకొంచెం తాగండి
ఇంకెన్ని తాగాలే .. తాగుతూనే ఉన్నా కదా.
కొద్దిగా దూరంగా జరిగి ఫోనోపెన్ చేశాన్నేను.
సార్, బ్లాడరేమన్నా ఫుల్లయినట్టుందా సార్ ` సఫారీ. తనెప్పుడూ ఆయన వెనకే.
లేదురా
ట్రైచెయ్యాలి సర్ ఇంకో బాటిలివ్వబోయి ఆగిపోయాడాయన.
ఇంతలో సిస్టర్ తొంగిచూసింది మొహంమీద క్వశ్చన్‌మార్కుతో.
ట్రై చేస్తున్నానమ్మా
ఇంకో పదినిముషాలు పడుతుంది సర్
ఆమాట ముందే చెప్పచ్చుకదా మేడమ్‌తో, మరో లీటర్ తాగుతూ.
పావుగంట. అరగంటైంది.
అసలు కదలికలేదమ్మా … తాగిన్నీళ్ళన్నీ ఏమైపోతున్నాయో.
ఉత్తప్పుడు నీళ్ళు తాగుతుండండీ అంటే వింటారా. అవయవాలన్నీ చెంబులూ గిన్నెలూ పట్టుకొని ఆవురావురుమని నిలబడుంటాయ్ లైన్లో ` ఈ ఎడారికి ఎన్నాళ్ళకి నీళ్ళొచ్చాయని. అవన్నీ నిండాక కదా తరువాయి ప్రయాణం అన్నారావిడ అర్థోక్తిగా
మరో పదినిముషాలకి రెడీ అన్నారాయన.
చేతిలో చిన్నప్లాస్టిక్ డబ్బాతో మనవాడు రెడీ.
ముందు స్కాన్‌సర్, ఆ తర్వాత శాంపులివ్వచ్చు అన్నాన్నేను.
స్కాన్ అయ్యింది.
డబ్బా తీసుకుని లోపలికెళ్ళారు.
బయటికొచ్చిన ఆయన ఓ ఎపిటోమ్ ఆఫ్ సెల్ఫ్ ఎంజాయ్‌మెంట్ ` కుడిచేతిలో ఖాళీ డబ్బా. నవ్వాపుకోలేకపోతున్నారు.
ఏమైందండీ
యూరిన్ శాంపిల్ తీస్కోవడం మర్చిపోయానే ` అప్పటికే పరిస్థితి చెయ్యిజారిపోయింది ` అన్నారాయన గంభీరంగా.
చేసేదేముంది, మళ్ళీ మొదలుపెట్టండి ` మనకేం కొత్తకాదుగా
ఈసారి త్వరగానే తయారయ్యారాయన.
మళ్ళీ రిటన్ రావద్దుసర్, అంతబాగుండదు ` బాటిల్ చేతిలోపెడుతూ సఫారీ.
విధివైచిత్రి ` మనం అనుకున్నది జరగదు, వద్దంటే ఆగదు ` తిరిగొస్తూ ఆయన ఫిలాసఫీ …
బాగా చదువుకొన్నారాయన ` పుస్తకాలూ, జీవితం కూడా. సామాన్య కుటుంబం నుంచి అనూహ్యంగా ఇంతెత్తుకెదిగారు. స్ఫురద్రూపి ` యాభైఆరు. ఎందుకిలా ` ఎలా ` అడుగుదామనుకుంటూనే ఆగిపోయాను. కుదరలేదు …
మూడోరోజు. ఇద్దరమే ఉన్నాం.
ఎప్పటిలాగే నీట్‌కట్ నారాయణస్వామిలా ఆయన ` ఈ హాస్పిటల్ బట్టలు నన్ను చంపేస్తాయయ్యా అంటూ.
మీరు నుంచి నువ్వు కొచ్చేశారు ` పెద్దాయన.
ఇదేదో యూత్‌ఫుల్ ఇన్‌డిస్క్రిషన్‌తో రాలేదయ్యా ..
అలా అని నేనెందుకనుకుంటాన్లెండి. నాలో నేను.
వళ్ళంతా నెప్పులు, చెప్పలేని బాధ. మా నాయనమ్మ అంటుండేది డాక్టర్‌గారితో, అప్పుడప్పుడూ గుండాగిపోతుందండీ అని. నవ్వుకుంటాంగానీ నిజమేనయ్యా. అది నెప్పీ మరోటీకాదు ` సలుపు ` జ్వరంలోనూ, ప్రేమలోనూ వచ్చేదదే. మా విషయంలో
ప్రేమతోనూ …
గ్రంధసాంగుడే అనుకొన్నాన్నేను..
***
రాత్రుళ్ళు నిద్రపట్టడంలేదు. అమ్మే గుర్తొస్తోంది.
ఆర్నెల్ల తర్వాత చూసిన ఆ అమ్మకి, అమ్మకి నక్కకి నాగలోకానికీ ఉన్నంతతేడా. అమ్మ ఇలాంటిదా, నన్ను కళ్ళలో పెట్టుకొని కాపాడుకొచ్చిన అమ్మ అసలు స్వరూపం ఇదా. ఇదా ఈవిడ వెలగబెట్టే వ్యవహారం సంగీతం క్లాసుల పేరిట. అడిగేవారెవ్వరూ లేరని అందరి నోళ్ళూ మూయించగలనని ఎంత అహం ఈవిడకి. అసలు నాన్న పోవడానికి కారణం కూడా ఈవిడేనేమో.
ఈవిడ ఆరోగ్యం ఇలా పాడవడమేమిటి, తనకోమాటైనా చెప్పకుండా ఆ వైద్యమేమిటి. చిన్నప్పుడు నాకు చిడుమో, గజ్జో వచ్చినప్పుడు అమ్మ మైలుతుత్తం పూయడం, ఆ మంట, తర్వాత డాక్టర్ తిట్లు బాగా గుర్తు. ఇప్పుడావిడకి మెర్క్యురీ …
లండన్ నుంచి తిరిగొచ్చేవరకూ నాకేవిషయం తెలియదు. అప్పటికి పరిస్థితి చెయ్యిజారిపోయింది. అనారోగ్యం అమ్మని తినేసింది. అంత చక్కటి అమ్మకూడా…
ఏంజరిగింది, ఎలా జరిగిందని అడగొద్దనుకుంటూనే ఎన్నిసార్లు అడిగినా మౌనమే సమాధానం ఆవిడది. మొండిది ` మొండిది కాబట్టే అంత భరించింది. అవునా ` ఏమో…
***
మీ సొంతూరేదయ్యా
చెప్పాను. మాదీ ఆవూరేనోయ్
అక్కడ ఎవరూ లేరుసర్. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ ఈ మధ్యనే పోయింది.
అయ్యో ` అమ్మకి చిన్నవయస్సే అయ్యుంటుంది.
అవును ` యాభై నాలుగే
ఎలా
.. హార్ట్‌స్ట్రోక్ … సర్
ఆయన ఓ క్షణం తలెత్తి చూశారు.
మరి ఇంట్లో ఎవరుంటారు
నేనూ, నా భార్య, బాబిగాడు
ఒకసారి ఇంటికి రావయ్యా, ఫ్యామిలీతో
అలాగేనండి` ఈ పెద్దపేషంట్ల తరహాయే ఇది. అనవసర ఆహ్వానాలు.
పెద్దాయన డిశ్చార్జ్ అయి ఇంటికెళ్ళిపోయారు …
అమ్మ సంవత్సరీకాలు దగ్గరకొస్తున్నాయి.
మాసికాలు పెట్టకపోతేపోనీ, కనీసం ఇవన్నా సరిగ్గా చెయ్యరా పుణ్యలోకాలకి పోతుంది
అమ్మ అంటూ మామయ్యలిద్దరూ ఎంత మొత్తుకున్నా కాదంటే కాదని భీష్మించుక్కూర్చున్నాను. ఏమాసికంరోజూ సరిగ్గా నిద్రపోయింది లేదు నేను.
ఓ రోజు పెద్దాయనే ఫోన్‌చేశారు స్వయంగా.
ఏమయ్యా మర్చిపోయినట్టున్నావ్
అబ్బే లేదండి, మీరెలా ఉన్నారు
బావున్నానయ్యా ` బాగా తగ్గింది
సర్
ఇంటికెప్పుడొస్తున్నావయ్యా … ఈ ఆదివారం వచ్చెయ్, లంచ్‌కి, పిల్లల్లి తీసుకురా
నసిగాను.
వచ్చెయ్యవయ్యా, బండిపంపిస్తాను. ఫోన్ పెట్టేశారాయన.
సరిగ్గా పన్నెండుగంటలకే కారొచ్చింది, పర్సనల్ వెహికిల్ అనుకుంటా.
పెద్దకాంపౌండు, వందిమాగధులు, దాటాక చిన్నకాంపౌండు. మంది పలుచబడ్డారు. సఫారీలు తగ్గి తెల్లడ్రస్సులు పెరిగాయి.
కారాగేసరికి ఎదురొచ్చారు దంపతులిద్దరూ. ముగ్గురం దిగాం.
నమస్కారం పెట్టగానే హగ్ చేసుకున్నారాయన.
నాక్కొంచెం గందరగోళంగానే ఉంది. ఆయనేమిటి, ఎదుర్రావడమేమిటి, అసలు గుర్తుపెట్టుకుని మళ్ళీ పిలవడమేమిటి.
భోజనం చాలా బావుంది. కొసరికొసరి తినిపించారిద్దరూ, శాకాహారమే అంతా అంటూ.
మేమిద్దరం కూడా ` గత పదహారేళ్ళుగా ` అన్నారావిడ నవ్వుతూ, ఆయన్నే చూస్తూ. ఆవిడ భుజంమీద ఆయన చెయ్యి.
కాస్సేపు కబుర్లు చెప్పుకుందాం రావయ్యా అంటూ తన ప్రైవేట్ రూంకి తీసుకెళ్ళారాయన. గది చాలా పెద్దది. సింపుల్‌గా ఉంది.
ఒక పక్క పెద్ద పుస్తకాల అర.
రిలాక్సవవయ్యా ` ఇదేమీ నా ఆఫీసుకాదు
కొందరిమీద మనం తొందరపడి ఓ నిర్ణయానికొచ్చేస్తామయ్యా. వాళ్ళ మంచీచెడుల్ని మనమే నిర్ణయించేస్తాం ` మన ఇష్టాయిష్టాలమీద బేరీజు వేసి, బుద్ధి చెప్పేసింది కదాని. మధ్యలో దయా, జాలీ పేరుతో మసకబారిన అద్దాల్ని మొహమాటంతో తుడుచుకుని మళ్ళీ మనోఫలకాలకి పరువుప్రతిష్టల్తో సందులేకుండా బిగించేస్తాం. ఆ పక్కవారిమీద మనం చల్లిందే కాంతి ` వాళ్ళెవరికీ సొంతంగా వెలిగే సత్తా ఉండదు ` ఉండకూడదు ` మనదే సమదృష్టి.
ఒక్కసారి మన విలువల వలువలు విసిరేసి
తడుముకుంటే గతుకుల వెల్లువే ` మదిలో, హృదిలో, మేనంతా …
ఒకరిని జడ్జ్ చెయ్యడానికి మనమెవ్వరమయ్యా, మన తాహతేమిటి. అప్పటిదాకా ఆరాధ్యదైవాలయినవాళ్ళు రాత్రికి రాత్రే అపరదయ్యాలా, నిన్నటిదాకా చెట్టాపట్టాలేసుకు తిరిగిన మనుషులు తెల్లారేసరికి బద్ధవిరోధులా.
ఒక్కక్షణంలో ప్రేమానురాగాల్ని పక్కకు తోసి మనిషిని పెడదారిపట్టించే ఆ మూర్ఖత్వానికి ఎన్ని ముద్దుపేర్లున్నా అది శూన్యసదృశమే.
ఆయన ఎటోచూస్తూ మాట్లాడుతున్నారు. వరండాకి మారాం ఇద్దరం.
కలపమన్నదెవరు, విడదీయమన్నదెవరు.
హాయిగా ఎగిరే సరళరేఖల్ని బలవంతంగా లాక్కొచ్చి, ఆశపడి వంగి ఒకటైనవాటిని ఒక్కసారిగా విరిచేస్తే ఆ మూగవెతమోయగల చెవులేవి…
నీకు తెలుసు ` ఈ రాజకీయాల్లోకి రాకముందు నేనో టీచర్ని ` సర్వస్వతంత్రుణ్ణి అనుకొనేవాణ్ని. అనుకోకుండా వచ్చిన అవకాశమిది `, అందిపుచ్చుకున్నాను. దానికంటే ముఖ్యమైనది ప్రేమనీ, దాన్ని మిస్సవుతానేమోనన్న భయం లోపలున్నా, తెచ్చిపెట్టుకున్న ధీమాతో నన్ను నేను ఏమార్చుకొన్నాను … తనకప్పుడే తెలుసు ` నేనెప్పటికీ దిగలేని బైపాసెక్కేశానని. చిరునవ్వుదే చివరి చెయ్యూపు …
ఓ సాంస్కృతిక సభలో కనబడిరది సుమారు రెండు దశాబ్దాల తర్వాత ఆ సాయంకాలం
తను. అదే రూపం. అదే మార్దవం. సభ పూర్తవగానే తలొంచుకుని తప్పించుకుపోవడం నేను గమనించలేదనుకొంది.
ఏదీ ఎవరిచేతిలో ఉండదయ్యా. మళ్ళీకలిశాం త్వరలోనో కొద్ది రోజుల్లోనే. కలుస్తూనే ఉన్నాం అప్పుడప్పుడూ ` నీడనో, చీకటినో ` కాదు ` ఆమె వెలుగులో.
స్వార్థం ఎక్కువనాకు. పరువూ, ప్రతిష్టా, చుట్టుపక్కలవాళ్ళూ ` ఇవి ముఖ్యం నాకు ఆమెకంటే. ఈ విషయం ఆమెకీ తెలుసు. అయినా తను నన్ను నన్నుగా కోరుకోవడం మానలేదు ` ఆమెవల్ల కాలేదు ` అదీ నేనందించగల పార్శ్వలేశంమటుకే. దానికే ఆమె తలమునకలయ్యేది ఆనందంతో …!
సర్, ఓ మాటడగనా
అడగవయ్యా, ఈపూట నన్ను నేను పూర్తిగా విప్పేసుకోనీ
మీ తొలిపరిచయం…
కాలేజీ యూనియన్ ఎలక్షన్లలో … నేను మంచివాడిలా కన్పించానట. తను వేసి మరో పదిమందికి చెప్పి వేయించిందావిడ ఓట్లు ` కనీసం ముఖపరిచయం లేకపోయినా. దసరా శెలవులకి ఇద్దరం ఇళ్ళకెళ్ళాం, ఒకే రైల్లో
తరువాత…
ఆ శెలవుల్లోనే మా అమ్మ చనిపోయింది. అప్పటికేమీకాని ఆమె ఆ పదిరోజులూ తనే
దగ్గరుండి అన్నీ చూసుకుంది. ఎన్ని కనుబొమ్మలెగిరాయో ` తనేంపట్టించుకొనేది కాదు
అంతేనా అనకుండా ఉండాల్సింది.
అంతేనా ` అది ఓ పదేళ్ళ పరిచయం పెట్టు…
చివరిసారిగా మీరామెని ఎప్పుడు …
ఆమె పెళ్ళిలో …
తర్వాత అంతా మారిపోయింది ` త్వరత్వరగా ` పెళ్ళి, పిల్లలు, ఎలక్షన్లు. పదవులు.
ఆమె మళ్ళీ ఆ సాయంత్రం కనబడేవరకూ `
కొంచెం అర్జంటయ్యా …` దూరంగా తచ్చాడుతున్న ఓ తెల్లడ్రస్సాయన.
ఒక్క నిముషం వెళ్ళినాయన పది నిముషాలకొచ్చారు.
ఈయన నాకెందుకు ఇన్ని విషయాలు చెప్తున్నట్టు. ఏంకావాలని .. అవును అమ్మెందుకు చెప్పుకోలేకపోయింది ` నేను వినడంలో తేడానా.
అమ్మ పర్సనల్ విషయాలేం మాట్లాడేదికాదు. ఏముంటాయి కనుక ఆవిడకి. తనకు నేనూ, నాకు తనూ. ఆవిడకో మనసుంది, దానికీ ఆలోచనలుంటాయి, ఆవిడకంటూ ఓ జీవితముంది ` ఆ విషయమే తట్టలేదు నాకెప్పుడూ ` కాదు కన్వీనియంట్‌గా
స్కిప్‌చేశాను.
అయినా అమ్మ ఏంచేసినా అది నా మంచికే. అది ఆవిడ నైజం ` అది నాకంటదు. ఉదయాలూ, సాయంత్రాలూ లేవావిడకి ` అన్నీ గౌరవ పనిగంటలే ` ఆవిడకామాత్రం పరుగు మామూలే. ఆమెమీద ఇదెవరో రుద్దింది కాదు ` తనే మీదేసుకుందావిడ ` స్వచ్ఛందంగా. అదామె బాధ్యత. భర్తని పోగొట్టుకొన్న ఓ భార్య కనీస బాధ్యత. తన కొడుక్కి తనే ఆసరా, బాసట ` బట్ నాట్ వాయిస్ వెర్‌సా!
ఇంకో విషయం ` తను మళ్ళీ పెళ్ళిచేసుకోవచ్చనే ఆలోచన ఆమెకి రాకపోవడం ఆవిడ సంస్కారం. దానికి కారణం ఆమె పుట్టి, పెరిగి, మీదేసుకు మోస్తున్న ఈ వ్యవస్థ.
అలాగని నేనేమన్నా తక్కువేచేశానా ఆమెకి. నాకేకాదు అందరికీ ఆమె తల్లోనాలుక. ఇంట్లో కిందపడ్డ పుల్లతీసి పైనపెట్టే అవసరం లేదావిడకి.
నేనింత చేసినా ఆవిడ చేసిందేమిటి ` తలుచుకొంటే వళ్ళు జలదరిస్తోంది. అందుకే `
తల్లి మనసులో ముక్కలు కొన్ని కొడుకుని తాకకూడదు ` అందునా తండ్రిలేని తల్లి. కళ్ళు, చెవులు మూసుకొనే అగత్యంకూడా రావచ్చు ` విల్లింగ్ సస్పెన్షన్ ఆఫ్ సెన్సెస్ …
భుజంమీద పెద్దాయన చెయ్యి.
ఏదో ఆలోచనలో ఉన్నావ్
అమ్మ గుర్తొచ్చింది ` మీరు మధ్యలో ఆపారు
చివరికొచ్చేశాను…
ఏమిటీ అతన్ని కూర్చోబెట్టి సలిపేస్తున్నారు అంటూ మేడమ్ వచ్చారు. వెనకే బాబిగాడూ…
అబ్బే ఏంలేదు …
ఆమాత్రం సలపరాలు మాకూ ఉంటాయి. మీకు ఈయన దొరికాడు పంచుకోడానికి … రండి టీ తాగుదాం అన్నారావిడ.
ఇద్దరం లేచాం.
పెద్దాయన మాటలు చెవిలో మార్మోగుతూనే ఉన్నాయి …
ఆ రోజు ఆమె పారిటాకులా ఎగిరొచ్చింది ` వేళకాని వేళలో.
విలవిల్లాడుతోంది. చెప్పి చేతిలో చెయ్యేయించుకుంది.
ఆ ఒక్కటే ఆమె జీవితంలో నన్నడిగింది. చేశానయ్యా …
ఓ పక్షం తర్వాత ఆమె ఆనందం నేనూ పంచుకున్నాను ` ఆమె ఎంతచెప్పినా వినకుండా …
అది యూత్‌ఫుల్ ఇన్‌డిస్క్రిషన్ కానేకాదు …
ఎదురుగా `
నేను లండన్ వెళ్ళే ముందురోజు పేపరు చూస్తూ అమ్మ ` చదివిందే చదువుతూ, నొసలు మీద వేలు మీటుకుంటూ, జారిపోతున్న కళ్ళద్దాల్ని పైకి తోసుకుంటూ.
ఇద్దరు సీరియల్ రేపిస్టులు పోలీసు కాల్పుల్లో హతం. పేపరు పక్కనపెట్టి హడావిడిగా బయటకు బయల్దేరిన అమ్మ …
అమ్మ సంవత్సరీకాల్లో మా పెద్దాయన …
***
