ప్రపంచంలోని కాలాలను, ఎల్లలను పక్కన పెట్టండి. అసలు వివిధ కాలాల్లో కవులు, రచయితలు ఎందుకు రాస్తూ వస్తున్నారు? ఎందుకింత సాహిత్య సృజన జరిగింది?
పాతకాలంలో రాజుల మెప్పు పొందటానికో, నజరానాలకో, అగ్రహారాలకు ఆశపడో రాశారా? లేక పోతన మాదిరి ఇమ్మను జేశ్వరాధములు అనుకుంటూ తాము ఇష్టపడే భగవంతుడి కోసం ఘంటాలను చేతపట్టారా?
ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక కవులు, రచయితలు సాహిత్య సృజన కోసం వేల లక్షల గంటల కాలాన్ని, శ్రమను ఎందుకు వెచ్చిస్తున్నారు? అసలు ఎవరూ ఏమి రాయకపోతే ఈ ప్రపంచ గమనం ఆగిపోయేదా?
రేయింబవళ్లు కాయకష్టం చేయకుంటే పూట గడవని స్థితిలో ఇప్పటికీ సామాన్యుడు కొట్టుమిట్టాడుతున్నాడు. సాహిత్యం చదవటానికి, అవగాహన చేసుకోవటానికి,ఆనందించటానికి అభిరుచి కావాలి. తీరుబడి చిక్కాలి. ఆర్థిక పరిస్థితులు కలిసి రావాలి. అక్షరాస్యత తోడవ్వాలి. ఇన్నీ జత కలిస్తేనే ఎవరైనా పుస్తకం చేతిలోకి తీసుకునేది.
ఇంత ఆధునికులం, అక్షరాస్యులం అనుకుంటున్న మనలో మాత్రం పుస్తకాలు పట్టుమని పది నిమిషాలు చదువుతున్న వారెంతమంది అంటే పెద్దగా లెక్కల జోలికి వెళ్లక్కర్లేదు.
ఒకప్పుడు, వేయి, రెండువేల కాపీలు ప్రింట్ చేసేవారు. ఇప్పుడు ఈ సంఖ్య మరీ దిగజారి రెండొందలకు స్థిరపడింది. ఇవి కూడా అమ్ముడవుతాయన్న గ్యారంటీ లేదు. ఒక్క తెలుగు నేలపైనే సాహిత్యం చదివే వారి సంఖ్య ఎంత ఘనంగా ఉందో ఈ లెక్కలే చెబుతున్నాయి.
ఈ మధ్య కాలంలో ఒక తెలుగు పుస్తకం 50 వేల కాపీలు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. ఇదేదో అరుదైన సందర్భమే. ఆ ఇతివృత్తం ఈ తరపు నవయువ పాఠకులకు పట్టి ఉండవచ్చు. దానికి తోడు సోషల్ మీడియా మార్కెటింగ్ టెక్నిక్కులూ కలసి వచ్చి వుంటాయి. అదే రచయిత మరో థీమ్‍తో మరో పుస్తకం రాస్తే ఇదే విజయం సాధించగలరని చెప్పలేం.
ఇక్కడ చర్చంతా-ఎంతమంది చదువుతున్నారన్నది కాదు. చదువరులు లేకున్నా ఎందుకు ఇంతమంది అంతగా టైము తగలేసి రాస్తున్నారు? డబ్బు వెచ్చించి అచ్చేసుకుంటున్నారు?ప్రతికూల ఫలితం ముందే సిద్ధంగా ఉన్నా రచయిత ఎందుకు నిర్విరామంగా రాస్తున్నాడు?
మానసిక ఆనందమా?అచ్చులో పేరు చూసుకోవాలన్న ముచ్చటా? బంధుమిత్రుల,పాఠకుల మెప్పు కోసమా? పోటీలో బహుమతులు గెలుచుకోవడమా? పారితోషికమా? ఇప్పుడు ఒకటి రెండు పత్రికలు మినహా ఎవరూ రచనలకు పారితోషికాలు ఇవ్వడం లేదు. రచన అచ్చేయడమే గొప్ప, ఇంకా డబ్బులు కూడానా?అనే రోజులు ఇవి.
అన్యాయాన్ని ప్రశ్నించాలి, సమాజంలో పరిస్థితుల్ని మార్చాలి అనే ఆవేశమా? నమ్మిన సిద్ధాంతాన్ని నలుగురికీ మీదైన పంథాలో చేర్చి వారిని చైతన్యవంతుల్ని చేయాలన్న సదుద్దేశమా?
వీటిలో ఒకటికి మించిన కారణాలే చాలమందికి ఉండొచ్చు. అచ్చులో పేరు, అభినందనలూ, గుర్తింపులూ -నిజానికి ఇవన్నీ ఏదో ఒక దశలో బోర్ కొట్టవచ్చు. అది శాశ్వత ప్రేరణ కాకపోవచ్చు. సిద్ధాంతాలూ కమిట్ మెంట్ లూ కూడా వయసుతో పాటో, ఆలోచనల్లో మార్పుతోటో రూటు మార్చుకోవచ్చు.
మనమనుకుంటున్న ప్రేరణలు, ప్రోత్సాహలు చాలామటుకు ఏదో ఒక దశలో ఫేడవుట్ అయ్యేవే. ప్రతి రచయితకూ తాత్కాలికంగానైనా ఒకానొక వైరాగ్య స్థితి వచ్చి ఉంటుంది. ఏ ఫలాపేక్ష లేకుండా నిర్విరామంగా ఏళ్ల తరబడి రచనలు చేస్తూ వస్తున్నవారికి చోదక శక్తి వేరే ఏదో తప్పక ఉండి ఉండాలి.
నా మటుకు నాకు రాయటమొక్కటే రససిద్ధినిస్తుంది.అచ్చుకావడమూ,అభినందనలూ,అభిప్రాయాలూ అన్నీ దానిముందు దిగదుడుపు వ్యవహారాలే.
విత్తనంలో నిద్రాణంగా ఉన్న జీవం అనువైన వేళలో పురుడు పోసుకుని మొలకెత్తే ప్రయత్నంలో చాలా ప్రయాస పడుతుంది. శక్తి కూడదీసుకుని,భూమిని చీల్చుకుని లేలేత కాండం వేళ్ళతో ,ఆకుల హస్తాలతో వెలుగులు చూడాలని ఎంతగా ఆరాటపడుతుందో!
సరిగ్గా, రచయిత బుర్రలో ఎప్పుడో నాటుకున్న ఆలోచన కూడా ఇదే మార్గంలో ముందుకు సాగి రచనగా ఊపిరి పోసుకుంటుంది. ప్రతి విత్తనమూ మొలకెత్తకపోవచ్చు. ప్రతి ఆలోచనా రచనగా మారకపోవచ్చు.
మెదడనే కమాండ్ కంట్రోల్ నుంచి ఆలోచనల ధార ఉరకలెత్తుతూ వేలి కొసల నుంచి కాగితంపై జాలువారటంలోని మహదానందం రచయితలకొక్కరికే సొంతమేమోననిపిస్తుంది.
జానపదుడి కాయకష్టంలో నుంచి,ఆట విడుపుల్లోంచి పుట్టుకొచ్చిన పాటకూ ఊపిరి పోసిన అంతఃసూత్రమూ ఇదే కదా!
తానే ప్రాణం పోసిన పాత్రలు,రూపుదిద్దిన ఘట్టాలు, సృష్టికి ప్రతిసృష్టి చేస్తూ కళ్ల ముందు కదలాడుతుంటే,రచయిత శివమెత్తడా?
ఒకటనుకుని రచనాప్రయాణం మొదలెడతాం. మధ్యలో దారులు మారతాయి. గమ్యస్థానాలు మారతాయి. పరిస్థితి పూర్తిగా రచయిత చేజారిపోతుంది. తాను సృష్టించిన పాత్రే తనకంటే ఎదిగిపోయి విశ్వరూప సాక్షాత్కారమిస్తుంది. ఆయా పాత్రలే రైలింజన్ మాదిరి, రచయితను ముందుకు లాక్కెళతాయి.అప్పుడు రచయిత నిజంగా నిస్సహాయుడు. కానీ నిస్సహాయతలోనూ అనిర్వచనీయ ఆనందం.
చిన్నప్పుడు బుడిబుడి నడకలు నేర్పించిన బిడ్డడే తండ్రికి ఆలంబనయి చేయి ఊతం ఇచ్చి నడిపించినట్టు తాను సృష్టించిన పాత్రలే దారిదీపాలవుతాయి. ఆ పాత్రలే కన్నబిడ్డలుగా ఎదిగి గుండె నిండా మేమున్నామంటూ గంపెడంత భరోసానిస్తాయి.
నవమాసాలు మోసి జన్మనిచ్చి బిడ్డను తొలిసారి చూసుకుంటున్న అమ్మ అనుభూతిని ప్రతి రచనలోనూ రచయిత పొందుతాడు.
అంతరాంతరాల్లోకి తొంగి చూసుకుంటే – ఈ ఆనందాల కోసమే రచయితలు,కవులు కలం విడిచిపెట్టకుండా రాస్తున్నారనుకుంటాను.
రాయటంలో ఇంతకు ముంచి అర్థం పరమార్థం మరేముంటుంది?
మీ మానాన మీరు యోగముద్ర దాల్చి ఊహల లోకాల్లో విహరించి రాస్తుండండి.
రాయడం మాత్రం ఎన్నడూ మానకండి.
రచయితలూ! జిందాబాద్!
* * *
