అతి చిన్న కథ, లోకేషన్‌కూడా ఒకే చిన్న ఊరు, మార్కెట్ ఉన్న నటులు కూడా లేరు. అయినా 20 కోట్లు వసూలు చేసింది వాళై (వాజ్హై) మారిసెల్వరాజ్ సినీ కెరీర్‌లోనే బెస్ట్ సినిమా అని చెప్పుకునే స్థాయిలో ప్రశంసలందుకుంది. ఇంతకీ అంతగా ఏముందీ సినిమాలో??
ఒక చిన్న ఊరు. ఆ ఊళ్లో శివనంద అనే ఓ పిల్లాడు, వాడికి శేఖర్ అనే ఓ స్నేహితుడు. ఇద్దరూ చదువుకునే పిల్లలే అయినా సెలవుల్లో పని చేయాలి, ఆ ఊరి చుట్టూ ఉన్న అరటితోటల్లో గెలలు మోయటానికి పోవాలి. ఆ పని శివనందకి నచ్చదు. అయినా చేయాల్సిందే. కమ్యూనిస్టు భావజాలంతో నాన్న హత్యచేయబడ్డాడు. చిన్నచిన్న అప్పులు, వాటిని తీర్చటానికి అమ్మా, అక్కతో పాటుగా వీడూ పనికి వెళ్లాలి.
ఎప్పటికప్పుడు ఆ గెలలు మోసే పని తప్పించుకోవాలనే అనుకుంటాడు. స్కూల్లో టీచర్ మీద చాలా ఇష్టంగా ఉంటాడు. తన అమ్మలోనూ, అక్కలోనూ తను చూడాలనుకునే ప్రత్యేకతని ఆమెలో చూస్తాడు. అది ప్రేమా? అంటే ప్రేమే కానీ అందులో ఏ వికారమూ లేని ప్రేమ. టీచరంటే వాడికి ఓ దేవదూతలా కనిపిస్తుంది.అందమైన ఊరు, అరటితోటలూ, 90లనాటి పల్లెటూరి వాతావరనాన్ని చూసిన ప్రతీ మనిషినీ కథలోకి లాక్కుపోయే కెమెరా పనితనం, కనిపించే ప్రతీ ఫ్రేమ్ మనల్ని అరటితోటలు ఎక్కువగా ఉండే దక్షిణతమిళనాడుకు తీసుకుపోతుంది.
అమ్మతో తన్నులు, గెలలు మోసే పని తప్పించుకోవటానికి చేసే పనులు, అక్క చూపించే ఆప్యాయత, ఆమెకి ఇష్టమైన అబ్బాయితో పెళ్లైతే బాగుండన్న కోరిక, నాన్న వదిలిపోయిన సుత్తీకొడవలిమీదా, అంబేద్కర్ మీదా వల్లమాలిన నమ్మకం ఉన్న శివనంద కథ ఇది. పిల్లవాడే లీడ్‌రోల్ కానీ ఇది పిల్లల సినిమా కాదు. ఈ దేశపు శ్రమదోపిడీని, వివక్షనీ మూలాలనుంచీ చూపించిన కథ. 1990ల నాటి విషాదకర ఘటననుంచి రాసుకున్న కథ. చక్కగా సాగుతూ సాగుతూనే, ఎన్నెన్నో విషయాలను అరటిపండు వొలిచినట్టు చెబుతూనే, గుండెలు పగిలే విషాదంతో కథ ముగియటం మనల్ని ఊపిరాడనివ్వదు. ఆ సంఘటన నిజంగా జరిగిందే అని తెలిసినప్పుడు మరింత దుఃఖం కలగకా మానదు.
1990లలో తమిళనాడులోని ఒక గ్రామంలో కొన్నేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను నిర్మించారు. అరటిపండ్ల వ్యాపారంతో ముడిపడిన గ్రామీణ కూలీల జీవన నేపథ్యానికి సంబంధించిన కథ ఇది. పేదరికంతో కూలీలు పడే అవస్థలు, కాంట్రాక్టర్ల ధోరణి, పేదరికం కారణంగా చదువుకు దూరమవుతున్న పిల్లలు, మొదలైన అంశాలను చాలా సహజంగా తెరమీదికి తెచ్చారు. అంబేద్కర్, మార్క్స్‌లని మరిచిపోకుండా అనుసరించే మారి సెల్వరాజ్ తనగత సినిమాలలాగే ఈ సినిమాలోనూ వదల్లేదు.
మనం శివనందని చూస్తూనే ఉంటాం కానీ సబ్‌ప్లాట్‌లో మరో విషయం నడుస్తూ ఉంటుంది. అరటితోటల యజమానికీ ఆ దోపిడీని ప్రశ్నించే కలై అనే యువకుడికీ మధ్య. రూపాయి కూలీ పెంచమన్నందుకు. తామెంత మూల్యం చెల్లించాల్సిన మూల్యపు లెక్కని, దోపిడీ సమాజపు తీరునీ సుష్పష్టంగా చెప్పిన తీరుకి మారి సెల్వరాజ్‌కి సెల్యూట్ చెప్పాల్సిందే.
నిజానికి యాభై శాతానికి పైగా క్రెడిట్ నటులకు ఇవ్వాలి. మిగతా యాభై శాతంలో దర్శకుడూ, కెమెరా మిగతా టెక్నికల్‌టీమ్ వస్తారు. ఇంత మాటన్నందుకు నా మీద కోపం రావచ్చుగానీ ఒకసారి సినిమా చూశాక ఇలా ఎందుకన్నానో మీకూ అర్థమవుతుంది.
కలయరసన్ స్క్రీన్‌టైమ్ ఎక్కువ లేనప్పటికీ అతి ముఖ్యమైన పాత్రని అంతే బాధ్యతగా చేశాడు. ఆ పాత్రని మనం ఎప్పటికీ మర్చిపోలేం. శివనందగా చేసిన కుర్రాదు పొన్‌వేళ్, అతని స్నేహితుడు శేఖర్‌గా కనిపించే రాగుల్, టీచర్‌గా కనిపించే నిఖిలా విమల్, శివ అక్కగా కనిపించే దివ్య దొరైసామి ఇలా ప్రతీ పాత్రా నిజమైందా అన్నంతగా పాత్రల్లో ఇమిడిపోయారు. కాస్ట్యూమ్‌స్, మేకప్ విషయంలో ఎక్కడా చిన్న లోపం కూడా కనిపించకుండా పని చేశారు.
టెక్నికల్‌గా, మారి సెల్వరాజ్ ఒక ఎత్తైతే సినిమాటోగ్రాఫర్ థెని ఈశ్వర్ మరోస్థాయికి తీసుకువెళ్లాడు.
సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్. OTT కోసం తెలుగులో డబ్ చేసినా పాటలను మాత్రం తమిళ్‌లోనే ఉంచటం బాగుంది. అందునా “మంజల్పూసుమ్ మంజల్పూసుమ్ వాంచిప్ పూంకోడి”, “తుత్తువజియలై అరైచు” లాంటి తమిళ జానపదాలని తీసుకోవటం మరింత ప్లస్ అయ్యింది.
సినిమాని చూడాలనుకుంటే మాత్రం, పూర్తి సమయం తీసుకొని జస్ట్ టైమ్‌పాస్ అన్నట్టుగా కాకుండా కూచోండి, ఈ సినిమా మీరు మర్చిపోలేని ఆనందాన్ని, విషాదాన్ని కూడా తెచ్చి మనసులో ముద్ర వేస్తుంది.
సినిమా చూడాలనుకుంటే… డిస్నీహాట్‌స్టార్‌లో ఉంది.

Good
Dr. B. R. Ambedkar thought is helpful to the world