ఉదయిని పత్రిక (అక్టోబర్, 2024) లో వచ్చిన జయమోహన్ కథ ( తమిళ కథకు తెలుగు అనువాదం : శ్రీనివాస్ తెప్పల) ‘మాయామోహం’ చదివి గొప్ప సారస్వత పారవశ్య అనుభూతికి లోనయ్యాను – అది చూడడం, ఇది వినడం ఒక మధురమైన అనుభవం అంటారు కదా – అలా ఈ కథ చదవడం కూడా ఒక అనుభవం నాకు. అల్లం శేషగిరిరావు ‘చీకటి’ కథ చదివినప్పటి అనుభవం లాంటిది. ఒక రచన చదివాక చాలా రోజులవరకూ ఇంకేం చదవబుద్ది అనిపించని స్థితి.
ఈ కథతో ఆ కథ పోలిక ‘గాఢమైన అనుభూతి’ కి సంబంధించినది మాత్రమే. అయితే గమ్మత్తుగా ఈ ‘మాయామోహం’ కథలోని సారాయి తయారుచేసే నేసైయన్ పాత్ర ‘చీకటి’ కథలోని ‘డిబిరిగాడి’ పాత్రను గుర్తుచేస్తే, ఈ కథలోని నేసైయన్ తండ్రి ‘సూసై’ కూడా డిబిరిగాడి తండ్రి లాగానే పోలిస్ స్టేషనులో రాత్రంతా చావగొట్టబడడం కూడా చీకటి కథను గుర్తుచేయడం అబ్బురమనిపించింది. ఇక ‘మాయామోహం’ కథలోకి వెళ్తున్న కొద్దీ –
కొండపైనెక్కడో పెద్దబండ రాళ్ల మధ్యనున్న పగుళ్ళ కింద రహస్యంగా కట్టుకున్న గుడిసెలో సారాయి కాచి అమ్ముకునే పాత్రగా – ఏ రోజుకూడా కల్తీ సారా కాచేందుకు ఒప్పుకోని పాత్రగా, ఏం చేసినా ఒక పద్ధతిలో తాను చేసే పనిని మెడిటేషన్లా చేసే పాత్రలా నేసైయన్ పాత్రను తీర్చిదిచ్చిన విధానం చూస్తుంటే – రచయిత సారా తయారీ గురించి, వాళ్ళ జీవన విధానాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడానికి వాళ్ళతో కలసి కొన్ని సంవత్సరాలైనా గడిపితే కానీ ఇలా రాయలేడు అనిపించింది.
తర్వాత్తర్వాత కథలో ముందుకి వెళ్ళే కొద్దీ నేసైయన్ సారాకాయడం మానేసి కొండల్లోంచి బయటకొచ్చి బాగా చదువుకొని రచయిత అయ్యి, ఈ కథ రాసాడేమో అని కూడా అనిపించింది.
ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ ఇది సారాయి తయారు చేసేవాడి కధ కాదు – దీన్ని అడ్డం పెట్టుకొని రచయిత ఇంకేదో చెప్పబోతున్నాడు అన్న సంకేతాలు కూడా కనబడసాగాయి కథలో.
“ఒక్కో కాగిన ఊటలో ఒకటి ఉందిరోయ్ …ఇప్పుడు దేవుడు లేచివచ్చి మన ముందు పెత్యక్షమయితే ఇందా అని మన సెయ్యి సాఫి ఇచ్చేలా ఒక సారా సీసా… దానికోసమే వెదుకుతున్నాను. ఎప్పుడో నూటికో కోటికో ఆ ఒక్కటి కుదురుతుంది. ఒక్కసారి సేత్తే ఇదిగో దొరికేసింది అనిపిస్తోంది. అయితే ఆపై మళ్ళీ చేజారిపోతుంది. తిరిగి తిరిగి ఇందులోనే కొట్టుకోవడం దీనికోసమే. పెభువైన యేసు పేణాలతో తిరిగిలేచి వచ్చేలా ఒక ఐటమ్.. “ఈ పేరగ్రాఫ్ చదవగానే బుర్ర తిరిగిపోయింది. ఊహించినట్లుగానే ఈ కథలో సారాయి సింబాలిజం కాబోతున్నట్లుందని అనుకున్నాను. రచయిత అమృతం…అది కూడా దివ్యామృతాన్ని (Devine) సింబలైజ్ చేసాడా అని అనిపించింది.
అనుభవించడం మాని విశ్లేషించుకోవడం ప్రారంభించిన (లేదా అనుభవిస్తునే, ఏకకాలంలో విశ్లేషించుకోవడం కూడా చేస్తున్న) మనసు పూర్తిగా కథలో లీనమైపోయింది. కథ చదవడం పూర్తిచేశాక కలిగిన అనుభవాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే
రససిద్ది కలిగిందని చెప్పొచ్చు. సారా కాచుకొని అమ్ముకునే వాడి కథలో రససిద్ది ఏమిటంటే ఇంతకు ముందే అనుకున్నట్టు ఇది సారాయి కాచుకొనేవాడి కథ కాదు. పర్ఫెక్షన్ కోసం పరితపించే ఒక కళాకారుడి కథ. ఆ కళాకారుడు రచయిత కావొచ్చు; చిత్రకారుడు కావొచ్చు; గాయకుడు, శిల్పి, నృత్యకారుడు ఇలా ఎవరైనా కావొచ్చు. మాములు కళాకారులు వెళ్ళగలిగే దూరాన్నిమించి పర్ఫెక్షన్ కోసం ఎంత దూరమైనా వెళ్ళగలిగే లాంటి కళాకారుడు అంతిమంగా పొందే ఫలిత దర్శనమూ అనుభూతి, అనుభవానికి సంబంధించిన కథ ఇదని అనిపించింది. అందుకే కథలో కళాకారుడికి కలిగిన రససిద్ది పాఠకుడికి ఎంతోకొంత ప్రాప్తించిందనిపించింది….
ఈ అక్షర రససిద్ది ఇచ్చిన దివ్యానుభవంలో తేరుకుంటూ, ఎందుకో ఈ కథ టైటిల్ ను గుర్తు చేసుకోగానే ‘మాయామోహం’ అని గుర్తుకొచ్చింది. ఏదో తేడాగా అనిపించింది. ‘మాయామోహం’ అని టైటిల్ పెట్టి రాసిన కథను చదివి విశ్వరూప దర్శనం అయినవాడిలా అనుభూతికి లోనయ్యానే… ఈ కథను పొరబాటున నేనేమైనా అపార్ధం చేసుకున్నానా అనుకుంటూ మరోసారి చదివాను.
“అయ్యప్ప శాస్తా మగపులి ఎక్కి కదా అడవికొచ్చాడు. మాయనిధి కూడా మగపులి దేవుడి లీల. పసుపు వెలుతురుని చూపించి బంగారం బంగారం అని కలవరించి తిరిగేలా చేస్తాడు.”
ఇవి ఈసారి స్పష్టంగా ఎదురుపడిన వాక్యాలు.
క్రమంగా ఈ కథ ఆస్తికవాదంపై కళాత్మక సెటైర్, మూఢ నమ్మకాలపై సౌందర్యాత్మక చురక అని అనిపించసాగింది. కథ పన్నిన మాయలో చిక్కుకున్న పాఠకుడిని అనుకున్నాను. ఒకవేళ ఇది నిజమైతే కథ చివర్లో నేసైయన్ కి కలిగిన అనుభవాన్ని ఏ కోణంలోంచి చూడాలి?
“ఆళ్ళు ఎలాగూ గంజాయి దమ్ము కొట్టి లాగుతారు. అప్పుడు మగపులి ఏం కర్మ.. ఏసుపెభూ కూడా కనిపిత్తాడు” లాంటి వాక్యం ఉన్న కోణం నుంచి చూడాలా? లేదా “అదే అతడు ఎదురుచూసినదే, ఒకసారి ప్రత్యక్షమై వెంటనే అదృశ్యమైన లీల ఆ దైవమే అది” లాంటి వాక్యాలు ఉన్న కోణం నుండి చూడాలా?
లేదా సత్యాసత్యాలకు ఆవల ఉండే అనిర్వచనీయమైన అనుభవాన్ని అక్షరాలతో పట్టి చూపించడానికి చేసిన ప్రయత్నమా?
నేను మాయామోహానికి గురి అయితే అయ్యుండొచ్చుగాక
ఈ కథ నాకు ఇచ్చిన అనుభవం మాత్రం ఈ పైన పేర్కొన్న మూడో దానిలోంచే పొందగలిగాను అని అనిపిస్తోంది.
‘అహో…జీవితపు రక్తోజ్వల ముక్తి క్షణమా’ అనే ఆలూరి బైరాగి వాక్యం కూడా గుర్తుకొస్తుంది.
మూలరచయిత జయమోహన్ ఈ కథకు ‘మాయనిధి’ (మాయప్పొన్) అని పేరు పెట్టాడట. కానీ అనువాదంలో ఈ కథ శీర్షికను ‘మాయామోహం’ అని మార్చారు. ‘మాయనిధి’ అనే టైటిల్ కన్నా ‘మాయమోహం’ అన్న టైటిలే ఈ కథలోని సారస్వతపు అసలుసిసలైన సౌందర్య క్షణాల్ని పాఠకుడిగా నాకు బొట్టు బొట్టుగా ఆస్వాదించగలిగే అనుభవానికి గురిచేసిందనిపిస్తుంది.
భగవంతం
భగవంతం అసలు పేరు మైసా నరసింహారావు. 20, మే 1970 లో ఉమ్మడి ఖమ్మం జిల్లా (ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) కొత్తగూడెంలో జన్మించారు. ప్రస్తుతం స్వంత ఊళ్ళోనే భారతీయ జీవిత భీమా సంస్థలో ఉద్యోగం. కథలు కవిత్వం రాస్తారు. తన మొదటి కథా సంకలనం 'లోయ చివరి రహస్యం' పేరున ఈ సంవత్సరం (2024) ప్రచురించారు. ఫోన్ నెం - 9399328997
Yes. Most of what Bhagavantham wrote were to be my words. But i disagree on title. Mayamoham was not apt. Its about perfection of a kind at a different level. After this achievement which couldn’t be repeated life or living lost its purpose. Its a fulfilment nearest to yur own Nirvana. When life lost its purpose, the extension is dying slowly. Only a truely creative artiste can comeup with an ending like that. Jayamohan is one.S
జయమోహన్ గారి తమిళ మాత్రుక కధ ‘ మాయప్పొన్ ‘ ను చాన్నాళ్లు గుర్తుండిపోయే ‘మాయామోహం’ కథగా తెలుగులోకి అనుసృజించిన శ్రీనివాస్ తెప్పల గారికి కృతజ్నతలు.
‘మాయామోహం’ కథ చదివి నేనెలాంటి పారవశ్య అనుభూతికి లోనయ్యానో, అక్షర రససిద్దిని పొందానో దాన్ని విశ్లేషించిన త్రిపుర గారి అభిమానులు కొత్తగూడెం ‘భగవంతం’ గారు, కధ కలిగించిన అనుభూతిని Its a fulfilment nearest to your own Nirvana అన్న పెద్దలు రాజమండ్రి పతంజలి శాస్త్రి గార్ల స్పందన తో మరింత లోతుగా అర్ధం చేసుకోగలిగాను.
వారికి, ఇది చదవమని చెప్పిన చెన్నై సోదరి డా. రాయదుర్గం విజయలక్ష్మి గారికి నెనర్లు.
~ కె.కె. రామయ్య