పూలఋతువు

Spread the love

తోకమల్లి చెట్ల నీడల్లో
చెట్టాపట్టాల్ నడక.
ప్రాణమంతా వేలాడేసి
రహస్యాల్ని వినే
పున్నాగపూలు.

*
గదిలో వెన్నెల చారిక
గది నానుకుని సన్నజాజి తీగ
ఊపిర్లు సర్దుకునే ఘడియల్లో
సుతారమైన రెక్కలతో ఎగిరివచ్చి
మృదువుగా తాకే పూవు.

*
విచ్చుకున్న పారిజాతం
ఆకుమీదే రాలిపడి-
రాతిరి నా నిశ్చింత నిద్ర
నీ మోచేతి దండ మీద.

*
పొగమంచు వాకిట్లో
పల్చని పరిమళం.
గుత్తులు గుత్తులుగా
బంతీ చేమంతీ.
పూలఋతువట లోకంలో.
ఎంత హాయి,
ఋతువు మారని ప్రేమ
కొలువైన హృదయంలో.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *