దీపాలపల్లె బోవాలె

Spread the love

పది గంటలకి స్పెషల్ వార్డులో లైట్లు తీసేశారు. నీలంరంగులో రాత్రి లైట్లు వెలిగేయి. అప్పుడప్పుడు వెలుతురు మారినప్పుడల్లా నాగముని అడుగుతుంటాడు. “బుజ్జీ, ఇప్పుడు టయం ఎంత?” రమణి చెప్తుంది. అతను వింటాడు. నాగముని తనదైన ఒక కాలవ్యవస్థలో ఉన్నాడు. తెల్లదీపాల బదులు వెలుగు మారి నీలంగా ఉన్నా అతని ప్రపంచంలో తేడా ఉండదు. నాగమునిది ఒక సమాంతర కాలగమనం. ఆయనకి అప్పుడప్పుడు తను కూచుని ఉండగా చుట్టూరా తిప్పుకున్న తెల్లటి ఎద్దు జ్ఞాపకం వస్తుంది. అదొక చక్రంలాంటి గుండ్రటి లోకం. తనే నడిపిస్తుంటాడు. కొంత కాలం తరవాత అతనికి ఒక అపరిచిత లోకంలో సంచరిస్తున్నట్టుండేది. ఏదో చక్రం ఊడిపోయింది. ఇది మూడోలోకం. సంబంధం ఉంటూనే లేని లోకం. మనవరాలి మెత్తటి చెయ్యి ఒక్కటే గడియారంలో చిన్నముల్లు.

            తాత అట్లా అడగడం ఇది రెండోసారి. లైట్ల పల్చటి వెలుగులో వార్డు పొరలు పొరలుగా కనిపిస్తోంది. గాలికి ఊగుతున్నట్టుగా నిశ్శబ్దం వార్డు అంతా చలిస్తోంది. నాగమునికి గడ్డం వరకూ దుప్పటి కప్పేరు. చేతులు మాత్రం, ఒకటి పొట్టకి అడ్డంగా మరొకటి పక్కనా ఒదిలేశాడు. ఆయనంత పొడవాటి నిట్టూర్పు విడిచి, కళ్లు తెరిచి పైకి చూశాడు. స్పష్టంగా కాకపోయినా, అన్నీ కనిపిస్తాయి. నాగముని లోకం చూడగలిగిన ప్రపంచానిది కాదు. వెలుతురు పొరల్లో, దుప్పటి పొరల్లో నాగముని శరీరం ప్రాణంతో ఉన్న పొడవాటి ఈజిప్టు మమ్మీలా ఉంది.

            తాత కళ్లు మూసుకుని ఏమాలోచిస్తున్నాడు, అనుకుంటుంది రమణి. ఏదీ ఆలోచించే స్థితిలో లేడని సమాధానపడుతుంది. కుర్చీ దగ్గిరికి లాక్కుని అందామె.

            “తాతా, నిద్రపోతున్నావా?”

            అతను తల అడ్డంగా ఊపేడు. తాత చెయ్యి కదిలింది. రమణి చెయ్యి పట్టుకుని అన్నాడు నాగముని.

            “దీపాలపల్లె బోవాలె.”

            తన తల ఎవరో పట్టుకుని విదిలించినట్టయింది.

            “ఎక్కడుంది తాతా?”

            తెలీదన్నట్టు చెయ్యి తిప్పేడు.

 *   *   *

            డాక్టరుగారి చేతిలో రిపోర్టు ఉంది.

            “నువ్వు హౌస్ సర్జన్ వి  కాకపోతే మరోలా చెప్పేవాణ్ని. ఇంకాయనకి పరీక్షలు, మందులు అనవసరం. నీకు తెలుసుగదా. అవునా?”

రమణి గొంతు విడలేదు. తల ఊపి అంది.

            “అవును సార్. ఎక్కువ టైం లేదు.”

            “ఆయనకి ఏం కావాలంటే అది పెట్టండి. తినలేడాయన. తొంభై ఏళ్లు దాటేయి. ఇప్పటికి కేవలం రెండు మూడు పళ్లు ఊడేయి. ప్రశాంతంగా వెళ్లిపోనీ. ఆయనకి ఏవో ఎప్పటివో జ్ఞాపకాలుంటాయి. ఆయన కాలక్షేపం అదే.”

            రిపోర్టు చూడగానే రమణికి తెలిసిపోయింది. మెల్లిగా నడుచుకుంటూ వార్డులోకి వెళ్లి నాగముని పక్కన కూచుందామె. మామూలుగా కళ్లు మూసుకుని  పడుకుని ఉన్నాడతను. ఆమె కూచోగానే కళ్లు తెరిచి ఆమె చేతికోసం వెతుకుతున్నాడు. ఆయన చెయ్యి తీసుకుని పొడవాటి వేళ్లు నొక్కుతూ సరిచేస్తోంది రమణి. తాత చేతులూ, కాళ్లూ పొడవాటివి. ముఖం కూడా కోలగా పొడుగు సాగి ఉంటుంది. మనవరాలి వేపు చూస్తూ, సన్నగా నవ్వుతూ అడిగేడు నాగముని.

            “బుజ్జీ, డాక్టరుగారు ఏమంటాడు?”

            “సరిగ్గా తినమన్నారు. నీరసపడిపోయావు. బిళ్లలు వేసుకోవాలని చెప్పేరు.”

             “నువ్వూ డాక్టరమ్మవే గదా. నే జెప్పనా? నాకు టయమయిపోయింది. నాకు తెలుసు. రోజులు, నెలలు గూడా గాదు.”

            పదిహేను రోజుల క్రితం తాత మాటలు బాగానే వినబడేవి. నీరసంగా ఉన్నా మాటలు స్పష్టంగానే ఉండేవి. రోజులు గడిచేకొద్దీ ఆయన లోకం కుంచించుకు పోతోంది. ఆస్పత్రి వెలుపల ఉన్న విజయవాడతో ఆయనకింక సంబంధం లేదు. నాగముని నాలుగు ముద్దలు అరగంటసేపు తిన్నాడు. ఆఖరి ముద్ద నములుతూ దరిదాపు నిద్రపోయాడాయన. తనూ భోజనం ముగించి, ఇంటికి ఫోన్ చేసింది రమణి.

                        “అమ్మా, దీపాలపల్లె నీకు తెలుసా? తాతకి తెలిసిన ఊరా? అక్కడికి వెళ్లాలంటున్నాడు.”

                        “నేనెప్పుడూ విన్లేదు. నాకు తెలిసి నాన్నకి కూడా ఆ ఊరితో సంబంధం లేదు.”

            కాసేపు తాత ఆరోగ్యం గురించి చెప్పి ఫోను పెట్టేసింది రమణి. ఇప్పటికి రెండు మూడుసార్లు అడిగి ఉంటాడు. తాత నిద్రమైకంలోగానీ, స్పృహలో లేనప్పుడో పలవరించడం లేదు. తను పుట్టి పెరిగిన ఊరు గుర్తుచేసుకుంటున్నట్టు అడుగుతున్నాడు. తాతగారి తాతగారు ఎప్పుడో శ్రీకాకుళం జిల్లా నుంచి గోదావరి జిల్లా వలస వచ్చేరు. మొత్తం ఆరు కుటుంబాలు. తాతకి కొంచెం పొలం కూడా ఉండేది. రాజమండ్రిలో అప్పటికి ఊరి చివర పెద్ద స్థలంలో పెద్ద పెంకుటిల్లు, లోపల ఓ మూల వేపచెట్టు, ఇంటినానుకుని పక్కనే పెద్ద తాటాకుపాకలో నూనెగానుగ. ఇంట్లో హాలు గోడగూట్లో నల్లరాతితో చెక్కిన బుద్ధుడి తల ఉండేది. తాతగారి తాత శ్రీకాకుళం నుంచి తెచ్చుకున్నాడు. ఇప్పటికీ అది పెద్దమావయ్య ఇంట్లో ఉంది. అమ్మ చిన్నప్పుడు, తాత గానుగ తిప్పుతూ ఒళ్లో కూచోబెట్టుకున్న ఫొటో ఒకసారి చూపించింది. గానుగ ఎద్దును బిడ్డలా చూసుకునేవాడు నాగముని. తాత గానుగ అంటే కల్తీలేని నూనె ఒయాసిస్సు. గానుగ తిప్పడం ఆపేసిన తరవాత కూడా ఎద్దుని అమ్మలేదు తాత. పాక తీసేసి మేడ కట్టేడు. తరవాత ఎప్పుడో ఎద్దు దేహత్యాగం చేసింది. నాగముని మధ్య హాల్లో నిలబడితే, మేడ నిట్రాటలా ఉండే వాడంది అమ్మ.

            స్నేహితురాలితో మాట్లాడి ఫోను పక్కన పెట్టగానే నాగముని మంచం పక్కన కూచుంది రమణి. రాత్రి నీలపు లైటు వెలుగులో తాత గ్రహాంతరవాసిలా కనిపించాడామెకి. కళ్లు మూసుకున్నా, చిన్న నవ్వుతో అతని పెదాలు కదులుతున్నాయి. అతన్ని చూస్తూ నుంచుంది రమణి. చటుక్కున కళ్లు తెరిచాడు నాగముని.

            “ఎన్ని దీపాలు, ఎన్ని దీపాలు…” అన్నాడతను. రమణితో కాదు. మెల్లిగా తల పంకిస్తూ మళ్లీ కళ్లు మూసుకున్నాడు తాత.

            ముందు అర్థంకాకపోయినా క్షణంలో స్ఫురించి ఆశ్చర్యపోయింది తను.

            నాగముని తలపాగ ఒళ్లో పెట్టుకుని అందరితోపాటు కూచున్నాడు. గ్రామం మధ్యలో బారలు జాపి విస్తరిల్లిన చెట్టుకింద దట్టంగా రెండువరసల రెల్లుతో వేసిన సాల అది. అందులో సమావేశం జరుగుతోంది. వెడల్పాటి ఇటుకల నేల. నిట్రాటకి వెదురుబద్దలతో చట్రం కట్టిన పటచిత్రంలో జేగురు రంగులో తథాగతుడు పద్మాసనంలో కూచున్నాడు, మూడు సంవత్సరాల నుంచీ. ఆయన ఎదురుగా కొంత మంది వృత్తివర్గాలవారు. అప్పటికే చాలాసేపట్నించీ మాట్లాడుతున్నారు. ఎండ పల్చబడి చారలుగా సాలమీద పడుతోంది. గ్రామం మాత్రం నిశ్శబ్దంగా ఉంది. అందరికంటే ముందు పెద్ద వడ్రంగి అన్నాడు.

            “ఈ మాసంలో మూడుతూర్లు కూచున్నాం. ముగ్గురు కట్టుబడి చూసుకోవాలె. ఇటుకల పని ఆరుగురు, బండ్లకెత్తేవారు. ఉదయం పని మొదలుగావాలె. పని ఆగడానికి వీల్లేదు.”

            గ్రామంలో కర్మకారుల పక్షాన పదిమంది పెద్దాచిన్నా మాసం నుంచీ సమావేశం అవుతూనే ఉన్నారు. తాబేలు గుట్ట మీది స్థూపానికి పూర్వం వేసిన మెట్లవరస ముసలివాడి పళ్లలాగ సడలిపోయి ఊడిపోగా, మిగిలినవి ఊడిపోడానికి సడలిపోయి సిద్ధంగా ఉన్నాయి. మహిళలకీ, పిల్లలకీ, పైనుండే భిక్షువులకీ కష్టంగా ఉంది. గుట్ట చెట్లతో పచ్చని తాబేలు ఆకారంలో ఉంటుంది. అందరూ అంగీకరించగానే సభ ముగిసింది. సభికులందరూ సవ్యంగా కూచుని తథాగతుడికి ప్రణామం చేసి, ఒకేసారి ముక్తకంఠంతో త్రిశరణాలను చెప్పుకున్నారు.

            నాగముని ఒక్కడే నదివేపు బయలుదేరేడు. ఒడ్డున పడవలు కట్టి ఉన్నాయి. నీలాకాశం నుంచి జారిపోయినట్టు కింద నది నీలిప్రవాహం. రేవుకి ఇవతల పెద్ద రాయిమీద కూచున్నాడతను. అతనికి ఎడం వేపుగా, దూరంగా నది విశాలంగా ఒంపు తిరిగినచోట తాబేలుగుట్ట ఉంది. గుట్టని తాకుతూ వెడుతుంది నది. గుట్టపై నుంచి కిందకి జారుతున్న మెట్లవరస అస్పష్టంగా కనిపిస్తోంది. స్థూపాన్ని చుట్టుకున్న ఇటుకల గోడలో దీపాలు పెట్టడానికి చాలా ఖాళీలు విడిచిపెట్టారు.

                        చీకటి పడగానే నలుగురు భిక్షువుల ఆధ్వర్యంలో వాటిలో దీపాలు వెలిగిస్తారు. రాత్రికి హారతుల్లా దీపాలు వెలగ్గానే, నదిమీంచీ, రేవులనుంచీ చూస్తున్నప్పుడు గుట్ట దివ్యభూమిలా వెలుగుతూంటుంది. ప్రతిదినం చూస్తున్నా, కాసేపు నిశ్శబ్దంగా నిలబడి, కళ్లలో చిన్నవెలుగు నింపుకుని వెడుతుంటారు, దీపాలపల్లెవారు. నదికావలి తీరంలో దూరంగా పల్లెల్లో మిణుగురుల్లా దీపాలు మెరుస్తూంటాయి. ఊరు దాటిన తరవాత దట్టమైన అడవి, నది వెంటే పరచుకుంది. అడవికీ, ఊరుకీ మధ్య, తాబేలుగుట్ట వెనక నుంచి పెద్దాచిన్నా గుట్టలు, వాటి వెనక కొండలు. తథాగతుడి గుట్ట వెనక చిన్న కొండలాంటి ఏకశిలమీద పల్లె అమ్మవారి గుడి నిలబెట్టేరు. గుళ్లో తల్లి పండుగలు కోలాహలంగా జరుగుతాయి. గుడి దిగువన వేలాది కోళ్ల నెత్తురు అమ్మవారి బదులు తాగి, చెట్లు బలిసి దట్టంగా పెరిగేయి. దీపాలపల్లె కడుపు నిండా సాలీలు, వడ్రంగులు, రైతులు, రెండు కుటుంబాల తెలకులు చల్లగా ఉంటున్నారు. అందరూ వ్యవసాయం చేసుకుంటారు. చేపలు పట్టుకుంటూ ఇటుకలు కూడా కాలుస్తారు. పక్క పెద్ద గ్రామంలో వర్తకులు నదికీ, పొలాలకీ మధ్య ఎత్తుమీద ఏదో అయ్యవారి ఆలయం కట్టించారు. సంధ్యా సమయంలో, అడవిగాలి వీచినప్పుడల్లా, ముఖ్యంగా నదీతీరాన, వేలాది పక్షుల కోలాహలం వినిపిస్తుంది. నది, కొండలు, అడవీ కలిపి పెద్ద బట్టమీద నేసినట్టుంటుంది గ్రామం. లేచి నుంచుని గుట్టమీద వెలుగుల్ని సభక్తికంగా చూస్తూ నుంచున్నాడు నాగముని.

            నోరు తెరవమని ఎవరో బిళ్ల మింగించారు. రెండు చుక్కల నీళ్లు తాగించారు.

            తరవాత ఎప్పుడో నది పొంగింది. ఉరక తీస్తూ సివంగుల గుంపులా ఎక్కడో కొండల మీంచి పరిగెడుతూ వచ్చింది. రేవు మెట్లు చాలా ములిగిపోయాయి. అప్పుడు గాని నది వెడల్పు తెలీడం లేదు. తాబేలుగుట్ట పాదాలు తడుస్తున్నాయి. ప్రవాహంలో చెట్లు, పశువులు, తాటాకిళ్లు కొట్టుకుపోయాయి. ఒకసారి పెద్దచెట్టు పట్టుకుని సగం నీళ్లలో ములిగి ముగ్గురు మనుషులు రేవు దగ్గరికి కొట్టుకొచ్చేరు. ఒక స్త్రీ, ఇద్దరు పురుషులు. ముగ్గురికీ ఒంటి మీద సరిగ్గా బట్టల్లేవు. పురుషులిద్దరికీ దుబ్బుజుట్టూ. మెళ్లో పూసలతో నీళ్లకి తడిసి మెరుస్తున్న నల్లటి శరీరాలతో ఒడ్డుకి చేరుకున్నారు. స్త్రీకి మెడనిండా అలంకారాలతోపాటు ముక్కుకి చెవులకీ కూడా పెట్టుకుందామె.

            మూడు పల్లె పడవలు కట్టుతెగి కొట్టుకుపోయాయి… వర్షాలు. బోర్లించిన ఆకాశం నించి ఎడతెగని తెల్లటి నీటితాళ్లు. చిన్నపిల్లలందరూ అమ్మమ్మల్ని వాటేసుకుని కుంపట్ల పక్కనుంచి కదలడం లేదు. చల్లటిగాలి వీపుల్ని ఉతుకుతోంది… “హుహూ…”

            “తాతా, ఇంకో దుప్పటి కప్పమంటావా?”

            ఇంకా పూర్తిగా తెలవారలేదు. గాజు కిటికీలు తెల్లబడుతున్నాయి.

                         “తాతా?”

            నాగముని కళ్లు తెరిచాడు. రమణిని వెంటనే గుర్తుపట్టలేదు.

            “వర్షం తగ్గిందా?” అన్నాడతను. మరుక్షణంలో నిద్రపోయాడు నాగముని.

                                    *  *  *

            తరవాత నాలుగైదు రోజుల్లో నాగముని మాట్లాడం తగ్గించాడని గమనించింది రమణి. మాట్లాడిన కొద్దిమాటలు అంత స్పష్టంగా లేవు. కొన్నిరోజుల క్రితం తాత కళ్లలో పల్చటి పొర కనిపించేది. అప్పుడప్పుడు కళ్లు చమరించేవి. ఈ కొద్ది రోజుల్లో ఆయన జీవశక్తి అంతా కళ్లకి చేరినట్టనిపిస్తోంది. కళ్లు మూసుకుని పడుకున్నప్పుడు తరచుగా పెదాల చివర చిరునవ్వు తోస్తోంది. తన ఆరోగ్యం గురించి అడగడం మానేశాడు. ఒక్కోసారి ఎవర్నో చూస్తున్నట్టుంటాడు తాత. తాతకి ఆస్పత్రిలో ఉన్నానన్న స్పృహ ఉందా అని అనుమానించింది రమణి. ఇంటి చిరునామా మార్చుకున్నట్టు నాగముని వేరేచోట ఉంటున్నాడనుకుందామె.

            “చివరిరోజుల్లో మనిషి మెదడు ఎలా పనిచేస్తుందో చెప్పలేం. ఏవేవో కల లొస్తూంటాయి,” అన్నాడు డాక్టరుగారు.

            కానీ తాతవి కేవలం చివరి రోజుల్లో కనే కలలు కావని రమణి నమ్మకం.

            నాగముని దగ్గిర కూచుని కాసేపు ఆయన్ని చూసి చెయ్యి తన చేతిలోకి తీసుకుంది రమణి. తన చేతిమీద ఆయన పొడవాటి వేళ్లు లయబద్ధంగా కదుల్తున్నాయి. అతని చెయ్యి ఆరోగ్యంగా, బలంగా, ప్రాణంతో తనకి ఏదో చెప్తున్నట్టుగా అనిపించింది రమణికి.

            రెండు గంటలపాటు గూగులంతా వెతికింది రమ. దీపాలపల్లె పేరుగల గ్రామం రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ కనిపించలేదు. ఇప్పుడు లేదేమో, ఒకప్పుడు లేదని ఎలా చెప్పగలం అనుకుందామె. లేని ఊరి పేరు తాత ఎలా చెప్పగలడు? చాలాసేపటికి, చీకట్లో లైటు వేసినట్టు ఆమె తోటి హౌస్ సర్జన్ రామ్మూర్తి జ్ఞాపకం వచ్చేడు. అతని అన్నగారు Survey of India ఉద్యోగి.

            “నాకు త్వరగా కావాలి,” అంది రమణి.

            గ్రామం కొత్తగా ఉంది. పేరు అదే. ఇప్పుడు గ్రామానికి ప్రవేశద్వారం నిర్మించుకున్నారు. దారికి అటూ ఇటూ రెండు రాతిస్తంభాలు, వాటిమీద శిలా తోరణం, తోరణంమీద పూలూ లతలూ చెక్కి అలంకరించారు. నాగముని తాబేలు గుట్ట వైపు నడిచాడు. దగ్గరకి రాకముందే గుట్ట సమీపంలో చెట్టు కింద కొంతమంది ప్రణామం చేస్తూ చుట్టూరా నుంచుని కనిపించారు. దగ్గరికి వెళ్లిన తరవాత కనిపించిందతనికి. గుట్టమీద భిక్షువు కాలం చేశాడు. అందరి కళ్లూ చెమ్మగిలి ఉన్నాయి. భిక్షువు శాశ్వత ధ్యానముద్రలో ఉన్నాడు. ప్రణామం చేసి నాగముని పల్లెలోకి వెళ్లేదు. కొత్త ఇళ్లు, కొత్త సాలలు కనిపించేయి. చెట్ల కింద ఎడ్లు, ఎడ్లబండ్లు విశ్రమిస్తున్నాయి. మనుషులు కూడా కొత్తగా ఉన్నారనిపించింది. ఊరి మధ్య చెట్టు, సాల మాత్రం మారలేదు. దీపాలపల్లె కొంచెం పొడవు సాగింది. ఎదురుగా రెండు గుర్రాల్ని నడిపిస్తూ ఇద్దరు యువకులు నాగమునిని దాటి వెళ్లిపోయేరు. పల్చటి గుర్రపు వాసన.

            దారివంపు తిరిగి నదివేపు పల్లంలోకి దిగింది. నది పారిపోతోందన్నట్టు  వేగంగా నడుస్తూ రేవు సమీపించాడతను. పెద్దదైంది రేవు. నది నిండుగా వెడుతోంది. మెట్లమీద కూచుని వెనక్కి చూశాడు నాగముని. పాత ఆలయం పక్కన మరో ఆలయం, అస్పష్టంగా మనుషులు కనిపించారు. నదినీటి మీద ఆఖరి వెలుగు పడి తళతళలాడుతోంది. ఆకాశం వేపు చూశాడతను. అతని గుండె పిట్టలా ఎగిరి పోయింది. ఆకాశం నిండా గుంపులుగా పక్షులు రకరకాల ఆకృతుల్లో నిశ్శబ్దంగా అడవివేపు ప్రవహిస్తున్నాయి. చూస్తుండిపోయాడతను.

            “తాతా పడవెక్కించు,” అంది రమణి. నాగముని నవ్వి, ఆమె చిన్నారి చేతులు పట్టుకుని రేవు మెట్లుదిగి పడవవాణ్ని చెయ్యి ఊపి పిలిచాడు. నది మధ్యకి నిట్టూర్చినట్టున్న వెలుతుర్లోకి మెత్తగా ప్రవేశించి గుట్టవేపు సాగింది పడవ. ఖాళీ నదిలో, అసుర సంధ్యలో, ఆకాశం విడిచిన మూడు ప్రాణుల్లా ఉన్నారు. చిన్నదాని చెయ్యి పట్టుకున్నాడు నాగముని. చిన్నదాని ముఖం వెలిగిపోతోంది. కాసేపు ముందుకు వెళ్లి, వెనక్కి తిరిగి వెలుతురు కరిగిన లేత నీలంలోంచి, తెలుపు నీలం దారాల్ని పెనవేస్తున్నట్టు పడవ రేవు వేపు తిరిగింది. అక్కణ్నుంచి రేవు చూడగానే మరోలోకపు మెట్లలా కనిపించింది.

            “సిస్టర్, కమ్ హియర్.”

            “ఒంగమాక, జారతావు పిల్లా,” అన్నాడు తాత.

            “తాతా, ఏంటి?”

            నాగముని మెల్లిగా కళ్లు తెరిచాడు. తెల్లవారి చాలాసేపయింది. ఒకసారి కాఫీ తాగి వచ్చి తాత దగ్గర కూచుంది రమణి. అతని చెయ్యి పట్టుకుని అంది. “జారను తాతా.” మరుక్షణం ఆమెకి అర్థమై, అతని చెయ్యి మెత్తగా నొక్కి అడిగిందామె.

“మేలుకున్నావా తాతా?” మగతగా తల ఊపేడు నాగముని.

            “టయం?”

            “ఉదయం ఏడున్నర.”

            గది కప్పు వేపు దీర్ఘంగా చూస్తున్నాడతను. నర్సు వచ్చి వెళ్లింది. ఆమెను గమనించలేదు నాగముని. తాతని చూస్తున్నకొద్దీ, ఆయన తనవేపు చూసినా చూడకపోయినా గడిచిన రెండురోజుల్నుంచి రమణిలో ఏదో అస్తిమితం ఏర్పడింది. ఇబ్బంది, బాధా, అసౌకర్యం లేని చిన్న జ్వరంలా. తాత స్పర్శ, చూపు, మాట మొత్తంగా తనని ఏదో అపరిచిత స్థలంలో ఉయ్యాల ఊపుతున్నట్టనిపిస్తుంది. రోజంతా తాత చెయ్యి పట్టుకునే కూచోవాలని ఉంటుంది. బహుశా ఒకటి రెండు వారాలు మాత్రమే జీవించే కేన్సరు రోగిలా కనిపించడం లేదాయన.

            సాయంత్రం నాలుగు దాటిన తరవాత సెల్లులో సమాచారం వెలిగింది. అందులో ప్రతి వాక్యం చదివిన తర్వాత తాతవేపు చూసిందామె. మొత్తం చదివిన తర్వాత రమణి శరీరం కంపించింది. నాగముని ఎందుకో అరచెయ్యి కళ్ల దగ్గిర పెట్టుకుని చూసుకుంటున్నాడు. మొత్తం పదిహేనుసార్లు చదువుకుందామె. సర్వే ఆఫ్ ఇండియా ఆయన తమ్ముడికి పంపిన వివరాలు రమణికి చేరేయి.

            “నువ్వు అడిగిన దీపాలపల్లె గ్రామం ప్రకాశం జిల్లాలో అంతరించింది. ప్రాచీన గ్రామం అయినా దాని చారిత్రక వివరాలు తెలియవు. అప్పటి గ్రామం అడవి సమీపంలో కొండలు, గుట్టల కావల ఉండేది. ఒక గుట్ట మీద కొన్ని బౌద్ధ అవశేషాలు ఉండేవి. దూరపు కొండల్లోంచి ప్రవహిస్తూ నది ఈ గ్రామం దగ్గిర ఒంపు తిరిగింది. ఎప్పుడో నది దిశని మార్చుకుంది. గ్రామస్తులు క్రమంగా ఊరొదిలి వలసలు పోయి ఉండే అవకాశం ఉంది. గ్రామనామంగానీ, దాని పురావస్తు విశేషాల్నిగానీ ధృవపరిచే చారిత్రక ఆధారాలేవీ లేవు. కానీ పురావస్తు శాఖవారి రికార్డులలో గ్రామం పేరు సర్వేలో దొరికింది. అంతే. ఒకనాటి దట్టమైన అడవి, నది గుర్తులు మాత్రం కనిపించేయి. ఇదంతా నాకు పురావస్తు శాఖ వారు ఇచ్చిన సమాచారం. ఈ ఊరి పేరు నీకు ఎలా తెలిసిందో ఆశ్చర్యంగా ఉంది. ఉంటాను.”

            అది చదివిన రోజు రమణి కోలుకోవడానికి చాలాసేపు పట్టింది. అప్పుడే లేచి వెళ్లి తాతకి చెప్పాలనిపించింది. దగ్గిరికి వెళ్లిన తరవాత చెప్పాలనిపించలేదు.

            అప్పట్నుంచి తాత కొత్తగా కనిపిస్తున్నాడు. రాత్రి అంతా తను మేలుకునే ఉంది.

            పిలవని పేరంటంలా వచ్చింది జడివాన. నది అవతల్నుంచీ గాలి వర్షాన్ని చిమ్ముకుంటూ వచ్చింది. వర్షం వెలిసిన తరువాత నాగముని వచ్చి రేవులో కూచున్నాడు. ఆకాశం అంతా చీకటిగా ఉంది. నక్షత్రాలన్నీ రాలిపోయాయి. అతన్ని ఆనుకుని కూచుంది మనవరాలు. నది అవతల తీరంలో ఇప్పుడు చాలాచోట్ల దీపాలు మినుకుమినుకుమంటున్నాయి. తాతని ఆనుకుని కూచుని నిద్రపోయింది రమణి.

            రాత్రి ఏ జామో తెలీడంలేదు. కాసేపటికి మళ్లీ తలెత్తి చూశాడతను. నదిలో బాగా కడిగి ఆకాశానికి అతికించినట్టు నక్షత్రాల గుత్తులు శుభ్రంగా ప్రకాశిస్తున్నాయి. పల్చటి చలిగాలికి చలిస్తున్నాయి. రేవు నుంచి మరో లోకానికి ఎవరూ చూడకుండా ఎగరబోతూ ఆగినట్టున్నాడు నాగముని.

            చీకటిలోనే నదినంతా కలయచూస్తూ తాబేటిగుట్టవేపు చూసి గతుక్కుమన్నాడు నాగముని. అతని గుండె గుర్రంలా పరిగెడుతోంది. ఛాతీ చీల్చుకుని బయటపడుతుందనిపించింది. గుట్టవంపు తిరిగి ఆముదం కాగడా నదిలోంచి దానంతట అదే తేలుతూ నిటారుగా వస్తోంది. ఇప్పుడు నాగమునికి ఎదురుగా దూరంగా నది మధ్యలోంచి నడుస్తున్న కాగడాని చూసి గొంతు తడారిపోయింది. కాగడా వెలుగులో ఎత్తుగా మనిషి, మనిషి చేతిలో ఎత్తిపట్టుకున్న కాగడా. నడుస్తున్న వ్యక్తి స్త్రీ. రేవుకి దూరంగా ఒడ్డు వేపు వస్తోందామె. అస్పష్టమైన వెలుగులో ఆమె ధరించిన ఎర్రటి చీరవంటిది తళుక్కుమంటోంది. మెడలో ఏవో మాలలు కనిపిస్తున్నాయి. ఆమె పొడవాటి నల్లటి జుట్టు భుజాల మీంచి వెనక నీళ్లలోకి జారింది. ఆమె నుదుటి మీద ఎర్రటి బొట్టు కాగడా వెలుగులో మెరిసింది. నాగమునికి అర్థమై ఒళ్లు జలదరించింది. ఒడ్డు సమీపిస్తూనే ఆమె మెడలో మాలలు, చేతి కడియాలు నదిలో విడిచిపెట్టింది.

            చేతులు జోడించి దణ్నం పెడుతూ కూచుండిపోయాడు నాగముని. అమ్మవారు ఎటూ చూడ్డంలేదు. నీటిలోంచి ఒడ్డు చేరే ముందు ఆమె చీరని నదిలో వదిలింది. ఒడ్డు చేరి ఆలయాలవేపు నడుస్తున్న ఆమె పాదాలు నేలనంటడం లేదు. భూమిమీద తనొక్కడే ఈ అలౌకిక దృశ్యాన్ని చూస్తున్నాడు. అమ్మవారు ఆలయం ముందు నిలబడింది. చేతిలో కాగడాని పైకి విడిచిపెట్టింది. కాగడా ఆకాశం వేపు వెడుతూ అదృశ్యమైంది. అమ్మవారి శరీరం మామూలు మానవ శరీరం వలె తగ్గిపోయింది. అమ్మవారు కొంచెం పైకి తేలుతూ ఆలయంలోకి అదృశ్యమైపోయింది. అసంకల్పితంగా నదివేపు చూశాడు నాగముని. చీకట్లో నక్షత్రాల మంటల కింద నది మామూలుగా సముద్రం వేపు ఎప్పటిలాగే వెడుతోంది.

            రమణికి మెలకువ వచ్చింది. తాత కళ్లు మూసుకుని ఉన్నాడు. భుజం తట్టగానే కళ్లు తెరిచాడతను. మెట్లమీద విశాలమైన ఎండలో ఇద్దరూ కూచుని ఉన్నారు. కళ్లు చికిలించి ఎండలోంచి నదిని చూడగానే బిత్తరపోయింది రమణి. నాగముని కూడా నదివేపు చూశాడు. అతని కళ్లు బండి చక్రాలయిపోయాయి. అతని ఎదురుగా కనుచూపుమేర దూరంలో తెల్లటి ఇసుక పరుచుకుని ఉంది. ఎక్కడా నది జాడలేదు. రేవులో తను కూచున్న మెట్టు మాత్రం ఇసుకమీద ఉంది. చురుక్కుమంటోంది ఎండ.

            దగ్గిరగా కుర్చీ లాగేరు.

            ఆస్పత్రిలో లైట్లు వేశారు. కుర్చీ మంచం దగ్గరికి లాక్కుంది రమణి. కళ్లు సగం తెరిచి చూస్తున్నాడు నాగముని. నదిలోంచి తేలినట్టు మంచాలు. దీపాల వెలుగు. ఆమెని చూడగానే చిరునవ్వేడతను. నాగమునికి నాలుగు మెతుకులు కూడా లోపలికి వెళ్లడం లేదు. కొన్ని చెంచాల మంచినీళ్లు మాత్రం తీసుకుంటున్నాడతను. డాక్టరు వచ్చి పరీక్ష చేసి రమణివేపు చూసి భుజం తట్టి వెళ్లిపోయాడు. తాతకి రాత్రి చెప్తే ఎలా ఉంటుంది? చెప్పినా అర్థం అవుతుందని నమ్మకం లేదు. రాత్రి పది దాటగానే పెద్ద లైట్లన్నీ తీసేశారు.

            తెలుపు, నీలం కలిసిన వెలుగులో తాత చెయ్యి తీసుకుంది రమణి. అతి కష్టం మీద కళ్లు తెరిచేడతను.

            అతని చెవి దగ్గిర నోరు పెట్టి అందామె.

            “తాతా, దీపాలపల్లె వెళ్దాం. వస్తావా?”

            నాగముని పొడవాటి వేళ్లు కదిలేయి.

            తల మెల్లిగా ఆమెవేపు తిప్పుకున్నాడు. నాగముని పెదాలు కదుల్తున్నాయి.

            రమణి మళ్లీ చెవి దగ్గిరిగా పెట్టింది.

            .”…..గం …..సెర ………..చామి …..”

            రమణి తల ఎత్తి చూసింది.

            నాగముని తల మెల్లగా జారిపోయింది.

తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి

తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి  14 మే 1945న తూర్పు గోదావరి జిల్లాలో జన్మించారు. వీరి మొదటి కథ సీతన్న తాట 1962లో ఆంధ్ర ప్రభలో అచ్చయింది. అయిదు కథా సంపుటాలు - వడ్ల చిలకలు, పతంజలి శాస్త్రి కథలు, నలుపెరుపు, రామేశ్వరం కాకులు, సమాంతరాలు; నాలుగు నవలలు, నాలుగు నాటకాలు, భమిడిపాటి కామేశ్వరరావు గారి సంక్షిప్త జీవిత చరిత్ర, ఒక కవితా సంపుటి ప్రచురించారు. ఆర్కియాలజీ చదివి, పర్యావరణ కార్యకర్తగా పని చేశారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *