మా అమ్మకు కాన్పు చేసిన మంత్రసాని ఇరుప (బొడ్రాయి) అచ్చయ్య భార్య – ఈమె కుంజ రామయ్య అక్క- రాత్రంతా నెప్పుల్తో మా అమ్మ ఏడుస్తుంటే , “ఏం వదినో! ముందే ఆలోచించుకోవాలె పిల్లలు కనాలంటే, మేం కన్లేదా పిల్లల్ని. నొప్పులు పడాలె. ఇప్పుడేడిస్తే ఏం లాభం” అని మోటుసరసం ఆడుకుంటా , మంచం పక్కనే చుట్ట కాల్చుకుంటూ , బొడ్డుకోసే లిక్కిని పదును పెట్టుకుంటూ ఉందంట.
తెల్లారగట్ల ఎప్పుడో పుట్టానంట. అన్ని నొప్పులు బరించిన మా అమ్మ -ఇప్పటికీ సందు దొరికినప్పుడల్లా దెప్పుతుంది- ‘నిన్ను కనడానికి సచ్చి బతికానని’.
కాన్పుల్లో నేను మూడోవాడ్ని. రెండోవాడు చనిపోయాడని చెప్పాను కదా! ఆ తర్వాత రెండో వాడిగా మారాను. ‘మా నడిపోడు’ అని ఎవరికైనా చెప్పేటప్పుడు చెప్తది.పెద్దోడు బందే అలి, నా తర్వాత మహమూద్, పాషా, రంజాన్ ,చెల్లెలు జాన్ బీ. మొత్తం ఆరుగురం. ఇప్పుడు ఉన్నోళ్ళం.
కనడం పూర్తయ్యాక అమ్మకు మా వూళ్ళో కాసే ఇప్పసారా కొద్దిగా పట్టించి, స్నానం వావిలాకు వేసి కాచిన నీళ్ళతో చేయించి మా ఊళ్ళో వాళ్లకి నన్ను చూపించిన్రంట.
వాడే వీడు !
‘యాకూబ్ /వల్ద్ మొహమ్మద్ మియా ‘
వల్ద్ అంటే s/o అని అర్థం.
కళ్లిప్పగానే నేను చూసిన మొదటి దృశ్యం ,బహుశా కుంజ రామయ్య గొడ్లకొట్టంలోని పేడరొచ్చు, బొంయ్ మనే ఈగల గుంపు,చుట్టుముట్టే దోమలు,చుట్టూతా కట్టిన తడికె అయ్యుండొచ్చు.
లేదా కిరసనాయిలు సీసాలో పోసి ,గుడ్డ వొత్తితో వెలిగించిన గాలికి రెపరెపలాడే బుడ్డి దీపపు తిర్రు కావొచ్చు.తడికకు తగిలించిన పాత గొనె సంచి అయినా అయ్యుండొచ్చు.
విన్న మొదటి శబ్దం – దోమలవల్ల గొడ్లు విసురుకుంటున్న తోకల చప్పుడో, చింతచెట్ల మీది పిట్టల కూతలో, దూరంగా రైలుపట్టాల మీది గూడ్స్బండి చప్పుడో, పక్కనున్న గుడిసెల్లో మొగుడూ పెళ్ళాల తగువుల్లో గుభిక్ గుభిక్ మనే తన్నులాటల, తిట్ల పురాణమో అయి ఉండవచ్చు.లేదా మా అమ్మానాన్నల భీకరమైన తగువులాట తర్వాత పొంతపొయ్యి దగ్గర అమ్మ ఎడతెగని సుదీర్ఘ ఏడుపు అయినా అయ్యుంటుంది.
చాలామందికి మల్లే, శుభ్రంగా అమర్చిన పుస్తకాల అలమరాలో, నిత్యం వచ్చిపోయే సాహితీమిత్రుల సందడో, ముచ్చటించే తల్లిదండ్రుల సాహిత్య సందోహమో ; లేదా అమ్మమ్మ తాతయ్యల,నానమ్మ తాతయ్యల ఒళ్లో కూచుని వినే గాధల కోలాహాలమో-కంసేకం..వేలుపట్టుకుని నడిపించే ఒక్కటైనా ఆసరా చేయికూడా లేని వాతావరణం.
బురద.బురద..
కాలు తీసి కాలు వేస్తే అంటుకునే బురద.
గాబు దగ్గర నీళ్ళు చేరి వాకిలంతా బురద. గొడ్లకొట్టం రొచ్చు బురద.
బురదలో జననం.
నామీద నేనే జోక్ వేసుకునే మాట – ఎక్కడ పుట్టావు అంటే ‘బురద’లో అని.
*
అమ్మకు నేనంటే ఇష్టమే. ఆ ఇష్టం దెబ్బలు కొట్టేటప్పుడు ఏమయ్యేదో అంతుపట్టదు ఇప్పటికీ. మామూలుగా దెబ్బలు కావు. దెబ్బలు అయ్యాక ఉంటడో ఊడతడో అన్నంత తీవ్రం. పైగా అపుడపుడూ నాన్న. ముంతపొగలు పెట్టడం, కట్టేయడం, రాళ్లతో ..కొట్టడం. ఆ తర్వాత మా అన్న.
వీళ్ళు దెబ్బలు కొడితే కోలుకోవడం కష్టం.మూర్ఖపు కోపం.
ఊహ తెలుస్తున్నకొద్దీ అమ్మానాన్నల రెక్కలు ముక్కలు అవుతుండటం అర్థమవుతూనే ఉంది. వాళ్ళుపడే కష్టంలోంచి ఎగదన్నుకొచ్చే అసహనం వల్ల నిరంతరం ఇద్దరిమధ్య గొడవలు. తన్నులాటలు, గుద్దులాటలు, తిట్లు,బూతులు, చిరాకులు, చీకాకులు,ఏడ్పులు,పెడబొబ్బలు,ఉరుకులు,గుంజులాటలు,గింజుకోవడాలు -ప్రతిరోజూ రమారమిగా ఇలానే ఉండేది.
అయినా వాళ్ళిద్దరిని కలిపిఉంచిన ఏకసూత్రత ఏమిటో ఇప్పటికీ చెప్పడం కష్టమే !
