నేలంతా పూలతో
చెట్లంతా పూలవాసనలతో నిండిపోయాక
మబ్బులు నడుము చుట్టూతా
కొన్ని మెరుపుల్ని అల్లుకొని వెలుగుతున్నాక
నల్లనిరెక్కల అందగాడు
కొన్ని పాటలను పట్టుకొచ్చి రికామిగా తిరిగి
పూలగుత్తులతో నిండిన బుట్టవలెని చెట్టు మీద వాలి
పాటలను పాడి కొంత కునుకుతీశాడు
పూలగుత్తులన్నీ ఆ పాటల బరువుతో
తొలిసారి పాలుబట్టిన చున్నులై
బరువుగా మెత్తగా నేలకు వాలాయి
చెట్టు మొదలంతా తేనెరాలింది
నీ కోసం రావి ఆకులతో తీపిని పట్టి ఉంచాను
నేలంతా చీమలతో తుమ్మెదలతో నిండిపోయింది
నీ నోటికి అందించాలని వాటికి కనిపించకుండా
ఆకులలో పట్టిన తేనెను చాటుచేశాను
కోకిల పూలతో మునిగిపోయింది
చీమల, తుమ్మెదల కొట్లాట ముగిసిపోయింది
మొదలంతా తీపికవురు వాసన
నా దోసిల్లలో ఆకుల చలువలో
ఇంకా తేనె మిగిలే ఉంది.