మామిడి రెమ్మల్లా..
-------------------------
నేల ఎండిపోయింది.
వెదురుపొదలులు ఎండలో వాలిపోయాయి.
బాణాలతో బందిపోట్లు
బాటసారులను చంపి
దోపిడీ సొమ్ము పంచుకుంటారు.
ప్రతిచోట మదమెక్కిన ఏనుగులు సంచరిస్తాయి.
మిత్రమా..మిగతాదంతా భయం లేదు.
ధనసంపాదనకు వెళ్ళిన నీ భర్తకు
ఎటువంటి ప్రమాదాలు ఎదురుకావు.
ముదురు మామిడిరెమ్మల్లాంటి నీ రంగు
పాలిపోదు.
నీ కంటే అతనికి
సంపద ఎక్కువ కాదని నాకు తెలుసు.
(ఆమె భర్త ధన సంపాదన కోసం ఆమెని వదలి వెళతాడని 'భయపడుతుంటే
ఆ భయాన్ని తగ్గించడానికి ఆమె స్నేహితురాలు అన్న మాటలు )
--- వేదపైరామన్తన్
బురద కలువలాగ
-------------------------
సముద్రతీర ప్రాంత అధిపతీ..
నువ్వంటే గిట్టనివాళ్ళను సంతోషపెడుతూ
నీ ప్రేయసిని బాధపెడుతూ
ఎన్నాళ్ళని ఇలా ఆమెని రాత్రుళ్లు
కలుస్తావు..?
వేగంగా వెళుతున్న రథం కింద పడి
చితికిన బురద కలువలాగ
మీ క్రూరత్వం కింద
ఆమె ఎప్పుడో చితికిపోయింది.
( ప్రేమికుడిని హెచ్చరిస్తూ ఆమె స్నేహితురాలు అన్న మాటలు )
---- కుండ్రియన్
వసంతకాల నీలి కలువలు
-----------------------------------
వివాహాలు ముందే నిర్ణయించబడతాయి.
వరుని యోగ్యత నిర్ణయించడానికి మనం ఎవరం ?
సోది మాటలు పక్కకు తోసేసి
నీ కూతురు
భారమైన హృదయంతో కళ్ళలో కన్నీళ్ళతో
వసంతకాల నీలికలువల వంక
చూస్తూ కూచుంది.
ఆమె ఎంపిక తప్పు కాదు.
( అనుమానపడే పెంపుడు తల్లితో ఆమె స్నేహితురాలు అన్న మాటలు )
----- పెరిచాథన్
మంట మీద మైనం
----------------------------
సఖీ..
అతను
మా ఇంట్లో ఒక్కరోజే వున్నాడు.
ఆ మాత్రానికే నేను
ఏడు రోజులుగా రోదిస్తూ
మంట మీద మైనంలా
కరిగిపోతున్నాను.
--- ఒరమ్పోకియార్

P. Srinivas Goud
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపాధ్యాయులుగా పని చేసి, ప్రస్తుతం నిర్మాణ రంగంలో వున్నారు. కవిత్వం, కథ, విమర్శ, అనువాదాలలో కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు 9 కవిత్వ పుస్తకాలు వెలువరించారు. 2024లో మార్జినోళ్ళు కథా సంపుటి వెలువరించారు. శ్రీనివాసం- కవిత్వ విశ్లేషణలు వెలువరించారు. కవిత్వ అనువాదంలో 4 పుస్తకాలు వచ్చాయి. ఈ సంవత్సరం మరికొన్ని అనువాదాలు రానున్నాయి. రచనలకు గాను పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్.
సెల్ : 9949429449 మెయిల్ : srinivasgoudpoet@gmail.com




