డాన్ నది ప్రశాంతంగా ప్రవహిస్తోంది Part 17

Spread the love

అధ్యాయం –19

      అక్టోబర్ ఆఖరి రోజుల్లో ఒక ఉదయాన మేజర్ లిస్ట్ నిట్ స్కీ కి ఆ రెజిమెంటు కమాండర్ నుండి తన దళాన్ని రాజభవనపు కూడలి దగ్గరకు తీసుకురమ్మని ఆజ్ఞ వచ్చింది.

  లిస్ట్ నిట్ స్కీ ఆ వార్తను వెంటనే సార్జెంట్ మేజర్ కి అందించి, హడావుడిగా స్నాపానాదులు పూర్తి చేశాడు.

    మిగిలిన అధికారులు అప్పుడే ఆవులిస్తూ నిద్ర లేచారు.వార్త తెలిసాక తిట్టుకుంటూ ఉన్నారు.

   ‘అసలు ఇదంతా దేని గురించి?’

    ‘బొల్షివిక్కుల గురించే!’

     ‘నా మందుగుండు సామగ్రిని ఎవరు తీశారు?’

    ‘అసలు మనం ఎక్కడికి వెళ్ళాలి?’

     ‘నీకు ఆ కాల్పులు వినిపించడం లేదా?’

   ‘ఓరి దేవుడా!అవి కాల్పులు కావు.నీకు చిత్త భ్రాంతులు కలుగుతున్నట్టున్నాయి!’

   అధికారులు బయటకు వచ్చేసరికి,దళం అంతా యుద్ధ వ్యూహ తరహాలో నిలబడి సిద్ధంగా ఉంది. లిస్ట్ నిట్ స్కీ వారిని అక్కడి నుండి భవనపు కూడలి దగ్గరకు వేగంగా మార్చింగ్ చేయించాడు. నేవ్ స్కీ ఖాళీగా ఉంది. అప్పుడప్పుడూ కాల్పులు వినిపిస్తూ ఉన్నాయి. ఆ కూడలి నుండి పహరా దళం రక్షణగా రాగా ఒక కారు వెళ్తూ ఉంది. ఆ వీధులన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. శీతకాలపు భవనం దగ్గర పహారపు దళాధికారి,నాలుగవ కోశాక్కు దళానికి చెందిన అధికారులు ఎదురయ్యారు. వారిలో ఒక దళపు అధికారి లిస్ట్ నిట్ స్కీ ని పక్కకు పిలిచాడు.

  ‘నీ దళం అంతా వచ్చిందా ఇక్కడికి?’

‘అవును.ఎందుకలా అడుగుతున్నారు?’

  ‘రెండవ,ఐదవ ,ఆరవ దళాలు రావడానికి నిరాకరించాయి. కానీ ఆయుధ దళం మాత్రం మనతోనే ఉంది. మీ కొసాక్కుల పరిస్థితి ఏమిటి?’

  లిస్ట్ నిట్ స్కీ నిస్సహాయంగా తల ఊపాడు.

  ‘అస్సలు మాట వినేలా లేరు. మొదటి మరియు నాలుగవ రెజిమెంట్ల విషయం ఏమిటి?’

  ‘వాళ్ళు ఇక్కడ లేరు,ఇక్కడకు రారు కూడా. ఈ రోజు బొల్షివిక్కులు దాడి చేసే అవకాశం ఉందన్న విషయం నీకు తెలుసా? అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు!అసలు ఇదంతా వదిలేసి ప్రశాంతంగా డాన్ కి వెళ్లిపోవాలని ఉంది’,గట్టిగా నిట్టూరుస్తూ అన్నాడు.

 లిస్ట్ నిట్ స్కీ తన దళాన్ని వాకిలి వైపుకి తీసుకువెళ్లాడు. కొసాక్కులు అక్కడ ఓ పక్కన తమ ఆయుధాలు ఉంచి, అక్కడ పెరేడ్ మైదానంలా ఉన్న ప్రాంతంలో పచార్లు చేస్తూ ఉన్నారు. అధికారులందరూ అక్కడికి కొద్ది దూరంలో ఉన్న ఒక లాడ్జికి చేరుకుని అక్కడ పొగ తాగుతూ,కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు.

   ఒక గంట తర్వాత అధికార దళ బృందం, మహిళా సైనికుల దళం భవనం దగ్గరకు వచ్చింది. ఆ అధికారుల దళం భవనం ముఖ ద్వారం వద్ద తమ ఆయుధాలతో  రక్షణగా నిలబడ్డారు. ఆ మహిళా సైనికులు వాకిలి వైపుకు వచ్చారు. వారిని చూస్తూ కొసాక్కులు మొరటు పరిహాసాలాడారు.

    ‘మీరు పిల్లలని కని ,ఇంట్లో ఉండాల్సిన వారు ఆంటీ ,కానీ మీరు ఇక్కడకు వచ్చారు’,అంటూ ఒక స్త్రీతో వెటకారంగా అన్నాడు ఒక కొసాక్కు. 

     ‘అయితే నువ్వే కను’,ఆ స్త్రీ గట్టిగా బదులిచ్చింది.

     ‘ఓ అందమైన అమ్మాయిలారా! మాతో ప్రేమగా ఉండొచ్చు కదా?’స్త్రీ వ్యసనపరుడైన ట్యూకోనోవ్ అన్నాడు.

  ‘ఇది చక్కగా దాక్కునే ప్రదేశమే. బహుశా అందుకే ఇక్కడికి వచ్చి ఉంటారు!’

‘మీరు యుద్ధం చేయాల్సింది ఇక్కడ కాదులే.. వేరే చోట..’

  ‘అసలు మీరు ఇంట్లో ఉండక ఇవన్నీ మీకెందుకు?’

  ‘ముందు నుండి చూడటానికి సైన్యానికి చెందిన వాళ్ళలానే ఉన్నారు కానీ, వెనుక నుండి చూస్తే మాత్రం….’

  ‘హే.. మర్యాదగా వెనక్కి పోండి.. మీ పనులు కావు ఇవి!’

  కొసాక్కులు నవ్వుతూ ఆ స్త్రీలతో పరిహాసాలు ఆడుతున్నారు.కానీ మధ్యాహ్న సమయానికి ఆ ఆనందమంతా ఆవిరి అయిపోయింది.

ఆ మహిళా సైనికులు యుద్ధ వ్యూహ పద్ధతుల్లో దళాలుగా ఏర్పడి,వాకిలి వైపు ఉన్న పడిపోయి ఉన్న వృక్షాలతో  ద్వారాలను మూసారు.  మెడలో సెయింట్ జార్జ్ పతకంతో పురుషుడి వలె బలిష్టంగా ఉన్న ఒక స్త్రీ ఆ ఆపరేషన్ కు నాయకత్వం వహిస్తుంది. చుట్టూ రక్షణా దళాలతో ఉన్న ఓ కారు ఆ కూడలి దగ్గరకు వస్తూ, ఆయుధాలను తీసుకు వచ్చి ఆ భవనంలోకి చేరుస్తూ ఉంది.

‘కొసాక్కులారా!మనం అప్రమత్తంగా ఉండాలి!’

‘చూస్తూ ఉంటే మనం యుద్ధం చేయాల్సి వచ్చేలా ఉందే?’

  ‘నీకు ఏమనిపిస్తుంది? ఇక్కడకు వాళ్ళు మనల్ని తెచ్చింది అమ్మాయిలతో జాలీగా ఉండటానికా?’

  బుకానోవస్కాయా, స్లాష్ చేవస్కాయా కొసాక్కులు లాగుటిన్ చుట్టూ చేరి, వారిలో వారు మాట్లాడుకుంటున్నారు. అధికారులు అప్పటికే మాయమైపోయారు. ఆ వాకిట్లో కొసాక్కులు, మహిళా సైనికులు మాత్రమే ఉన్నారు.

  సాయంత్రానికి చిన్నగా మంచు కురవడం కూడా మొదలైంది.

కొసాక్కులకు అసహనం పెరిగిపోయింది.

  ‘అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు? మనల్ని ఇక్కడికి తెచ్చి ఏం చెప్పకుండా ఇలా వదిలేసారు!’

  ‘మనం లిస్ట్ నిట్ స్కీ ఎక్కడ ఉన్నాడో చూస్తే సరిపోతుంది.’

‘అయితే నువ్వే వెళ్ళి ఒక్క పిలుపుతో అతన్ని తీసుకురా.అతను రాజభవనంలో ఉన్నాడు, మనబోటి వారిని అక్కడ వారు లోపలికి రానివ్వరు.’

‘ఎవరో ఒకరిని వంటగదిలోకి పంపిద్దాము. కనీసం మనం తినడానికి ఏదో ఒకటి దొరకొచ్చు.’

‘మీ తుపాకీలు ఇక్కడే ఉంచి వెళ్ళండి. లేకపోతే మిమ్మల్ని కాల్చి పడేస్తారు ‘, లాగుటిన్ సూచించాడు.

   వాళ్ళు ఇంకో రెండు గంటల వరకు వేచి చూశారు,కానీ ఎవరూ రాలేదు. వారికి ఆ తర్వాత తెలిసిందేమిటంటే అంతకన్నా ముందే ఆ మొబైల్ కిచెన్ అక్కడి నుండి తరలింపబడిందని. సాయంత్రం అవబోతూ ఉంటే, గేటు దగ్గర స్త్రీల బెటాలియన్ ఉండి, కూడలి వైపు కాల్పులు జరుపుతూ ఉన్నారు. కొసాక్కులు అక్కడ నిలబడి చూస్తూ ఉన్నారు. లాగుటిన్ ఆ దళాన్ని భవనం గోడ దగ్గర సమావేశపరిచాడు.అప్పటికే భయపడి ఉన్నవారు మాట్లాడటం మొదలుపెట్టారు.

   ‘కొసాక్కులారా!నా మాట వినండి.మనం ఇక్కడ ఉండటం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఇక్కడి నుండి వెంటనే మనం వెళ్లిపోకపోతే ఇబ్బందుల్లో చిక్కుకుంటాము. ఇంకాసేపట్లో ఈ భవనం మీద దాడులు చేస్తారు. అయినా దానితో మనకేమి సంబంధం ఉంది? ఇక్కడ చూస్తే ఎక్కడా కూడా అధికారులు కనిపించడం లేదు. మనం మన ప్రాణాల్ని ఎందుకు కోల్పోవాలి? ఇక మనం ఇంటికి బయలుదేరుదాము,ఇలా గోడల దగ్గర నిలబడుతూ ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు. అయినా మనకు ఆ ప్రొవిజినల్ ప్రభుత్వం తో ఏంటి సంబంధం?మీరు ఏమంటారు,కొసాక్కులారా?’

   ‘మనం బయట అడుగు పెట్టగానే బొల్షివిక్కులు మనల్ని కాల్చి పడేస్తారు.’

   ‘మన పేగులు తోడేస్తారు!’

    ‘ఎందుకు ఎలా చేస్తారు?’

   ‘అయినా ఇప్పుడే అది ఆలోచిచడం మూర్ఖత్వం అవుతుంది.’

   ‘లేదు,మనం ఇక్కడే ఉందాము.’

    ‘అయినా మనకు దీనితో ఏ సంబంధం లేదు.’

    ‘నాకు మిగిలిన వాళ్ళ గురించి తెలియదు,కానీ మా దళమైతే మాత్రం ఇక్కడ నుండి వెళ్తుంది.’

  ‘మేము కూడా!’

   ‘బొల్షివిక్కులతో మాట్లాడటానికి ఎవరో ఒకరిని పంపించండి. వాళ్ళు మాకు ఏ హాని చేయకపోతే,మనం కూడా వారి జోలికి పోమని చెప్పండి.’

    మొదటి,నాలుగవ దళాల కొసాక్కులు ఒకటయ్యారు. తర్వాత ఆలస్యం లేకుండా నిర్ణయం వెంటనే తీసుకున్నారు. ప్రతి దళం నుండి ఒక్కో కొసాక్కు చొప్పున,ముగ్గురు కొసాక్కులు ,అక్కడి నుండి బయటకు వెళ్లారు. ఒక గంట తర్వాత వారితో పాటు ముగ్గురు వచ్చారు. ఆ ద్వారానికి అడ్డు పెట్టి ఉన్న దుంగలను వారు తొలగించి లోపలికి వచ్చారు. వారు కొసాక్కుల దగ్గరకు వచ్చి ఆత్మీయంగా పలకరించారు. వారిలో యువకుడైన ఒక వ్యక్తి ,కొసాక్కుల మధ్యలో దారి చేసుకుని నిలబడి,మాట్లాడసాగాడు.

   ‘కొసాక్కు కామ్రేడ్స్ లారా! మేము విప్లవ దళానికి ప్రతినిధులుగా ఇక్కడికి వచ్చాము. మీరు వెంటనే ఈ భవనం నుండి బయటకు వెళ్తే మంచిది.అయినా ఈ బూర్జువా ప్రభుత్వానికి మీరు ఎందుకు మద్ధతునివ్వాలి? ఆ బూర్జువా వ్యవస్థలో పాతుకుపోయిన ఆ అధికార వర్గాన్నే దాన్ని చూసుకోనివ్వండి. ఒక్క సైనికుడు కూడా ప్రొవిజినల్ ప్రభుత్వానికి మద్ధతుగా రాలేదు. మొదటి మరియు నాలుగవ రెజిమెంట్ల సైనికులు మా దగ్గరకు వచ్చారు. మాతో కలిసేవారు, ఎడమ వైపుకి రండి!’

   ‘ఒక్క నిమిషం ఆగండి!’ మొదటి దళపు సార్జెంట్ ముందుకు వస్తూ అన్నాడు. ‘మీతో రావడానికి మాకు ఏ అభ్యంతరం లేదు. కానీ మమ్మల్ని బొల్షివిక్కులు కాల్చి పడేస్తే మాకు దిక్కు ఏమిటి?’

  ‘కామ్రేడ్స్! పెట్రోగ్రాడ్ మిలిటరీ విప్లవ కమిటీ తరపున మీకు ఏ హాని జరగదని నేను మీకు హామీ ఇస్తున్నాను.’

   పొట్టిగా ,స్ఫోటకం మచ్చలతో ఉన్న ఇంకో వ్యక్తి అప్పటి వరకు మాట్లాడిన వ్యక్తి పక్కన నుండి ముందుకు వచ్చి, ‘మేమే మీకు రక్షణగా ఉంటాము. మా గురించి మీకు ఎంటువంటి అనుమానాలు అవసరం లేదు. మేము మీకు శత్రువులం కాదు. మీ శత్రువులు ఉంది అక్కడ…’అంటూ భవనం లోపలి వైపుకి తన చేతిని చూపాడు.

   కొసాక్కులు కాసేపు సందేహిస్తూ ఆగారు. మహిళా సైనికులు అక్కడికి వచ్చి ఆ మాటలన్నీ విన్నారు. తర్వాత కొసాక్కుల వైపు చూసి ,మరలా గేటు దగ్గరకు వెళ్ళిపోయారు.

   ‘ఓ అమ్మాయిల్లారా!మీరు మాతో రారా?’ పెద్ద గడ్డంతో ఉన్న ఒక కొసాక్కు వారిని పిలిచాడు.  

   కానీ ఏ సమాధానం లేదు .

    ‘మీ ఆయుధాలు తీసుకుని ఇక బయల్దేరండి’,లాగుటిన్ అన్నాడు.

   కొసాక్కులు తమ ఆయుధాలను తీసుకుని బయల్దేరడానికి సిద్ధమయ్యారు.

   ‘మరి ఇక్కడ ఉన్న మెషీన్ గన్స్ పరిస్థితి ఏమిటి?’ఆ బొల్షివిక్కు ప్రతినిధితో ఓ కొసాక్కు అన్నాడు. ‘వాటిని కూడా తీసుకురండి.వాటిని ఇక్కడే వదిలేయడంలో అర్థం లేదు.’

    కొసాక్కులు వెళ్లబోయే ముందే ,అధికారులు వచ్చారు. గుంపుగా నిలబడిన వారు,ఆ విప్లవ ప్రతినిధుల వైపు చూస్తూ ఉన్నారు. ఆ దళాలు వరుసలగా ఏర్పడి ఆ మెషీన్ గన్స్ తో సహా అక్కడి నుండి బయటకు కదిలిపోయాయి. మొదటి దళపు అధికారి పక్కన విప్లవ ప్రతినిధి ఉన్నాడు. పొడుగ్గా, ఒత్తైన జుట్టుతో ఉన్న ఫెడోసేయెవెస్కాయా స్టానిట్సా కు చెందిన ఒక కొసాక్కు తన మనసులోని ఆలోచనలను బయట పెట్టాడు.

  ‘అసలు మనం ప్రజలకు వ్యతిరేకంగా వెళ్లాల్సిన అవసరం ఉందా? మనం ఏం తెలియక ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాము. అసలు తెలిసి ఉంటే ఇక్కడికి వచ్చేవారిమే కాదు!’నుదురు చిట్లిస్తూ , ‘దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నా !తెలిసి ఉంటే అస్సలు వచ్చేవాళ్ళమే కాదు!’అన్నాడు.

   నాలుగవ దళం వెనుక ఉండటం వల్ల వారు బయటకు వచ్చేసరికి కొంత ఆలస్యమైంది.వారు ఆ గేటు నుండి బయటకు వెళ్తూ ఉంటే ,అక్కడ స్త్రీల బెటాలియన్ అక్కడే గుంపుగా ఉంది. లావుగా ఉన్న ఒక కొసాక్కు బయటకు వెళ్తూ,అన్నాడు.

   ‘ ఓ తుపాకీలు పట్టుకున్న స్త్రీలారా! మీ మూర్ఖత్వం వల్ల ఇక్కడ ఉంటున్నారు.ఇక దీన్ని ఇంకా పెద్దది చేయొద్దు.మేము వెళ్తూ ఉంటే వెనుక నుండి మా మీద కాల్పులు జరిపితే మాత్రం మిమ్మల్ని ఏం చేయడానికి కూడా మేము వెనుకాడము. నేనేం చెబుతున్నానో అర్థమవుతుంది కదా? అది గుర్తు పెట్టుకోండి.ప్రస్తుతానికి వీడ్కోలు!’

    అతను బయటకు రాగానే తన దళాన్ని అందుకోవడానికి వెనక్కి తిరిగి చూస్తూనే ముందుకు ఉరికాడు.

    కొసాక్కులు దాదాపుగా ఆ కూడలి మధ్యకు వచ్చేసరికి ,వారిలో ఒకడు వెనక్కి తిరిగి చూసి,అరుస్తూ అన్నాడు. ‘చూడండి !ఒక అధికారి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు మన వెనుక!’

   వారిలో చాలామంది ఆగకుండా తలలు వెనక్కి తిప్పి చూశారు. ఒక పొడుగైన అధికారి తన ఖడ్గాన్ని సరిచేసుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు.

   అతను తన చేయి ఊపాడు.

     ‘అతను మూడవ దళానికి చెందిన అటార్శ్చికోవ్.’

      ‘ఎలా ఉంటాడు?’

     ‘పొడుగ్గా,కళ్ల దగ్గర పుట్టుమచ్చతో ఉంటాడు.’

  ‘అంటే అతను కూడా మనతో రావాలనుకుంటున్నాడు అన్నమాట.’

  ‘అతను మంచివాడే.’

   అటార్శ్చికోవ్ దళాన్ని అందుకోవడానికి వేగంగా వస్తున్నాడు. అతని ముఖంలో నవ్వు ఉండటం కనిపిస్తూనే ఉంది. కొసాక్కులు కూడా చేతులు ఊపుతూ,నవ్వారు.

   ‘లూయీటెంట్ ,త్వరగా రా!’

   వెనుక నుండి పెద్ద శబ్దం. అంతే అటార్శ్చికోవ్ చేతులు ముందుకు వాలుస్తూ పడిపోయాడు. లేవడానికి ప్రయత్నించినా అతని వల్ల కాలేదు. ఒక్కసారిగా వారంతా ఆ భవనం వైపుకి చూశారు. ఒక్కసారిగా దాడులు ప్రారంభమయ్యాయి. వెంటనే జాగురుకులయ్యారు వాళ్ళు.

  ఆ విప్లవ దళ ప్రతినిధి , ‘వేగంగా ముందుకు కడలండి’,అని ఆజ్ఞ ఇచ్చాడు.

   వెంటనే అందరూ వేగంగా కూడలి నుండి ఎడమ వైపుకి కదిలారు. వారు వెళ్తూ ఉండటం ఆ భవనంలోని వారు నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నారు.

 *   *  *

Mikhail Sholokhov
Author
Rachana Srungavarapu
Author & Translator

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *