జీవితపు సూక్ష్మతా, నిరాకారం

Spread the love

భారతీయ భాషల్లోని ఏ భాషలోని కథలు తీసుకొన్నా పత్రికల ఆధారంగా ఆధునిక తమిళ సాహిత్య సంప్రదాయంలో వచ్చిన పాఠకుడికి వాటి శిల్పంలో కాస్తంత లోపాలు ఉన్నట్టు కనిపిస్తాయి. ఎందుకంటే, తమిళంలోని ఆధునిక సాహిత్యం(modern), తమిళంలో మాత్రం ఆధునికవాద(modernism) సాహిత్యంగా పరిచయమయ్యింది. ఇతర భాషల్లో వీచిన వాస్తవికవాద అల మన దిశగా వీచలేదు. కనుక ఇతర భాషల్లో నవలలు విస్తృతంగా రూపొందితే, అందుకు ప్రత్యామ్నాయంగా ఇక్కడ కథ విస్తృతంగా వ్యాపించింది.

రచయిత ‘పుధుమైపిత్తన్’ కథలలోని అన్ని ప్రక్రియలకు మార్గనిర్దేశకుడిగా నిలిస్తే, దాని వివిధ పోకడలు ఆ తదనంతరం వచ్చిన సుందర రామస్వామి వంటివారి వలన ఎంతో విజయవంతమయ్యాయి. మనం దాని నుండి రూప సమ్మేళనం, రూపపరమైన ప్రయోగాలు దిశగా వెళ్ళి, అందులోనూ విసుగొంది, సూటిగా చెప్పే మరో వాస్తవికవాద కథ దశకు చేరుకున్నాము. అనేక భారతీయ భాషల్లో వాస్తవికవాద కథనే కొనసాగుతోంది. ఆధునికవాదం కూడా కొనసాగుతూనే ఉంటుంది.

వాస్తవికవాద కథ రెండు స్వభావాలను కలిగివుంది. మొదటిది సుధీర్ఘ జీవిత చిత్రీకరణ, రెండవది ఒక జీవితంలోని ఒక భాగాన్ని ముందుంచి అక్కడితో ఆపేయడం. అది ఎల్లప్పుడూ ఒక నవలకు సంక్షిప్త రూపంగానూ, లేక ఒక భాగంగాను నిలిచిపోతుంది. ఎందుకంటే నవలే వాస్తవికవాదపు ప్రాథమిక రూపం. ఆధునికవాదం కథలలో శిల్పపరమైన విజయాన్ని చవిచూసింది. దాని ప్రాథమిక రూపం కథే. అనేక ఆధునిక నవలలు కథల సంకలనాలు. అందుకు నిదర్శనం అశోకమిత్రన్ నవలలే.

ఎందుకంటే ఆధునికవాదపు ఆలోచనా పోకడ జీవితపు సంఘర్షణలను గమనించడం మాత్రమే. జీవితమన్నది ఒక గతితార్కికత (dialectics) అని భావించడం. కనుక కథనే అందుకు సరిపోయే రూపం. ఎందుకంటే కథ కొసమెరుపును రూపంగా కలిగినది.

దానితో ఆధునిక భావసౌందర్యాన్ని సూటిగా, ఖచ్చితంగా, ఒక విషయాన్ని చెప్పడమే సాహిత్య లక్ష్యం అని నమ్మబడింది. కా.నా. సుబ్రహ్మణ్యం మొదలుకొని, సుందరరామస్వామి వరకు అది ‘సరిగ్గానే వచ్చింది’, ‘కాస్త దీనిని కత్తిరించి ఉండాల్సింది’, ‘చిన్న సవరణలు ఉన్నాయి’ వంటి మాటలను విరివిగా వాడటం ద్వారా గమనించవచ్చు.

ఆధునికవాదానికి తదనంతరం వచ్చినటువంటి మరో వాస్తవికవాద కథలుగా ‘నెమ్మి నీలం’ కథలను చెప్పొచ్చు. అవి వాస్తవికవాదపు ‘పూర్తి జీవితపు చిత్రీకరణలు’ కలిగివున్నాయి. అయితే దానితోపాటు ఆధునికవాదపు కథకు తగిన ‘పతాకస్థాయి మలుపు’ లేదా ‘పతాకస్థాయి కొసమెరుపు’ ని కలిగివున్నాయి. ప్రాచీన సాహిత్య పరంపరలో కథ చెప్పే విధానపు సంక్షిప్త చిత్రీకరణ, చారిత్రక వివరణలు ఆధునికవాదంలో కనిపిస్తున్నాయి. అయితే అవి ఆధునికతకు తదనంతరం వచ్చినవి. మొత్తమ్మీద ఆధునికత్వం చేరుకున్న కవిత్వపు అంతరార్ధాలు, చెప్పబడని ఖాళీలను కలిగివున్నాయి.

ఈ భావసౌందర్య దిశలో ఒకటి తప్పు, మరొకటి ఒప్పు అనేదేమీ లేదు. అన్నీ జీవితాన్ని చెప్పేందుకు తగినవి. అయితే ఏ రూపం అదనపు ప్రయోజనం చేకూర్చేది అన్నదే కీలక ప్రశ్న. దాని ఆధారంగానే విమర్శ రూపుదిద్దుకోవాలి. నాకు సంబంధించినంతవరకు భావసౌందర్యం దిశగా వెళ్ళడమే ప్రధానమైనది. గనుక సృజనరూపమే నిష్పాక్షిక దృక్పథంతో వాదించతగినది. కథావస్తువుని అనుభూతి చెందాలి. విమర్శ ఆ కథావస్తువుని స్పష్టం చేసుకోవడం కోసం మాత్రమే.

బి.అజయ్ ప్రసాద్ రాసినటువంటి తెలుగు కథలను తమిళంలో క.మారియప్పన్ అనువాదంలో ‘అద్దంకి మలై’ పేరుతో సంకలనంగా విడుదలయ్యింది. ఈ కథలన్నీ విశేషమైన పాఠనానుభూతిని కలిగిస్తున్నాయి. తెలుగునేల, అక్కడున్న జీవనం, రెండూ మనకీ దగ్గరగా ఉండటం కూడా అందుకొక కారణమయ్యుండొచ్చు.

ఈ సంకలనంలోవున్న ఆసక్తికరమైన కథ ‘లోయ.’ వింతైన ఒక కొండ శిఖరాన కథ జరుగుతోంది. అక్కడ ఒక ఆలయం, గుహలో ప్రార్ధనా ప్రదేశాలు ఉన్నాయి. చిన్నకొట్లు పెట్టుకున్నవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు, సంచారులు, పరన్నాజీవులు – ఇలా ఒక నవలకు ఉండాల్సిన అందమైన, విస్తారమైన నేపథ్యం ఈ కథలో వుంది. శీను, ఆచారి, జయమ్మ, చెన్నమ్మ అని స్పష్టంగా రూపొందించిన కథాపాత్రలు, ఒక నవలకు ఉండదగిన లక్షణాలను కలిగివున్నాయి.

ఈ కథ చెన్నమ్మపై రూపొందే ఒక నిందపై కథకుడు అయినటువంటి ఒక సంచారి అంతరంగ విచికిత్స ద్వారా కొనసాగుతోంది. కొండ నుండి లోయకు దిగడం, మరో ప్రదేశానికి వెళ్ళడం ఈ కథలోని ముగింపు. కథ ఆకర్షణీయమైన పాఠనానుభూతిని అందించినప్పటికీ అందులో పాఠకుడు పూరించవలసిన ఖాళీలేవి ఉండవు. అంతా కథకుడి ద్వారానే వ్యక్తమవుతోంది.

ఆ గుహ చీకటిలోకి కథకుడు వెళ్ళడం ఒక మంచి ఘట్టం. ఒక చిన్న కదలిక ద్వారా దానిని ఆ కథ కీలక దృశ్యంగా (ఆ గుహలోని చీకటి, అందులోని చిన్న కాంతి) మలచి వుండొచ్చు. కథలో చోటుచేసుకునే సంఘర్షణ లేదా ప్రతిఘటన అనేది రోజువారీ జీవితాల్లోని తేలికగా అపార్ధం చేసుకొదగిన అవగాహనారాహిత్యంగానే ఉంది. అది రేకెత్తించే మానసిక సంఘర్షణ లేదా తాత్వికచిక్కుముడి అంటూ ఏమీ లేదు. కథ తారస్థాయికి చేరుకోకుండా, మలుపు తీసుకోకుండా సహజంగా ముగుస్తోంది.

‘నిష్క్రమణ’ అనేది స్వతహాగా ఒక నవలకుండే ముగింపు. ఎందుకంటే సాధారణంగా ఒక నవలకు ముగింపు ఏమిటంటే నవల ఒక కథానేపథ్యాన్నీ, ఓక జీవనసారాన్ని రూపొందించి, దాని పొరల్లో వ్యక్తీకరించాల్సినటువంటి వాటిని పొందుపరిచి ముగుస్తోంది. పాఠకుడి కాల్పనికతకు పూరించవలసిన ఖాళీలన్నవి నవలలోనే ఉంటాయి. దానికి బదులుగా ఒక కథ ముగింపు తర్వాతే మొదలవుతుంది. పూర్తవ్వగానే ఆ నేపథ్యానికే పాఠకుడిని మళ్ళీ తీసుకువెళ్ళడమే కథ లక్ష్యమయ్యుంటింది. ఈ కథ నిష్క్రమణతో ముగుస్తోంది. మంచికథ దాని ముగింపులో పునఃప్రారంభాన్ని, నిజమైన ఆరంభాన్ని చేరుకుంటుంది.

నాగి పైన శివకు కలిగే ప్రేమ, మధ్యలో వచ్చే కస్తూరి, సానుభూతితో పిలిస్తే వస్తోందా అని ముగించే మరో కథలో కథకు ఉండాల్సిన పతాకస్థాయి ఉన్నప్పటికీ దాని ఆత్మ ఆ అంచును దాటి అంతకుమించి తీవ్రతను సంతరించుకోలేదు.

రసవాదానికి సంబంధించిన కథలో పతాకస్థాయి లేదు. లేదా అనువాదంలో ఏదైనా వదిలివేయబడిందా? నాణాన్ని అందుకొని తిరిగిచ్చేది బంగారు నాణెమా?

ఈ సంకలనంలోని ఆధునిక ధోరణిలోని కథ ‘దివా స్వప్నం.’ మగవాడి అస్తవ్యస్తమైన, గాలికివదిలేసిన గది. అసంపూర్తిగా నిర్మితమైన పిచ్చుక గూళ్ళు. అక్కడ వచ్చే మనోరమ అనే స్త్రీ  (మనసును వశీకరించేది అన్న పేరు సముచితమైనది) ఆ గదిని మళ్ళీ తీర్చిదిద్దుతుంది. మెల్ల మెల్లగా ఆమె కూడా ఆ గది అనే వాస్తవికతలో ఒక భాగమవుతోంది. ఆధునికవాదపు ప్రారంభకాల కథలు వచ్చిన క్రమంలో అవి పూర్తిగా మానసికపరమైనవి. ఉద్వేగాలను క్లుప్తంగా చైతన్య స్రవంతిలో (stream of consciousness) వ్యక్తికరించేవి. ఆ కథ చెప్పే పద్ధతి ఇప్పుడు కాస్త పాతబడింది.

ఈ సంకలనంలోని ప్రధాన కథ ‘పడవ సాయం.’ అనుపమ అనే ముసలావిడని అవతలి తీరానికి చేర్చేవాడు, లేదా అవతలి తీరంలో నుండి వచ్చేవాడు –  పాఠకుడి కల్పనకు పని పెట్టేవిధంగా సహజధోరణీలో ఉండీ లేనట్లుగా ఉన్నాడు. కనుక ఆ కథ మనలో విస్తరిస్తోంది.

తెలుగుకథలు కొత్తపుంతలు తొక్కుతున్నాయని తెలిపే సంకలనమిది. మరికొన్నేళ్ళలో ఆధునిక సాహిత్యంలో భారతీయ భాషలకు ప్రధాన వేదికగా తెలుగు సాహిత్యం నిలిస్తే అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అనువాదం సరళమైన పాఠనానుభూతిని అందిస్తూ ముందుకు సాగింది.

                                           -జయమోహన్

Jeya mohan

జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది‌, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్‌ అనే నవల అకిలన్‌ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దంపట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు.

jeyamohan.writer@gmail.com

శ్రీనివాస్ తెప్పల

శ్రీనివాస్ తెప్పల 1989 విశాఖజిల్లాలోని పాయకరావుపేట లో జన్మించారు. 1998 లో కుటుంబంతో పాటు చెన్నైలో స్థిరపడిన తను, విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తి చేసుకున్నారు. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన తను ఆరేళ్ళు గ్రాఫిక్ డిజైనర్‍‍గా పని చేసి 2019 లో జాబ్ వదిలేసి, ప్రస్తుతం సినిమాల్లో సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. సాహిత్యం మీదున్న ఆసక్తితో కొన్ని కథలను, కవితలను అనువాదం చేశారు. కుమార్ కూనపరాజు గారి కథలను ఎంపిక చేసి ‘ముక్కుళిపాన్’ పేరిట, పెద్దింటి అశోక్ కుమార్ గారి జిగిరి నవలను ‘కరడి’ పేరిట తమిళంలోకి అనువదించారు. తమిళ రచయిత నరన్ గారి కథాసంకలనం ‘కేశం’ త్వరలో తెలుగులోకి రానుంది.


Spread the love

One thought on “జీవితపు సూక్ష్మతా, నిరాకారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *