మబ్బులులేని నీలాకాశంలో పూర్ణచంద్రుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. ఆనడిరేయివేళ రెండునక్షత్రాలు భువికి దిగిరాసాగాయి.
నక్షత్ర ధ్వయాన్ని పరికించిన తారామండలమంతా విస్మయాశ్చర్యాలకు లోనవుతూ “ఆతారకలేవోగాని మనోవేగాన్నిమించి ఏతావునకు సాగిపోతున్నాయో!?” గుసగుసలుపోతూ వాటిదెశ వీక్షించసాగాయి.
నక్షత్రధ్వయ ఆగమనాన్ని పసిగట్టిన హంపినగర ఉపరితలాన పరివ్యాపితమైవున్న వాయుతరంగాలు అప్సరోభామినులను మరిపింపజేస్తూ నర్తించసాగాయి. నగరానికి నాలుదిశలా కొలువుదీరిన హేమకూట, మాతంగ, మాల్యవంత, అంజనాద్రి పర్వతాలు ఆనక్షత్రధ్వయం తమ శిరస్సులపైననే పాదంమోపితే బావుండునన్న కోరికతో తపించిపోసాగాయి.
తుంగభద్రానది తోయమాలికల సుస్వరాలతో ఆగమగీతాలాపనకు పూనుకుంది. తరులన్నియూ ఉధృతంగా ఊగిపోతూ సంతోషాన్ని వ్యక్తంచేయసాగాయి. శిథిలారామాల్లోన్ని గబ్బిలాలన్నీ సమూహాలుగా వెలికిదూసుకొచ్చి గాలిలోగిరికీలు కొట్టసాగాయి. విరూపాక్షాలయంలోని జేగంటలు వాటంతటవే వేగంగాచలిస్తూ సహర్శామోదంగా నాదించసాగాయి
వీక్షించుచుండగానే నక్షత్రద్వయం మాతంగ పర్వత శిఖరాగ్రంపైదిగి మానవ రూపములు ధరించినవి. వారిలో ఒకరు ఆరడుగులు ఎత్తున, అందుకుతగినసౌష్టవంతోనూ, గౌరువర్ణంతోనూవున్న వృద్ధుడు. అతని రూపం దేవగురుడు బృహస్పతిని తలపించుచున్నది.
మరొకరు మధ్యస్థపు ఎత్తుతోనూ, సాముగారిడీలుచేసి, చేవదేరిన దృఢమైన కృష్ణవర్ణపు కాయంతోనూ, అందమైన మీసకట్టుతోనూ, చురుకైన కనుదోయితోనూ, శిరస్సున స్వర్ణమకుటంతోనూ, రాజసం ఉట్టిపడుతున్న ముఖవర్చస్సుతోనూవున్న వయస్సెంతో చెప్పలేనివిధంగా వున్నాడు. శిఖరంమీద దిగినవెంటనే నాలుదిశలా కనుచూపుమేర నిర్ణీమేషంగా వీక్షించిన అతడు వృద్దునిదిశకుచూస్తూ రుద్దస్వరంతో “ఏమిటిది? అప్పాజీ! వజ్ర వైఢూర్య,మరకత మాణిక్యాలను రాశులుగాపోసి అమ్మిన హంపినగరం శిథిలాలదిబ్బగా మారిపోయినదేమి!?”
ఆమాటలను ఆలకించిన అప్పాజీ “ప్రభూ కృష్ణరాయా! గడచిన అయిదువందల అరువది వత్సరములుగా తమరు ఎన్నోమారులు హంపినగర సందర్శనమునుగురించి ప్రస్తావించిననూ నేనెందుకు మౌనాన్ని ఆశ్రయించితినో ఇప్పటికైనా మీకుఅవగతమైనదా? మీలోనానాటికీ బలీయమౌతున్న హంపినగర సందర్శనాభిలషను అవగాహన చేసుకున్నా మీదట ఒక్కసారివెళ్ళి వచ్చేదమని అమరేంద్రుని ఒప్పించినాను. అందుకీ గురుపూర్ణిమను ముహూర్తముగా నిర్ణయించినాను” విషయాన్ని ఎంతోమృదువుగా రాయలవారికి వివరించాడు అప్పాజీ.
“అప్పాజీ! మీఆలోచలనను అర్ధంచేసుకోవడంలో నాబలహీనతను మరొకమారు మంన్నించగలరు” రాయలవారు మరేదో అనబోవుచుండగా వారించిన అప్పాజీ “వాత్సా! తడవుచేయక నగర సందర్శనమునకు బయలుదేరుము” అన్నాడు.
2
అప్పాజీ, రాయలవారలిరువురూ మాతంగపర్వత శిఖరం మీదనుండి నేరుగా హంపినగరంలోకెల్లా అతిపెద్దరూపంలో కొలువుదీరిన శనగగింజ వినాయక మందిరానికి చేరుకున్నారు.
ధ్వంశమైపోయి పూజాపునస్కారాలకు దూరమైన శనగగింజ వినాయకుణ్ణిచూసి మనస్సు వికలమైపోయిన రాయలవారు “అప్పాజీ! ఏమిటీ వైపరిత్యం? అసలీ హంపినగర విధ్వంశకులెవరు? ఎందుకు వారలింత అఘాయిత్యానికి పాల్పడినారు?”కనుకొలుకులనుండి కన్నీరు జాలువారిపోతుంటే అప్పాజీ ముఖంలోకి చూస్తూ ఆవేదనగా ప్రశ్నించారు.
“ప్రభూ! మీతదనంతరం విజయనగర సామ్రాజ్యం రెండుతరాలపాటు శతృదుర్భేద్యంగా నిలిచివుంది. కానీ, రామరాయల కాలంనాటికి ఎడతెరిపిలేని యుద్ధాలకారణంగా సామ్రాజ్యం బలహీనమైపోవడంతోపాటు, మనసైనిక పాటవమూ నిర్వీర్యమైపోయినది. దానికితోడు మనశతృవులైన బహమనీసుల్తానులంతా కలిసికట్టుగా నగరంమీదికి దండెత్తినారు. అనేక భేదోపాయములనుఫన్ని మనవారిని ఏమార్చినారు. యుద్ధంలో ఆదిల్ షా తనకరవాలంతో రామరాయల తలను మొండెంనుండి వేరుచేసి యుద్ధభూమిలో ప్రదర్శించినాడు. ఆదృశ్యాన్నిచూసిన మనసైనికులంతా ప్రాణభయంతో కకావికలమైపోయినారు.
ఆవిధంగా విజయనగర సామ్రాజ్యపతనం పరిపూర్ణమైపోయినది. బహమనీ సుల్తానుల సమస్తసైన్యములు ఆరుమాసాలపాటు ఎడతెరిపిలేకుండా నగరవిధ్వంసానికి పూనుకున్నాయి. ఆవిధ్వంసంలో ఒక్క విరూపాక్షాలయం మాత్రం మిగిలిపోయినది. ఆగమ శాస్త్రానుసారం ఖండితవిగ్రహాలకు ధూపదీపఅర్చనాదికాలు నిషిద్దం. కావున ఆనాటినుండి మనసమస్త ఆలయాలు ఈవిధంగా గబ్బిలములకు నెలవులుగా మారిపోయినాయి” బరువెక్కిన హృదయంతో విజయనగర సామ్రాజ్య పతనాన్ని కాలచక్రంలో వీక్షిస్తూ వివరించినాడు అప్పాజీ
అప్పాజీ నోటివెంట వెలువడుతున్న ఒక్కోవాక్యం ఒక్కోశరాఘాతమై గుండెనువ్రయ్యలు చేయుచుండగా నిరుత్తరుడైపోయిన రాయలవారు “అప్పాజీ! ఆవిరూపాక్షాలయమొక్కటీ శత్రుమూకల విధ్వంసంనుండి ఎలాతప్పించుకున్నది?” అమితాశ్చర్యంతో ప్రశ్నించినారు.
“ప్రభూ! సమస్తజగాలనూ సంరక్షించే సర్వేశ్వరునికి తననుతాను ఎటుల రక్షించుకోవలెనో తెలియదా? విజయనగర సామ్రాజ్య రాజముద్రిక ప్రతిరూపం విరూపాక్షాలయ సింహాద్వారాలమీదా గాలిగోపురాలమీదా చిత్రితమై నిలిచిపోయినవి. అందుగల వరాహమూర్తి ప్రతిమను వీక్షించిన ముష్కరులా ఆలయం జోలికిరాకుండా తొలిగిపోయారు” వివరించాడు అప్పాజీ.
దు:ఖంతో బరువెక్కిన గుండెలను ఒడిసిపట్టుకుంటూ ప్రభువు, సచివులిరువురూ శనగగింజ వినాయక మందిరంనుండి నేరుగా విరూపాక్షాలయానికిచేరుకుని దైవదర్శనం చేసుకుని రాజవీధిని చూద్దామని బయలుదేరారు.
ప్రపంచచరిత్రలో రతనాలను అంగడిలో రాసులుగాపోసి కుంచాలతోఅమ్మిన ఏకైక రాజవీధి నేడు పందుల, పశువుల విసర్జకాలకు ఆలవాలమై కాన్పించడంతో ఉద్వేగానికిలోనైపోయిన రాయలవారు పక్కనేవున్న ఓఅశ్వథవృక్షం కిందకుచేరి తనలోతాను పొగిలిపొగిలి ధు:ఖించసాగారు.
రాయలవారిని అంతబేలగా ఏనాడూ చూసిఎరుగని అప్పాజీకూడా ఉబికివస్తున్న దు:ఖాన్ని అతికష్టంతో నిభాయించుకుంటూ రాయలవారినిచేరి “ప్రభూ! అనంతసృష్టిలో కాలసర్పం కాటుకు గురికానివస్తువంటూ ఒక్కటీవుండదు. సృష్టి, స్థితి, లయ పున: పున: జరిగిపోతూనే వుంటాయి. అన్నీతెలిసిన మీవంటి విజ్ఞులు ఈవిధముగా వగచడం దైవదూషణ క్రిందకివస్తుంది. కాబట్టి దు:ఖాన్ని సైరించి “ఉగ్రనరసింహునికడకేగి ఆయనతోపాటుగా ఆప్రక్కనే కొలువుదీరిన బడవలింగేశ్వరుడు ఏవిధంగానున్నాడో వీక్షించెదము” రాయలవారికి కర్తవ్యబోధచేశాడు అప్పాజీ.
గోమాతవెంట లేగదూడ మాదిరిగా అప్పాజీని అనుసరించిన రాయలవారు శిధిలాల కుప్పగామారిపోయిన హజారరామాలయాన్ని,కృష్ణాలయాన్నీ కన్నీటితెరలమధ్య వీక్షించుకుంటూ ఉగ్రనరసింహుని చెంతకు చేరుకున్నారు.
కిరాతమూకల దాడిలో మందిరంతోపాటు అమ్మవారినిసైతంకోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన నృసింహుడు ఉగ్రత్వాన్నికోల్పోయి, బేలతనం ఆవహించిన వానితీరున కనిపించడంతో కలతచెందిన అప్పాజీ “కుమారా! నేనిక్కడ ఇంకొక్కక్షణంకూడా నీలువజాలను” అంటూ భగవంతునికి మనస్సులోనే అంజలి ఘటించి పక్కనేవున్న బడవలింగేశ్వరుణ్ణి చేరుకున్నాడు.
యాత్రీకులు సమర్పించిన మారేడుదళాల మధ్య బితుకు, బితుకుమంటూ మూడడుగులలోతు నీటిమధ్య నిచ్చలంగా నిలిచివున్న బడవలింగేశ్వరుణ్ణి మనసులోనే అర్చించుకున్నారు.
“తదుపరి ఎచటికేగెదము?” అన్నట్టు అప్పాజీ కళ్లలోకి చూశాడు రాయలవారు.
ఆచూపులకు అర్ధం ఎరిగిన అప్పాజీ “ప్రభూ! సప్తస్వర సుగాత్రియైన రాతికంభాన్ని కలిగివున్న రంగమండపాన్ని, ఏకశిలానిర్మిత రధారూఢుడైన పాండురంగ విఠలుణ్ణి ఒక్కసారి కన్నులనిండుగా వీక్షించి, మయబ్రహ్మను మించిన ఆస్థానస్థపతి కేతనాచార్యులవారిని స్మరించుకుంటూ కంబవీణయ సప్తస్వరాలాపనతో సేదదీరేదము” వివరించినాడు.
విఠలాలయంపేరు చెవిసోకగానే రాయలవారి హృదయమందిరంలో శాశ్వతముగా ప్రతిష్టితమైవున్న చిన్నాదేవి ఒక్కసారిగా అక్కడప్రత్యక్షమై రంగమండపం కదిలిపోయేలా నర్తిస్తున్నాట్టు కలలుకంటూ ఆనందపు వలయాల్లో కూరుకుపోయినారు.
ఆక్షణంలో రాయలవారి మన:కాసారంలో పరువులిడుతున్న ప్రకంపనలేమిటో ఎరిగిన అప్పాజీ తనలోతానే ముసిముసిగా నవ్వుకుంటూ “వత్సా! నీఅంతరంగంలో ప్రతిష్టితమైవున్న చిన్నాదేవి ఈరంగమంటపంలోని కణకణంలోనూ కళ్ళింతలుచేసుకొని ఇంతకాలముగా నీకోసం నిరీక్షిస్తూనేవుండి వుంటుంది. నీదర్శనభాగ్యంతో ఆతల్లి నిరీక్షణ నేరవేరి, తానూ మనతోడనే పరోక్షముగా ఊర్ధ్వలోకములకురానున్నది. కావున మనము సత్వరమే అటకేగుదము!” అనగానే రాయలవారు మౌనంగా ఆయనను అనుసరించినారు.
విఠలాలయమార్గంలోని అశ్వశాలల సముదాయమంతా, కాలం పదఘట్టనలకు ధ్వంశమైపోగా అక్కడక్కడా మిగిలిపోయిన రాతిస్థంభాలుకొన్ని గతవైభవచిహ్నాలుగా కన్పిస్తున్నాయి.
వాటిని చూసినవెంటనే తన పంచకళ్యాణి గాలిలోతేలివస్తూ కన్నుల ముందు నిలిచినట్లుగా భ్రమిస్తూ అప్పాజీతోపాటు మెల్లగా విఠలాలయ ప్రాంగణంలో రాయలవారు పాదంమోపారు.
ప్రాభవవైభవాలను కోల్పోయిన సప్తస్వర కంభమండపాన్ని వీక్షించి విచారమగ్నుడైన రాయలవారు “ఆహ్హో..కాలమా! నీకరకు పాదతాడనానికి నానెచ్చెలి చిన్నాదేవి నర్తించిన ఈసుందరమడపం నేడెంత దైన్యతను సంతరించుకున్నదో వీక్షించుచున్న మా మానసం సుడిగుండంలో చిక్కువడిన పీపీలికమువోలె గిర్రునతిరిగిపోవుచున్నది. ఇంక మేమిచ్చట క్షణకాలంకూడా నిలువజాలము” అనుకుంటూ వెనుదిరిగినారు.
రాయలవారి మనస్సులో ఏజ్ఞాపకాల దవాలనం నాలుకలుసాచి విజృంభించుచున్నదో పసిగట్టిన అప్పాజీ దేవుడులేని విఠలాలయాన్ని ఏకశిలానిర్మిత రాతి రధాన్ని చుట్టివచ్చి, విచారమగ్నతతోనిండిన మనస్సును దిటవుపరుచుకొని వడివడిగా రాయలవారి కడకుచేరుకున్నాడు. అచ్చటినుండి ఇరువురూ రాణిమహల్ దిశగా సాగినారు.
3
అప్పటివరకూ తాముచూసిన దుర్భర దృశ్యాలకు పరాకాష్ట అన్నట్టుగా నామమాత్రపు ఆనవాలుకూడాలేకుండా రాణిమహల్ మొత్తము ఓమట్టిదిబ్బగా దర్శనమిచ్చినది. ఆ మట్టిదిబ్బను చూసిన తక్షణమే పట్టపురాని తిరుమలాదేవి బేలచూపులతో వారికళ్ళముందు ప్రత్యక్షంకావడంతో భరింపరానిబాధతో బాహ్యస్మృతిని కోల్పోయిన రాయలవారు, అంతరంగాన దు:ఖపుసుడుల్లో లుంగలు చుట్టుకుపోయారు.
వారి మానసికస్థితిని గమనించిన అప్పాజీ వెంటనే తనను దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకుంటూ “కృష్ణరాయా! లేనిదానికి వగచేకన్నా వున్నదానినిచూసి సంతోషించడం గొప్ప సుగుణం. కాలప్రవాహంలో ఆనవాలులేకుండా కొట్టుకుపోయిన రాణీమహల్ని గురించిన దు:ఖాన్ని వదిలిపెట్టు. అదుగో అటుచూడు అయిదువందల అరువది వత్సరాలుగాకాల ప్రవాహానికి ఎదురునిలిచివున్న పద్మమహల్ని, నీ మన:క్షేత్రంలో ఎన్నెన్ని సుందర దృశ్యాలు సప్తవర్ణశోభిత ఇంద్రఛాపములై సుందరనందనముగా రూపుకట్టి కదలాడుతాయో” వేసవితాపము నుండి రాణీవాసపు స్త్రీలు సేదదీరేటందుకు నిర్మించిన పద్మమహల్ని చెయ్యెత్తి చూపించినాడు.
దానిని పరికించిచూసిన రాయలవారు పరమసంతోషంతో చిన్నపిల్లవానితీరున దాని కడకు పరుగులుతీసినారు. గడిచిపోయిన మధురజ్ఞాపకాల తోరణాలను తడిమిచూసుకుంటూ కొంతతడవు అచ్చటనే గడిపిన రాయలవారిని మెల్లగా చేరబోయిన అప్పాజీ “ప్రభూ! ముందుకు సాగుదామా?” కరిగిపోతున్న కాలాన్ని సున్నితముగా గురుతుచేసినాడు.
“పదండి అమాత్యా!” అన్నారు.
అచటినుండి కదిలి దసరాఉత్సవ సంబరాలలో రాణీవాసపు స్త్రీలుకూర్చుండు తంతెల గద్దెను, దానికి ఎడమదిశలో నల్లరాతితో తీర్చిదిద్దిన కోనేటిని చూసుకుంటూ మెలమెల్లగా గజశాల వైపుగాసాగిపోయిన ప్రభువు, సచివులిరువురూ దానిని వీక్షించుచూ పడమరదిశగా నడచి, అచ్చటగల మావాటీల గృహసముదాయం ముందరగల రాతిఅరుగులమీదకూర్చుని, అప్పటిదాకా తామువీక్షించిన హృదయవిదారక విధ్వంస అవశేషాలపై కొంతతడవు పునశ్చరణ చేసుకున్నారు.
“అప్పాజీ! ఐదువందల అరువదివత్సరాలుగా హంపినగరాన్నిమరొక్కమారు వీక్షించాలన్న నాకాంక్ష నేటితో తీరిపోయినది. కానీ, ఇప్పుడు ఆలోచించిన అసలురాకుండా వుండివుంటేనే బాగుండేడిదేమో అనిపించుకున్నది. రాకుండా వున్నటులైతే నాటిసిరులుపొంగు సుందర హంపినగరము నామనోవీధిని అటులనే శాశ్వతంగా నిలిచివుండేడిది” రాయలవారు దీర్ఘనిశ్వాసంతో అప్పాజీ వంకచూస్తూ అన్నారు.
“లేదు ప్రభూ! ఇటులరావడమే తమరికి మేలైనది. మనము రాకుండిన ఆకోరిక మీహృదాంతరాళములో జ్వలిస్తూనే వుండేదిది”రాయలవారి చేతను సమర్ధించాడా జ్ఞానసచివుడు.
కొంతతడవు తనలోతానేదో ఆలోచించిన రాయలవారు ఆఖరికి శిర:కంపనంచేస్తూ “అప్పాజీ!మనమిచటినుండి నిష్క్రమించుకాలము ఆసన్నమైనటులున్నదికదా? బయలు దేరుదమా?” భారమైన గొంతుకతో తిమ్మరుసువంక చూస్తూ అన్నారు.
“ప్రభూ! మీరన్నటుల మనము తిరిగి వెళ్ళవలసిన సమయం ఆసన్నమగుచున్నది. కానీ, నేనింతకు మునుపే, మీరెరుగాని ఓఆధునిక దేవాలయాన్ని వీక్షించవలసివున్నట్టుగా విన్నవించితినిగదా? అచటికేగుదమా? నర్మగర్భంగా నుడివినాడు అప్పాజీ.
ఆతని మాటలను ఆలకించిన రాయలవారు ఆశ్చర్యంతో “అప్పాజీ! హంపినగర పరిసరాలలో అంతటి ప్రశస్తమైన అధునాతన ఆలయమేమున్నది?” ప్రశ్నించినారు.
“ఔను కుమారా! నిజముగనేవున్నది. తక్షణమే మనమా దేవాలయము కడకేగి వీక్షించిన పిమ్మట అటునుండి అటే అమరావతికి వెళ్ళిపోవుదము” ఎన్నడూలేనిది తనస్వరములో కొంత చిలిపితనాన్ని మేళవింపజేస్తూ నుడివినాడు అప్పాజీ.
4
“ఒహ్హో అప్పాజీ! హంపినగరాన్ని ఆనుకొని ఇంతటి విశాలసాగరమెటులేర్పడినది!? ఇంతటిపొడవైన సేతువును ఎటులనిర్మించినారు? సేతువుకింద ఎంతటి నాయనానందకరమైన సాగుభూములున్నవి!? ఈఅద్భుత సేతువు వివరములేమిటో మాకు వివరింపుడు” అలవి మీరిన ఉత్సాహంతో రాయలవారు తిమ్మరుసుపైన ప్రశ్నలను సంధించినారు.
ఔను ప్రభూ! మీరన్నటుల ఇది ముమ్మాటికీ మానవనిర్మిత అద్భుతసాగరమే. ఈసాగరం మన తుంగభద్రాతల్లి పైన ఆధునిక, సాంకేతిక నిపుణులు నిర్మించిన సేతువు” అంటూ వివరించసాగినాడు తిమ్మరుసు.
గురువు మాటలకు రిచ్చబడిపోయిన రాయలవారు “ఇప్పుడీ రాజ్యమును పాలించుచున్న రాజవంశ మెయ్యది? ఎవరి ఆధ్వర్యమున? ఎవరిపేరున? ఈ సేతువు నిర్మితమైనది?” ఆసక్తిగా ప్రశ్నించినారు.
“ఏమనిచెప్పను కుమారా! ఇప్పుడిక్కడ రాజ్యము చేయుచున్నది మీవంటి ప్రభువులుకారు. నడుస్తున్నది అలనాటి రాజరిక వ్యవస్థ అంతకన్ననూకాదు. ఈసాగరమును నిర్మించిన నిపుణునిపేరు విశ్వేశ్వరయ్య. ఈసాగరమును తమరి పేరుమీదుగనే ‘కృష్ణరాయసాగరం’ మనుపేర నిర్మించినారు” వివరించినాడు అప్పాజీ.
ఆమాటలువిన్న రాయలవారు అవధులులేని విస్మయంతో “ఏమేమి!?” అన్నారు. “ఔను ప్రభూ! ఇప్పుడిచట నడుస్తున్నది అద్వితీయమైన ప్రజాస్వామ్యవ్యవస్థ. ఈవ్యవస్థ ‘ప్రజలనుండి, ప్రజలకొరకు, ప్రజలచేత’ అన్న మౌలికసూత్రానికి కట్టుబడి పనిచేస్తుంది. పాలకులు ఎన్నుకోబడతారు. ప్రజలు ఏదికావలని కోరుకుంటే పాలకులు దానినే శాసనంగా తీసుకొస్తారు. శాసనంవలన సంక్రమించిన అధికారంద్వారా పాలనసాగిస్తుంటారు” ప్రజాస్వా,మ్య ప్రక్రియ విధివిధానాలను గురించి తనశిష్యునికి వివరించినాడు ఆప్పాజీ.
“అది అంతయూ సత్యమేనందురా? అప్పాజీ!” సందేహముగా అడిగినాడు రాయలవారు.
“సత్యమే వత్సా! నాటి రాచరిక వ్యవస్థలో ప్రభువుల అభీష్టమే ప్రజలకు శిరోధార్యము. ప్రజాభిష్టానికి వీసమెత్తువిలువ వుండేడిదికాదు. నేటి ప్రజాస్వామ్యవ్యవస్థలో ప్రజాభిప్రాయమే పాలకులకు పరమావధి” ప్రజాస్వామ్యవ్యవస్థ తీరుతెన్నులను విపులముగా రాయలవారికి వివరించినాడు అప్పాజి.
అప్పాజీ చెప్పినదంతయూ మనసుపెట్టివిన్న రాయలవారు “ఔను అప్పాజీ! మీరు చెప్పిన దానినిబట్టి అలనాటి రాచరిక వ్యవస్థకన్నా ఈనాటి ప్రజాస్వామ్యవ్యవస్థే అద్వితీయమైనదిగా తోచుకున్నది” తన అభిప్రాయాన్ని తెలియజేశారు
“అంతేకాదు ప్రభూ! రాచరిక వ్యవస్థలో కేవలం రాచకుటుంబంలోనివారు మాత్రమే ప్రభువులు కాగలుగుతారు. ప్రజాస్వామ్యవ్యవస్థలో ఒకసాధారణపౌరుడుకూడా పాలకుడు కాగలడు. ఆవిధంగా చూసినప్పుడు పాలనా రీతులలో ప్రజాస్వామ్యానికి ప్రత్యామ్నాయమేలేదు” ప్రజాస్వామ్యంపట్ల తన సంపూర్ణసానుకూలతను వ్యక్తంచేసినాడు అప్పాజీ.
“అంతేకాదు అమాత్యా! అలనాటి మనశిల్పుల అపారమైన వృత్తికౌశలాన్ని, సామాన్య ప్రజల శ్రమశక్తినీ, అంతులేని ప్రజాధనాన్నీ వెచ్చించిన రాజులు, తమకీర్తి ప్రతిష్టలకోసం గుళ్ళు, గోపురాలపేర రాళ్ళపాలు చేసినారు. ఇప్పటి హంపినగర సందర్శన ఆవిషయాన్నే తేటతెల్లం చేస్తుంది. అలనాటి మనశిల్పుల నిర్మాణనైపుణిని, అంతులేని మానవశక్తిని, అపార సంపాదనూ వెచ్చించి ఇటువంటి జలాశయములనునిర్మించి ఉన్నటులైతే లక్షలాది ఎకరముల బీడుభూములు శతాబ్దముల క్రిందటనే సాగులోనికివచ్చి సామాన్యప్రజలు సుఖశాంతులతో జీవించియుండేడివారు. ఆజలాశయములే నిజమైనదేవాలయములుగా నిలిచిపోయి ఆయా రాజుల చరిత్రలు ఆచంద్రతారార్కము ప్రజల నాలుకలమీద నిలిచియుండేడివి.
ఎన్నితీరుల యోచించినప్పటికీ అలనాటి రాచరికవ్యవస్థకన్నా ఈనాటి ప్రజాస్వామ్య వ్యవస్థ, ఆనాటి శిల్పసంపాదకన్నా ఈనాటి ఆనకట్టల ఆధునిక దేవాలయములే సామాన్యులకు నిస్సందేహముగా ఉపయుక్తమైనట్టివని ఘంటాపథముగా చెప్పవచ్చును” రాయలవారు తన మనసులో కదలాడుతున్న భావాలను వ్యక్తంచేశారు.
“ప్రభూ! మీరన్నది అక్షరసత్యం. ఎన్నోఏండ్ల పిమ్మట మనం చేసిన హంపినగర సందర్శనంతో ప్రజాస్వామ్యవ్యవస్థకు ప్రత్యామ్నాయమేలేదన్న గొప్ప సత్యాన్ని అవగతం చేసుకున్నాము. మన ఈసందర్శనమునకు లభించిన అంతిమఫలము అదియే” అప్పాజీ ఇంకనూ ఏదో చెప్పబోవుచుండగా ..
తూరుపుదిశలో వేగుచుక్క పొడిచినది. దూరముగా ఎక్కడినుండో తొలికోడికూత వినిపించింది.
ఆమరుక్షణమే అప్పాజీ రాయలవారలిరువురూ తిరిగి నక్షత్రాలుగామారి తారామండలం దిశగా సాగిపోయినారు.
5
“రాయలవారూ! అప్పాజీ మీరు వెళ్లొద్దూ.. వెళ్ళొద్దూ…”
“నీకేన్నసార్లు చెప్పినా ఏదోపుస్తకం చదవడం, అందులోని పాత్రలను తలపోస్తూ కలవరించడం. నీకిదో పెద్దజబ్బైపోయింది” నాగదిలోకొచ్చిన అమ్మ అప్పటిదాకా నా గుండెలమీదున్న ‘విజయనగర సామ్రాజ్యవైభవం’ చారిత్రక నవలను తీసి పక్కనపెడుతూ నన్ను తట్టి లేపింది.
“ఎంత మంచి కలను పాడుచేశావమ్మా!”అంటూ నేను నిరాశగా పక్కమీది నుండి లేచాను.
—- అయిపోయింది —-





