ఆసిఫ్ జహాన్ కోడలు

Spread the love

స్టోరీ లైన్: వైద్య సదుపాయాలు ఉన్నా కానీ మునుపటి రోజుల్లో దాయమ్మలతో ఇంట్లోనే అపరిశుభ్రమైన, ప్రమాదకరమైన వాతావరణంలో ఆడవాళ్ళకి కాన్పులు చేసేవారు. వైద్య కారణాల వల్ల బిడ్డ బయటకి రాలేకపోయిన ఆశుపాత్రులకి తీసుకెళ్ళేవాళ్ళు కాదు. దాయమ్మల మీదే నమ్మకంతో ఉండేవాళ్లు. ఈ క్రమంలో కానుపు సమయంలో, తరువాత మాయ బయటకు రాక చాలా రక్తస్రావం అయ్యి స్రీలు ప్రాణాంతక పరిస్థితుల్లోకి వెళ్లిపోయేవాళ్ళు. బిడ్డ కూడా మరణించి పుట్టటమో.,పుట్టాక మరణించడమో, తల్లి కూడా కాన్పులో మరణించడం జరగేది.స్రీలు నరక యాతన పడేవాళ్ళు. ఆసుపత్రికి వెళ్ళి ప్రాణాలు కాపాడుకోవాలన్న కోరికని కూడా వ్యక్త పరచలేని, డిమాండ్ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రాణాలు కోల్పోయేవారు. పిల్లలు తల్లి లేని అనాథలు అయ్యేవారు. కుటుంబ నీయంత్రణని నిషేధించిన మతంలో పుట్టిన కారణంగా స్రీలు ఋతు క్రమం ఆగిపోయే దశవరకూ పిల్లల్ని కనాల్సిందే. ప్రతి కానుపూ వారికి ప్రాణాంతకమే. నిత్య గర్భాలు,ప్రసవాల్లో పోయే రక్తం, నిత్యం పిల్లలకు పాలిస్తూనే  ఉండాల్సి రావడం వల్ల రక్త హీనత, క్యాల్షియం లోపం తో ఎముకలు బలహీనం అయిపోవడం వాళ్ళు అనుభవించే నిత్య ఆరోగ్య సమస్యలు. అంతే కాదు నిత్య గర్భాల స్థితిలో ఉండడం  వల్ల,అధిక సంతానం,బీదరికాల వల్ల  మానసికంగా విపరీతమైన వొత్తిడి వలన డిప్రెషన్, ఆందోళన లాంటి మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అప్పటి కాలం  నుంచి ఇప్పటి కాలం 2024 వరకే ఈ పరిస్థితుల్లో ఏ మార్పు లేదు. విద్య, చైతన్యం పెరిగి కొద్ది మంది ఇప్పుడు కుటుంబ నియంత్రణ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఈ కథలో రచయత్రి  తన కాలం నాటి ముస్లిం సమాజం లో మత కట్టుబాట్ల వలన స్రీలు ఎలా తమ ప్రత్యుత్పత్తి, లైంగిక హక్కులకి దూరమై సమస్యలను ఎదురుకున్నారో విశ్లేషించే ప్రయత్నం చేశారు. ఇక కథలోకి వెళదాము.

====================

ఆసిఫ్ జహాన్ భర్త బాగా డబ్బులున్న డిప్యూటీ కలెక్టర్. వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు నూరుల్ హసన్ ఎంతో మంది పిల్లలు పుట్టి చనిపోయాక బతికిన వాడు కాబట్టి అతి గారాబంగా పెరిగాడు. అంత మంచి కుటుంబం లో పిల్లను ఇవ్వడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి.  కానీ ఆసిఫ్ జహాన్ కి మాత్రం కుబరా ఇంటి నుంచే కోడల్ని తెచ్చుకోవాలని మహా ఆశగా ఉంది. ఆమె ఆ ఇంటి ఆడబిడ్డ అవడం, తన బావమరిది భార్య అవడం కూడా బాగా కుదిరాయి. ఇదంతా ఆమె దూరదృష్టి అనచ్చు. ఎందుకంటే  నూరుల్ హాసన్ కాబోయే భార్య  అత్తగారింట్లో పనిచేస్తే పుట్టింటివాళ్ళకి కోపం వస్తుంది. పుట్టింట్లో పనిచేస్తే అత్తింటివాళ్ళకి కోపం వస్తుంది. అదే కుబరా బిడ్డని చేసుకుంటే ఏ బాధా ఉండదు. రెండు వైపులా అందరూ సంతోషంగా ఉంటారు. ఇంత దూరం ఆలోచించింది ఆసిఫ్ జహాన్. 

కుబరా బేగం కి ప్రతి ఏడాది ఒక కొడుకు పుడుతూ ఆమెకి ఇరవై ఐదేళ్లు వచ్చేప్పటికి  ఐదుగురు మగపిల్లలు పుట్టేశారు. అదృష్ట వంతురాలంటే కుబరానే మరి. ఎందుకంటే ఆడపిల్ల భారం కదా.  కుటుంబంలో అందరూ ఆమె అదృష్టాన్ని చూస్తూ సంతోషించేవాళ్లు. ఎంత సేపూ కుబరా కొడుకునే ఎత్తుకుని కనిపించేది. ఎవరూ కూడా  ఆడపిల్లని ఆమె వొడి లో ఊహించలేక పోయేవాళ్ళు. శత్రువులకి కూడా ఆడపిల్ల  వద్దు అనుకునేవాళ్ళు. కుటుంబం లో కుబరా  బేగం కి కొడుకు పుడితే అందరూ పండగ  చేసుకునేవాళ్ళు. కానీ ఆసిఫ్ జహాన్ మాత్రం బాధపడేది. కాన్పు ఎన్నోదైనా ఎవరికైనా ప్రాణాంతకమే. కానీ కుబరా బేగం కి కొడుకు పుట్టటం ఆసిఫ్  జహాన్ కి  ఏ మాత్రం ఇష్టం ఉండేది కాదు. ఆమెకి ఆడపిల్ల కావాలి తన కొడుక్కి భార్యను చేసుకోవడానికి. ఇక్కడ చూస్తే కుబరా ఎప్పుడూ మగ పిల్లాడ్ని కంటూ పోయేది. కాన్పు అయినప్పుడల్లా ఆమె ఏడిచేది. “ఇదంతా నా దురదృష్టం  కాకపోతే ఏంటి తొమ్మిది మంది పిల్లల తరువాత నూరుల్ హాసన్ పుట్టాడు. లోకమంతా ఎక్కడ చూడూ  ఆడపిల్లలే కనిపిస్తున్నారు.  కానీ ఇప్పుడు చూడబోతే  నూరుల్ హాసన్ కోసం ఒక్క ఆడపిల్ల కూడా దొరికేలా లేదు. కుబరాకి అంతా మగ పిల్లలే పుడుతున్నారు .  ఆ అల్లాహ్ నా కొడుకు కోసం ఒక దులహన్ న్ని పంపకూడదా”? అని అఫ్సర్ బేగం తెగ బాధ పడిపోయేది.

==================

ఈ సారి మూడు రోజుల నుంచీ కుబరా  బేగం కానుపు నొప్పులతో   చాలా అస్వస్థతతో మంచాన పడి  ఉంది. ముసలి  ఖాన్ దానీ {కుటుంబ} దాయి కాన్పు చేయడానికి వచ్చి కూర్చుని ఉంది.                                                                       ఇంటి నిండా ఆడబిడ్డలు, మరదళ్లు, ముసలివాళ్ళు, చిన్న పిల్లలతో హంగామా గా  ఉంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కానంత కోలాహలంగా  ఉందక్కడ. ఆడ వాళ్ళంతా  ఒక చోట గుమిగూడి డాక్టర్ ని  పిలవాలా వద్దా అని చర్చించుకుంటున్నారు. కుబరా బేగం కి నొప్పుల మీద నొప్పులు వస్తూనే ఉన్నాయి కానీ పొట్టలో పిల్లాడు కొంచం  కూడా కదలట్లేదు. ప్రసవం బాగా కావాలని కుబరా బేగం కి తావీజు కట్టారు, మరో పక్కమంత్రాలు చదువుతున్నారు, బలి మేకని సిద్దం చేశారు, బీదలకి బియ్యం పంచారు అన్నీ చేశారు. ఇంత చేసినా ఏం లాభం? పిల్లాడు కదల కుండా పొట్టలో అలా పడి  ఉన్నాడు. కుబరా బేగం ఒక పక్క నొప్పితో తాయి మాయి అవుతున్నది . మరో పక్క ఆసిఫ్  జహాన్ పక్క గదిలోనే నేల మీద నమాజు రజాయి  మీద కూర్చుని అల్లాహ్ ని  కుబరా బేగం కి  ప్రసవం బాగా కావాలని దువా చేస్తున్నది. “యా అల్లాహ్.,కుబేరా బేగంకి చిన్న చిన్న పిల్లలున్నారు. దయ చూపించు. ఏ ప్రమాదము లేకుండా చూడు. పనిలో పని ఈ సారి నాకు ఆడ పిల్లని కోడలుగా ప్రసాదించు. ఇప్పటికీ ఐదు సార్లు నిన్ను ఈ కోరిక కోరాను. ఈసారి కరుణించు.నాకు ఆడపిల్లనివ్వు” అంటూ అఫ్సర్ జహాన్ దువాల మీద దువాలు చేస్తూనే ఉంది. మరో పక్క కుబేరా బేగం నొప్పి భరించలేక “హాయ్ అల్లాహ్  దయ చూపించు, ఆపా నన్ను రక్షించు చచ్చి పోతున్నా” అంటూ  చేస్తున్న  అరుపులు, ఆర్తనాదాలు ఆమె చెవిన పడుతూనే ఉన్నాయి. “ కుబరా చావు మాటలు  ఇప్పుడు  మాట్లాడకు అంతా బాగవుతుంది వోపిక పట్టు” అఫ్సర్ బేగం వోదారుస్తూ అంటుంది. అరుస్తూ అరుస్తూనే  నొప్పి వోప లేని కుబరా ఎండిన పెదాలతో  “దాహం అవుతుంది ఆపా కొన్ని నీళ్ళు ఇవ్వు” అంటూ  అడిగింది. అది విన్నట్లుగానే  “గుల్ షబ్బో..వో గుల్ షబ్బో వినపడ్డం లేదా., అరె బుద్ధి లేనిదానా , కొంచెం చిన్న కటోరీలో నీళ్ళు తీసుకుని వెళ్ళు” లోపలనుంచి  ఎవరో ఒక స్రీ బహుశా బంధువేమో  గుల్ షబ్బో అనే పనికి సాయం చేసే అమ్మాయి కి అరుస్తూ చెబుతున్నది. మెల్లిగా కుబరా బేగం నొప్పులు భరించలేక   బాధతో చేసే అరుపులు ఎక్కువై పోయాయి. దానితో పాటు ఆడవాళ్ళ అరుపులు కూడా. “ఇంకొంచెం బలంగా .. ఆ అయిపోతుంది ., ఒక్క సారి ఇంకా జోరుగా తొయ్యి’’ అంటూ వాళ్ళు అరుస్తూనే ఉన్నారు. ఇక  బిడ్డ బయటకు వస్తున్నట్లుంది కుబరా బేగం ఉన్నట్లుండి  పెద్ద కేక వేసింది నొప్పిని అణుచుకోలేనట్లుగా. ఆ కేక విన్న ఆసిఫ్  జహాన్ పై ప్రాణాలు  పైనే పోయాయి. వెంటనే గాల్లో పసి పాప ఏడుపు వినిపించింది. అఫ్సర్ జహాన్ “హాయ్ అల్లాహ్., నీకు నా శుక్రియా ఆడో, మగో ఎవరైతే ఏం గానీ నువ్వు కుబరా బేగం ప్రాణాలు కాపాడావు” అంటూ మళ్ళీ మోకాళ్ల మీద కూర్చుని దువా చేసింది. చేశాక పైకి లేవబోయింది  కానీ పట్టు తప్పి పక్కకి పడిపోయి వెంటనే లేవలేక పోయింది. ఇంతలో అక్కడికి “బేగం ముబారక్ ఈ సారి ఆడపిల్ల పుట్టింది”అంటూ అరుస్తూ ఒకమ్మాయి వచ్చింది. అది విన్న ఆసిఫా  జహాన్ మొఖం  పట్టలేని సంతోషంతో వికసించింది. వెంటనే తన నడుము దగ్గరి చీర మడతలో ఉన్నచిన్న  పైసల సంచి లోంచి రూపాయి తీసి  సంతోషకరమైన వార్త చెప్పిన ఆ అమ్మాయి చేతిలో పెట్టి, ప్రసవపు గది వైపుకి వేగంగా అడుగులు వేసింది. అక్కడ చాలా మంది  స్రీలున్నారు. అందులో పెళ్ళయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు.  ఆసిఫా జహాన్ న్ని చూసి అక్కడే ఉన్న ఒకామే “ఇంకా  మాయ బయటకు రాలేదు బేగం” అంది. కుబరా బేగం తల వైపు ఆమె అత్త, ఆడబిడ్డ, మరదలు కూర్చుని  ఉన్నారు. కాళ్ళ వైపు దాయమ్మ కూర్చుని ఉంది. మరదలు లేచి మంచం మీది  తన జాగా అఫ్సర్ జహాన్ కి ఇచ్చింది. “వదినా  ఈ సారి కుబరా చాలా కష్ట పడింది. కానీ మీ అందరి అదృష్టం చూడండి ఆడపిల్ల పుట్టింది. పిల్ల బాగుంది కానీ తల్లి ప్రాణమే బాగాలేదు” అంది కుబరా చెల్లెలు ఆసిఫ్ జహాన్ తో . 

             “మీ అందరి ప్రార్థనలని ఆ ఖుదా విన్నాడు. కానీ నాకైతే ఈ సారి కూడా ఆడ పిల్ల పుడుతుంది అని కొద్ది ఆశ కూడా లేకుండింది. ఇదంతా అల్లాహ్ ఆజ్ఞ. ఆ డాక్టర్నీ  వచ్చి ఏం చేస్తుందని .. అనవసరమైన కత్తులు కటార్లు లోపలికి పంపించడం తప్ప? మాయ బయటకి రావడం  కొంచెం ఆలస్యం అవుతే ఏమైంది పుట్టింది ఆడపిల్ల. ఏం ఆడపిల్లని ఎవరూ కనరా ఈ దునియాలో ? కొంచెం అటూ ఇటూ అవుతుంది వోపిక పట్టండి కొంచెం”అంటూ  దాయమ్మ కోపంగా  గొణుగుతూనే ఉంది. ఆమె బాధ ఆమెది. డాక్టర్ వస్తే తన స్థానం పడిపోతుంది మరి. “ఏం మాట్లాడుతున్నావు దాయమ్మా .. ఆలస్యానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మూడు  పగళ్లు  , రెండు రాత్రుళ్లు గడిచిపోయాయి.  దీదీ రాత్రింబగళ్లు నొప్పితో అల్లాడుతూనే ఉంది. నువ్వు కనీసం బిడ్డ ఎప్పుడూ బయటకి వస్తుందో కూడా చెప్పలేకపోతున్నావు . ఏం మేం పిల్లలనే కనలేదా., ఇంకా మాయ కూడా  బయటకు రాలేదు ఎందుకు” కుబరా బేగం చెల్లెలు ఆయేశా ఆందోళనతో కొంచెం ధాటీగానే  అడిగింది. “బీబీ చావు పుట్టుకలు అన్నీ ఖుదా చేతుల్లో ఉన్నాయి. కాలం చాలా చిత్రమైనది.  ఎప్పుడేమవుతుందో ఎవరికీ   తెలియదు. బిడ్డయితే పుట్టేసింది. బొడ్డు తాడులో లో ఇంకా ప్రాణం ఉంది. చూడు ఎలా ప్రాణం తో కొట్టుకుంటుందో” అంటూ  వెండి., కాంచు గాజులు నిండిన తన చేతిలో బయటకి రాని  మాయ తాడు ని పట్టుకుని  చూపిస్తూ అంది. మరో పక్క ఆసిఫ్ జహాన్, కుబేరా బేగం పొట్ట బలంగా కిందికి వత్తుతున్నది అలా చేయడంలో ఆమె కుటుంబం లోనే ప్రసిద్ధి. “ఏం బేగం మాయ నొప్పి వస్తుందా లేదా? చెప్పు”  దాయమ్మ అడిగిన ప్రశ్నకి ‘లేదు’ అంటూ బలహీనంగా జవాబు చెప్పింది కుబరా బేగం. “మాయ తాడులో రక్త నాళాలు తక్కువ  కొట్టుకుంటున్నాయి”అంటూ దాయమ్మఆందోళనతో  తన చేతులతో మాయతాడుని గట్టిగా రుద్ద సాగింది.. ఎంత అంటే అది రక్తం లేక తెల్లగా పాలిపోయింది. “వో  దాయీ., మాయ తాడుని ఇప్పుడే కొయ్యకు ఇంకా మాయ పడాల్సి ఉంది” అక్కడి ఆడవాళ్ళ గుంపు నుంచి ఎవరో కేకేశారు.

                        “ఏం .. పిల్లా మొన్న మొన్న పుట్టినదానివి. అదీ నాచేతుల్లో .. నాకే నేర్పిస్తావా .. పెద్ద బేగం మీమీద ఒట్టు నన్ను నమ్మండి ఈ పిల్లలు మంచివాళ్ళని కూడా మూర్ఖులుగా చూపించే ప్రయత్నం చేస్తారు. నేనేమైనా పిచ్చిదాన్నా చెప్పండి., మాయ పడకుండానే తాడు కోసేయడానికి” ?  అంటూనే దాయీ మాయతాడుని నొక్కుతూ గుంజుతూ ఉండి పోయింది. ఇంకో పక్క అక్కడే ఉన్న స్రీలు తమకు తెలిసిన ప్రసవ అనుభవాలను, జ్ఞాపకాలను ఒకరితో ఒకరు మాట్లాడుకోసాగారు. ఒకరికి ప్రసవం ఎంతాలస్యంగా అయిందో.. ఎంత రక్తం పోయిందో., ఇంకో బంధువులమ్మాయి బిడ్డ బయటకు రాక గంటల కొద్దీ ప్రసవపు నొప్పులు అనుభవించి కడాకి ఎలా చనిపోయిందో ., ఫలానా ఆమెకి చచ్చిన బిడ్డ బయటకి వచ్చి మాయ ఎట్లా  లోపలే ఉండిపోయిందో.,తమకి   ఏ దాయి కానుపుకి వచ్చిందో అంతులేకుండా మాట్లాడుకుంటూనే ఉన్నారు. “ఆసిఫ్ దులహన్ సంగతి ఏం అయిందో తెలీదా .. ఎంతకీ ప్రసవం కాలేదు ఇక ఆమె కూడా చెప్పేసింది తన చేతుల్లో ఏమీలేదని సాయంత్రం అయ్యింది ఇక ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ మేడమ్ సంభాళించినది కానీ మాయ గర్భ సంచికి  అతుక్కు పోయిందట , గర్భ సంచి  తీసేయాల్సి వచ్చిందంట . మూడు రోజుల తరువాత తల్లి చనిపోయిందట., పాపం ముగ్గురు చిన్న చిన్న పిల్లలు అనాథలయ్యారు” ఈ మాటలు దాయీ వింటూనే ఉంది. డాక్టర్ మాట రాగానే దాయీ ఊరికే ఉండలేక పోయింది.”దునియాలో ఎవరికీ కూడా  ఇలా చిన్న వయసులో చావు రాకూడదు. అయినా నాకు తెలీక అడుగుతా  ఏం మాటలు ఇవన్నీ., అదీ ఇక్కడ  చావు., మాయ , డాక్టర్ అంటూ ., వేరే మాటలే లేవా మీకు మాట్లాడడానికి ? అరె ఏమైనా తెలివి ఉందా  మీకు? చూడండి పెద్ద బేగం వీళ్ళని” అంటూ ఆసిఫ్ బేగం వైపు తిరిగి కోపం నారాజు కలగల్సిన గొంతుతో అంది. ఆసిఫ్ బేగం వెంటనే అక్కడున్న ఆడవాళ్ళ వైపు తిరుగుతూ “అరె నిజమే కదా కైసర్., కాస్త వేరే మాటలు మాట్లాడుకోండి”అంది చిరాగ్గా. అది విన్న దాయీ రెట్టించిన ఉత్సాహం తో “ఇది కదా అసలు మాట.,వో ఆయేషా బీబీ కాస్త గట్టిగా పొట్టమీద వత్తు. చూడు మాయ బయటకి వచ్చేలా ఉంది” అంటూ అరిచింది. అంతకు ముందు నించే అక్క పొట్ట వవత్తు తున్న ఆయేషా పిడికిలి బిగించుతూ మరింత గట్టిగా పొట్ట వత్త సాగింది. నొప్పి భరించలేక కుబరా బేగం  ‘చచ్చిపోతున్నా., వదలండి నన్ను’ అంటూ పెద్దగా అరవసాగింది.

“అయిపోయింది చూడు., కాస్తనే ఉంది హమ్మయ్య వచ్చేసింది” అంటూ దాయమ్మ సంతోషంగా కేకేసింది.  వెంటనే ఆసిఫా బేగం వైపు తిరుగుతూ “చూడు బడి బేగం మొత్తం మాయ వచ్చేసింది. లోపల  ముక్కలేం లేవు మళ్ళీ నన్ను అనద్దు బాగా చూసుకో అంది మాయని చేతిలో పట్టుకొని అటూ ఇటు తిప్పుతూ.  అంతే కాదు అక్కడే ఉన్న ఆడవాళ్ళంతా దాన్ని చూస్తూ తమ తమ అభిప్రాయాలు చెప్పసాగారు గోల గోలగా.

                     “ఆయేశా బేగం ఇప్పుడే పొట్టని వదులు చేయకు గట్టిగా పట్టుకో.  చూడు  రక్తం చాలా పోతుంది” అంటూ దాయి అరిచింది. వెంటనే ఆయేశా అక్క పొట్ట మీద మరింత గట్టిగా వత్తిడి పెట్టసాగింది. “మాయ తాడు కోసేయనా., రక్తం కారడం ఆగుతుందేమో”  అంటూ దాయమ్మ మాయ తాడుని మరింతగా గట్టిగా వత్తడం మొదలు పెట్టింది. ఇక లాభం లేదని బొడ్డు తాడుని అక్కడే పడి  ఉన్న తాడుతో గట్టిగా కట్టేసి అవతలి భాగాన్ని కత్తితో శాఫ్ చేసింది. కొద్దిగా రక్తం కారడం ఆగింది. అయినా ఇంకా  పూర్తిగా ఆగిపోలేదు. ఇక దాయీ మంచం దిగి వళ్ళు విరుచుకుంటూ  “ఇక లాభం లేదు బేగం మీరు తప్పుకోండి. సాబీర్  బేగం, కైసర్  మీరిద్దరూ ఇటు రండి.” అంటూ పిలిచింది. షాబీరా, కైసర్  ఇద్దరూ కలిసి కుబరా బేగం నొప్పితో చేసే ఆర్తనాదాలను పట్టించుకోకుండా ఆమె నడుముని ఎనిమిది ఇంచుల వరకు పైకి లేపారు. దాయి ఒక పొడవాటి బట్టని కుబరా నడుము చుట్టూ వేగంగా చుట్టేయసాగింది. కొద్దిగా రక్తం కారడం  ఆగింది. కానీ కుబేరా చమటతో  తడిసిన బట్టలా అయిపోయింది. “పిల్ల పుట్టేసింది. మాయ పడిపోయింది. ఇక అల్లా దయ వల్ల కుబరాకి బలం కూడా వచ్చేస్తుంది”. ఒక రకమైన సాంత్వన నిండిన గొంతుతో అంది దాయమ్మ.

                  ఆసిఫా బేగం మెల్లిగా కుబరా బేగం మంచం వైపు నడిచి పిల్లను పరీక్షగా చూస్తూ “పిల్ల చామన చాయ రంగు లో ఉంది” అంది. “ఏం మాట్లాడుతున్నావు బేగం? నల్లగా ఉంటే వదిలేస్తామా ఏంటి? వో దాయమ్మా ఏం చేస్తున్నావు పాపాయికి స్నానం అన్నా చేయిస్తావా లేదా చెప్పు? కుబరా బేగం నీరసంగా అన్నది.

              దాయమ్మ పాపాయికి స్నానం చేయించింది. తనకి ఇవ్వమని అసిఫా బేగం ఎంత అడిగినా పాపాయిని దాయి ఆమె చేతుల్లో పెట్టక పోగా..”ఈ పాపాయి మీద నాదే మొదటి హక్కు. నాకు ఇవ్వాల్సింది ఇస్తేనే ఇస్తాను” అంది కాస్త కవ్వింపుగా.

“ఇదేం కొత్త పద్దతి మొదలెట్టావు దాయీ నువ్వు? నీ హక్కుగా రావాల్సింది ఎప్పుడో నీ మాయ కుండలో వేసేశాను . అయినా ఈ ఐదు రూపాయలు ఇస్తాను తీసుకో”అంది.  “ఏ కాలం లో ఉన్నావు నువ్వు బేగం ఐదు  రూపాయలు జమానా ఎప్పుడో పోయింది నేను తీసుకోను’’ దాయి దాదాపు అరిచినట్లే చెప్పింది. “మరీ పిచ్చిగా చేయకు దాయీ ..ఇదేమైనా బహస్ చేయాల్సిన సమయమా చెప్పు? అంతగా అయితే పిల్ల నిఖా అప్పుడు తీసుకో” బేగం చిరాగ్గా అంది. అది విన్న దాయి కూడా అంతే కోపంగా “ఆ., అవును ఈ బిడ్డ పెరిగి పెళ్లి చేసుకునేదాకా నేను ఉంటాను. మీరంతా మీకు కావలసింది హాయిగా తీసుకుంటారు. మా దగ్గరికి వచ్చేప్పటికి మాత్రం మీకు  హక్కులు, చట్టాలు యాదికి వస్తాయి. వో భంగిన్{సఫాయి కార్మికురాలు} రా నువ్వు తీసుకో., గుల్ షబ్బో  పోనీ నువ్వు తీసుకో. కానీ నేను మాత్రం చచ్చినా నువ్విచ్చే ముష్టి  ఐదు రూపాయలు తీసుకోను గాక   తీసుకోను”!   దాయీ పేరు మసీతన్ ఆమె వాళ్ల  కుటుంబాల్లో ఎన్నో తరాలనుంచి ఆడవాళ్ళకుం కాన్పులు చేస్తూ వస్తుంది. ఆ అధికారం తో ఆమె వాళ్ళ మీద అరుస్తుంది .,హక్కుగా అడుగుతుంది కూడా. ఇక అసిఫా బేగం ఆమె ఎత్తయిన కుండలో మరో రెండు  రూపాయలు వేసింది. మసీతన్  కి పెద్దగా  సంతోషం ఏమీ కలగలేదు అయినా ఆ డబ్బులు తీసుకుంది. అక్కడున్న ఆడవాళ్ళంతా ఆమె జోలెలో ఎంతో కొంత వేశారు. ఒకళ్ళు ఆటానా వేస్తే ఇంకొందరు ఒక రూపాయి వేస్తూ పోయారు. మసీతన్ కుబేరా బేగం మంచం దగ్గరికి వెళ్ళి “బేగం ఈ ఆడపిల్ల చక్కర్లో పడి  చాలా మొక్కులు మొక్కావు. ఆడపిల్లే పుట్టింది చూడు. నాకు తోఫాగా బంగారం ఇవ్వకుండా వదిలిపెట్టను” అంది. “కుబరా ఎప్పుడూ ఆడపిల్ల కావాలనుకున్నది .. కోడలు కోసం మొక్కులు మొక్కింది ఆసిఫా బేగం కాదూ., పో పోయి ఆమెనే అడుగు. మేమైతే ఆడపిల్లలు పుట్టినా సరే  అందరూ ఏమి ఇస్తారో అదే ఇస్తాము. ఇందులో నీకు ప్రత్యేకంగా ఏమీ దొరకదు” ఆయేశా  దూకుడుగా అంది. “విన్నావా బేగం ఎలా మాట్లాడుతుందో” మసీతన్ దాయి అసిఫా బేగం తో కోపంగా అంది. “ఇప్పటికైతే నువ్వు వెళ్ళు. కాళ్ళు చేతులు కడుక్కో. మంచి పాన్ తిను. నీకైతే ఈ డబ్బు పిండుకోవడం మీదే పడింది”అంది అసిఫా జహాన్ విసుగ్గా.                 ఆసిఫ్ జహాన్ ముందే ఖంగారుతో కూడిన ఆనందంలో ఉంది. బాజా బజంతరీలకు కబురు చేసింది. ఇల్లంతా ముందే గొడవ గొడవగా హంగామా గా ఉంది. డోల్ బాజాలు చెవులు చిల్లులు పడేలా మో గుతున్నాయి.  బాలింత నిద్ర గురుంచి ఎవరూ ఆలోచించట్లేదు.అప్పటిదాకా ఆందోళనతో ఉన్న  ఆడవాళ్ళంతా ఆసిఫ్ జహాన్ తో ఎకసెక్కాలు ఆడుతూ ఉండిపోయారు. గర్భం తో ఉన్నట్లు ఒకరు నటిస్తుంటే., మరొకరు “ఎన్నోకానుపేంటీ” ., అని పగలబడి నవ్వుతూ అడుగుతుంటే.. ఏడోది అని ఒకళ్ళు , ఎనిమీదోది అని మరొకళ్లు  పగలబడి నవ్వేస్తున్నారు.   బాలింతకి ఎలాంటి తిండి పెట్టాలో వైన వైనాలుగా చెప్పుకుంటున్నారు. ఇక అందరూ ఒక చోట కూడారు. పెళ్లి కాని  ఆడపిల్లలు .. భార్యలు పిలిస్తే  బయటి నుంచి మగవాళ్లు అంతా స్వేచ్చగా లోనకి వచ్చారు. ఆ గుంపులో ఒక పన్నెండేళ్ల పిల్లాడు కూడా  అందరి చూపుల నుంచి దాక్కుంటూ కూర్చుని కనపడ్డాడు. వొకామే కన్ను ఆ పిల్లాడి మీద పడనే పడింది. వాడు ఆసిఫ్ బేగం కొడుకు నూరుల్ హాసన్. అంతే ఆమె వెంటనే అతన్ని లపుక్కన పట్టుకుంది. అందరికీ ఆ పిల్లాడ్ని చూపిస్తూ “ఇదిగో చూడండి.. పెళ్లి కొడుకు కూడా ఎలా కూర్చున్నాడో” అంది. అంతే అక్కడ నవ్వులు వెల్లి  విరిసాయి. కానీ పిల్లాడు ఆమె చేతుల్లోంచి  తప్పించుకోవడానికి తెగ గింజుకున్నాడు.”అరె వదులు చాచీ” అంటూ.  ఆఖరికి ఆమె  నుంచి విడిపించుకుని దర్వాజ వైపు పరిగెత్తాడు. “అరె అలా పారిపోతావేంటీ పెళ్లి కొడుకా కాస్త నీ పెళ్ళికూతురుని చూడు., ఎంత ముద్దుగా చందమామలా  ఉందో” వెనక నుంచి వచ్చే  చిలిపి మాటలు వింటూనే ఆ పిల్లాడు పారిపోయాడు. నీరసంగా సోలిపోయినట్లున్న కుబరా బేగం వొళ్ళో అప్పుడే పుట్టిన ఆడపిల్లతో., మంచం చుట్టూ “బెహన్ ఆయీ హై”{చెల్లి పుట్టింది} అంటూ కేరింతలు కొడుతున్న మిగిలిన తన ఐదుగురు పిల్లలతో నీరసంగా నవ్వింది.                                                      

డా. రాషీద్ జహాన్

డా. రాషీద్ జహాన్ ప్రముఖ ప్రగతిశీల ఉర్దూ రచయిత్రి. డా. రాషీద్ జహాన్ ఆగస్ట్ 25, 1905లో ఆలీఘర్ లో జన్మించారు. రాషీద్ జహాన్ స్రీ వైద్య నిపుణురాలు.{gynaecologist } ప్రజాపక్ష మేధావి, కమ్యూనిస్ట్ నాయకురాలు. అభ్యుదయ కథా రచయత్రి.  తొలి  కమ్యూనిస్ట్ ముస్లిం డాక్టర్ & సర్జన్ గా ఎన్నో వైద్య సేవలు అందించారు .

గీతాంజలి

Dr. Bharati : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. రచనలు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). ''బచ్ఛేదాని' (కథా సంకలనం). 'పహెచాన్' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం ' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *