‘నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్’ అంటాడు రచయిత అలెగ్జాండర్ డ్యూమాస్.
“సక్సెస్ లాగా ఏదీ విజయం సాధించదు”. విజయం అనేది సరిహద్దులు, సంస్కృతులు, కాలాన్ని అధిగమించే విశ్వవ్యాప్త ఆకాంక్ష.
అందుకే విజయాన్ని మించిన విజయం లేదు, విజయం మరిన్ని విజయాలను అందిస్తుంది అంటారు. లక్ష్యాలను సాధించడం వ్యక్తిగత సంతృప్తిని కలిగించడమే కాకుండా మరిన్ని విజయాలకు మార్గం సుగమం చేస్తుంది.
మరింత ఎత్తుకు నడిపిస్తుంది. అఖండ విజయాలను సాధించినవారు… అంతేస్థాయిలో వ్యతిరేకతను, విమర్శలను ఎదుర్కొన్న సందర్భాలు చరిత్రలో చాలానే కనిపిస్తాయి. అబ్రహం లింకన్ విజయాన్ని అందుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ అతను విజయం సాధించినప్పుడు, అతని విమర్శకులు, ప్రత్యర్థులందరూ మౌనంగా ఉన్నారు.
అతని ప్రభ తగ్గినకొద్దీ… విమర్శకుల గొంతులు పెరిగాయి. అదేవిధంగా, ఐన్‌స్టీన్ కూడా ఇలాంటి దశనే దాటవలసి వచ్చింది. వేలాది మంది యువకులకు స్ఫూర్తిగా నిలిచిన ఆ ఇద్దరినీ ఇప్పుడు ప్రపంచం చాలా గొప్పగా గౌరవిస్తుంది… కీర్తిస్తుంది.
మనిషి జీవితంలో ఎప్పుడూ విజయాలే సాధించలేడు. అపారమైన విజయాలను సాధించిన తర్వాత విఫలమైన జీవితాలు కూడా చరిత్రలో చాలానే కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో వారు సాధించిన విజయాలను కాక… వైఫల్యంలోని లోపాలనే ఎత్తిచూపుతారు.
ఇది ఆయా వ్యక్తుల మానసిక స్థితిపైనా ప్రభావం చూపుతుంది. ‘ఫెయిల్యూర్స్ ఆర్ ది పిల్లర్స్ టు సక్సెస్’ అని ఒక సామెత ఉంది.
అపజయాలే విజయానికి మూలస్తంభాలని అర్థం. అపజయాన్ని, అపఖ్యాతిని ఎదుర్కొన్న వ్యక్తి తన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, తన సమర్థతను నిరూపించుకోడానికి, విజయం దిశగా మార్గం సుగమం చేసుకోవడానికి… ఆ ఓటమిని ఒక అవకాశంగా మలచుకొని, ఒక్కో మెట్టు ఎక్కుతూ మళ్లీ విజయపథంలోకి దూసుకెళ్లనూ వచ్చు.
అయితే, చాలా సందర్భాల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగపర్చుకోలేక, అపవాదులను, అపఖ్యాతినీ చెరుపుకోలేక చీకటిలో మగ్గిపోతారు.
మరింత అథఃపాతాళానికి కూరుకుపోతారు.
విజయం అంతిమం కాదు… ఓటమి శాశ్వతం కాదు! విజయపథంలో సాగుతున్న వ్యక్తికి ఓటములు, అపవాదులు ఎప్పుడూ వెన్నంటే వుంటాయి.
వాటిని స్థితప్రజ్ఞతతో ఎదుర్కోగలిగిన వారు… చిన్నచిన్న అపజయాలు వచ్చినా వాటిని దాటుకుని ముందుకు వెళుతూనే వుంటాయి.
ప్రేమ, కుటుంబం, వ్యక్తిగత వ్యసనాలకు లోనై, వాటినుంచి బయటపడలేక… అప్పటివరకూ కష్టపడి సాధించుకున్న కీర్తిప్రతిష్టలను మసకబార్చుకుంటారు. తెరమరుగైపోతారు.
మనిషి జీవితంలోనే ఒక విచిత్రం ఉంది. అదేంటంటే సమస్య మరియు దాని పరిష్కారం ఒకేసారి పుడతాయి.
కానీ మనిషి పరిష్కారం గురించి ఆలోచించకుండా సమస్య గురించే సతమతమవుతుంటాడు.
సమస్య మనల్ని లోబరుచుకుని మన బుద్ధిని మందగింపజేస్తుంది.
‘‘నా జీవితంలో ఒక తీరని కోరికో లేక ఒక లోటో వున్నంత వరకూ నేను జీవించి ఉండటానికి ఒక కారణమంటూ ఉంటుంది. ఏ కోరికా లేక పూర్తిగా సంతృప్తి చెందటమంటే… అది మరణంతో సమానం’’ అంటాడు బెర్నార్డ్ షా.
జీవితంలో అతిప్రధానమైనది జీవితమే. జీవితంలో ఉన్నతి అంచెలంచెలుగా ఎలా కలుగుతుందో, పతనం కూడా అలాగే జరుగుతుంది. ఈ ఉత్థాన పతనాలు సంపద విషయంలోనే కాదు… శీలం, సంస్కారాల విషయంలోనూ ఉంటాయి. ఇది పుట్టుకతో రాదు.
సాధన చేసి… మెట్టుమెట్టుగా సాధించుకోవలసిందే!
జీవితంలో ఎదురయ్యే అవాంతరాలను, ఎత్తుపల్లాలను, ఒడుదొడుకులను దాటుకొని… చరిత్రలో తమకంటూ కొన్ని పేజీలను సృష్టించుకొని… తమ చరిత్రను తామే మసకబార్చుకుని ముగింపులేని విషాదగాథలా అసంపూర్తిగా మిగిలిపోతారు కొందరు.
విజయాన్ని ఆస్వాదిస్తారు…
అపజయాన్నీ ఆలింగనం చేసుకుంటారు.
ఆ మత్తులోనే జీవితం చివరి క్షణాలను నరకప్రాయం చేసుకుంటారు ఇంకొందరు.
జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు. కొందరి జీవితం వడ్డించిన విస్తరి అయితే… ఇంకొందరి జీవితం వారి విస్తరి వారే తయారు చేసుకోవాల్సి వుంటుంది.
జీవితంలో ఎన్ని ఆటుపోట్లకు గురైనా… చివరకు అందరూ అసూయపడేంత ఉన్నత స్థాయికి చేరుకుటారు.
అయితేనేం సామాన్యులకు తేలిగ్గా దొరికే సుఖ శాంతులూ, భద్రతా వారికి అందని మానిపండ్లే!
అలా తారాజువ్వల్లా నింగి కెగసి, ఉల్కల్లా నేలకు జారిపోయిన కొందరు ప్రముఖుల జీవితాలే డాక్టర్ భార్గవి రొంపిచర్ల ‘‘అలా కొందరు’’ పుస్తకం.
ఈ ‘‘అలా కొందరు’’లో పాబ్లో ఎస్కోబార్, మార్లిన్ మన్రో, చక్రపాణి, ఈఎన్‍బీ శర్మ, మాతాహరి, గీతాదత్, గురుదత్, శారద(నటరాజన్), ఓ.పి. నయ్యర్, గౌహర్ జాన్, అంజనీబాయి, మీనాకుమారి, సాల్వడార్ డాలీ, పర్వీన్ బాబీ, రీటా హేవర్త్ వంటి ప్రముఖుల బయోగ్రఫికల్ స్కెచెస్ అనబడు 15మంది పరిచయాలు ఈ పుస్తకమంతా పరుచుకుని వున్నాయి.
ఒకరిద్దరు తప్ప మిగతా అందరూ కళాకారులే.
బతికుండగా కళాకారులకు సముచిత గౌరవం ఇవ్వలేని సమాజం, మరణానంతరం వారిని కీర్తించడం వీరి విషయంలో కనిపిస్తుంది.
అయితే, ఈ పుస్తకంలోకెక్కిన ‘అలాకొందరు’ని పైపైన స్పృశించుకుంటూ పోదాం…
* పాబ్లో ఎస్కోబార్ ఒక డ్రగ్ లార్డ్. తనను తాను ఓ రాబిన్ హుడ్ గా భావించేవాడు. కొలంబియాలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలకు స్థానికులు దేవుడిలా చూశారు. నిరుపేదలు నీరాజనాలు పట్టారు. అతని అవినీతి అంతులేనిది. 20 ఏళ్లలో అతనో అవినీతి మహావృక్షంగా ఎదిగాడు. అమెరికా ప్రభుత్వాన్నే హడలెత్తించే స్థాయికి చేరుకున్నాడు. చివరికి అతని మరణం ఎంత దయనీయంగా జరిగిందో… పాబ్లొ ఎస్కోబార్ కొకైన్ కింగ్ వ్యాసంలో ఒక మాఫియా సినిమా చూస్తున్నంత ఆసక్తికరంగా వివరిస్తారు రచయిత్రి భార్గవి. అదే సందర్భంలో ఎస్కొబార్ కుటుంబం సొంత పేర్లను మార్చుకొని ప్రవాస జీవితం గడిపారు.
* ఒక నటిగా ఉన్నత స్థానానికి ఎదగాలని కలలుకని, ఆ కలను సాకారం చేసుకోడానికి ఎన్నో కష్టాలుపడి విజేతగా నిలిచిన శృంగార తార మార్లిన్ మన్రో. ఆమె చనిపోయి 58ఏళ్లు అయినా… ఇప్పటికీ ఆమె రూపురేఖలు అభిమానుల కన్నుల్లో స్వప్నాలను, గుండెల్లో గిలిగింతలను రగిలించిన ఆమె తెర మీద కనబడితే ప్రజలు వెర్రెత్తిపోయేవాళ్లు. ఆమె జీవితం వర్థమాన తారలకు ఆదర్శం కాకపోవచ్చుగాని నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఆమె జీవితంలో చాలానే వున్నాయంటారు రచయిత్రి.
* ఓ వెన్నెల ఎడారి గురుదత్. ఆయన మరణించిన సుమారు 20 ఏళ్ల తర్వాతగాని ఆయనలోని కళాకారుడిని గుర్తించలేకపోయింది భారతీయ సినిమా ప్రపంచం. తన చుట్టూ వున్న ప్రపంచంలో కలిసిపోలేక, ఆ ప్రపంచంలో ఒకడిగా బతకలేక తల్లడిల్లాడు గురుదత్. ఆ వేదనకు దృశ్యరూపమే గురుదత్ సినిమాలు. అందుకే ఆయన సినిమాల్లో ఒక గాఢత కనిపిస్తుంది. ఆయన పాటల్లో ఒక ఆర్ద్రత వినిపిస్తుంది. ఆయన చిత్రీకరణలో సౌందర్యం రూపుకడుతుంది. “ఒక దర్శకుడు కెమెరా అనే కలంతో సాహిత్యాన్ని సృష్టిస్తాడు” అని ‘న్యూ వేవ్’ సినిమా గురించి ప్రస్తావిస్తూ, 1948లో అలెగ్జాండ్రే ఆస్ట్రుక్ అనే ఫ్రెంచ్ చలనచిత్ర విమర్శకుడు గురుదత్ కళావైదుష్యాన్ని ప్రశంసిస్తాడు. గురుదత్ సినిమాల్లో అంత ఆర్ద్రత వుందిగనుకనే ‘ఘనీభవించిన కన్నీటి చుక్క’ అంటారు డాక్టర్ భార్గవి. గురుదత్ కెమెరాతో సృష్టించిన సినిమా సాహిత్యం వున్నంతకాలం… ఆయన చిరస్మరణీయుడే.
* హిందీ చలనచిత్ర సీమలో రిథమ్ కింగ్ అని, మెలోడీ కింగ్ అని పిలుచుకునే స్వర మాంత్రికుడు ఓపి నయ్యర్. వీనులవిందైన అద్భుత బాణీలతో సంగీత జగత్తులో ఓలలాడించే ఇంద్రజాలికుడు ఆయన. ప్రతి పాటా ఒక అందమైన స్మృతి. ఇంతటి అద్భుత బాణీలు స్వరపరిచిన ఓపి నయ్యర్ సంగీతంలో ఎలాంటి శిక్షణా తీసుకోలేదంటే ఆశ్చర్యపోక తప్పదు మరి. ఆయనకి సంగీతం పెద్దగా తెలియదని ఆక్షేపించినప్పటికీ, అత్యంత మధురమైన లయతో కూడిన అతని పాటలని ప్రజలు అమితంగా ఇష్టపడ్డారు. ఆడగొంతులలో షంషాద్ బేగం, గీతాదత్, ఆశా భోంస్లేలు ఆయన కి ఇష్టమైన వాళ్లయితే, మగ గొంతులలో రఫీ అంటే ఆయనకి ప్రాణం. ఆయనతో హీరోలకీ, కమెడియన్లకి కూడా పాడించేవాడు. ఆ రకంగా ఆయన చిరంజీవి అంటారు రచయిత్రి.
* కష్టాల కొలిమిలోంచి, దారిద్ర్యపు శృంఖలాల నుంచి ఒక మామూలు మనిషి సృజనాత్మక శక్తిగా ఎలా ఎదగగలడో శారద ఒక ఉదాహరణ. ‘శారద’ అనే కలం పేరుతో ఎన్నో గుర్తుండిపోయే రచనలు చేసిన ఈ రచయిత అసలుపేరు ఎస్. నటరాజన్. ‘సాహిత్య బాటసారి శారద’ పుస్తకం నటరాజన్ జీవిత చరిత్రను సంక్షిప్తంగా తెలియజేస్తుంది. నటరాజన్ జీవితం కూడా సంక్షిప్తంగానే ముగుసినా… తెలుగు నేర్చుకోవడమూ, జీవనమూ, జీవన పోరాటమూ, వ్యక్తిత్వమూ సాహిత్య కృషీ మొదలైనవి పొరలు పొరలుగా తెరలు తెరలుగా నడిచింది. ఆకలీ, ఆరోగ్యమూ, అనంతంగా రాయాలనే తపనా శారద ఆయుష్షును పరిమితం చేసాయి. శారద కథలు, నవలల మీద ఎం.ఫిల్, పిహెచ్.డి చేసే సాహిత్య పరిశోధక విద్యార్థులకు మార్గదర్శకం. ప్రతి ఒక్క సాహిత్యాభిమానీ చదివి తీరవలసిన చరిత్ర నటరాజన్ ది. అందుకే ‘శక్తివంతమైన అన్య స్వరం’ అంటారు రచయిత్రి భార్గవి.
‘దుఃఖమంటే గాయమని కాదు/ ఆత్మపతనమే సిసలైన దుఃఖం’ అంటారో కవి. రచయిత్రి అన్నట్లుగా తారాజువ్వల్లా నింగి కెగసి, ఉల్కల్లా నేలకు జారిపోయిన కొందరి జీవితాలే ఈ ‘అలా కొందరు’. ఈ పుస్తకంలోని వ్యాసాలన్నింటిలోనూ విజయము, పతనము, దుఃఖము, మరణము పోటీ పడినట్లు కనిపిస్తాయి. కాసిని నవ్వులు, కాసిని సంతోషాలు, కాసిని కన్నీళ్లూ వుంటాయి. ఈ పుస్తకంలోని 15 వ్యాసాల గురించీ ఎంతోకొంత రాయాలని వున్నా… ప్రచురణకూ కొంత పరిమితి వుంటుంది గనుక ఐదు వ్యాసాలనే ఇక్కడ సమీక్షించడం జరిగింది. ఒక్క పుస్తకంలో ఇందరి జీవితలలోకి చదువరులనూ పరకాయ ప్రవేశం చేయించగలిగారు రచయిత్రి డాక్టర్ భార్గవి రొంపిచర్ల.
సాహిత్యాభిమానులు, కళాభిమానుల వ్యక్తిగత లైబ్రరీలో కచ్చితంగా వుండదగిన పుస్తకం ఇది.

