“విశ్వంలో తిరుగాడుతున్న భూగోళం గురించీ, మానవజాతిని గురించీ చర్చించడం ఎట్లాంటిదో ఈనాడు షేక్ స్పియర్ను గురించి చర్చించడం అట్లాంటిది.” ఇవి షేక్ స్పియర్ 400వ జన్మదినోత్సవ సందర్భంలో బి.బి.సి.లో ప్రసంగిస్తూ, విమర్శకుడు వి.ఎస్. ప్రిచెట్ చెప్పిన మాటలు. ఒక్క పాశ్చాత్య దేశాలేకాకుండా ప్రపంచంలో అన్ని దేశాలూ ఈ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాయి. ఇంతటి ఖ్యాతి మరే కవికీ సమకూరలేదు. షేక్ స్పియర్ ని గురించి వ్రాసిననన్ని పుస్తకాలు మరే కవిని గురించి వ్రాయబడలేదు. ప్రతినెలా షేక్ స్పియర్ ని గురించి ఒక వ్యాసమో, ఒక పుస్తకమో వెలువడుతూనే ఉంది. ప్రతిరోజూ ఎవరో ఒకరు ఆయన్ని గురించి వ్రాయడంలో నిమగ్నులై ఉన్నారనడం అతిశయోక్తి కాదు. షేక్ స్పియర్ ని గురించి వ్రాయడం నాగరిక ప్రపంచానికి ఒక తీరిక సమయపు వ్యాపకం అయిపోయిందన్నారెవరో.
ఎడతెగని ఈ సాహితీ కల్లోలానికి, ఇన్ని పుస్తకాలు వెలువడ డానికి కారణం ఏమిటి? మానవుడి అంతరంగ వికాసానికి దోహదమిచ్చే దృక్పధం, ప్రక్రియలు, షేక్ స్పియర్ నాటకాలలో ఇమిడి ఉండడం ఒక కారణం. మన నిజస్వరూపాన్ని మనం చూచుకునేటందుకు తోడ్పడుతాయి. ఆయన విషాదాంత నాటకాలు. బాహ్య ప్రపంచానికి తెలియకుండా, మనం ఏకాంతంగా, రహస్యంగా, సాగించే ఆలోచనలు, ఆశలు, ఊహలు, ఈ నాటకాలలో ప్రధానపాత్రలు బహిర్గతం చేస్తాయి. మన ఆలోచనలు మన వాంఛలూ, మన నిజస్వరూపాలు వాటిద్వారా తెలుసుకుని ఆశ్చర్యపడతాం; భయపడతాం అంతా ముగిసిం తర్వాత ‘అమ్మయ్య’ అని నిట్టూరుస్తాం. ‘ఇట్లాంటివాటి జోలికి మనం పోకూడదు’ అని తీర్మానించుకొని, మానసిక వైరాగ్యాన్ని అలవరచుకుంటాం. విశ్వంలో గోళాలు ఢీ కొంటున్నాయి. సూర్యగోళం గతితప్పి అనంతంలోకి పోతోంది. భూగోళం వెలుగులేక గడ్డకట్టిపోతోంది. మానవజాతి చరిత్ర రేపటితో సమాప్తమవుతుంది. కాన, మానవులు తమ వీలునామాను సిద్ధపరచాలి అని అశరీరవాణి శాసిస్తే, ‘ షేక్ స్పియర్ నాటకాలే మానవుడి వీలునామా’ అనేటంత పలుకుబడి తెచ్చుకున్నాయి. ఈ నాటకాలు.
ఇట్లాంటి నాటకాలు వ్రాసినాయన ఎవరు? ఎట్లాంటివాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం కోసం ఇన్ని పుస్తకాలు వెలువడడానికి మరో కారణం షేక్ స్పియర్ గురించి నిక్కచ్చిగా పరిశోధించి తెలుసుకున్న విషయాలు ఎన్నో లేవు. ఆయన 1564వ సంవత్సరం, ఏప్రిల్ 23 వ తేదీని స్ట్రాట్ఫర్డు గ్రామంలో జన్మించాడు. స్కూల్లో చదువుకున్నాడు. ఏనాతావే అనే ఆమెను – తనకంటే వయస్సులో ఏడు సంవత్సరాలు ఆమె పెద్ద. – 1582 నవంబర్లో పెండ్లి చేసుకున్నాడు. 1583లో వీరికి ‘సుసన్న’ అను కుమార్తె కలిగింది. రెండేళ్ళ తరువాత, జుడిత్, హామ్నట్ – అను కవలలు జనించారు. లండన్ పట్నం వచ్చి నాటక కంపెనీలో చిన్న చిన్న పనులు చేస్తూ, కొన్ని నాటకాలు వ్రాశాడు. కొంతడబ్బు సంపాదించాడు. స్వగ్రామం వెళ్ళి, వీలు వ్రాసి, అందులో ఆస్థిని పెద్దకుమార్తెకీ, తన రెండో మంచాన్నీ, మరికొన్ని సామానులనీ భార్యపేర వ్రాసి – 52వ యేట పరమపదించాడు. పండితులు తమ పరిశోధనా ఫలితాలను, నొక్కి వక్కాణించక, ఇతమిత్థమని నిర్వచించక, అస్పష్టమైన ధోరణిలో తమ గ్రంధాలలో పొందుపరచిన విధానాన్ని హేళన చేస్తూ స్టీఫెన్ లీకాక్ అనే హాస్య రచయిత ఇలా అన్నాడు. ” షేక్ స్పియర్ బహుశః ఫలానా సంవత్సరంలో, ఫలానా చోట జన్మించి వుంటాడు. బహుశః చనిపోయి వుంటాడు.” ఈ శతాబ్దంలో పరిశోధనల ఫలితంగా షేక్ స్పియర్ జీవిత విశేషాలను మరికొన్ని తెలుసుకోగలిగారు. నిజమే. అయినా అసలు ఈ నాటకాలు వ్రాసింది షేక్ స్పియర్ కాదు. ఆయన పేరుతో ఫలానా వారు వ్రాశారు అన్న వాదాన్ని బలపరుస్తూ ఈ నాటికీ ఎవరో ఒకరు వ్రాస్తూనే వున్నారు.
షేక్ స్పియర్ ఎట్లాంటి మనిషి ఆయన మనస్తత్వం ఎట్టిది? ఆయనకో తత్వం అంటూ వుందా! ఉంటే దాని స్వరూపం ఏమిటి? ప్రధానమైన జీవితపు సమస్యల పట్ల ఆయన అలవరచుకున్న దృక్పథం ఏది? ఈ ప్రశ్నలకు సమాధానాలుగా ఎన్నో పుస్తకాలు వెలువడ్డాయి. వీటిల్లో చాలాభాగం ఊహాగానాలే. కొందరు – కోల్రెడ్జ్, మిడిల్టన్ మర్రీ, విండ్ హామ్ లెవీ లాంటివారు – తమ మనస్తత్వాన్నీ, దృక్పథాన్ని షేక్స్పియర్ కి ఆపాదించి, షేక్ స్పియర్ ని తమరుగానే చిత్రించి చూపడం జరిగింది. ఇన్ని పుస్తకాలుండడం వల్లే, మనం షేక్స్పియర్ని ఎరుగున్నంత బాగా మరే ఇతర వ్యక్తినీ ఎరగం అన్నాడు జె.బి.ప్రీస్ట్.
షేక్ స్పియర్ ఎట్లాంటివాడు? అన్నదానికి విమర్శకులు చెప్పే సమాధానం,’ హామ్లెట్ షేక్ స్పియర్ లాంటి మనిషి’ అని. కోల్రెడ్జ్, గెథేలు హామ్లెట్ పాత్రని గూర్చి వ్రాసిననాటి నుండి, ఇదొక సమస్యతో కూడుకున్న నాటకంగా పరిణమించింది. ఈ నాటకంపై వచ్చినన్ని విమర్శలు, పుస్తకాలు మరే నాటకంపైనా రాలేదు. హామ్లెట్ నాటకంలో సమస్య ఏమిటి? అతని తల్లి, తన తండ్రిని చంపిన వ్యక్తితో వ్యభిచరించి, వివాహమాడుతుంది. అతని తండ్రి దయ్యం రూపంలో కనబడి, రాజ్యం కోసం తనేవిధంగా హత్యగావింపబడిందీ చెప్పి, వారిపై పగ సాధించమంటాడు.
హామ్ లెట్ సరేనంటాడు. కాని ఆ పని చెయ్యలేడు. పగసాధించడలేడు. వారినీ వీరిని, – అనవసరమైన వారిని – చంపుతూ, అసలు పనికి ఉపక్రమించక జాప్యం చేస్తాడు. తుదకు అందరూ చనిపోతారు. ఎందుకు జాప్యం చేస్తాడు? అన్నది సమస్య. ఈ సమస్య గూర్చే గ్రంథాలు, వ్యాసాలు వెలువడ్డాయి. హామ్లెట్ ఆదర్శజీవి; తత్వజ్ఞుడు, ఆలోచిస్తాడు ఊహలో జీవిస్తాడు, సృష్టిని తిలకిస్తాడు, సమాధిలో పడతాడు. సత్చిత్ ఆనందాన్ని ఆరాధిస్తూ, తన విధిని విసర్జిస్తాడు. కార్యశూరుడు కాదన్నమాట. స్థూల జగత్తు మాయ అనీ అనిత్యమనీ, సమాధానం చెప్పుకుని, తన పనిని కర్మకి విడిచేసి ప్రత్యేకమైన ‘అహం’ని జీవాత్మలో కలిపివేసే యత్నంలో నిమగ్నమవుతాడు. ఈ రకం స్వార్థ రాహిత్యం, పట్టించుకోకపోవడం – హిందూ తత్వానికిసన్నిహతమైన దృక్పథం, ఫలాపేక్ష లేకుండా, తనపని నిర్వర్తించకపోవడమే కాదు, – అసలు పనే నిర్వర్తించడు హామ్లెట్. దీనికి కారణం ఏమిటి? ఈ కారణాలన్నీ పొందుపరచడానికి నేనిప్పుడు పూనుకోవడం లేదు. జీవితపు సమస్యల పట్ల ఒక నిర్ణయానికి రాలేకపోవడం హామ్లెట్ లక్షణం. అదే షేక్ స్పియర్ లక్షణం కూడా అని ఋజువు చేసేందుకు ఇన్ని గ్రంథాలు వెలువడుతున్నాయనుకుంటాను. అసలు నిర్ణయానికి రాలేకపోవడం – షేక్ స్పియర్ విషాదాంత నాటకం సారాంశం. నాయకుడు ఒక సందర్భంలో రెండింటిలో ఏదో ఒక దాన్ని ఎన్నుకుని ఆ పని చెయ్యాల్సి వస్తుంది. “ఇదేనా చెయ్యి, లేకపోతే అదేనా చెయ్యి, మరి మార్గం లేదు” అని స్థూలజగత్తు శాసిస్తుంది. ఆ పరిస్థితుల్లో అతను నిర్ణయానికి రాలేడు. ఏ నిర్ణయమూ సాధ్యం కాకపోవడమే, మానవుడి విధి నిర్వహణలో విషాదం. “తెలివి హీనులు బల్లగుద్ది చెప్తారు. తెలివైనవారు నోరు మెదపరు. ఇదే ప్రపంచానికి అరిష్టం” అన్నది. తత్వజ్ఞుడైన బెరట్రండ్ రసెల్ నిర్వచనం. హామ్ లెట్ నాటకం ఈ నిర్వచనాన్ని సోదాహరణంగా విశదీకరిస్తుంది. షేక్ స్పియర్ ఎట్లాంటివాడు? అతని దృష్టిలో పంచేంద్రియాలలో, ఏ ఒక ఇంద్రియాన్ని విడిచెయ్యకుండా, అన్ని అవయవాలనీ సమంగా వాడుకుని, సుఖంగా వుండగలిగిన వ్యక్తి ధన్యుడు. ప్రతివాడు సంతోషంగా జీవించాలి. ఆ సంతోషాన్ని యే విధంగా సాధించినా ఫరవాలేదు. మనిషి ఉద్రేకాన్ని తగుమాత్రంగా వాడుకోవాలి కాని, దానికి బానిస కాకూడదు. నిండు జీవితం, సమగ్రమైన ప్రవర్తన, ఆనందాన్ని వ్యక్తం చేసే శీలం – ఇవి వున్నవాడు షేక్ స్పియర్ కి ఇష్టమైన వ్యక్తి, షేక్ స్పియర్ ఏ మతాన్ని, ఏ తత్వాన్ని బోధించాడు? ఎన్నో రకాలుగా వ్రాస్తారు విమర్శకులు. కాని వాల్టర్ రాలే చెప్పిన సంగతే నాకు సబబుగా తోస్తుంది. “నిప్పు కాలుస్తుంది. వాన తడుపుతుంది – అనడంలో ఏ తత్వం వుందో, అంతకుమించిన మరో పెద్ద తత్వం షేక్ స్పియర్ బోధించాడనుకోను.” అన్నాడు రాలె.
షేక్ స్పియర్ కళ ద్వారా బహిర్గతం చెయ్యలేని కొంత ‘రహస్యం’ చీకటి వుదంతం వున్నాయి. వాటిని హామ్లెట్ ద్వారా బైట పెట్టి ముక్తి సాధించే యత్నంలో నాటక కర్త విఫలుడయ్యాడు – అందుచేత కళదృష్ట్యా ‘హామ్లెట్’ నాటకం అసంతృప్తికరమైనది. అని టి.ఎన్. ఎలియట్ వాదం. తల్లి వ్యభిచారం నాటకానికి వస్తువుకాదు. అది చెప్పివేస్తేగాని తన బాధ తీరదు. హామ్లెట్ ద్వారా చెప్పడానికి యత్నించాడు. కాని తనలో వున్న ప్రమాదకరమైన ఉద్రేకం, నాటకం వస్తువులో వున్న నమూనాను మించింది కావున, ఆ వుద్రేకం పూర్తిగా వస్తువులో లీనమవలేదు అన్నది ఎలియట్ వాదం.
మానవుడు ఒక వ్యవస్థలో ఇరుక్కుంటాడు. ఆ స్థితికి హామ్ లెట్ ప్రాతిపదిక. అందులో షేక్ స్పియర్ దర్శన మవుతుంది. ఇంతటి కల్లోలానికీ, ఇంత ఖ్యాతికి ఈ కారణాలు సరిపోతాయా? కళాకారుడుగా, షేక్ స్పియర్ చేసిన అత్యాచారాలను, దారుణాలను ఎందరెందరో ఎత్తిచూపారు. షేక్ స్పియర్ తత్వాన్నీ, నాటకాలలోని చెడుగునీ తీవ్రంగా ఖండించిన రచయిత టాల్స్టాయ్. క్రైస్తవ మత సూత్రాలను ఆరాధించిన టాల్ స్టాయ్ , షేక్ స్పియర్ లోని మానవతావాదాన్ని తన దృష్టిని అవగాహన చేసుకోలేకపోవడం, ఆయన దురదృష్టమని, టాల్ స్టాయ్ విమర్శనాన్ని ఖండిస్తూ ఎన్నో గ్రంథాలు వెలువడ్డాయి. షేక్ స్పియర్ నాటకంలో హితబోధ లోపించిందనీ, తన వాటికల్లో అది వుంది గావున, తనే షేక్ స్పియర్ కంటే ఘనుణ్ణి అనీ బెర్నాడ్ పదేపదే చెప్పుకున్నాడు. షేక్ స్పియర్ నాటకాలలోని రసహీనమైన లక్షణాల నొకటి తయారు చేశాడు లోగన్ పెర్సాల్ స్మిత్ (Logan Pearsall Smith) అనే ఆయన. ఆ చిట్టాలో కొన్నింటిని వివరిస్తాను.
గొప్ప రచయితలు మనని విసిగిస్తారు. మన జీవితం అంతా వారి రచనలే చదువుతూ కూర్చోవాలిట. దర్బారు దస్తులు ధరించి వారి సమక్షాన నిలబడాలిట. షేక్ స్పియర్ ఒక జాతీయ సంస్థగా మననెత్తిన రుద్దడం చూస్తే, మనకి అనుమానం తగుల్తుంది. – పో, పో, అన బుద్దేస్తుంది. వేదికపై నిలబెట్టిన ఈ శిలాప్రతిమని కదిపి చూడాలనిపిస్తుంది. . కనుపిస్తుంది? విసుగుపుట్టించే ఛలోక్తులు, చెత్త కబుర్లు, అవే సన్నివేశాలు, వికటకవనం, మాటలపై గారడీ, ఒళ్ళు బలసిన ఇదంతా పెద్ద దగా – మోసం లాగుందే అనుకుంటాం. తీరా షేక్ స్పియర్ నాటకాలు చదవడం మొదలుపెడితే, ఏం పదజాలం, హత్యలు, యుద్ధాలు, కొట్లాటలు, చివరికి ఒక అరడజను శవాలను బైటకు ఈడ్చివెయ్యడం ” అంటాడు. పెర్సాల్ స్మిత్ . అంతా రోదన, ఏడ్పు, భేదం, శోకం, ఇంతేనా? మనిషి పట్ల అసహ్యం పుట్టించే ఈ స్వగతాలేనా పుత్తమ కావ్యం? మొదటి ప్రపంచ యుద్ధానంతరం యూరప్ లో షేక్ స్పియర్ నాటకం రోమియో జూలియెట్ చదివి కొందరు యువతీ యువకులు, ప్రేమపేరిట ఆత్మహత్య చేసుకున్నారుట. రోడ్డు మీద నడిచే కన్యల్ని అల్లరి పెట్టే యువకుల్ని రోడ్డు రోమియోలని వ్యవహరిస్తున్నాం. షేక్ స్పియర్ నాటకంలో కొన్ని భాగాలు చదవలేక, మొహం తిప్పేసుకునేవాడట ప్రసిద్ధ విమర్శకుడు డాక్టర్ జాన్సన్. షేక్ స్పియర్ పాత్ర చిత్రణలో లోపాలున్నాయి, వస్తువుని మలచడంలో దోషాలున్నాయి, కొన్ని సందర్భాలలో కళాదృష్టి కుంటువడుతుంది. కొన్ని ప్రదర్శన యోగ్యం కావు. ఇల్లా వెదికితే ఎన్నెన్నో చెప్పుకుపోవచ్చు. మరెందుకు షేక్ స్పియర్ అంటే ఇంత ఆరాధన, ఇన్ని స్త్రోత్రాలు?
ఇందుకు కారణం షేక్ స్పియర్ కవిత. ఆయన వాడిన భాష, అలవరుచుకున్న శైలి, ప్రదర్శించే ఊహాబలం, ప్రతిభ. ఈ కవితా స్వరూపం ఎట్టిదో, ఈ శైలి లక్షణాలేవో, భావన వైశాల్యం ఎంతటిదో, పరామర్శించి చూపాలనే ఈ వ్యాసరచనకు పూనుకున్నాను.
ఆంగ్లభాషతో గాఢమైన పరిచయం లేక, షేక్ స్పియర్ కవిత ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలని కుతూహల పడే వారెందరో ఉన్నారు. వారిని ఉద్దేశించి వ్రాసిందే ఈ వ్యాసం. ఆంగ్లభాషతో పరిచయం ఉన్నవారిలో కూడా చాలామంది షేక్ స్పియర్ కవితలో అందచందాలని ఆస్వాదించలేకపోతున్నారు. ఇందుకు కారణం, షేక్ స్పియర్ నాటకాలు, పాఠ్యగ్రంథాలు కావడమే. ఈ నాటకం రచన ఎప్పుడు జరిగింది? షేక్ స్పియర్ వ్రాతప్రతికీ తరువాత అచ్చయిన ప్రతులకీ తేడాలేవి? నాటకంలో వస్తువుకి ఆధారాలేవి? సమకాలిక విశేషాలు ఎందుకు ఎల్లాగ వాడుకున్నాడు నాటకకర్త? రంగస్థల ప్రదర్శనలో చిక్కులేవి? ఒక పదానికి ఆనాడున్న అర్ధం ఏమిటి? ఇప్పటి అర్థం ఏమిటి? విద్యార్థుల దృష్టి ఈ సమస్యపై మరలి, నాటకంలో కవితా విశిష్టతని గ్రహించే అవకాశాలు ఉండకపోవడం, మనదేశంలోనే కాక, ఇతర దేశాలలో కూడా జరుగుతున్నదే.
చాలాచోట్ల వచనం వున్నా, షేక్ స్పియర్ నాటకాలు కావ్యాలుగా రచించబడ్డాయి.
ఆరోజుల్లో, కర్టెన్లు తదితర రంగస్థల పరికరాలు లేనందున, ఎక్కడ, ఎప్పుడు, ఏం జరుగుతున్నదీ, పాత్రలే చెప్పుకుని, తగు వాతావరణాన్ని సృష్టించుకునే సంప్రదాయం వల్ల స్వగతాలు వెలువడ్డాయి. ఈ స్వగతాలు ప్రకృతి వర్ణన కోసమే కాకుండా, జీవితం గురించి కొన్ని నిర్వచనాలు చేసుకోవడానికీ, అంతరంగ వైక్లబ్యాన్ని బైట పెట్టడానికీ ఎక్కువగా ఉపయోగపడతాయి. ఛలోక్తులు విసరడంలోనూ, జీవితంపై అద్భుతమైన నిర్వచనాలు చెయ్యడంలోను షేక్ స్పియర్ అద్వితీయుడు. ఆయన వ్రాసిన నాటకాలన్నింటిలోనూ ఉన్న మంచి సూక్తులను ఏరి పుస్తకంగా వెలువరించారు. ఉపన్యాసాల లోనూ, వ్యాసాలలోనూ వీటిని వాడుతూ ఉండడం పరిపాటైపోయింది. అసలు షేక్ స్పియర్ నాటకాలు చదవడంలో ఉన్న ఆనందం, మనం తరచూ వింటూ ఉన్న సూక్తులను పోల్చి పసిగట్టడంలోనే ఉంది – అని ఎవరో అన్నారు కూడా. ఇప్పుడు నేను, ఆ సూక్తుల జోలికి పోను.
వాటిని ఉదహరించడం మొదలిడితే, ఆగడం కష్టంట. ఈ నిర్వచనాలు జాబితాలు తయారు చేసి, ఏ నాటకంలోను ఏయే ఉపమానాలు విశేషాలు, సమాసాలు ప్రధానంగా తోస్తాయో విపులీకరించి, కారెలైన్ స్పర్జిన్ (Carolinespurgeon.) అనే ఆమె పెద్ద గ్రంథం వ్రాసింది.
గడియారం విప్పి అందులో భాగాలన్నీ విడగొట్టి చూపటమే చెయ్యదలచుకున్నది. షేక్ స్పియర్ శైలిలో ఉన్న ప్రత్యేకతను, పొడి మాటల్లో చటుక్కున అర్ధమయ్యేలాగు చెప్పడం నా ఉద్దేశం. సంస్కృత పదాలు, ఘాటైన సమాసాలు బరువైన మాటలు వాడి, ఇంతకంటే, గంభీరంగా షేక్ స్పియర్ భాషను అనువదించవచ్చును. తెలుగులో కొచ్చిన షేక్ స్పియర్ నాటకాలలో ఈరకం భాష వాడి అనువాదకులు కృతార్థులయ్యారు. ఒక వాక్యాన్ని విప్పి మాటల పొందికపై పొడి మాటల్లో వ్యాఖ్యానించడంతో తృప్తిపడతారు.
షేక్స్ స్పియర్ ది చాలా కఠినమైన భాష. కృత్రిమమైంది. తికమకలతో కూడుకున్నదీ. ఇతర భాషలలోకి అనువదించడం సాధ్యం కానప్పుడే గొప్ప కవిత అన్నాడుకూడా ఒక విమర్శకుడు. దానికి తోడు మరో ఇబ్బంది కూడా ఉంది. షేక్ స్పియర్ వాడిన నాడు ఉన్న అర్థం, కొన్ని మాటలకు ఇప్పుడు లేదు. కాలంతో, అవి కొత్త అర్థాలు తెచ్చుకున్నాయి. షేక్ స్పియర్ వ్యక్తిగతమైన శైలి. కొన్ని మాటలకు తాను వేరే అర్థం కల్పించినట్లు తోస్తుంది. కొన్ని సందర్భాలలో, కొన్నిటిని సృష్టిస్తాడు. పదాలను పీడించి సాగేస్తాడు. కృత్రిమ కవి సమయాలను కల్పిస్తాడు. కవిత ప్రబలిశైలి ప్రజ్వరిల్లిన కొన్ని భాగాలను పదిమంది అనువదించడానికి పూనుకుంటే, పదిమందీ పదిరకాలుగా అనువదిస్తారనడంలో సందేహంలేదు. శైలి లక్షణాలను ఉదహరించడమే నా ఉద్దేశంగావున, మూలంలో ఉన్న ఆంగ్ల పదాలను వాడకూడదనుకున్నా : అయినా, షేక్ స్పియర్ శైలి ప్రత్యేకతని అనువాదంలో తీసుకురావడం ఎంత కష్టమో చూపడం కోసం, ఒక్క వాక్యాన్ని మాత్రం ఉదహరిస్తాను. షేక్ స్పియర్ శైలిలో విశిష్టతను పూర్తిగా చూస్తే ఒక్క వాక్యం ఉదహరించగలవా అని అడిగితే, – ఈ వాక్యం ఉదహరిస్తాను.
In the dark and backward abysm of Time
కవివ్యక్తిత్వం అంతా వుంది ఈ వాక్యంలో, తెలుగులో దీని అర్థం ఏమిటి? స్థూలంగా ‘కాలగర్భంలో’ అనొచ్చు. అసలు ‘కాలగర్భం’లో అన్నది ఎంతో మంచి సమాసం. అద్భుతమైది. కాని మనం తరచు వాడటంలో ఇది పాత చింతకాయ పచ్చడైపోయింది. కాబట్టి ‘కాలగర్భంలో’ అని అనువదిస్తే, అర్థం సరైంది అయినా, కవి వ్యక్తిత్వం, శైలీ, ప్రత్యేకతా అందులో లేవు. ఆ వాక్యంలో మాటలకు విడివిడి అర్థాలు చూద్దాం. ‘డార్క్’ అంటే చీకటి, నలుపు. ‘బేక్వర్డ్’ అంటే – వెనక్కు తిరిగిన, వెనకవైపు. ‘ఎబిసీమ్’ అనేది వెనకటి కవులు వాడిన పదం. ఇప్పుడు ‘ఎబిస్’ గా మారింది. ‘ఎబిస్’ అన్నదానికి రెండుమూడు అర్థాలున్నాయి. అంతులేని అఖాతం, భూనభోంతరాళం, ఆది ప్రళయం, అడుగుభాగం లేనిది ఇవన్నీ కలిపితే — చీకటి, వెనక్కి తిరిగింది. అంతులేని అఘాతం…. అదీ కాలాన్ని గూర్చిన షేక్ స్పియర్ భావన. బరువైన పదాల వాడి ఇల్లా అనువదించవచ్చు;
అంధకార తిరోగమనైక
కాలగర్భ భీకరాఖాతమ్ము!
కాని ఇది ఎంతమందికి అర్థమౌతుందో నాకు తెలియదు. అంతేకాదు, షేక్ స్పియర్ మూలంలో ‘గర్భం’ అన్న ధ్వని లేదు. అది తీసివేస్తే, తెనుగులో అర్థం రాదు.
అనుభవాలను, వ్యక్తులనూ, కొత్త దృక్పథంతో చూస్తాడు షేక్ స్పియర్ అని వర్ణించడంలో, చమత్కారమైన భాష వాడతాడు. కృత్రిమ ప్రయోగాలు చేస్తాడు. మనల్ని నిలిపి లేవదీసి, కూర్చోబెట్టి, మరోసారి ఆలోచించి, ఊహించేటట్లుంటాయి కొన్ని ప్రయోగాలు. ఒక్క వాక్యంలో, ఒక్క సమాసంలో ఇమిడిన కవితా రీతుల్ని కొన్నిటిని ఉదహరిస్తాను.
నాయకుడు ఏవోకొత్త విషయాలు ప్రేయసితో చెప్తుంటే ఆమె ఆశ్చర్యపడిన సందర్భంలో
“రక్తం ఆమె బుగ్గల పైకొచ్చి తొంగిచూచింది.” వెన్న మీగడల రాణి ఆమె”
మరొక నాయికను గూర్చి.
“ఆమె శరీరంలోని అతుకులూ, ఆవేశాలూ….” స్త్రీ చూపే ఆవేశంలో ప్రత్యేకత ఆ ‘అతుకులు’ అన్నదాంట్లో ఉంది.
“ఆకుపచ్చని కళ్ళ రాకాసి – అసూయ”
ఆ రంగుకీ అసూయ ఉన్న స్నేహం ఎట్లాంటిదో మన మెరుగుదుం.
“నిశీధి చాచిన ఇనప నాలుక” ఆ రాత్రుళ్ళు మన మెరుగుదుం. ఈ ఉపమానంతో ఆ చీకటిని ఎదుర్కోగలం. “సమానమైన చేతులు గల న్యాయం.” న్యాయం ముందర అందరూ సమానులే అని. – చేతులు ఒకటి పొడుగూ, ఒకటి కాస్త పొట్టీ ఉండకూడదు.
మనిషి మెదడు ఎట్లాంటిది?
“అతుకులు, సాగెయ్యడాలూ, త్వరితంగా జరిగే కర్మాగారం” ఆ ‘త్వరితం’గా అన్నది గమనించాలి. ఒకచోట ‘శాంతి చేసే బలహీనమైన గానం’ అంటాడు షేక్ స్పియర్ . ‘శాంతి’లో కాస్తంత చప్పదనం ఉంది.- బలహీనమైంది. కాని అందరూ కోరదగింది – కాబట్టి గానం.
‘తడిసిన కళ్ళతో ధర్మం మూతబిగించి చేసిన రోద.” తడిసిన కళ్ళు, బిగిసిన మూతి, – రెండు విశేషణాలు వాడడం, ఆయన శైలిలో ప్రత్యేకత.
‘నిశీధి నడుమ మృతి వైశాల్యం” ఆ ‘వైశాల్యం’ నడుమ ఉండాలంటే ఆ నిశీధి ఎంతటిదో!
ఇక్కడ ‘మృత’ అన్నది షేక్ స్పియర్ కంఠం.
“అతని దోషాలు మృదువుగా అతని మీద పడ్డాయి.” మృదువుగా అంటే? అల్పమైన దోషాలనా? అవి ఎంతటికైనా అతడు భరించగలడనా? ఆ దోషాలు అతనిలో లేవు- ఎవరో మీద పడేశారనా? పడేసినవారు, పేడ కలిపి చల్లినట్లు గాక, మృదువుగా ఎందుకు పడేశారు?
‘పాపం మంచివాడు. ఈ నిందలు మృదువుగా పైనపడేద్దాం’ అనుకున్నారా? ఆ పడేసినవాళ్ళు?
యుద్ధం ముగిసిన తరువాత, ఎట్లా ఉన్నదీ వర్ణన.
‘రక్తపాతమైన యుద్ధం దిగవిడిచిన వీలునామా’
“దగ్ధమైన పగటి వెలుగు” ఈ ఎండ గండిపోవడం మనమూ ఎరుగుదుం.
‘కోపగించిన కోతివలె చిమిడిన అతని అంతరంగం’ నాకర్థంకాదు. కోపగించిన కోతికి చిమడ్డానికీ ఉన్న సంబంధం ఏమిటో నాకు తెలీదు. వింత ఉపమానం.
“ధనంతో వంకర తిరిగిన జాతిప్రియులు”. ధనం ఉన్నవారు త్రాగి తందన్నాలు తొక్కి కూడా దేశానికి ప్రియులు కాబోలు!
“ప్రశాంతతను పీల్చే నేత్రం” ఆ కన్నెత్తితే చాలు కనకాభిషేకాలు.
ఒక్క విశేషణంతో తారక మినక్కుమంటుంది – తేమగా ఉన్న తారక తడిసినట్లు, తేమగా కనబడే నక్షత్రాన్ని శీతాకాలంలో చూస్తాం. దీనితో సమమైంది వాల్మీకి చంద మామ – ‘శ్వాసతో మసకైన అద్దంలాంటి చందమామ’.
అధికారం కోసం అత్యాచారాలు చేసి పతనం చెందిన వ్యక్తులను, సన్నివేశాలను వర్ణించేటప్పుడు, షేక్ స్పియర్ శైలిలోని ఉదాత్తత, శిఖరాన్నందుకుంటుంది. ఆ ధోరణిని ‘కసిత్వం’ అనొచ్చు.
‘ కళ్ళు తెరుచుకున్న గూడుపుఠాణి’-ట, కూలదోయడానికి కుట్రలు సల్పేవారు.
“వెళ్ళినరోజుల్లో వెలిగిన వెర్రివారున్నారు.”
” పంగల కర్రలా రెండుగా వీడిన మనిషి” అన్నది చాల చిత్రమైన వర్ణన- ఆధునిక చిత్రకళలో, – ముఖ్యంగా పికాసో, పాలి చిత్రాలలో ఇట్లాంటి మనిషి స్వరూపం చూస్తాం.
“పిచ్చుక క్రిందపడటంలో ఒక ప్రత్యేక కర్మ వుంది.”
విద్యుత్ తీగ పై నుండి కింద పడ్డ పిచ్చుకను చూసినప్పుడు నాకీ వాక్యం బాగా అర్ధమైంది.
“చమట్ల వేగిరపాటు వల్ల రాత్రి, పగటికి తోటిపని వాడవుతుంది.” చలి దేశాల్లో వారికి చమట వేగిరపాటు అంత సులువుగా బోధపడదు.
“సంధ్య దిగవిడిచిన కిరణం వలె పతనమౌతాను.”
చెట్ల ఆకుల మధ్య, కొండ శిఖరం వెనక, కిరణం జారి పోవడం చూసినవాళ్ళు, వెలుగు దిగజారడంలో ఉన్న దైన్యాన్ని బాగా గ్రహిస్తారు.
స్త్రీ కోసం సామ్రాజ్యాన్ని వదులుకున్నవారి ప్రగల్భం — “సామ్రాజ్యాలని ముద్దుతో తుడిచివేశాము.” “జమకొచ్చిన ప్రేమలో యాచన ఉంది”.
—లెక్క, జమలో జమ ఇందులో జమ.
రక్తనాళాలు పచ్చగా ఉంటాయి. — కాని కోపం వచ్చినవారిని ఇల్లా వర్ణిస్తాడు షేక్ స్పియర్ . ‘రక్తనాళాలలోంచి ఎర్ర ప్రవాహాలు….’
‘జీవితం ఒక నడిచే నీడ,’ ఊహిస్తే భయమేసే ఈ ఉపమానంలో షేక్స్ స్పియర్ ని దర్శిస్తాం.
ఇప్పుడు కొంచెం దీర్ఘమైన భాగాలను పరిశీలిద్దాం. షేక్ స్పియర్ నాటకాలలో వారి దేశ చరిత్రకు సంబంధించిన గాథలే కాకుండా, ప్రాచీన గ్రీసు, రోమ్ దేశాల పౌరాణిక గాథలకు సంబంధించిన విశేషాలు, వ్యక్తులు ఉదాహరణలుగా దొర్లుతాయి. ఆ గాథలతో పరిచయం లేనివారికి వ్యాఖ్యానం లేనిదే ఆ భాగాలు అర్థం కావు. అట్లాంటివి విడిచేస్తాను. అందరికి అందుబాటులో ఉన్న కొన్ని అనుభూతులను షేక్ స్పియర్ ఏ విధంగా కవిత ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నాడో చూపే నిమిత్తమై ఆ అనుభూతులను శీర్షికల క్రింద విడమరచి స్వేచ్ఛానువాదం సాగిస్తాను.
సౌందర్యం – ప్రేమ
ఆమె ‘కాగడాలకి జోరుగా కాలడం నేర్పుతుంది.’
‘రాత్రి చెంపపై వ్రేళ్ళాడుతుంది’ ప్రతి రచయితకీ, ధ్వనినిబట్టీ, అర్థం బట్టీ, తాను కల్పించిన ఊహ బట్టీ, కొన్ని అభిమాన పదాలుంటాయి. ‘వ్రేళ్ళాడడం’, ‘కదపడం’, ‘వూపడం’, ‘మెరుగైన’, ‘ముంచడం’, ‘తాకిడి’, ‘తొంగిచూడటం’, మొదలైనవి షేక్స్ స్పియర్ కు ఇష్టమైన మాటలు. ‘ఆర్’ అన్న అక్షరం గల పదాలంటే ఆయకి ఎంతో ప్రీతి.
‘అశుభమైన తారకల కాడిని కదిపేసి ఇక్కడ శాశ్వతమైన విశ్రాంతి తీసుకుంటానంటాడు ఒక పాత్ర. ఒకామె సౌందర్యం ఇలా వర్ణిస్తాడు.
ఆమెశ్వాస గదినంతా పరిమళం చేస్తుంది. శెమ్మాలో దీపం వెలుగు ఆమె మీదకి ఒరిగి, కనురెప్పల వెనక దాగిన కాంతులను తొంగిచూస్తుంది” – గొప్ప వర్ణన.
మరొకచోట —
‘ఉప్పు ప్రవాహంతో తడిసిన సముద్రపుటొడ్డున శాశ్వత భవనాన్ని నిర్మించుకున్నాడు. రోజుకొకసారి భీకరంగా పొంగే కెరటాలను తన నురుగుతో కప్పివేస్తూ,’
‘రోజుకొకసారి’ ఎందుకో నాకర్ధం కాలేదు. ఉపమానాన్ని పీడించి అస్పష్టమైన అందాన్ని సమకూరుస్తాడు షేక్ స్పియర్ .
“గాలిలోంచి చూస్తూంటే స్వర్గంలో ఆమె కళ్ళు మెరుస్తాయి, పగలనుకుని పక్షలు పాడతాయి.” ఆమె “దుఃఖానికి మాటలు నేర్పుతుంది. బాధతో కొట్టుకునే గుండెకి గుసగుస చెప్తూ పగలమని శాసిస్తుంది.” దైన్యం ఆ గుసగుసలో వుంది.
‘నీ తల్లి పాలిటి అద్దానివి నువ్వు.
ఆమె యవ్వనపు సొగసు నీలో చూసుకుని మురిసి పోతుంది.’
అమాయకురాలి వర్ణన
“ఆమెకి ధైర్యం లేదు. నెమ్మదైంది. తన కదలికకి తనే సిగ్గుపడుతుంది”.
వాల్మీకి ఊహించిన ‘సిగ్గుపడిన కన్యలు’ మరీ బాగుంటారు.
“వస్త్రముల వలె నదిలో నీరు ఒడ్డున చేరుతోంది; సిగ్గుపడిన కన్యల తొడలవలె ఇసుక ఒడ్డు మెరుస్తోంది” అని వాల్మీకి.
“శూన్యం ఏర్పడుతుందన్న భయం లేకపోతే ఆమెని చూడ్డానికి గాలికూడా వెళ్ళును. ప్రకృతిలో ఖాళీ కనపరుస్తూ ” ‘సిగ్గుబిడియాలు గల కన్య కూడా, తన పేరు సౌందర్యాన్ని చందమామ ముందు బైటపెట్టినప్పుడు తన దుబారాతనాన్ని బాగా చూపెడుతుంది.’
ప్రేమని పైకి చెప్పుకోలేని స్త్రీని ఇలా వర్ణిస్తాడు.
‘పుష్పంలో పురుగులా, దాపరికం ఆమె ఎర్రటి చెక్కిలిని తింటూవుంది – ఆకుపచ్చ, పసుపురంగు దైన్యంతో, శిలా ఫలకంపై ‘సహనం’ అనే ప్రతిమవలె దుఃఖాన్ని చూసి నవ్వుతూ కూర్చుంది.’
పుష్పంలోని మృదుత్వం, శిలా ప్రతిమలోని నునుపు, – వీటి కలయికతో దైన్యం రంగుల్ని కూడా తెచ్చుకున్నట్లుంది. లోపలున్నపుడు ఆకుపచ్చ (కంఠంలో నాళాలు) నవ్వు రూపంలో బైటకొచ్చినపుడు పసుపు. ఇదొక అపూర్వమైన భావన.
ప్రకృతి వర్ణనలో కవి పరిశీలనా శక్తి వ్యక్తమవుతుంది. ఈ పరిశీలన రెండు విధాలుగా ఉంటుంది. ఎదురుగా ఉ న్నదాన్ని, వున్నది వున్నట్లుగా వర్ణించడం ‘ఆ చెట్టుకి ఇరవై నాలుగు కొమ్మలున్నై.’ ఇట్లాంటి వాక్యాన్ని గమనించం. ‘ఇరవై నాలుగు అంకెలా కొమ్మలు పెనవేసుకున్నాయి’ అనగానే మనకొక బొమ్మచిత్రితమవుతుంది. ఇట్లాంటి వర్ణనలో వాల్మీకి అద్వితీయుడు. ఇది చూడండి. ‘గాలికి చెట్టు కదులుతున్నా, వాటి వెనుక ఉన్న కొండలు నృత్యం చేస్తున్నట్లుగా ఉంది.’ షేక్ స్పియర్ నాటకాలలో ఇట్లాంటివెన్నో ఉన్నాయి. అందమైన ఉపమానమని తోస్తే దాన్ని ప్రేమిస్తాడు. సందర్భాన్ని మరచి దాన్ని వెంటాడుతాడు. నిద్రిస్తున్న పసి కందులను హత్య చెయ్యడానికి వచ్చిన ఒక దుండగీడు చేత ఆ పిల్లలు, ‘రెమ్మమీద ఉన్న రెండు గులాబీలు’ లా ఉన్నారని పిస్తాడు. గాయపడిన ప్రియుడ్ని చూసి ప్రేయసి భయంతో ఎలా వెనక్కి తగ్గుతుంది.? మెత్తని మెదడు గాయపడి నత్తగుల్ల బాధతో తన గుహలోకి వెనక్కి తగ్గి ఆ నీడలో మొత్తంగా ముడుచుకుపోయి చాలా సేపటి వరకూ, బైటికి రావడానికి జంకినట్లు….” ఇందులో చివరి వాక్యం – అంటే చాలా సేపటివరకూ బైటకి రాదన్నది – అనవసరం.
“రాత్రి వెలిగించిన కొవ్వు ఒత్తులు ఆరిపోయాయి. మసక కొండ శిఖరం మీద ప్రభాతం కాలిబాటన వ్రేళ్ళమీద నిలబడింది మహదానందంతో.”
మరో రకం వర్ణనలో, వెనక తాను చూసిన వాటిల్లో అందమైన వాటిని జ్ఞప్తికి తెచ్చుకుని, వాటిని తన ఎదురుగా ఉన్న వస్తువుతో జతపరచి, కొత్త అందాన్ని వెదకడం జరుగుతుంది. ప్రస్తుతంలో గతాన్ని స్మరించడమే ప్రతిభ అన్నారెవరో.
పైనుంచి చూస్తుంటే భూమి ఎలా వుందో వాల్మీకి ఇలా వర్ణిస్తాడు.
“మహా నగరాలలో భూమి రథచక్రంలా ఉంది. కొండలు ఒడ్డున గులకరాళ్ళలాగున్నాయి. నదులు దారం లాగా ఉన్నాయి. పెద్ద పర్వతాలు, చెరువులో నీళ్ళు త్రాగుతున్న ఏనుగుల వలె ఉన్నాయి.
“కన్యలాంటి ముల్లు మీద వాడిన గులాబి’ అన్న షేక్ స్పియర్ వర్ణన ఈ రకందే. కన్యలో కాఠిన్యం ఆయనెరుగును – అది ముల్లులాంటిది. ఇల్లాంటిదే మరొకటి.
‘మృత్యువు కొట్టిన దెబ్బ, ప్రియుడు బుగ్గ గిల్లడం లాంటిది. నెప్పిగా ఉన్నా, కావాలంటాం.’
మరొకటి.
“ప్రభాతం దగ్గర పడుతోందని చెబుతుంది. మెరుగు – పురుగు దాని నిరుపయోగమైన వెలుగు సన్నగిల్లుతుంది.” ఇందు నిరుపయోగమైన వెలుగు అన్నది అనవసరం. రెండు విశేషణాలుంటే కాని తృప్తి పడడు షేక్ స్పియర్ , ఒకటి కాకపోతే ఒకటేనా నిలబడకపోతుందా – అనుకున్నట్లు. అతని దృష్టి అట్లాంటిది. ఉపమానాన్ని కామించడం విరమించి, ఉద్వేగంలో కూడా ఏకాగ్రత సాధించినప్పుడు, ఆయన వర్ణనలు చాలా శక్తివంతంగా ఉంటాయి.
“ఆనందంతో వారు తమ టోపీలను పైకి ఎగురవేశారు – చందమామ కొమ్ముల మీద వ్రేళ్ళాడవేసినట్లు.” ఇది అద్భుతమైన ఉత్ప్రేక్ష. ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్న నానుడిని పరామర్శిస్తూ, ‘అతి’ అంటే ఏమిటో ఇల్లా ఉదహరిస్తాడు.
“పొదిగిన బంగారానికీ మెరుగెట్టడం, మల్లెపూవుకి తెల్లరంగు పూయడం, పరిమళించే పుష్పం పై అత్తరు చల్లడం, మంచుని చదును చెయ్యడం, ఇంద్రధనుస్సుకి మరో రంగు అమర్చడం, ఆకాశం యొక్క అందమైన కంటికి కొవ్వొత్తి వెలుగు చూపడం.”
ప్రపంచంలో ఉత్తమ నాటక కర్తగా ఖ్యాతి గడించుకున్నాడు షేక్ స్పియర్ . మానవ ప్రకృతిని బాగా పరిశీలించి తరచి చూచాడు, పైకి ఎలా కనబడినా వారిలో ప్రాకృతిక శక్తుల విజృంభణ, కామము, రహస్యమైన వాంఛలు వుంటాయనీ, వాటికి లొంగిపోయినప్పుడు మానవుడు పతనమౌతాడనీ గ్రహించాడు. విషాదాంత నాటకాలు వ్రాసిన కాలంలో మానవుడి పట్ల అతనికి రోత పుట్టిందనడానికి నాటకాలలో ఎన్నో నిదర్శనాలున్నాయి. ఉద్రేకానికి లొంగిపోయి, అధికారం కోసం ఘోర అపచారాలు చేసిన వ్యక్తులని ప్రత్యేకమైన కసితో వర్ణిస్తాడు. “మనుషులు మనుషుల్ని ఎలా నమ్ముతారో నాకర్థంకాదు.” అంటాడు షేక్ స్పియర్ నాయకుడు. పాపాలు చేసినవారి మొహాలు ‘కరుడు గట్టిన బురదనీటి గుంటపై పరచిన పరదాలవలె’ వుంటాయంటాడు. పాపాత్ములు వారొక్కరే నాశనం కాక, తోటివారైన మంచి వారిని కూడా నాశనం చేస్తారు. జీవితంపైనా, మనుషులపైనా రోత పుట్టించే భావాలు, నిర్వచనాలు ఎన్నో వున్నా, మానవత్వం పట్ల అతని విశ్వాసం సడలిందనలేము. ఘోరాలు చేసినవారిని చూసి విస్తుపోతాం. ముక్కుమీద వేలేసుకుంటాం. కాని అట్టివారిని ద్వేషించడు. వారిని చూసి జాలి పడతాడు. జాలిపడేటట్లు చేస్తాడు. కొన్ని ఇక్కట్లు, పోటీలు.
“చీకటి సమస్య”, “ఇసుక కాళ్ళ కింద చలితో ఒణికి పోతోంది”, “రాత్రంతా మంచు పీల్చి వికసించలేని పుష్పం లాంటి “- ఆమె చక్కదనం. “యుగాలుగా కొండ శిఖరాలపై మంచు కురిపించి మత్తెక్కిన చంద్రబింబాలు – ఆ నేత్రాలు”, “ఎర్రపూలను బంధించిన గడ్డిపోచలు”, “ఆద్యంతాలు కలది కన్నీరొక్కటే”
వీటి మూలాలు షేక్ స్పియర్ రచనలలో ఉన్నాయో లేవో నేనెరగనుగాని, షేక్ స్పియర్ నాటకాలు చదువకపోతే ఇల్లా వ్రాసి ఉండేవాణ్ణి కానని మాత్రం చెప్పగలను. కేంద్ర సాహిత్య అకాడమీ వారు, షేక్ స్పియర్ నాటకాలని, యుస్కో సంస్థ ప్రోద్బలంతో, దేశభాష లన్నింటిలోకీ అనువదించే యత్నం చేస్తున్నారు. తెలుగులో కొన్ని మంచి అనువాదాలు వెలువడ్డాయి కూడాను. ఇవిగాక, షేక్స్పియర్ని గురించిన ఒకటి రెండు పుస్తకాలను తెలుగులో అనువదించడానికి మరెవరన్నా పూనుకోవాలి. వాల్టర్ రాలె, (Sir Welter Raleigh), ఇవర్ బ్రౌన్, (Ivor Brown) వ్రాసినవి రెండు మంచి పుస్తకాలు. వీటిల్లో షేక్ స్పియర్ జీవిత విశేషాలు, నాటకాల చరిత్ర, ఇతివృత్తం పాత్రల విమర్శ, తాత్విక చింతన సమగ్రంగా గంభీరమైన భాషలో, కూర్చబడ్డాయి.
* * *