“గంటల తరబడి మాటులో కూర్చున్న బైరిగాడి నడుం పీకేస్తోంది. క్రమేణా అడవంతా చీకట్లు ముసురుకున్నాయి. చీకటి దట్టమౌతున్న కొద్దీ కీచురాళ్ల ధ్వని ఎక్కువౌతుంది. దూరంగా కొండ లోయల్లో కొండ గొర్రె అరుపు మొదలు పెట్టింది. చుక్క వెలుగు, గుంటలోని నీట్లో ప్రతిఫలిస్తూ బైరిగాడి కళ్లకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎండిపోయిన సెలయేటి ఇసుక అంత చీకట్లోనూ తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది.
అల్లం శేషగిరిరావు మృగతృష్ణలోనిది ఇది. ఆయన కథలను విజయవాడ పల్లవి పబ్లికేషన్స్ ప్రచురించింది. వేట చుట్టూ ప్రధానంగా సాగే ఈ కథలన్నీ దేనికదే రచయిత శక్తిని గొప్పగా చాటతాయి.
ఆ కథలు చదువుతోంటే-మనమూ ఆ వేటగాడితో పాటు వెనకనే పొదల మాటున కూచుని చడీ చప్పుడు కాకుండా జంతువు కోసం నిరీక్షిస్తాం. ప్రధాన పాత్రతో ప్రతి అడుగులో కలిసి కదులుతాం. ఆయా పాత్రల మానసిక స్థితిగతులతో మమేకమవుతాం. ఆ పాత్రే మీరయిపోతారు. అతడి నిస్సహాయత మీ నిస్సహాయత అవుతుంది. అతడి తెగింపు, తిరుగుబాటు మీరే చేస్తున్నట్లు ఉంటుంది. వెరసి నిస్సహాయుల పట్ల సానుభూతి,రక్తం పీల్చే మానవ జలగల పట్ల చంపెయ్యాలన్నంత కోపమూ మిమ్మల్ని చుట్టుముడతాయి.
ఏ సాహిత్యానికైనా ఇంతకంటే గొప్ప పరమార్థం మరోటి ఉండదు.
అక్షరాలనే కెమెరా కన్నుగా మలుచుకుని తెర మీద దృశ్య కావ్యాన్ని చూస్తున్న అనుభూతిని కలిగించడమన్నది సమర్థులైన రచయితలందరూ నాటి నుంచి నేటి దాకా చేస్తూనే వస్తున్నారు.
మనోఫలకంపై అక్షరాలతో దృశ్యాలను చిత్రీకరించడమనే కళ ఈ నాటిది కాదు. కొండ గుహల్లో తల దాచుకున్న ఆది మానవుడు -బొమ్మనే భాషగా చేసుకున్నాడు. వేటాడి తెచ్చిన జంతువును ఏ బొగ్గు ముక్కతోనో గుహగోడలపై గీసి తన మనసులోని భావాలను బొమ్మ కట్టించాడు. ఈ బొమ్మల మేజిక్కు,కెమిస్ట్రీ ఇప్పటికీ అలాగే అక్షరాలా కొనసాగుతూ రావడమే విశేషం.
***
మనసులోని భావాలు పలురూపాలు తొడుగుతాయి. అచ్చు రూపం తొడిగే అక్షరాలు కొన్నయితే,చెవి ద్వారా లోపలకు చొరబడే విషయాలు మరికొన్ని. కనిపిస్తూ వినిపిస్తూ కనువిందు చేసేవి ఇంకొన్ని.
వార్తా పత్రిక,పుస్తకం అచ్చు తొడిగిన అక్షర రూపం. మొదటినుంచీ ఈ మాధ్యమానిదే అగ్రగణ్య స్థానం. రేడియో వచ్చి ,చెవిలో ఎన్నో ఊసులు చెప్పింది. ఆ తరవాత బుల్లి తెర విచ్చుకుని మహాద్భుత ప్రపంచాన్ని కళ్ల ముందే ఆవిష్కరించింది. స్మార్ట్ ఫోన్ అరచేతిలోకొచ్చి ఆ బొమ్మల కేన్వాసును మరింత పెద్దది చేసింది.
వార్తలు,సమాచారం తెలుసుకోవటానికి వార్తాపత్రికలే అక్కర్లేదు.టీవి చూస్తే చాలదా? యూట్యూబ్ లో విశ్లేషణ వింటే మన పని ఇంకా సులువు కదా! నవలలే ఎందుకు చదవాలి? టీవీలో జీడిపాకం సీరియళ్లు చూస్తూ కూచుంటే మహాబాగు కదా! అని అనుకునే వారెందరో.
ఇప్పటి తరానికి స్మార్ట్ ఫోనే ప్రపంచం. ఆ ఫోనులో మునిగి తేలే యువత సమాజం నుంచి మానసికంగా దూరం జరిగిపోయింది. యువతలో పొడచూపుతున్న పలు రకాల వైపరీత్యాలకు స్మార్ట్ ఫోన్ కారణమన్న సత్యం తెలియంది కాదు.
సమాచారం, వినోద కాలక్షేపాలకు ఎన్ని మాధ్యమాలు అంది వచ్చినా, అవేవీ పుస్తకానికి సరిసాటి కావు.
పుస్తకాలు ఎందుకు చదవాలి?
1) పుస్తకాలు, పత్రికలు చదువుతుంటే మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చెప్తున్న విషయాలతో మనోఫలకంపై బొమ్మ గీసుకుంటారు. అలా దృశ్యబద్ధం అయినప్పుడే ఆ విషయం మనకు బోధ పడుతుంది. రేడియో వినటం ద్వారా కూడా ఇలా విషయాలను బొమ్మ కట్టిస్తుంటాం.
2) టీవీ చూసేటప్పుడు మెదడుకేమి పని ఉండదు. ఒక వాహనాన్ని స్టార్ట్ చేసి న్యూట్రల్‍లో ఉంచితే ఇంధనమైతేఖర్చవుతుంది కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు. అదే చందంగా తెర మీదే అన్నీ ఆవిష్కృతమవుతుంటే మన మెదడు క్రమేణా ఆలోచించటం మానేసి,ఊహలకు రెక్కలు తొడగటం మరిచిపోతుంది. ఆలోచనా జ్ఞానం,కల్పనా శక్తి వెనకబడిపోతాయి.
3) కథలు, నవలలు చదివితే ఆయా పాత్రల జీవన స్థితిగతులు కళ్లకు కడతాయి. మానవ మనస్తత్వాలు బోధపడతాయి. తెలీకుండానే జీవితంలో ఎదురైన సవాళ్లను ఢీ కొనే సన్నద్ధతనిస్తుంది. నిజ జీవిత అనుభవాలైనా,కల్పిత కథలైనా చెరగని ముద్ర వేసి వివేచనా శీలురను చేస్తుంది.
4) ఏ విషయం పైన అయినా స్వతంత్రంగా ఆలోచించి,మంచి చెడ్డలు బేరీజు వేసుకుని మీదైన అభిప్రాయాన్ని ఏర్పరచుకోవటానికి శక్తిమంతమైన మాధ్యమం-పఠనమే. యూట్యూబ్ వీడియోల్లో అభిప్రాయాలు వారి వాదనా పటిమతో అప్పటికి సబబని అనిపిస్తాయి. కానీ స్వంతంత్ర నిర్ణయానికి రాగలిగేది మాత్రం పఠనం ద్వారానే.
5) స్మార్ట్ ఫోన్‍తో ఓ రెండు గంటలు గడిపాక, ఈ రెండు గంటల్లో ఏమేమి చూశాం, చదివాం అని గుర్తు చేసుకోండి. బహుశ చాలా భాగం అప్పటికప్పుడు స్ఫురణకు రావు. కాలం వృధా తప్పించి నేర్చుకున్నది,జీవితానికి మలుచుకున్నదీ తక్కువే ఉంటుంది.
6) దీనికి భిన్నంగా ఏదైనా చదివితే, సర్వ శక్తుల్ని కేంద్రీకరిస్తారు. ఆ గాఢత వేరు. ఆ ప్రభావం వేరు. ఆ ప్రయోజనం వేరు. మంచి రచయితలు ముందుగా మంచి చదువరులే. వారి కల్పనాశక్తిని రాటు తేల్చింది పఠనమే.
పఠనం ప్రయోజనాల గురించి ఇలా చాలా విషయాలను క్రోడీకరించుకుంటూ వెళ్లవచ్చు.
మీ ముందు రెండే మార్గాలున్నాయి. ఒకటి -దారి తెన్ను లేని కీకారణ్యం. ఎటు పోతున్నామో ఎందుకు పోతున్నామో తెలియని ప్రయాణం. ఈ మార్గంలో అలసటే తప్ప ఎక్కడ తేలుతామో మరింకెక్కడ మునుగుతామో అంతు చిక్కదు. స్మార్ట్ ఫోనూ,టీవీలు ఈ దుర్గమారణ్యాలు.
ఇక రెండోది -దారి మీకు స్పష్టంగా తెలుసు. ఎక్కడికి వెళ్తున్నామో,ఎందుకు వెళ్తున్నామో మీకు పూర్తి అవగాహన ఉంది. ఏ ఫలితాలు పొందబోతున్నదీ స్పష్టత ఉంటుంది. మరి ఈ మార్గం-పఠనం అని వేరే చెప్పనవసరం లేదు.
***
తేట తెలుగు కథకు పట్టంగట్టిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు మార్గదర్శి కథలో వ్యక్తం చేసిన ఈ అభిప్రాయాలు తలపోసుకోకుంటే ఈ వ్యాసం అసంపూర్ణమే. ఆయనంటారు:
“కథలంటే మనుష్యుల నడతలకు ప్రతిబింబాలు కావుటో వెర్రివాడా! అనుభవపరుడంటే చాలా కథలు అర్థం చేసుకుని, వాటి భావం జీర్ణం చేసుకున్న వాడు కాడూ?అయితే కథలర్థంచేసుకోవాలంటే కళ్ల యెదట జరిగితే చూడనైనా చూడాలి,పుస్తకాలు చదవయినా గ్రహించాలి. కళ్ల యెదుట జరిగేవి చూదామంటే బుద్ధికి వికాసం కలిగించేవి యెప్పుడో గాని మనకు దొరకవు. పుస్తకాలు చదివితే అన్నీ అలాంటివే ఉంటాయి, కనుక చదువు వచ్చినవాడు చిన్నతనంలోనే ఎన్నో కథలు బుద్ధికి పట్టించుకోవచ్చు.
అనేక కథలు చూడడం వల్లా ,చదవడం వల్లా ,వినడం వల్లా, చిన్నతనంలోనే బుద్ధికి వికాసం అబ్బుతుంది. అదే ప్రౌఢిమ. అంచేతే చదువురాని ముసలి వాడి కంటే,చదువు వచ్చిన కుర్రవాడు ఎక్కువ జ్ఞానవంతుడు కావడం.
ఏతా వాతా -కథలంటే పైపైని వున్నాయనుకున్నావేమో? అవి కల్పించడానికి చాలా గొప్ప ప్రతిభ ఉండాలి. వాటి విలువ తెలుసుకోవడానికెంతో పరిజ్ఞానం వుండాలి.అవి చెప్పడానికెంతో నేర్పు ఉండాలి.అవి బోధపరచుకోవడానికి బుద్ధి సూక్ష్మత ఉండాలి.
కథలు కళ్లకి వెలుగిస్తాయి. బుద్ధికి పదును పెడతాయి. మనసుకి ఉత్సాహమూ ఉల్లాసమూ కలిగిస్తాయి. జడునకున్నూ కల్పనాశక్తిన ప్రతిపాదిస్తాయి నిజంగా. వొక్కొక్క కథ యెలాంటి ఘట్టం లోనూ కూడా వొక్కొక్కళ్లని వొడ్డె క్కిస్తుంది.
కథలు చదవడమూ, అథమం వినడమూ యెప్పుడు దండుగ అనుకోకేం?”
* * *