‘లోయ చివరి రహస్యం’ లో మాంత్రిక వాస్తవికత

Spread the love

గత రెండు దశబ్ధాలలో అత్యంత ప్రయోగాత్మకమైన కథలు రాసిన రచయితలలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు భగవంతం.  కథా రచనలో భగవంతం ఈ రెండు దశాబ్ధాల కాలంలో గొప్ప పరిణితి సాధించాడు. తనదైన శిల్పాన్ని రూపొందించుకున్నాడు. లోతైన తాత్విక, అస్తిత్వ ప్రశ్నలను అన్వేషించే ప్రత్యేకమైన కథన రూపాన్ని సృష్టించ్చుకున్నాడు. భావుకతకి, వాస్తవికతకి మధ్య విభజన రేఖలు చెరిపి తాను రాసిన కథలు మానవ అనుభవానికుండె అనేక పోరలను తన కథలలో ఆవిష్కరించాడు. తన కథలన్నీ వర్తమాన సంక్లీస్ట జీవితానికి రూపకాలు (metaphors) లాంటివి. తన కథలు తరచుగా పాఠకులను వేరే ప్రపంచంలోకి తీసుకుపోతాయి. అక్కడ వాస్తవికథకు సంబంధించిన నియమాలకు విలువలేదు. ఒక కొత్త మార్మిక వాస్తవికత పాఠకుల అనుభవంలోకి వస్తుంది. ఒకరకంగా భగవంతం కథలు తాత్విక విచారణలు. అతని కథలు తరచుగా స్పష్టమైన వ్యాఖ్యానానికి లోంగవు. పాఠకులను అస్పస్టతలో మిగుల్చుతాయి. కథలు క్లుప్తంగా ఉంటాయి, అయినప్పటికీ వాటిలో అనేక అర్థ పొరలునిండి ఉంటాయి. సంక్లిష్టమైన ఆలోచనలు, భావోద్వేగాలు,కథనాలను సంక్షిప్త పద్ధతిలో చిత్రించటం అనేది  తన నైపుణ్యాన్ని తెలియజేస్తుంది.

భగవంతం పాత్రలు, ఎక్కువ సందర్భాలలో విచిత్రమైన, అహేతుకమైన పరిస్థితులలో తమను తాము కనుగొంటాయి, ఇవి ఆధునిక ప్రపంచంలో జీవితంలోని దిక్కుతోచని, తరచుగా అర్థరహితమైన అంశాలను ప్రతిబింబిస్తాయి. సాహిత్యం, దృశ్య కళల మధ్య రేఖలను అస్పష్టం చేస్తూ తరచుగా తన రచనలో దృశ్యమాన అంశాలను చేర్చుతాడు. కొన్ని కథలు collage పేయింటింగ్స్ లాగా వుంటాయి. అతను మేధోపరంగా ఉత్తేజపరిచే, కళాత్మకంగా ఉల్లాసపరిచే,  లోతుగా ప్రభావితం చేసే కథలు రాశాడు. ఇటీవల అవి ‘లోయ చివరి రహస్యం’ పేరుతో ఒక సంపుటిగా వచ్చాయి.

లోయ చివరి రహస్యం అనే కథనాన్ని  భౌతిక, ఆత్మిక  అంశాలను పెనవేసుకున్న ప్రయాణం ద్వారా అస్తిత్వ అన్వేషణ, గాఢమైన పరివర్తన చూపుతూ  నడిపాడు రచయిత.

ఈ కథ, దాని గొప్ప ఇమేజరీ ప్రతీతకాత్మతతో  , మనిషి అస్తిత్వ స్థితి, దాన్ని అధిగమించాలనే తపన, వ్యక్తిగత కోరికలు మనిషి జీవితానికి ఉన్న పరిమితుల మధ్య ఉద్రిక్తతను పరిశీలిస్తుంది. మరింత నిర్ధిస్టంగా చెబితే మన అంతర్గత కోరికలు, మనం ఎదుర్కొనే బాహ్య అడ్డంకుల మధ్య సంఘర్షణను స్పష్టంగా చిత్రిస్తుంది,

ఒక పచ్చని లోయ అందాలను చూసి కథానాయకుడు ఆశ్చర్యపోయి, అందులోకి దూకాలని, బహుశా పక్షిలా పైకి ఎగరాలనే కోరిక కలగడంతో కథ మొదలవుతుంది. ఈ తపన స్వేచ్ఛ కోసం లోతైన కోరికను,  మనిషి  జీవిత లేక ప్రాపంచిక పరిమితుల నుండి బయటపడాలనే కోరికను  ప్రతిబింబిస్తుంది. లోయ, దాని నిర్మలమైన అందంతో వ్యక్తిగత పరిమితులను అధిగమించగల సామర్థ్యం తక్షణంగానైనా కథకుడికి ఇస్తుంది.

లోయలో నడుస్తూ, నేలపై హుందాగా కదలగల వ్యక్తిగా తనను తాను మార్చుకోవాలనుకునే మరో పాత్ర రాక ఒక గొప్ప  అనుబంధాన్ని పరిచయం చేస్తుంది. అ  పాత్ర ‘ మనిషిలా నేల మీద బరువుగా నడవాలని కోరుకోవటం, పక్షిలా గాల్లోకి ఎగరాలనే కథకుడి ఆలోచనకు పూర్తి భిన్నంగా ఉంటుంది.  ఎగరగలిగే  సామర్ధ్యం ఉన్నప్పటికీ, స్థిరంగా ఉండటానికి చేసే ప్రయత్నం రెండూ మనిషి  తానున్న స్థితిని అధిగమించటానికే పడే తపన,సంఘర్షణను చిత్రించం కనిపిస్తుంది. కథలోని ‘మనిషి పక్షిలా గాల్లోకి ఎగరాలని వాంఛిస్తుంటాడు కానీ మనిషై ఉండి ఇతను మనిషిలాగ నేల మీద నడవాలని కోరుకోవడం ఏంటీ?అనే వాక్యం ఏకకాలంలో కవితాత్మకంగా, వ్యంగ్యం కూడా అనిపిస్తుంది.

మానవులు ఔన్నత్యాన్ని, స్వేచ్ఛను కోరుకుంటారు (ఎగరడం అనే ప్రతీక), వాళ్ళు  తమ సాధారణ ఉనికికి (నడక అనే ప్రతీక) ఏకకాలంలో విలువ ఇస్తారు. ఇది మానవ ఆకాంక్షకు,  వాస్తవ అస్తిత్వానికి మధ్యఉండే  ద్వంద్వాన్ని ఎత్తి చూపుతుంది. “Man is nothing else but what he makes of himself”. అంటాడు సార్త్ర్ (Sartre). సార్త్ర్  ప్రకటన మనుషులు తమ జీవితాలకు , ఆలోచనలకు, చర్యలకు తామే  బాధ్యులు అనే విషయాన్ని చెపుతుంది. ఒక వ్యక్తి ఆస్తిత్వం , భవిష్యత్తు తన  స్వంత నిర్ణయాలు, ప్రయత్నాల ద్వారా నిర్వచించబడుతుంది. ఇది అస్తిత్వ స్వేచ్ఛ- బాధ్యత అనే భావనను నొక్కి చెబుతుంది. అలాగే ఆల్బర్ట్ కాము ( Albert Camus) “ The only way to deal with an unfree world is to become so absolutely free that your very existence is an act of rebellion” అని అంటాడు. కాము  ప్రకారం స్వేచ్ఛ పరిమితం చేయబడిన ప్రపంచంలో, ప్రతిఘటన అంతిమ రూపం సంపూర్ణ స్వేచ్ఛను ప్రకటించడమే. అంటే సామాజిక నియంత్రణలను  ధిక్కరించే విధంగా జీవించడం, అస్తిత్వాన్ని తిరుగుబాటు రూపంగా మార్చడం.

ఈ పై  ఆలోచనలను కలిసి చూసినప్పుడు, అవి స్పష్టమైన అవగాహననిస్తాయి. మనిషి   స్వేచ్ఛగా ఉండాలని ఉన్నతంగా (ఎగరడం వంటివి) ఎదగాలని కోరుకుంటాడు , ఆదే సందర్భంలో తన రోజువారీ సాధారణ జీవితాన్ని (నడక వంటివి) మిగుల్చుకోవాలని  కూడా అనుకుంటాడు. మనిషికి ఉండే రెండు ప్రధాన కోరికలు, ఒకటి జీవితంలో తన  స్వంత మార్గాన్ని రూపొందించుకోవటం, స్వేచ్ఛగా ఉండటం, అవసరమైనప్పుడు సమాజ నియమాలకు విరుద్ధంగా కూడా ఉండటం. ఈ అంశాలను లోయచివర రహస్యం కథ సంకేతిస్తుంది. అలాగే ఇది మానవ ఆస్తిత్వంలో అంతర్లీనంగా ఉన్న భౌతిక ప్రపంచం పరిమితుల నుండి తప్పించుకోవాలనే కోరిక, అదే సమయంలో దాని కట్టుబాట్ల మీద ప్రతిఘటనలు సంబందించిన వైరుధ్యాన్ని కూడా ప్రతిఫలిస్తుంది. ప్రధాన పాత్ర మానవ పరిమితులను ఎలా అధిగమించాలనుకుంటుందో, అదే విధంగా తేలియాడే మనిషి మరింత దృఢమైన అనుభూతిని పొందాలని కోరుకుంటాడు. ఈ వైరుధ్యం మనుష్యులు  వాళ్ళ  అస్తిత్వ  సవాళ్లను వివిధ మార్గాల్లో ఎలా ఎదురుకుంటారో వివరిస్తుంది: ఒక వ్యక్తి పరిమితుల నుండి తప్పించుకుని వాటి నుండి పైకి ఎదగాలని కోరుకుంటే, మరొక వ్యక్తి జీవిత వాస్తవాలను పూర్తిగా అనుభవంలోకి  తెచ్చుకోవాలని ప్రయత్నిస్తాడు.

పై  రెండు పాత్రలు కలిసి లోయ గుండా ప్రయాణిస్తుండగా, కథనం మార్మిక, నిగూడ కోణాల్లోకి వెళ్తుంది. వాళ్ళ ఇద్దరి సంభాషణ, వాళ్ళిద్దరికి విభిన్నమైన కోరికలు ఉన్నప్పటికీ, ఇద్దరూ తామున్న స్థితినుంచి బయటపడాలనే కోరికతో ఉన్నారనే విషయం తెలుస్తుంది.  కొంత అలంకారికంగా చెప్పాలంటే స్వీయ అన్వేషణ, అర్థాన్వేషణ ద్వారా సాగే ప్రయాణానికి ఈ లోయ ఒక రూపకం (metaphor). అది వాస్తవికతకు, ఆకాంక్షకు మధ్య హద్దులు మసకబారే ప్రదేశం, పాత్రల అంతరంగిక ప్రపంచాలు బహిర్గతమయ్యే ప్రదేశం.

కథలో ముఖ్యమైన ప్రతీకల్లో ఒకటైన  సొరంగాన్ని రెండు పాత్రలు సమీపించే కొద్దీ కథ పతాకస్థాయికి చేరుకుంటుంది. ఈ సొరంగం భౌతిక, ఆత్మిక  పరివర్తనలు జరిగే  మార్గాన్ని సంకేతిస్తుంది. ఇది పాత్రల ఆకాంక్షలు,  భయాలు కలిసే  మధ్యస్థ స్థలం (luminal space)గా అనిపిస్తుంది.  మనస్తత్వశాస్త్రం, భవననిర్మాణ శాస్త్రం మొదలైన వాటిలో   మధ్యస్థ స్థలం అనే భావన ఉంది. ఇది పరివర్తన లేదా మధ్య దశను సూచిస్తుంది, ఇది తరచుగా అస్పష్టత, అనిశ్చితితో వర్గీకరించబడుతుంది. పై శాస్త్రాలలో  సాధారణ నియమాలు,  నిర్మాణాలను పక్కనపెట్టే లేక నిరాకరించే సందర్భాలను  సూచించేందుకు దాన్ని వాడతారు. లిమినల్ స్పేస్ లో ఉండటం అంటే మార్పు ముంగిట్లో  ఉండటం, అక్కడ తెలిసింది  వింతగా మారుతుంది భవిష్యత్తు అనిశ్చితంగా ఉంటుంది. కథలో కథకుడు తన శారీరక వస్త్రధారణను వదులుకుని సొరంగం గుండా పరిగెత్తాలని నిర్ణయించడం, లోతైన సత్యాల అన్వేషణలో ఉపరితల పరిమితులను తొలగించడాన్ని సూచిస్తుంది. కథలో ఇలాఉంది:

పెద్ద టన్నెల్ అంటున్నారు. కొంపదీసి దాంట్లో దూరి అవతలికి వెళ్లేసరికి పూర్తిగా తెల్లారిపోదు కదా?’ అన్నాను జోక్ చేస్తున్నట్లుగా. ఇద్దరం టన్నెల్ని సమీపించాం.

అతను నా జోక్ కు నవ్వలేదు.

ఏమో! ఎవరు చెప్పొచ్చారు? తెల్లారొచ్చు లేదా ఇంకెప్పటికీ తెల్లారక పోవచ్చు. నాకు మాత్రం ఈ రాత్రి నుండి వస్తోన్న వాసనని గమనిస్తోంటే ఈ సొరంగం అవతలికి వెళ్లేలోపు నా లక్ష్యం మాత్రం నెరవేరబోతోంది అనిపిస్తోందిఅన్నాడు.

అతని మాటల్లో ఏదో ప్రాకృతిక రహస్యం బలంగా వ్యక్తం కావడానికి గింజు కున్నట్లనిపించింది. వెన్నెల కాంతిలో అతని ముఖంలోని సీరియస్నెస్  చూస్తోంటే నేను కూడా పక్షిలా ఎగరగలిగే సమయం ఇక వచ్చేసిందేమో అన్పించింది. ప్రతి రాత్రి కలలో ఈ దార్లో నేను వెదికే అద్భుతం బహుశా ఈ టన్నెలేనేమో అని కూడా అనిపించింది.

ఇద్దరి  మద్య సంభాషణ ఇలా కొనసాగుతుంది:

వేగంగా పరుగెత్తడం వల్ల పక్షిలాగా ఎగిరే అవకాశం త్వరగా రావచ్చేమోనని, పక్షులు సూర్యోదయానికి ముందే ప్రయాణానికి సిద్ధం అవుతాయి కాబట్టి ఈలోపే నా లక్ష్యాన్ని చేరుకోవాలని నా తాపత్రయం.

మీ అయిడియా చాలా బావుంది. అయితే ఇంకో ప్రయోగం కూడా చేద్దాం… మనమిద్దరం ఒక నూతన జన్మను ఎత్తాలనుకుంటున్నాం కాబట్టి- అప్పుడే జన్మించిన శిశువులా నగ్నంగా మారిపోదాం. కొత్త జన్మ ఎత్తడానికి ఒక్కోసారి ఒంటి మీది నూలు పోగు కూడా అడ్డం అవుతుందిఅన్నాడతను.

కథ క్లైమాక్స్ లో  – కథానాయకుడు చీకట్లో సొరంగం గుండా పరిగెత్తడం, తాను అనుకున్న మార్పు సాధిస్తాడనే నమ్మకంతో నడపడం – ప్రయాణం ముగింపు సారాన్ని ప్రతిబింబిస్తుంది. సొరంగపు చీకటి తెలియనిదానికి ఒక రూపకంగా పనిచేస్తుంది. కథకుడు  ముందుకు పరుగెత్తుతున్నప్పుడు విశ్రాంతి తీసుకోవాలని ఎగిరే వ్యక్తి అనటం ఒక  సంఘర్షణను లేక  తీవ్రమైన వైరుధ్యాన్ని చూపిస్తుంది. వ్యక్తి తాను కోరుకునే మార్పు కోసం తానే ప్రయత్నం చేయాలి, తన స్వంత సవాళ్లను తానే ఎదుర్కోవాలి అనే విషయాన్ని పై సన్నివేశం తెలియజేస్తుంది. అలాగే అంధకారంలో కథకుడి  అలుపెరగని అన్వేషణ ప్రతికూలతల మధ్య కూడా మనిషి చేసే అస్తిత్వ  పోరాటం కనిపిస్తుంది. వ్యక్తులు తమ ఉనికిని వాస్తవికతలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూనే తమ పరిమితులను అధిగమించడానికి ఎలా పోరాడతారో ఈ కథలో కనిపిస్తుంది.

అస్తిత్వ అధిగమనం కోసం అన్వేషణ వ్యక్తిగతం, ఆదే సందర్భంలో  సామాజిక (కథలో రెండవవ్యక్తిని సమాజం అనుకుంటే) అనుభవం అని ఈ కథ వివరిస్తుంది. స్వేచ్ఛకు సంబంధించిన కోరికను,  స్థిరత్వపు  అవసరాన్ని ఈ కథ  హైలైట్ చేస్తుంది, అదే సమయంలో భయాలను ఎదుర్కోవటానికి, కలలను వెంబడించడానికి మనిషికి ఉండే  సామర్థ్యాన్ని కూడా ఈ కథ చిత్రిస్తుంది. గొప్ప ప్రతీకాత్మకత,బలమైన కథనం ద్వారా, ఇది పాఠకులను వారి స్వీయ-అన్వేషణ గురించి ఆలోచించడానికి ప్రేరేపిస్తుంది. శైలీ పరంగా ఈకథ అద్భుతమైన heights కి వెళ్ళింది. కథలోని శైలి పాఠకుడికి బలమైన,అద్భుతమైన అనుభవాన్ని మిగిలిస్తుంది. లోయకు జీవం పోయటంలో కథకుడు ఒకానొక మాంత్రిక (magical) స్పృహ ను ప్రదర్షించాడు, సంవేదనాత్మక చిత్రణ చేశాడు. ఒక అపరిచిత అనుభం కోసం పడే ఆందోళన మనకు కథలో తెలుస్తుంది. ఉదాహరణకు, లోయ అందం పట్ల కథ ప్రారంభంలో కథకుడు  అద్భుతపడిపోవటం పాఠకులను ఆహ్లాదకరంగా లోతైన కథా ప్రపంచంలోకి ఆకర్షిస్తుంది.

కథలో వాడిన భాష ఒక మార్మిక , కవిత్వంలో లాగా అపరిచిత లక్షణంతో నిండి ఉంది, ముఖ్యంగా లోయ, సొరంగం వర్ణనలలో. ఉదాహరణకు:

పున్నమి చంద్రుడు పేట్రేగిపోతున్నాడు. ఆకాశం నుండి కారుతోన్న వెన్నెల కింద తడుస్తూ కొండలు, మలుపులు, చెట్లు, ఆకులు, ఆ ఆకుల చివర నుండి మొదలయ్యే శూన్యం… అన్నీ ఈ రాత్రి తాంత్రిక స్నానం చేస్తున్నట్లనిపించాయి.

 వాస్తవికతకు వాంఛకు  మధ్య సరిహద్దులు మసకబారే కలలాంటి వాతావరణాన్ని సృష్టించడానికి ఈ శైలి ఉపయోగపడినది. . సొరంగం గుండా పరిగెత్తే అనుభూతి, చీకటి, మార్పుకు సంబంధించిన భౌతిక అనుభవాన్ని కథకుడి  ప్రయాణంలో పాఠకులను లీనంచేసేటట్లుగా వర్ణించాడు కథకుడు. కథకుడి భావోద్వేగ, శారీరక సవాళ్లను పాఠకులు కూడా అనుభూతి చెందడానికి కథ ఆస్కారమిస్తుంది.

జ్ఞానం, అజ్ఞానం మరియు పరివర్తనను సూచించడానికి కథ అంతటా వెలుతురు, చీకటిని ప్రతీకాత్మకంగా వాడాడు కథకుడు.  సొరంగపు  చీకటి తెలియని, అంతర్గత భయాలను ఎదుర్కొనే ప్రక్రియను సూచిస్తుంది, అదే సందర్భంలో తనలో  రాబోయే మార్పు గురించి కథకుడి విశ్వాసాన్ని వెలుతురు సంకేతిస్తుంది. అలాగే, కథలోని మార్పు,

స్వీయ-అన్వేషణ అనే భావనలను వెలుతురు, చీకటి బలపర్చుతాయి. కథలోకథకుడు ఎంచుకున్న శైలి కథకుడితో పాటు పాఠకుడు ప్రయాణించటానికి ఆస్కారమిచ్చింది.

ఈ కథ  చాలా స్పస్టంగానే మ్యాజిక్  రియలిజంకి చెందిన కథ.  మ్యాజిక్  రియలిజం అనేది ఒక సాహిత్య ప్రక్రియ.  ఇక్కడ కల్పిత అంశాలను వాస్తవ ప్రపంచంతో మిళితం చేసి కథనంలో సాధారణమైనదిగా అంగీకరించేటట్లు చేయగలుగుతారు మ్యాజిక్ రియాలిస్ట్ రచయితలు. లోయ చివరి రహస్యం మ్యాజిక్ రియాలిస్ట్ ఛాయాలు అనేకం ఉన్నయి. ఛాయలేకాదు, అసలు కథే మ్యాజిక్ రియలిస్ట్ కథ.

కథలో అత్యంత ముఖ్యమైన మ్యాజిక్ రియలిస్ట్ ఎలిమెంట్స్ లో ఒకటి ఎగిరే మనిషి. గాలిలో అప్రయత్నంగా ఎగరగల అతని సామర్థ్యం వాస్తవికతకు పూర్తివిరుద్ధమైన అంశం. అయినప్పటికీ కథా సందర్భంలో, ఇది ఏమాత్రం అ సహజమైనదిగా అనిపించదు. అసాధారణమైన వాటిని లౌకికతతో మిళితం చేయడం దైనందిన జీవితంలో భాగంగా మాంత్రిక అంశాలను ప్రదర్శించే మ్యాజిక్ రియలిస్ట్ సంప్రదాయానికి ఈ కథ అనుగుణంగా ఉంటుంది. కథలోని లోయను మార్మిక ,మాంత్రియక లక్షణాలతో చిత్రించటం జరిగింది. వాస్తవికత, ఊహాత్మకతల మధ్య దాని అందం అది వేరే లోకం అన్నట్లుగా వర్ణించబడింది.

లోయ కేవలం భౌతిక స్థలం మాత్రమే కాదు, మార్పుకి, అసాధారణ అనుభానికి చిహ్నం. ప్రయాణాన్నిఎగురుతూ  అనుభవించాలనే కథకుడి కోరిక, ప్రపంచ బరువును అనుభవించాలనే ఎగిరే  మనిషి కోరిక కథలోని మ్యాజికల్ రియలిస్ట్ అంశాలకు కేంద్ర బిందువు. ఈ రెండు  కోరికలు చాలా సహాజమైనవిగా కథలో  చిత్రించబడ్డాయి. కథనంలో నమ్మదగినవిగా పరిగణించబడతాయి. కథకుడి  ప్రయాణంలో, అస్తిత్వ అర్థాన్వేషణలో ఈ అంశాలు సజావుగా  మిళితం కావటంలో మ్యాజికల్ రియలిస్ట్ విధానం స్పష్టంగా కనిపిస్తుంది. కథకుడు  వెళ్ళే సొరంగం లోతైన, మార్మిక అనుభవంలోకి ప్రయాణాన్ని సూచిస్తుంది. దాని చీకటి, ఆవరించి ఉన్న స్వభావం మరియు కథానాయకుడి పరివర్తనలో పాత్ర అంతర్గత వాస్తవాలు మరియు వ్యక్తిగత పెరుగుదలను అన్వేషించడానికి ఆదివాస్తవిక అంశాలను ఉపయోగించే మ్యాజికల్ రియలిజంను ప్రతిబింబిస్తుంది. కథకుడు వెళ్లే సొరంగం, లోతైన మాంత్రిక అనుభవం లోకి ప్రయాణాన్ని సూచిస్తుంది. కథ అంతటా పాత్రల దైనందిన అనుభవాలు, భావోద్వేగాల్లో భాగంగా మ్యాజికల్ ఎలిమెంట్స్ చిత్రించాడు రచయిత.

కథ వాస్తవాన్ని చిత్రించే, గ్రహించే తీరులో ప్రయోగం చేస్తుంది. ముఖ్యంగా కథకుడికి  తన కోరికల పట్ల విస్తరిస్తున్న అవగాహన ద్వారా, గాలిలో తేలియాడే మనిషి ప్రత్యేక దృక్కోణం ద్వారా మాంత్రిక వాస్తవికత పద్ధతిలో చిత్రించటం జరిగినది. అందులో అసాధారణ అంశాలు మనం  రోజువారీ ప్రపంచాన్ని అర్థం చేసుకునే తీరును ఎలా మార్చగలవో తెలుస్తుంది.

స్పస్టంగా  చెప్పాలంటే,  కథలో మ్యాజిక్ రియలిస్ట్ ఎలిమెంట్స్ ఊహాజనితమైన వాటిని సాధారణంతో మిళితం చేయడంలో స్పష్టంగా కనిపిస్తాయి. తేలియాడే మనిషి, మంత్రమయమైన లోయ, మార్పుకు గురిచేసే సొరంగం, మార్మిక భాష లాంటివన్నీ  ఒక కథనానికి దోహదం చేస్తాయి. అందులో  మాంత్రికత  వాస్తవం నిరాటంకంగా మిళితమై ఉంటుంది. ఈ అంశాలు వాస్తవికత, కల్పన మధ్య సాంప్రదాయిక సరిహద్దులను సవాలు చేసే కథను సృష్టిస్తాయి.  మ్యాజికల్ రియలిజపు సారాన్ని ప్రతిబింబిస్తాయి.

స్వీయాన్వేషణ, అర్థాన్వేషణ, మానవ వాంఛల స్వభావం వంటి అస్తిత్వ ఇతివృత్తాలను ఈ కథ లోతుగా పరిశీలిస్తుంది. ఈ తాత్విక అన్వేషణ కథకు లోతును జోడించి, కేవలం ఒక సాధారణ కల్పితస్థాయిని దాటి ఒక గొప్ప కథగా మిగులుతుంది.  కథ వాస్తవికత,  దాని గురించిన అవగాహన మారుతున్న స్వభావాన్ని అన్వేషిస్తుంది. అంటే వాస్తవికతకున్న ద్రవలక్షణాన్ని బహిర్గతం చేస్తుంది. ఈ ద్రవత్వం మ్యాజికల్ రియలిజం లక్షణం, ఇక్కడ విభిన్న వాస్తవాల మధ్య పరస్పర చర్య ఉన్నతమైన, అదే సందర్భంలో  సంక్లిష్టమైన కథనాన్ని సృష్టిస్తుంది. సరిగ్గా ఈ కథకుడు కూడా దాన్ని సాధించాడు. రచయిత కళానైపుణ్యం కథలోని  అనేక కీలక అంశాలలో స్పష్టంగా కనిపిస్తుంది.  కథన  నిర్మాణం, ఉన్నత స్థాయి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. కథలోని మ్యాజికల్ రియలిస్ట్ ఎలిమెంట్స్ ను పెంచడానికి రచయిత వినూత్న కథన పద్ధతులను పొందుపరిచాడు . విభిన్న వాస్తవాల మేళవింపు,  అంతర్గత మానసిక స్థితులను ప్రతిబింబించడానికి మాంత్రిక  అంశాలను ఉపయోగించడం లాంటివి అత్యంత  సృజనాత్మకం గా చేశాడు.

అద్బుతమైన కథలు రాసిన భగవంతం, తన కథలలో సంప్రదాయ కథన నిర్మాణాలను ప్రక్కన పెట్టి ఒక కొత్త శైలిలో కథలు రాశాడు. తన కథలు తరచుగా కాల్పనికతకి, వాస్తవికతకు మధ్యన వుండే సరిహద్దులు చెరిపేస్తాయి. అస్సలు కాల్పనిక సాహిత్య నిర్వచనాలను సవాలు చేస్తాయి. సమకాలీన పాశ్చాత్య ఆధునికానంతరవాద  కథకుల కధనపద్దతికి దగ్గరగా వుంటాయి. శకలాలుగా వుండే,  open-endedగా వుండే, సమకాలీన సంక్షోభాన్ని ప్రతిఫలించే , బాహుముఖీన మైన మానవ స్వభావాని ప్రతిఫలించే కథలు రాశాడు. తనకి కల్పన కేవలం వాస్తవికతను ప్రతిబింబించకూడదు, దాని నిర్మాణ స్వభావాన్ని బహిర్గతం చేసే విధంగా ఉండాలి. ఇంకొక రకంగా చెప్పాలంటే, కథ అనేది పూర్తయిన ఉత్పాదనగా కాకుండా,  ఒక process గా ఉండాలి.

భగవంతం ప్లాట్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన సాంప్రదాయిక విధానం నుండి దూరంగా జరిగి తన కథనాన్ని spontaneous గా వుండేటట్లు చూసుకుంటున్నాడు. నిర్మాణాత్మక కథాంశాన్ని అనుసరించే బదులు, అతని కథనం సహజంగా పరిణామం చెందుతుంది, అనూహ్యంగా ఉండే అతని కనపద్ధతి  పాఠకులకి గొప్ప  అనుభవాన్ని ఇస్తుంది.

కథ  అనేది రచయిత చైతన్యపు ( consciousness)విస్తరణ  అనే విధంగా తన కథలుంటాయి. అతని కథల్లో , రచయిత , కథకుడు మధ్య సరిహద్దు తరచుగా అస్పష్టంగా ఉంటుంది. కొన్ని చోట్ల  రచయిత  కథనంలోకి తనను తాను పాత్రగా చొప్పించుకున్నట్లుగా వుంటుంది. కొన్ని చోట్ల రచయిత, తన వైయక్తిక అనుభవాలను,ఆలోచనలను  కథలోకి చెప్పించినట్లు అనిపిస్తుంది. తద్వారా, రచయిత కాల్పనిక సాహిత్యంలో వస్తుగతత్వం వుంటుంది తప్ప, వైయక్తికాంశాలు కాదనే భావనను సవాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది.  కథ లేక వాచక అర్ధ  నిర్మాణంలో పాఠ కుడికి పాత్ర కల్పిస్తాది రచయిత.  ఈ సంధర్భంలో  ప్రముఖ  ఇటాలియన్ రచయిత ఉంబెర్తో ఎకో ( Uberto Eco) అన్నమాటలు గమనించాలి :

A text is a machine for producing interpretations. The role of the reader is to decode and interpret the signs, to actively participate in the construction of meaning.

ఈ పద్ధతి పాఠకుడిని లోతైన స్థాయిలో కథనంలో  నిమగ్నం చేయటం ద్వారా , కథ చెప్పే ప్రక్రియలో అంతర్భాగంగా చేస్తుంది.

ఒక వ్యక్తిగా భగవంతం  ఆధునిక ప్రపంచంలోని సంక్లిష్టతలను, అనిశ్చితులను లోతుగా గమనించాడు. అందువాల్లనే వాటికి బలమైన కథారూపం ఇవ్వగలిగాడు. మారుతున్న సాంస్కృతిక సన్నివేశాలకు అతని కథలు ఒక దర్పణం. “the job of fiction is to find the truth inside the story’s web of lies” అంటాడు (159) స్టీఫెన్ కింగ్ తన రచన ‘ On Writing: A Memor of the Craft ‘ లో (పేజీ 159). అంటే, కథ కనిపెట్టబడినది లేదా అబద్ధం ఇప్పటికీ, అది మానవ అనుభవం గురించి, వాస్తవికత గురించిన లోతైన సత్యాలను తెలియజేస్తుంది. ఈ పై లక్షణాలన్నీ భగవంతం కథల విశిష్టతని తెలియజేస్తాయి.

బి. తిరుపతిరావు

ఆధునికాంతరవాదం, ఆధునిక తత్వశాస్త్ర అంశాలపై  పై అనేక విశ్లేషణాత్మకంగా వ్యాసాలు వెలువరించిన బి.తిరుపతిరావు ద్రావిడ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నారు. పోస్ట్ మోడర్నిజం, బౌమనిజం పుస్తకాలు తీసుకువచ్చారు. ఈస్థటిక్స్,, ఫిలాసఫీ మీద ఇంగ్లీషులో పుస్తకాలు రాశారు. ద్రవాధునికత మీద పరిశోధనా వ్యాసాలు రాస్తున్నారు. సాహిత్యం, కళలు, తత్వశాస్త్ర సంబంధిత విషయాలపై ఆసక్తికరమైన వ్యాసాలు సమర్పిస్తుంటారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *