మిత్రుడొచ్చి కూర్చుంటాడు..

Spread the love

ఈ సలుపునెట్టా చెప్పను..
దీనికి నోరు లేదు.
ఈ ఖాళీనెట్టా విప్పను.
దీనికి భాష లేదు.
నువ్వు లేకపోవడం వెనుక
ఇంత పెద్ద ఒంటరి దిగుడులోయ..
లోపలి బాధ చెప్పుకోవడానికి
ఇన్ని రక్కసిరాళ్ళపొదలు..

తలుపులు బిడాయించుకున్నావు సరే..
లోన పిగిలిపోయే దుఃఖానికి
గొళ్ళెం పెట్టుకున్నావు సరే..
ఒక కిటికీ అయినా ఓరగా తెరువు..
ఆ చేతులిలా నా చేతుల్లో ఒంపు -
చీకటి మూసిపెట్టిన కన్నీటినిలా పంపు -

కళ్ళజోడు తీసి
చూపు తుడుచుకునేవాడివి.
కన్నీటికళ్ళు తుడుచుకోవడం
కనపడనీయలేదు కదూ..
నీ లోపలే నువ్వు ఛిద్రమయిన సంగతి
చిన్న మాటగా నయినా తేలనీయలేదు కదూ..

నువ్వెళ్ళిన కాడ్నుంచి
తనలో తానే సమాధైన అమ్మను చూసావా..
అర్థాంతరంగా వెళ్ళినవాడివి
చిన్న చినుకుగా నయినా వస్తావేమోనని
నెర్రలిచ్చిన నేల‌కళ్ళతో
నిలువెల్లా ఎదురుచూపైన అమ్మను చూసావా..
పోనీ..
శిథిలమయి నుసి రాలుతున్న
నిన్ను నువ్వు చూసుకున్నావా..
పూలకాడల మీద గాలికి తేలిపోయే
లేత నూగారు లాంటి నీ పిల్లలు..
తనివితీరా కౌగిళ్ళో పొదువుకొని
తృప్తితీరని నదిలా విలపిస్తావా-
నీ కళ్ళల్లో వెలిగే కాకరపువ్వొత్తులు పిల్లలు..
నీ సమాధి ముందర దీపం పెట్టి దండం పెడితే
కలవళపడి అక్కడక్కడే
ఎగిరే కాకిలా కావుకావుమని గిరికీలు కొడతావా-
చెప్పు..నీ గుండెల మీద ఈ
తెగని బంధాలబండలు ఎలా బద్దలు కొడతావ్..

మిత్రుడొచ్చి కూర్చుంటాడని చెపుతుంటా గానీ
మిత్రుడొచ్చి లోన సమస్తాన్ని కూలుస్తుంటాడని
జ్ఞాపకాల కొరివి పట్టుకొని గుండె చితిని
కొంచెం కొంచెంగా కాలుస్తుంటాడని
అందరి ముందు గుప్పెట విప్పలేను.

వద్దువద్దన్నా వచ్చేవాడివి..
నన్ను చెండుకు తింటా కూర్చున్నవాడివి..
నన్ను చీల్చుకు బయటకు రారా నాయనా..
నిన్ను దగ్ధం చేసిన దుఃఖలావా ఏదో
నిన్ను దహనం చేసిన దిగులుకీలలు ఏవో
కక్కురా నాయనా కక్కు..

ముగ్గేస్తా.
ముగ్గులో ఒక నైన్టీ పెగ్గేస్తా.
జీడిపప్పు ఫ్రై చేస్తా.
ఎదురుగా ఖాళీ కుర్చీలో
నైన్టీతో నిండి మిత్రుడొచ్చి కూర్చుంటాడు.
After Ninety only English అంటుంటాడు.
రాసుకుపూసుకు తిరిగిన రోజులు..
చుట్టూ తిరుగుతున్న బడాయిమాటలు..
ఎండిన పువ్వుల్లా రాలిపడుతున్న నవ్వులు..
మూట కట్టి మనసుమూలలకు
తోసేసిన యవ్వనగాయాల ప్రేమలు..
అన్నింటినీ ముందేసుకొని
కన్నీటిపొరల అరలో కత్తి తీసి
వధ్యశిల మీద
ముక్కలు ముక్కలు చేస్తుంటా.
ముక్కలుముక్కలై పోతుంటా.

గాజుపెంకుల మీద పూస్తున్న
ఈ రక్తపాదపూల సంభాషణలో
ఆ సలుపునెట్టా చెప్పను ?
ఆ సలుపునెట్టా చెప్పను ?

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *