గత సంచికలో కుక్కకు సంబంధించిన కొన్ని మాటలు వాటి వెనక ఉన్న అర్థాలూ చూసాం ఈ సంచికలో పిల్లీ – పులకు సంబంధించిన మాటలు చూద్దాం
పిల్లినడక:
పిల్లి చప్పుడు చేయకుండా నడవగలదు. పొంచి ఉండి ఉండి ఒక్కసారి పరుగులు తీసినా అది పరిగెత్తిన ధ్వని వినిపించదు. పరుగులు తీసేప్పుడే వినిపించని అడుగుల సవ్వడి నడిచేప్పు డసలే వినిపించదు. పొంచి గుట్టుచప్పుడు కాకుండా నడిచే నడకను పిల్లి నడక అన్నారు. ఈ లక్షణాన్ని మానవ జాతికి అన్వయించి దొంగలా నడిచినా, చాటుమాటుగా నడిచినా ఫలానా వ్యక్తి పిల్లినడకలు నడుస్తున్నా డంటారు. నిజానికి నడకకన్నా ఆ వ్యక్తి ప్రవర్తనకే ప్రాధాన్యముంది. పిల్లినడక నడిచే వ్యక్తి అంటే తన స్వభావం, కదలికలు ఇతరులకు తెలియకుండా ప్రవర్తించే గుంభన అయిన మనిషి అని భావం. దాపరిక మున్నవ్యక్తి అని తాత్పర్యం. ఏదో దూరాలోచనగల మనిషి అని అర్థం. పిల్లినడక దొంగనడకవంటిదేగాని వేరుకాదు.
పిల్లిశీలం:
తెనాలి రామకృష్ణుడి పాండురంగ మాహాత్మ్యంలో ‘నిగమశర్మ’ విషయం ప్రస్తావిస్తూ అతగాడిది పిల్లిశీల మన్నాడు. పిల్లులు సంయోగ సమయంలో చేసే ఆర్భాటం ఇంతా అంతా కాదు. ఇష్టపడనట్లు హంగామా చేస్తాయేగాని పారిపొయ్యే ప్రయత్నం కూడా చేయవు. పైకి అనిష్టత నటిస్తూ అందులోనూ తీవ్రంగా నిరోధిస్తున్నట్లు అరుస్తూ సరిపెట్టుకొని సంసారం చేయటాన్ని పిల్లిశీల మంటారు.
పొయ్యిలో పిల్లి:
పెంపుడు పిల్లి, లేదా ఇంట్లో కాసిని పాలయినా దొరక్కపోవన్న భ్రాంతిలో వచ్చిన పిల్లి ఏమీ దొరక్క శోషవచ్చి కాస్త వెచ్చదనమయినా ఉంటుందని పొయ్యిలో పడుకుంది. పొయ్యి తప్ప వంట సామగ్రి లేని ఇంట్లో అది చేయగల పని మరేమీ లేదు. ఇల్లంతా కలియదిరిగి కడుపుమాడిన పిల్లి మూడురాళ్ళ పొయ్యిలో కళ్ళు మూసుకు పడుకుంటుంది. ఇంటివాళ్ళు వంటపని తలపెడితే దానికి లేవక తప్పదు. లేవకపోతే వాళ్ళు తోలకా తప్పదు. పిల్లి కదల్లేదంటే వంటా పెట్టూ లేని పరమ దరిద్రంలో ఆ కాపుర ముందని అర్థం. గర్భదరిద్రాన్ని సూచింటానికి పొయ్యిలో పిల్లి లేవలేదనటం వాడుకలో’ నిలిచినమాట.
పులికాపు:
పుల్లని వస్తువుతో పరిశుద్ధం చేయటం పులికావు. వైష్ణవ పరిభాషలో ‘తమిళభాషలో ‘పులిక్కాపు’. దేవతా విగ్రహాలను అప్పుడప్పుడు చింతపండుతో తోమి శుభ్రం చేసి పునరావాహన చేసి ప్రతిష్ఠించి పూజిస్తారు. ఈ దేవకార్యానికి కాలక్రమాన ‘దేహశుద్ధి’ అనే అర్థం వచ్చింది. ‘ఒళ్ళు కడగటం’ అనే అసలర్థమున్న దేహశుద్ధికి లాగానే పులికాపు అనేమాటక్కూడా తోమటం, కొట్టడం అనే అర్థాలు వాడుకలో నిలిచాయి. మంత్రపూతంగా విగ్రహాలను శుద్ధి చేయటమనే శాస్త్రార్థం స్థానంలో చావగొట్టడమనే అర్థం వాడుకలో నిలిచింది. పులికాపు పెట్టడం అంటే తన్నటం. వైష్ణవ విద్యార్థుల వాడుకలో ఈ అర్థం బలీయం. తప్పు చేసినందుకు ఆచారికి వాళ్ళ నాయన పులికాపు పెట్టాడు (తన్నాడు) అనే వాడుక ఉంది.
పులి నాకినవాడు:
పులి చంపకుండా నాకి వదిలివెయ్యటమనేది ఊహకు అందే విషయమేగాని వాస్తవంగా జరిగే పని కాదు. నాకటం ప్రేమ చిహ్నం. పులివంటి క్రూరమృగం కూడా అనురాగం ప్రదర్శించి వదిలిపెట్టిందంటే అది అసామాన్య విషయం. అతగాడి అదృష్టానికి చరమ నిదర్శనం. ‘అదృష్టవంతుడు, అసాధ్యుడు, గుండెలు తీసినబంటు’ అనే అర్థ విశేషాల్లో ఈ జాతీయం వాడుతుంటారు.
పులినోటి కండ:
పరమ క్రూరజంతువైన పులి నోట్లోని మాంసం ముక్క అనేది సాధారణార్థం. ఎంత సాహసి అయినా దాని జోలికి పోడు- బతకదలిస్తే. దాన్ని లాగేసుకోవటం, కాజేయటం సాధ్యం కాదు – ఎక్కడో ఏమహావీరుడికో తప్ప. సర్వసాధారణంగా ‘అందుబాటులో లేనిది, అసాధ్యమైనది’ అనే అర్థాల్లో మాట వాడుతుంటారు. ప్రమాదకరమైనది అనే అర్థంలోకూడా ఈ మాటను ప్రయోగిస్తుంటారు.
పెద్దపులి చూపు:
పెద్దపులి చాలా దూరం చీకటిలో కూడా చూడగలదు. పిల్లిజాతి జంతువులన్నిటికీ ఈ శక్తి ఉంది. అయితే పెద్దపులి చూపులో మరో ప్రత్యేకత ఉందిట. అది మనవైపు చూస్తున్నప్పుడు దాన్ని చూడటం కష్టం. బోనులో ఉన్న పులి కంట్లో కళ్ళు పెట్టి చూడటం కూడా దుర్భరమైన విషయం. చూపుల్లో తీవ్రతేగాక అందులో ఏదో వశీకరణశక్తి ఉందని జిమ్ కార్బెట్, ధనగోపాల్ ముఖర్జీ వంటి గొప్ప వేటగాళ్ళు వర్ణించారు. పులి కంట్లోకి చూడగానే చూపు మళ్ళించుకోవటం చాలా కష్టమవుతుందని వాళ్ళంటారు. అది ఆకర్షణ వల్లనే గాదు. ఆ చూపును ఏ మాత్రం ఏక్షణకాలమయినా మార్చుకోబోయామో ఆ స్వల్ప వ్యవధిలోనే అది కదలి మీదపడుతుంది. ఏపాటి ఏమరుపాటయినా దానికి చాలు. అందువల్ల పులి వేటకు పోయేవాళ్ళు దానికి ఎదురు నిలిచి చంపాలని ప్రయత్నం చేసేకన్నా దానిమీద పక్కదెబ్బ తీయటమే క్షేమకరమని అనుభవజ్ఞులు చెప్తారు.
కొందరి చూపుల్లో పులిచూపులోని తీవ్రత, జాగరూకత కనిపిస్తాయి. ఎదటి వ్యక్తిని అంచనా వేయటంలో వాళ్ళ చూపు నిశ్చలంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తి చూపు మరలిస్తే అతడి లోపాలోపాలను బలహీనతలను గమనించగలుగుతారు. తప్పుచేసిన వ్యక్తిగాని, తప్పుకపోదలచిన మనిషి కాని ఎదుటివాడి ముఖంలోకి చూడలేడు. చూస్తూ అబద్ధం చెప్పలేడు. అందుచేతనే అవతలి మనిషి అబద్ధమాడుతున్నా డనుకొన్నప్పుడు, మోసగిస్తున్నా డనిపించినప్పుడు “ఏదీ, నా కళ్ళలోకి చూస్తూ మాట్లాడు/చెప్పు” అని హెచ్చరించటం పరిపాటి. మామూలు మనిషి కళ్ళలోకే చూడలేనివాడు పెద్దపులి కళ్ళలోకి చూడగల ధైర్యం ప్రదర్శించలేడు. అందుకే పెద్దపులి చూపు భయంకరం. ఆ చూపున్నవాడు మహా ధైర్యవంతుడు. ఆలోచనాపరుడు. పరిశోధకుడు. జాగ్రత్త కలవాడు. క్షణంలో దెబ్బతీయగల సమర్థుడు. పెద్దపులి లక్షణాలన్నిటినీ వ్యక్తికి ఆపాదించి, అతడి చూపు పెద్దపులి చూపంటే ఆ వ్యక్తి భయంకరుడు, ప్రమాదకరుడూ అని అర్థం చెప్తారు.
పెద్దపులి పాలు:
పాలిచ్చే పెద్దపులి ఆడది- బాలింతరాలు. ఈనిన కుక్క, ప్రచండ పరాక్రమం పిల్లి, పందివంటి సామాన్య జంతువులే ఆ సమయంలో చూపుతాయి. పెద్దపులి సంగతి చెప్పనక్కరలేదు. పిల్లలున్న ఆడపులి మగపులిని కూడా దగ్గరికి రానీదు. ప్రాణం తీస్తుంది. పాతకాలపు కథల్లో రాజులు పెద్దపులి పాలు వైద్యానికి అవసరమని అది తెచ్చినవాడికి అర్ధరాజ్యమో రాజకుమారినో కట్టపెడతామని ప్రకటించినట్లు, లేదా సవతితల్లి రాజుకుమారుణ్ణి పెద్దపులి పాలు తెమ్మని నిర్బంధించినట్లు కనిపిస్తాయి. పెద్ద పులిని ఎదుర్కొని చంపగలవా ళ్ళుండవచ్చుగాని, దాని పాలు తీరిగ్గా పితికి తేగలవా ళ్ళుండరు. అందుచేత అసాధ్యమయిన పని చేయటాన్ని పెద్దపులి పాలు తేవటంతో పోలుస్తారు. అది కుందేటి కొమ్ములా లేని వస్తువు కాదు. ఉన్నదేగాని బలపరాక్రమాలవల్లగాని, ఉపాయంద్వారాగాని సాధించగలది మాత్రం కాదు. పెద్దపులులను పెంచుకోగలిగిన వాళ్ళు, వాటిని జంతు ప్రదర్శనశాలల్లో ఉంచి పోషిస్తున్నవాళ్ళు గూడా ఈ భయంకర సాహసం చేసిన దాఖలాలు లేవు. అది నిజంగా ఉన్నదేగాని అలభ్యం, అప్రాప్యం.
బూదరాజు రాధాకృష్ణ
1932 మే మూడో తేదీన ప్రకాశం జిల్లా వేటపాలెంలో జన్మించిన డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ 1965లో హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ ఎర్లీ తెలుగు ఇన్స్టిప్షన్స్ అనే అంశంపై పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. చీరాల వి.ఆర్.ఎస్. అండ్ వై.ఆర్.ఎస్. కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పనిచేసిన వీరు 1988లో తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. సెంట్రల్ యూనివర్శిటీ విజిటింగ్ ప్రొఫెసర్‌గా వుండి 1990 నుంచి దశాబ్ద కాలంపాటు ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేశారు.