నిండుగా పూసిన చెట్లను చూస్తూ
కమ్మగా రాగం ఎత్తుకున్న కోకిల గొంతు వింటూ
పూలు పిండారబోసిన ఈ నీడలో మేను వాల్చి
ఏవో కొన్ని కథలు, మరికొన్ని పాతకాలంనాటి గ్యాపకాలు
పండిన జామకాయను కొడుతున్న చిలుక
మూతి తుడుచుకుంటుంది
గుబురుగా మబ్బులు కమ్ముకుపోతున్నాయి
కోకిల పాడుతూ ఉంది దాని గొంతు ఇంకా జీర పోలేదు
పువ్వులు ఆకుల్ని కమ్మేసి పూస్తూ ఉన్నాయి
మబ్బుల చీకటిలో పువ్వుల వెలుగు కాస్తోంది
వాన చినుకులు ఒక్కొక్కటీ రాలుతున్నాయి
చీమలు పుట్టలోకి చేరుకుంటున్నాయి
నువ్వింకా నీ కథల్ని వినిపిస్తూనే ఉన్నావు
నేనింకా పూస్తూనే ఉన్నాను.
వెలుగు చుట్టూ పరుచుకుంటూ ఉంది