పుట్టినఊరు

Spread the love

నేను అనే వాడిని ఏ తారీఖున పుట్టానో ఖచ్చితంగా చెప్పలేను . నేను చదువుకున్న చిన్నబడి దోస్తులేమో 64లోనో, 63లోనో పుట్టామంటారు. నేను మాత్రం 62లో పుట్టానని మావూరి బడి రికార్డు. నేను పుట్టిందెప్పుడో తనకు తానే ఊహించుకుని , అనామతుగా రాసేశాడు మా కోటయ్య సార్ !

పుట్టింది రొట్టమాకురేవు. డోర్నకల్ నుంచి కొత్తగూడెం వైపు వెళ్ళే రైలుకట్టకు దగ్గరిలో కారేపల్లి కి వెళ్ళే దారిలో ఉంది. పట్టుమని  యాభై ఇళ్ళు కూడా వుండవు. మా ఊరంతా రెండు మూడు కుటుంబాలు తప్ప అందరూ కోయవాళ్ళే! కోయోళ్ళు అని, దొరసొట్టపోళ్ళు అనే చిన్నప్పట్నుంచి వింటున్నది. ఆ వూరికి నేను పుట్టడానికి ఐదేళ్ళ ముందు అమ్మానాన్న , వాళ్ళు మోయగలిగినంత సామాన్లతో వచ్చారంట – మా అన్న బందేఅలి ని చంకనెత్తుకుని. ఆ తర్వాత ఖాజా అని నాకంటే ముందు పుట్టి, కొన్ని రోజులకు చనిపోయిండు. 

ఆ వూరు నాన్నవాళ్ళు రావడానికి బొర్ర రామక్క కారణమంట. ఆవూరు వాళ్ళు కూలీనాలీ చేసుకోవడానికి చుట్టుపక్కల ఊళ్లు – కారేపల్లి (ఇంకో పేరు సింగరేణి -రెవెన్యూ రికార్డుల్లో ఇదే ఉంది) , పేరేపల్లి, గేట్ కారేపల్లి, ఇంకాస్త దూరంగా పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఇల్లందు (సింగరేణి కాలరీస్/బొగ్గుట్ట) వెళ్తుండేవాళ్ళు. అలా కూలికి వెళ్ళిన బొర్రరామక్క మా నాయినను ఆ రోజుల్లో చేస్తున్న తాపీ పని దగ్గర చూసి, ‘ఓ సాయిబూ ! ఓ తమ్ముడా ! ఇన్ని కష్టాలు ఏడబడతావుకానీ ,మావూళ్ళ చిల్లర కొట్టు పెట్టుకొమ్మని’ సలహా చెప్పిందట. ఆ విధంగా మకాం రొట్టమాకురేవుకు మారింది. ఉండటమెట్లా? కుంజ రామయ్య గొడ్లకొట్టం లోని ఒక పంచన మాబీర పొరకతోటి దడి కట్టుకుని ఉండమన్నాడు.

*

మా నాన్న (మేం ‘అబ్బా’ అని  పిలుస్తాం) పుట్టింది మానుకోట దగ్గర  చినగూడూరు, దాశరథి పుట్టిన ఊరు.వరంగల్ జిల్లా. ఐదుగురు అన్నదమ్ములు,ఒక అక్క – అందర్లో చిన్నోడు. అక్క బిడ్డతోనే మొదట పెళ్లి విడాకులు గూడ అయినయి. 

మా నాన్న చిన్నప్పట్నుంచి జీతం చేసేటోడు. ఆయన మాటల్లో విన్నది ఎక్కువగా జీతం చేసింది మడికొండ వెంకయ్య దగ్గర అని. 

కొంత వయసొచ్చినంక చింతపండు,మిరపకాయలు నెత్తినబెట్టుకుని ఊరూరా తిరిగి అమ్మడం ,అలా కారేపల్లి ఒకసారి రావడం మా తాత కరీం సాబ్ ను కలవడం, అలా మా అమ్మతో పెళ్లి (ఆమెకు కూడా మొదట పెళ్లై, ఆతర్వాత విడిపోవడం అయిపొయింది) జరగడం, మళ్ళీ కొత్తగా జీవితం మొదలు పెట్టడం అదో పెద్ద కత.

*

రొట్టమాకురేవుల దుకణం. ఎట్లా మొదలెట్టాలే అని కారేపల్లిల ఎర్ర పుల్లయ్య కిరాణా దుకాణానికి వెళ్లి  అప్పుపెట్టమని అడిగిండంట- ఆయనేమో ఒప్పుకోలేదు ముందుగాల – మా అమ్మ తరుపోళ్ళు కూడా జమానతు ఉండమంటే ఉండలేదంట. అప్పుడు తన వెండి దండకడియం ఆయన దగ్గరే కుదువ బెట్టి -బీడీకట్టలు,బెల్లం,మసాలాలు,పుట్నాలు,బొంగుపేలాలు ,పువ్వాకు – ఇట్లా చెడ్దరమడ్డర సామాన్లు కొనుక్కొచ్చి , దాన్లో కొంత మా అమ్మ దగ్గర అమ్మడానికి బాధ్యతపెట్టి, మిగిలినవి కావిడి గంపలల్ల వేసుకుని ఆ వూరు చుట్టుమట్ల ఉన్న – చీమలోరి గూడెం, అనంతారం, రేగుల గూడెం, పూసంవోళ్ళ గుంపు , ముత్రాసి గూడెం – రోజులో ముప్పై కిలోమీటర్లు తిరిగి అమ్ముకొచ్చేటోడు.

మధ్య మధ్యలో నాట్లకు, జొన్న చేలు,కందిచేలు కోతలకు వెళ్ళేటోడు. మా అమ్మా వెళ్ళేది.

కొన్నాళ్ళకు నెత్తిమీది గంప కిందికి దించి ,కావిడి భుజానికి ఎత్తుకున్నాడు. రోజురోజుకి యాపారం పెంచిండు. కావిడికి ఒకవైపు కిరాణా సరుకులు,మరో వైపు తినేటివి- మిర్చి బజ్జీలు,అరిసెలు, కారపుసుట్లు,పకోడీ,- నింపుకుని పొద్దున్న చీకట్లో వెళ్లినోడు,రాత్రి చీకటిపడ్డంక వచ్చేటోడు.

ఆ రోజుల్లోనే నేను పుట్టాను.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *