పాదధూళి వెతుక్కుంటూ కొన్ని గొర్రెలు
పరుగెడుతున్నాయి.
తోసుకుంటున్నాయి.
అందుకోలేని స్వర్గం పాదధూళి ముసుగు కప్పుకుంది.
ఒకటా రెండా నూట ఇరవై ప్రాణాలు!
పాదధూళి యజ్ఞం లో రక్తవర్షమయ్యారు.
ఉందొ లేదో తెలీని స్వర్గం,
బోధ ల లో మత్తుగా వినపడుతూ ఉంది.
మధిర,మగువ లేకుంటే స్వర్గం మాత్రం వాళ్లకెందుకు!
మైక్రో గ్రామ్ పాదధూళి ఇప్పుడు లక్షల్లో
తూగుతుంది.
ఒక్క మైక్రాన్ దేవుడిని చూపెడుతుంది.
హ్మ్! పక్కవాడి దారికి కళ్ళు అతికించి
కాళ్ళను నడిపే బుర్రలు ఎప్పుడో నిద్రపోయాయి.
వాడి పాదాలకు ధూళి అంటడానికి,
వాడేమైనా బురద మట్టిలో ఎండగొడుగు
వేసుకొని గింజలు పండించే రైతా!
అగ్ని గుండం పక్కన స్వేదహారాలు వేసుకొని కండలు కరిగించే శ్రామికుడా!
పైకి కాషాయం,
లోన కోరికలు అక్షయం.
ముక్కు మూసుకొన్నట్లు ఉండే
మునికి పాదధూళి ఎక్కడిది?
అదిగో అటు చూడు!
ముడతలు కప్పుకొని కడుపు కుంచమంత
లోతుగా దారి పక్కన పడున్న ముసలవ్వ.
ఒక్క పిడికెడు మెతుకులు తనకి
ప్రేమతో పెట్టు.
పరమాత్ముడు ఆ నీలి కళ్ళలో నవ్వై
మెరుస్తాడు.
పక్కవాడి ఆకలి పరమాత్ముడి ఇల్లు.
పిడికెడు అన్నం ఇప్పుడు పాదధూళి ని ఓడించింది.