పరిహారం

Spread the love

“ఇదేందీ తిరిపేలూ ! ఇయ్యా లప్పు డు ఈడికి పిలిసినావ్ “- అడిగినాడు కొండయ్య. “ఏంది  కొండయ్యా ! తెలనట్లుమాట్టాడతావ్ . ఇట్టాటి యవ్వారమంతా  ఇట్టా సందకాడ , గుడెనకాలే జరిగేది మడి . ఏదో మావానివని,  నీకు  ఐనంతా సాయం  సేద్దామని ఈడికి పిలిసినా. వూర్లో అందరికీ  తెలిచ్చే తాట తీయ్రూ ?” – గొణిగాడు తిరిపేలు.

“నీకు తెలీందేముంది. ఇంకో  నాలుగు , ఐదు నెలల్లో  మన  వూరు మునిగేది ఖాయం . సర్కారోళ్లు  కడ్తున్న జలాసయం  కొరకు మునిగే మన వూర్లల్లో అందరికీ  నష్ట పరిహారం సెల్లిస్తామన్న్యా , ఇచ్చిన  మొత్తానికి ఒప్పు కుని అందరూ సేవ్రాలూ, ఏలి గుర్తు ఏసేటప్పుటికి  ఇన్నేండ్లయ్య. పోయినసారి యం .ఎల్ .ఏ  తనకు ఓటేస్తే, తమ ప్రభుత్వమే  వస్తే నష్ట పరిహారం   రెండింతలు ఇప్పిస్తానాని  సెప్పి గెల్చ.  మన  అదృష్టం బాగుండి  మధ్యంతర ఎన్నికలు వేరే వచ్చ్యా. ఈ సారేమోఅపోజిషన్ క్యాండేట్  నాల్గింతలు  యిప్పిస్తామంటే గొర్రెల మందల్లాగా  అందరూ  వోట్లేస్తిరి.  . ఆళ్ళే సత్తాలోకి  వచ్చి నారు గానీ ముందటి సర్కా రు హయాంలో భూముల కుటుంబపు  మనుషుల్లో సూపిన  వివరాల్లో  తప్పు లున్నాయని , లేనిపోనివన్నీ  చూపిచ్చి ఎక్కువ లెక్క అడిగినారని అనుమానమొచ్చి ,  మమ్మల్ని మళ్ళా అన్నీ సరిగా ఉన్నాయా, లేదా అని ఖచ్చితం  జేసుకోని, ధృవీకరణ  పత్రం మీద మీ అందరి ఏలి గుర్తులు, మా సేవ్రాళ్ళు -అన్నీ పెట్టి మళ్ళా పంపియ్యమన్న్యారు  మడి .”  – గుక్క  తిప్పు కోకుండ  కక్కే శాడు తిరిపేలు .

అటు  కొండ , ఇటు  గుట్ట కాని ఆ ఎత్తైన  ప్రదేశం లో  శివాలయం  వెనుక ప్రొద్దు కుంకిన  మీదట మసక చీకటిలో  మాట్లాడుకుంటున్నారు వారిద్దరూ. కొండయ్య నోట్లో మండుతున్న  బీడీ, తాను గట్టిగా పీల్చినప్పుడల్లా  కాస్త వెలుగు చిమ్ముతోంది . కొండయ్యది  పాతపల్లి. అదే  వూరిలో  ప్రభుత్వం  తరఫున పని చేస్తున్న గ్రామోద్యోగి  తిరిపేలు. పాతపల్లి దగ్గర రెండు కొండల మధ్య  మరెక్కడినుంచో మళ్లించిన నీళ్లకు  జలాశయం  నిర్మించి  సాగు నీటిని అందజెయ్యా లనే సదుద్దేశం తో  సర్కా రు వేసుకున్న  ప్రణాళిక ఇన్నేళ్లకు దాదాపు  సాకారమయ్యింది. మొదట 3 టి.ఎం.సి.  (300కోటుఘనపు టడుగుల ) నీళ్లు  30,000 ఎకరాలకు  సాగు నీటి నందివ్వా లనుకున్నది సర్కా రు. క్రితం  అధికారం లో వుండిన పార్టీ  మధ్యంతర ఎన్నికలు వచ్చి ఓడిపోయి, వారి  ఎదురు పక్షం  ఎన్నికల్లో ఎక్కువ  పరిహారాన్ని, ఎకు వ ఎకరాలను సాగుబడి క్రిందికి  తెస్తామని వాగ్దానం చేయడం వల్ల, ఇప్పుడు ఆ ప్రణాళికను మరింత విస్తరించి   5 టి.ఎం.సిల నీళ్లు  50000ఎకరాలకు  ఉపయోగపడేలా చేయాలని  నిర్ణయించింది. . ఎన్నీ టి.ఎం.సి లైనా ఆ ప్రాంతంలో  ముందుగా వచ్చే  పాతపల్లి  ముంపు ప్రాంతాల్లో మొదటిది.

కొత్త ప్రభుత్వం  అధికారంలోకి  వస్తూనే  పోయిన సారి నష్ట పరిహారం విషయంలో చాలా  అవకతవకలు జరిగాయని , ముఖ్యంగా  కుటుంబ  సభ్యుల నిబంధనలకు విరుద్ధంగా   పెళ్లయి వెళ్ళిపోయిన  అమ్మాయిల పేర్లు చేర్చినట్లు , ఇంకా  మైనారిటీ తీరని అబ్బాయిలను మేజర్ లుగా చూపినట్లు- వార్ల పేరుతొ రావాల్సిన దాని కంటే  ఎక్కువ నష్ట పరిహారం దాఖలు చేసినట్లు  అభియోగం  లేవనెత్తారు. మొదట ఆ లొసుగులన్నీ  తొలగిస్తే తప్ప, ఎన్నికల ముందు వాగ్దానం చేసినట్లు  నాలుగు  రె ట్లుపరిహారం చెల్లించడం కుదరదని సర్కా రు ఖరాఖండిగా చెప్పేసింది. . అలాంటి  లొసుగులకు తమ ఉద్యోగులే అవకాశం కల్పించారని, రాతకోతలు  మార్చేశారని , మద్దతు నిచ్చారని  సర్కా రుకు తెలియక కాదు; మళ్లీ  అలా జరిగే అవకాశాలు లేవనీ కాదు. ఇప్పటికే  అప్పుల్లో కూ రుకుపోయిన రాష్ట్ర  ప్రభుత్వానికి  ఊపిరి పీల్చుకునేందుకు  కాస్త సమయం  కావాలి. ఐనా ఎన్నికలైపోయి, ఓట్లుపడి అధికారం  లోకి వచ్చారు గనుక ఇంకో  ఐదేళ్లు తమకు ఢోకా లేదనే  ధీమా వేరే. అంతలోగా ఎలాగోలా సర్డు బాటు చేసి  మళ్లీ  ఎన్నికలు వచ్చే సమయానికి  మరింత  నష్ట  పరిహారం పెంచుతామని దాటెయ్యచ్చని  వారి అంచనా. నిరక్షరాస్య ప్రజాస్వామ్యం లో ప్రజల  మీద ప్రభుత్వానికి  అంత భరోసా ! ‘దక్కినంత మహాదేవ’ అని దొరికినంత మొదట తీసుకుని నష్ట పరిహారం  పెంచమని మళ్లీ  ఉద్యమించడం ప్రజల  హక్కే . ‘ఐనా సమాజం లో  అన్ని సంక్షేమ కార్యాలు  ప్రజల  యోగక్షేమాలకే  కదా ! మరి అలాంటప్పు డు మరింత నష్ట పరిహారం  మాకు చెల్లించడం  తప్పేమీ కాదు. ఐనా మేము కట్టిన శిస్తేగా  మాకు పరిహారంగా ఇచ్చేది. పుట్టి పెరిగిన వూరు, తరతరాల  అనుబంధం, అక్కడే  ఖననం  లేదా  దహనమయిన పూర్వీకులు – ఈ సెంటిమెంట్లకు ఎవరైనా  వెల కట్టగలరా ?’ – అన్న  మనోభావన ప్రజలది.

“మీరే గద మాకు ఇయన్నీ నేర్పింది.  ఇంకా లెక్క  రాక  ముందే  మీ వంతు మీరు తీసుకోల్యా? ఐనా ఆళ్ళు ఓటేసిందాక  ఒక మాట , గెలిసి గద్దె  మీద కూసుంటనే  ఇంకో  మాట్న? . ఐనా మేం  కట్టే శిస్తే గద పరిహారంగా మాకిస్తాండేది?  జనాలు బాగుండాలని  గద ఇదంతా సేసేది. మాకు రోంత  లెక్క  ఎక్కువిస్తే ఎవరి గంటు  పోతాది?” ఆరిపోయిన బీడీ పారేస్తా అక్కసు వెళ్లగక్కాడు కొండయ్య.

“అదట్ట పోనీ , ఇప్పు డు నీకు దుడ్లు  ఎక్కువ కావాలంటే  నేను  సెప్పిన సోటంతా  ఏలి గుర్తులేయ్. నాకియ్యా ల్సింది నాకిచ్చేయ్.” ఏదో గుట్టు చెప్పినట్లు గుసగుసమన్నాడు  తిరిపేలు. “అదేదో దాంట్లోనే పట్టుకోని ఇయ్యకూడదూ ” విసుక్కున్నాడు కొండయ్య.

” ఇదో, అదే  వద్దనేది; మీకు మీ కాతాల్లోకి  చెక్కులు నేరుగా  గద వస్తాయ్. మేమెట్లా తీసుకునేకయితాది. నీకు లెక్క కావాలంటే నాకు ముడుపు ముందస్తే; వచ్చి దుడ్లియ్ నీ పని జేసి పెడతా. అంతే  “- గదిమాడు తిరిపేలు. ఎంతైనా సర్కా రు బంటు  గదా!

” కాదు. నాకు తెలీకడుగుతా ; ఆ దేవలం మునిగిపోతాదని గుడిని, గుళ్లో ద్యావుణ్ణి  ఏరే  సోటికి మార్సేందుకు మాత్రం  సర్కా రు దగ్గర  లెక్కుంటాది. మాకై తే ల్యా. అగుపిచ్చే  మడుసుల కంటే, అగుపడని సామే గొప్ప”- మరో సారి  కోపం  చేసుకున్నాడు  కొండయ్య.

” అదంతా సొడ్డు . మరి దేముడు ముక్యమైతే ఈ దేవలం  , ఈ లింగం  కనపల్యా? దేమునికే దిక్కు  లేదు; మనమో లెక్కా? అది పూర్వ కాలందంట ఇది కొత్తదంట! సర్కా రు లెక్కాచారం  మనక్యా డ తెలుస్తాది. ముడు, మనిసి -అంతా ఒక్కటే ఆళ్ళకు. ఆళ్ళకు పనికొస్తేనే ఏమైనా “- చిదంబర  రహస్యం ఉల్లేఖించా డా చిన్న ఉద్యోగి.

” కానీ నేను  లక్షకు ఇరవై వేలు ఇచ్చు  కోలేను; పది తీసుకో” – బేరమాడాడు  కొండయ్య.

” ఇదో, మడీ చౌకాశి సేయొద్దు. అదేం నాకొక్కని కేం  కాదు . నా పైనోళ్ళకూ  బాగమిచ్చుకోవాలా ” కాసేపు  ఆగి ఏదో ఆలోచించి, ఏదో  లెక్కేసి “సరే నీకూ కష్టమొద్దు, నాకూ నష్టమొద్దు ; పదైదు – లాస్ట్ . కాయితాలన్నీ నేనే సూసుకుంటా “- తెగేసి చెప్పాడు తిరిపేలు.

“తొరగా  లెక్కిచ్చి, దుడ్లు  తీసుకోని, మూటాముల్లె  సర్దుకో. అతివాదులు  అడ్డకట్ట తెంచే  పెమాదముందని

సర్కా రు గుమానీ. లేదా  ఆళ్ళే వదలం, వదలం  అని రాత్రికి,రాత్రికి  గమ్మున  నీళ్లొదిలితే  ‘గోయిందా  , గోయింద; ఆలూ ల్యా , సూలూ ల్యా . ఛండికోటలో అట్నే  గద్ద జరిగింది ” – చావు కబురు  చల్లగా  చెప్పాడు తిరిపేలు. ఏదో  అర్థమైనట్లు తలూపాడు కొండయ్య. తిరిపేలు ఇలా నయానా , భయానా  బెదిరించి  డబ్బులు వసూలు చేసిన  గ్రామస్తుల్లో కొండయ్య మొదటివాడూ  కాడు . చివరివాడూ  కాడు. వూర్లో వున్న  300 కుటుంబాల  పెద్దలను, గుట్ట పైనో, గుడి వెనకో,  పొలంలోనే, కల్లంలోనో  – ఐనంతా చీకట్లో  అందరికీ తిరుమంత్రం  వేసి తన వ్యవహారం  సజావుగా చేసుకోగల  సమర్థుడు తిరిపేలు.

రెండు నెలల తరువాత —

గత రెండు రోజులుగా  భోరున కుండపోతగా వర్షం  కురుస్తోంది.   బంగాళాఖాతంలో  వాయుగుండం  వల్ల  ఈ ప్రాంతాల్లో  కూడ 4 రోజుల పాటు  భారీ  వర్షాలు  కురిసే సూచన వుందని  వాతావరణ  శాఖ తెలిపినట్లు రేడియోలో , టివి లో  ప్రకటించారు. అందుకే అవ్వాళ తమ కుటుంబ వివరాలు, ఆస్తుల లెక్కలు తెలిపేందుకు స్కూల్ భవంతిలో సమావేశమైన వూరి జనులు తమ దస్త్రాలన్నీ  జాగ్రత్తగా  ప్లాస్టిక్ కవర్లలో, ఫోల్డర్లలో అత్యంత జాగ్రత్తగా తెచ్చారు. వాన  జోరుగా కురుస్తోన్నా గది కిటకిటలాడి పోతోంది.

“మీ పేర్లవారీగా పిలుస్తాం . మీరొచ్చి మీరిచ్చి న వివరాలన్నీ  సరిగాా ఉన్నాయని  ఏలిగురుతులేసి ఖచిత  పర్సాల.  (వొత్తు ‘ఖ’ పలకడం  కాస్త కష్టమే  అయ్యింది  తిరిపేలుకు . వూర్లో వాళ్లతో  మాట్లాడేటప్పుడు  వాళ్ళ యాస వచ్చినా, అధికారుల ముందర కాస్త జాగ్రత్త  పడతాడు).

మొదట మీరిచ్చి న బ్యాంకు ఖాతా వివరాల్లో   మార్పులు లేవని , ఒక వేల మార్పులు  వుంటే కొత్త వివరాలు  నమోదు సేసి  ఏలి గురుతులెయ్యాల.మీ ఆధార్ కార్డు కాపీలు జత చేయాల. నీళ్ళు వొదిలేదానికి  నెల రోజులు  ముం దుగానే  ఇేండ్లు కాళీ సేసి ,ఊరొదిలి ,  పునరా(వా)సా  కేంద్రాలకు  ఎలతామని ఒప్పు దల పత్రాల  మీద కూడా సేవ్రాలు , ఏలి ముద్రలు  ఎయ్యనే  ఎయ్యా ల ” – అనౌన్స్ చేసాడు  తిరిపేలు. ప్రక్కనే  మండలానికి చెందిన పై ఉద్యోగులు, వివరాలు నమోదు చేయడానికి  కంప్యూటర్ అన్నీ సిద్ధం.

అప్పటికే అక్కడి ఊళ్ళోవాళ్ళందరూ వాళ్ళ,వాళ్ళ  దస్త్రాలు, ఫోటో కాపీలు  అన్నీ తయారుగా పెట్టుకున్నారు. మొదట జరిగిన ఉద్యమం లో కూడా సహాయం చేసిన కొంత మంది సమాజ సేవకులు, సేవికలు వారికి  తగిన సూచన లిచ్చి సహాయం చేస్తున్నారు. జనాలు తెచ్చిన దస్త్రాలు, ఆధార్ కాపీలు పరిశీలించి  , బ్యాంకు  ఖాతా వివరాలు  పరీక్షించి పెద్దా ఫీసర్ సంతకం తో పాటు , ఒప్పు దల పత్రాలు  ఒక్కో  కుటుంబానివి  విడి,విడి ఫైళ్లల్లో  భద్రపరిచి, పక్కనే వున్న డేటా ఎంట్రీ క్లర్క్ కి ఇస్తే , అతడు కంప్యూటర్ లో ఎంటర్ చేసి, అప్లోడ్ చేస్తున్నాడు. అంతలో  తిరిపేలు మొబైల్ ఫోన్ మోగిేంది. ఫోన్ లో  అగుపించిన  పేరు చూసి పై అధికారి అనుమతి కోసమా అన్నట్లు  “సార్, యం.ఎల్ .ఏ గారు “

అని జనానికి  కాస్త దూరంగా  వెళ్ళుతూ   కాల్ రిసీవ్ చేసుకుని  ” సార్, నమస్కారం  సార్. అంతా సరిగా జరుగుతోంది సార్ ” లేనిపోని వినవ్రమత ఉట్టి పడుతోంది అతని గొంతులో. “అది సరే! చెప్పిందంతా  మతికుందా ? సాయంకాలం  6 గంటల్లోగా  అంతా ముగించేసి, ఆ  దస్త్రాలతో సహా వెంటనే మండలపు అధికారులను పంపి , నువ్వూ  వెళ్ళిపోవాలి. నీ కోసం , మీ ఇంట్లో వాళ్ళ  కోసం  వేరే బండి  ఏర్పాటు జేశా .ఎట్టాటి  పరిస్థితుల్లో కూడా  ఆలస్యం చేయొద్దు. . మళ్ళా నన్ను  తప్పు బట్టాకు.”

” సార్ ! మరి వూళ్ళో  ఆళ్ళు ..” ఏదో చెప్ప బోయాడు  కానీ గొంతులో  ఏదో అడ్డం పడినట్టయింది తిరిపేలుకు. ” ఏేందోయ్ . నాకంత మాత్రం తెల్దా ? చెప్పింది చేయ్ . విషయం బయటికి పొక్కిందా… , నీ పని ఆఖర్ ” – కాల్ కట్ అయింది. తిరిపేలు కు ముచ్చెమటలు పట్టాయి. వెంటన్ గబా,గబా ఓడిపోయిన  యం ఎల్. .ఏ  నంబర్ కు ఫోన్  చేసాడు. ఆదుర్దాగా  “సార్… ”  అంటూ జరిగిన సంభాషణంతా పూసగుచ్చినట్లుచెప్పాడు. “ఏేందీ ! ఏం  జేస్తాడంట? వాడికంత ధైర్యమా ? ఐనా , ఆ వూర్లో వాళ్ళు మనకు  ఓటెయ్యలా.   ఇక దుకూడా ఎయ్యరు  . పోతే పోతారులే.  వాని ఓట్లే పోతాయ్.  రాద్ధాంతం సేయడానికి మాకో మాంచి యవ్వారం దొరుకుతాది.   ” చెవులు పగిలిపోయేలా బిగ్గర గా నవ్వు తూ ఫోన్ పెట్టే శాా డాయన . ఆ నవ్వు చాలా  కర్కశమనిపించింది తిరిపేలుకు చెమటలతో  ఒళ్ళంతా  తడిసిపోయింది.

వణుకుతున్న  చేతులతో  ఇంటికి భార్యకు ఫోన్ చేసాడు.  ” ఇదో.  చెప్పేది జాగర్తగా ఇను. అల్మారాలో వున్న దుడ్లన్నీ  3,4 గోనె  సంచుల్లో కుక్కి , పురికోసతో గట్టిగా  కట్టేయ్.  మన బట్టలు, నగా, నట్రా  అన్నీ ఓ ట్రంక్ పెట్టెలో సర్దేయ్. సందకాడే  మీ వూరికి పయానాం. పిల్లోనికి బెరీన  బువ్వ బెట్టి రెడీ చెయ్.  నేనొచ్చే బండ్లోనే ఎల్లిపోదాం.”

ఆవిడ ఇంకేమో  అడుగబోయేలోగా  ఫోన్ కట్ జేశాడు. తేలుకుట్టిన  దొంగలా  తిరిపేలు జనాల వద్ద  నుేండి దస్త్రాలు తీసుకుంటున్న సహోద్యుగుల వద్దకు  వెళ్ళాడు.  “ఐదు గంటల్లోగా  ముగిచ్చి  సాయంకాలానికల్లా దస్త్రాలు జిల్లా ఆఫీసుకు సేర్సాలంట  సార్; పైనుంచి ఆర్డర్లంట. యం.ఎల్ .ఏ  సార్ సెప్పినాడు”  మెల్లిగా  మండలం ఇన్ ఛార్జ్ ఆఫీసర్  చెవిలో  వూదాడు  తిరిపేలు. విషయం అర్థమైనా , కాకపోయినా  తన ఇన్నేళ్ల అనుభవం లో ప్రాంతీయ నాయకులను ప్రశ్నించే దమ్ములేని  ఆయన  ‘డూడూ బసవన్న’ లాగా తలూపాడు.  మిగతావాళ్ళనీ  పురమాయిస్తూ, తానూ  కాగితాలు పుచ్చుకోవడం వేగవంతం చేసాడు  తిరిపేలు. వర్షం ఇంకా తగ్గు ముఖం పట్టలేదు.  కారే కప్పు లపై తడికెలు, మట్టికప్పినోళ్లు. దుమికే  తూము  నీళ్లను మళ్లించడానికి  కాలువల్లాగా చేసినోళ్లు, వర్షంలోనే చేనికాడికి  పోయి వచ్చినోళ్లు, సర్కా రుకు దస్త్రాలు  తడవకుండా  ఇచ్చి రశీదు ఇప్పించుకొని వచ్చినోళ్లు, ఇంట్లో వెచ్చగ  కంబళి  కప్పుకొని పడుకున్నారు. కారే గుడిసెల్లో  ఒక వారగ వున్న  కాసింత  స్థలం లో  పిల్లాజెల్లలతో దాదాపు మోకాళ్ళు తాకేట్టు తల దాచుకున్న  వాళ్ళు వున్నారు. రోజంతా పొలం లోనో, ఇంటి పనో చేసి, వున్న చాలీ చాలని, చిరుగుల దుప్పట్లో చలికి వొణికే పిల్లలను అక్కున జేర్చుకుని కళ్లు  మూసుకున్న తల్లులూ వున్నారు.   అమ్మ ఎదపై ఆడుకుంటూ, ఆదమరిచి నిదురపోయిన పసికందులూ వున్నారు. కొండయ్య, తన మేజర్ కాబోతున్న కొడుకు, పురిటికని పుట్టింటికొచ్చిన మూడో కూతురూ తమకు రాబోయే  పరిహారం గురించిన కలల్లో వున్నారు.  వారి గాడిపాట్లో  ఎనుములు మెల్లిగా  నెమరు వేస్తున్నాయి. అటువైపు ఎద్దులు అలసినయ్ గాబోలు, కాలు మడిచి  ఒదిగి కూర్చొని వున్నాయ్. ఒక మూలగా ఓ చిన్న  బల్బు కాసింత వెలుగునిస్తోంది. వూరంతా ప్రశాంతంగా  నిదుర పోతోంది. వీధి దీపాలు మాత్రం  మేలుకుని వున్నాయ్. వూరికి దూరంగా ఎత్తైన గుట్ట మీద  శివాలయంలో బాగా ఎత్తుగా కట్టిన కార్తీక దీపం, ఊరికంతా కనపడేలా మిణుకు,మిణుకు మంటోంది.  అంతలో వున్నట్టుండి  వీధి దీపాలు కళ్ళు మూసుకున్నాయి.  కొండయ్య ఇంట్లో చిన్న బల్బు కూడా ఆరిపోయింది.  అంతలో ఉన్నట్టుండి  ఎద్దులు లేచి నిలుచుకుని రంకె వేయసాగాయ్.  తలుగుల నుండి  తప్పించుకునే ప్రయత్నం చేయసాగాయి. ఎనుములు కూడా అదే వ్యర్థ ప్రయత్నం లో ‘అంబా’ అని అరువ సాగాయి.  గాడిపాటన  రభస  ఎక్కువయ్యింది. కొండయ్య  “నారాయణా ! బుడ్డి ఎలిగిచ్చి పామేదైనా  జొరబడిందేమో సూడు”  అంటున్నాడు కొడుకుతో. అంతలో బయట కూడా  ఏదో రభస.  ఎవరో పరుగెత్తుకొచ్చినట్లు . ఏవో అరుపులు  కూడ వినిపిస్తున్నాయ్. చీకట్లోనుండి  ఎవరో బిగ్గరగా అరుస్తున్నారు. “కట్ట తెగింది. నీళ్లు ముంచుకొస్తున్నాయ్. ఉరకండి “. అంతే; ఇంట్లో అందరి  నిద్దుర మత్తు ఎగిరిపోయి భయం చోటు చేసుకుంది. నారాయణ పరుగెత్తికెళ్లి గోడకానించిన  సైకిల్ ను స్టాండ్ మీదనే పెడల్ తొక్కి, ఆ సైకిల్  దీపపు కాంతిలోనే  ముందర యాకటి అక్కను, వెనకల నడి వయస్సు తండ్రిని కూర్చోబెట్టుకుని శివాలయం వైపు జోరుగా తొక్కసాగాడు. అప్పటికే చాలా మంది జనం- ఆడామగా – అందరూ లాంతరు, టార్చ్ -ఏది దొరుకుతే  దాన్ని పట్టుకుని పరిగెడుతున్నారు. కన్ను పొడుచుకున్నా కనబడని ఆ చీకట్లో ప్రాణం కోసం పరిగెడుతున్నప్పుడు అవే  ఆసరా. 

 చీరె తట్టుకునో, కాలికి ఏ రాయి రప్పో తగిలి,  అక్కున వున్న పసికందుతో సహా  కింద పడితే , వెనుకనుండి పరుగున వచ్చే జనం తొక్కిడిలో  పేగు తెంచుకుని పుట్టిన బిడ్డతో పాటు, కడుపు పగిలి  ప్రాణాలు పోవడం ఖాయం.  ఎవరి ప్రాణం వారికి  తీపి. పక్కవాణ్ణి పట్టించుకునే  అవకాశమూ లేదు; ఆస్కారమూ లేదు. అనుకున్న దానికంటే  నీళ్లు వేగంగా ముంచుకొచ్చినాయి. మునిగిపోతున్న  జనుల ఆర్తనాదాలు, హాహాకారాలు, కొట్టుకొచ్చిన పశువుల అరుపులు, పాముల బుసబుసలు అన్నీ ఉధృతమైన ఆ ప్రవాహపు ముప్పులో  మూగవోయాయి. 

నారాయణ తొక్కుతున్న సైకిల్ గుట్టకు ఇంకా అల్లంత దూరం లో వుంది. ముగ్గురిని తొక్కుతున్న ఆ కాళ్ళు భయంకరమైన ఆ ముంపు ముందు  నిలువలేక పోయాయి. ఒక్క ఊపుతో  వెనకనుండి  నీళ్లు ఉరుకున ముంచేశాయి. నాన్న, అక్క, సైకిల్ ఏమయ్యాయో తెలియదు.  తాను ముంపు లోనుండి సుడులు తిరుగుతూ అలలాగా పైకి లేచినప్పుడు, దగ్గిరలో  శివాలయం ముందరి ధ్వజస్థంభం, దాని ప్రక్కనే ఎత్తుగా  కార్తీక  దీపం కొరకు కట్టిన కంబం కళ్ళకు కనపడ్డాయి . తనకున్న  శక్తినంతా ఉపయోగించి  మళ్ళీ మునిగి  పైకి తేలే లోగా  అరక్షణం లో  లంఘించి, గట్టిగా కంబాన్ని  పట్టుకుని , అంతలోనే తేరుకుని  గబగబా పైకి పాకసాగాడు. శివాలయం చుట్టూ సుడులు తిరుగుతూ ముంపు ముంచుకొస్తోంది.

గంగమ్మ అలుకలో ఆది శివుడే మునిగిపోయాడు.  ఆ మహోధృతికి  గోపురం కూడా వేగంగా మునిగి పోయింది.  దీపం కట్టిన కంబం కూడా కంపించ సాగింది. తన కాళ్ళ వరకూ నీళ్ళొచ్చాయి.  ఐనా సరే కంబం  వదలకుండ  గట్టిగా చేతులు  పెనవేసి పట్టుకున్నాడు నారాయణ . అంతలో  వేగంగా సుడులు తిరుగుతున్న నీళ్లు దభేలని తగిలి కార్తీక  దీపపు గాజు మూత  ఖణేల్మని  పగిలింది. దీపం  ఆరిపోయింది. కంబమే ఒరిగిపోయింది. దాహం  తీరని గంగ దమన తాండవం లో శివుడైతేనేం, నారాయణుడైతేనేం?

************************************

దూరంగా రాజధాని  నగరంలో  సమాజం  పట్ల ఉదాసీనత  పెంచుకున్న, ఘనత వహించిన సగటు పౌరుని

చేతిలోని దినపత్రిక  మొదటి పుట లో, పెద్ద, పెద్ద అక్షరాల్లో  హెడ్ లైన్స్: ముంపు తెచ్చిన ముప్పు.   భారీ ప్రాణ హాని, ఆస్తి నష్టం మెట్టూరు , నవంబర్ 10: మెట్టూరు జిల్లా , సుండూరు మండలం లో సుముద్వతీ నది కట్ట తెగి, ప్రతిపాదించబడిన  జలాశయం ప్రాంతం లోని 20 గ్రామాల ముంపు. భారీ ప్రాణహాని, ఆస్తి నష్టం.  నేషనల్ డిసాస్టర్ మేనేజ్మెంట్  అథారిటీ (NDMA)  సహకారం తో రాష్ట్రపు  సత్వర సహాయ చర్యలు. ముంపు గ్రామాలకు  చేసిన ఎన్నికల వాగ్దానం  అమలు పరచలేని సర్కా రు కుతంత్రం  అని ప్రధాన ప్రతిపక్షపు అభియోగం. ఊహించని భారీ వర్షాల ప్రభావమా ? లేక కట్ట నిర్మించిన మునుపటి ప్రభుత్వం లోని మంత్రి గారి బామ్మరిది  నాసిరకం నిర్మాణమా ?? ఇటీవల ఆ ప్రాంతంలో ఉధృతమైన తీవ్రవాదుల చర్యా ?? దోషులెవరైనా

ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, సజీవ బాధితులకు తగిన ఆర్ధిక సహాయం అందజేస్తుందని

 ముఖ్యమంత్రి ప్రకటన. ఆ ప్రధాన శీర్షిక క్రిందనే బాక్స్ లో మరో వార్త. భారీ వర్షాల వల్ల  సుముధ్వతీ ఉపనది కుముధ్వతీ  ఉప్పెనలో  వంతెన కూలి జీపు గల్లంతు. దాదాపు 5 కి.మీ.ల కావల  4 మృత దేహాలు లభ్యం .  అవి పాతపల్లి గ్రామోద్యోగి తిరిపేలు కుటుంబానివని నిర్ధారణ.

ప్రతాప్ రెడ్డి రాజులపల్లి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *