సోమర్ సెట్ మామ్
నా చదువంతా ఇంటర్మీడియెట్ వరకూ తెలుగు మీడియమ్ లోనే సాగింది.ఇంగ్లీషు పుస్తకాలు చదవడం నేను ఇంటర్మీడియెట్ తర్వాత మూడేళ్ల పాటు ఇంట్లో వున్న కాలంలో మొదలు పెట్టాను .నెమ్మది నెమ్మదిగా కూడబలుక్కుంటూ చదవడం,డిక్ష్నరీ దగ్గరపెట్టుకుని అర్థాలు చూసుకుంటూ చదువడం చేసే దాన్ని .మా ఊళ్లో లైబ్రరీలో వున్న ఇంగ్లీషు పుస్తకాలు రాశి లో తక్కువయినా వాసిలో తక్కువయినవి కాదు .జిమ్ కార్బెట్ “మాన్ ఈటర్స్ ఆఫ్ కుమోన్ “,టాగూర్ “గీతాంజలి”,ఎడ్వర్డ్ ఫిట్జరాల్డ్ “రుబాయియత్ ఆఫ్ ఉమర్ ఖయ్యామ్ “అలా చదివిన పుస్తకాలలో కొన్ని.
ఆ కాలంలోనే మాలతీ చందూర్ గారు “పాత కెరటాలు “పేరిట ప్రపంచ ప్రఖ్యాత నవలలని పరిచయం చేస్తూ వుండేవారు.నిజంగా ఆవిడ పుణ్యమా అని ఎన్నో మంచి పుస్తకాలని చదివి,మంచి అభిరుచిని పెంపొందించుకుంది ఆనాటి యువతరం.
నేను అలా చదివినవే టాల్ స్టాయ్ “అన్నాకెరినినా”, మార్గరెట్ మిచెల్ “గాన్ విత్ ద విండ్ “,సోమర్సెట్ మామ్ “ఆఫ్ హ్యూమన్ బాండేజ్ “,”యానీ ఫ్రాంక్స్ డెయిరీ”.అవన్నీ నా మీద చెదరని ముద్ర వేశాయి.
సోమర్సెట్ మామ్ “ఆఫ్ హ్యూమన్ బాండేజ్ “చదివే టైమ్ కి నేను మెడికల్ కాలేజ్ లో వున్నాను.నా ప్రాణస్నేహితురాలు ఒకామెకి సోమర్సెట్ మామ్ అభిమాన రచయిత.ఇకమేమిద్దరమూ ,ఇంకొక ముగ్గురు నలుగురు స్నేహితులూ కలిసి “ఆఫ్ హ్యూమన్ బాండేజ్ “చదివి ఎన్నెన్నో చర్చలు చేసేవాళ్లం.

అప్పటి నుండీ వరసగా మామ్ రచనలన్నీ చదవడం మొదలు పెట్టాము. “దిమూన్ అండ్ సిక్స్ పెన్స్ ,లిజా ఆఫ్ లాంబెత్ ,కేక్స్ అండ్ ఏల్ ,ది పెయింటెడ్ వెయిల్ ,మిసెస్ క్రాడక్ ,ది రేజర్స్ ఎడ్జ్ ,అప్ ఎట్ ద విల్లా” ఇవన్నీ ఈ నాటికీ గుర్తున్న పేర్లు.
మామ్ ని అంతగా అభిమానించడానికి ,అతను మానవ మనస్తత్వాన్ని అధ్యయనం చేసి తన రచనలలో విశదీకరించినట్టు అనిపించడం .మనిషి స్వభావాన్ని వ్యంగ్యంగా వ్యాఖ్యానించినట్టు గా వుండటం,అతను జీవితాన్ని అందరిలాగా కాకుండా ఒక విభిన్న కోణంలో దర్శించినట్టు గా వుండటం కారణాలయి వుండవచ్చు.
జీవితం పట్ల అతనికొక సినికల్ ఆటిట్యూడ్ వున్నట్లుగా భావించేవాళ్లం.ఇలాంటి జీవన దృక్పథం యేర్పడటానికి బీజాలు అతని బాల్యంలోనే పడ్డట్టుగా తోస్తుంది అతని జీవన ప్రయాణం పరిశీలిస్తే.
విలియమ్ సోమర్సెట్ మామ్ ది న్యాయవాదుల కుటుంబం .అతని కుటుంబంలో రచయితలెవరూ లేరు.అతని తాత,తండ్రులు న్యాయవాద వృత్తిలో మంచి పేరు గడించారు.అతని తండ్రి బ్రిటీష్ ప్రభుత్వం తరుఫున పారిస్ లో బ్రిటీష్ రాయబార కార్యాలయం లో పని చేస్తున్న కాలంలో ,(25 జనవరి 1874)నాలుగవ సంతానంగా విలియమ్ సోమర్సెట్ మామ్ జన్మించాడు.అతనిని కుటుంబంలోని వారూ, దగ్గరవారూ “విల్లీ” అని పిలిచేవారు.
అతని మీద తల్లి ప్రభావమెక్కువ .ఆమె చక్కని మనిషి ,కొడుకు పట్ల ప్రేమగా మెలిగేది.దురదృష్టవశాత్తూ అతని ఎనిమిదవ యేట క్షయవ్యాథితో బాధపడుతూ ఆమె కన్ను మూసింది.ఇది ఒక కోలుకోలేని దెబ్బ అతనికి ,ఆమెని అతనెంత ప్రేమించే వాడంటే ,అతను చనిపోయే వరకూ ఆమె ఫోటో అతని పడక పక్కనే వుండేది.
ఆమె మరణించిన రెండున్నర యేళ్లకు అతని తండ్రి కూడా కాన్సర్ కారణంగా మరణించడం అతని దురదృష్టం..తల్లీ తండ్రీ ఇద్దరూ దూరమవ్వడంతో అతను దాయాదుల సంరక్షణలో ఇంగ్లండ్ లో కొంత కాలం,జర్మనీలో కొంత కాలం పెరగ వలసి వచ్చింది.అతని పెదనాన్నచూపే కఠినమైన క్రమశిక్షణ అతని పసి హృదయాన్ని గాయపరిచేది.
తల్లి దండ్రుల ప్రేమ దొరకక పోవడం,చిన్ననాటినుండీ వేధిస్తున్న నత్తి సమస్య అతనిని ఒక అంతర్ముఖుడిగా తయారు చేశాయి.అయితే మనుషుల స్వభావాలనీ,వారి చేష్టలనీ విపరీతంగా పరిశీలించడం వాటిని కాగితం మీద పెట్టడం అలవాటయింది.అతను తన పదిహేనవ యేట నుండీ రచనలు చేయడం ప్రారంభించాడు.
కుటుంబంలోని వారు తలచిన దానికి భిన్నంగా అతని చదువు సాగింది.అతను మెడిసిన్ లో చేరి డాక్టర్ అయ్యాడు. చదువు పూర్తి చేసి డిగ్రీ అందుకునే సమయానికి అతని మొదటి నవల “లిజా ఆఫ్ లాంబెత్ ” విడుదల అయ్యి మంచి పేరు తీసుకు వచ్చింది.అదేసమయానికి అతను రాసిన నాలుగు నాటకాలు కూడా థియేటర్లలో ఆడుతూ వుండటంతో అతను వైద్యవృత్తిని వదిలి వేసి రచయితగా కొనసాగాడు.
మామ్ చేసిన సాహిత్య కృషి సామాన్యమయినది కాదు.
సుమారు వంద చిన్న కథలూ, ఇరవై నవలలూ, పాతిక నాటకాలూ, ఇంకా అనేక విషయాలపై రాసిన సాహిత్య వ్యాసాలూ కలిసి దాదాపు రెండు వందలుంటాయి. ఇవన్నీ అతనిని ఇరవయ్యో శతాబ్దపు రచయితలలో అగ్రగణ్యుడిగా నిలబెట్టాయి.
మామ్ రాసిన చిన్న కథలనీ, నాటకాలనీ ప్రజలెంతో ఆదరించారు.
నవలల విషయానికి వస్తే “ఆఫ్ హ్యూమన్ బాండేజ్ ” చాలా వరకూ అతని జీవిత కథ ఆధారంగా రాసిందేనంటారు.అందులో కథానాయకుడు ఫిలిప్ కేరీ కి ఒక అవయవ లోపం ఉంటుంది (వంకర పాదం club foot).మామ్ కి కూడా చిన్నతనం నుండీ మాట తడబడుతూ వుండేది,అందరూ అతనిని నత్తి వాడని గేలిచేస్తూ వుండేవారు.ఈ నవలలో కథానాయకుడు కూడా మామ్ లాగానే చిన్నతనంలోనే తల్లిని కోల్పోతాడు,అతని లాగే డాక్టర్ కోర్సు చదువుతాడు.ఇలా చాలా సారూప్యాలు కనపడతాయి..ఇందులో కథానాయకుడైన ఫిలిప్ కేరీ తన కంటే అన్నివిధాలా తక్కువ స్థాయిలో వున్న మిల్ డ్రెడ్ అనే హోటల్ వెయిట్రెస్ ప్రేమ కోసంవెంపర్లాడి జీవితాంతం ఎలాంటి పాట్లుపడ్డాడో,ఆమె అతని ప్రేమతో ఎలా ఆటలాడుకున్నదో,అతను అందులోనుండీ యెలా బయటపడ్డాడో చాలా బాగా చిత్రీకరించాడు మామ్
ఈ నవల మామ్ కి ఎంతో పేరు తెచ్చిపెట్టడమే కాక సాహితీ లోకంలో అతని స్థానాన్ని సుస్థిరం చేసింది.
ఈ నవలని సినిమాగా కూడా రూపొందించారు. లెస్లీ హోవార్డ్ ఫిలిప్ కేరీ గానూ, బెట్టీ డేవిస్ మిల్డ్రెడ్ గానూ నటించిన సినిమా ఈ మధ్యనే చూశాను బాగుంది.
ఆ తర్వాత అతనికి మంచి గుర్తింపు తెచ్చిన నవల “దిమూన్ అండ్ సిక్స్ పెన్స్ “.ఇది ప్రఖ్యాత ఫ్రెంచ్ పెయింటర్ పాల్ గాగిన్ జీవితం ఆధారంగా రాసిన నవల.ఈ నవలలో ఛార్లెస్ స్ట్రిక్ లాండ్ అనే ఇంగ్లీషు స్టాక్ బ్రోకర్ ,తన పెళ్లాం బిడ్డలనీ భద్రమైన జీవితాన్నీ హఠాత్తుగా వదిలివేసి ,పారిస్ వెళ్లిపోయి పెయింటర్ గా జీవితాన్ని కొత్తగా మొదలు పెడతాడు.తాను కోరుకున్నది సాధించడానికి అతను ఆర్థికంగా ,శారీరకంగా ఎన్నో సమస్యలను యెదుర్కొంటూ ,దుర్భర జీవితాన్ని అనుభవిస్తూ కూడా అతని పట్టువిడవడు
చివరికి అతని జీవితం యెన్ని మలుపులు తిరిగిందీ,యెలా ముగిసిందీ,ఆర్టిస్టుగా అతనెంత యెత్తుకు యెదిగిందీ అనేదే ఈ నవలలోని ప్రధానాంశం.
అసలు మామ్ మనసులో ఈ నవలకు బీజం యెలా పడిందంటే—
1904లో మామ్ పారిస్ వెళ్లి ఒక సంవత్సర కాలంపాటు అక్కడే గడిపాడు.అప్పుడే అతనికి పాల్ గాగిన్ గురించి ,అతన్నెరిగిన వారి ద్వారా కొంత సమాచారం దొరికింది.అప్పటి నుండీ అతని మనసులో ఈ సబ్జెక్ట్ నలుగుతూనే వుంది .ఆ తర్వాత పదేళ్లకు,జీవిత చరమాంకంలో పాల్ గాగిన్ నివసించిన తాహితీ ఐలెండ్స్ కు మామ్ కూడా వెళ్లాడు ,అక్కడి పరిచయస్తుల ద్వారా మరింత సమాచారం తెలుసుకున్నాడు.ఆ విషయాలన్నీ గుదిగుచ్చి తన కల్పనను కొంత జోడించి ఈ “మూన్ అండ్ సిక్స్ పెన్స్ ” నవలను తీర్చిదిద్దాడు.
మామ్ తన రచనల గురించి యేమంటాడంటే “జీవితంలోని ఫాక్ట్స్ ని తీసుకుని నా సొంత కల్పనని కొంత జోడించి కథలని రూపొందిస్తాను.కొంత కాలం తర్వాత చదువుతుంటే యేది నిజమో యేది కల్పనో నేనే గుర్తు పట్టలేను” అని.
ఇంకా అతని అభిప్రాయాలు యెలా వుంటాయంటే” రచన చేయడానికి కావలసిన సబ్జక్ట్ జీవితంలోనుండే దొరుకుతుంది.సంఘటనల వెంట రచయిత పడాలి ,రచయిత వెనక సంఘటన పడదు ,రచయితలని తయారు చేసే సూత్రాలూ,పాఠాలూ అంటూ యేమీ వుండవు జీవితం కంటే పెద్ద పాఠశాల యేమీలేదు “.ఇవన్నీ అతని ఇంటర్వ్యూలు వింటుంటే తెలిసిన సంతులు.
ఇంకా ఈ “మూన్ అండ్ సిక్స్ పెన్స్ “కి ఆ పేరు యెందుకు పెట్టారు ?అని అడిగితే ,”కింద నేల మీద వున్న ఆరు పెన్నీల కోసం చూసుకుంటుంటే పైన ఆకాశంలో ప్రకాశవంతంగా వెలిగే చందమామను చూడలేము” అనే అర్థంలో ఆ నవలకా పేరు పెట్టడం జరిగిందని స్నేహితునికి రాసిన ఉత్తరంలో చెప్పాడు మామ్ .
మామ్ రాసిన నవల చదివాక నాకు పాల్ గాగిన్ మీదా,అతని పెయింటింగ్స్ మీదా విపరీతమైన ఆసక్తి కలిగింది.ఛార్లెస్ గోర్హమ్ రాసిన పాల్ గాగిన్ జీవిత చరిత్ర పుస్తకం “ది గోల్డ్ ఆఫ్ దెయిర్ బాడీస్ ” కూడా చదివాను.2019 లో బోస్టన్ లో గాగిన్ గీసిన మాస్టర్ పీస్ where do we come from? what are we?where are we going? ముందు నిలిచి తనివి తీరా చూసి కన్నీరు కార్చాను.

న్యూయార్క్ ఆర్ట్ మ్యూజియమ్ లో ఆయన సెల్ఫ్ పోర్ట్రయిట్ ముందు నుంచుని ఫోటో తీయించుకున్నాను.
షికాగో ఆర్ట్ గేలరీలో తాహితీ ఐలాండ్స్ లో వున్నప్పుడు ఆయన చేతిలో రూపు దిద్దుకున్న దారు కళాకృతులూ,సరైన కాన్వాస్ కొనే స్తోమత లేక,ఒక వేళ వున్నాకాన్వాస్ దొరకక గోనె పట్టాలనే కాన్వాస్ గా చేసుకుని చిత్రించిన చిత్రాలూ చూసి జన్మ ధన్యమైందను కున్నాను.
వీటన్నిటికీ కారణం మామ్ రాసిన పుస్తకం చదివితే కలిగిన ప్రేరణే అనడం లో సందేహం లేదు!
నాకు మామ్ రాసిన నవలలన్నింటిలోనూ బాగా నచ్చిన నవల పేరు చెప్పమంటే “ది రేజర్స్ ఎడ్జ్ “పేరు చెబుతాను.
ఈ పుస్తకం లో కథానాయకుడు లారీ డారెల్ ఒక అమెరికన్ పైలెట్ .మొదటి ప్రపంచయుధ్ధ సమయంలో తోటి కమాండర్ గాయపడి మరణించడం చూసి తట్టుకోలేక పోతాడు.మృత్యువంటే ఏమిటీ? ఈ జీవితానికి అర్థం ఏమిటీ? ఇలాంటి ప్రశ్నలు బయలు దేరుతాయి.
వీటన్నింటికీ సమాధానాలు వెదుకుతూ అనేక చోట్ల పర్యటిస్తూ వుంటాడు.ఇండియా కూడా వస్తాడు .ఇక్కడొక స్వామీజీని కలిసి ఆయన ఆశ్రమంలో కొన్నాళ్లు వుంటాడు.
చివరకు అతను తెలుసుకున్న పరమార్థమేమిటీ? అతని వ్యక్తిగత జీవితంలో సంభవించిన పరిణామా లేమిటీ ?అనేదే ఈ నవల లోని విషయం.ఇందులో మధ్యలో మామ్ పాత్రకూడా అప్పుడప్పుడూ వచ్చి కథానాయకుడి తో అద్వైతం గురించీ, ఫిలాసఫీ గురించీ మాట్లాడుతూ వుంటుంది.
ఈ నవలకి ప్రేరణ కూడా ఎవరో ఒక పైలెట్ అని అంటూవుంటారు.అయితే సోమర్సెట్ మామ్ అధ్యాత్మిక విషయాల మీద వున్న ఆసక్తితో భారతదేశం వచ్చి ఇక్కడ కొంతకాలం వున్న మాట వాస్తవం.ఆయన తిరువణ్ణామలై వచ్చి రమణ మహర్షి ఆశ్రమం లో కొన్నాళ్లు వున్నారనీ,మహర్షితో నేరుగా సంభాషించే వారనీ ప్రముఖ రచయిత చలం తన పుస్తకం “మ్యూజింగ్స్ “లోనూ “,భగవాన్ పాదాలముందు చలం ” అనే పుస్తకంలోనూ రాసింది నేను చదివాను.ఈ నాటికీ రమణాశ్రమం లో ఒక గదిని చూపించి మామ్ ఈ గదిలోనే వున్నారని చెప్పడం నాకు తెలుసు .(అయితే చలం గారు మామ్ ని మాఘం గారు అని రాస్తారు చిత్రంగా.)ఆయన ఆధ్యాత్మిక అనుభవాలని క్రోడీకరించి,దాదాపు నిజ జీవితంలోని సంఘటనలతోనే ఆయన ఈ నవలని రాశారని అంటూ వుంటారు.ఈ నవలలో కల్పన తక్కువని కూడా సాహితీ విమర్శకులు భావిస్తారు.
నవలకి పెట్టిన పేరు కి కూడా “కఠోపనిషత్తు”లోని ఒక శ్లోకమే ఆధారమట!మోక్షానికి తీసుకు పోయే త్రోవ కఠినమైనది,కత్తి అంచు మీద నడకలాంటిది అనే అర్థాన్నిచ్చే ఆ శ్లోకాన్ని పుస్తకం ముందు పేజీలో చూడవచ్చు
1944లో వెలువడిన ఈ నవల ఆ తర్వాత రెండు సార్లు సినిమాగా వెలువడింది.(1946లోనూ,1984లోనూ)
మామ్ నవలలే కాదు,ఆయన రాసిన కథలూ,నాటకాలూ,ప్రయాణ కథలూ ,వ్యాసాలూ ఇవన్నీ కూడా చాలా పేరొందినవి
అసలు ఆయనని ప్రపంచ ప్రఖ్యాత చిన్న కథల రచయితలలో ఒకరిగా పరిగణిస్తారు.
ఆయన రాసిన కథలలో మూడుపేజీల కథలనుండీ నలభై పేజీల కథల వరకూ వున్నాయి.
వాటినన్నిటినీ మూడు సంపుటాలుగా ప్రచురించారు.
ఆయన కథలలో బాగా పేరుతెచ్చుకున్న వాటి పేర్లు కొన్ని చెప్పుకుందాం
.ది వర్జర్
రెయిన్
ది హాపీ కపుల్
ది లంచ్
మిస్టర్ నో ఆల్
ఆయన రాసిన వంద కథల్లో
దాదాపు అన్నీ మంచి కథలే మచ్చుకి కొన్ని పేర్లు చెప్పానంతే.మామ్ కథలలో తీసుకునే ప్లాట్ విభిన్నంగా వుండడం,సంభాషణలు సహజంగా,క్లుప్తంగా,సరళంగా వుండటం.సున్నితమైన వ్యంగ్యమూ,హాస్యమూ కథలలో అంతర్లీనంగా ప్రవహిస్తూ వుండటమూ, మెరుపుల్లాంటి చురకలతో కథలు ముగియడమూ ,ఆయన కథలనంత ప్రత్యేకంగా నిలుపుతాయనుకుంటాను.
మామ్ రాసిన నాటకాల విషయానికొస్తే దాదాపు పాతిక వరకూ నాటకాలు రాశారు అని చెప్పుకున్నాం కదా,వాటిలో “ది బ్రెడ్ విన్నర్ ,సీజర్స్ వైఫ్ ,ది సర్కిల్ ,పెనిలోప్ “మొదలైనవి బాగా పేరొందినవి.
వివిధ విషయాల మీద పత్రికలలో వ్యాసాలు రాయడమే కాక దాదాపు నలభై సినిమాల వరకూ రచనా సహకారం కూడా అందించారు.ప్రపంచమంతా విస్తృతంగా పర్యటించడంతో పాటు,తన ప్రయాణ కథలను కూడా రసవత్తరంగా రాసి అందించడం విశేషం.
అందుకే
ఇరవయ్యవ శతాబ్దపు రచయితలలో మామ్ ని ఒక మేథావిగా,పాప్యులర్ రచయితగా పరిగణించే వారు.
ఆయన వ్యక్తిగత జీవితం విషయాని కి వస్తే ,మెడిసిన్ చదివినప్పటికీ ,డిగ్రీ చేతికి అందేటప్పటికే ఆయన రాసిన మొదటి నవల బాగా సక్సెస్ అవ్వడం(లిజా ఆఫ్ లాంబెత్ ),ఆయన రాసిన నాటకాలు కూడా బాగా ఆడుతూ మంచి పేరు తీసుకు రావడంతో ఆయన రచనా వ్యాసంగాన్నే వృత్తిగా స్వీకరించారు అని చెప్పుకున్నాం కదా.
మొదటి ప్రపంచ యుధ్ధ సమయానికి అతను పదమూడు నవలలూ ,యెనిమిది నాటకాలు రాసి వున్నాడు.
అయితే మామ్ మొదటి ప్రపంచ యుధ్ధ సమయంలో బ్రిటీష్ రెడ్ క్రాస్ సంస్థ తరఫున ఆంబులెన్స్ లో పని చేస్తూ వివిధ దేశాలు తిరిగారు.ఇండియా కూడా వచ్చారు.అదే సమయంలో అంటే మొదటి ప్రపంచ యుధ్ధ సమయంలో బ్రిటీషు వారికి సీక్రెట్ ఏజంట్ గా కూడా పనిచేశారు.ఈ అనుభవాలన్నీ ఆయన రచనా వ్యాసంగానికి యెంతో ఉపకరించాయి.
ఆయనకు ఎంతోమంది ఆడవాళ్లతో అనుబంధాలున్నప్పటికీ ప్రధానంగా ఆయనొక గే అని చెబుతారు.1917లో సీరీ వెల్కమ్ అనే ఆమెను పెళ్లిచేసుకున్నాడు. కానీ చాలాకాలం ఆమెకు దూరంగానే గడిపే వాడు మామ్.1929లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.వారిద్దరికీ పుట్టిన కూతురు పేరు లిజా.
మొదటి ప్రపంచ యుధ్ధ సమయంలో బ్రిటీష్ రెడ్ క్రాస్ లో పని చేసేటప్పుడు పరిచయమైన ఫ్రెడరిక్ జెరాల్డ్ హాక్స్టన్ తో ఏర్పడిన అనుబంధం సుదీర్ఘకాలం(సుమారు ముఫ్ఫయ్యేళ్లు) అతను 1944లో చనిపోయేదాకా కొనసాగింది.హాక్స్టన్ మామ్ కి పర్సనల్ సెక్రటరీగా పని చేసేవాడు.అతను చనిపోయాక.ఆ స్థానంలో తన పర్సనల్ సెక్రటరీ గానూ,అనుచరుడుగానూ వుండేందుకు ఆలెన్ సెర్లె అనే అతన్ని ఎంచుకున్నారు మామ్ .అతనే చివరి వరకూ మామ్ తో వున్నాడు.

మామ్ తన జీవిత చరమాంకంలో ఫ్రాన్స్ లో స్థిరపడ్డాడు .
1965 వ సంవత్సరం డిసెంబర్ పదహారవ తారీఖున ,తన 91వ ఏట తుది శ్వాస విడిచాడు.ఆయన చితాభస్మాన్ని ఇంగ్లండు లో ఆయన చదువుకున్న కేంటర్ బరీలోని కింగ్స్ స్కూలు ఆవరణలో వెదజల్లారు.
ఆయన మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన సృష్టించిన సాహిత్యంద్వారా ఆయన చిరంజీవి.
ప్రపంచ సాహిత్యం మీద సోమర్ సెట్ మామ్ వేసిన ముద్ర యెన్నటికీ చెరగనిది.

భార్గవి గారూ, మామ్ ఆఫ్ హ్యూమన్ బాండేజ్ మాకు డిగ్రీ లో నాన్ డీటెయిల్డ్ ఉండేదండి. అది abridged వెర్షన్. మొత్తం పుస్తకం సంపాదించి చదివాను అప్పుడే. అలాగే ఆయన రాసిన మూన్ అండ్ ది సిక్స్ పెన్స్, పెయింటెడ్ వీల్, రేజర్స్ ఎడ్చ్- ఇంకా కొన్ని కథలు – చిన్నతనపు ఉత్సాహం లో ఒక రచయిత వి అన్నీ చదివడం వేడుక. ఇప్పుడు వివరాలు మరచిపోయాను.. కాని ఇష్టంగా చదివిన రోజులంటే ఇష్టం.
అ రోజులు ఏవీ? ఇప్పుడు మీ వ్యాసం తో అప్పటి రోజుల్లో కి చేయి పట్టుకొని తీసుకుని వెళ్లారు. అభినందనలు.
థాంక్యూ అండీ.దాదాపు మీరూ మేము చదువుకున్నట్టే చదువుకున్నారు అయితే