డాన్ నది ప్రశాంతంగా ప్రవహిస్తోంది Part 16

Spread the love

  కొర్నిలోవ్ పెట్రోగ్రాడ్ కు పంపించిన మూడవ ఆశ్విక దళం, ప్రాంతీయ దళం ఎనిమిది రైల్వే విభాగాల పరిధిలోకి వచ్చే దారిలో వెళ్తున్నాయి. రెవెల్, వెజన్ బర్గ్, నార్వా, యామ్ బర్గ్, గాచిన, సోంరినో, వైరిసా, చూడొవో, డోవ్, నోవ్ గోరోడ్, డ్నో, స్కోవ్, లుగా, వీటితోపాటు మధ్యలో వచ్చే అనేక చిన్న స్టేషన్ల గుండా అనేక రైళ్ళు మెల్లగా వెళ్తూ ఉన్నాయి. రెజిమెంట్లలో ఉన్న సైనికులు అధికారుల మాటల మీద నమ్మకం కోల్పోయారు, అప్పటికే వివిధ రైళ్లలో ఉన్న దళాలు ఒకరితో ఒకరు సంప్రదింపుల్లో కూడా లేరు. మధ్యలో సైనికులను మళ్ళీ బృందాలుగా చేయడంతో పరిస్థితి ఇంకా చేజారిపోయింది.

    మధ్యలో రైల్వే సిబ్బంది నుండి, అధికారుల నుండి ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమిస్తూ, కొర్నిలోవ్ సైన్యాన్ని తీసుకువెళ్తున్న రైలు మెల్లగా పెట్రోగ్రాడ్ వైపుకి వెళ్తూ, మధ్యలో స్టేషన్ల దగ్గర ఆగుతూ, మరలా సాగుతూ ఉంది.

   డాన్, ఉస్సురి, అమూర్, ఒరేన్ బర్గ్, నేర్చిస్క్ లకు చెందిన కొసాక్కులు అర్ధాకలితో ఉన్నారు. వారితో పాటు కౌకాశస్ కు చెందిన సియాకిన్స్, కబర్థినియన్స్, ఒసేతీయన్స్ ల పరిస్థితి కూడా ఇదే. వీరిని ఓకే బండిలో వారి గుర్రాలతో కలిపి కుక్కినట్టు ఉంచారు.

స్టేషన్ల దగ్గర రైళ్ళు గంటల తరబడి నిలిచిపోతూ ఉన్నాయి. బండ్లు ఆగగానే, అందులోనుండి జనాలు వేగంగా ఒకరినొకరు తోసుకుంటూ కిందకి దిగి, ప్లాట్ ఫారం మీద, పట్టాల మీద తినడానికి ఏమైనా దొరుకుతాయేమోనని వెతుక్కునే వారు. లేకపోతే అక్కడున్న చిన్న చిన్న కొట్లలో తిండి పదార్ధాలు దొంగతనం చేసేవారు.

  పసుపు, ఎరుపు గీతలతో ఉన్న కొసాక్కుల ప్యాంట్లు, డ్రాగున్ల బరువైన దుస్తులు , కౌకాసియన్ల పెద్ద కోట్లు….నిస్తేజంగా, పేలవంగా ఉండే ఆ ఉత్తర భూభాగ ప్రాంతంలో అలాంటి రంగురంగుల దృశ్యం ఎప్పుడూ చూసింది లేదు.

      ఆగస్టు 29న ప్రిన్స్ గగారిన్ కమాండర్ గా ఉన్న ప్రాంతీయ విభాగానికి చెందిన మూడవ బ్రిగేడ్ పావలోవస్క్ సమీపంలో ఉన్న శత్రువు ప్రాంతానికి వచ్చింది.అప్పటికే పాడైపోయిన రైలు పట్టాల వల్ల ఇంగుష్, కౌకాశియన్ రెజిమెంట్లు ఇక చేసేది లేక రైలు దిగి జార్ స్కోయే సెలో వైపు మార్చింగ్  కు బయలుదేరితే ; ఇంగుష్ పహారా దళం సోంరినో స్టేషన్ కనిపిస్తున్న వైపుకి బయలుదేరింది, మిగిలిన వారు కూడా వస్తారని చూస్తూ ముందుకు సాగాయి. కానీ ఎక్కువ దళాలు డ్నోదగ్గరే ఆగిపోయాయి, కొన్నయితే స్టేషన్ వరకూ కూడా చేరుకోలేదు.

     ఆ ప్రాంతీయ విభాగపు కమాండర్ ప్రిన్స్ బగ్రాషన్ ,ఆ స్టేషన్ కి దగ్గరలోనే తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుని,మిగిలిన బృందాలు వస్తాయని వేచి చూస్తున్నాడు.

   ఉత్తర సరిహద్దు ప్రాంతపూ ముఖ్య కార్యాలయం నుండి అతనికి ఆగస్టు 28 న ఒక టెలిగ్రామ్ అందింది.దానిలో ఇలా ఉంది:  

    మూడవ దళ  మరియు డాన్, ఉస్సురి,కౌకాసియన్ లకు చెందిన మొదటి దళ కమాండర్లకు నేను విజ్ఞప్తి చేసేదేమిటంటే అనుకోని పరిస్థితుల వల్ల వెళ్ళే దారిలో రైళ్ల ప్రయాణానికి ఏవైనా ఆటంకాలు ఏర్పడితే, సుప్రీం కమాండర్ ఇన్ చీఫ్ వెంటనే ఆ దారి గుండా మార్చింగ్ చేస్తూ కొనసాగమని ఆజ్ఞ ఇచ్చారు. కనుక దాన్ని అనుసరించమని మనవి.

           27 ఆగస్ట్ ,1917, సంఖ్య 6411, రోమానోవ్ స్కీ.

        ఆ ఉదయం తొమ్మిది గంటలకు బగ్రాషన్ కొర్నీలోవ్ కి ఒక టెలిగ్రామ్ పంపించాడు. అందులో తనకి  ఆ ఉదయం 6.40 కి పెట్రోగ్రాడ్ సైన్య జిల్లా   ముఖ్య అధికారి కల్నల్ బాగ్రటుని నుండి  ఒక సందేశం వచ్చిందని,దానిలో కెరెన్ స్కీ ఉన్న అన్ని సైన్య విభాగాలను వెనక్కి మరలమని ఉందని, ఎందుకంటే ప్రొవిజినల్ ప్రభుత్వ ఆజ్ఞ వల్ల గాచ్కా,ఒర్దెజ్ మధ్య రైలు మార్గం సుగమం గా లేదన్నదే కారణమని చెప్పినట్టు రాసి పంపించాడు.

   కానీ అతనికి వచ్చిన టెలిగ్రామ్ లో, ‘ప్రిన్స్ బగ్రాషన్, రైల్వే గుండా ముందుకు కొనసాగండి. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే, లుగా ప్రాంతం వరకు మార్చింగ్ చేస్తూ అయినా సాగిపోండి.అక్కడ మీరు జనరల్ క్రిమోవ్ ఆధ్వర్యంలో పని చేస్తారు’,అని ఉంది.కానీ ఈ విషయాన్ని పట్టించుకోనట్టు దానికి విరుద్ధంగా అతను టెలిగ్రామ్ పంపించాడు.

   యెవజిని లిస్ట్ నిట్ స్కీ అంతకు పూర్వం పని చేసిన రెజిమెంటు, మొదటి డాన్ కొసాక్కు విభాగ రెజిమెంటుతో కలిసి పెట్రోగ్రాడ్ కు రెవెల్-వెజెన్ బర్గ్-నార్వా గుండా వెళ్తూ ఉంది. 28 వ తారీఖున సాయంత్రం ఐదు గంటలకు ఈ రెజిమెంటుకి చెందిన రెండు దళాల సైనికులను తీసుకువస్తున్న రైలు నార్వాకి వచ్చింది. ఆ రైలు అధికారికి అక్కడి నుండి ఆ రాత్రి  రైలు ముందుకు కదిలే పరిస్థితి లేదని ఎందుకంటే రైలు పట్టాలు తొలగించబడ్డాయని తెలిసింది. అప్పటికే రైల్వే అధికార వర్గం దాన్ని బాగు చేయడానికి మనుషులను పంపించింది. ఒకవేళ ఆ పని ఉదయానికి పూర్తైతే అప్పుడు రైలు ముందుకు కదులుతుంది. ఇక చేసేది లేక దానికి ఒప్పుకుని,ఆ రైలు అధికారి తిట్టుకుంటూనే,మరలా బండిలోకి ఎక్కి,మిగిలిన వారికి ఆ విషయాన్ని తెలియజేసి, విశ్రాంతి తీసుకున్నాడు.

   రాత్రయింది. సముద్రం నుండి చల్లటి గాలి వీస్తూ ఉంది. కొసాక్కులు రైలు పట్టాల దగ్గర,బండిలోనూ గుంపులుగా కూడి,చిన్నగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అసహనంగా ఉన్న గుర్రాలు సకిలిస్తూ ఉన్నాయి. రైలు వెనుక ఓ కుర్ర కొసాక్కు చీకటికి ఫిర్యాదు చేస్తున్నట్టు ఓ పాట అందుకున్నాడు:

    నాకు జన్మనిచ్చిన స్టానిట్సా కి వీడ్కోలు

 నా ప్రియమైన ప్రాంతవాసులకు వీడ్కోలు

ప్రేమను పంచే నా కుటుంబానికి వీడ్కోలు

మా పచ్చిక మైదానాల్లో పూసే గడ్డి పువ్వుకు వీడ్కోలు!

 అప్పుడు ఉదయం నుండి రాత్రి వరకు

ఆ ప్రేమ కౌగిలిలో ఉండేవాడిని

ఇప్పుడు ఉదయం నుండి రాత్రి దాకా

చేతిలో తుపాకీతో నిలబడుతున్నాను….

అక్కడ దగ్గర్లో ఉన్న వేర్ హౌస్ వెనుక నుండి ఒక మనిషి వచ్చాడు. అతను ఆ పాటను కొద్దిసేపు వింటూ ఉండిపోయి, తర్వాత ఆ రైలు పట్టాల దగ్గరకు ఒక దీపంతో వెళ్ళి, కాసేపు అక్కడ పరీక్షగా చూసి,తర్వాత మళ్ళీ రైలు దగ్గరకు వచ్చాడు. అతని అడుగుల శబ్దం వినిపిస్తూ ఉంది. అతను ఆఖరి బోగి దాటుతూ ఉంటే, తలుపు దగ్గర పాట పాడుతూ ఉన్న కొసాక్కు చీకట్లో ఆకారం చూస్తూ అరిచాడు.

  ‘ఎవరక్కడ?’

  ‘నీకు ఎవరు కావాలి?’ అంటూ ఓ నిరాశక్తపు సమాధానం వచ్చింది.

‘ఈ రాత్రి వేళ ఇక్కడ ఎందుకు తచ్చాడుతున్నావు? మేము దొంగలను కాల్చి పారేస్తాము. ఏదైనా కొట్టేయ్యడానికి చూస్తున్నావా?’

  ఏం సమాధానం ఇవ్వకుండా ఆ వ్యక్తి రైలులోని  మధ్యభాగం వైపుకి నడిచి, అక్కడ సగం తెరిచి ఉన్న తలుపుల సందులోంచి తన తల పెట్టి,’ఏ దళం?’ అని అడిగాడు.

  ‘నేరస్తుల దళం!’ ఒకడు ఆ చీకట్లో నవ్వుతూ అన్నాడు.

  ‘నవ్వులాట కాదు! ఏదో చెప్పండి.’

  ‘రెండవది.’

  ‘అయితే నాలుగవ దళం ఎక్కడ ఉంది?’

  ‘ఆరవ బోగి లో ఉంది.’

  అతను అక్కడకు వెళ్ళేసరికి ముగ్గురు కొసాక్కులు పొగ కాల్చుకుంటూ ఉన్నారు.అందులో ఒకడు కింద కూర్చుని ఉంటే, ఇద్దరు అతని పక్కన నిలబడి ఉన్నారు

ఆ ముగ్గురు మౌనంగా తమ వైపుకి వస్తున్న వ్యక్తిని చూస్తూ ఉన్నారు.

   ‘శుభ సాయంత్రం, కొసాక్కులారా!’

   ‘దేవుడికి స్తోత్రాలు!’, ఆ కొత్త వాడి ముఖం చూస్తూ వారిలో ఒకడు అన్నాడు.

   ‘నికితా దుగిన్ ఇక్కడ ఉన్నాడా?’

   ‘ఇక్కడే ఉన్నాను’, అక్కడ కూర్చుని ఉన్న వ్యక్తి కీచు గొంతుతో అంటూ, లేచి నిలబడుతూ, సిగరెట్ పీకను తన కాలితో నలిపేసాడు.

  ‘నిన్ను నేను గుర్తు పట్టలేకున్నాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు?’

అలా అంటూ అతను, ముందుకు వంగి, ఆ అపరిచితుడి వైపు చూశాడు. కోటు, పాడైపోయిన టోపీ ఉన్న ఆ వ్యక్తిని గుర్తు పట్టి, ఆశ్చర్యపోతూ,’ఇల్యా!బంచక్!ఏ దయ్యం ఇన్నాళ్ళు నిన్ను మాయం చేసింది?’ అన్నాడు.

   అతను వెంటనే రోమాలతో ఉన్న బంచక్ చేతిని గట్టిగా పట్టుకుని, ముందుకు వంగుతూ, నెమ్మదిగా అన్నాడు.’వీళ్ళు మన వాళ్ళే. నీకు ఏ భయం లేదు. అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అసలు ఏంటి విషయం?’

  బంచక్ మిగిలిన కొసాక్కులతో చేతులు కలిపి, ధ్రుడమైన స్వరంతో బదులిచ్చాడు.

  ‘నేను పెట్రోగ్రాడ్ నుండి వచ్చాను.నిన్ను కనుక్కోవడమే పెద్ద పనైపోయింది. ఒక పని చేయాల్సి ఉంది. మనం మాట్లాడుకోవాలి. మీరంతా ప్రాణాలతో ఆరోగ్యంగా ఉండటం చూడటం నాకు సంతోషంగా ఉంది.’

   అతను నవ్వాడు. ఆ నవ్వుతో అతని తెల్ల పళ్ళు, కళ్ళల్లో మెరుపు బయటపడ్డాయి.

  ‘మాట్లాడాలా? అంటే నువ్వు పెద్ద అధికారివి అయినా సరే, మేము నీ కన్నా తక్కువ అన్న భావన నీకు లేదన్న మాట. దానికి కృతజ్ఞతలు, ఇల్యా. దేవుడు సదా నీతో ఉండు గాక. అప్పుడప్పుడు దయతో కూడిన ఒక మాట, ఒక ఆత్మీయ కౌగిలి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది’, హాస్యంగా అన్నాడు దుగిన్.

   బంచక్ ఆ హాస్యానికి అదే ధ్వనిలో జవాబిచ్చాడు.

   ‘సరే, స్నేహితుడా!నీ గడ్డం మోకాళ్ళ వరకూ పెరిగినా ఇంకా నీలో చతురత పోలేదు.’

‘మనం క్షవరం ఎప్పుడైనా చేయించుకోవచ్చు కానీ నువ్వు అక్కడ పెట్రోగ్రాడ్ లో ఏం జరుగుతుందో చెప్పు. ఇంతకీ అక్కడ తిరుగుబాటు మొదలైందా?’

  ‘లోపలికి వెళ్దాం’, బంచక్ సూచించాడు. వాళ్ళు బండి లోపలికి వెళ్ళారు. దుగిన్ నిద్రపోతూ ఉన్న తన సహచరులను మెల్లగా లేపి, చిన్నగా అన్నాడు.

‘అందరూ లేవండి!మనకు ఈ సమయంలో అవసరమైన ఓ మనిషి మనల్ని చూడటానికి వచ్చారు. లేవండి, కాస్త ఉత్సాహంగా ఉండండి.’

  కొసాక్కులు పైకి లేచారు, గొంతులు సవరించుకున్నారు. అక్కడ ఉన్న ఓ గుర్రపు జీను మీద బంచక్ కూర్చున్నాడు. ఆ చీకట్లో పొగాకు, గుర్రపు చెమట వాసనతో ఉన్న ఎవరివో పెద్ద చేతులు అతని ముఖాన్ని తడిమాయి. గంభీరమైన  స్వరంతో, అతను గట్టిగా ‘బంచక్ నువ్వేనా?’అని అడిగాడు.

‘అవును. చికమాసోవ్ నువ్వేనా?’

 ‘హే, నేనే మిత్రుడా!’

  ‘హలో’

  ‘నేను వెళ్ళి వెంటనే మూడవ దళపు కుర్రాళ్ళను కూడా పిలుస్తాను.’

  ‘సరే. వెళ్ళి పిల్చుకురా!’

మూడవ దళంలో ఇద్దర్ని గుర్రాలని చూడటానికి ఉంచి, మిగిలిన వాళ్ళంతా వచ్చారు. కొసాక్కులందరూ బంచక్ చుట్టూ గుమిగూడి, అతని ముఖంలోకి లాంతరు వెలుతురులో చూస్తూ;’ఇల్యా మిత్రిచ్ ‘,’బంచక్’ లేదా ‘ఇలుషా’;అన్ని పేర్లతో పిలుస్తూ ఉన్నా ఆ పిలుపుల్లో ఆత్మీయత, స్నేహం మాత్రమే ఉంది.

    అప్పటికే బండి అంతా జనంతో నిండిపోయింది.ఆ బోగిల్లో ఆ ఆకారాల నీడలు నృత్యం చేస్తున్నట్టు ఉన్నాయి.

   వెలుతురు ఉన్న చోట వారు బంచక్ కూర్చోవడానికి వారు చోటిచ్చారు. ముందు వరసలో ఉన్న వారు మోకాళ్ళ మీద కూర్చుంటే, మిగిలిన వారు వెనుక వలయాకారంలో నిలుచున్నారు. దగిన్ గొంతు సవరించుకుని మాట్లాడటం మొదలుపెట్టాడు.’మాకు నీ ఉత్తరం అందింది, ఇల్యా ‘మిత్రిచ్, అది ఈ మధ్యే. కానీ అసలు విషయం నీ నోటి నుండే మేము వినాలనుకుంటున్నాము. అలాగే భవిష్యత్తులో మేమేం చేయాలో కూడా నువ్వే సలహా ఇవ్వాలి. నీకు తెలిసే ఉంటుంది, వారు మమ్మల్ని ఇప్పుడు రాజధానికి తీసుకువెళ్తున్నారు. మేము ఈ విషయంలో ఏం చేయాలి?’

     ‘ఇటు చూడు మిత్రిచ్’తలుపు దగ్గర నిలబడ్డ కొసాక్కు మొదలుపెట్టాడు.ఆ కొసాక్కు చెవికి పోగు ఉంది. అతన్నే గతంలో లిస్ట్ నిట్ స్కీ కందకాల్లో కవచాల మీద నీళ్లు వేడి చేసినందుకు తిట్టింది.’ఎంతో మంది ఉద్రేకంగా ఇక్కడకు వచ్చి పెట్రోగ్రాడ్ కు వెళ్లొద్దని చెప్తున్నారు. మీలో మీరు కొట్టుకోవాల్సిన అవసరం లేదు… ఇలాంటి విషయాలేవో చెప్తున్నారు. మేము వాళ్లు చెప్పేవి వింటున్నాము. కానీ ఎవరి మీద మాకు నమ్మకం లేదు. వాళ్ళంతా మాకు అపరచితులు.ఒకవేళ వాళ్ళు కూడా మమ్మల్ని ఎందులోనైనా ఇరికించే ఆలోచనలో ఉన్నారేమో, ఎవరికి తెలుసు?ఒకవేళ మేము ఎదురుతిరిగితే, కొర్నిలోవ్ తన సిర్కాసియన్లను మా మీదకు పంపిస్తాడు,ఇక అంతా రక్తపాతమే. కానీ నువ్వు మాలో ఒకడివి, మా కొసాక్కువి, నీ మీద మాకు నమ్మకం ఉంది. నువ్వు మాకు పెట్రోగ్రాడ్ నుండి ఉత్తరాలు, వార్తాపత్రికలు పంపిస్తున్నందుకు కృతజ్ఞతలు.నిజం చెప్పాలంటే, మాకు సిగరెట్లు చుట్టుకోవడానికి కాగితాలు లేనప్పుడే నువ్వు పంపిన పత్రికలు అందాయి…’

 ‘మూర్ఖుడా, ఏం వాగుతున్నావు రా?’ ఇంకో కొసాక్కు అతన్ని కోపంతో అడ్డుకున్నాడు.’నువ్వు చదవలేవు కాబట్టి మేము కూడా నీ లాగా చదువు లేని వాళ్ళం అనుకుంటున్నావా? ఏదో మేము ఆ పత్రికలను సిగరెట్ల కోసం వాడినట్టు చెబుతున్నావు. నిజంగా ఇల్యా మిత్రిచ్ మేము వాటిని పై నుండి కింద వరకూ అంతా చదివాము.’

‘పెద్ద చదివావులే!’

   ‘సిగరెట్ల కోసం అంటున్నాడు… ఇక వాడి మాటే వినాలి!’

 ‘వాడు ఒట్టి దద్దమ్మ.’

  ‘కొసాక్కులారా!నా ఉద్దేశం అది కాదు, ముందు చదివాము’, తనను తాను సమర్థించుకుంటూ అన్నాడు చెవి పోగు కొసాక్కు.

  ‘నువ్వు చదివావా?’

‘నేను పెద్దగా పుస్తకాలు చదవలేదన్నది నిజమే… కానీ నేను అనేది ఏమిటంటే మేము సిగరెట్లు చుట్టుకోవడానికి వాడే ముందు మొత్తం చదివే వాళ్ళం అని..’

  బంచక్ గుర్రపు జీను మీద కూర్చుని, మెల్లగా నవ్వుతూ, కొసాక్కుల వైపే చూస్తూ ఉన్నాడు. అక్కడ కూర్చుని మాట్లాడటానికి ఇబ్బందిగా ఉండటంతో, అతను తన వీపు దీపం వైపు ఉండేలా నిలుచుని, మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టాడు.

  ‘అసలు మీరు పెట్రోగ్రాడ్ లో చేయాల్సింది ఏమి లేదు. అసలు అక్కడ ఏ తిరుగుబాట్లు జరగడం లేదు. అసలు మిమ్మల్ని అక్కడికి ఎందుకు పంపిస్తున్నారో తెలుసా? ప్రొవిజినల్ ప్రభుత్వాన్ని  కూలదోయడానికి… అవును, అందుకే!మిమ్మల్ని అక్కడికి పంపిస్తుంది ఎవరు? జార్ మార్గం  అనుసరించే జనరల్ కొర్నిలోవ్. అసలు కెరెన్ స్కీ ని ఎందుకు దింపాలనుకుంటున్నాడు? ఎందుకంటే తానే సింహాసనం  అదిష్టించవచ్చని.ఒక్కసారి ఆలోచించుకోండి కొసాక్కులారా!మీ మెడలకు ఉన్న చెక్క గుదిబండను ఇప్పుడు తొలగించవచ్చు, కానీ తప్పక ఇంకొకటి తగిలిస్తారు. కాకపోతే ఉక్కుతో చేసింది పెడతారు అంతే.రెండు దయ్యాల మధ్య తక్కువ హాని కలిగించే దానిని ఎంచుకోవడమే మంచిది. అవునా? కాదా? కాబట్టి మీకు మీరే నిర్ణయించుకోండి. జార్ పాలనలో మిమ్మల్ని యుద్ధం పేరుతో పీల్చి పిప్పి చేసి వాళ్లే ప్రయోజనాలను అనుభవించారు. ఇప్పటికి కెరెన్ స్కీ అధికారంలోనూ అదే జరుగుతుంది, కాకపోతే మీకు కొంత ఊపిరి పీల్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు కెరెన్ స్కీ పాలన కొద్దిగా పర్లేదు, అదే కనుక బొల్షివిక్కులు అధికారంలోకి వస్తే ఎంతో మార్పు ఉంటుంది. బొల్షివిక్కులకు  యుద్ధం అవసరం లేదు. వాళ్ళకే అధికారం వస్తే, వెంటనే శాంతి కుదురుతుంది. నేను కెరెన్ స్కీ కి అనుకూలంగా ఏమి లేను, అతను దయ్యానికి సోదరుడు లాంటివాడు. వాళ్ళంతా ఓకే రకమైన వారు!’ బంచక్ నవ్వుతూ, తన ముఖానికి పట్టిన చెమటను కోటుతో తుడుచుకుంటూ కొనసాగించాడు.’కానీ శ్రామికుల రక్తం మీరు చిందించవద్దనే నేను మీకు చెప్పేది. ఒకవేళ కొర్నిలోవ్ అధికారంలోకి వస్తే, రష్యా కార్మికుల రక్తంతో  నిండిపోతుంది. అప్పుడు అధికారం అతని నుండి శ్రామికులకు దక్కించుకునే అవకాశమే ఉండదు.’

  ‘ఇల్యా మిత్రిచ్, ఒక్క నిమిషం ఆగు!’లావుగా ఉన్న ఒక కొసాక్కు  వెనుక వరస నుండి ముందుకు వస్తూ, గొంతు సవరించుకుని, తన పెద్ద చేతులు రుద్దుకుంటూ,లేత ఆకుపచ్చ రంగులో ఉన్న కళ్ళతో బంచక్ వైపు చూసి నవ్వుతూ, అడిగాడు.’నువ్వు ఇప్పుడు గుదిబండ గురించి చెప్పావు… ఒకవేళ బొల్షివిక్కులు  అధికారంలోకి వస్తే, దేనితో చేసిన గుదిబండ మన మెడలకు తగిలిస్తారు?’

  ‘ఏమిటి, మీకు మీరే గుదిబండలు తగిలించుకుంటారా?’

  ‘మాకు మేమే అంటే అర్థం ఏమిటి?’

  ‘సరే అయితే, బొల్షివిక్కుల పాలనలో, అధికారం ఎవరికి ఉంటుంది? నువ్వు ఎన్నుకోబడితే నీకే ఉంటుంది.లేకపోతే ఈ దుగిన్, లేకపోతే ఇంకొకరికి. అది ప్రజాస్వామ్య ప్రభుత్వం, అర్థమైందా?’

‘అయితే పైన ఎవరు ఉంటారు?’

 ‘అది కూడా ఎవరు ఎన్నుకోబడతారు అన్నదాని మీదే ఆధారపడి ఉంటుంది. నిన్ను ఎన్నుకుంటే, నువ్వే పైన ఉంటావు.’

  ‘అవునా? నువ్వు వేలాకోళం చేయడం లేదు కదా, మిత్రిచ్?’

  కొసాక్కులంతా ఒక్కసారిగా నవ్వుతూ, మాట్లాడసాగారు. ఆఖరికి. తలుపు దగ్గర రక్షణగా నిలబడిన సైనికుడు కూడా ఒక నిమిషం పాటు తన పని వదిలేసి వారితో కలిశాడు.

 ‘అయితే భూమి గురించి వారు ఏమంటున్నారు?’

  ‘వాళ్ళు మన దగ్గర నుండి లాక్కుంటారా?’

 ‘వాళ్ళు నిజంగా యుద్ధం ఆపేస్తారా? బహుశా మన ఓట్ల కోసం అలాంటి వాగ్దానాలు చేస్తున్నారేమో!’

  ‘నిజం చెప్పు.’

  ‘ఇప్పుడు అంధకారంలో ఉన్నాము.’

  ‘అసలు అపరిచితులను నమ్మే పరిస్థితి లేదు. ఎన్నో పుకార్లు

షికార్లు చేస్తున్నాయి.’

 నిన్న ఒక యాత్రికుడు ఎవరో ఇక్కడ మాకు తిరుగుతూ కనిపించాడు. వాడు కెరెన్ స్కీ కోసం బాధ పడుతూ ఉన్నాడు. వాడి జుట్టు పట్టుకుని, నాలుగు తగిలించాము.’

‘మీరంతా విప్లవ ద్రోహులు’, అంటూ అరిచాడు. పిచ్చివాడిలా ఉన్నాడు.’

  ‘వారి పెద్ద పెద్ద పదజాలాల అర్ధాలు మాకు తెలియవు.’

బంచక్ చుట్టూ చూస్తూ, కొసాక్కులని గమనిస్తూ, వారి ఆలోచనలను అర్థం చేసుకుంటూ, వారు కుదుట పడే వరకూ వేచి చూస్తూ ఉన్నాడు. అంతకుముందు వరకూ తను వచ్చిన పని విజయవంతం అవుతుందో లేదో అన్న సందేహం అతనికి ఉంది. కానీ ఇప్పుడు కొసాక్కులను చూసాక, ఏమి జరిగినా సరే, నార్వా దగ్గర రైలు ఆపగలనన్న నిశ్చయానికి వచ్చాడు.అంతకు ముందు రోజు ఎప్పుడైతే,అతను పెట్రోగ్రాడ్ జిల్లా పార్టీ కమిటీకి వెళ్ళి, పెట్రోగ్రాడ్ సమీపానికి వస్తున్న మొదటి కొసాక్కు విభాగాన్ని రాకుండా అడ్డుకోగలనని చెప్పినప్పుడు అతనికి ఎంతో నమ్మకం ఉంది. కానీ నార్వా వచ్చేసరికి అది కాస్త సన్నగిల్లింది. కొసాక్కులతో ఒక విభిన్న శైలిలో మాట్లాడాలని, కానీ తను అలా మాట్లాడలేనేమోనని అతను అనుకున్నాడు. తొమ్మిది నెలల నుండి అతను శ్రామికులతో కలిసిపోయాడు. అక్కడ వారితో ఉన్నప్పుడు చిన్నపాటి పదం నుండి కూడా అతనికి వారి గురించి పసిగట్టగలిగేవాడు. కానీ ఇప్పుడు తన సొంత వాళ్లతో మాత్రం, తను ఎప్పుడో సగం మర్చిపోయిన భాషలో, ఒప్పించే రీతిలో, కొన్ని శతాబ్దాలుగా స్థిరపడిపోయిన అపనమ్మకాన్ని పోగొట్టేలా, కొసాక్కులకు ధైర్యం, నమ్మకం కలిగేలా మాట్లాడాలి.వారు సరైన దారిలో ఉన్నారని వారికి అనిపించేలా చేయాలి. తర్వాత వారిని తన దారిలోకి తెచ్చుకోవాలి.

  మొదట అతను మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు, కొన్నిసార్లు తడబాటు ఉండటం అతనికే అర్ధమైపోయింది. తన బలహీనమైన వాదనలు అతనికే నచ్చలేదు, ఇంకా బలమైన పదాల కోసం అతను  వెతుక్కుంటూ ఉన్నాడు.

    అయినా అతను, తన మనసులో ఉన్న చిన్న చిన్న పదాలతోనే మాట్లాడగలిగాడు. అక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్న అతనికి చెమట పట్టి, శ్వాస కొంచెం కష్టమైంది. తను మాట్లాడుతుంది తనకే నిరాసక్తంగా అనిపించింది. ‘ఇక్కడ నాకు ఎంతో పెద్ద బాధ్యత అప్పగించారు, కానీ నేను దాన్ని సరిగ్గా వాడుకోలేకపోతున్నాను. అసలు సరైన మాటలే రావడం లేదు. నాకు ఏమైంది!నా స్థానంలో ఎవరున్నా నాకన్నా వెయ్యి రెట్లు బాగా మాట్లాడి ఉండేవారు…. ఎంత పెద్ద వైఫల్యం ఇది నాకు!’ అని తనలో తానే అనుకున్నాడు.

  గుదిబండ గురించి కొసాక్కు అడగటం వల్ల అతని మాటల్లో కూడా మార్పు వచ్చింది. ఏదో తెలియని శక్తి ఆవహించినట్టు, మాటల శైలి కూడా మారిపోయింది. బయటకు ప్రశాంతంగా కనిపిస్తున్నా, లోపల రగిలిపోతున్న అతను, ఒక గుర్రాన్ని మచ్చిక చేసుకున్నట్టు వారి ప్రశ్నలకు తగిన సమాధానాలు ఇవ్వసాగాడు.

   ‘సరే, చెప్పండి.రాజ్యాంగ సభతో మీకు ఉన్న సమస్య ఏమిటి?’

  ‘అసలు జర్మన్లే లెనిన్ ను ఇక్కడికి తీసుకువచ్చారు. అవునా, కాదా? లేకపోతే ఎక్కడి నుండి వచ్చాడు? ఏదైనా చెట్టు మీద నుండి ఊడి పడ్డాడా?’

   ‘మిత్రిచ్ ఇక్కడకు నువ్వు ఇష్టపూర్వకంగా వచ్చావా? లేక ఎవరైనా పంపితే వచ్చావా?’

‘డాన్ కొసాక్కుల భూములు ఎవరికి చెందబోతున్నాయి?’

‘నిజంగానే జార్ పాలనలో అంత బాధలు ఉన్నాయా?’

 ‘ఈ బొల్షివిక్కులు జనాల కోసమే కదా?’

  ‘మన కొసాక్కు సైన్య కౌన్సిల్ జనాల ప్రభుత్వమే. మాకు ఇప్పుడు ఈ కొత్తది ఎందుకు?’

  ఆ సమావేశం ముగిసేసరికి అర్ధరాత్రి అయ్యింది. తర్వాతి ఉదయం ఆ రెండు దళాలకు ఒక సమావేశం పెట్టాలని నిర్ణయం జరిగింది. బంచక్ ఆ రాత్రి బండిలోనే ఉండిపోయాడు. చికామాసోవ్ తన పక్కన పడుకోవడానికి చోటు ఇచ్చాడు. రాత్రి అతను ప్రార్ధన చేసుకునే ముందు, బంచక్ ను వారించాడు.

 ‘బహుశా నీకు మాతో కలిసి పడుకోవడానికి ఇబ్బంది ఉండకపోవచ్చు, ఇల్యా మిత్రిచ్.కానీ నువ్వు మమ్మల్ని క్షమించాలి. మాకు బోలెడు పేలు పట్టాయి తలలో. ఒకవేళ ఏవైనా నీ మీదకు పాకితే ఏమనుకోకు. అసలు ఇప్పుడున్న ఇబ్బందుల్లో వాటిని బాగా పెరగనిచ్చాము’, అంటూ కాసేపు ఆగాడు. తర్వాత,’ఇల్యా మిత్రిచ్, లెనిన్ ఏ జనానికి చెందిన వాడు? అంటే ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు?’అని అడిగాడు.

‘లెనినా? అతను రష్యావాడు.’

 ‘కాదే!’

‘లేదు ఇదే నిజం, అతను రష్యావాడు.’

 ‘లేదు, మిత్రమా!నీకు అతని గురించి పెద్దగా తెలియదనుకుంటా’, చికామాసోవ్ తనకు తెలుసన్న దర్పంతో కొనసాగించాడు. ‘అతని జాతి ఏంటో తెలుసా? మన జాతే. అతను మన డాన్ కొసాక్కే. సాల్ జిల్లాలో పుట్టాడు, వెలికోన్యాజేస్కాయా స్టానిట్సా వాడు. నీకు అర్ధమైందా? అతను ఆయుధ శాఖలో పని చేశాడని చెప్తుంటారు. అందుకే అతని ముఖం కూడా డాన్ కొసాక్కులానే ఉంటుంది. అతని కళ్ళు, ముఖం అచ్చం మన వాళ్ళవే.’

 ‘ఇదంతా నువ్వు ఎక్కడ విన్నావు?’

  ‘కొసాక్కులు వారిలో వారు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను.’

  ‘లేదు, చికామాసోవ్. అతను రష్యా వాడే, సింబిస్క్ ప్రావిన్స్ లో పుట్టాడు.’

  ‘నేను అది నమ్మను. ఎందుకో చెప్పనా? చాలా తేలికగా చెప్పొచ్చు. పుగాచోవ్ కొసాక్కు, అవునా? కాదా? అలాగే స్టెపన్ రాజిన్ కూడా. ఇక ఎర్మార్క్, అలాగే నువ్వు కూడా!జార్లకు వ్యతిరేకంగా పోరాడిన వారందరూ కొసాక్కులే. ఇప్పుడు నువ్వు అతను సింబర్క్ ప్రావిన్స్ వాడివి అంటావు. ఇది వినడానికే అవమానంగా ఉంది, ఇల్యా మిత్రిచ్.’

  ‘అంటే వాళ్ళు అతను కొసాక్కు అనే చెబుతున్నారన్నమాట’, బంచక్ నవ్వుతూ అన్నాడు.

‘అసలు అతను, ఇప్పటికి ఆ విషయం ప్రకటించడం లేదు అంతే!అయినా ఒక్కసారి నేను ఆ ముఖం చూస్తే, వెంటనే నేనే చూసి చెప్పేయ్యగలను అతను ఎవరో’, చికామాసోవ్ సిగరెట్టు వెలిగించి, గట్టిగా పొగ పీలుస్తూ, దగ్గుతూ అన్నాడు.’అయినా నాకు ఆశ్చర్యంగానే ఉంది. దీని గురించి మనం వాదనలోకి దిగామంటే. కానీ లెనిన్ మనలాంటి కొసాక్కు అయితే, అతనికి ఈ జ్ఞానం ఎలా వచ్చింది? వాళ్ళు ఏమంటారంటే యుద్ధం మొదలైన సమయంలో అతన్ని జర్మన్లు ఖైదు చేసారని,అక్కడ అతను చదువుకున్నాడని, ఎప్పుడైతే అతను శ్రామికులను తిరుగుబాటు చేసేలా చేశాడో, అక్కడున్న వారు భయపడిపోయారని,’ఒరేయ్, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే పో!’అని వారిలో పెద్ద తలకాయ చెప్పాడని, అలా అతన్ని రష్యాకు పంపించారని చెప్పుకుంటున్నారు. ఎంతైనా దమ్మున్నోడు’, ఆ చీకట్లో నవ్వుతూ అన్నాడు చికమాసోవ్.’మిత్రిచ్, నువ్వు అతన్ని చూడలేదు కదా? నిజంగా జాలి పడాల్సిన విషయం! అతనిది పెద్ద ముఖం అని చెప్పుకుంటున్నారు.’ అతను గొంతు సవరించుకుని, పొగ ఒక నాసిక నుండి పీల్చుకుంటూ, మళ్ళీ కొనసాగించాడు.’అసలు స్త్రీలు అలా ఉంటారు. అయినా అతను ఒక జారునే కాదు ఎంతమంది నైనా వణికిస్తాడు…..’, గట్టిగా గాలి పీల్చుకున్నాడు.’మిత్రిచ్, నాతో వాదించడం మంచిది కాదు. ఇతను తప్పక కొసాక్కే.. దాన్ని రహస్యంగా ఉంచడం ఎందుకు? సింబిస్క్ ప్రావిన్స్ లో అలా పెరగరు!’

   బంచక్ ఏమి మాట్లాడకుండా, నవ్వుతూ అలానే చాలాసేపు ఉండిపోయాడు.

అతనికి నిద్ర పట్టేసరికి చాలా సేపయ్యింది. అతని షర్టులోకి పాకిన కొన్ని పేలు దురద పెట్టాయి. అతని పక్కనే పడుకున్న చికాసామోవ్ నిట్టూరుస్తూ కాసేపు గోక్కుని, తర్వాత  నిద్రలోకి జారుకున్నాడు.  బంచక్ నిద్ర పోబోతుండగా, గుర్రాలు కొట్టుకుంటూ ఉంటే, వాటి డెక్కల శబ్దం, సకిలింపులు వినిపించసాగాయి.

   ‘దయ్యాల్లారా!ఆయ్.. ఆయ్!’నిద్రమత్తులో ఉన్న దుగిన్ స్వరంతో అంటూ,వాటి దగ్గరకు దూకి, తన చేతికి దొరికిన ఏదో బలమైన వస్తువుతో దగ్గరలో ఉన్న గుర్రాన్ని గట్టిగా తన్నాడు.

  అప్పటికే పేల బాధతో, మేలుకుని ఉన్న బంచక్ తర్వాతి రోజు సమావేశం గురించి ఆలోచించసాగాడు. అక్కడ ఉన్న అధికారులు నిరసన ఏ రూపాల్లో తెలియజేస్తారో ఊహిస్తూ, తనలో తానే నవ్వుకున్నాడు. కొసాక్కులు ఎదురుతిరిగితే, వాళ్లే తోక ముడుస్తారు, కానీ వారు తప్పక అలానే ఉంటారని అనుకోలేను.ఎందుకైనా మంచిది, గారిసన్ కమిటీకి తెలియజేస్తాను.అసంకల్పితంగానే అతను యుద్ధ సమయంలో అక్టోబర్ 1915 లో జరిగిన దాడి గుర్తుకు తెచ్చుకున్నాడు.ఆ జ్ఞాపకంతో ఆ మార్గంలో అతని మదిలో ముద్రించుకుపోయిన కొన్ని దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. ఆ ముఖాలు, కుళ్ళిపోయిన రష్యా,జర్మనీ సైనికుల మృతదేహాలు,ఏవో తెలియని స్వరాలు, సమయంతో పాటు కొంత రంగు,వాసన కోల్పోయిన ఆ జ్ఞాపకాలు ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టాయి. ఆయుధాల ధ్వనులు, ఫిరంగుల కాల్పులు,ఒకనాడు తను ప్రేమించిన స్త్రీ పెదవులు ,మళ్ళీ యుద్ధ జ్ఞాపకాల్లోని శవాలు ; అతని మనసంతా ఉక్కిరిబిక్కిరిగా ఉంది.

    బంచక్ అసహనంగా మోచేతి మీద లేచి,గట్టిగా అనుకున్నాడు. ‘ఈ జ్ఞాపకాలు నేను చచ్చేవరకు నన్ను వదిలిపోవు. నేనే కాదు యుద్ధంలో ప్రాణాలతో బయట పడిన ప్రతి వాడిని ఇలానే వేధిస్తాయి. ఇక జీవితం ధ్వంస చిత్రమైపోయింది.ఆఖరికి చావు కూడా యుద్ధంలో చేసిన పాపాలను కడగలేదు!’

     అతను 12 ఏళ్ల లుషాను కూడా జ్ఞాపకం తెచ్చుకున్నాడు. పెట్రోగ్రాడ్ లో ఓ కర్మాగారంలో పని చేసే కార్మికుడి కూతురు ఆ పిల్ల, యుద్ధంలో చంపేశారు. ఆమె తండ్రి బంచక్ మిత్రుడు. ఇద్దరూ కలిసి టులాలో కలిసి పని చేశారు. ఒక రోజు సాయంత్రం ఒక వీధి దగ్గరలో ఆమె అతనికి కనిపించింది. ఒక బెంచి మీద కూర్చుని ఉంది.ఆమె సన్నటి కాళ్ళు రెండు దూరంగా పెట్టుకుంది. రెండు పెదాల మధ్య సిగరెట్టు ఉంది. ఆమె ముఖంలో అలసట,ఆమె పెదవుల్లో జీవితపు ఛాయల విషాదం కనిపిస్తున్నాయి. ‘ఇల్యా మావయ్య,నువ్వు నన్ను మర్చిపోయావా?’తన వృత్తి నేర్పిన నవ్వుతో అడిగింది. ఆ తర్వాత చిన్న పిల్లలా అతని దగ్గరకు వచ్చి భుజం మీద తల ఆనించి ఏడ్చింది.

     ఇప్పుడు మంచం మీద ఉండి, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఏదో విషయపు వాయువు గుండెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు అస్థిమితంగా అనిపించింది బంచక్ కు. అతని ముఖం పాలిపోయింది. చాలాసేపటి వరకు అతను గుండెల మీద రుద్దుకుంటూ ఉన్నాడు. అతని పెదవులు కూడా వణుకుతున్నాయి.ఆ జ్ఞాపకాల వల్ల కలిగిన ద్వేషం,కోపం వల్ల ఛాతికి ఎడమవైపున అతనికి నొప్పి వచ్చిన భావన కలిగింది.

   అతను ఉదయం వరకు నిద్రే పోలేదు. ఆ రోజు నిద్ర లేచాక అతను క్రితం రోజు కన్నా స్థిమితంతో రైల్వే సిబ్బంది కమిటీకి వెళ్ళి,వారితో కొసాక్కుల రైలు నార్వా దాటకుండా ఉండేలా ఒప్పించి వచ్చాడు. ఒక గంట తర్వాత అతను గారిసన్ కమిటీ సభ్యులను వెతుక్కుంటూ బయల్దేరాడు. అతను రైలు దగ్గరకు వచ్చేసరికి ఏడు దాటింది. ఆ ఉదయపు చల్లదనం అతని శరీరంలోని అనువణువును స్పృశిస్తూ ఉంటే,అతను దాన్ని ఆస్వాదిస్తూ, తను వచ్చిన పని విజయవంతం కాబోతుందన్న ఊహాతో సంతోషంగా ఉన్నాడు. సూర్య కిరణాలను చూస్తూ, దూరంగా వినవస్తున్న ఓ స్త్రీ స్వరాన్ని వింటూ నడుస్తున్నాడు. ఉదయం కాకముందు ఓ చిన్నపాటి వర్షపు జల్లు కురిసింది. రైలు పట్టాల మధ్య ఉండే ఇసుక నేల ఆ వానకు తడిసి ఉంది. ఇప్పటికీ ఆ మట్టి నుండి వాన వాసన గుభాలిస్తూ ఉంది.

    బురద అంటి ఉన్న బూట్లతో ఒక అధికారి రైలు పక్కగా వస్తూ ఉండటం బంచక్ గమనించాడు. బంచక్ అతన్ని మేజర్ కాల్మికోవ్ గా గుర్తించి, వెంటనే తన అడుగుల వేగాన్ని తగ్గించాడు. వారు ఒకరికి ఒకరు దగ్గరకు వచ్చేసరికి కాల్మికోవ్ ఆగాడు.అతని కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తూ ఉంది.

   ‘కార్నెట్ బంచక్? ఇంకా నువ్వు  ఇలా తిరుగుతూనే ఉన్నావా? క్షమించు,నేను నీ లాంటి వారికి షేక్ హ్యాండ్ ఇవ్వను.’

    పెదవులు కొరుక్కుంటూ, తన చేతులను కోటు జేబులో పెట్టుకుంటూ అన్నాడు.

   ‘నీకు నా చేతిని అందించే ఉద్దేశం నాకు కూడా లేదు. నువ్వు కాస్త తొందరపడి ముందే మాట్లాడావు’బంచక్ ఘాటుగా బదులిచ్చాడు.

    ‘ఇక్కడ ఏం చేస్తున్నావు? ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నావా? లేకపోతే పెట్రోగ్రాడ్ నుండి మన స్నేహితుడు కెరెన్ స్కీ నుండి వచ్చావా?

  ‘ఏంటి ఇది -ఇంటరాగేషనా?’

    ‘కర్తవ్య విధుల నుండి పారిపోయిన తోటి ఆధికారి పట్ల న్యాయమైన ఆసక్తి మాత్రమే.’

   ‘ఒక విషయంలో మాత్రం నేను హామీ ఇవ్వగలను. నేను కెరెన్ స్కీ నుండి అయితే రావడం లేదు’, భుజాలు ఎగరేస్తూ అన్నాడు బంచక్.

  ‘కానీ ఇప్పుడు సంభవిస్తున్న ప్రమాదాలకు కారణమైన వారితో నీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా? సరే అసలు నువ్వు ఏంటి? సైనికుడు వేసుకునే  బట్టలు లేవు నీ ఒంటి మీద…’ నాసికలు చిట్లిస్తూ, బంచక్ ఆకారాన్ని పరీక్షగా చూస్తూ, ‘అయితే నువ్వు రాజకీయ పార్టీల సిద్ధాంతాలకు పని చేస్తూ తిరుగుతున్నావా? అంతేనా?’ అంటూ ఏ సమాధానం కోసం ఎదురు చూడకుండా వెనక్కి తిరిగి వేగంగా వెళ్లిపోయాడు.

    దగిన్ బండి బయట బంచక్ కోసం చూస్తూ నిలబడి ఉన్నాడు.

  ‘నువ్వు ఎక్కడికి వెళ్ళావు ?ఇప్పటికే సమావేశం మొదలైపోయింది!’

   ‘అప్పుడేనా ?’

    ‘అవును. మా దళపు కమాండర్ మేజర్ కాల్మికోవ్ ఇన్నాళ్ళు లేడు, ఈ రోజే వచ్చాడు. ఆయన పెట్రో గ్రాడ్ నుండి వచ్చాక కొసాక్కుల సమావేశం ఏర్పాటు చేశాడు. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు.’

  బంచక్ కాల్మికోవ్ ఎన్నాళ్ళు పెట్రోగ్రాడ్ లో ఉన్నాడో అడిగాడు. దుగిన్ కి తెలిసిన మేరకు, ఓ నెల అని చెప్పాడు.

   ‘విప్లవాన్ని అణగదొక్కడానికి కొర్నిలోవ్ పెట్రోగ్రాడ్ కు ఏదో మిష మీద పంపించి ఉంటాడు.కొర్నిలవ్ అనుచరుడే అయ్యి ఉంటాడు’, బంచక్ తనలో తానే అనుకుంటూ దగిన్ తో కలిసి సమావేశానికి వెళ్ళాడు.

 ఆ ఇద్దరూ వేర్ హౌస్ కి వెళ్ళేసరికి అక్కడ వలయాకారంలో నిలబడి ఉన్న కొసాక్కులు కనిపించారు.

ఒక డ్రమ్ములాంటి దాని మీద నిలబడి ఉన్నాడు కాల్మికోవ్. అతని చుట్టూ అధికారులు ఉన్నారు. ఆవేశంగా మాట్లాడుతున్నాడు.

  ‘… ఈ యుద్ధంలో విజయం సాధించేవరకు మనం విశ్రమించకూడదు.మన మీద ఉన్న నమ్మకాన్ని మనం నిజం చేయాలి. ఇప్పుడు నేను కొసాక్కుల కోసం జనరల్ కార్నిలోవ్ పంపిన టెలిగ్రామ్ చదువుతాను.’

  వెంటనే కంగారుగా తన కోటు పక్క జేబులో నలిగిపోయి ఉన్న ఓ కాగితాన్ని బయటకు తీసి, ఆ ప్రాంతపు రైలు విభాగ అధికారితో గుసగుసలాడాడు.

   బంచక్, దగిన్ ముందుకు వచ్చి కొసాక్కులతో కలిసిపోయారు.

  ‘ప్రియమైన కొసాక్కులారా!’కాల్మికోవ్ ఉద్రిక్తతతో మొదలు పెట్టాడు.’మీ పూర్వికుల ఎముకల కష్టం మీద కాదా  నేడు అభివృద్ధి చెందుతున్న రష్యా నిర్మించబడింది? మీ ధైర్యం, అసమాన త్యాగాల వల్ల కాదా ఈ రష్యా బలపడింది?డాన్  బిడ్డలైన మీరు కుబాన్, ఉరల్, ఒరేన్ బర్గ్, అష్ట్రాఖాన్, సెమిరియచి వీరుల్లా నిలబడి దేశ రక్షణకు ఎప్పుడు ముందున్నారు!మీ నాన్నలు, తాతలు చేసిన త్యాగాలే రష్యా ప్రగతికి కారణం. ఇప్పుడు మాతృభూమి కోసం అందరూ ఏకం కావాల్సిన సమయం వచ్చింది.

            సమర్థత లేకుండా వ్యవహరిస్తున్న ప్రొవిజినల్ ప్రభుత్వం  వలనే జర్మన్లు ఇప్పుడు మన దేశంలో తిరగగలుగుతున్నారు. దీనికి నిదర్శనమే కజాన్ లో జరిగిన పేలుడు. అందులో దాదాపు 12,000 ఆయుధాలు నాశనమయ్యాయి. ఇంకా చెప్పేది ఏమిటంటే ప్రభుత్వంలో ఉన్న కొందరు దేశద్రోహానికి పాల్పడుతున్నారు. దానికి నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి.నేను ఆగస్టు 3 న శీతకాలపు భవనంలో జరిగిన సమావేశానికి వెళ్లినప్పుడు కేరెన్ స్కీ, సావిన్ కొవ్ నన్ను అక్కడ కొందరిని నమ్మలేకుండా ఉన్నందువల్ల అంతర్గత విషయాలు ఎక్కువ మాట్లాడొద్దని వారించారు. అటువంటి అసమర్థ ప్రభుత్వం దేశాన్ని నాశనం వైపే నడిపిస్తుందన్నది స్పష్టమైపోయిన విషయమే. కనుక ఆ ప్రభుత్వాన్ని నమ్మకూడదు. అలాంటి ప్రభుత్వ నాయకత్వంలో రష్యాకి విముక్తి ఉండదు. అంతే కాదు, ఇదే ప్రొవిజినల్ ప్రభుత్వం ,నా శత్రువుల కోరికను తీర్చడానికి నన్ను నా పదవి నుండి తప్పుకోమని ఆదేశించింది. నా రష్యా యుద్ధ భూమిలో మరణించడమే నాకు ఉత్తమమైన మార్గంగా కనిపించి,ఆ ఆదేశాన్ని తిరస్కరించాలనిపించింది. కొసాక్కులారా,రష్యా వీరులారా!మీరంతా మాతృభూమి కోసం అవసరమైనప్పుడు నాకు తోడుగా ఉంటానని ప్రమాణం చేశారు. ఆ సందర్భం రానే వచ్చింది -ఇప్పుడు మన మాతృభూమి కోసం మనం ఒకటిగా ఉండాలి. నేను ప్రొవిజినల్ ప్రభుత్వ ఆదేశాలకు తల ఒగ్గను,రష్యా విముక్తి కోసం అవసరమైతే దాన్నే ఎదిరించి నిలబడతాను. కొసాక్కులారా, మీ వీరత్వాన్ని ప్రదర్శించవలసిన సమయం వచ్చింది. విప్లవంతో వచ్చిన స్వాతంత్ర్యాన్ని మనం పరతంత్రం చేయకూడదు. కనుక క్రాంశిక్షణతో వ్యవహరిస్తూ నా ఆజ్ఞలు పాటించండి. ఆగస్టు 28,1917. సుప్రీం కమాండర్ ఇన్ చీఫ్ ,కార్నిలోవ్.’

     కాల్మికోవ్ అంతా చదివాక కాసేపు ఆగు,ఆ కాగితాన్ని మడత పెడుతూ, గట్టిగా అరిచాడు. ‘కేరెన్ స్కీ  మరియు బొల్షివిక్కుల తొత్తులు మనం ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడానికి రైళ్లను కదలనీయడం లేదు.ఒకవేళ మనం రైలు ద్వారా ముందుకు వెళ్ళే అవకాశం లేకపోతే గుర్రం మీద అయినా సరే పెట్రోగ్రాడ్ కు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలి. ఈ రోజే మనం బయల్దేరదాము. మీ అందరూ సిద్ధంగా ఉండండి!’

  బంచక్ అధికారుల దగ్గరకి పోకుండా జనం మధ్యలోకి నడిచి, ఆత్మవిశ్వాసంతో తను చెప్పదలచుకున్నది కూడా చెప్పాడు:  

         ‘కామ్రేడ్ కొసాక్కులారా! పెట్రోగ్రాడ్ లోని శ్రామికులు,కార్మికులు నన్ను మీ దగ్గరకు పంపించారు. మీరు ఇప్పుడు యుద్ధం చేయబోతున్నది మీ సోదరులపైనే,అది కూడా విప్లవాన్ని అణచివేయడానికి. మీరు మీ సోదరులకు వ్యతిరేకంగా మళ్ళీ రాచరిక వ్యవస్థనే అధికారంలోకి తీసుకురావాలనుకుంటే,యుద్ధానికి బయల్దేరండి, మీరు చచ్చే వరకో లేక అంగవైకల్యంతో మిగిలిపోయేవరకో ఆ రక్తపాతంలోనే ఉండిపోండి! కానీ పెట్రోగ్రాడ్ శ్రామికులు ,సైనికులు మీరు అలా చేయరనే  భావిస్తున్నారు. వారు మిమ్మల్ని తమ సోదరులుగా భావిస్తున్నారు. వారు మీ స్నేహాన్ని స్వాగతిస్తున్నారు తప్ప మీతో శతృత్వాన్ని కాదు. .’

     అతన్ని పూర్తిగా మాట్లాడనివ్వలేదు. అప్పటికే ఆమోద పూర్వక అరుపులు మొదలయ్యాయి. ఆ అరుపులతో తను నిలబడి ఉన్న డ్రమ్ము మీద నుండి కిందకు దిగాడు కాల్మికోవ్. వెంటనే బంచక్ దగ్గరకు నడిచాడు.

   ‘కొసాక్కులారా! పోయిన సంవత్సరం కార్నెట్ బంచక్ యుద్ధ సరిహద్దు నుండి పారిపోయాడన్న విషయం మీ అందరికి తెలుసు. ఇటువంటి పిరికివాడు,దేశద్రోహి అయిన వాడి మాటలు మనం వినాలా?’

  ఆరవ దళ కమాండర్ లూయీటెంట్ కల్నల్ సుకిన్,తన గంభీరమైన కంఠంతో కాల్మికోవ్ మాటల్ని అందుకున్నట్టు, ‘ఆ వెధవను అరెస్ట్ చేయండి! మనం దేశం కోసం ఇక్కడ రక్తం చిందిస్తుంటే వాడు వెన్నుపోటు పొడుస్తున్నాడు. పట్టుకోండి వాడిని!’

  ‘మేము అది హడావుడిగా చేయాల్సిన అవసరం లేదు.’

  ‘అతను చెప్పేది చెప్పనివ్వండి.’

   ‘ఎందుకు ఇంకో మనిషి నోరు నొక్కడం! అతన్ని కూడా మాట్లాడనివ్వండి!’

   ‘అరెస్ట్ చేయండి!’

  ‘మనకు పిరికివాళ్లు అవసరం లేదు.’

  ‘బంచక్ ,మాట్లాడు!’

  ‘మిత్రిచ్ ! నీ మాటలతో వారికి సరైన బదులు చెప్పు.’

  ‘వాళ్ళ నోళ్ళు మూతబడాలి.’

  ‘నువ్వు నోర్ముయ్ ,మూర్ఖుడా!’

  ‘మాట్లాడు బంచక్! నువ్వు మాట్లాడితే వాళ్ళు నోరు మూసుకోవాలి!’

  నెత్తి మీద టోపీ లేకుండా ఉన్న ఓ పొడుగైన కొసాక్కు, డ్రమ్ము మీదకు ఎక్కాడు.అతను ఆ రెజిమెంటు విప్లవ కమిటీ సభ్యుడు. కొసాక్కులను జనరల్ కొర్నిలోవ్ కి మద్ధతు ఇవ్వవద్దని, అతను విప్లవాన్ని ఉక్కు పాదాలతో అంతం చేయాలని చూస్తున్నాడని చెప్పి ; దానికి కొనసాగింపుగా సొంత ప్రజల మీదే యుద్ధం చేస్తే వచ్చే పరిణామాల గురించి కూడా మాట్లాడి, తన తర్వాత బంచక్ ను మాట్లాడమని కోరాడు.

  ‘మేము నిన్ను ఈ అధికారుల్లా నమ్మడం లేదని నువ్వు అనుకోవద్దు,కామ్రేడ్! నిన్ను చూడటం మా అందరికి సంతోషంగా ఉంది.అలాగే నువ్వు ప్రజల ప్రతినిధిగా రావడం హర్షనీయం. అలాగే నువ్వు అధికారిగా ఉన్నప్పుడూ కూడా మా మీద జులుం చేయకుండా మాతో సోదరుడిగా ఉన్నందుకు నిన్ను మేము గౌరవిస్తున్నాము. నీ నుండి ఒక పరుష పదం కూడా మేము వినలేదు. చదువులేని వాళ్ళమైన మాకు ఈ నాగరిక పద్ధతులు తెలియకపోవచ్చు. కానీ దయ మాత్రం అర్ధమవుతుంది. మాకు నీ మీద ఎంతో గౌరవం ఉంది,ఆ గౌరవంతోనే మేము నిన్ను అడిగేది ఏమిటంటే పెట్రోగ్రాడ్ శ్రామికులకు,సైనికులకు మేము వారికి మిత్రులమే అని తెలియజేయి.’

   ఒక్కసారిగా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ కొసాక్కు సైనికులు గట్టిగా అరిచారు. తర్వాత ఆ ధ్వని  మెల్లగా తగ్గిపోయింది.

  కాల్మికోవ్ మరలా డ్రమ్ము మీదకు ఎక్కాడు. అతని ముఖం పాలిపోయింది. మాటల కోసం తడబడుతున్నాడు. డాన్ పూర్వం నుండి ఎలా దేశం కోసం ఎన్ని త్యాగాలు చేసిందో, కొసాక్కుల వీరత్వ చరిత్ర ఏమిటో మరలా చెప్తూ తన వైపుకి ఆకర్షించే ప్రయత్నం చేశాడు.

  అతని తర్వాత ఒక కొసాక్కు అధికారి మాట్లాడాడు. అతను ఎప్పుడైతే బంచక్ కు వ్యతిరేకంగా మాట్లాడాడో అప్పుడే అతన్ని కొందరు కొసాక్కులు అడ్డుకుని కిందకు లాగేశారు. చికామాసోవ్ డ్రమ్ము మీదకు ఎక్కాడు.’మేము వెళ్ళము!అసలు రైలు దిగి కిందకే రాము! ఆ టెలిగ్రామ్ లో కొసాక్కులు కొర్నిలోవ్ కు సాయం చేస్తామని ప్రమాణం చేసినట్టు చెప్పారు. కానీ మనలో ఎవరినైనా అడిగారా దాని గురించి? మేము అతనికి ఏ మాట ఇవ్వలేదు. కొసాక్కు యూనియన్ అధికారులు ఆ మాట ఇచ్చారు! గ్రీకోవ్ చేశాడు ఇదంతా,కనుక అతన్నే ఆ సాయం చేయనివ్వండి!’

    ఎంతోమంది మాట్లాడటానికి ముందుకు వచ్చారు. బంచక్ తన తల ముందుకు వంచి నిలబడి జరిగేది చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు అతని ముఖంలో ఒక కొత్త మెరుపు ఉంది. ఇప్పుడు అక్కడ వాతావరణం అంతా ఉద్రిక్తంగా ఉంది. ఒక చిన్న మూర్ఖపు పని చాలు, అంతా రక్తపాతంగా మారడానికి.

    గారిసన్ నుండి సైనికులు స్టేషన్ కు వచ్చారు.అధికారులు ఆ సమావేశం వదిలి వెళ్ళిపోయారు.

   ఒక అరగంట తర్వాత దగిన్ రొప్పుకుంటూ బంచక్ దగ్గరకు వచ్చాడు.

  ‘ మిత్రిచ్! ఇప్పుడు ఏం చేద్దాం? కాల్మికోవ్ ఏదో చేయబోతున్నాడు. ఇప్పుడే మెషీన్ గన్స్ తెప్పించారు. అలాగే వార్తాహకులను కూడా ఎక్కడికో పంపించారు.’

  ‘అయితే పద! వెంటనే ఇరవై మంది కొసాక్కులను నీతో తీసుకురా! ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా!’

   రైలు అధికారి కోసం ఉన్న బండిలో నుండి కాల్మికోవ్, ఇంకో ముగ్గురు అధికారులు గుర్రాల మీదకు మెషీన్ గన్స్ దింపుతున్నారు. బంచక్ ముందు అక్కడకు చేరుకున్నాడు. అతను అక్కడ ఉన్న కొసాక్కుల వైపు చూస్తూ, తన కోటులో ఉన్న రివాల్వర్ ను బయటకు తీశాడు.

   ‘కాల్మికోవ్ ! మర్యాదగా చేతులు పైకెత్తు! ఇప్పుడు నువ్వు ఖైదు కాబోతున్నావు!’

  కాల్మికోవ్ వెంటనే వెనక్కి తిరిగి తన రివాల్వర్ దగ్గరకు చెయ్యి తీసుకువెళ్ళబోయాడు. అతను అది తీయకముందే బంచక్ అతని తల పై నుండి పోయేలా ఒక తూటా పేల్చాడు. ‘మర్యాదగా చేతులు పైకెత్తు!’బంచక్ మళ్ళీ అన్నాడు.

  తనకు సూటిగా గురి పెట్టబడ్డ ఆ రివాల్వర్ వైపు చూస్తూ, భయంతో కాల్మికోవ్ చేతులు పైకెత్తాడు.

   మిగిలిన అధికారులు చేసేదేమి లేక తమ ఆయుధాలు కూడా స్వాధీనం చేశారు.

  ‘మా ఖడ్గాలు కూడా ఇవ్వాలా?’ఆయుధ శాఖ లో ఉన్న ఓ సైనికుడు అడిగాడు.  

  ‘అవును.’

   కొసాక్కులు ఆ గుర్రాల మీదకు ఎక్కించిన ఆయుధాలను తమ బండిలోకి చేర్చారు.

  ‘వీటిని జాగ్రత్తగా చూస్తూ ఉండండి’,బంచక్ దగిన్ తో చెప్పాడు. ‘చికామాసోవ్ మిగిలిన వారిని కూడా బంధించి,ఇక్కడికే తీసుకువస్తాడు. చికమాసోవ్,నీకు వినబడుతోందా? మనం ఇప్పుడు కాల్మికోవ్ ను గారిసన్ విప్లవ కమిటీ దగ్గరకు తీసుకువెళ్దాము. మేజర్ కాల్మికోవ్,దయ చేసి ముందుకు కదలండి!’

  ‘భలే చేశాడు!’ ఒక కొసాక్కు అధికారి బండిలోకి వెళ్తూ, ఖైదు చేసిన వారిని దగిన్ తో కలిసి తీసుకువెళ్తున్న బంచక్ ను చూస్తూ అన్నాడు.

  ‘ఇది నిజంగా సిగ్గు పడాల్సిన విషయం. మనం చిన్న పిల్లల్లా ప్రవర్తించాము. మనలో ఎవరికి ఏ వెధవను కాల్చి పారేసే ధైర్యం లేకపోయింది. వాడు తన రివాల్వర్ ను కాల్మికోవ్ కు గురి పెట్టినప్పుడే మనం ఏదో ఒకటి చేస్తే ఇక్కడి వరకు వచ్చి ఉండేది కాదు!’ లూయీటెంట్ కల్నల్ సుకిన్ మిగిలిన అధికారుల వైపు చూస్తూ, వణుకుతున్న చేత్తో సిగరెట్ పెట్టె లో నుండి ఒకటి తీసుకుంటూ అన్నాడు.

   ‘కానీ అక్కడ వాళ్ళ వాళ్ళు అందరూ ఉన్నారు.మనం అలా చేసి ఉంటే అక్కడే చంపేసేవాళ్ళు’,ఆయుధాల శాఖలో ఉన్న సైనికుడు అన్నాడు.

   అక్కడ బందీలుగా ఉన్న అధికారులు పొగ కాల్చుకుంటూ ఉన్నారు. ఊహించని రీతిలో వేగంగా జరిగిపోయినదాన్ని వారు ఇంకా జీర్ణించుకోలేకుండా ఉన్నారు. 

  కాసేపు కాల్మికోవ్ తన పెదాలు కొరుక్కుంటూ ఏమి మాట్లాడకుండా ముందుకు నడిచాడు. అతని ఎడమ బుగ్గ ఎవరో చెంప దెబ్బ కొట్టినట్టు ఎర్రగా కందిపోయింది. వారిని దాటి వెళ్తున్న ఆ ప్రాంతపు ప్రజలు మధ్యలో ఆగి వింతగా చూస్తూ, గుసగుసలాడుకుంటున్నారు. అప్పటికే ఆకాశంలో సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు.వృక్షాల నుండి రాలి పడిన ఆకులు రైలు పట్టాల మీద పడి ఉన్నాయి. అక్కడ దగ్గర చర్చి గోపురం చుట్టూ పక్షులు తిరుగుతూ ఉన్నాయి. ఆ స్టేషన్ వెనుక దూరంలో ఉన్న పొలాలలో అప్పటికే చీకటి పడిపోయింది. కానీ నారా నుండి స్కోవ్,ల్యుగా మార్గంలో మాత్రం ఇంకా సాయంత్రపు ఛాయలే ఉన్నాయి.ల

    స్టేషన్ దగ్గర కాల్మికోవ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి బంచక్ ముఖం మీద ఉమ్మేశాడు.

    ‘వెధవ!’

      బంచక్ దాన్ని తుడుచుకున్నాడు,అతని కళ్ళు పెద్దవయ్యాయి. తన జేబులోకి తీసుకుపోబోయిన చేతిని అతికష్టం మీద నిలిపాడు.

   ‘ముందుకు నడవండి !’ అతికష్టం మీద అనగలిగాడు.

 కాల్మికోవ్ బండ బూతులు తిడుతూ నడుస్తున్నాడు. కోపం ,భయం ,అధికారినన్న అహంకారం అన్నీ కలిపి అతన్ని అసహ్య పదజాలం మాట్లాడేలా చేస్తున్నాయి.

‘నువ్వు ఒక ద్రోహివి! దేశద్రోహివి! నువ్వు దీనికి తప్పక అనుభవిస్తావు! ;, మధ్యమధ్యలో ఆగిపోతూ, బంచక్ వైపు తిరిగి అరుస్తూ అన్నాడు.

  ‘ఇక చాలు …ముందుకు నడవండి…’ఓపికగా అన్నాడు బంచక్.

   కాల్మికోవ్ తన పిడికిలి బిగిస్తూ, కోపంతో అడుగులు వేస్తున్నాడు. వాళ్ళు వాటర్ టవర్ దగ్గరకు వచ్చారు. పళ్ళు కొరుకుతూ, కాల్మికోవ్ గట్టిగా అరిచాడు. ‘నువ్వేమి గొప్ప పని చేయడం లేదు. నువ్వు సమాజానికి పట్టిన చీడ పురుగువి. మీ నాయకుడు ఎవరు! ఆ జర్మనీ వాళ్లే కదా! బొల్షివిక్కులను పిలుచుకుంటూ ఉంటారు. పనికిమాలిన వాళ్ళు! మీ కన్నా వేశ్యలు నయం! నువు దేశాన్నే అమ్ముకుంటున్నావు! ఒక్క వేటుతో నీ తల తీస్తాను. ఆ సమయం వస్తుంది …..అదే మీ లెనిన్ -రష్యాను ముప్పై జర్మనీ మార్క్స్ కు అమ్మలేదా? తెలివిగా తప్పించుకున్నాడు ..గుంట నక్క!’

   ‘మర్యాదగా ఆ గోడకు ఆనుకుని నిలబడండి !’ బంచక్ తనను తాను సంభాళించుకుంటూ అన్నాడు.

   దుగిన్ భయంతో చూస్తున్నాడు.

   ‘ఇల్యా!ఆగు …నువ్వు ఏం చేయబోతున్నావు?ఆగు!’

    కోపంతో ముఖం ఎర్రబడిన బంచక్ కాల్మికోవ్ గుండెల మీద గట్టిగా గుద్దాడు. అప్పటికే కాల్మికోవ్ టోపీ కిందకి జారిపోయింది. దాన్ని గట్టిగా తొక్కుతూ, అతన్ని అక్కడ ఉన్న వాటర్ టవర్ రాళ్ళ గోడ దగ్గరకు ఈడ్చుకుంటూ వెళ్ళాడు.

   ‘ఇక్కడే నిలబడు!’

     ‘నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా?నీకు ఎంత ధైర్యం ! నన్నే కొడతావా?’ కాల్మికోవ్ ఉరుముతున్నట్టు అన్నాడు.

    తనను గోడ దగ్గర  నిలబెట్టినప్పుడు కాల్మికోవ్ కి అర్థమైంది.

   ‘అంటే నువ్వు నన్ను చంపబోతున్నావా?’

    బంచక్ తన రివాల్వర్ కోసం కోటు జేబులో చేయి పెట్టాడు. ఆ రివాల్వర్ ఒక దారపు పొగుతో చిక్కుపడింది.

   కాల్మికోవ్ ముందుకు అడుగు వేసి, తన కోటు బొత్తాలు వేగంగా పెట్టుకున్నాడు.

   ‘అయితే కాల్చరా! కాల్చు! రష్యా అధికారులు ఎంత ధైర్యంగా చావగలరో కూడా చూపిస్తాను….ఆఖరికి చావు ఎదురుగా నిలబడినా…’

     తూటా అతని నోటి గుండా పోయింది. ఒక అరుపు ఆ వాటర్ టవర్ అంతా ప్రతిధ్వనించింది. కాల్మికోవ్ ఇంకో అడుగు ముందుకు వేస్తూ ఒక్కసారిగా  కింద పడిపోయాడు. నోట్లో నుండి రక్తం ప్రవహించింది. మళ్ళీ బంచక్ ఇంకో సారి పేల్చాడు. అంతే,కాల్మికోవ్ తల నిద్రపోతున్న పక్షి లా పక్కకు వాలిపోయింది, చనిపోయే ముందు ఒక మూలుగు వినిపించింది.

  బంచక్ అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. తర్వాతి సందు దగ్గర అతని వేగాన్ని అందుకుని దగిన్ అతన్ని కలిశాడు.

   ‘ఇల్యా…ఇలా నువ్వు ఎలా చేయగలిగావు? ఎందుకు చేశావు?’

  బంచక్ దగిన్ భుజాలను గట్టిగా పట్టుకుంటూ, అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నెమ్మదిగా చెప్పాడు:

   ‘ఉంటే వాళ్ళు ఉండాలి ,లేకపోతే మనం ఉండాలి. అంతకు మించి వేరే దారి లేదు. ఇక ఖైదీలు వద్దు.రక్తానికి రక్తం అంతే. వాళ్ళో ,మనమో తేలిపోవాలి. …యుద్ధమో ,చావో!అర్థమైందా? ఈ కాల్మికోవ్ లాంటి వాళ్ళను ఇలానే మట్టు పెట్టాలి. అలాగే ఇలాంటి వాడిని చూసి జాలిపడే వారికి ఇదే గతి పట్టించాలి. అర్థమైందా? ఏంటి అలా చూస్తున్నావు?ఇక మామూలు అవ్వు. ఇలాగే కఠినంగా ఉండాలి!ఒకవేళ కాల్మికోవ్ మన స్థానంలో ఉంటే తన సిగరెట్టు కాల్చినంత తేలికగా మనల్ని కాల్చేసేవాడు. నువ్వు మాత్రం ఇప్పుడే పుట్టిన పిల్లాడిలా ఏడుస్తున్నావు!’

  దగిన్ ఆ మాటలకు తల  ఊపాడు .తనలో తానే ఏదో గొణుక్కున్నాడు కానీ అది బయటకు వినబడలేదు.

   అక్కడి నుండి నిర్మానుష్యంగా ఉన్న ఆ వీధిలో వారు నిశ్శబ్దంగా నడిచారు. మధ్య మధ్యలో బంచక్ వెనక్కి చూస్తూ ఉన్నాడు. అప్పటికే ఆకాశం మేఘావృతమైంది. క్షీణించిన చంద్రుడు ఆకాశంలో దూరంగా కనిపిస్తూ ఉన్నాడు.

     వారు తర్వాతి కూడలి దగ్గరకు వచ్చేసరికి, ఒక సైనికుడు, అతని పక్క తెల్ల షాల్ భుజాల చుట్టూ కప్పుకుని ఉన్న ఒక స్త్రీ పక్కపక్కనే నడుస్తున్నారు. ఆ సైనికుడు మధ్యలో ఆగి, ఆమెను తన చేతుల్లోకి తీసుకుని, గట్టిగా కౌగలించుకుంటూ, ఏదో గుసగుసగా చెప్తున్నాడు. కానీ ఆమె తన చేతులు తన ఎదకు అడ్డంగా పెట్టుకుంటూ, అతన్ని అడ్డుకుంటూ,’నేను నిన్ను నమ్మను!నేను నిన్ను నమ్మను!’ అంటూ నవ్వింది.

    *  *  *

   కెరెన్ స్కీ  పెట్రోగ్రాడ్ కు జనరల్ క్రిమోవ్ ని పిలిపించాడు. అక్కడకు ఆగస్టు 31 న వచ్చిన జనరల్ క్రిమోవ్ అక్కడికక్కడే కాల్చుకుని చనిపోయాడు.

   క్రిమోవ్ నేతృత్వంలో ఉన్న దళాలలోని అధికారులందరూ  శీతాకాలపు భవనానికి క్షమాపణ వేడుకోవడం కోసం వెళ్ళారు. అలా వెళ్ళిన వారే అప్పటివరకు ప్రొవిజినల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలని అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళే కెరెన్ స్కీ ముందు మోకాళ్ళ మీద నిలబడి తమ విధేయతను, విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు.

  నైతికంగా క్రిమోవ్ సైన్యం దెబ్బ తిన్నప్పటికీ కూడా, మరలా కోలుకుని పెట్రోగ్రాడ్ దిశగా తమ సొంతగానే ప్రయాణాన్ని కొనసాగించాయి. కానీ దాని వల్ల ప్రయోజనం లేకుండా పోయింది.

అప్పటికే కొర్నిలోవ్ ప్రభావం తగ్గిపోతూ ఉంది;కార్చిచ్చులా రాజుకున్న మంట ఆరిపోతున్న దశలో ఉంది.

   క్రిమోవ్ ఆత్మహత్యకు ముందురోజు జనరల్ అలెక్సెయెవ్  ను సుప్రీం కమాండర్ ఇన్ చీఫ్ గా నియమించడం జరిగింది.

తానున్న పరిస్థితిలో ఆ పదవి స్వీకరించడం క్లిష్టమైన పని అని మొదట్లో అనుకుని దాన్ని తిరస్కరించినా, తర్వాత దాని ద్వారా కొర్నిలోవ్ కు, ప్రభుత్వ వ్యతిరేక విప్లవకారులకు సాయంగా ఉండొచ్చని  ;పదవిని స్వీకరించాడు.

    మొగిల్యోవ్  లో ఉన్న ప్రధాన కార్యాలయానికి వెళ్తున్న దారిలోనే అతను ఫోన్ చేసి తన కొత్త నియామకం పట్ల, తన రాక పట్ల కొర్నిలోవ్ ధోరణి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు.

  ఆ చర్చ సుదీర్ఘo గా సాగి, మధ్యలో విరామాలతో అర్థరాత్రి వరకూ సాగింది.

  ఆ రోజు కొర్నిలోవ్ తన అధికార బృందంతోనూ, సన్నిహిత అనుచరులతోనూ సమావేశంలో ఉన్నాడు. వారిలో ఎక్కువ మంది ప్రొవిజినల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలనే తేల్చారు.

   ‘ఈ విషయంలో మీ అభిప్రాయం తెలుసుకోవచ్చా, అలెగ్జాండర్ సెర్జీయేవిచ్?’ఆ సమావేశంలో నిశ్శబ్దంగా నిద్రపోతూ ఉన్న లుకోమ్ స్కీ ని అడిగాడు కొర్నిలోవ్.

  నెమ్మదిగా అయినా ధృడంగానే ఆ పోరాటం పట్ల తన  వ్యతిరేకతను వ్యక్తం చేశాడు అతను.

  ‘అయితే ఇప్పుడు మనం లొంగిపోవాలా?’ కొర్నిలోవ్ అతన్ని మధ్యలోనే అడ్డుకుంటూ అడిగాడు.

  లుకోమ్ స్కీ భుజాలు ఎగరేసాడు.

  ‘అలా చేయడమే మంచిదని ఇప్పుడు జరుగుతున్న వాటిని చూస్తే స్పష్టమైపోతుంది.’

  ఆ చర్చ ఇంకో అరగంట సాగింది. కొర్నిలోవ్ తనను తాను నియంత్రించుకుంటూ, ఏమి మాట్లాడకుండా ఉండిపోయాడు. ఆ సమావేశం అయిపోయిన తర్వాత అతను లుకోమ్ స్కీ ని పిలిపించాడు.

 ‘అలెగ్జాండర్ సెర్జీయేవిచ్ నువ్వు చెప్పింది నిజమే!ఇంకా దీన్ని కొనసాగించడం మూర్ఖత్వం, నేరం అవుతుంది’, ఏటో దూరంగా చూస్తూ అన్నాడు.

  అతను తన బల్ల మీద వేళ్ళతో దరువు వేస్తూ, ఏదో ధ్వనులు వినాలనుకున్నట్టు ;బహుశా తన ఆలోచనలే కావొచ్చు కాసేపు ఉండి,’అలెక్సెయెవ్  ఎప్పుడు ఇక్కడికి వస్తాడు?’అని అడిగాడు.

  ‘రేపు.’

అలెక్సెయెవ్ సెప్టెంబర్ 1 న వచ్చాడు. అదే రోజు సాయంత్రం ప్రొవిజినల్ ప్రభుత్వ ఆజ్ఞ మీద అతను కొర్నిలోవ్, లుకోమ్ స్కీ, రోమానోవ్ స్కీ లను అరెస్ట్ చేశాడు. వారిని ఉంచే చోటైనా మెట్రోపోలె హోటల్ కు వారిని పంపించే ముందు, అలెక్సెయెవ్ కొర్నిలోవ్ తో రహస్యంగా ఇరవై నిమిషాల పాటు మాట్లాడాడు. తర్వాత ఆ గది వదిలి బయటకు వచ్చేసరికి తనను తానే నిగ్రహించుకోలేనట్టు అయ్యాడు. ఎప్పుడైతే రోమానోవ్ స్కీ కొర్నిలోవ్ ను కలిసే ప్రయత్నం చేయబయాడో, అప్పుడు అతన్ని కొర్నిలోవ్ భార్య అడ్డుకుంది.

‘నన్ను క్షమించండి. కానీ లావ్ర్ జార్జియేవిచ్ నన్ను ఎవరిని లోపలికి అనుమతించొద్దని చెప్పారు.’

రోమానోవ్ స్కీ అభావంగా ఉండిపోయాడు.

  తర్వాతి రోజు  బెర్డిచేవ్ లో యుద్ధ ప్రాంతపు నైరుతి దిశలో కమాండర్ ఇన్ చీఫ్ గా ఉన్న జనరల్ డెనిఖిన్ ను,అతని ముఖ్య అధికారి జనరల్ మార్కోవ్ ను, జనరల్ వానోస్ స్కీ ని,ప్రత్యేక సైన్య కమాండర్ జనరల్ ఎర్డెలి లను కూడా ఖైదు చేశారు.

బాలికల పాఠశాల అయిన బైకోవ్ పాఠశాలలో వారిని ఉంచారు. అక్కడే చరిత్ర చక్రాల కింద కొర్నిలోవ్ ఉద్యమం ముగిసిపోయింది. కానీ అదే ముగింపు ఇంకో కొత్త ఉద్యమానికి ఊపిరి పోసింది. ఇక్కడే భవిష్యత్తులో పూర్తి స్థాయిలో జరగబోయే  విప్లవకారుల యుద్దానికి పునాదులు పడ్డాయి.

   *  *  *


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *