చందమామతో ఓ మాట చెప్పాలి

Spread the love

“మంచిగున్నదె మీ కత, అచ్చినసంది అవ్వబిడ్డెలు పరీచ్చలకు సదివినట్టు ఒకటే సదువుతున్నరు.”

వంటర్రల్నించి చాయ్ గ్లాసుతో బయటకి వస్తూ అంది నీరజ తల్లి శాంత.

సాయమాన్ల ఈజీచైర్ లో కూర్చుని ‘మట్టి మనిషి’ చదువుతున్న నీరజ తలెత్తి చూసింది.

“రాకరాక ఊరికచ్చి తలో వయ్యి ముందేస్కున్నరు. దాన్నిగూడ నీలెక్కనె తయారుజేత్తవానే? ఇగో శాయబొట్టుదాగు.”

దివాన్ మీద బోర్లా పడుకుని ‘ఫేమస్ ఫైవ్’ సీరీస్ ను సీరియస్ గా చదువుతోంది నీరజ కూతురు పదేళ్ల కీర్తన.

“మంచిదేగదమ్మా, కీర్తనని ఫోన్లు, ట్యాబులకి అల్వాటుగాకుండ పెంచాల్నని నేను విశాల్ అనుకున్నమే,” గ్లాసు తీసుకుంట అన్నది.

“పిల్లలన్నంక ఆడాలె పాడాలె ఎగరాలె దుంకాలె. నువ్వు గూడ చిన్నప్పుడు గింతే. పదేండ్లకే ఇర్వైయేండ్ల దాన్లెక్క మెల్గెదానివి.”

తల్లి గొంతులో కన్సర్న్ అర్థమైంది. 

ఏదో చెప్పబోయేలోపు హారన్ సౌండ్ వినిపించి అటువైపు చూసింది.

పెద్ద ట్రక్. దానిముందు యువజంటతో ఒక బైక్.

వీళ్ళ ఇల్లు దాటి ఎదురు లైన్లో నాలుగిళ్ళవతల ఆగాయి. 

అదే ఇల్లు.

అప్పుడు కూడా ఇలాంటి ట్రక్కే కదా.

కాదు లారీ అనుకుంటా.

ఏమో మర్చిపోయాను.

నిజంగా మర్చిపోయానా?

అసలు మర్చిపోగలనా?

వాసనా? కాదు కంపు!

నీరజ ఒక్కసారిగా ఇరవైఏళ్ల కిందటి జ్ఞాపకాల్లోకి జారిపోయింది.

****

“నీరమ్మా, సుధమ్మా జర బిన్న రాండిరా, డ్యూటీకి లేటైతుంది.”

సైకిల్ మీద కూర్చుని HMT వాచీలో టైమ్ చూసుకుంటూ అరిచాడు ధర్మారావు.

బ్యాగ్ వీపునేసుకుంటూ చెంగుచెంగున వచ్చి చెల్లె బొంగుమీద కూర్చుంటే, నీరజ క్యారేజెక్కి కూర్చుంది.

బొయ్ మని హారన్.

ఒక ట్రాన్స్ పోర్ట్ లారీ వీళ్ళ ఇంటిని దాటి నాలుగిళ్ళవతల ఆగింది.

“ఎవరో బెంగాలోళ్ళు దిగుతున్నరట” టిఫిన్ కారేజ్ ఇస్తూ చెప్పింది శాంత.

“అట్లనా,” అని సైకిల్ ముందుకు కదిలించి బెంగాలీ దంపతుల ఇంటిముందు ఆపాడు.

“నమస్తే సార్. నా పేరు ధర్మారావు. ఫైవ్ ఇంక్లైన్ల సర్దార్ గ చేస్తున్న. ఎదురుంగనే ఉంటం,” పరిచయం చేసుకున్నాడు.

“హల్లో! నైస్ మీటింగ్ యూ సర్! అయామ్ బినయ్ ముఖర్జీ, నా వైఫ్ రోమా ముఖర్జీ. సెవన్ ఇంక్లైన్ కి అండర్ మేనేజర్ గా బదిలీ అయింది.” షేక్ హాండిస్తూ చెప్పాడు బెంగాలీ బాబు.

“మాకు ఒక సన్ అండ్ డాటర్. హైదరాబాద్ లో చదువుతున్నరు,” చెప్పింది రోమా.

తెలుగు ఇంగ్లీష్ బంగ్లా కలిసి తెంబ్లీష్ మాట్లాడుతున్న ఆ ఇద్దర్నీ అబ్బురంగ చూస్తుంది నీరజ.  

“హూ ఆర్ దీస్ లిటిల్ ఏంజిల్స్?”

“నా బిడ్డలు. పెద్దామె అయిదు, చిన్నామె రెండు చదువుతున్నరు.”

“హల్లో! ఏంజెల్స్.”

షేక్ హాండిచ్చాడు బినయ్. నీరజ మెరిసేకళ్ళతో షేక్ హాండిచ్చి, “వెల్కమ్ టు సింగరేణి కాలనీ తాతయ్యా.” అంది.

****

ఆ సాయంత్రం వంట చేసి ఒక కారేజీలో సర్దుకుని వెళ్తుంటే “బెంగాలోళ్ళ ఇంటికా, నేనూ వస్తనమ్మా” అని శాంత వెంట వెళ్ళింది నీరజ.

రోమాకి కారేజీ ఇస్తూ, ”ఇంకా మీరు వంటిల్లు సదురుకున్నరో లేదో అని తెచ్చిన.” చెప్పింది శాంత.

“ఓహ్! థాంక్యూ సో మచ్.”

అప్పుడే హాల్లోకి వచ్చిన బినయ్ నీరజను చూసి, “హలో ఏంజిల్.” అన్నాడు.

“హల్లో తాతయ్యా!”

“నువ్వలా పిలిస్తే మేమిద్దరం ముసలోళ్లలాగ ఫీల్ అవుతాం, ఆంటీ అంకుల్ అని పిలవచ్చుగా” అన్నాడు.

అప్పటినుంచి నీరజకు వాళ్ళిద్దరూ ఆంటీ అంకుల్ అయిపోయారు.

బినయ్ వయసు యాభైపైనే ఉండొచ్చు. జుట్టునెరిసి ముగ్గుబుట్టలా ఉండేసరికి అరవై పైబడిన వాడిలా కనిపిస్తాడు. రోమా నలభైల్లో ఉన్నట్టుంటుంది. ఆమె పుట్టి, పెరిగింది కలకత్తాలోనే. హైదరాబాద్ లో చదువుకోవడం వల్ల తెలుగు బాగానే మాట్లాడేది. 

రోమా ఆంటీతో స్నేహం బాగా కుదిరింది నీరజకి. స్కూల్ నుండి రాగానే వాళ్ళింటికి పరుగెత్తేది. మాటకుముందో ఆంటీ వెనకో ఆంటీ తగిలించేది. రోమా కూడా నవ్వుతూ ‘యెస్ డియర్’ అని మురిపెంగా దగ్గరకు తీసుకునేది.  

బెంగాల్ నుంచి తెప్పించిన తెల్లటి గుండ్రటి స్వీటు నీరజకోసం దాచిపెట్టి ఇచ్చేది. దాన్ని రసగుల్లా అంటారని నీరజకు తెలీదు. ఆంటీ ఎంబ్రాయిడరి వర్క్ చేస్తుంటే పక్కన కూర్చుని గిల్లుకుంట గిచ్చుకుంట నిమ్మలంగా ఆస్వాదిస్తూ తినేది.

***

రోహిణికార్తె.

చుట్టూ చెట్లున్నా ఇంట్ల పండుకుంటే బొగ్గుబాయిలకు దిగినట్టే అనిపించేది.

ఏసీ పెట్టించుకునే ఐసత్ లేదు గానీ వాకిట్ల నవారు మంచమ్మీద పండుకుని నక్షత్రాలను చూసే లగ్జరీ ఉంది నీరజ వాళ్లకు. 

ఆ రాత్రి చంద్రుడు వెండిపళ్లెంలా వెలిగిపోతున్నాడు.

“అట్లా వచ్చే జల్మలోనన్నా మనిషి పుట్క బుట్టాల్నని దీక్షబట్టిన కుందేలును పరీచ్చబెట్టి, నువ్వు బూమ్మీద ఉండాల్సినసొంటిదానివి గాదూ, నాతోటి రా’ అని కుందేలుకు ముద్దువెట్టి శెంద్రమండలం తోల్కవోయిండు. అగో సూడు, కనిపిస్తున్నదా కుందేలు”

తల్లి పక్కన పండుకుని, ఆమె చూపుడు వేలుపొంటి చూపు సారించి వినీలాకాశాన్ని విభ్రమంగా చూస్తూ అన్నది నీరజ.

“అవునమ్మా. చందమామల మచ్చ అచ్చం కుందేల్లెక్కనే గొడ్తాంది. భలే ఉందమ్మా కథ!”

“నువ్వు సుత గా కుందేల్లెక్క మంచిగుండాలె.”

“కాదు, బినయ్ అంకుల్ లెక్క. మొన్న రోమాంటీకి జరమత్తే అంకులే పనంత జేశిండు. పెదనాయిన యాదికత్తడు అంకుల్ ని జూత్తే. మస్తు మంచోడమ్మా.”

“సరేతీయ్. అంకుల్లెక్క సక్కగ సదువుకుని సల్లగ బత్కవే నా బంగారు కుందేలు పిల్ల. ఊమ్మ్”

నీరజ బుగ్గమీద ముద్దుపెట్టింది శాంత.

ఆరోజు నుంచి నీరజకి అందమైన కలలు వచ్చేవి. రాత్రవగానే కుందేలు కిందకొచ్చి నీరజని హంసవాహనం ఎక్కించుకుని గగనవిహారం చేయించేది. ముల్లోకాలు తిప్పి జాబిలిమీదకు తీసుకుపోయేది. అక్కడ కుందేలు మీద వెన్నెలపిండిని చల్లుతూ అలిసిపోయేవరకు ఆడేది. జాబిల్లితో వసపిట్టలా తెగ ముచ్చట్లుపెట్టి కిందకు వచ్చేటపుడు ముద్దుపెట్టేది.

***

ఆరోజు ఆదివారం.

పిల్లలిద్దర్నీ ఇంట్లో వదిలి నీరజ అమ్మానాన్న పెళ్లికెళ్లారు. అన్నం తిని నిద్రొస్తుందంటూ పడుకుంది చెల్లి.

ఒక్కదానికి బోర్ కొడుతుందని కలకత్తా ఆంటీవాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపుకొట్టింది నీరజ.

బినయ్ అంకుల్ తలుపు తీశాడు. 

“ఆంటీ లేదా అంకుల్?”

“కిచెన్ లో ఉన్నట్టుంది, కమిన్!”

నీరజ చేయి పట్టుకుని లోపలికి లాగాడు.

పట్టుకున్న విధానం తేడాగా అనిపించినా అర్థం చేసుకునే వయసు కాదు.

నవ్వుతూనే ఆయన చేయి వదిలించుకుని కిచెన్ లోకి తొంగి చూసింది.

“ఆంటీ లేదంకుల్.”

“చెక్ ద బెడ్రూం” అన్నాడు డోర్ మూసేస్తూ.

బెడ్రూంకి వెళ్లి చూసింది. ఆంటీ జాడ కనిపించలేదు.

తెలియని నిశ్శబ్దం ఆవరించి ఒక్కసారిగా భయమేసింది. గబుక్కున వెనక్కి తిరిగేలోపు-

గాలిదూర సందులేకుండా రెండుచేతుల్లో గట్టిగా బిగించాడు.

ఒళ్ళంతా తడుముతున్నాడు.

అంకుల్ దగ్గర అదోరకం వాసన. కడుపులో తిప్పే వెగటు వాసన.

వయసువల్ల వచ్చిన దడనో, తప్పుపని చేస్తున్న కంగారు వల్లనో తెలీదు, విపరీతమైన ఎగస్వాస అతనిలో.

ఏం చేస్తున్నాడో అర్థం కాలేదుగానీ అసహజమైన పనేదో జరగబోతోందని మాత్రం పసిప్రాణం పసిగట్టింది.

“అంకుల్, ఇడ్శిపెట్టండి. నొప్పైతంది.”

విదిలించుకోవాలని చూసింది. ఊహూ, చిన్నపిల్ల.

“అంకుల్, ప్లీజ్ వద్దు.”

ఏడుస్తూ బతిమాలుతుంది. 

“డోంట్ షౌట్ నీరూ. బోల్డు చాక్లెట్లు ఇస్తాను. బీ ఎ గుడ్ గర్ల్.”

నీరజ చేతిని తన నడుమువైపు లాగుతున్నాడు.

లోపలనుండి తన్నుకొచ్చిన బాధ, కోపం, ఏడుపు, తెలియని అసహ్యం.

 చేయిబట్టి గట్టిగ గుంజిండు.

ముందుకు తూలబోయి, నోటికి, చేతికి ఏం బలం వచ్చిందో గాని, గట్టిగా అరిచి చేతుల్ని విదిలించుకుని అతన్ని కాలితో బలంగా తన్ని, ఒక్కతోపు తోసి బయటికి పరుగెత్తింది.

దబ్ మన్న శబ్దం. దెబ్బ ఎక్కడ తగిలిందో గమనించే స్థితిలో లేదు.

తుపానులో కొట్టుకుపోతున్న ఆకులా పరుగెత్తింది ఇంటివైపు.

ఆపాదమస్తకం వణికిపోతూ మంచంమ్మీద పడిపోయింది.

ఎంతసేపు అలా ఉందో.

ఒంటిమీద చిన్నప్పటినుంచి చిరపరిచితమయిన స్పర్శ.

దిగ్గునలేచి అమాంతం అమ్మ ఒళ్ళో దూరింది.

“ ఏమయిందే నీకు పగటీలి పండుకున్నవ్”.

“ఇంకెప్పుడూ నన్ను ఇడ్శిపెట్టిపోకమ్మా.” అంది ఏడుస్తూ.

పాండ్స్ పౌడరూ, మెత్తటి కాటన్ చీర వాసనలు కలగలసిన అమ్మ పరిమళం పీలుస్తూ ఆ అసహ్యమైన వెగటు వాసనను దూరంగా తరిమేయాలని చూసింది.

కానీ పోలేదు.  

ఆరోజునుంచీ నీరజకు ఏం శాతగానట్టు నీరసంగ ఉండేది.

ఎవరైనా అంకుల్ని గొర్రగొర్ర గుంజుకపోయి నుజ్జునుజ్జు కొడితే బావుండు అనిపించేది.

ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటెనక గోలెంల కూర్చుని ఏడ్చేది.

సల్లటి నీళ్లల్లో గూసున్నా సావిట్ల మండే బొగ్గుబకీటుకంటే ఆమె లోపటే వేడి ఎక్కువున్నట్టు అనిపించేది.

బాసాన్లుతోమే కొబ్బరిపీసుతో పెయ్యంత రాక్కోవాలనిపించేది.

“పిల్లలో మునుపటి ఉషారే లేదు. ఏమైందో ఏమో, జర నువ్వన్నా అడగరాదు” ఒకరోజు రోమాకి చెప్పింది శాంతి. 

ఆ సాయంత్రమే ఆంటీ అంకుల్ ఇద్దరూ వచ్చారు.

“ఐ విల్ టాక్ టు హర్, యు వెయిట్” అని అంకులే చొరవతీసుకుని నీరజ రూమ్ లోకి వచ్చాడు.

అతనితోపాటే ఆ అసహ్యమైన వెగటు వాసన! 

“హలో ఏంజిల్, వాట్ హాప్పెండ్ టూ యూ?”

దయ్యాన్ని క్లోజప్ లో చూసినట్టు దడుచుకుంది నీరజ.

కూల్ గా పక్కన కూర్చుని చిన్నగా చెప్పాడు.

“నువ్వు ఏం చెప్పినా ఎవరూ నమ్మరు. ఏమైనా చెప్పాలని చూస్తే మీ చెల్లెకి కూడా ఇట్లనే అయితది.  అండర్ స్టాండ్?”

ఫైనల్ నెయిల్ ఇన్ ది కాఫిన్.

గుండెలోపట ధైర్యాన్ని ఎవరో బల్మీకి గుంజుకపోయిన్నట్టు గజగజలాడింది.

ఆమెకు అప్పటినుంచి ఎప్పుడూ ఏకలలో కుందేలు కిందికి రాలేదు.

చీకటిగుహలో చిక్కుకుపోయినట్టు, తానే బొందదవ్వుకొని అందులో కూరుకుపోయినట్టు, భరించలేని దుర్గంధంతో ఊపిరాడక కొట్టుకున్నట్టు పీడకలలు వచ్చేటివి.

వయసొచ్చాక ఎవరికైనా చెబితే ఏమనుకుంటారో అని భయపడేది.

ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్తతో కూడా ఈ విషయం డిస్కస్ చేయలేనంత ఎంబరాసింగ్ గా ఫీలయ్యేది.

***

“ఏందే గట్ల బీరిపొయ్యి గా ఇంటిమొకమే చూస్తున్నవ్. కలకత్తా ఆంటోళ్ళిల్లు. యాది మర్శినవా, ఇయ్యాలే గీకొత్తోల్లు దిగుతాండ్లు.”

తల్లి మాటలకి అగాథాగతం నుంచి బయటికి వచ్చింది నీరజ.

“అప్పట్ల సందు దొరికితే వాళ్ళింటికి పోయేదానివి. ఆదాట్న పోవుడు బంజేశినవ్. ఆంటీ ఎన్నిసార్లు పిలిశినా పోకవోతివి.”

“ఆంటీవాళ్ళు ఇప్పుడు ఎక్కడుంటున్నరే?”

“అంకుల్ రోమా ఆంటీకి ఇడుపుగాయిదం ఇచ్చి కలకత్తా వోయిండు. ఆంటీ ఒక్కతే భాగ్యనగర్ కాలనీల ఉంటాంది.”

“డివోర్సా?”

“ఆ గదే. ఆలుమగలు ఏం జవుడం బెట్టుకున్నరో, ఏందో ఎవ్వలకు దెల్వదు. కానీ ఆమె తొడుక్కునే ఫ్యాషన్ జాకిట్లు, ఒర్క్ చీరలు జూషి గిన్ని సోకులువోతాంది అని జనాలు ఒకటే వదురుడు. పాపం ఆమె శానా మంచిదే. అదేందోగాని మగాయన్ని మాత్రం ఒక్కరు ఒక్కమాట అనలే.”

“నీకు ఆంటీ అడ్రస్ తెల్సానే?”

***

ఇంటిముందు నిలబడి కాలింగ్ బెల్ కొట్టి గుండె బిగబట్టి చూస్తుంది నీరజ.

తలుపుతీసి ఎవరూ అన్నట్టు క్వశ్చన్ మార్క్ మొహంతో చూసింది డెబ్బైయేళ్ల రోమా బెనర్జీ.

“ఆంటీ నేను, ధర్మారావు బిడ్డను. కాలనీలో మీ ఎదురుంగ ఇంట్లో ఉండే.”

నీరజ చెబుతుండగనే, “నీరూ! నువ్వేనా? గాడ్! ఫైనల్లీ!” అంటూ సుడిగాలిలా చుట్టేసుకుందామె. అప్రయత్నంగా ఆంటీని పొదువుకుంది నీరజ.

ఆమె మాటల జలపాతమై దూకింది.

ప్రశ్నల గోదావరై ప్రవహించింది.

ఇరవైఏళ్ళుగా తన కోసమే ఎదురుచూస్తుందేమో అనిపించింది నీరజకి.

కాఫీ తాగుతూ ఆంటీ కళ్ళల్లో కనిపించిన ఆనందం చూసాక ఆలోచనలో పడింది నీరజ.

ఇరవైయేళ్ల కిందటి విషయం ఇప్పుడీమెకి చెప్పాలా? నా బాధని పంచి ఆమె బాధను పెంచాలా?

ఈ దుఖం నాతోనే పోనీ. నాలోనే ఇంకిపోనీ.

అమ్మ తర్వాత అమ్మలా చూసుకుంది. అమ్మకు కూడా చెప్పలేదు కదా.

కానీ ఇప్పుడు కూడా చెప్పకుంటే ఎట్లా? నాలోనే సమాధి కావాలా?

“ఏమన్నా చెప్పాలా నీరూ?”

“సారీ ఆంటీ! మిమ్మల్ని చాలాసార్లు కలుద్దామనుకున్నాను. కుదరలేదు.”

“ఇట్స్ ఓకే బేటా. మంచి భర్త, ముద్దులొలికే బంగారుతల్లితో నువ్వు సంతోషంగా ఉన్నావని  అమ్మ చెప్పింది. ఐ యామ్ హాపీ ఫర్ యు.”

“ఆంటీ, అంకుల్ మీకు డివోర్స్ ఇచ్చారని”

ఒక్క క్షణం మౌనం తర్వాత, “అలా అందరిదగ్గరా ప్రచారం చేసుకున్నాడు. నేనే అతన్ని వద్దనుకున్నా.”

షాకై చూసింది నీరజ.

“నువ్వు రెసిడెన్షియల్ స్కూల్ కి వెళ్ళిపోయాక స్వాతి అనే అమ్మాయి వాళ్ళు పక్కింట్లోకి వచ్చారు. నాకు బాగా క్లోజ్ అయింది. అచ్చు నీవయసే, నీలాగే చురుగ్గా ఉండేది. ఒకరోజు వాళ్ళమ్మా నేనూ గుడికి వెళ్ళి వచ్చేసరికి, వాడు దట్ డర్టీ ఫెలో, చిన్నపిల్లని పట్టుకుని.”

పామేదో వంటిమీద జరజరా పాకినట్లు వణికింది నీరజ.

“తట్టుకోలేకపోయాను నీరూ. వాణ్ణి లైఫ్ లో ఎప్పుడూ ఒక్కమాట కూడా అనలేదు. నా చేతిలో చెప్పు దెబ్బలు తిన్నాడు.

స్వాతి పేరెంట్స్ అందరికీ తెలిస్తే పరువు పోతుందని, ఎవరికీ చెప్పకండి అని వదిలేసారు.

కానీ అతన్ని చూసినా, తాకినా కంపరంగా ఉండేది నాకు. కొన్నాళ్ళు నరకం అనుభవించాను. నలుగురికి చెప్పుకోలేను, అలాగని మర్చిపోలేను.

తర్వాత ఒకరోజు మీ చెల్లి నా దగ్గరికి వచ్చి మాటల మధ్యలో నువ్వు మా ఇంటికి వచ్చి వెళ్ళావని చెప్పింది. అప్పుడు నీ విషయంలో కూడా ఏదో తప్పు జరిగుండొచ్చు అనిపించి వాడిని గట్టిగా నిలదీశాను.

ఒప్పుకున్నాడు నీ విషయం.

“ఐ యామ్ సారీ నీరూ, ప్లీజ్ ఫర్ గివ్ మీ. ప్లీజ్!”

దు:ఖంతో రోమా గొంతు పూడుకుపోయింది.

‘ఆంటీ!” అని ఏడుస్తూ ఆమెని చుట్టేసుకుంది.

“ఒక్కక్షణం కూడా వాడితో కలిసి బతకలేనని డీవోర్స్ అప్లై చేసాను. పిల్లలకు చెప్పొద్దని కాళ్ళు పట్టుకున్నాడు. స్వాతి పేరెంట్స్ ని పిలిపించి నా కొడుక్కీ కూతురికీ మొత్తం చెప్పించాను. అసహ్యించుకుని వెళ్ళిపోయారు. అవమానంతో కలకత్తా పారిపోయాడు. ఎక్కడెక్కడ తల దాచుకోగలడో అన్నిచోట్లా చెప్పేసాను. అందరూ ఛీ కొట్టారు. నాలుగేళ్ల క్రితం ఫుట్ పాత్ మీద  అనాథశవంలా పోయాడని తెలిసింది.”

నీరజ గుండెలో ఇరవైయేళ్ళుగా ఘనీభవించిన దు:ఖపర్వతం పొరలుపొరలుగా కరిగిపోతుంది.

చెల్లిని అడ్డం పెట్టుకుని 20 ఏళ్లపాటు అశాంతికి, అలజడికి గురిచేసిన ఆ మనిషి ఇక లేడని తెలిసినందుకా!

“మీ ఇంటికి చాలాసార్లు వెళ్లాను. కానీ, మీ అమ్మకేం తెలియదని అర్థమయ్యింది. నీకిలా జరిగిందని తెలిస్తే తట్టుకోలేదని నేనూ చెప్పలేదు.” 

లాక్రిమల్ గ్రంధులు ఇంకిపోతాయేమో అన్నట్టు ఏడ్చింది నీరజ.

తల్లి కోడిలా నీరజని రెక్కల్లో పొదువుకుంది రోమా. ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదు.

భోజనం చేసేవరకు వదల్లేదు నీరజని. ప్రేమగా రసగుల్లా నోట్లో పెట్టింది.

ఇంటికానుకుని ఉన్న తన కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ షాపుకు తీసుకెళ్లింది.

ఎప్పుడో ఇష్టంగా నేర్చుకున్న ఎంబ్రాయిడరీనే ఉపాధిగా చేసుకున్నాను, చెబుతూ ఉంది రోమా.

“నీరూ, ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా!“

ఇవాళ నాతోపాటు నలుగురు బతుకుతున్నారు. వాళ్లలో తల్లిదండ్రులులేని అనాధ పిల్లలున్నారు, అనేక రకాలైన అబ్యూస్ లకు గురైన అమాయక ఆడపిల్లలు ఉన్నారు. నాకు వాళ్లు, వాళ్లకు నేను. ఇది చాలు నాకు.”

ఇన్నాళ్లుగా తనలో రేగిన తుఫాను అలజడి తగ్గి, రోమా ఆంటీ ప్రేమను గుండెల్లో నింపుకొని మరోసారి ఆర్తిగా ఆమెను హత్తుకుని ఆటో ఎక్కింది నీరజ.

***

అమ్మ పక్కన పడుకుని, ఆమె చూపుడు వేలుపొంటి చూపు సారించి వినీలాకాశాన్ని విభ్రమంగా చూస్తోంది కీర్తన.

ఆరాత్రి చంద్రుడు వెండి పళ్ళెంలా వెలిగిపోతున్నాడు.

“యా! అచ్చం రాబిట్ లెక్కనే ఉందిమా. బ్యూటీఫుల్. రాబిట్ స్టోరీ ఈస్ డామ్ కూల్. థాంక్యూ.”

వెన్నెలదేహంలా మెరిసిపోతున్న కూతురుని చూసి “నువ్వే నా కుందేలు పిల్లవి” అని గట్టిగా బుగ్గమీద ముద్దుపెట్టింది నీరజ.

***

స్వర్ణ కిలారి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *