ఏ కథైనా కాలం వెంట పరుగెట్టాలి. ఆధునిక సాంకేతికత ప్రబలినపుడు ఊపిరిసలపనివ్వని జీవితాలుంటాయి. వాటిని పట్టుకోవాలి. అంతేకాదు వాటిని సామాజిక చరిత్రలో నమోదు చేయాలి. ఒకానొక పెనుగులాటలో మునిగితేలుతూ అనుభవించి పలవరించినవారికే అది సాధ్యమౌతుంది. అట్లాంటివే ఉమా నూతక్కి ‘25వ గంట’ కథలు.
కొన్ని కథలు భాష, వస్తువు సంవిధానంతో మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మన ఆలోచనల్ని ఎక్కడికో తీసుకెళతాయి. ఆ ఆలోచనలేవీ మన అనుభవంలోనివి కానక్కర్లేదు. అయినా ఎంతో ఉత్సుకతతో చదివిస్తాయి. ముఖ్యంగా వివక్షతల్ని ఆధిపత్యదురహంకారాల్ని తేటతెల్లం చేసే కథలు గగుర్పాటును కలిగిస్తాయి.
ఉమా నూతక్కి ప్రధానంగా స్త్రీలు ఎదుర్కొనే వివక్షతల్ని తన అనుభవంలోంచి ఎరిగిన సమూహం లోంచి ఎదురైన సంఘటనల్ని కథలుగా మలిచారు. నేటి యాంత్రికమైన వేగవంతమైన స్త్రీల జీవితాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. ఉద్యోగునుల జీవితాలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. ఎంతటి ఉన్నతోద్యోగంలో ఉన్నా ఇంటా బయటా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మానసికంగా శారీరకంగా వేదనపడుతూ బతుకుల్ని సాగిస్తున్నారు. ఉద్యోగంతో పాటు ఇంటిభారమంతా మోస్తూ ఏకరీతి జీవితంతో సతమతమవుతున్నారు. ఇందులోని కథలు వీటి గురించి చెప్పాయి.
‘25వ గంట’ శీర్షికే సగం కథను చెప్పేస్తుంది. భార్యగా కూతురికి తల్లిగా అత్తకు కోడలిగా ఆఫీసులో సీనియర్ ఉద్యోగిగా బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఇష్టమైన వ్యాపకాల్ని వదులుకోకుండా అభిరుచుల్ని పండిరచుకోవడం ఎంత కష్టమో ఊహించండి. వీటన్నింటినీ సక్రమంగా చేయడం కోసం కాలనిర్ణయ పట్టిక తయారు చేసుకుంటే… ఏముంది? రోజుకున్న ఇరవై నాలుగుగంటలు సరిపోవని ఇంకో గంట అదనంగా కావాల్సి రావడమే ఈ కథ. క్రమ తప్పకుండా జరిగే ఈ తంతు ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యుని సలహాతో ఉదయపు నడక అవసరమని తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోవాల్సిన అగత్యాన్ని చిత్రించిన కథ ఇది.
‘మిట్ట మధ్యాహ్నపు నీడ’ కలవరపెట్టే కథ. ప్రతిరోజూ వార్తల్లో ఏదో మూల ఒక అమానుషమైన వార్త కనపడుతుంది. అదే లైంగిక దాడి గురించి. పాఠశాల, బంధువుల ఇళ్ళు… చోటు ఏదైనా వయసుతో సంబంధం లేకుండా జరిగే అకృత్యాలు. తెలిసేవి కొన్నే. తెలియనివి ఎన్నో. ఎత్తుకునేంత చిన్నది కాదు. అయినా ఎత్తుకుంటాడు. బుగ్గలు పుణుకుతాడు. చెవులు మెలేస్తాడు. పాప గింజుకంటుంది. ఇదంతా ప్రేమ అనుకోమంటాడు. పైగా అక్కడితో సరిపెట్టడు. ‘సాయంత్రం చెబుతా నీ పని’ అంటాడు. ఇదేమీ రహస్యంగా కాదు. పక్కనే మురిసిపోతూ భార్య ఉంటుంది. అయినవాళ్ళ మధ్య చనువు పేరిట అజ్ఞాతంగా ఉండిపోయే కథనాలెన్నో. ఒక చేదు అనుభవాన్ని మూడు దశాబ్దాల తర్వాత అక్షరబద్ధం చేశారు ఉమా నూతక్కి. దీన్ని ఒక సార్వజనీనమైన అంశంగా భావించి చేయగలిగారు.
ఆధునిక సమాజంలో సాంకేతిక ఫలాలెన్నో పొందుతున్నాం. సెల్ అనేది శరీరంలో జీవితంలో ఒక భాగమై అత్యవసర సరుకుగా మారిపోయింది. మనిషీ మనిషికీ మధ్య సంభాషణల భావ ప్రసారం ఒక్కటే కాదు. సోషలుమీడియా పేరిట సవాలక్ష దృశ్యకథనాలు అరచేతిలోకి వచ్చేశాయి. యువత మీద వీటి ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది. సెల్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే ఎలాంటి దుష్ప్రరిణామాలకు దారి తీస్తుందో చెప్పే కథ ‘బ్లాక్ ది లైఫ్’. కథ పత్రికలో ప్రచురణ జరిగి కథకురాలికి అనేక ఫోన్లు వస్తాయి. కొన్ని ఉత్సాహాన్ని నింపి కథలు రాయాలనే ఉత్సుకత కలిగిస్తాయి. అదే సమయంలో ఒక పనికిమాలినవాడి ఫోను ఇబ్బంది కలిగిస్తుంది. వదలడు. వీలున్నప్పుడల్లా చేస్తూనే ఉంటాడు. బ్లాక్ చేస్తుంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. ఇదంతా మామూలే అన్నట్టు ప్రవర్తించే పోలీసు అధికారి ఉంటాడు. మనసు పాడవుతుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆడపడచు వీడియో కాల్ చేస్తుంది. ఆడపడుచు ముచ్చట ఎలా ఉందంటే తన రెండేళ్ళ కొడుకు రెండు కాళ్ళ మధ్య ఉన్న అంగాన్ని చూపిస్తుంటే ఆవిడకు సరదాగా ఉంటుంది. ‘సిగ్గు లేదూ ఇవి నేర్పడానికి’ అని అరిస్తే ఆవిడేమంటుందంటే ‘సిగ్గెందుకు…వాడు మొగాడు. కదా నాన్నా’ అంటుంది. అసలు మూలాలు ఎక్కడ తయారవుతున్నాయో అర్థమౌతుంది రచయిత్రికి. మనకూ తెలుస్తుంది.
12 కథలున్న కథాసంపుటిలో ఉమా నూతక్కి ఉత్తమ పురుషలోనే ఎక్కువ కథలు రాశారు. స్వతంత్రంగా జీవించే అవకాశం లేని స్త్రీల కథలే ఎక్కువ. సామాన్యుల మధ్య ఉండే స్వచ్ఛమైన స్నేహాలు, తండ్రి స్వార్ధానికి చితికి పోయే, జెండరు సమస్యతో ఇబ్బందులు పడే, వివాహ వ్యవస్థలో ఇమడలేక రెక్కలతో ఎగిరిపోయే, నాలుగుగోడల మధ్య బిగుసుకుపోయే కథలు ఇందులో ఉన్నాయి.
ఉన్నతోద్యోగాల్లోని పాత్రలకు సంభాషణల్లో కొంతవరకు ఇంగ్లీషు పదాలు పర్వాలేదు. కథనంలో మటుక్కి ఆ భాషా పదాల్ని పరిహరిస్తేనే బావుంటుంది. కొన్ని కథలు కొందరు మాత్రమే రాయగలరు. కథ రచయితను ఎన్నుకుంటుంది. ఇందులోని కథలన్నీ ఉమా నూతక్కిని వెతుక్కుని వచ్చినవే.
Click the link below to buy

