“ఈ లోయ సౌందర్యం చూస్తోంటే ఉన్నపళంగా అమాంతం ఇందులోకి దూకేయాలనిపిస్తోంది… కాసేపటికి ఈ ఆకుపచ్చ లోయలోంచే పక్షిలా అలా గాల్లోకి ఎగురుతూ రాగలనేమో అని కూడా అనిపిస్తోంది,” అన్నాను భావోద్వేగంతో.
చుట్టూ ఎత్తయిన కొండల మధ్య నుండి వీస్తోన్న చల్లగాలికి ఆ క్షణం నా చర్మం రక్తమాంసాలతో కలిసి నృత్యం చేయసాగింది.
అతడూ కాసేపు ఆ లోయలోకి చూసి-
“చాలాకాలంగా నేనూ ఇలాంటి ప్రయత్నాలే చేస్తున్నాను. కాని ఫలితం… ఊహూ… శూన్యం,” అన్నాడు ఆ లోయ దగ్గర్నుండి కదులుతూ.
ఆశ్చర్యపోయాను. ఇప్పుడే నాకొచ్చిన ఈ అద్భుతమైన ఆలోచనలాంటిది అతనికి చాలాకాలం క్రితమే వచ్చినట్లు తెలిసి. నిజానికి ఇలాంటి ఆలోచనలు దాదాపుగా ఎవరికీ రావు.
“ఏదీ… పక్షిలా ఎగురుతూ పైకి లేవడమా…?” అన్నాను అతనితోపాటే కదులుతూ.
“కాదు. మనిషిలా నేల మీద బరువుగా నడవగలగడం,” అన్నాడతను మళ్లీ ఆశ్చర్యపరుస్తూ.
మనిషి పక్షిలా గాల్లోకి ఎగరాలని వాంఛిస్తుంటాడు కానీ మనిషై ఉండి ఇతను మనిషిలాగ నేల మీద నడవాలని కోరుకోవడం ఏంటీ? కవిత్వంలా గానీ చెప్పాడా? లేదా వ్యంగ్యమా? లేక నాకొచ్చిన అద్భుతమైన ఆలోచన వల్ల నాలో నేనే గర్వంతో ఆనందపడుతున్నానని ఊహించుకొని అసూయతో అలా అన్నాడా? లేక నేనేమైనా వెర్రిబాగులోడిలాగా కనబడుతున్నానా?
పరిచయమైన రెండు గంటల్లోనే చాలా చొరవ తీసుకుంటున్నాడనిపించింది.
“మీరు నన్ను ఆటపట్టిస్తున్నట్లున్నారు,” అన్నాను నవ్వుని నటిస్తూ. కానీ అతను చాలా గంభీరంగా మొహం పెట్టి-
“నేను చెప్పేది నిజం. చాలాకాలం నుండి నేను మనిషిలా రూపాంతరం చెందడానికి ప్రయత్నిస్తూ ఈ పరిసరాల్లోనే తిరుగుతున్నాను. కానీ ఎంత ప్రయత్నించినా అది సాధ్యంకావడం లేదు. నా మాటల్లో మీకు నమ్మకం లేకపోతే కాసేపు నా నడకని గమనించండి- మీకే తెలుస్తుంది,” అన్నాడతను.
నేను అతని పాదాలవైపు దృష్టిని సారించి అతడు నడుస్తోన్న తీరు చూసి దిగ్భ్రాంతి చెందాను.
అతను రెండడుగులు నేలమీద నడిస్తే రెండడుగులు గాల్లో తేలుతున్నాడు.చాలా జాగ్రత్తగా గమనిస్తేనేగానీ ఈ విషయం ఎవ్వరూ కనిపెట్టలేరు. భయంతో చెమటలు పట్టాయి నాకు. నృత్యం చేస్తోన్న చర్మం ఒక్కసారిగా వణికింది.
ఇట్లా నడుస్తున్న మనిషిని చూడ్డం జీవితంలో ఇదే మొదటిసారి. ఇతను చెబుతున్నదే నమ్మాల్సి వస్తే ఇతను గాల్లో తేలుతూ నేల మీద నడవడానికి ప్రయత్నిస్తున్నాడన్నది నిజమే. కానీ ఇదంతా నమ్మశక్యంగా లేదు.
“ఇది నా ఊహకే అందడం లేదు. మీరు చెప్పేదే నిజమైతే హాయిగా గాల్లో తేలే మీరు నేల మీద నడవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నట్లు?” అన్నాను ఇంకా ఆశ్చర్యంలోంచి తేరుకోకుండానే.
“ఎందుకంటే- నేను పుట్టడమే దూదిపింజలాంటి శరీరంతో పుట్టాను కాబట్టి… ఇంతకాలం ఈ తేల్షికైనతనాన్ని మోసీమోసీ, గాల్లో ఎగిరీ ఎగిరీ, శూన్యంలో తేలీ తేలీ బతుకుమీద రోత పుట్టింది కాబట్టి… జీవితంలో వైవిధ్యమే లేకుండా పోయింది కాబట్టి… చొప్పబెండులా చప్పబడిపోయిన ఈ శరీరమే గనుక బరువెక్కి, పాదాలు పూర్తిగా నేలమీద వాలితే- ఆ భారమైన అనుభూతిని ఆస్వాదిస్తూ ఈ భూమ్మీద తిరగాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నాను. కానీ ఈ జన్మలో అది జరిగే పనిలా కనబడ్డంలేదు. అయినానరే పట్టు వదలని విక్రమార్కుడిలా ఇవ్వాళ ఎలాగైనా ‘నడక’ని సాధన చేస్తూ అట్లా అరకులోయ దాకా వెళ్లొద్దాం అని బయలుదేరాను. ఈలోగా టైడా ఇవతల మీరు పరిచయమయ్యారు,” అన్నాడతను రెండడుగులు గాల్లో తేలుతూ రెండడుగులు నేలమీద నడవడానికి ప్రయత్నిస్తూనే.
నాకెందుకో వెన్నుపూసల మధ్య చలి పెట్టింది. అతను దెయ్యం కాదన్నది అతని పాదాల్ని చూస్తేనే తెలుస్తోంది. అతని పలువరన చూసినా, మాట్లాడే తీరుచూసినా ఎవ్వరికీ ఈ అనుమానం రాదు. ఈ భూమ్మీద ఇలాంటి మనుష్యులు కూడా జీవిస్తున్నారా అని తల్చుకుంటే సంభ్రమంతో కూడిన ఆశ్చర్యం కలిగింది. సృష్టిలోని అనేక వింతల్లో ఇతనొకడు అనుకొన్నాను. ఎందుకో అతడి పట్ల ఇంతకు ముందు కలిగిన భయం పోయింది. జాలి కూడా కలిగింది.
“ఇంతకీ మీది ఏ ఊరో చెప్పనేలేదు,” అనడిగాడు నా ఆలోచన్లను పుటుక్కున తెంచుతూ,
“విశాఖపట్నం,” అన్నాను.
అలా అంటున్నప్పుడు అప్రయత్నంగా అతడి కళ్లలోకి చూసి విస్తుపోయాను. అతడివి పక్షి కళ్లు. శరీరమంతా మనిషిది.
క్రమంగా అతను చెబుతున్నదంతా నిజం అన్న నమ్మకం బలపడింది.
“మీదే ఊరు?” అనడిగాను.
అతను వెనక్కు తిరిగి, “అదుగో… అక్కడ దూరంగా కొంచెం ఎత్తుగా కనబడుతున్న రెండు కొండల అవతలున్న చెట్లపాలెం. అవునూ! విశాఖపట్నం నుండి అరకు వైపు ఎవరైనా రైల్లోనో, బస్సులోనో వస్తారు కానీ మీరేంటి ఈ కొండల, లోయల మీదున్న రైలుపట్టాల మధ్య నడుచుకుంటూ ఒంటరిగా వస్తున్నారు. ఇంతకూ మీరూ అరకులోయ వరకేనా?” అనడిగాడు.
“అవును. శృంగవరపుకోట వరకూ రైల్లో వచ్చాను. అక్కడి నుండి ఈ పట్టాల మీద నడుచుకుంటూ అరకు వరకు వెళ్లిరావాలని చాలారోజులుగా అనుకుంటున్నాను. ఇదిగో… ఇప్పటికి వీలయింది. ఈ మార్గమధ్యంలో ఏదో అద్భుతం దాగి ఉందని ఎప్పట్లుండో నా సిక్త్ సెన్స్ చెబుతోంది. ఈ దారి ప్రతిరోజూ నా కలలో కన్పిస్తూ ఉంటుంది. కలలోనే ఆ అద్భుతం కోసం ఈ దార్లోనే వెదుకుతాను. కానీ కన్పించదు,” అని ఆగి-
“ఎవరు చెప్పాచ్చారు. ఆ అద్భుతం మీరేనేమో?” అన్నాను నవ్వుతూ.
అతనూ నవ్వాడు పక్షి కళ్లతో.
అతన్ని చూస్తోంటే ఏదో జన్మలో నాకు ప్రాణమిత్రుడై ఉంటాడనిపించింది.లోయల్లోంచి వస్తోన్న ఆకుపచ్చని వాసనని పీలుస్తూ సముద్ర మట్టానికి కొన్ని వందల అడుగుల ఎత్తున్న ఆ కొండల మీది మలుపులు తిరుగుతూ నడుస్తున్నాం.
అరకు వరకేనని అతనితో అబద్ధం చెప్పాను కానీ, నిజానికి నా గమ్యం- నేనిట్లా నేలమీద నడుస్తూ నడుస్తూ పక్షిలా మారిపోయి… గాల్లోకి ఎగిరేంతవరకూ.
ఈ విషయం అతనికి చెప్పదల్చుకోలేదు. గాల్లో ఎగరగలిగి ఉండీ మనిషిలా నేలమీద నడవాలని మోజు పడుతోన్న వాడికి నా లక్ష్యం చెబితే పడీపడీ నవ్వుతాడనిపించింది. అతని గమ్యం వేరు- నా గమ్యం వేరు. అయినా మా ఇద్దరి కలయిక విచిత్రమే అనిపించింది.
బరువైన శరీరం- మనసూ, ఇనుప వాసన వేసే జీవితం నుండి విరక్తి చెంది పక్షిలా మారి గాల్లోకి హాయిగా ఎగరాలని బయలుదేరిన నాకు- తేలికైన శరీరం పట్ల విసుగు పుట్టి- బరువైన శారీరక స్థితిలోకి మారాలని ప్రయత్నిస్తోన్న వ్యక్తి పరిచయం కావడాన్ని ఏ కోణంలోంచి అర్థం చేసుకోవాలో తెలియలేదు.
ఒక్కసారి చుట్టూ ఉన్న పరినరాల వంక పరిశీలనగా చూశాను. లోయలు శూన్యాన్ని తింటూ శూన్యాన్ని నెమరు వేసుకొంటున్నాయి. చెట్ల ఆకుల కింది నీడలు మధాహ్నపు నిద్రలో జోగుతున్నాయి. ఆకాశంలోని నీలిరంగుని కూడా కలుపుకొని వెలిగిపోతున్న ఎత్తయిన కొండలు ఎవరికీ అంతుబట్టని రహస్యాల గురించి గుసగుసలాడుకొంటున్నాయి.
చిన్నచిన్న జలపాతాల్ని, వంతెనల్ని, వాటి కిందున్న లోతుల్నీ దాటుకుంటూ నడుస్తున్నాం రైలు పట్టాల మధ్య.
మధ్యమధ్యలో ఎదురవుతోన్న చిన్నచిన్న రైల్వేస్టేషన్లు పాద్దునెప్పుడో కిరండోల్ పాసింజర్, దాని తర్వాత వచ్చిన రెండు మూడు గూడ్సు రైళ్లు కూడా వెళ్లిపోయాక మళ్లీ నిశ్శబ్దంలోకి వెళ్లిపోయి ఆ చుట్టుప్రక్కలున్న చెట్లతో కల్సి అలా ఉండిపోయాయి.
అక్కడక్కడా కొందరు రైల్వే గ్యాంగ్‌మెన్లు ఏవో పనులు చేనుకొంటూ కనిపించారుకానీ, వాళ్లు మమ్మల్ని పెద్దగా పట్టించుకోలేదు. ముఖ్యంగా గాల్లో తేలుతున్న అతడిని. మాకు కావల్సిందీ అదే అనుకొన్నాం.
“కనుచూపు మేరా పర్చుకొన్న ఈ ప్రకృతిని చూస్తోంటే ఇదంతా ఓ మర్మదేశంలా, మనం ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్లలా ఉన్నాం కదూ ఇప్పుడు,” అన్నాను.
అతను నవ్వాడు.
ఈ భూమ్మీద ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలెన్నింటినో వదిలేసి నాగరికులంతా ఇరుక్కొని ఇరుక్కొని కాలుష్యాన్ని తింటూ నగరాల్లో ఎందుకు బతుకుతుంటారో కదా అనిపించింది.
ఎవరి సంగతో ఎందుకు… నిన్నా మొన్నటి దాకా నేనూ అట్లా బతికినోడినేకదా…!
ఏదో… ఆ బతుకు మీద విరక్తి కలిగి… ఉన్నట్టుండి ఒకరోజు ఎందుకో- జీవితాన్ని మరణానికి ముందుండే కొద్దిపాటి సమయంతో ముడిపెట్టి చూసినందువల్లే కదా… లక్ష్యమేదో తెలిసినట్లనిపించి… ఎవ్వరికీ చెప్పాపెట్టకుండా ఇట్లా బయలుదేరింది…?
దూరంగా ఏదో రైల్వేస్టేషన్ కనిపించింది. బహుశా శిమిలిగూడ కావచ్చు. వీలైతే అక్కడ ఆగి టీ తాగాలి.
పక్షుల గుంపొకటి మా తలలకు కొంచెం దూరంలోంచి వెళ్లిపోయింది. సూర్యాస్తమయ సమయం దగ్గర పడుతోందని అర్ధమైంది. ఇతను అరకు వరకే నాతో కల్సి ప్రయాణం చేస్తాడు. నేను అరకు దాటి చాలా దూరం వెళ్లాలి. నా లక్ష్యాన్ని చేరుకోడానికి ఇంకా ఎంత దూరం ప్రయాణించాలో తెలీదు.
“బాగా చీకటిపడేలోగానే అరకులోయ చేరుకోవాలి,” అన్నాడతను.
“స్థలకాలాల న్నృహ బాగానే ఉంది కాబట్టి త్వరలోనే మీరు మనిషి బరువును పొంది నేల మీద పూర్తిగా నడవగలరన్న నమ్మకం కలుగుతోంది నాకు,” అన్నాను అభినందనపూర్వకంగా.
అతని పక్షి కళ్లు మెరిసాయి.
“అంతకన్నా కావలసిందేముంది?” అన్నాడు.
శిమిలిగూడలో ఆగి టీ తాగాను. అతడు అరటిపళ్లు మాత్రం తిన్నాడు.
శిమిలిగూడ ఈ దార్లోని అన్ని స్టేషన్ల కన్నా నాకు బాగా నచ్చిన ప్రదేశం. అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్న స్టేషన్‌గా భారతీయ రైల్వేలో ఈ స్టేషన్‌కి ప్రాధాన్యత ఉంది కానీ, దానికన్నా నాకు ఆసక్తి కలిగించే విషయం ఈ స్టేషన్ చుట్టూ ఉండే పరినరాలు. ఈ పరిసరాల్లోని వెలుగునీడల్లో, ఎత్తుపల్లాల్లో, మడతల్లో ఏదో అవ్యక్త దివ్యత్వం ఉన్నట్లనిపిస్తుంది.
ఇక్కడి ప్రకృతిలో పూర్తిగా మునగగలిగితే పట్టాల మీద వెళ్లే గూడ్స్ రైలు కూడా అలా ఏదో ఒకరోజు గాల్లోకి లేచి పక్షిలా మారి ఎగిరిపోతుంది అనుకున్నాను.
చెట్టు మీది నుండి చెట్టు మీదికి ఎగురుతూ నిశ్శబ్దాన్ని కొంచెం కొంచెంగా తాగుతోన్న పిట్టల్ని చూస్తోంటే బరువెక్కిన మానవ జీవితాన్ని తల్పుకొని దుఃఖం కలిగింది.
“వెళ్దామా… కాసేపట్లో చీకటిపడొచ్చు,” అన్నాడతను.
అక్కడ నుండి లేవబుద్ధి కాలేదు. అలాగని ఉండబుద్ధీ కాలేదు.
“పదండి,” అన్నాను లేస్తూ.
కొంచెం దూరం నడిచాక ఎందుకో వెనక్కి తిరిగి చూశాను. నాకెందుకో- ముందుకు వెళ్తూ మనిషి వెదుకుతున్నదేదో… అతడు హఠాత్తుగా ఆగి- ఎందుకో వెనక్కి తిరిగి చూసుకున్నపుడు… అది అంతకు క్రితమే అతడు దాటి వచ్చిందై ఉంటుంది, అని అనిపిస్తుంటుంది. ఎందుకలా అనిపిస్తుందో తెలియదు.
వెనుక శిమిలిగూడ స్టేషన్ కనిపించలేదు. చీకటిని నింపుకుంటోన్న వలిసెపూల వసుపుదనం అవతలి దృశ్యంలో కనుమరుగైపోయింది.
“ఇవాళ పౌర్ణమి కదూ…” అనడిగాడతను ఏదో గుర్తుకు తెచ్చుకొంటూ.
“అవును,” అని, “మర్చేపోయాను. అయితే ఈ రాత్రంతా వెన్నెల్లో తడుస్తూ ఈ ప్రయాణాన్ని మరింత ఆహ్లాదంగా కొనసాగించవచ్చునన్నమాట,” అన్నాను హుషారుగా.
అతను మాత్రం “నేను అరకులోనే ఆగిపోతాను. సాధారణంగా నేను రాత్రివేళ ప్రయాణం చేయను. మీతో కల్సి ఇట్లా ప్రయాణించడం నాకూ బాగానే వుంది. కానీ ఇప్పటికే నా కాళ్లు బాగా నొప్పి పెడుతూండడం వల్ల ఈ రాత్రంతా అరకు ఊరవతల విశ్రాంతి తీసుకొని రేప్పాద్దున మళ్లీ వెనక్కి బయలుదేరి నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనిపిస్తోంది,” అన్నాడు.
“మీ ఇష్టం. మీకెట్లా అనిపిస్తే అట్లాగే చేయండి. కానీ నాకెందుకో ఈ ప్రయాణంలో మీ పరిచయం, అనుకోకుండా ఇవాళ పౌర్ణమి అయి ఉండడం… ఇవన్నీ తల్చుకొంటొంటే ఈ రాత్రే ఈ దార్లో నేను కలలో వెదుకుతోన్న అద్భుతం ఎదురవుతుందని అనిపిస్తోంది. ఎందుకో… అసలు ఇది మొత్తం నా జీవితంలోనే అత్యంత ముఖ్యమైన రాత్రి అని కూడా అనిపిస్తోంది,” అన్నాను, కొండల మీద పూర్తిగా పరుచుకుంటోన్న చీకటిని చూస్తూ.
అతను ఆలోచనల్లో పడ్డాడు. ఏమనుకొన్నాడో ఏమో కాసేపటి తర్వాత,“పదండి, నేనూ మీతోనే వస్తాను. ఎందుకో మీ మాటలు వింటోంటే ఈ రాత్రే నేను కూడా నా లక్ష్యాన్ని చేరుకోగలననిపిస్తోంది,” అన్నాడు.
నాకు చాలా ఆనందం కలిగింది అతడూ నాతో పాటే కల్సి మరికొంత దూరం ప్రయాణించబోతున్నందుకు.
ఏదో ఒక తోడు లేకపోతే, ‘పోల్చుకోవడం’ చేతగాక- “నిర్ధారణ’కు రావడమెట్లాగో తెలియక- పిచ్చెక్కి… మనిషి ఆత్మహత్య చేసుకొంటాడనుకుంటా.
గమ్యస్థానమైన అరకుని మానసికంగా తీసిపడేశాక అతను నింపాదిగా నడవడం (ఎగరడం) మొదలుపెట్టాడు. అది నాక్కూడా సౌకర్యంగా అనిపించింది. ఇంతకుముందు నడక సాధనలో వేగం వల్ల అతడితో సమానంగా నడవడానికి నేను కూడా కొంచెం ఆయానపడాల్సి వచ్చింది. ఇప్పుడా బాధ తప్పింది.
“ఎంత దూరమైనా సరే- ఇలాగే తెల్లారేదాకా నడుద్దాం. ఈ వెన్నెల రాత్రిని కీర్తిస్తూ,” అన్నాను భావుకతతో.
“అలాగే. ఈ రాత్రి చేయబోయే ప్రయాణం తల్చుకొంటుంటే నాక్కూడా కాళ్ల నొప్పులు మాయమై మళ్లీ హుషారొచ్చింది,” అన్నాడతను చురుగ్గా.
అరకు రైల్వేస్టేషన్ని సమీపించాం కానీ దాని స్థల స్పృహ కూడా లేకుండా ఆ స్టేషన్‌ని దాటి చాలా దూరం వచ్చేశాం. ఇప్పుడు కాలస్పృహ కూడా పోయింది. అర్ధరాత్రి దాటిపోయిందన్న విషయాన్ని కూడా మేం పట్టించుకోలేదు. రాత్రి చేయాల్సిన భోజనం మీద కూడా ధ్యాసే లేకుండాపోయింది.
పున్నమి చంద్రుడు పెట్రేగిపోతున్నాడు. ఆకాశం నుండి కారుతోన్న వెన్నెల కింద తడుస్తూ కొండలు, మలుపులు, చెట్లు, అకులు, ఆ ఆకుల చివర నుండి మొదలయ్యే శూన్యం… అన్నీ ఆ రాత్రి తాంత్రిక స్నానం చేస్తున్నట్లనిపించాయి.
లోయల మీద పర్చుకొన్న వెన్నెల చర్మ సౌందర్యాన్ని తాగుతూ అట్లా ఎంత దూరం నడిచామో తెలీదు. అతను ఇంకా రెండడుగులు గాల్లో, రెండడుగులు నేల మీద వేస్తూ వస్తూనే ఉన్నాడు.
చాలాసేపటిదాకా మేమిద్దరం మాట్లాడుకోలేదు. కీచురాళ్ల శబ్దానికీ శబ్దానికీ మధ్యనున్న నిళ్శబ్దంతో కలిసి మా ఇరువురి శరీరాలు ఆ ఎత్తయిన కొండల మీది రైలుపట్టాల మధ్య అలా చాలా దూరం ప్రయాణించాయి.
నిశ్శబ్దాన్ని చీలుస్తూ అన్నాడతను.
“టూరిస్టులందరూ అరకు వరకే వచ్చి చూసి వెనక్కి వెళ్లిపోతుంటారు కానీ, అరకువ్యాలీ అవతల కూడా చాలా టన్నెల్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా మనం చూసిన వాటికన్నా పెద్ద లోయలున్నాయి. ఇంకాసేపట్లో చాలా పెద్ద టన్నెల్ రాబోతోంది. ఇంతకు ముందు మనం దాటొచ్చిన అన్ని సారంగాల కన్నా పాడవైంది. ఈ సమయంలో రైళ్లేవీ ఈ మార్గంలో తిరగవు కాబట్టి లోపలంతా కటిక చీకటిగా ఉంటుంది. జాగ్రత్తగా నడవాలి. కనీసం మన దగ్గర అగ్గిపుల్ల కూడా లేదు కాబట్టి.”
“పెద్ద టన్నెల్ అంటున్నారు. కొంపదీసి దాంట్లో దూరి అవతలికి వెళ్లేసరికి పూర్తిగా తెల్లారిపోదు కదా?”అన్నాను జోక్ చేస్తున్నట్లుగా.ఇద్దరం టన్నెల్ ని సమీపించాం.
అతను నా జోక్‌కి నవ్వలేదు.
“ఏమో! ఎవరు చెప్పాచ్చారు? తెల్లారొచ్చు లేదా ఇంకెప్పటికీ తెల్లారకపోవచ్చు. నాకు మాత్రం ఈ రాత్రి నుండి వస్తోన్న వాసనని గమనిస్తోంటే ఈ సొరంగం అవతలికి వెళ్లేలోపు నా లక్ష్యం మాత్రం నెరవేరబోతోంది అనిపిస్తోంది,” అన్నాడు.
అతని మాటల్లో ఏదో ప్రాకృతిక రహస్యం బలంగా వ్యక్తం కావడానికి గింజుకున్నట్లనిపించింది. వెన్నెల కాంతిలో అతని ముఖంలోని సీరియస్‌నెస్‌ని చూస్తోంటే నేను కూడా పక్షిలా ఎగరగలిగే సమయం ఇక వచ్చేసిందేమో అన్పించింది. ప్రతి రాత్రీ కలలో ఈ దార్లో నేను వెదికే అద్భుతం బహుశా ఈ టన్నెలేనేమో అని కూడా అనిపించింది.
“అయితే మనం ఇట్లా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లే కన్నా ఏదైతే అదయింది- వేగంగా ఈ సారంగంలో పరుగెత్తుకొంటూ వెళ్తేనే పూర్తిగా తెల్లవారకముందే మనం ఈ టన్నెల్ అవతలి భాగానికి చేరుకోగలం,” అని, “మన లక్ష్యాన్ని అందుకోగలం అని నాకనిపిస్తోంది,” అన్నాను టన్నెల్ వైపు బాగా తలెత్తి చూస్తూ.
వేగంగా పరుగెత్తడం వల్ల పక్షిలాగా ఎగిరే అవకాశం త్వరగా రావచ్చేమోనని, పక్షులు సూర్యోదయానికి ముందే ప్రయాణానికి సిద్ధం అవుతాయి కాబట్టి ఈలోపే నా లక్ష్యాన్ని చేరుకోవాలని నా తాపత్రయం.
“మీ అయిడియా చాలా బావుంది. అయితే ఇంకో ప్రయోగం కూడా చేద్దాం… మనమిద్దరం ఒక నూతన జన్మను ఎత్తాలనుకుంటున్నాం కాబట్టి- అప్పుడే జన్మించిన శిశువులా నగ్నంగా మారిపోదాం. కొత్త జన్మ ఎత్తడానికి ఒక్కోసారి ఒంటి మీది నూలు పోగు కూడా అడ్డం అవుతుంది,” అన్నాడతను.
“మనిద్దరం’ అని సంబోధిన్తున్నాడంటే నా లక్ష్యాన్ని పసిగట్టేశాడా ఈ పక్షి కళ్లోడు. కనిపెడితే కనిపెట్టాడ్లే కానీ అతను చెబుతోన్న దాంట్లోనూ సత్యముందనిపించింది. నగ్న సత్యం అంటే ఇదే కాబోలు.
అతడట్లా అన్నాక ఒక్కసారిగా ఒంటి మీది బట్టలు బరువుగా తోచాయి. ప్యాంటూ, షర్టూ విప్పేశాను. బనీను కూడా తీసి అవతల పడేసి అండర్‌వేర్ విప్పుతోంటే- దట్టమైన ఆ అరణ్యంలో… ఆ రాత్రి… ప్రాచీన మానవుడి ఆవిర్భావ అనంతర అనేక నాగరికతల్ని ఒక్కసారిగా విడిచిపడేసిన భావన కలిగింది. శరీరమెందుకో పులకరించింది.
ఆ పులకరింతతోనే టన్నెల్లోకి అడుగు వేశాను. అతను నగ్నంగా కనిపించడానికి సిగ్గుపడ్డాడేమో సొరంగం లోపలికి అడుగుపెట్టగానే మొదలయ్యే చీకట్లో రైలు పట్టాల అవతలివైపు నిలబడి ఉన్నాడు. అతను విడిచిన బట్టలు అతని వెనుక వెన్నెల్లో పడున్నాయి.
“మిత్రమా! ఇంకా ఎక్కువ సమయం లేదు.పరిగెత్తు.మళ్ళీ ఆ టన్నెల్ చివర్లో అద్భుతంగా …కలుద్దాం.ఆల్ ది బెస్ట్”,అని నా ప్రతిస్పందన కోసం ఎదురుచూడకుండానే పరిగెత్తడం ప్రారంభించాడు.
అతడలా అక్కడ్నుంచి వెళ్లిపోగానే ఒక్కసారిగా ఒంటరివాడ్నయిపోయిన భావన కలిగింది. నా వెనుక అనంతమైన నిశ్శబ్దం మిగిలిపోయింది.
ఒంటరితనాన్ని ఆసరా చేసుకొని భయం ప్రవేశించకముందే లక్ష్యంవైపు గురిపెట్టాలి అనుకొని- గుండెల నిండా గట్టిగా గాలి పీల్చుకొని రైలుపట్టా ఇవతలి పక్కనుండి పరుగెత్తడం ప్రారంభించాను.
కళ్లకి ‘గుప్పు’మని కొట్టింది సారంగంలోని చీకటి. కళ్లు మూసుకున్నా తెరుచుకున్నా ఒకేలా ఉంది… నల్లగా.
ఆ నలుపురంగుని చీల్చుకొంటూ ముందుకి దూసుకుపోసాగాను. నా నగ్న శరీరం ఆ టన్నెల్లో గడ్డ కట్టిన చీకటిని కత్తిలా కోయసాగింది.
అట్లా పరుగెత్తుతూనే తల మాత్రం వెనక్కి తిప్పి చూశాను. బోర్లించబడ్డ నల్లని ఇంగ్లీష్ “యు’ ఆకారం అవతల వెన్నెల్లో వెలుగుతోన్న ప్రకృతి ఈ రాత్రి సంభవించబోయే అన్ని పరిణామాలను కనురెప్ప కూడా వాల్చకుండా ఉద్విగ్నంగా చూస్తున్నట్లనిపించింది.
దబ్బుమని కిందపడ్డాను కాళ్లకి ఏదో తగిలి, కానీ దెబ్బలేమీ తగల్లేదు.
“కమాన్ లేచి పరుగెత్తు… ఎక్కువ టైం లేదు మనకు, నువ్వన్నట్లు సూర్యోదయానికి ముందే ఈ టన్నెల్ చివరికి చేరుకోవాలి. లేకపోతే నువ్వు నీ అద్భుతాన్ని అందుకోలేవు. నేను నా లక్ష్యాన్ని చేరుకోలేను. మూవ్… ఫాస్ట్…” అంటున్న అతని మాటలు సొరంగంలో ప్రతిధ్వనించాయి.
నేను కిందపడ్డానన్న విషయం అతడికెలా తెల్సిందో? చప్పుడుని బట్టి గ్రహించాడా? లేకపోతే పక్షి కళ్లు కదా… చీకట్లో కూడా కన్పించిందా?
రెండు చేతుల మీద స్ప్రింగ్ లా లేచి నిలబడి, పిచ్చిపట్టినట్లు పరుగెత్తడం మొదలుపెట్టాను. గబ్బిలాల కంపు ముక్కుపుటాల్ని బద్దలు చేస్తోంది. ఎక్కడ ఏ మలుపు వస్తుందో తెలీదు. ఏది తగిలి కింద పడతానో తెలీదు. ఇంకేమీ ఆలోచించకుండా వేగంగా పరుగెత్తడం ఒక్కటే ఇప్పుడీ జీవితానికి సంబంధించిన అత్యంతముఖ్యమైన విషయం అనుకొన్నాను. వేగం తీవ్రతను ఇంకా పెంచాను. గుండెగంటకి ఎన్నిసార్లు కొట్టుకుంటోందో దానికే అర్థం కానంత వేగంగా పరుగెత్త సాగాను.
“ధం… థిం… థిం… థిం…’ శ్వాన నా చుట్టూ వున్న పరిసరాల్లోని గాలిని చీల్చి చెండాడుతోంది. అట్లా ఎంత దూరం పరుగెత్తానో తెలీదు. ఇంకా ఎంత దూరం పరుగెత్తాలో కూడా తెలీదు. పక్షిలా గాల్లోకి లేచి ఎగిరిపోయే దృశ్యం తప్పనా కళ్లకి ఇంకేం కనిపించడం లేదు.
ఈలోపు ఓ అద్భుతం జరిగింది. క్రమంగా రెండు చేతులు నా ప్రమేయం లేకుండానే భుజాల వరకూ పైకి లేవసాగాయి. ‘ఓ…!’ అంటూ కేక పెట్టాను వెర్రి ఆనందంతో అట్లా పరుగెత్తుతూనే. నా సంతోషానికి అవధుల్లేవు. నా వాంఛ నెరవేరబోయే సమయం రానే వచ్చేసింది. బహుశా ఇంకాసేపట్లో పక్షిలా మారి పైకి లేచి ఈ సొరంగం అవతలి మార్గం నుండి ఇంకా ఉదయించని నూర్యుడివైవు రెక్కలూపుకుంటూ పోతానన్నమాట.
అట్లా పరుగెత్తుతూనే, “మాస్టారూ ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? మీ లక్ష్యం నెరవేరిందా?” అని అరిచాను.
ఎలాంటి ప్రతిస్పందన లేదు.
అయితే ఈపాటికే అతను ఈ టన్నెల్ చివరికి చేరుకొని ఉంటాడా? మనిషిలాంటి బరువుని నంతరించుకొని పూర్తిగా నేల మీద పాదాల్ని అనించి నడక ప్రారంభించి ఉంటాడా? లేకపోతే పలకడేంటీ?
“హలో మాస్టారూ…” అని అరుస్తూ శరీరంలోని శక్తిని మొత్తం కాళ్లలోకి తెచ్చుకొని పరుగెత్తసాగాను. కాళ్ల కింద కంకరరాళ్లు పిండి అవుతున్నాయి. నా అడుగుల శబ్దానికి బెదిరిపోయి టన్నెల్లోపలి పైకప్పుకి అతుక్కొని ఉన్న గబ్బిలాలు చెల్లాచెదురయినట్టున్నాయి. నాలుగైదు నా నగ్నశరీరాన్ని గీరుకుంటూ వెళ్లాయి.మంట… అయినా దేన్నీ పట్టించుకొనే స్థితిలో లేను.
పరుగెత్తడం… పరుగెత్తడం… పరుగె… అంతే.
పక్షి రెక్కలలాగా చేతులైతే భుజాల వరకూ పైకి లేచాయి కానీ శరీరమే ఇంకా దూదిపింజలా మారలేదు. ఆ బరువు తెలుస్తూనే ఉంది. ఇంకా ఇట్లాగే పరుగెత్తుతూ పోతే లాభం లేదనిపించింది.
ఏదైతే అదయింది- మరింత… మరింత వేగంగా ఇంకో పదిహేనూ ఇరవై అడుగులు పరుగెత్తి… ఒక్కసారి గాల్లోకి ఎగిరి దూకితే టన్నెల్ చివరి అంచుకి చేరుకోవచ్చేమో- అని ఆ క్షణం ఎందుకో బలంగా అనిపించింది. ఇంకేం ఆలోచించలేదు.
ఒంట్లోని రక్తాన్నంతా పాదాల్లోకి తెచ్చుకొని పెద్ద పెద్ద అంగలు వేసుకొంటూ… పరుగెత్తీ… పరుగెత్తీ… దాదాపు ఇరవై అడుగులకి పైగా వేశాక రెండు కాళ్లతో స్ప్రింగులా… బలంగా ఒక్కసారి గాల్లోకి ఎగిరి ముందు వైపుకి దూకాను.
చాలా పెద్ద గెంతు అది.
అట్లా ఎగిరి ముందుకి దూకగానే… అప్పటిదాకా లేని స్వచ్చమైన చల్లగాలి నా ముఖానికి రివ్వుమని కొట్టింది.
అంటే- అంటే- నేను టన్నెల్ చివరి అంచుకి వచ్చేశాను. పక్షిలా గాల్లో శాశ్వతంగా ఎగరబోయే క్షణం ముంగట్లోకి వచ్చేశాను. సంతోషం పట్టలేక రెండు చేతుల్నీ పక్షిలా ఆడించాను. ఇంకా నా శరీరం గాల్లోనే ఉంది. అంటే పక్షిలా మారిపోయానన్నమాట. ఆనందంతో మళ్లీ రెక్కల్ని రెపరెపలాడించాను.
ఏదో తేడాగా అన్పించింది. గాల్లోనే తేలుతున్నాను కానీ పైకి ఎగరడానికి బదులు కిందికి జారుతున్నాను.
ఏదో అనుమానం వచ్చింది. ఒక్కసారి నా శరీరంవైపు చూసుకొన్నాను.అప్పుడు గుర్తొచ్చింది నేను చాలాసేపట్నుండి కళ్లు మూసుకొనే ఉన్నానని.
‘టప్’మని కళ్లు తెరిచాను. భగ్గుమని కళ్లల్లోకి కొట్టింది ఆకుపచ్చ నేపధ్యాన్ని కలిగి ఉన్న వెలుతురు.
“అప్పుడే తెల్లారిపోయిందా?’ అనుకొన్నాను ఆ వెలుతురుని చూసి.
ఎందుకో కడుపులో దేవినట్లయింది. కళ్లు గిర్రున తిరిగాయి. చేతుల్ని అలాగే పక్షిరెక్కల్లా చాచి ఒక్కసారి నా దేహంవైపు చూసుకొని షాక్ తిన్నాను.
నా ఒంటి మీద జీన్ ప్యాంటు, టీ షర్టూ వున్నాయి. టన్నెల్ అవతలి ద్వారం దగ్గర నేను విడిచి పడేసినవి.
మళ్లీ అవి నా ఒంటి మీదికి ఎట్లా వచ్చాయో తెలీదు. అనలు నేను ఎక్కడ ఉన్నానో… చుట్టూ చూశాను.
నేనో పెద్ద లోయలోంచి చాలా వేగంగా జారిపోతున్నాను. నా శరీరంలో ఎలాంటి మార్పు లేదు. అదే బరువు. దాని చుట్టూ కమ్ముకున్న అదే మానవ చర్మం.
భుజాల పక్క నుండి పైకి లేచిన రెండు చేతుల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. అక్కడ ఏ పక్షి రెక్కలూ లేవు. నా శరీరం ఇంకా లోయలోకి జారుతూనే ఉంది. ఇంకా ఎంతసేపు అలా జారతానో తెలీదు. నేల మాత్రం కనుచూపు మేరలో కనబడడం లేదు. కిందంతా పచ్చని రంగు మాత్రం కనిపిస్తోంది.
మొత్తం నా ఆశలన్నీ అడియాసలయిపోయాయి. అసలు నేను లోయలోకి ఎప్పుడు దూకానూ? టన్నెల్ ఏమైందీ? టన్నెల్ చివర లోయ ఉందా? భుజాలదాకా లేచిన చేతులు ఎలా మాయమయ్యాయి? అన్నింటి కన్నా ముఖ్యంగా అతనేమయ్యాడు?
నాకన్నా ముందే పరుగెత్తాడు కాబట్టి టన్నెల్ చివరున్న ఈ లోయలోకి జారి కిందికి వెళ్లిపోయి ఉంటాడా? లేదా- ఎంత పిలిచినా పలకలేదు కాబట్టి- ఆ సొరంగంలోనే ఎగరలేక, నడవలేక స్పృహ తప్పి పడిపోయి ఉంటాడా? ఇంతకీ మనిషి బరువును సంతరించుకొన్నాడా? లేదా?
ఏదో అనుమానం వచ్చి తలను పూర్తిగా పైకెత్తి నేను జారుతోన్న లోయ పైభాగపు అంచువైపు చూశాను.
దూ…రం..గా ..
చాలా… చా…లా… దూ…రం…గా… లోయ రెండు అంచుల్ని కలువుతూ వేసిన రైలు పట్టాల మధ్యలోంచి ఒక పక్షి ఆకాశం వైపు ఎగురుకుంటూ వెళ్తోంది. అంత పెద్ద గుండ్రని అంచు కలిగిన లోయ మీద ఇంత పెద్ద అరణ్యంలో ఎగురుకుంటూ ఒకే… ఒక… పక్షి.
అనుమానం లేదు… అది… అతడే…
పాపం… పూర్‌ఫెలో’ అనుకొన్నాను.
క్రమంగా నాకు ఏదో కొంచెం కొంచెంగా అర్ధమవసాగింది. కానీ ఒక్క విషయం మాత్రం ఎందుకో అర్ధం కాలేదు.
* * *

భగవంతం
భగవంతం అసలు పేరు మైసా నరసింహారావు. 20, మే 1970 లో ఉమ్మడి ఖమ్మం జిల్లా (ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) కొత్తగూడెంలో జన్మించారు. ప్రస్తుతం స్వంత ఊళ్ళోనే భారతీయ జీవిత భీమా సంస్థలో ఉద్యోగం. కథలు కవిత్వం రాస్తారు. తన మొదటి కథా సంకలనం 'లోయ చివరి రహస్యం' పేరున ఈ సంవత్సరం (2024) ప్రచురించారు. ఫోన్ నెం - 9399328997
My dear bhagavamtam
లోయ చివరి రహస్యం
మళ్లీ చదివాను
గొప్ప అనుభూతి కావ్యం గ్రేట్
—మంచికంటి