మాయా మోహం

Spread the love

“ఒకటి పుడితే, మూడు. లెక్కిప్పుడు సరిగ్గా వత్తాది అనుకుంటా” అన్నాడు నేసైయన్.

“ఏందిరోయ్, నువ్వేమైనా అమృత సంజీవినా కాయబోతుండావ్? కాసేది నాటు సారా. కొండసరుకు. అందులో ఏందీ సైన్సు? బొంగు….? నాకు కావలసింది డబ్బై లీటర్ల సారా. ఎల్లుండికల్లా అరుమనై అండిపీసులో తీసుకెళ్ళి సరుకు దింపాలి. నీవల్లవుతుందా అని ముందే సెప్పేయ్. కాదంటే మన దగ్గర మనుషులున్నారు” అన్నాడు లాత్తి మాణిక్కం.

“దాన్ని నేను సరిగ్గానే సేసివ్వగలను. ఏం సేసినా ఒక పద్దతిలో సేద్దాం గదా అని అట్టా సెప్పాను”

“అరేయ్, ఇది తాగనోడి కోసం ఏమనుకుంటున్నావు? తాగనోడిని నువ్వు ఎరుగుదువా? ఊరకే మనలో మన మాట. నిన్ను తీసుకెళ్ళి, ఇది తాగేటోడు ఎక్కడ నుండి ఎట్టా తాగతున్నాడని అని సూపించాలిగా. అడవి కొండపై నిటారుగుండే బండరాయి మీద మలైమాడన్ సామిలా ఆడనే ఉండి అలవాటు పడ్డావు సూసుకో… ఓ సారీ కిందకు దిగిరా… సూపిత్తాను” అన్నాడు లాత్తి.

“నాకు తెలుసు” అన్నాడు నేసైయన్.

“తెలుసా? అక్కడ, రుసికో, వాసనకో, కలకో సోటుందా? మనిషి వత్తుంటాడు, ఆత్మకు నిప్పెట్టి మంటబెడతాడు. ఆ మంటల్లోనే తగలబడిపోతాడు. ఎక్కడో ఓ చోట్లో కాలి, కట్టై కాలుతాడు. అంతే. పోతావా”

నేసైయన్ దానిని ఎరుగుదుడు. దరిదాపుగా అంగళ్ళ వెనుక భాగంలో దించి కట్టినటువంటి వాలులో, కొన్నిసార్లు బజార్లను ఆనుకొని ఉన్నటువంటి మురికివాడల్లో లారీ ట్యూబుల్లో సారాయి నింపబడుంటుంది. పాత లారీటైర్లు బొక్కలు, అంటింపులతో దుమ్మూధూళితో పేరుకోపోయిన ప్రదేశం. ఉచ్చలకంపు, వాంతుల వెగటు, సారాయి కంపు రాకుండా అక్కడ డీజిలును గ్రీసుతో పాటు కలిపి జల్లుతారు. తెలిసినవారికే సరుకు ఇవ్వబడుతోంది. లేకుంటే కనీసం తెలిసినవాడితోనైనా రావాలి.

డబ్బును అందుకొని ట్యూబ్ వాల్వ్ తెరిచి సత్తుగ్లాసులో పోసి ఇస్తారు. వచ్చినోడే నంచుకొనేందుకు ఏమైనా వెంట తెచ్చుకోవాలి. ఏ పచ్చడిబద్ద అనో, చిప్స్ అనో. అయితే సగానికి పైగా వచ్చినోళ్ళు కిరాణా కొట్లో కెళ్ళి ఉప్పుశనగలను కొని తెచ్చుకుంటారు. ముక్కు మూసుకొని ఒక గుటకేసి, ఒళ్ళు తూలుతూ, వాంతి వచ్చినట్టు వెగటుగా ఉంటే తేనుపు వదిలి ఉప్పుశనగలను నోట్లో వేసుకొంటారు. మళ్ళీ గుప్పుమనే ఒక తేనుపు. పళ్ళు కొరుక్కొని పెదవులతో ఒక ఇకలింపు. ఆ వెంటనే, పక్కకు తప్పుకుంటారు. ఇక అంతే, అంతకుమించి వాళ్ళకు ఇంకేది పట్టదు.

వాళ్ళకు తెలిసిందల్లా ఒకటే. వాళ్ళకు లోపలికి వెళ్ళే కొద్దీ లోపలి నుండి మంటలు దావానంలా అంటుకొని ఎక్కాలి. చెవులకు మంట ఎక్కాలి. శ్వాసలో ఆవిర్లు లేవాలి. కళ్ళు ఉష్ణంతో నిండాలి. నోట్లో పిసుపిసుమని ఉమ్ము ఊటలూరాలి. చెమటపట్టి, నడక తడబడి కాసేపట్లోనే తల దిమ్మెక్కాలి. వారికి కంటిముందు తెలిసిన ప్రపంచం పూర్తిగా కనుమరుగవ్వాలి.

ఒక్కొక్కరు మద్యానికి అలవాటుపడిన తాగుబోతులు. తాగుబోతులకు మత్తు అంత తేలికగా ఎక్కదు. బురదలో చిక్కుకొని వజ్రంలా మారినటువంటి కట్టెలు అంత తేలికగా మంట అంటుకోవు. మంట రాజుకోవడానికి అనేక యుక్తులను వాడుతుంటారు. లీజ్ రాజప్ప సరుకులో, ఎవరెడీ బ్యాటరీలను వేస్తుంటారు. గంజాయి ఆకులను వెయ్యడం అలవాటు. ఉమ్మెత్తకాయలు కూడా వేస్తుంటారు. ఇక్కడ ఏది వేసినా ఎవరికీ ఎటువంటి ఫిర్యాదులు లేవు. మొత్తమ్మీద ఏదేమైనా ఇక్కడ చివరిగా అందరికీ కావలసింది మత్తెక్కడం, మంటలు పైకి ఎగదన్నడం; ఆపై బూడిదవ్వడం.

నేసైయన్ ఏరోజూ కల్తీ సారాయి కాచేందుకు ఒప్పుకొనింది లేదు. పైగా అతడు అందుకు ఒప్పుకోడన్న సంగతి లాత్తికి కూడా బాగా తెలుసు. నేసైయన్ తండ్రి సూసై కూడా ఇదే చేసేవాడు. ఇప్పటికీ ఆయన చేతిరుచిని గుర్తుచేసుకొనే ముసలోళ్ళు ఉండనే ఉన్నారు. పోలీసులు ఆయన్ని ఎత్తుకెళ్ళి, మెడలో ఖాళీ సీసాలను వేలాడదీసి తన్ని ఈడ్చుకొని వెళ్ళారు. స్టేషనులో పెట్టి తెల్లరేదాక చావగొట్టారు. తెల్లారేసరికి స్టేషన్ లాకప్పులో చచ్చిపడున్నాడు. ఆయన్ని నేరుగా ఆసుపత్రికి తరలిస్తే, గుండెపోటుతో చనిపోయినట్టుగా రిపోర్ట్ రాయించి తీసుకున్నారు.

అయితే, నేసైయన్ సరిగ్గా నెల తిరిగేలోపు వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. అతడు తండ్రితో పాటు ఎనిమిదేళ్ళు పనిచేసినవాడు. అతడు ఇది తప్ప ఇంకో పని చెయ్యలేడు. అది చెయ్యడం వలనే అతడు నేసైయన్ అయ్యాడు. డబ్బు అతడికి అసలు పెద్ద విషయమే కాదు. ఎళ్ళుమలై కొండలో డబ్బుకు పెద్ద విలువ లేదు.

అతడి భార్య కంటతడి పెట్టుకొని “మనమేదైనా కూలీ పని సేసుకొని పొట్ట నింపుకుందాం. నా మాట ఇనండి” అంది.

“నేను కూలోడిని కాదు” అని అన్నాడతడు. “నేను సెయ్యగలిగింది ఇది మాత్రమే”… “పులికాడ గర్జించమాకు, మియావ్ అని పిల్లి కూతలు పెట్టు అని అంటావా? అది ఎన్నటికీ జరగని పని.”

ఆ రోజు అర్ధరాత్రి, చాపపై వెల్లకిల్లా పడుకొని ఇంటిపైకప్పును చూస్తున్నాడు.

ఆమె కోపంతో పైకి లేచి “అట్టాగంటే ముందు నన్నూ, నా బిడ్డల్ని సంపేయండి” అంది.

అతడు మారు మాట్లాడకుండా పడుకున్నాడు. అతడు ఆమెతో మాట్లాడటమే చాలా తక్కువ.

“నేను ఇకపై ఈ కొండల్లో ఉండను. యాడకైనా పోయి ఇసుక తట్టలు మోసుకు బతుకుతాను… కూలీ పని సేత్తాను. నా పిల్లలు ఈ పని సెయ్యరు.”

“అతడు బదులివ్వకుండా లేచెళ్ళి వరండాలో కూర్చొని ఒక బీడీ వెలిగించాడు. ఆమె ఇంట్లో వెక్కివెక్కి ఏడుస్తోంది.

ఆమె చెప్పినట్టుగానే మరుసటిరోజు ఇల్లొదిలి వెళ్ళిపోయింది. అందుకు అతడు ఆమెను వద్దని వారించలేదు. అతడు శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు. ఆమె చంకలోని చిన్నోడు నోట్లో వేలు పెట్టుకొని చప్పరిస్తున్నాడు. పెద్దోడు పదే పదే అతడినే చూస్తున్నాడు. ఆమె చివరిగా ఒకసారి వెనుతిరిగి చూసింది. కన్నీరును కట్టడి చెయ్యలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది.

ఊళ్ళోవాళ్ళు ఆమె మూలచ్చల్ దగ్గర ఉన్నటువంటి ఆమె మేనమామ దగ్గరకు వెళ్ళిపోయిందని చెప్పుకోసాగారు. లాత్తి అక్కడకు వెళ్ళి ఆమెను కలిసి చేతిఖర్చులకు డబ్బులిచ్చి వచ్చాడు. ఆమె ఆ ఊర్లో ఒక బడ్డీకొట్టు పెట్టుకున్నట్టు నేసైయనుకు విషయం తెలియవచ్చింది. ఈ ఎనిమిదేళ్ళలో అతడు ఒక్కసారి కూడా ఆమెను వెళ్ళి పలకరించిన పాపాన పోడు.

లాత్తి “సరుకు కిందకు దించు… రాగానే ఓ సారీ సూసుకో. నేను రేపొద్దున వత్తాను” అని తోలు సంచిని చంకన పెట్టుకొని ఒంటికాలి బాటలో ఇరంబన్ రాఘవన్ దగ్గర ఉన్నటువంటి బైకుపై ఎక్కాడు. ఇరంబన్ కాలితో ముందుకు తోసుకుని తోసుకుని తన్నితే డొక్కు బైకు ఎటువంటి శబ్దం రేకిత్తించకుండా ముందుకెళ్ళింది. కిందకు వెళ్ళాకనే ఇంజన్ను స్టార్ట్ చేస్తారు.

నేసైయన్ కొండపైకెక్కి వెళ్ళాడు. గుర్రపుబండరాయి పోటును దాటుకుని, పందిబండరాయిపై ఎక్కి అవతలివైపుకు వెళితే అతనుంటున్న ప్రదేశం. అయితే పందిబండరాయిపై నుంచుంటే కూడా ఏమీ కనిపించదు. పైనుండి దొర్లుకొంటూ అక్కడక్కడా మధ్యలో స్తంభించిపోయిన రాళ్ళే, చిన్న చిన్న కట్టడాల్లా, దున్నపోతుల గుంపులా కనిపిస్తాయి. కింద వాలు అంచుల్లో కొండవాగు ప్రవహిస్తోంది. బండరాళ్ళ మధ్యన నీటిశబ్దం, నీటిచీలికలు. చాలావరకు అక్కడ ప్రదేశంలో ఏనుగులు సంచరిస్తుంటాయి. ఏనుగు పాదముద్రలు బురదలోకి కూరుకుపోయిన గుంతల్లా విస్తరించి ఉంటాయి. ఎవరైనా అటుగా వచ్చినాసరే ఏనుగు పాదముద్రలు చూసి అటునుంచి అటే వెనుతిరుగుతారు.

పల్లంలో రెండు బండరాళ్ళ మధ్యన ఉన్న పగుళ్ళ మధ్య అతడు సారాయి కాచేందుకు గుడిసె కట్టుకున్నాడు. అక్కడే సారాయి ఊటపొయ్యలు ఉన్నాయి. దగ్గరకు వచ్చేంతవరకూ ఆ బండరాయి రెండుగా చీలి, మధ్యన అంత పెద్ద స్థలం ఉన్నట్టుగా ఎవరికీ తెలియదు. ఆ గుడిసె తెలిసినవారు కూడా అప్పుడప్పుడు గుర్తుపట్టలేక దిక్కులుపట్టుకు తిరిగేవారు.

బండరాయిపై మొలుచుకు వచ్చిన పెద్ద పొగడచెట్టు పైన ఎత్తులోనున్న కొమ్మలో చీరిన వెదురుబద్దలను వరుసగా పేర్చి మంచెను కట్టుకున్నాడు. మంచెకుపైన వెదురుతో పేనిన చాపతో ఇంటిపైకప్పును నిర్మించాడు. నిజానికది ఒక పొడవైన చత్రంలా ఉంటుంది. అందులో కూర్చొని లోపలికి దూరి నిద్రపోవాలి. అయితే, కాళ్ళు బాగానే చాపుకోవచ్చు. వెదురుచాప మీద తేనె మైనం, అరకు కలిపి పూయడం వలన భారీ వర్షానికి కూడా అది తట్టుకోగలదు. అక్కడుంది ఒక మంచెనే, రాత్రయితే అతడు, పగటిపూట కూమన్ను సారాయి ఊటలను దగ్గరుండి చూసుకునేవారు. సారాయి ఊటవేసే వేళల్లో ఇద్దరూ రోజు విడిచి రోజు మార్చి మార్చి చూసుకునేవారు.

అతడు బండరాయిలోకి దూరి గుడిసెను చేరుకున్నాడు. ఊట కాచేందుకు కావలసిన వంటచెరకును అడివి నుండి కొట్టి కుప్పగా పోశాడు. గూనలను కాస్త పక్కకు వాల్చి నోరెళ్ళబెట్టి ఎదురుచూశాడు. అతడు చిన్న రాయిపై కూర్చొని ఒక బీడీని వెలిగించాడు. చాలాసేపుగా కూర్చోవడం కోసం ఆ బండరాయిపై అల్లంగడ్డితో నేసిన చాపను పరిచాడు.

గాడిద గిట్టల చప్పుడు వినిపించింది. కూమన్ ఒకదాని వెనక ఒకటి జత కూడిన నాలుగు గాడిదలను తోలుకొని పైకి వస్తున్నాడు. నాలుగూ పక్కటెముకలకు ఇరువైపులా మూటలు మోసుకుంటూ, తలవాల్చి, చెవులను వాల్చి, శరీరాన్ని నేలకు ఆనుకుంటూ వచ్చాయి. గుడ్డలు చిరుగుతున్నట్టు వగరుస్తున్నాయి.

అతడు లేచి నిలబడ్డాడు. కూమన్ దగ్గరకు వచ్చి “లారీవోడు అటేపెక్కి ఎళ్ళిపోయాడు అన్నా” అన్నాడు. ఉణ్ణిబండరాయి పోటులో…”

నేసైయన్ గాడిదలను పట్టుకొని ఆపి, వాటి పక్కటెముకలపై వేలాడుతున్న మూటలను దింపాడు. గాడిద శరీరంపై నుండి మూటలను దింపేందుకు శిక్షణ అవసరం. ఒకపక్క మూటను విప్పితే, మరోవైపు బరువుతో దాని నడుము విరిగిపోయే ప్రమాదం ఉంది. రెండు మూటలను తోసుకుంటూ, ఒకే క్షణంలో వెనుక నుండి కిందకు దింపాలి. కుమానుకు ఈ విషయం అనేకసార్లు చెప్పినప్పటికీ ఆ ఒడుపు అతడికి వంటబట్టలేదు. కొండకిందన మూటలను పనివాళ్ళే ఎక్కిస్తారు.

అతడు మూటలను దింపుతున్నపుడు కూమన్ మట్టికుండ నుండి నీటిని తగరపు చిన్నసెరవతో ముంచుకొని తీసి తాగాడు. రాతిపై కూర్చొని సేద తీరాడు. బరువు దిగగానే గాడిదలు వగర్చుకుంటూ పక్కకు జరిగి దట్టంగా ఉన్న అల్లంగడ్డిని మెయ్యసాగాయి.

“మిగిలినోళ్ళు వచ్చారా?” అని నేసైయన్ “గాడిదలను సూస్తే అనుమానం రాకూడదు?”

 “కోణైయన్ నిలబడ్డాడు” అన్నాడు కూమన్. “పోయేటప్పుడు గడ్డి మూటను తీసుకువెళతాడు.”

“వాడు పైకి ఎక్కి రాకూడదూ?”

“లేదు, వాడు ఇంత దూరం ఎక్కలేడు” అన్నట్టు లేచాడు. గాడిదలను ఒకదానితో ఒకటి కట్టాడు. వాటిని లాగుకుంటూ కిందకు వెళ్ళాడు. గాడిదల బరువు లేని నడుమును తలుచుకొని సహజంగా శ్వాస వదులుతూ ముందుకు వెళ్ళాయి. వాటి తోకల వంపును నేసైయన్ చూస్తుండిపోయాడు.

ఆపై గోనులను విప్పి పాత బెల్లాన్ని తీసి చూశాడు. పాత బెల్లాన్ని ఒక దానితో ఒకటి కొట్టి చూశాడు. చెక్కలా చప్పుడైతే ముదురు తాటిబెల్లం. మెత్తమెత్తగా ఉంటే అది అది ఇంకా పక్వానికి రానిది. మంచి తాటిబెల్లం వీటి రెంటికీ మధ్యన ఉండాలి. ఒక్కో దాని నుండి కాస్త చిదిమి నోట్లో వేసుకున్నాడు. ఎనిమిది తాటి బెల్లాలు బొగ్గురుచిని కలిగున్నాయి. వాటిని తీసి అవతల పెట్టాడు.

కాసేపట్లోనే కూమన్ వచ్చేశాడు. అప్పుడు నేసైయన్ తాటిబెల్లాన్ని వాటి నాణ్యతను బట్టి వాటిని వేరుపరుస్తూ వచ్చాడు. కూమన్ చాపను తీసి వేసి, నుంచున్న చోట్లోనే దంచేలా వెదురు పిడిని అమర్చినటువంటి దంచుడు పలకతో తాటిబెల్లాన్ని కొడుతున్నాడు.

“ఈ రోజు నేను కాలి గుర్తును చూశాను” అన్నాడు కూమన్.

“ఎక్కడా?” అన్నాడు నేసైయన్.

“పడమటి కొండల్లో….యేటిగట్టు బురదలో, ఒక కాలు.”

“ఒక్క కాలు మాత్రమా”

“అన్నా, మరో కాలు ఎక్కడ పెట్టిందని ఎప్పుడు చూశాము గనక?”

“దానికో ట్రిక్ ఉంది” అన్నాడు నేసైయన్.

“అది ఎప్పుడూ బండరాయి మీదే కాలుపెట్టి ఎళుతుంది”

“అన్నా, అలా వెళ్ళగలదా?”

“వెళుతుందిగా”

“అరేయ్, అది ఇంతకీ ఏమాత్రం బరువు ఉంటుంది ఏంటి?” అన్నాడు నేసైయన్.

“మీరు ఓ సారీ సూసారుగా. దాని కాలుకు మద్దెనున్న సందును? అన్నా! గుడిసె కట్టేందుకు భూమిలో పాతిన వెదురు బొంగుల్లా ఉంటాయి దాని కాళ్ళు. అది పెద్దపులి… బాగా దట్టంగా పెరిగిన మగపులి, నలుగురు మనుష్యుల బరువు ఉంటుంది…”

“అలా అంటే ఒక రెండొందల యాభై కేజీలు ఉంటుందేట్రా?”

“అన్నా, ఇది మూడొందలు ఉంటుంది. అంతకుపైనే కూడా ఉండొచ్చు”

“మూడొందలకు పైనా?”

“అన్నా, నేను నిన్ను తీసుకెళ్ళి చూపిస్తా… సూడండి… కొలిసి దాని పెకారం లెక్కగట్టండి. అన్నా, అది మూడొందల యాభై కేజీలు ఉంటుంది… అది మగపులి మాత్రమే కాదు. రాక్షసి”

“వయసెంత ఉంటుందేటి?”

“బాగా వయస్సు మళ్ళిన మగపులి… నా లెక్క పకారం పదమూడు, నేదా పదేను కానీ ఉంటది”

“పదేను అంటే, బాగా ముదిరిపోయిందే… వయస్సు మళ్ళిన ముసలోడేమో”

“అట్టాగంటే పళ్ళు ఉండాయిగా, గోళ్ళు కూడా ఇంకా అట్టాగే ఉండాయిగా”

“ఎదురుగా దాన్ని పూర్తిగా సూసినోడు ఎవరో?”

“దాన్ని పూర్తిగా అంటే? కోయోళ్ళు సూసినారు. ఆనాయాళ్ళు దానిని దేవుడంటున్నారు.”

“ఆళ్ళకది మగది అయితే సాలు దేవుడే? అన్నాడు నేసైయన్.

“అయ్యప్ప శాస్తా మగపులి ఎక్కి గదా అడివికొచ్చాడు?”

కూమన్ పొయ్యి వెలిగించి దాని మీద పెద్ద పాత్రను ఎక్కించాడు. సత్తు పాత్రలను వెదురుబద్దకు కావిడి కట్టి చెరువు నుండి నీళ్ళు పట్టుకువచ్చి అందులో పోశాడు. అగ్గిపెట్టెను గుడిసెలో మూసి ఉంచిన కుండ నుంచి తీసి పొయ్యిలో కట్టెలకు నిప్పు అంటించాడు. నిప్పు పుల్లలలో అంటుకొని మెల్లగా విస్తరించి మంట కట్టెలపైకెక్కి నిలబడి నాట్యం చేసింది.

వాళ్ళు రాత్రుల్లో మాత్రమే పొయ్యి వెలిగించేవారు. చీకట్లో పొగ తెలియదు. మంట వెలుతురును బయటి బండరాయి పూర్తిగా అడ్డుకుంది. పైగా, అక్కడ గాలి కొండెక్కి చుట్టూ అలుముకుంది. పొగ వెంటనే కరిగి కనుమరుగయ్యేది.

నేసైయన్ తాటిబెల్లం ముక్కల్లో పెద్ద వాటిని కర్రతో కొట్టి పగులగొడుతున్నాడు.

“అన్నా కోయోళ్ళు చెప్పిన మాటల్లో నిజముందా?” అన్నాడు కూమన్.

“ఏంటీ?”

“ఆ పులి మగదైతే దేవుడవుతుందా?”

“ఏరా, దేవుడయితే అడవిలో ఎందుకు తిరుగుతుంది?”

“ఆళ్ళ దేవుడు అడివిలోనేగా ఉండేది?”

నేసైయన్ బీడీని దూరంగా పడేసి, “ఏరా, అలాగంటే ఆళ్ళ కాడకెళ్ళి మగపులి దేవుడిని ఎదికి పట్టుకొని, మొక్కుక్కోమని చెప్పేహెయ్” అన్నాడు.

“ఆళ్ళు సెబుతుండారు, పెద్దపులి దేవుడిని అలా ఉచుకుమంటే ఎపుడుబడితే అపుడు సూడలేరట. దేవుడ్ని మనం ఎదికి ఎళ్ళనే లేమట. దేవుడే మనల్ని ఎదికి రావాలట…”

“అందుకు మనమేటి సెయ్యాలి? తపస్సు సెయ్యాలా?” అన్నాడు నేసైయన్.

“ఆళ్ళు సెప్పేది పూజ అని. అయితే ఆళ్ళకు పూజ

ఏరే ఇదంగా ఉండుద్ది. తినడం, తాగడం, చిందులేయడం. ముట్టాకాణీ నాతో సెప్పేడు, దేవుడు ఆవయిచ్చిన రోజున ఆకాశంలోని ఎన్నెల కిందకొచ్చి నిలుత్తాదట. అప్పుడు ఇక్కడ మాంచి సల్లని ఎలుతురు వత్తది. ఆ ఎలుతురులో మనం మగపులిని సూడొచ్చు.”

“ఏరా, ఇంతకీ ఆడు సూసాడటా?”

“ఆడు సూడలా కానీ, పూజారి సూసాడట”

“ఆళ్ళు ఎలాగా గంజాయి దమ్ముకొట్టి లాగుతారు… దానికి మగపులి ఏం కర్మా? ఏసు పెభూ కూడా కనిపిత్తాడు”

కొండవాలున బండరాళ్ళ మధ్యన తక్కువగా ఇంటికప్పులు వేసిన మూడు గుడిసెలు ఉన్నాయి. సారాయిని ఆ గుడిసెల్లోనే ఊటబెడతారు. మట్టిలో తగినంత లోతుకు గొయ్యి తీసి కింద నుండే బంకమట్టితో కప్పి గోడలా పైకి లేపుకుంటూ వచ్చారు. ఈలోపు మంటపెట్టి బట్టీలా కాల్చి గోడలను మట్టి కుండలా చేసి, ఆ తొట్టిలో అడవి నుండి ఏరుకొచ్చిన పేడను, ఆకులను వేసి, మరిగించారు. అది పులిసి నురగలతో బుడగలొచ్చి పగిలి, పాడువాసన కొట్టింది.

అందులో ఎప్పుడు చెయ్యి పెట్టినా తట్టుకోలేనంత వేడి ఉంటుంది. వర్షంలోను ఎండలోనూ ఆరని మంట. కట్టెలో, నూనెనో లేని మంట. “అది జీవమున్న మంట మనుషుల కడుపులో రగిలే మంట. విన్నావా?” అని నేసైయన్ చెబుతుంటాడు. ఆ పేడ బురదలో, మెడవరకు పేర్చిన గూనలు శాశ్వతంగా అక్కడే అమర్చబడ్డాయి.

గూనల్లోకి పగలగొట్టిన తాటిబెల్లాన్ని వేశాడు కూమన్. నేసైయన్ మరుగుతున్న నీటిని తీసుకువచ్చి తాటిబెల్లం గుండను అందులో కొలిచి పోశాడు. అది పూర్తవ్వగానే, కర్రతో ఒకసారి తిప్పి మట్టితో చేసిన సిబ్బిరేకులతో గూనలను మూసి వాటి అంచును అరకు మందు, తేనె మైనంపూతను, బంకమట్టిని కలిపి, కరిగించి చేసిన పూతతో కప్పాడు.

గూనల మూతలో వేలు పెట్టేటంత కన్నం ఉంది. అందులో వెదురు గొట్టాన్ని దూర్చి దాని ఇంకో మొన తాలుకా కన్నాన్ని గుడిసె పైకి తీసి పెట్టాడు. లోపల తాటిబెల్లం మరిగేటప్పుడు సారాయి వాసన వీస్తోంది. ఆ వాసన  ఎక్కడున్నా ఎలుగుబంట్లను పరుగులుపెట్టి రప్పిస్తోంది. పైకి విసిరితే గాలిలో కలిసిపోతుంది. వెదురుగొట్టం అమర్చిన చోటును బంకమట్టి పూతతో మూశాడు.

“రేపు సాయంకాలం, లాత్తి వత్తానని చెప్పాడు… డబ్భై సీసాలని చెప్పాడు” అన్నాడు కూమన్.

“చూద్దాం”

“డబ్భై వస్తాయా” అని అన్నాడు కూమన్.

“సూద్దాం” అని నేసైయన్ మళ్ళీ చెప్పాడు.

నేసైయన్ పని ముగించుకొని వచ్చి రాయిపై చతికిలబడ్డాడు. “అన్నా, బెల్లం టీ పెట్టివనా” అన్నాడు కూమన్.

“పెట్టు”

కూమన్ పొయ్యి మీద సత్తుగిన్నెను పెట్టి నీళ్ళు పోశాడు. అందులో చక్కెరను, టీ పొడిని కలిపే వేశాడు. మరిగించి దింపి గుడ్డతో చేసిన టీ చిక్కంతో వడకట్టి పిండాడు. నేసైయనుకు దట్టమైన బ్లాక్ టీ అంటే ఇష్టం. అయితే దానిని వెంటవెంటనే తాగేస్తాడు.

సత్తుగిన్నెలో కూమన్ ఇచ్చిన టీను నేసైయన్ నాలుగైదు గుటకల్లో మింగేశాడు. ఒంట్లోకి వేడి ప్రసరించగానే వంట్లో పటుత్వం తగ్గి కండరాలు కాస్త వదులయ్యాయి. అతడు కాళ్ళు చాచుకొని కూర్చొని బీడీ వెలిగించుకున్నాడు.

కూమన్ కూడా బీడీ వెలిగించుకొని చతికిలబడి కూర్చున్నాడు. కూమన్ ఎక్కువసేపు చతికిలబడి కూర్చోగలడు. పైపెచ్చు బీడీనో, తమలపాకో పక్కనుంటే ముఖం పువ్వులా విచ్చుకుంటుంది.

అడవి చీకటి పడుతోంది. వెంటనే సూర్యుడు ఎలుగుబంటి కొండకు అవతల కిందకు వాలింది. పక్షుల శబ్దాలు బిగ్గరగా వచ్చి, మెల్లగా తగ్గుముఖం పట్టాయి. కింద యేటిలో నీటి వెలుతురు మాత్రమే మిగులుంది. పోను పోను అది కూడా కరిగి, శబ్దం మాత్రమే మిగిలిపోయింది.

బీడీని పక్కన పడేసి, నేసైయన్ లేచి కొండవాలున మట్టితో కప్పినట్టున ఇంకొక సారా ఊటగుడిసె వైపుకు వెళ్ళాడు. కూమన్ వెనుక వచ్చాడు. సారా ఊటగుడిసెకు వెదురుబద్ధల ఇంటి పైకప్పుకు మీద అడవి నుండి తీసుకువచ్చిన ఎండుటాకులను పరిచారు. కాస్త దూరంలో నిలబడినా సరే దాన్ని ఎవరూ గుడిసె అనుకోలేరు.

“ఇది పక్వానికి వచ్చింది అనిపిస్తోంది… పనసకాయలు పండిన వాసన” అన్నాడు కూమన్.

“హ్మ్” అన్నాడు నేసైయన్.

గుడిసెలో సన్నని వాసన అలుముకొంది. నేసైయన్ శ్వాసను గట్టిగా లోపలికి పీల్చి వదిలాడు. అతడి ముఖం విచ్చుకొంది.

“నేనైతే అప్పుడే పుట్టినబిడ్డ మొదటిసారి నవ్వినట్టు అనుకుంటా” అన్నాడు నేసైయన్.

“నేను పొద్దుపొద్దున్నే పువ్వు పూసినట్టు అనుకుంటున్నా” అన్నాడు కూమన్.

నేసైయన్ ఒక్కో గూన మూతవైపు వెళ్ళి వెదురు గొట్టాన్ని తొలగించి, కన్నం దగ్గర ముక్కుపెట్టి చూశాడు.

“నా కూతురు సవర్తాడినట్టు అని సెప్పకూడదా ఏంటి?”

“ఏందన్నా, మీరూ అదోరకం మనిషి…” అన్నప్పుడు కూమనుకు నవ్వు ముంచుకొచ్చింది.

“ఇవి మూడు దగ్గరకయ్యాయిరోయ్”

“మూడిట్లో డబ్భై వస్తాయా అన్నా?”

“పది పది సొప్పున ముప్పై వత్తాయి. మహా అయితే ముప్పై అయిదు వత్తాయి”

“ఆళ్ళు డబ్భై కదా అడుగుతున్నారు”

“ఆడి సొమ్మేం పోయింది, ఎన్నైనా అడుగుతాడు… మనమిక్కడ ఫ్యాక్టరీ ఏమైనా నడుపుతున్నామా ఏటి?  రావాలిగా?”

“ఇక్కడ మనకో ముఖం సూపిత్తారు. పోయే దోవలో నీళ్ళు కలిపి, పొడులు కలిపి ఆ ముప్ఫైని కాస్తా డబ్భై సేత్తారు.”

“వదిలేయ్.. ఆ ఊసు నా దగ్గర తేమాకు… అని  నేసైయన్ చిరాకుగా అన్నాడు.

“లేదు..ఊరికే అంటున్నా”

“ఆ ఊసు మనకెందుకులే కానీ…తాగేటోడికి తలరాతలో రాసి పెట్టుంటే మంచిదే తాగుతాడు”

నేసైయన్ గూనలలోని మూతలకు అంటుకొనున్న బంకమట్టి పూతను కత్తితో గోకి తొలగించాడు. మధ్యలో కత్తితో పైకెత్తాడు. కొత్తసారాయి వాసన గుప్పున తన్నుకు వచ్చింది.

“అన్నా, ఇది కదా వాసనంటే, తొలకరిజల్లు వాసనలా”

నేసైయన్ మూడు గూనలను తెరిచాడు. లోపల నలుపు రంగులో సారాయి ఊట ఉంది. అతి చిన్న నీటి బుడగలు పగిలే సన్నని శబ్దం వినిపించింది. నురుగు పగిలి కనుమరుగయ్యే శబ్దం. అద్దంముక్క నలిగే శబ్దంలా వుంది. నేసైయన్ వంగి ఒక్కొక్కటిగా చూశాడు. సంతృప్తితో తలాడించాడు.

కూమన్ గూనలను దొర్లించుకుంటూ, తీసుకువెళ్ళి పొయ్యి మీద పెట్టాడు. పొయ్యి నేల నుండి బెత్తుడు ఎత్తులోనే ఉంటుంది. అయితే పొయ్యి కింద గుంత లోతు నడుము వరకు ఉంటుంది. మట్టిని తవ్వి లోపల బంకమట్టితో గోడ కట్టి చేసిన ఊటపొయ్యి అది. లోపల గాలి ప్రవేశించేందుకు ఇరువైపులా వెదురు గొట్టంతో అమర్చిన ఎనిమిది కన్నాలు ఉంటాయి. కట్టెలను పేర్చాక ముందువైపు మట్టి పెళ్ళం పెట్టి మూస్తే లోపల మంట వేడి పెరుగుతూనే వుంటుంది. ఊటపొయ్యిలో పొగ తగ్గాలి. అగ్గిలో మంటలు పైకి లేవకూడదు.

కూమన్ సారాయి కాచే గుడిసెలోకి వెళ్ళి సారా ఊట దించబడిన గూనలలో నుండి వెదురుగొట్టంతో అనుసంధానించిన తగరపు టిన్నుతో ఊటను పైనుండి మెల్లగా పోసి, సత్తుతూగులో నింపాడు. ఊట తేనెలా పైన తేలుతుంది. దానిని తీసుకువచ్చి మొదటి గూనలోకి వదిలాడు. ఒక్కో ఊట నిండిన గూనను విడివిడిగానే కాచాలి అన్నది నేసైయన్ కచ్చితంగా పాటిస్తాడు. “ఒక్కోదానికి ఒక్కో రుచీ, వాసనా ఉంది” అని అంటాడు.

“ఏం చెబుతున్నావురా… ఒకే తాటిబెల్లం, ఒకే కుండా” అని ఒకసారి లాత్తి అన్నాడు.

“ఒకే పెళ్ళాంతో మీరు కాపురం చేసి కన్న నలుగురు కూతుర్లు నలుగురు, నాలుగు డిజైన్లలో ఉన్నారుగా మరి అదెలా సాద్దేమయ్యింది” అన్నాడు నేసైయన్.

“నోరెట్టుకొని ఊరికనే ఉండవేం” అన్నాడు లాత్తి.

కూమన్ పగలబడి నవ్వాడు.

“ఏందిరోయ్, పియ్య సూసిన పందిలా నవ్వతున్నావు” అన్నాడు లాత్తి.

నాలుగు గూనలలోకి ఊట పోసి ముప్పావు వంతు వాటిని నింపాడు కూమన్.

“ఆగరోయ్” అని, గుడిసెలోకి వెళ్ళి పళ్ళబుట్టను తీసుకురమ్మన్నాడు నేసైయన్. కూమన్ కూడా గుడిసెలో నుండి పళ్ళబుట్టను తీసుకువచ్చి పెట్టాడు.

అడివి నుండి తీసుకువచ్చి చేర్చిన అడివి అరటిపళ్ళు. అవి కుళ్ళిపోయి ఒకటిగా కలిసిపోయి గుజ్జులా ఉన్నాయి. వాటిని తెచ్చేటప్పుడే నేసైయన్ కూర్చొని తోలును ఒలిచాడు. ఆ తరువాత దానిని ఊటలో కలిపి, మధ్యలో మళ్ళీ ఆ కర్రను అందులో పెట్టి తోలు ఏదైనా తగులుతోందేమోనని చూశాడు.

“కోయోళ్ళు తోలుతోనే ఏత్తున్నారు” అని కూమన్ అన్నాడు. అది అతడు ఎప్పుడూ చెప్పేదే.

“చాలా మంది అలానే ఏత్తారు…నేను ఎయ్యను”అన్నాడు నేసైయన్. “మంచి సారా తీపి నుంచి మాత్రమే రావాలి… తోలో, ఆకో, పొట్టో, చెక్కపొడో అందులో ఏది పడినా రుచి సెడిపోతుంది…”

“ఎందుకు?”

“ఇది తీపిలో ఊరి రాదు. పెభువైన యేసులా… ఇంకోటి వుంది, ఆకుతోను, తోలుతోను అది రాదు. అంటే సాతానులా అన్నమాట. చూసేందుకు అదీ, ఇదీ ఒకేలానే ఉంటాయి. అయితే అది ఎక్కువైతే కళ్ళు పీక్కుపోతాయి.”

కూమన్ అందుకు ఫక్కున నవ్వాడు.

ఆ సందర్భంలో వాళ్ళు మాట్లాడుకొనేందుకు ఇష్టపడతారు. అయితే ఇవి తప్ప మరేదీ మాట్లాడలేరు కూడాను.

నేసైయన్ కుళ్ళిన పళ్ళగుజ్జును ఒకటిగా చేర్చి, తాటిబెల్లం పులిసి వచ్చిన సారా ఊటతో పాటు వేశాడు. పుల్లను పెట్టి బాగా కలియతిప్పాడు. పళ్ళగుజ్జు ఊటలో కలిపినపుడు వాసన మారింది.

నేసైయన్ వాటిపై మూత పెట్టాడు. మూత అంచును బంకమట్టితో పూసి బాగా మూశాడు. దానిపై దివిటిని చూపించి బంకమట్టిని కాల్చి గట్టిపడేలా చేశాడు.

మూతల మధ్య ఉన్నటువంటి కన్నంలో అమర్చిన గొట్టంలాంటి వెదురు కుళాయిలు పైకి లేచి వంపులు తిరుగుతూ వెళ్ళాయి. వాటిని దగ్గర్లో అమర్చినటువంటి రాగితో చేసినటువంటి స్థూపంలోకి వదిలారు. రాగి స్థూపానికిపైన గడ్డిపోచలు, జనుమునారతో చేసిన గోనెపట్టా చుట్టి దానిపై ఎత్తులోనున్న కుండలో నుండి కుళాయి గుండా చల్లని నీరు పడుతూ ఉంది.

నేసైయన్ చల్లటి నీటి కుండను తొంగి చూశాడు. “నీళ్ళు తెస్తాను అన్నా” అన్నాడు కూమన్.

“అప్పుడే నింపుండాలి కదరా” అన్నాడు నేసైయన్.

కూమన్ కింద చెరువు నుండి సత్తు టిన్నుల్లో నీళ్ళుపట్టి, వాటిని కావిడతో కట్టి మోసుకొని, తీసుకువచ్చి గూనలను నింపాడు.

నేసైయన్ “ఏసయ్యా!” అని ప్రార్ధన చేసి, శిలువను వేసుకొన్న వెంటనే అగ్గిపెట్టెను గీసి పొయ్యి వెలిగించాడు. మంట రాజుకొని కట్టెలు ఎరుపెక్కిన అగ్ని గోళాలుగా మారగానే ముందుభాగాన్ని మూశాడు. లోపల అగ్గి ఛిద్రమై మంటలుగా మారి కాలసాగింది.

కూమన్ గోనె పట్టాల నుండి సీసాలను బయటకు తెచ్చి రాగి కుళాయిల దగ్గర పెట్టి పక్కన కూర్చొని బీడీని వెలిగించాడు.

నేసైయన్ నిలబడి పాత్రల్లో సారా ఊట వేడెక్కడాన్ని శబ్దం గుండానే అనుభూతి చెందాడు.

పులియబెట్టిన ఊట నుండి సారాయి ఆవిరై పైకి లేచి, కుళాయిలు గుండా వచ్చి, రాగి కుళాయిలు చల్లబడి భాష్పిభవనం చెంది, నీటి బిందువులు చేరి ఊటలూరి, చిన్న లోహపు ముక్కు కలిగిన కుళాయి రంధ్రం గుండా కారింది. కూమన్ మొదటి సీసాను తీసి దాని కింద పెట్టాడు.

నేసైయన్ కిందకు వంగి మొదటి బొట్టును చేతిలోకి తీసుకొని వాసన చూశాడు. ముఖం విచ్చుకుంది.

“ఎలా అన్నా?”

“బాగా పక్వానికి మరిగిందిరోయ్”

“ఆ తర్వాతేటీ?”

“తమలపాకు, సున్నము, కలిపితే ఎరుపెక్కుద్ది. అది అందరికీ తెలిసిన సంగతే. అయితే, కనీసం వెయ్యిసార్లు మటుకైనా తమలపాకు వేత్తేనే, ఏదో ఒక్కసారి మాత్రమే అన్నీ కలిసొత్తాయి. ఆ ఒక్క తమలపాకు రుసి కోసమే ఒక్కొక్కడు  తిరిగి తిరిగి రుసి చూస్తున్నాడు.”

“అవును”

“ఒక్కో కాగిన ఊటలో ఒకటి ఉందిరోయ్. ఇప్పుడు దేవుడు లేచొచ్చి, మన ముందు పెత్యక్షమైతే, ఇందా అని మనం సెయ్యి సాపి ఇచ్చేలా ఓ సీసా…. దాని కోసమే వెదుకుతున్నాను. ఎప్పుడో నూటికో కోటికోనే ఆ ఒకటి కుదురుతుంది. ఒక్కసారి సేత్తే ఇదిగో దొరికేసింది అనిపిత్తోంది. అయితే ఆపై మళ్ళీ సేజారిపోతుంది. తిరిగి తిరిగి ఇందులోనే పడి కొట్టుకోవడం దీని కోసమే. పెభువైన యేసు పేణాలతో తిరిగి లేచి వచ్చేలా ఒక ఐటమ్…”

నేసైయన్ సారాయిని చేతిలో పోసుకొని అగ్గిపెట్టెను తీసి వెలిగించాడు. నీలి అగ్నిపుంజం చేతికి తగలకుండా గాల్లోనే వెలిగి ఆరిపోయింది.

“సొచ్ఛంగా ఉందిరోయ్”

నేసైయన్ ఒక్కో కుండగా పట్టుకొని చూసి కట్టెను పైకి తీసి మంటను సరిచేశాడు. వేడి ఎక్కువైతే పొయ్యిని ఆర్పే దానిని అదుపు చెయ్యాలి.

“నువ్వు కావాలంటే కాత్త పడుకొని సేద తీరరా” అన్నాడు నేసైయన్.

“లేదు నేనుంటాను.”

“నేను కావాలంటే తెలివేసే ఉంటా… నువ్వెళ్ళి పడుకో”

కూమన్ తాడుతో చేసిన నిచ్చెన కర్రలపై కాలుమోపి పైకెక్కి వెళ్ళి మంచెలోకి ప్రవేశించాడు.

నేసైయన్ చేతులు కట్టుకొని సెగతో నిండిన కుండలను చూస్తూ నడిచాడు. ఒక్కో సీసాను తీసి దూరంగా పెట్టాడు. బొట్టు బొట్లుగా సీసాలు నిండుతున్నాయి. ఒక్కో సీసాకు ఒక్కో వాసన ఉంది. చాలా స్వల్పమైన తేడాలతో. అది మల్లెపువ్వుకు, సంపెగపువ్వుకువున్న వ్యత్యాసం కాదు. ఒక మల్లెపువ్వుకు, ఇంకో మల్లెపువ్వుకు మధ్యనున్న వ్యత్యాసం.

లేచి వెళ్ళి పొయ్యిలన్నిటిలోను కట్టెలను బయటకు తీసి, అగ్గిని ఒక కర్రతో తట్టి, బూడిద చెదిరిపోగానే మూత పెట్టాడు. పొయ్యిలో గాలి వెళ్ళవలసిన కన్నాలు ఎక్కువగా గాలివీచే నైరుతి దిశగా అమర్చబడ్డాయి. లోపల గాలి దూరి సెగను మరింత ఇనుమడింప జేసింది.

మొదటి ఏడు సీసాలలో ఉన్నటువంటి సారాయిని తీసుకువచ్చి ఇంకో మట్టికుండలో పోశాడు. సారాయి నులివెచ్చగా ఉంది. గుడిసెలోకి వెళ్ళి బుట్టలో ఉన్నటువంటి అరటిపళ్ళను తీసుకువచ్చాడు. వాటిని చిన్నచిన్న ముక్కలుగా కోసి అందులో వేశాడు. దానిని పెద్ద పొయ్యి కింద మంట తగిలేలా పెట్టాడు.

చేతులు విరుచుకొని, కుండలను ఒక్కొక్కటిగా తరచి చూస్తూ నడిచాడు. మంటను తగ్గించాల్సి వచ్చింది. ఆకాశంలో నక్షత్రాలు చుట్టూ అలుముకున్నాయి. దక్షిణదిశగాలి చల్లగా వీచింది. పొయ్యి మంట దగ్గర నిలబడి ఉండగా చలి తెలియలేదు. కాస్త పక్కకు జరగగానే ఒళ్ళు పులకరించింది.

కింద యేటితీరంలో ఏనుగుల గుంపు ఒకటి దిగింది. అతడికి బాగా పరిచయమున్న గుంపే. ఎనిమిది పిల్ల ఏనుగులున్నాయి. కనుక చాలా అప్రమత్తమయ్యాయి. అతడి మనసెరిగి ఆడ ముసలి ఏనుగు ఏదో చెప్పింది. వాటికి ఆ చోటులో వాళ్ళు ఉన్నట్టు బాగా ఎరుక. చెప్పాలంటే ఆ ఏనుగుల గుంపే అతడికి కావలి కాస్తాయి. అవి కింద రోడ్డు వరకు వ్యాపించిన వెదురు అడవుల్లోనే చాలా వరకు ఉంటాయి. ఎవరైనా వస్తే దూరం నుంచే వాసన పసిగట్టి ఘీంకరించి మనిషిని ఇట్టే పట్టించేస్తాయి.

ఆ ఆడ ముసలి ఏనుగుకు నేసైయన్ పై మంచి అభిప్రాయముంది. మలవిసర్జనకు, వంటచెరకు తీసేందుకు, అరటిపళ్ళు ఏరుకొనేందుకు అడవిలోకి వెళ్ళినపుడు అనేకసార్లు దానికి ఎంతో దగ్గరగా వెళ్ళేవాడు. ఆదివాసుల ఢంకాలా ఘీంకరించి పక్కకు తప్పుకో అని చెబుతుంది. అది కేవలం అదిలింపు మాత్రమే. చెవిని మడవటమో, తల ఆడించడమో వంటివి చెయ్యదు. నాలుగైదుసార్లు దగ్గరకు వచ్చి తాకి వాసన చూసి తిరిగెళ్ళింది. పిల్ల ఏనుగులు ఆసక్తిగా అతడిని వాసన పీల్చేందుకు తొండం విదిల్చితే, వాటిని అదిలించి ఆపై పక్కకు నెట్టేస్తోంది.

వేకువజామున ఇరవై సీసాలు నిండాయి. నేసైయన్ పొయ్యిలో కట్టెలన్నింటిని బయటకు లాగి మంటను చల్లార్చాడు. పొయ్యిలను బాగా ఆర్పి పొగ రాకుండా చేశాడు.

కనురెప్పలు కిందకు వాలాయి. అతడు ఆవలిస్తూ కూర్చున్నప్పుడు కూమన్ పైనుండి కిందకు దిగొచ్చాడు.

“తెల్లారింది అన్నా, టీ పెట్టేదా?”

“పెట్టు” అన్నాడు నేసైయన్.

కూమన్ అడివిలోకి వెళ్ళి యేటిలో ముఖం, కాళ్ళూచేతులు కడుకొని వచ్చాడు. అతడే చిన్నపాత్రలో నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టాడు.

“ఎన్ని అన్నా?”

“ఇరవై వత్తాయి”

“ఇరవైనా? అన్నా ఆయన అమ్మనా బూతులు తిడతాడే?”

“దానికేం సెయ్యమంటావు?”

టీ తాగేసి నేసైయన్ అడివిలోకి వెళ్ళి వచ్చాడు. ఈలోపు కూమన్ నాలుగు పెద్ద కర్ర పెండ్లం దుంపలను కాల్చేందుకు పడేశాడు. ఇంకో మంటపై పెట్టిన రాయిపై ఎండు చేప వేగుతుంది.

“తింటావా అన్నాయ్?”

“తియ్యి” అన్నాడు  నేసైయన్  “ఆ ఎర్రసీసా ఇటు ఇవ్వరా”

కూమన్ ఎర్ర సీసా తీసి ఇచ్చాడు. దానిని తెరిచి తగరపు కప్పులో కాస్త పోసుకున్నాడు. ఎండుచేపను కరుచుకుని దానిని తాగాడు. నులివెచ్చని సారాయి పండిన పండు వాసనతో ముక్కును లోలోపల నుండి తొలిచేసింది.

కర్ర పెండలం దుంపను కూడా తినేసి, బీడీని వెలిగించి పైకెక్కి మంచెపై పడుకున్నాడు. కళ్ళు మూసుకొని బీడీని గట్టిగా లోపలికి లాగాడు. పిల్లల జ్ఞాపకం వెంటాడింది. ఎనిమిదేళ్ళ క్రితం ఉన్నటువంటి ముఖం. భార్య మరియం ముఖం గుర్తుకువచ్చింది. దీర్ఘంగా నిట్టూర్పు వదులుతున్నాడు.

అతడు కళ్ళు తెరవగానే మంచె ఇంటి కప్పుపై వర్షం కురుస్తోంది. ఆ శబ్దం వింటూ ఎంతోసేపు పడుకున్నాడు. మూత్రం తన్నుకువచ్చింది. పాక్కుంటూ బయటకు వచ్చి వర్షానికి కాగితాన్ని తీసి పైన కప్పుకొని కిందకు దిగి వచ్చాడు. గుడిసెలో కూమన్ కూర్చొనివున్నాడు.

“బీడీ ఉందేటేహే?”

“ఉంది అన్నా…” అని తీసుకువచ్చి చేతికి అందించాడు.

“టైమ్ ఎంతయ్యింది”

“అయ్యిందిలే, నాలుగు, నాలుగున్నర ఉంటుంది… వర్షంలో, చీకటి ఇంకా బాగా కమ్మేసింది”  అన్నాడు కూమన్.

“గంజి తాగుతారా? చెవులపిల్లి కాల్చాను.”

“తీసుకురా?”

పెసర్లు వేసి కాచిన గంజి. దానిని పెద్ద తగరపు గిన్నెలో ముంచి పోసి, తీసుకొచ్చి ఇచ్చాడు. చెవులపిల్లిని కూడా దోరగా కాల్చాడు. చెవులపిల్లి మాంసం వెంటనే కరిగిపోతుంది. ఒడుపుగా కాల్చకుంటే గనుక ఎముకలే మిగులుతాయి. మావిడికాయను మంటల్లో కాల్చి పచ్చిమిరపకాయలతో కలిపి దంచి చేసిన తొక్కు.

అతడు తింటునప్పుడు కింద ఏనుగు శబ్దం వినబడింది.

“ఆళ్ళే అయ్యుంటారు ఎళ్ళి… తీసుకురా”

“కూమన్ కిందకు దిగాడు. గంజి తాగి పాత్రను కడిగి గుడిసెలో పెడుతున్నపుడు లాత్తి పైకి ఎక్కి రావడం చూశాడు. కూమన్ వెంట తీసుకువస్తున్నాడు.

బీడీని వెలిగించి వాళ్ళు రావడం చూశాడు. పైనుండి దిగి రావడం ఆలస్యమవుతుంది.

వగర్చుకుంటూ వచ్చి నిలబడిన లాత్తి బిగ్గరగా “ఈడు ఏం సెబుతుండాడు. ఇరవై సీసాలా, అవి పెట్టుకుని ఏం పీక్కోవాలి?” అన్నాడు.

“ఇరవైనే వత్తాయి…. అంతే”

“రేయ్, ఇటు సూడు, ఇది యాపారం. నేను ఇవ్వలేదంటే ఆడు మిగతా వొళ్ళ దగ్గర కొనుక్కుంటాడు. ఒకసారి ఖాతా అటేపు పోయిందంటే, ఆనాక ఇక సచ్చినా ఇటేపు రాదు. ఇటు సూడు, ఈ యాపారంలో అదనంగా రిస్క్ తీసినోడే అమ్ముతాడు. ఆడిని పెట్టే ఆట ఉంటుంది”

“అందుకు నేనేటి సేసేది?”

“అరేయ్, దీన్ని ఇంకా కాయూ… ఇంకా కాస్త కాసివ్వు…”

“ఇది… మిగిలింది…ఇకపై కాత్తే దగ్గరకు అయిపోద్ది… రుసి సెడి పోద్ది.. ఒకరోజు ఉంటే రేపటికి మరో ఐదు సీసాలు అయినా వత్తాయి.”

“తాగితే కిక్కు ఎక్కుతుంది కదేటి? మరీ ఇంకేంది? కాసి ఇవ్వహెయ్”

“అట్టా ఎట్టా పడితే అట్టా కాయనమాలదు…”

“నువ్వేంది దేవామృతమా కాత్తుండావు? సెప్పింది ఇనవహెయ్. లేకుంటే మరో రెండు ఊటలు సిద్ధం సెయ్”

“అవి పక్వానికి రాలేదు… పక్వానికి వచ్చినవి తీసేశాను… నాలుగు రోజులు తరువాత వత్తాది, ఈ ఊటను దానిని ఇట్టానే పెడితే ఇంకాత్త సారా అవ్వుద్ది. దీని నుండి మరో ఇరవై సీసాలు పట్టి ఇత్తాను”

“నాకు ఇప్పుడు కావాలి… నాకు ఇక్కడే ఇప్పుడే కావాలి…” లాత్తి ఆక్రోశంతో అరిచాడు. “నీకు వద్దంటే నువ్వెళ్ళి సావెహే…. నేను కాత్తాను. రేయ్ కూమా, నువ్వు కాయ్… పొయ్యి ఎలిగించు… నేను సెబుతుండా”

కూమన్ మౌనంగా మాట్లాడకుండా నిలబడ్డాడు.

“లేదంటే నేను మనుష్యులను సిద్ధం సేత్తాను..” అని లాత్తి తిరిగాడు.

నేసైయన్ బీడీని విసిరి లేచి “నువ్వు కాస్తావ ఏందిరేయ్? కాసి సూడు” అన్నాడు. “నువ్వు ఏమనుకుంటుండావు? నీకిది మురిక్కాలవనేమో… నాకు ఇది అమృతమేనేహే…. దీన్ని తాకి సూడు… ఎహే… మగోడివి అయితే తాకి సూడేహే”

“మీ సారాయి ఇకపై నాకు వద్దేహే…  నేను ఇంకో మనిషిని సూసుకుంటాను…

“ఇంకో మనిషిని సూసుకొని పోయేహే… నేను ఏమన్నా నిన్ను పట్టుంచి వద్దనా అంటున్నా? నాకు ఈక ముక్కంత కూడా దీన్ని తాగాలని లేదు. నాకు ఎవడి డబ్బులు వద్దు. నేను కాసేది నా కోసం, నా సత్యం కోసం.. ఈ తీపి ఎక్కువై, అందులో కైపు ఊరతుండాదిగా, దానికీ దణ్ణం సత్యేముగా నేను జపం సేసేది ఆ సత్యం కోసమే”

చటుక్కున అతడి గొంతు పూడుకుపోయింది. “ఒకటి ముడతే పది సెడతుండాయి. మనసుమీద ధ్యాస లేదు. కాసి, కాసి నేను వెళ్ళే తోవ తెలియట్లే…” మళ్ళీ గూనలను చూసి “తూ..ఈ దరిద్రపు ముఖం నాయాళ్ళను పెట్టుకొని… నేను సత్తూన్డా…” అని అరుచుకుంటూ భయపడి తడిక తీసి వాటిని అందుకొని పగలగొట్టేందుకు ఉరికాడు.

కూమన్ “అన్నా, ఏంది ఇది… అన్నా” అని ఉరికి వచ్చి పట్టుకున్నాడు. లాత్తి అతడిని పట్టుకొని ఆపాడు.

“ఎహెయ్…ఏందిది… నేను ఏదో నా మనసులో పడింది సెప్పా… అరేయ్ వదిలెయ్…. ఎందేహే… ఇది” అన్నాడు లాత్తి. ఆ కర్రను పట్టుకొని అవతలకి విసిరాడు. “అటేపుకు తీసుకు పోయేహే…”

కూమన్ అతడిని లాక్కొని వెళ్ళి కూర్చోబెట్టాడు..

నేను సత్తా.. నేను సచ్చి ఊరకుంటా…నాకు రాదు… నాకు సేతిలో మహిమ లేదు” నేసైయన్ తన తల బాదుకొని ఏడ్చాడు.

కూమన్, లాత్తి మాణిక్కమూ అతడిని దిగ్భ్రాంతితో చూస్తుండిపోయారు. నేసైయన్ తన మోకాలిపై తల వాల్చి కూర్చున్నాడు. ఒళ్ళు ముడుచుకుంటూ, అప్పుడప్పుడు విదుల్చుకుంటూ ఉన్నాడు.

“అన్నా” అని కూమన్ సుతారంగా పిలిచాడు. “కాత్త తాగుతావా?”

నేసైయన్ వద్దని తలాడించాడు.

“అరటిపళ్ళు వేసి చేసింది ఉంది”

“వద్దు”

“తియ్యహెయ్…” అన్నాడు లాత్తి “నాకు కావాలి”

కూమన్ ఆ చిన్న కుండను తీసుకొని కలిపి కాస్త తేరుకునేలా చేసి, లోపల నుండి పైకి తేలిన సారాయిని ఒక సత్తుగిన్నెతో మెల్లగా ముంచి తీసి ఇంకో దానిలో పోసి తీసుకువచ్చి ఇచ్చాడు. అరటిపండు నల్లగా మాడి ముడుచుకుపోయి అడుగున మిగిలిపోయుంది.

లాత్తి వాసన చూసి ముఖం వెలిగిపోయింది. “అరేయ్, నేసైయా, ఇది దేవామృతం… ఒట్టేసి సెబుతుండా నీ సేతివాటం ఈ కొండలో ఏ ఒక్కడికి లేదు. నేను మీ బాబు కాసిన దాన్ని కూడా తాగినోడ్ని… సత్త పెమాణముగా సేబుతుండా, ఇది నీ సేతులో ఉన్న మహిమనెహే…”

“లేదు” అని ఇంకెక్కడో చూస్తూ నేసైయన్ “అందులో ఇంకా వాసన ఎక్కలేదు” అన్నాడు.

“నువ్వు ఏమంటుండావు? పిచ్చి పట్టిందా ఏంది? ఎహెయ్… ఇటు సూడు.  ఇంతకు మించి సారా ఇంకేముంది? ఎహెయ్… ఏ సీమ సారా దీని దరిదాపులకు వత్తాది? సీసాకు ఐదువేల చొప్పున సరుకును నేను తాగాను. అవన్నీ దీంట్లో ఒక సుక్కకి సమానం కాదు. ఇది ఈ కొండ మనసు పండిన రుచినహె… తీపిలో వచ్చిన రుచి అంటివే అది ఇదేనెహే…”

“బాగా పులియలేదు…. ఇంకా బాగా పులియలేదు” అన్నాడు నేసైయన్.

“ఊరికే పిచ్చోడిలా మాటాడమాకు”

“నాకు తెలుసు”

“ఏం బొచ్చు తెలుసు నీకు? ఊరికే నీ పాటికి నువ్వే ఏదేదో ఊహించుకోమాకు. ఏదో, ఎక్కడో దండిగా ఉంటుంది, నువ్వు అక్కడ వెళతావు, కుదరలేదు అనుకుంటావు. అలా ఎందుకు అనుకుంటున్నావు తెలుసా? నీకున్న పొగరు వలన. నువ్వు పెద్ద పోటుగాడివి… మగ పెద్దపులి దేవుడి బంధువువి…”

నేసైయన్ తల వంచుకొని కూర్చున్నాడు. లాత్తి గొంతు జీరపోయింది. “అరేయ్, ఇటు సూడు. ఒక్కొక్కడికి ఒక్కో లిమిట్ ఉంటుంది సూసుకో… ఎందుకంటే మనం మనుషులం…దేవుళ్ళమో, గంధర్వులమో కాదుగా? మనిషి ఎళ్ళగలిగే దూరం అంతే…”

“నేను అంతకు మించి కూడా వెళ్ళున్నాను”

“అయితే, మళ్ళీ ఎందుకు అక్కడికి ఎళ్ళలేదు సెప్పు…”

నేసైయన్ మాట్లాడకుండా తలవాల్చి కూర్చున్నాడు.

“చెప్పేహే,ఎందుకు మళ్ళీ నీవల్ల సెయ్యడం సాధ్యపడలేదు? ఎందుకంటే అది నీ నైపుణ్ణం కాదు. నువ్వు దానిని సదివి సెయ్యలేవు. అదేందో దేవుడి మహిమ వలన జరుగుతుంది. ఈ అడివిలో ఏదేదో జరుగుతుంది. యాభై ఏళ్ళు ఊరికే నిలబడిన చెట్టు పూలు పూసి కాయలు కాత్తుంది. యాభై ఏళ్ళుగా మొక్కగా నిలబడింది చటుక్కున చెట్టవుతుంది… ఇవన్నీ మనకేం తెలుసు…?

లాత్తి అతని పక్కకు వచ్చి నిలబడ్డాడు. “ఇదంతా దేవుడి లీలలు…బాసు, నువ్వు కాదు ఆడిస్తోంది నేను అని దేవుడు మన దగ్గర సెబుతున్నాడు. మనిషి దేవుడు అవ్వాలని ఆశ పడకూడదు సూసుకో. దాన్ని అట్టా వదిలేయ్… ఇదిగో నువ్వు కాసినావుగా ఇటువంటి ఒక సుక్క దేవతలు కూడా తాగుండరు. ఈ అడివి దేవతలు తాగి ఉండరు. నా కొడుకు సత్యనేసన్ మీద పెమాణం సేసి సెబుతుండా… ఉన్నది ఉన్నట్టు”

లాత్తి నేసైయన్ భుజాన చెయ్యి వేసి చెప్పాడు. “సెబితే విను…. ఇది నీకు దక్కిన విజయం… ఇంతకు మించి ఏదో ఉందని చెప్పి తిరగమాకు. సచ్చిపోతావు.  అడవిలో ఒక మాయనిధి ఉందని సెబుతారు, విన్నావా? మాయనిధి కూడా మగపులి దేవుడి లీల. పసుపు వెలుతురును చూపించి బంగారం బంగారం అని కలవరించి తిరిగేలా సేత్తాడు. దాన్ని ఎదుక్కుంటూ ఎళ్ళినవాడు అడివి మధ్యలో దిక్కుతోసక పోతాడు. అక్కడ తిండీతిప్పలు లేకుండా పడుండి కేకలు యేస్తూ తిరుగుతాడు. అతడిని పెద్దపులి మీదెక్కి దాడి చేస్తోంది. రక్తం తాగి, మాసం తింటుంది.”

అలా అనునయమైన గొంతుతో “పసుపు కొండకు వెళ్ళే దారిలో ఒక సోటుంది. అక్కడ పుర్రెలు దొరుకుతాయి. నేను వాటిని సూశాను. అందరూ మాయనిధిని వెదికి వెళ్ళినవారే. మన కోయోడు ఉరుమన్ నే ఇది చెప్పింది… వద్దురోయ్.. ఇది కూడా ఒక విధమైన మాయనిధి” అన్నాడు లాత్తి.

నేసైయన్ కన్నీటితో “అయితే నేను ఎందుకు జీవించాలి?” అన్నాడు. “ఇందా నేను దేనిని కాసేశానుగా. ఎప్పుడైనా కాత్తాను. మరేటి? ఇక దేనికి ఈ అడివిలో పడుండాలి?” అన్నాడు

“ఇయన్నీ నువ్వు అడగాలిసింది ఆ దేవుడి కాడ”

“ఒక మాయనిధే ఉండని… దానిని ఎదికి ఎళతాను. ఎళ్ళే దారిలో సత్తాను… ఆ సావు వరకు తలుచుకునేందుకు స్వప్నం, కల ఏమైయుంటాయి”

“నువ్వు బాగుపడవహే”

నేసైయన్ నవ్వుకున్నాడు.

“ఇరవై లీటర్లు ఉన్నాయి… పర్లేదు…ఇందా ఈ రెండు లీటర్ల అరటిపళ్ళ సారా, ఇది యాభై లీటర్లకు సమానం. అరుమనైలోనూ, కొలసేగరములోను మంచి కుటుంబంలోని పొరువట్టనులు, నాయన్మార్లు దీనికి అడిగిన కాడికి సొమ్ములు ఇత్తారు… నేను తీసుకెళ్ళి ఇత్తాను” అన్నాడు లాత్తి. “నువ్వు నీకు నచ్చినట్టు కాయి. నాకేం కాదు”

నేసైయన్ తల ఆడించాడు.

“సరే పోదామా” అన్నాడు లాత్తి.

“బయలుదేరుదాం అన్నా” అన్నాడు కూమన్.

సీసాలను గోనె పట్టీలో పెట్టి కట్టి ఇద్దరూ భుజాన ఎక్కించుకున్నారు. లాత్తి “రేయ్, నేసైయా, ఈ అరటి సారాలో ఒక సీసా నీ కోసం తీసుంచునా” అన్నాడు.

“వద్దు” అని నేసైయన్ “తీసుకువెళ్ళండి”

“కొంచెం…”

“వద్దు… తీసుకువెళ్ళండి”

“నిజంగానే అంటున్నావా? తీసుకువెళితే నాకు బంగారం ధర పలుకుద్ది సరేనా?”

“పట్టుకెళ్ళండి”

“అలాగే”

“లాత్తి దానిని కూడా తీసుకున్నాడు. వాళ్ళు కొండ ఎక్కి బండరాయి మీద తేలి, అవతలి వైపుకు వెళ్ళి కనుమరుగయ్యారు. నేసైయన్ అడవిలో శూన్యంలోకి చూస్తూ అలా కూర్చుండిపోయాడు. అంతవరకు ఉన్న మబ్బుతెరలు వీడి అవి ఉత్తరదిశగా వెళ్ళసాగాయి. నింగి మేఘపటలాన్నీ చీల్చుకొని తెలుపెక్కింది. తెల్లవారుతున్నట్టు అడవి వెలుగు అలుముకుంది. తేమ నిండిన ఆకులు మెరుస్తూ ఊగుతున్నాయి. బండరాయి అంచుల వంపులు మెరుస్తున్నాయి. యేటినీటి అలల్లో వెలుతురు అల మోదింది.

గాలిలో మృదువైన నీటి బిందువులు ఉన్నాయి. చేతిలోనున్న వెంట్రుకల మీద అవి పుప్పొడి రేణువుల్లా పడి, చెయ్యి తెల్లని వెంట్రుకలతో తెల్లబడినట్టు అనిపించింది, విదిలించినప్పుడు నీరు కారింది.

కూమన్ తిరిగి వచ్చాడు. “అన్నా అలాగే ఉన్నారా?” అన్నారు. “మాట్లాడుతూనే వెళుతా, దారి పొడుగునా మీ గురించే మాటలు” అన్నాడు…

 నేసైయన్ ఏమి మాట్లాడలేదు.

“ఆయన ఏమంటున్నాడంటే, మగపులి మిమ్మల్ని ఆవహించిందని, మగపులి బంగారాన్ని మీకు ఎరేసి మనిషిని పట్టుకుంటుంది” అన్నాడు కూమన్.

“బీడీ ఉందేటిబే” అన్నాడు

“ఉంది అన్నా”

కూమన్ దానిని వెలిగించి ఇచ్చాడు. నేసైయన్ దానిని గట్టిగా పీల్చి తేమతో  నిండిన అడివి కాంతిని చూస్తుండిపోయాడు.

“మళ్ళీ తెల్లారినట్టు ఉందే. అన్నా గంజి వేడిగా ఉంది, తాగుతావా?

“లేదు, నేను ఇప్పుడే తాగాను”

“నేను తాగేదా?”

“తాగేసి నువ్వు పడుకుంటావా?”

“అలాగే అన్నా” అని అతడు గంజిని సత్తుగిన్నెలో నింపాడు. “పెద్దపులి బంగారం రంగట. సూసినోళ్ళు సెబుతారు” అన్నాడు. “బాగా బంగారాన్ని కరిగించి సన్నని తివ్వ సేసి, దానిని మెరిసే బంగారం సేసినట్టు ఉంటుంది. కళ్ళలో పచ్చబంగారం దగదగ లాడుతోందని సెబుతున్నారు.”

అతడు గంజి తాగి, ఒంటేలు పోసుకున్న తరువాత “యబ్బా నేను పడుకుంటాను అన్నా” అని మంచెపైకి ఎక్కాడు.

నేసైయన్ కింద రాయిపై కూర్చున్నాడు. అక్కడ కూర్చోడానికి ఎటువంటి అవసరం లేదు. ఇంకోసారి కాచి ఉండొచ్చు. మరో నాలుగైదు లీటర్లు దొరికుండేది. అయితే లేచి వెళ్ళి అది చెయ్యబుద్ది కాలేదు.

గాలి నలుదిశలా నుండి వీయసాగింది. వెళ్ళిన దారిలోనే మళ్ళీ తిరిగొచ్చింది. గాలిలో వాసన తగిలి ముసలి ఆడ ఏనుగు ఘీంకరించింది. అది అక్కడే ఎక్కడో ఉండివుండాలి.

చేతిని గుండెలపై ఆన్చి, నేసైయన్ కూర్చున్నాడు. అతడి మనుసు శూన్యంతో నిండిపోయింది. స్వతహాగా అలజడి రేపే ఆలోచనలు ఏవి లేవు. ఒంటరితనం, అయితే అది అతడిని నిర్బంధించలేదు. చల్లగాలిలా, మృధువైన వాసనలా ఉంది.

అతడు కళ్ళు తెరిచిన తరువాతే పడుకున్న విషయం తెలియవచ్చింది. పక్కకు ఒత్తిగిల్లి వాలుగా బండరాయిపై జారబడ్డాడు. తల జారీ ఉమ్ము గుండెలపై కారింది. చుట్టుపక్కల మంచి వెలుతురు. పగటిని తలపించింది. తలపైకెత్తి చూశాడు. వెన్నెల శ్వేతవర్ణంలో తలకుపైన గుండ్రంగా ఉంది. ఈరోజు పౌర్ణమినా? లేదే దానికింకా మరో రెండు రోజులు ఉన్నాయి. నిద్రపోవడం వలన అయ్యుండొచ్చు, కళ్ళు బైర్లు కమ్మి మిరుమిట్లు గొలిపే కాంతి. ప్రతిదీ మెరిసిపోతున్నాయి. బండరాయి అంచులన్నీ అద్దంలా కనిపించసాగాయి.

మెల్లగా చుక్కలు కారే చట్ చట్ అనే శబ్దాన్ని అతడు విన్నాడు. ఏమైయుంటుందా అని లేచి చూశాడు. సారా ఊట కారుతుందా? అయితే వేడి లేదే. ఒకవేళ గాలిలో నిప్పు రాజుకొని ఉండాలి. అతడు గుడిసెలోకి వెళ్ళి చూసినప్పుడు రాగి కుళాయి ముక్కు అంచుకు అంటుకొని సారా బొట్లు బొట్లుగా కారడాన్నీ చూశాడు.

కింద సత్తుగిన్నెను పెట్టుంచాడు కూమన్. అందులో బొట్టు నిండి కిందకు కారుతూ కాంతితో ముందుకు వచ్చి పడుతూవుంది. చాలా నెమ్మదిగా, ఏదో ఆలోచించి ఆలోచించి పడుతున్నట్టుగా. ఒక్కో మాటలా…అది గడియారపు శబ్దం అయితే యాభైలో ఒక వంతు వేగం తగ్గింది.

కారి కారి కారే వేగం ఇంకనూ తగ్గింది. ఒక బొట్టు తరువాత చాలా సంకోచం. ఇంకో బొట్టు… ఆఖరి బొట్టు కుళాయి ముక్కు అంచులో ఎంతోసేపుగా నిలిచింది. కాంతితో నిండి ఆపై కిందపడింది.

అతడు ఆ సారాయిని తీసి చూశాడు. అతడు అరటిపళ్ళు వేసి మరిగించిన సారాయిలో పళ్ళ వాసన ఘాటుగా ఉంది. అయితే, ఇందులో అతి సున్నితంగా ఒక జ్ఞాపకపు పరిమాణములోనే ఆ వాసన ఉంది. తీసి వాసన చూశాడు.

గుండె టపటపని కొట్టుకొంది. మళ్ళీ వాసన చూసినప్పుడు నిర్ధారణ అయ్యింది. అదే, అతడు ఎదురు చూసినదే. ఒకసారి ప్రత్యక్షమై, వెంటనే అదృశ్యమైన లీల ఆ దైవమే అది.

అతడు దానిని వాసన చూస్తుండిపోయాడు. “అరేయ్ , కూమన్, లెగు” అని పిలిచాడు. ఆపై అతడిని పిలవొద్దని అనిపించింది. ఆ సమయంలో ఎవ్వరూ వెంట ఉండటం నచ్చలేదు. వంగి దానిని చూశాడు. లేతపసిడి వర్ణం. వెన్నెల్లో ఎత్తి చూపాడు. బంగారం, కరిగించిన బంగారం.

రేపు లాత్తి దగ్గర చూపించాలి. చూడు అని చెప్పాలి. నావల్ల అవుతోంది. నేను దాన్ని అందుకోగలను. తాగి చూడు, ఇంకోసారి ఒక చుక్క నీ నాలుకపై పడటం కోసం నువ్వు ఈ జీవితాన్ని కోల్పోయెందుకు కూడా సిద్ధపడుతావు. చచ్చేందుకు కూడా తెగిస్తావు, చంపుతావు, చస్తావు, సర్వం కోల్పోతావు, పిచ్చిపట్టి తిరుగుతావు.

ఆపై ఒక ఆలోచన వచ్చి అతడు నవ్వుకున్నాడు. ఎందుకు దీనిని నేను మరొకరికి చూపించాలి. దానిని పూర్తిగా ఒక చుక్క కూడా వదలకుండా తాగేయాలి. ఒక్క చుక్క కూడా. చెంబులో కూడా మిగలకుండా. అలా మిగిలిందని కూడా ఎవరికీ చెప్పకూడదు.

అతడు ఆ చెంబుతో నడిచి వెళ్ళి కింద యేటిఒడ్డున కాంతితో వెలిగిపోతున్న మొనలేని బండరాయిపై ఎక్కాడు. దానిపై కాలుచాచి కూర్చొని, దానిని తీసి వాసన చూశాడు. మెల్లగా చేతిలో పెట్టుకొని తిప్పి దానిని ఆవిరిగా శ్వాసలో నింపుకున్నాడు. నాలుకలో ఊరగానే ఒక్కో బొట్టుగా తాగాడు.

గాలి వీస్తున్న శబ్దము, నీటి అలజడి మాత్రమే వినిపిస్తోంది. చంద్రుని కాంతి మృదువుగా వీస్తోంది. దూరాన ఆకులు బంగారు పత్రాలలా ధగధగలాడాయి.

అతడు చెంబును పైకెత్తి రెండు బొట్లను నాలుకపై వేసుకున్నాడు. చెంబును అవతల బోర్లించి పెట్టాడు. చేతులను చాచి బండరాయిపై పడుకున్నాడు. బండరాయి ఎంతో మృదువుగా అనిపించింది. బురదలా జారుతుంది. ఆపై దూదిలా మెత్తగా మారింది. ఆపై నురుగులా మారింది.

అతడు తన తలపైనున్న వెన్నెలను చూశాడు. అతిపెద్ద వెన్నెల. కొండప్రాంతాల్లో వెన్నెల లేతఎరుపు రంగులో ఉంటుంది. ఆరోజు అది పసుపురంగులో కనిపించింది. ఆపై పాలతెలుపు రంగును సంతరించుకుంది. కళ్ళలో నిండిపోయే వెన్నెల కాంతి. కళ్ళు బైర్లు కమ్మి మిరుమిట్లుగొలిపే కాంతి.

అతడు దగ్గరకు వెళ్ళేకొద్దీ ఒక పట్టు నూలుతో కట్టిపెట్టినట్టు అది కిందకు దిగింది. చాలా దగ్గరగా. అయితే, పరిమాణంలో మాత్రం పెద్దది కాలేదు. వెలుగును విరజిమ్మే తాంబాళపళ్ళెంలా. అతడు లేచి కూర్చొని చూశాడు. ఎదురుగా అది నిలిచింది. చేతికందేంత దూరంలో. చల్లని వెన్నెల కాంతితో.

అతడు అతి సన్నని శ్వాస శబ్దాన్ని విన్నాడు. చెవిని చేరుకునేటంతటి శబ్దమది. అతడికి అది తెలిసింది. కనుక తలతిప్పి చూసేసరికి అతడు అందుకు పెద్దగా ఆశ్చర్యపోలేదు. వెన్నెల్లో మృదువైన వెంట్రుకలు బంగారంలా మెరుస్తూ, అగ్ని గోళాల్లా మెరిసిపోయే కళ్ళతో, కూర్చున్న స్థితిలోనే మనిషంత ఎత్తులో, అతడి పక్కనే ఆ పెద్దపులి కనిపించింది.

****

Jeya mohan

జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది‌, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్‌ అనే నవల అకిలన్‌ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దంపట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు.

jeyamohan.writer@gmail.com

శ్రీనివాస్ తెప్పల

శ్రీనివాస్ తెప్పల 1989 విశాఖజిల్లాలోని పాయకరావుపేట లో జన్మించారు. 1998 లో కుటుంబంతో పాటు చెన్నైలో స్థిరపడిన తను, విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తి చేసుకున్నారు. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన తను ఆరేళ్ళు గ్రాఫిక్ డిజైనర్‍‍గా పని చేసి 2019 లో జాబ్ వదిలేసి, ప్రస్తుతం సినిమాల్లో సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. సాహిత్యం మీదున్న ఆసక్తితో కొన్ని కథలను, కవితలను అనువాదం చేశారు. కుమార్ కూనపరాజు గారి కథలను ఎంపిక చేసి ‘ముక్కుళిపాన్’ పేరిట, పెద్దింటి అశోక్ కుమార్ గారి జిగిరి నవలను ‘కరడి’ పేరిట తమిళంలోకి అనువదించారు. తమిళ రచయిత నరన్ గారి కథాసంకలనం ‘కేశం’ త్వరలో తెలుగులోకి రానుంది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *