ముక్కుల్లిప్పన్

Spread the love

కుమార్ కూనపరాజు గారిని బెంగుళూరులోని బుక్ బ్రహ్మ సాహిత్య సదస్సులో కలిశాను. టాలుస్టాయ్, దొస్తోయేవిస్కీ రచనలను, ఐరోపా క్లాసిక్కులను తీసుకురావడం కోసం ఏకంగా ఒక ట్రస్టునే స్థాపించి, దానిని నిర్వహిస్తున్నారు. ఉదయిని అనే అంతర్జాల పత్రికను నిర్వహిస్తున్నారు. సాహిత్యంలో చాలా తీవ్రంగా ఆయన పాలుపంచుకుంటున్నారు.

తెలుగు సాహిత్యం గురించి నాకున్నది నామమాత్రపు అవగాహనే. ఎందుకంటే ఇక్కడ మలయాళ సాహిత్యం వెనువెంటనే అనువాదం చేయబడుతోంది. కన్నడ సాహిత్యాన్ని అనువదించేందుకు భావనన్, నల్లతంబితో పాటు పలువురు ముఖ్య అనువాదకులు ఉన్నారు. తెలుగు సాహిత్యం కోసం మాట్లాడేవారు ఏ ఒక్కరూ లేరు. అనువాదకులు కూడా తక్కువ సంఖ్యలోనే ఉన్నారు.

ఈ మధ్య అనేక కొత్త అనువాదకులు పుట్టుకురావడం చూడగలుగుతున్నాం. శ్రీనివాస్ తెప్పల ఈ పుస్తక అనువాదకుడు. బి.అజయ్ ప్రసాద్ కథలను కె. మారియప్పన్ తమిళంలోనికి అనువదించారు. ఈ విధంగా తమిళంలో దొరికే తెలుగు సాహిత్యాన్నంతటిని ఎవరైనా ఒక పట్టికగా రూపొందిస్తే బాగుంటుంది.

నాకు అర్ధమయినంత మేరకు తెలుగు నవీన సాహిత్యంలో కొన్ని ఒరవడులు కనిపిస్తున్నాయి. తెలుగు సాహిత్యంలో జాతీయవాదానికి సంబంధించిన సిద్ధాంతపరమైన సాహిత్య ఒరవడి, ఇతర భాషల్లాగే తీవ్రస్థాయిలోని ఒక సాహిత్య ఆరంభానికి నాంది పలికింది. ఆపై మార్క్సిజానికి చెందిన ఒరవడి. అందులో చెప్పుకోదగ్గ స్థాయిలో రచయితలు కొందరు ఉన్నప్పటికీ, సాహిత్యం అంటేనే కేవలం సిద్ధాంతాల ప్రచార మాధ్యమం అనే మానసికస్థితికి బీజం వేసింది. ఆ రచనల్లోని ప్రధాన సమస్యలు ఇవే.

తెలుగుకు ప్రాతినిధ్యం వహించి, జాతీయ సదస్సులకు విచ్చేసేవారు సామాన్యంగా రెండు విధాలు. ప్రొఫెసర్లు మరియు ప్రముఖ రచయితలు. వారికి సాహిత్య భావసౌందర్యంపై (Aesthetics) అవగాహన ఉందా అన్న సందేహం నాకు ప్రతిసారి తలెత్తేది. ప్రగతిశీలత, సామాజికోద్దరణ లక్ష్యం చేసుకున్న ఆదర్శాలను దృఢంగా వ్యక్తపరిచేవే ‘ఉత్తమ సాహిత్యం’ అనే అభిప్రాయం అక్కడ బలంగా వేళ్ళానుకుందనిపిస్తోంది.

సాహిత్య రూపాలు, సాహిత్య భావసౌందర్యం గురించిన చర్చలు తెలుగులో విస్తృతంగా చోటు చేసుకోలేదా అనే అభిప్రాయం సామాన్యంగా తెలుగు సాహిత్యం ద్వారా కలుగకమానదు. ఒక రకంగా ప్రధానంగా వినిపించవలసింది భావసౌందర్య విమర్శకుని గొంతే. అతడే సాహిత్యం అనే ప్రత్యేకమైన మేధోవర్గాన్ని సుస్థిరం చేసేవాడు, ముందుకు తీసుకువెళ్ళేవాడు. ఏది సాహిత్య లక్షణం కలిగిన రచన, ఏది అర్హతలేనిది అన్నదానిని అతనే తీర్మానించగలడు. అది ఎందువలన అనేది కూడా అతడే వివరణ ఇవ్వాలి.

భావసౌందర్య విమర్శకుడు అనేవాడు ఒక మనిషి కాదు. అలాగని ఒక మేధో వర్గము కాదు. భావసౌందర్య విమర్శకుడు అన్నవాడు ఎప్పుడూ ఒక్కడిగానే పని చెయ్యగలడు, ఒక్కడిగానే తన గొంతును వినిపించగలడు. అతడికి వర్గనేపథ్యం లేక ఆదర్శాల (సిద్ధాంతాల) నేపథ్యం ఉండే అవకాశముండదు. ఎందుకంటే అతడు వాటికి వ్యతిరేకమైనవాడు. అతడు దేనిని నిరూపించడు. ఎందుకంటే అతని మార్గం తార్కికమైన అనుభవవాదం కాదు. భావసౌందర్య విమర్శకుడు మంచి రచనలను ఎలుగెత్తి చూపించగలడు. అతడు చెయ్యగలిగింది అందులోని భావసౌందర్యాన్ని కేవలం ముందుంచడం మాత్రమే. అతడు ప్రతిపాదించే దానిని పాఠకులు చదివి అతడు చెప్పే దానిని వారు కూడా అంగీకరించేటప్పుడే అతని సామర్ధ్యం రూపుదిద్దుకుంటుంది. అతడొక మేధో సంపన్నుడిగా రూపుదిద్దుకుంటాడు.

అనగా భావసౌందర్య విమర్శకుడు అనేవాడు ఒక ఒంటరి వ్యక్తి కాడు. అలాగని కేవలం ఒక సిద్దాంతం వైపు నిలిచేవాడు కాదు. ఒక వర్గ ప్రవాహంలో తనకు తానుగా రూపొందే కేంద్రం అతడు. ఆ వర్గ ప్రవాహపు సమ్మతితో మాత్రమే స్థిరత్వాన్ని సంపాదించుకునేవాడు. వారి ప్రతినిధిగా ప్రతిధ్వనించేవాడు. అతని గొంతు గట్టిగా ప్రతిధ్వనిస్తేనే పాఠకుడి అధికారం అక్కడ రూపుదిద్దుకుంటుంది.

మరోవైపు భావసౌందర్య విమర్శకుడు పాఠకులలో పైచెయ్యి సాధించినవాడు. కావున అతడు పాఠకులకు సౌందర్యాన్ని నేర్పిస్తున్నాడు. అతడు నేర్పించే భావసౌందర్యం అనేది ఎటువంటి ఆదర్శవాదుల పక్షం వహించి రూపొందించేది కాదు. దాని మూలాధారం అనేది ఉత్తమ సాహిత్యాలే. భావసౌందర్య విమర్శకుడు తన భాష యొక్క ఉత్తమ సాహిత్యాల నుండి తన కొలమానాలను, సిద్ధాంతాలను ప్రతిపాదించేవాడు. ప్రపంచ సాహిత్యం నుండి అగ్రస్థానంలోని రచనల నుండి తన దృక్కోణాన్ని, ఆకాంక్షను సేకరించి సమీక్షించుకునేవాడు.

భావసౌందర్య విమర్శకుడనేవాడు కేవలం ఒకవ్యక్తి మాత్రమే కాడు. అనేకమంది ఏకకాలంలో పనిచేసేవారు. వారి మధ్యన కూడా సంఘర్షణలు నెలకొంటాయి. వివాదాలు తలెత్తుతాయి. తద్వారానే భావసౌందర్య ప్రతిపాదనలు రూపుదిద్దుకుంటాయి. తమిళ భావసౌందర్య విమర్శ తరపున K.N. సుబ్రహ్మణ్యము,C.S. చెలప్ప వంటివాళ్ళు పరస్పరం విబేధించి, వివాదించుకునేవారు. తద్వారానే ఇక్కడ భావసౌందర్య కొలమానాలను మెరుగుదిద్దేందుకు దిశానిర్దేశం చెయ్యగలిగారు.

సాహిత్యంలో భావసౌందర్యానికి బదులుగా కంటెంట్ ప్రధానంగా చర్చకు వస్తే అవి రాజకీయ సాహిత్యాలు, లేక మత సాహిత్యాన్ని అందిపుచ్చుకునేవిగా ఉంటాయి. అవి అధికార లక్ష్యం కలిగినవి. అధికారానికి సానుకూల సాధనంగా అవి సాహిత్యాన్ని మార్చుకుంటాయి. అవి సాహిత్యాన్ని అంతకు మించి ఏ మాత్రం ఎదగనివ్వకుండా కట్టడి చేస్తాయి. అవి సాహిత్యాన్ని బోన్సాయ్ మొక్కలుగా మార్చేస్తాయి.

సాహిత్యం విద్యారంగంలో కేవలం పాఠ్యంశంగా నేర్పిస్తే రాజకీయ లేక మతం రూపొందించే ఆనవాళ్ళను కేంద్రంగా చేసుకొనే వారి అధ్యయనాలు రూపుదిద్దుకుంటాయి. వారి విధివిధానం అనేది గుర్తు చెయ్యడం, నమోదు చేయడం మాత్రమే. విద్యారంగాలు ఎన్నటికీ సాహిత్య జీవానికి నీళ్ళొదులుతాయి.

తమిళంలో, బ్రిటిష్ సాహిత్యం లాగే గొప్ప సాహిత్యాన్ని రాసిన సాహితీకారులే, సాహిత్య విమర్శను కూడా రూపొందించడం మన అదృష్టం. పుదుమై పిత్తన్, కు.రాజగోపాలన్ మొదలుకొని సుందర రామస్వామి వరకు ఆ అలవాటు మనకు సౌందర్య విమర్శను మూడు తరాలుగా సుస్థిరం చేసింది. ఈరోజు వరకు మనం ఇక్కడ పాటించే విమర్శ అన్నది భావసౌందర్య విమర్శ మాత్రమే.

నేను తెలుగు సాహిత్యం నుండి వినగలిగిన మొదటి భావసౌందర్య గొంతుక చినవీరభద్రుడు గారిది మాత్రమే. విష్ణుపురం అవార్డు సదస్సులో ఆయన మాటలు తెలుగు గురించి సమూలంగా సరికొత్త నిర్వచనానికి అద్దం పట్టాయి. ఆయన లాంటివారికి అగ్రతాంబూలం ఇవ్వాలి.

**************

కుమార్ కూనపరాజుగారి కథలు నవీన సాహిత్యంలో చోటు చేసుకోవడము, అవి మాట్లాడే వస్తువుల ఎంపిక, అవి ముందుంచబడిన విధానం ఆధారంగా వాటిని రెండు కోణాల్లో వర్గీకరిస్తాను.

ఒకటి రోజువారీ జీవితాన్నీ, సామాన్యులను నమ్మశక్యంగా చెబుతూ ముందుకుసాగాయి. రెండోది రచయిత దృక్కోణం వారి జీవితాలను ఆదర్శాలకనుగుణంగా వక్రీకరించే ప్రయత్నమేది చెయ్యలేదు. సాధ్యమయినంత వరకు వారి వైపే సాగేందుకే కాల్పనికత దోహదం చేసింది. కనుక కాల్పనికతలోని నమ్మశక్యత నేర్పుగా చిత్రీకరించబడింది.

ఈ సంకలనంలో ‘ముక్కుళిప్పాన్’ (బుడ బుచ్చకాయలు) ఉత్తమకథ. వలస వచ్చే పక్షిని చంపేందుకు పనిలో పెట్టుకున్న సంచార తెగకు చెందిన వ్యక్తి అయినటువంటి విబ్రో ఒకానొక దశలో తననే దానిలో చూసుకుంటాడు. అది అతడిని దాని నుండి విముక్తుడిని చేస్తోంది. చెప్పకనే అనుభూతీకరించిన ఈ అనుసంధానం, నీటి మునక పక్షిని ఒక అందమైన రూపముగా మార్చి కళాత్మకతను సంతరించుకుంది.

తోలు బొమ్మలాట, తీర్పు ఇచ్చే రోజు, కోళ్ళ పందెం, సులేమాన్ కారు వంటి కథలు జీవనవైవిధ్య చిత్రీకరణలో గమనించదగిన కథలు. తోలుబొమ్మలాట తోలు బొమ్మల మధ్యనే గడిపి నిరాదరణకు గురైనవాడి కథ. జీవితంలో ఒక కారు ద్వారానే ఎదిగి, దాని ద్వారానే పరాయివాడిగా మిగిలినవాడు, న్యాయస్థానం నీతిరాహిత్యం ద్వారా తన నీతిని నిరూపించుకున్నవాని పాపభీతి అని అనేక మనుష్యుల బహుముఖ కోణాలు మనకు ఈ కథల్లో తారసపడతాయి.

ఈ కథల్లో ఓవరాల్గా ఉన్న ఏకైక లోటుపాటు వీటిలో కథానిక అనే ప్రత్యేక రూపమే అనేకంగా లేదన్నదే. అనేక సందర్భాల్లో ఇవి జీవినవైవిధ్యాల చిత్రీకరణలా మాత్రమే మిగిలిపోతున్నాయి. 1952 లో తమిళంలోని ప్రఖ్యాతి గాంచిన రచయితలు కొందరి కథానికల్లోవున్న ఈ లోటుపాటును K.N.సుబ్రమణ్యం ఎలుగెత్తి చాటి కటువుగా ఒక విమర్శను రాసి ‘ఎళుత్తు’ సంచికలో రాశారు. అది రేకెత్తించిన వివాదం కథానిక రూపాన్ని సుస్థిరం చేసేందుకు దారి చూపింది.

కథానిక అన్నది ‘చిన్న కథ’ మాత్రమే కాదు. కథానికలో ప్రధాన భాగం దాని ముగింపే. ఆ ముగింపు అన్నది మరో కథకు కొనసాగింపు. అంతవరకూ ఉన్న కథ ఆ ముగింపులో నుండి మళ్ళీ మొదలయ్యి ఎదగాలి. కథ మొత్తాన్నీ ఆ ముగింపు దిశగా చెప్పుకుంటూ పోవాలి. అనూహ్యమైన మలుపే కథానిక ప్రాథమిక రూపం. మలుపుకి బదులుగా దృఢమైన తారస్థాయిని లేదా కవిత్వ తారాస్థాయి తగినదని, ఆ తరువాతి రోజుల్లో రూపొందిన ఒక వర్గము భావన. అయినప్పటికీ మలుపే కథానిక క్లాసిక్ రూపం.

ఈ కథలు ఎందులోను ముగింపులో అటువంటివి ఏవి చోటుచేసుకోలేదు. కేవలం ఒక జీవనవైవిధ్య చిత్రీకరణతోనే కథకులు ముగింపుకొస్తున్నాయి. కథానికకు అది మాత్రం సరిపోదు. చదివేందుకు లభ్యమయ్యే కథ ఒక ఆరంభం మాత్రమే. పాఠకుడు కాల్పనికత ద్వారా మరింత ముందుకు సాగించే పయనమే నిజమైన కథానిక. కనుక చెప్పడం కాకుండా, సాధ్యమయ్యినంతవరకు తక్కువగా చెప్పి, ప్రేక్షకుడిని ప్రేరేపించేదే మంచి కథకున్న లక్షణం. చెప్పడం కాదు, చెప్పకుండా నిగూఢంగా దాయడమే రచయిత చేతుల్లోకి తీసుకోవలసిన యుక్తి. అన్నిటినీ చెప్పే రచయిత పాఠకుని కల్పనకు అడ్డుకట్ట వేస్తున్నాడు.

ఈ సంకలనములోని కథల్లో అకాడెమీ అవార్డు, తీతువుపిట్ట వంటివి తేలికైన విషయాలను సరళంగా చెప్పేవి. అందులో కళాత్మకతకు చెందిన ప్రయత్నం ఏది లేదు. ఆ ప్రయత్నమున్న కథలేమో శిల్పంలోని లోటుపాటు వలన ఎలా ఛిద్రమవుతున్నాయి అని గమనించడం స్పష్టతను కలిగించవచ్చు.

మంచి కథ అయినటువంటి ‘ముక్కుళిప్పాన్’ (బుడ బుంగ) కూడా ఏకత్వం చేతికి అందిరాలేదు. మన కల్పన వలన మాత్రమే ఒక మంచి కథను కనుగొనగలము. కథ నీటి మునగే పక్షికి, దానిని చంపేందుకు ఎదురుచూస్తున్న ఇద్దరితో మొదలవ్వడం బాగుంది. ఇక్కడ కథ నీటి మునగే పక్షి, దానితో తనను సరిపోల్చుకొనే విబ్రో ఇద్దరే కథలో కీలకం.

వారిద్దరిని ముందుంచే కథను కొనసాగించి ఉండాల్సింది. విబ్రో కుటుంబం సాయిరాజుకు బానిసగా ఉండటమూ, దోపిడీకి గురి కావడమూ ఎంత తక్కువగా చెప్పాలో అంత తక్కువగా చెప్పి ఉండి ఉండవచ్చు. ఎందుకంటే అది అలాగే జరగబోతుంది అని పాఠకుడికి ఒకింత ముందే తెలిసుంటుంది. అది వ్యత్యాసంగానో, దిగ్భ్రాంతికి గురి చేసే విధంగానో లేదు. నీటి మునగే పక్షి లక్షణాలు మరింత నిశితంగా, అది పాఠకుడి దృష్టితో చూసే విధంగా చెప్పుండవచ్చు. ఏ పరిమాణంలో మెరుగ్గా చెబితే ఆ స్థాయిలో అది గొప్ప విజువలుగా మారుతోంది.

నీటి మునగే పక్షి తో, తనను తాను విబ్రో పోల్చి చూసుకునే తరుణం ఈ కథలో పీక్స్ లో ఉంది. ఆ దిశగా వెళ్ళి , అక్కడ కథ తారాస్థాయికి వెళ్ళి ముగిసి ఉండవలసింది. అక్కడ ఇక మరెప్పటికీ అతడు వాటిని కాల్చలేడు అన్నదే అంతిమ వాక్యం తప్ప, రొయ్యల చెరువులో రొయ్యలు చనిపోవడం కాదు.

మరొక కథ, ‘మంచు కురిసిన ఒక ఆదివారం’ బాగా రాయబడలేదు. కథకుడి దృష్టిలో అందులోనున్న కథ అంతు చిక్కలేదు. ఈ కథలో కథానాయకుడు మైకేల్ రాబర్ట్ ఆండర్సన్నే. అతడు కృంగి కృశించిపోవడం. అదే కథ అంటే, కథ అతనితో మొదలయ్యి అతనితోనే ముగించి ఉండాలి. నేరేటర్ ఎక్కడ బ్రతికాడు, ఏమేం పనులు చేశాడు అన్నది ముఖ్యం కాదు. ఆహారం పొట్లాలు పంచి పెట్టె చోట్లో మైకేల్ అతడిని కలిసే తరుణమే కథ ప్రారంభ బిందువు.

ఆ కథలో ప్రధాన సమస్య , అసలు ముడిపెట్టిన అంశం ఏమిటి అన్నదే కథకుడు తనకు తాను వేసుకోవాల్సిన ప్రశ్న. ఒక నల్లజాతివాని మానసిక కృంగుబాటుతో ఎలా భారతీయుడు అయినటువంటి నేరేటరుతో కనెక్ట్ అవుతున్నాడు? ఏ విధంగా దానిని అర్ధం చేసుకుంటున్నాడు? వాళ్ళ మధ్య మొదలయ్యే సంఘర్షణ, కలయిక దిశగా కథ ముందుకు సాగుండాలి.

ఆ ప్రయాణంలో సరళమైన సమాచారం కూడా భారీ విజువల్స్ గా రూపుదిద్దుకుంటాయి. హాట్సన్ నదికి కింద వందల ఏళ్ళ క్రితమే సొరంగ మార్గాన్ని అమెరికన్లు కట్టించినప్పటికీ అక్కడ నల్లజాతీయులకు మాత్రం ఇంకా న్యాయం చేకూర్చలేదు. అది ఒక సంఘర్షణాత్మక పాయింట్. చాలా సరళంగా వాటిని నేరేటర్ వాటిని పక్కన వుంచి పాఠకుడికి సంఘర్షణను చూపించి ఉండొచ్చు. మైకేల్ చావు, ఆపై అతడి ఆస్థితో ఒక సంస్థను స్థాపించడం వంటి విషయాలకు, ఈ కథ ప్రధాన సమస్యకు ఎటువంటి పొంతన కుదరలేదు.

సాహిత్య రచయిత కోణంలో కథకు సంబంధించిన జీవనవైవిధ్యాల చిత్రీకరణలను అందిపుచ్చుకున్న రచయిత, వాటిని కథ అనే రూపంగా మలచడంలో మాత్రం చాలావరకు చేజార్చుకున్నారు. దానిని బలంగా చూపించే భావసౌందర్య విమర్శనే ఆ తరువాతి స్థాయికి దిశానిర్ధేశం చెయ్యగలదు. అటువంటి భావసౌందర్య విమర్శను రూపొందించాలి. దానితో పాటు తీవ్రమైన ప్రతివిమర్శలను కూడా నిర్మాణాత్మకంగా తీసుకొనే మానసిక పరిపక్వత అక్కడ రూపుదిద్దుకోవాలి.

తమిళ్ నుండి తెలుగులోకి అనువాదం శ్రీనివాస్ తెప్పల

Jeya mohan

జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది‌, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్‌ అనే నవల అకిలన్‌ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దంపట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు.

jeyamohan.writer@gmail.com

శ్రీనివాస్ తెప్పల

శ్రీనివాస్ తెప్పల 1989 విశాఖజిల్లాలోని పాయకరావుపేట లో జన్మించారు. 1998 లో కుటుంబంతో పాటు చెన్నైలో స్థిరపడిన తను, విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తి చేసుకున్నారు. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన తను ఆరేళ్ళు గ్రాఫిక్ డిజైనర్‍‍గా పని చేసి 2019 లో జాబ్ వదిలేసి, ప్రస్తుతం సినిమాల్లో సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. సాహిత్యం మీదున్న ఆసక్తితో కొన్ని కథలను, కవితలను అనువాదం చేశారు. కుమార్ కూనపరాజు గారి కథలను ఎంపిక చేసి ‘ముక్కుళిపాన్’ పేరిట, పెద్దింటి అశోక్ కుమార్ గారి జిగిరి నవలను ‘కరడి’ పేరిట తమిళంలోకి అనువదించారు. తమిళ రచయిత నరన్ గారి కథాసంకలనం ‘కేశం’ త్వరలో తెలుగులోకి రానుంది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *