కుక్క బలుపు:
పోషణ బాగుంటే వ్యక్తులకుగాని, జంతువులకు గాని, మొక్కలకుగాని బలుపువస్తుంది. అందులో వింతేమీ లేదు. కానీ కుక్క బలిసే పద్ధతే జనాన్ని ఆకర్షించి, ఈ మాట పుట్టించింది. ఎంత తక్కువ ఆహారంతోనయినా బతకగల జీవుల్లో కుక్క ఒకటి. ఒక్క కడి ఎక్కువ తిన్నప్పుడు అది వెంటనే బలిసినట్లు కనిపిస్తుంది – వేటకుక్క కాకపోతే. జాతి కుక్కమాత్రం ఎంత పెట్టినా ఎంత తిన్నా ఎండుకపోయినట్లే ఉంటుంది. కుండలో తలపెట్టి గతికిన కుక్క మెడదగ్గరనుంచి బలిసిపోతుంది. అందువల్ల తిండి పూర్తయిన తరువాత మెడ లాక్కోలేక అటూఇటూ ఏ గోడకో వేసి కొట్టి కుండను పగలగొట్తుంది. మూతి దగ్గర గట్టిగా ఉండే వలయం మాత్రం కంఠాభరణంలాగా కంటెలాగా నిలిచిపోతుంది. అప్పటి కుక్క దర్జా, ఠీవీ చెప్పతరం కాదు. అది జాతీయానికి ముఖ్యంకాదు. కానీ నిముషాలమీద మెడనుంచి పొట్టదాకా బలిసిపోవటమే లోకదృష్టిలో విడ్డూరమై ఈ మాట పుట్టింది. నిన్నమొన్నటిదాకా దరిద్రమనుభవించి దొంగతనంవల్లనో, ఏ వారసత్వం వల్లనో, ముదనష్టపు ఆస్తి వచ్చి పడ్డందువల్లనో, అనుకోని పరిస్థితుల్లో వ్యాపారం అధిక లాభార్జన చేసినందువల్లనో తెల్లవారేసరికి ఐశ్వర్యవంతు లయినవారున్నారు. వారిది కుక్కబలు పంటారు.
కుక్కచావు:
నీచంగా బతికినా, చచ్చినా, ఒకరిమీద ఆధారపడి (కుక్కలా) వారి సేవలు చేస్తూ హీనంగా బతికినా ‘కుక్కచావు చస్తున్నా’మని చెప్పుకోవటం కద్దు. దిక్కులేని చావు అనే అర్థంలో కూడా ఈ జాతీయం వాడుతుంటారు. పిచ్చి కుక్క కరిచిన మనిషి నీళ్ళంటే భయపడటంతో కుక్కచావు మొదలవుతుంది. కుక్క పిచ్చిదో మంచిదో తెలుసుకోవటానికి నీళ్ళు బ్రహ్మాండంగా పనికివస్తాయి. అందుకే పూర్వం బాటసారులు నీటిపాత్ర, కర్ర లేకుండా పొరుగూరు పోగూడదనేవారు. మంచికుక్కను అదిలించటానికి చేతికర్ర ఉపయోగపడితే, నీళ్ళు దాని మొహాన చిలకరించి అది పిచ్చిదో కాదో తేల్చుకోవచ్చు. మంచిది అయితే భయపడక మీదమీదకి వస్తుంది. పిచ్చిదైయితే తిరిగి చూడకుండా పారిపోతుంది. పాతకాలంలో పిచ్చికుక్క కాటుకు మందే లేదు. మంచి కుక్క కరిస్తే కరిచిన చోట చెప్పుదెబ్బ కొడితే ప్రమాదం లేదని నమ్మేవాళ్ళు అందుకే ‘కుక్క కాటుకు చెప్పుదెబ్బ’ అనే సామెత పుట్టింది. పిచ్చి కుక్క కరిచిన వ్యక్తి నీటికి భయపడటం తొలిదశ అయితే, కుక్కలా అరవటం, కరవటం, చివరికి చేతులూ, కాళ్ళు నేలకానించి పాకటం చివరిదశ. ఇప్పుడు ముందు జాగ్రత్తకు ఇంజెక్షన్లు వచ్చాయిగాని, రోగం (దాని పేరు రాబిస్) వచ్చిన తరువాత మనిషి దక్కటం కష్టం. ఆ వ్యక్తి చొంగ తగిలినా ఇతరులకు అదే వ్యాధి సంక్రమిస్తుంది. దానికి విరుగుడు లేదు. అందువల్ల మార్గాంతరంలేని హీనస్థితిలో, బతకడానికి గత్యంతరంలేని దుర్భరస్థితిలో బతికినా చచ్చినదానితో సమాన మనుకున్నప్పుడు కుక్కచావు చస్తున్నా డంటారు. ఆ బాధలనుంచి విముక్తి లేదనే నమ్మకం కుదిరినప్పుడు అది కుక్క చావవుతుంది. దిక్కులేని చావవుతుంది.
కుక్కతోక:
కుక్కతోక వంకర’ అని చిన్న తరగతుల్లో బోధిస్తారు – ఆపాటి పిల్లలు గమనించలేదని! అసలు ఏ తోక అయినాసరే చిన్నపిల్లలకు ఆకర్షకంగానే ఉంటుంది. ‘అతడి బుద్ధి వక్రం’ అనడానికి ‘కుక్క తోకలాంటి బుద్ధి’ అనటం మామూలు, ప్రయత్నపూర్వకంగా సరిచేసినాసరే మళ్లీ మొదటిరూపానికి వచ్చే కుక్కతోకను వక్రతకు చిహ్నంగా గ్రహిస్తాం. ఈ తోక శాస్త్రజ్ఞులను మరో కారణంగా ఆకర్షించింది. అందువల్ల ‘ఛిన్నపుచ్ఛేతు శ్వత్వ వ్యవహారవత్’ అనే పరిభాషను ఏర్పాటు చేసుకున్నారు ” వ్యాకరణంలో, ‘తోకతెగినా కుక్కకుక్కేనన్నట్లు’ అనేది ఆ మాటలకర్థం. ప్రపంచంలో అన్ని జంతువులకూ తోకలుండగా కుక్కతోకే ఎందుకు ప్రస్తావనకు వచ్చిందో తెలీదు. ‘కుక్క తోకబట్టి గోదావరి ఈదడం’ అనే నానుడి కూడా ఉంది తెలుగులో- పనికిరాని వస్తువును సాధనంగా వాడటం నిష్ప్రయోజనకరమనే అర్థంలో, కొందరు ‘గేదెతోకబట్టి’ అనే పాఠంతరం చెప్తుంటారుగాని వేమన పుణ్యమా అని కుక్కతోకకే వాడుక ఎక్కువ.
బూదరాజు రాధాకృష్ణ
1932 మే మూడో తేదీన ప్రకాశం జిల్లా వేటపాలెంలో జన్మించిన డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ 1965లో హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ ఎర్లీ తెలుగు ఇన్స్టిప్షన్స్ అనే అంశంపై పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. చీరాల వి.ఆర్.ఎస్. అండ్ వై.ఆర్.ఎస్. కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పనిచేసిన వీరు 1988లో తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. సెంట్రల్ యూనివర్శిటీ విజిటింగ్ ప్రొఫెసర్‌గా వుండి 1990 నుంచి దశాబ్ద కాలంపాటు ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేశారు.